• Sitemap
  • Advance Search
Global Affairs

బ్రిక్స్

పరిణామం, సహకారం, భారత నాయకత్వం

Posted On: 10 SEP 2026 12:35PM

నాలుగు వర్ధమాన మార్కెట్లను సూచించేందుకు సమావేశ మందిరాల్లో వాడిన సంక్షిప్త నామం ఇప్పుడు ఎంతో విస్తృత రూపం సంతరించుకుంది. నేడు నాలుగు ఖండాలకు విస్తరించిన భౌగోళిక రాజకీయ కూటమిగా మారింది. నాలుగు దేశాల మధ్య చర్చగా మొదలైన ప్రయాణం ప్రస్తుతం మరింత విస్తృతమైన సమూహంగా ఎదిగింది. వరుస దఫాల్లో సభ్యత్వ విస్తరణతో చమురు ఉత్పత్తి దేశాలు, ఆఫ్రికా ఆర్థిక వ్యవస్థలు, ఆగ్నేయాసియా భాగస్వాములు ఇందులో చేరారు. విస్తరిస్తున్న ఈ నిర్మాణానికి భారత్ ఈ ఏడాది కేంద్రంగా నిలుస్తోంది. బ్రిక్స్ ఆవిర్భావం తర్వాత నాలుగోసారి అధ్యక్ష బాధ్యతలు నిర్వహిస్తోంది.

బ్రిక్స్: సమ్మిళిత ప్రపంచ వ్యవస్థకు రూపకల్పన
ప్రధాన వర్ధమాన ఆర్థిక వ్యవస్థల మధ్య ఆర్థిక విధానాల సమన్వయానికి బ్రిక్స్ కీలక వేదికగా అవతరించింది. ప్రపంచ పాలనపై ఈ దేశాలు ఉమ్మడి వైఖరిని రూపొందించే ప్రధాన వేదికగా పనిచేస్తోంది. నిరంతర చర్చల ద్వారా బహుపాక్షిక సంస్థల్లో ప్రపంచ దక్షిణ దేశాల ప్రయోజనాలను ముందుకు తీసుకెళ్లే మార్గంగా ఎదిగింది. అభివృద్ధి, ఆర్థిక సేవలు, సాంకేతికత, వాణిజ్యం, ప్రజల మధ్య సంబంధాలు దీని కార్యాచరణ పరిధిలో ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా వర్ధమాన ఆర్థిక వ్యవస్థల పెరుగుతున్న ఆర్థిక బలం, ఆకాంక్షలను ఈ కూటమి ప్రతిబింబిస్తోంది. అనుభవాలను పంచుకోవటానికి, ఉమ్మడి సవాళ్లను పరిష్కరించటానికి సభ్య దేశాలకు వేదికను అందిస్తోంది.

2026 అధ్యక్ష బాధ్యతల్లో భాగంగా 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సును 2026 సెప్టెంబర్ 12–13 తేదీల్లో న్యూఢిల్లీలో భారత్ నిర్వహించనుంది. 2026లో భారత్‌కు ఇది నాలుగో బ్రిక్స్ అధ్యక్ష బాధ్యత. ‘‘ఆటుపోట్ల‌ను త‌ట్టుకునే సామర్థ్యం, ఆవిష్కరణలు, సహకారం, సుస్థిరత కోసం నిర్మాణం’’ అనే ఇతివృత్తం భారత అధ్యక్షతకు మార్గనిర్దేశం చేస్తోంది. ఇప్పటికే సాధించిన విజయాలు, సంస్థాగత సామర్థ్యాన్ని బలోపేతం చేయటంపై భారత దృష్టిని ఈ ఇతివృత్తం ప్రతిబింబిస్తోంది. అభివృద్ధి, సుస్థిరత, ఆవిష్కరణలను కార్యాచరణకు కేంద్రంగా నిలుపుతోంది. ప్రపంచ దక్షిణ దేశాల ఆకాంక్షలను కూడా ప్రముఖంగా ప్రస్తావిస్తోంది. నిర్మాణాత్మక, పరిష్కార కేంద్రిత వేదికగా బ్రిక్స్‌ను మరింత బలోపేతం చేయాలని భారత్ భావిస్తోంది.

 

 


ప్రస్తుతం బ్రిక్స్‌లో 11 దేశాలు ఉన్నాయి. అవి బ్రెజిల్, చైనా, ఈజిప్ట్, ఇథియోపియా, భారత్, ఇండోనేషియా, ఇరాన్, రష్యా, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, యూఏఈ. ఈ దేశాలు కలిపి ప్రపంచ జనాభాలో 49.5 శాతం, ప్రపంచ జీడీపీలో 40 శాతం, ప్రపంచ వాణిజ్యంలో 26 శాతానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. వాటి భారీ జనాభా, ఆర్థిక బలాన్ని ఈ గణాంకాలు తెలియజేస్తున్నాయి. సభ్యత్వ విస్తరణతో ఆసియా, ఆఫ్రికా, పశ్చిమాసియా, లాటిన్ అమెరికా ప్రాంతాలకు భౌగోళిక పరిధి పెరిగింది. ప్రధాన మార్కెట్లు, సహజ వనరులు, సాంకేతిక సామర్థ్యాలు, విభిన్న అభివృద్ధి అనుభవాలను ఈ వైవిధ్యం ఒకే వేదికపైకి తెస్తోంది.

ఆవిర్భావం
గోల్డ్‌మన్ శాక్స్ 2001లో విడుదల చేసిన ‘ప్రపంచానికి మెరుగైన ఆర్థిక బ్రిక్‌ అవసరం’ అనే ప్రపంచ ఆర్థిక పత్రంలో ‘బ్రిక్’ అనే సంక్షిప్త నామాన్ని తొలిసారి రూపొందించింది. ఆర్థిక గణాంక విశ్లేషణ ఆధారంగా తర్వాతి ఐదు దశాబ్దాల్లో బ్రెజిల్, రష్యా, భారత్, చైనా ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో నిలుస్తాయని ఆ పత్రం అంచనా వేసింది. పెరుగుతున్న ఆర్థిక బలం, మూడు ఖండాల్లో విస్తరించిన భారీ భౌగోళిక పరిధి ఈ దేశాల ప్రపంచ ప్రాధాన్యాన్ని చాటాయి. ఆ తర్వాత బ్రిక్ భావన అధికారిక కూటమిగా రూపుదిద్దుకుంది. 2010లో దక్షిణాఫ్రికా చేరటంతో బ్రిక్ కాస్తా బ్రిక్స్‌గా మారింది. విశ్లేషకులు గుర్తించిన ఆర్థిక సమూహం నుంచి రాజకీయ, ఆర్థిక, అభివృద్ధి సహకారానికి అధికారిక వేదికగా మారిన పరిణామాన్ని ఇది సూచించింది.

లక్ష్యం, ఉద్దేశం, సహకార రంగాలు
అంతర్జాతీయ కార్యాచరణను ప్రభావితం చేసే ప్రధాన అంశాలపై చర్చలకు వేదికగా బ్రిక్స్‌ను మొదట రూపొందించారు. ప్రపంచ రాజకీయ, ఆర్థిక అంశాలపై ఉమ్మడి వైఖరులను రూపొందించటమే తొలి దశలో ప్రధాన లక్ష్యం. మరింత ప్రజాస్వామ్యబద్ధమైన, చట్టబద్ధమైన, సమతుల్య అంతర్జాతీయ వ్యవస్థను ప్రోత్సహించాలని సంకల్పించింది. వర్ధమాన ఆర్థిక వ్యవస్థల మధ్య సుస్థిర ఆర్థిక, సామాజిక అభివృద్ధి, సామాజిక సమ్మిళితత్వం, ఉమ్మడి శ్రేయస్సుకు కూడా ప్రాధాన్యం ఇచ్చింది. కాలక్రమంలో సభ్య దేశాల మధ్య మరింత లోతైన, విస్తృత సంబంధాలకు ఈ ప్రాధాన్యాలు పునాదిగా నిలిచాయి.

వరుస శిఖరాగ్ర సదస్సుల ద్వారా బ్రిక్స్ సహకారం వ్యూహాత్మక ప్రపంచ అంశాలు, ఆచరణాత్మక సహకార రంగాలకు క్రమంగా విస్తరించింది. ఉగ్రవాదం, వాతావరణ మార్పు, ఆహార, ఇంధన భద్రత, వాణిజ్యం, వ్యవసాయం దీని కార్యాచరణలో ఉన్నాయి. కార్మిక, ఉపాధి అంశాలు, టెలికమ్యూనికేషన్, అంతర్జాతీయ ఆర్థిక సేవలు, ప్రపంచ ఆర్థిక పరిస్థితిపైనా దృష్టి పెడుతోంది. ప్రపంచ వాణిజ్య సంస్థ, అంతర్జాతీయ ఆర్థిక నిర్మాణం సహా ప్రపంచ సంస్థల్లో మరింత ప్రాతినిధ్యం, సమానత్వం కోసం బ్రిక్స్ వాదిస్తోంది. ప్రపంచ పాలనను మరింత సమ్మిళితంగా, సమర్థంగా, ప్రస్తుత సవాళ్లకు స్పందించేలా మార్చటం ఈ ప్రయత్నాల లక్ష్యం.

ఏళ్లుగా బ్రిక్స్: సంక్షోభం నుంచి సమష్టి కార్యాచరణ వరకు
2008 ప్రపంచ ఆర్థిక సంక్షోభం బ్రిక్స్ పరిణామంలో కీలక మలుపుగా నిలిచింది. అప్పటి ప్రపంచ ఆర్థిక నిర్మాణంలోని లోపాలను అది బయటపెట్టింది. ప్రపంచ ఆర్థిక పాలనపై విస్తృత ఏకాభిప్రాయం అవసరమని కూడా స్పష్టం చేసింది. ఈ అంశాలపై నాలుగు బ్రిక్ దేశాలు ఉమ్మడి వైఖరిని ప్రకటించాయి. మరింత ప్రాతినిధ్యం కలిగిన అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ కోసం పిలుపునిచ్చాయి. అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్), ప్రపంచ బ్యాంకులో వర్ధమాన ఆర్థిక వ్యవస్థలకు మరింత ప్రాధాన్యం కావాలని కోరాయి. రక్షణాత్మక వాణిజ్య విధానాలను వ్యతిరేకిస్తూ, బహిరంగ, నిబంధనల ఆధారిత బహుపాక్షిక వాణిజ్య వ్యవస్థకు మద్దతు తెలిపాయి. ఈ సమన్వయం 2009లో రష్యాలోని యెకటెరిన్‌బర్గ్‌లో తొలి బ్రిక్ శిఖరాగ్ర సదస్సుకు పునాది వేసింది.



బ్రెజిల్, రష్యా, భారత్, చైనా మధ్య రాజకీయ సహకార వేదికగా బ్రిక్ 2006లో అధికారికంగా ఏర్పాటైంది. మరింత ప్రాతినిధ్యం, సమానత్వం కలిగిన ప్రపంచ వ్యవస్థ వీటి ఉమ్మడి ఆకాంక్ష. 2011లో దక్షిణాఫ్రికా పూర్తి సభ్యదేశంగా చేరటంతో బ్రిక్ కాస్తా బ్రిక్స్‌గా మారింది. దీంతో ఖండాల మధ్య కూటమి భౌగోళిక ప్రాతినిధ్యం విస్తరించింది. ఆ తర్వాత ఆర్థిక అంశాలకు మించి అభివృద్ధి, ఆర్థిక సేవలు, ఆరోగ్యం, వాతావరణ చర్యలు, సాంకేతికత, వాణిజ్య రంగాలకు కార్యాచరణ విస్తరించింది. ఈ పరిణామంతో వర్ధమాన ఆర్థిక వ్యవస్థల మధ్య సంబంధాలకు బ్రిక్స్ విస్తృత చట్రంగా బలపడింది.

విస్తృత బ్రిక్స్: పెరిగిన పరిధి, బలపడిన సంబంధాలు

 


2024 జనవరిలో ప్రధాన విస్తరణ దశ ప్రారంభమైంది. ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, సౌదీ అరేబియా, యూఏఈ పూర్తి సభ్యదేశాలుగా చేరాయి. 2025 జనవరిలో ఇండోనేషియా 11వ పూర్తి సభ్యదేశంగా చేరింది. ఈ చేరికలతో బ్రిక్స్ భౌగోళిక, ఆర్థిక పరిధి గణనీయంగా విస్తరించింది. విస్తరణతో పాటు భాగస్వామ్య దేశం అనే కొత్త విభాగాన్ని రూపొందించారు. 2025లో బెలారస్, బొలీవియా, క్యూబా, కజకిస్థాన్, మలేసియా, నైజీరియా, థాయ్‌లాండ్, ఉగాండా, ఉజ్బెకిస్థాన్, వియత్నాం ఈ చట్రంలో చేరాయి. బ్రిక్స్‌తో క్రమబద్ధమైన సంబంధాలకు కొత్త ఏర్పాటు అదనపు మార్గాన్ని కల్పిస్తోంది.



పూర్తి సభ్యత్వ నిర్మాణాన్ని మార్చకుండానే భాగస్వామ్య దేశాల చట్రం బ్రిక్స్ చేరువను విస్తరిస్తోంది. ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా, యురేషియా వ్యాప్తంగా దక్షిణ–దక్షిణ సహకార అవకాశాలను బలోపేతం చేస్తోంది. వాణిజ్యం, ఆర్థిక సేవలు, వాతావరణ చర్యలు, సుస్థిర అభివృద్ధిలో సహకారానికి విస్తృత నెట్‌వర్క్ అవకాశం కల్పిస్తోంది. ప్రపంచ పాలనపై చర్చల్లో పాల్గొనేందుకు వర్ధమాన ఆర్థిక వ్యవస్థలు చూపుతున్న ఆసక్తిని ఇది ప్రతిబింబిస్తోంది.

నాలుగు దేశాల ఆర్థిక చర్చ నుంచి రాజకీయ, ఆర్థిక, ద్రవ్య, సామాజిక సహకారానికి విస్తృత చట్రంగా మారిన తీరును బ్రిక్స్ పరిణామం తెలియజేస్తోంది. విస్తరణతో జనాభా, ఆర్థిక బలం పెరిగింది. ప్రాంతీయ ప్రాతినిధ్యం, సంబంధాల పరిధి కూడా విస్తరించాయి. వర్ధమాన ఆర్థిక వ్యవస్థల మారుతున్న ప్రాధాన్యాలకు అనుగుణంగా కూటమి సంస్థాగత పరిణామం సాగింది.

బ్రిక్స్ అధ్యక్ష బాధ్యతలు: మార్పిడి విధానం, కర్తవ్యాలు
బ్రిక్స్ అనే సంక్షిప్త నామంలోని అక్షరాల క్రమంలో ఏటా అధ్యక్ష బాధ్యతలు మారుతాయి. ప్రతి అధ్యక్ష పదవీకాలం జనవరి 1న మొదలై సంబంధిత ఏడాది డిసెంబర్ 31న ముగుస్తుంది. అధ్యక్ష బాధ్యతలు నిర్వహించే దేశం ఆ ఏడాది కార్యాచరణ ప్రాధాన్యాలను నిర్ణయిస్తుంది. వార్షిక శిఖరాగ్ర సదస్సును నిర్వహించటంతో పాటు కీలక మంత్రుల, కార్యబృంద సమావేశాలకు దిశానిర్దేశం చేస్తుంది. ఇటీవల సభ్యత్వ విస్తరణ నేపథ్యంలో అధ్యక్ష బాధ్యతల కోసం కొత్త మార్పిడి సూత్రంపై సభ్య దేశాలు చర్చిస్తున్నాయి.

బ్రిక్స్ నాయకత్వంలో భారత్: కొనసాగింపు నుంచి ఏకాభిప్రాయం వరకు
ఈ ఏడాదికి ముందు భారత్ 2012, 2016, 2021లో బ్రిక్స్ అధ్యక్ష బాధ్యతలు నిర్వహించింది. ప్రతి అధ్యక్షత సంబంధిత కాలంలోని ప్రాధాన్యాలు, సవాళ్లను ప్రతిబింబించింది. కూటమితో భారత్‌కు కొనసాగుతున్న బలమైన సంబంధాన్ని పునరావృత నాయకత్వం తెలియజేస్తోంది. నిర్మాణాత్మక బహుపాక్షికత, అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల ప్రాధాన్యాల పట్ల భారత నిబద్ధతను కూడా చాటుతోంది.

2012: బలమైన సహకారానికి పునాది
నాలుగో బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సును 2012 మార్చి 29న న్యూఢిల్లీలో భారత్ నిర్వహించింది. ‘‘ప్రపంచ స్థిరత్వం, భద్రత, శ్రేయస్సు కోసం బ్రిక్స్ భాగస్వామ్యం’’ అనే ఇతివృత్తంతో సదస్సు జరిగింది. ప్రపంచ పాలనా సంస్కరణలు, సుస్థిర అభివృద్ధి, ఆహార భద్రత, ఇంధన భద్రతపై చర్చలు సాగాయి. ఢిల్లీ ప్రకటనతో పాటు బ్రిక్స్ సహకార బలోపేతానికి కార్యాచరణ ప్రణాళికను సదస్సు ఆమోదించింది. సంస్థాగత, రంగాల వారీ సంబంధాలకు మరింత బలమైన పునాదిని ఫలితాలు ఏర్పరిచాయి.

ప్రధాన ఫలితాలు
* మౌలిక సదుపాయాలు, సుస్థిర అభివృద్ధి ప్రాజెక్టులకు వనరులను సమీకరించేందుకు కొత్త అభివృద్ధి బ్యాంకు ఏర్పాటును పరిశీలించాలని సదస్సు ప్రతిపాదించింది. బ్రిక్స్, వర్ధమాన ఆర్థిక వ్యవస్థలు, అభివృద్ధి చెందుతున్న దేశాలకు ప్రతిపాదిత సంస్థ సేవలందిస్తుంది. ప్రపంచ వృద్ధి, అభివృద్ధికి మద్దతు ఇవ్వటంలో ప్రస్తుత బహుపాక్షిక, ప్రాంతీయ ఆర్థిక సంస్థలకు అనుబంధంగా పనిచేస్తుంది.
* స్థానిక కరెన్సీలో రుణ సదుపాయం విస్తరణకు సంబంధించిన ప్రధాన ఒప్పందంపై సభ్య దేశాలు సంతకం చేశాయి. బ్రిక్స్ అంతర్గత వాణిజ్యాన్ని పెంచేందుకు అంగీకరించాయి.
* బ్రిక్స్ దేశాలకు ఆర్థిక రక్షణ వ్యవస్థగా అత్యవసర నిల్వల ఏర్పాటుకు (సీఆర్‌ఏ) కూడా సదస్సు పునాది వేసింది. స్వల్పకాలిక నగదు సాయం అందించి, ఆర్థిక అస్థిరతను ఎదుర్కొనేందుకు సభ్య దేశాలకు తోడ్పడేలా ఈ ఏర్పాటును రూపొందించారు.
* వ్యవసాయం, ఆరోగ్యం, విజ్ఞాన శాస్త్రంలో ఆచరణాత్మక సహకారం కోసం కొత్త ఉమ్మడి మార్గాలను భారత్ సంస్థాగతం చేసింది.

2016: బ్రిక్స్ విస్తరించిన గోవా సదస్సు
ఎనిమిదో బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సును 2016 అక్టోబర్‌లో గోవాలో భారత్ నిర్వహించింది. ‘‘స్పందనాత్మక, సమ్మిళిత, సమష్టి పరిష్కారాల నిర్మాణం’’ అనే ఇతివృత్తంతో సదస్సు జరిగింది. బ్రిక్స్ అంతర్గత సహకారాన్ని బలోపేతం చేయటం, ఇతర దేశాలకు చేరువను విస్తరించటంపై భారత అధ్యక్షత దృష్టి సారించింది. ఉగ్రవాద నిరోధం, వాణిజ్యం, ఆవిష్కరణలు, బహుపాక్షిక సమన్వయంలో సహకారాన్ని కూడా ముందుకు తీసుకెళ్లింది. వర్ధమాన ప్రపంచ సవాళ్లు, ఆచరణాత్మక సహకారంపై కూటమి దృష్టిని గోవా సదస్సు మరింత బలోపేతం చేసింది.

ప్రధాన ఫలితాలు
* పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులకు ప్రధానంగా మద్దతు ఇస్తూ తొలి విడత రుణాలను విడుదల చేయటంతో కొత్త అభివృద్ధి బ్యాంకు కార్యకలాపాలు మరింత పటిష్ట‌మయ్యాయి.
* పునరుత్పాదక ఇంధన లభ్యత, స్వచ్ఛ ఇంధన మార్పు, ఇంధన భద్రతను బ్రిక్స్ ఉమ్మడి ప్రాధాన్యాలుగా ఉన్నత స్థాయికి తీసుకెళ్లింది.
* హెచ్‌ఐవీ, క్షయవ్యాధి నిరోధంపై మరింత దృష్టి పెట్టింది.
* ఉగ్రవాద నిరోధంపై మరింత బలమైన బ్రిక్స్ భాషను భారత్ సాధించింది. ఆర్థిక చర్యల కార్యదళం (ఎఫ్‌ఏటీఎఫ్) ప్రమాణాలను పాటించాలని కోరింది.
* బంగాళాఖాతం బహుళ రంగ సాంకేతిక, ఆర్థిక సహకార కార్యక్రమం (బిమ్‌స్టెక్) చేరువ సదస్సు, బ్రిక్స్‌తో విస్తృత బంగాళాఖాత ప్రాంత దేశాల సంబంధాలను పెంచింది. ఉగ్రవాద నిరోధం, వాణిజ్యం, ఇంధనం, పెట్టుబడులు, పర్యావరణం, సాంకేతికత, మౌలిక సదుపాయాలపై చర్చలు జరిగాయి.
* బ్రిక్స్ వ్యవసాయ పరిశోధన వేదిక, బ్రిక్స్ రైల్వే పరిశోధన నెట్‌వర్క్, బ్రిక్స్ క్రీడా మండలి, యువత కేంద్రిత పలు సహకార వేదికలను ఏర్పాటు చేసేందుకు అంగీకారం కుదిరింది.

2021: మారుతున్న ప్రపంచంలో సహకార సమీకరణ
13వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సును 2021 సెప్టెంబర్ 9న భారత్ ఆన్‌లైన్‌లో నిర్వహించింది. బ్రిక్స్ 15వ వార్షికోత్సవం సందర్భంగా ఈ సదస్సు జరిగింది. ‘‘బ్రిక్స్@15: కొనసాగింపు, సమీకరణ, ఏకాభిప్రాయం కోసం బ్రిక్స్ అంతర్గత సహకారం’’ అనే ఇతివృత్తంతో నిర్వహించారు. సంస్థాగత కొనసాగింపును బలోపేతం చేయటం, సహకారాన్ని మరింత లోతుగా తీసుకెళ్లటం, విస్తృత ఏకాభిప్రాయాన్ని నిర్మించటంపై భారత్ దృష్టి పెట్టింది. ఆరోగ్యం, డిజిటల్ సాంకేతికతలు, ఉగ్రవాద నిరోధం, సుస్థిర అభివృద్ధిలో సహకారాన్ని కూడా అధ్యక్షత ముందుకు తీసుకెళ్లింది.

ప్రధాన ఫలితాలు
* ఏకీకృత బ్రిక్స్ ఉగ్రవాద నిరోధ కార్యాచరణ ప్రణాళిక ఆమోదానికి భారత్ నాయకత్వం వహించింది.
* తన అధ్యక్షతలో మొట్టమొదటి బ్రిక్స్ డిజిటల్ ఆరోగ్య సదస్సును భారత్ నిర్వహించింది.
* ప్రస్తుత, భవిష్యత్తు మహమ్మారులను సమష్టిగా ఎదుర్కొనేందుకు బ్రిక్స్ టీకా పరిశోధన, అభివృద్ధి కేంద్రాన్ని ప్రారంభించారు.
* బ్రిక్స్ రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహ సముదాయ సహకారంపై ఒప్పందం కుదిరింది. పర్యావరణ పరిరక్షణ, విపత్తు నిర్వహణ, వాతావరణ పర్యవేక్షణ కోసం దేశాలు రిమోట్ సెన్సింగ్ సమాచారాన్ని పంచుకునేందుకు ఇది వీలు కల్పిస్తోంది.
* సుస్థిర వనరుల నిర్వహణ కోసం బ్రిక్స్ హరిత పర్యాటక కూటమి, తొలి బ్రిక్స్ జల మంత్రుల సమావేశాన్ని ప్రారంభిస్తూ మంత్రుల స్థాయిలో కొత్త కార్యాచరణ మార్గాలను భారత్ ప్రవేశపెట్టింది.

వరుస అధ్యక్ష బాధ్యతల ద్వారా బ్రిక్స్ సంస్థాగత, విషయపరమైన అభివృద్ధికి భారత్ తోడ్పడింది. ఆచరణాత్మక సహకారంపై దృష్టిని కొనసాగిస్తూనే, కొత్త ప్రపంచ సవాళ్లకు అనుగుణంగా ప్రాధాన్యాలను మార్చుకుంది. ఈ అనుభవం, విస్తరించిన సభ్యత్వంపై భారత 2026 అధ్యక్షత నిర్మితమైంది.

బ్రిక్స్ 2026: మంత్రుల సమావేశాలతో వ‌చ్చిన‌ కీలక ఫలితాలు
2026 జనవరి 1న భారత్ నాలుగోసారి బ్రిక్స్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టింది. అధ్యక్షత కాలంలో బ్రిక్స్ సహకారంలోని ప్రాధాన్య రంగాలపై వరుస మంత్రుల సమావేశాలను నిర్వహించింది. ఏడాది పొడవునా ఉమ్మడి ప్రాధాన్యాలు, ప్రపంచ, ప్రాంతీయ పరిణామాలపై బ్రిక్స్ సభ్య దేశాలు అభిప్రాయాలను పంచుకున్నాయి. కూటమి మూడు ప్రధాన మూలస్తంభాల్లో ఈ చర్చలు సహకారాన్ని ముందుకు తీసుకెళ్లాయి. రాజకీయ, భద్రతా సహకారం, ఆర్థిక, ద్రవ్య సహకారం, సాంస్కృతిక, ప్రజల మధ్య సంబంధాలు ఈ మూలస్తంభాల్లో ఉన్నాయి.

భారత అధ్యక్షత కాలంలో 25 నగరాల్లో 350కు పైగా సమావేశాలు, ఉన్నత స్థాయి కార్యక్రమాలు జరిగాయి. కీలక సహకార రంగాల్లో ఆచరణాత్మక, అభివృద్ధి కేంద్రిత ఫలితాలను ఈ సమావేశాలు అందించాయి. భారత 2026 బ్రిక్స్ అధ్యక్షతలో జరిగిన మంత్రుల సమావేశాల నుంచి కింది ఫలితాలు వెలువడ్డాయి.

* వ్యవసాయ జీవావరణంపై బ్రిక్స్ ప్రతిభా కేంద్రాలు: వాతావరణ మార్పులను తట్టుకునే సుస్థిర వ్యవసాయ వ్యవస్థలను ప్రోత్సహించేందుకు సహజ, సేంద్రియ, పునరుత్పాదక సాగు పద్ధతులపై ఉమ్మడి పరిశోధన, విజ్ఞాన వినిమయం, సామర్థ్య నిర్మాణానికి సహకార వేదికగా వీటిపై అంగీకారం కుదిరింది. ప్రారంభంలో మోదీపురంలోని ఐసీఏఆర్–భారత వ్యవసాయ వ్యవస్థల పరిశోధన సంస్థ సమన్వయం చేస్తుంది. వ్యవసాయంలో ఏఐ ఆధారిత నిర్ణయ సహాయక వ్యవస్థలు, భౌగోళిక సమాచార మేధ, ఐఓటీ ఆధారిత పర్యవేక్షణ, అధునాతన సమాచార విశ్లేషణ వినియోగాన్ని విస్తరించేందుకు డిజిటల్ వ్యవసాయంపై బ్రిక్స్ నెట్‌వర్క్ ఏర్పాటు చేయనున్నారు. ప్రారంభంలో ఐఐటీ ఢిల్లీ సమన్వయం చేస్తుంది.
* బ్రిక్స్ అగ్రిన్: వ్యవసాయ ఉత్పాదకాలు, జన్యు వనరులు, సమాచార నెట్‌వర్క్ అయిన బ్రిక్స్ అగ్రిన్‌ను స్వచ్ఛంద, రైతు కేంద్రిత సహకార చట్రంగా అంగీకరించారు. విత్తనాలు, జన్యు పదార్థం, వ్యవసాయ ఉత్పాదకాలపై బ్రిక్స్ దేశాల మధ్య సహకారాన్ని బలోపేతం చేయటం దీని లక్ష్యం.
* ఆరోగ్యకర జీవనశైలి కోసం బ్రిక్స్ ఉద్యమం: 2026–2029 ఆరోగ్యకర జీవనశైలి ప్రోత్సాహ ఉమ్మడి కార్యక్రమానికి బ్రిక్స్ మార్గసూచితో పాటు ఈ ప్రాధాన్యాన్ని ప్రారంభించారు. సాంకేతిక సహకారం, విజ్ఞాన వినిమయం, సమన్వయ అవగాహన కార్యక్రమాలకు వేదికగా పనిచేయటం దీని లక్ష్యం. ఊబకాయం, ఇతర సంక్రమణేతర వ్యాధుల నివారణకు జీవితంలోని అన్ని దశలను పరిగణనలోకి తీసుకునే విధానాలను ప్రోత్సహిస్తుంది.
*  సంప్రదాయ, అనుబంధ, సమీకృత వైద్యంపై బ్రిక్స్ నిపుణుల కార్యబృందం (టీసీఐఎం): టీసీఐఎంపై క్రమబద్ధమైన, ఏకాభిప్రాయ ఆధారిత సహకారానికి వేదికగా పనిచేయటం దీని లక్ష్యం. విధాన చర్చలు, పరిశోధన, ఆధారాల రూపకల్పన, సామర్థ్య నిర్మాణం, విద్యా వినిమయం, డిజిటల్ విజ్ఞాన వేదికలు, నాణ్యత, నియంత్రణ ప్రమాణాలు, సంప్రదాయ, దేశీయ విజ్ఞాన పరిరక్షణను ఇది పరిధిలోకి తీసుకుంటుంది.
* మానసిక ఆరోగ్యంపై దృష్టి: బ్రిక్స్ శిక్షణ కేంద్రాల నెట్‌వర్క్, బ్రిక్స్ ప్రతిభా కేంద్రాల నెట్‌వర్క్ ద్వారా ఈ అంశంపై దృష్టి పెట్టారు. భారత నిమ్హాన్స్ సమన్వయ కేంద్రంగా ఉంటుంది. నైపుణ్యాల మెరుగుదల, పనుల భాగస్వామ్యం, ప్రామాణిక శిక్షణ ద్వారా మానసిక ఆరోగ్య మానవ వనరులను సమర్థంగా వినియోగించటం, ప్రాథమిక ఆరోగ్య సంరక్షణలో మానసిక శ్రేయస్సును భాగం చేయటం లక్ష్యం.
*  సంప్రదాయ విజ్ఞానానికి ప్రధాన స్రవంతిలో స్థానం: ప్రజా కేంద్రిత, సమాజ ఆధారిత అనుసరణ ద్వారా వాతావరణ ప్రతిఘటన సామర్థ్యాన్ని పెంచే బ్రిక్స్ సూత్రాలు; సంప్రదాయ, దేశీయ విజ్ఞాన వ్యవస్థలపై విద్యా సహకార బలోపేతానికి బ్రిక్స్ మార్గదర్శక సూత్రాలను ఆమోదించారు.
* సుస్థిర జీవనశైలుల పురోగతి: విజ్ఞాన వినిమయం, పరిశోధన, ఆవిష్కరణలను ముందుకు తీసుకెళ్లే బ్రిక్స్ సంస్థల నెట్‌వర్క్; సుస్థిర జీవనశైలుల వారోత్సవం ద్వారా విధానాలు, కార్యక్రమాలు, చొరవలు, ఉత్తమ పద్ధతులపై విజ్ఞానాన్ని పంచుకుంటారు. ఇతివృత్తాల వారీగా సామర్థ్య నిర్మాణ కార్యశాలలు నిర్వహిస్తారు. విద్యా, పరిశోధన సంస్థలు సహా భాగస్వాముల మధ్య చర్చలకు అవకాశం కల్పించి, అధ్యయన ఉదాహరణలను సంకలనం చేస్తారు.
*  నైపుణ్యాల కోసం బ్రిక్స్ కనెక్ట్: బ్రిక్స్ వర్చువల్ లైజన్ కార్యాలయం ఆధారంగా సామర్థ్య నిర్మాణం, ఉపాధి సామర్థ్యం, కొత్త నైపుణ్యాలు, సాంకేతికతల కోసం బ్రిక్స్ సహకార నెట్‌వర్క్‌ను రూపొందించారు. సామాజిక భద్రత పురోగతికి సామర్థ్య నిర్మాణం, శ్రామిక శక్తిలో మహిళల భాగస్వామ్యం, నైపుణ్యాలు, ఉపాధి సామర్థ్యం, డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాలు అనే నాలుగు భాగాలతో పనిచేసే సరళ వేదిక ఇది. దీని కింద సహకారం స్వచ్ఛందం; చట్టపరంగా కట్టుబడి ఉండదు.
* స్మార్ట్ గ్రిడ్లు, ఇంధన నిల్వ: ఇంధన నిల్వ, స్మార్ట్ గ్రిడ్లపై బ్రిక్స్ మార్గదర్శక సూత్రాలను ఆమోదించారు. స్మార్ట్ గ్రిడ్లు, ఇంధన నిల్వకు బ్రిక్స్ డిజిటల్ ప్రతిభా కేంద్రాన్ని ప్రారంభించారు. విజ్ఞాన వినిమయం, సామర్థ్య నిర్మాణం, విధాన, నియంత్రణ ఉత్తమ పద్ధతుల మార్పిడి, బ్రిక్స్ దేశాల మధ్య ప్రయోగాత్మక కార్యక్రమాల ప్రోత్సాహానికి ఇది స్వచ్ఛంద వేదికగా పనిచేస్తుంది.
*  పట్టణ మౌలిక సదుపాయాల బలోపేతం: సుస్థిర పట్టణ రవాణాలో విజ్ఞాన వినిమయం, సామర్థ్య నిర్మాణం, సాంకేతిక సహకారాన్ని ప్రోత్సహించే ఆన్‌లైన్ సహకార వేదికగా బ్రిక్స్ పట్టణ రవాణా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. పట్టణ ప్రణాళిక, రూపకల్పన, పెట్టుబడి, నిర్మాణం, నిర్వహణలో వాతావరణ, విపత్తు ముప్పులను భాగం చేసేందుకు వాతావరణ మార్పులను తట్టుకునే పట్టణ మౌలిక సదుపాయాలపై బ్రిక్స్ స్వచ్ఛంద సూత్రాలను ఆమోదించారు. అనువర్తిత పట్టణ పరిశోధన, దేశాల మధ్య సహచర అభ్యసనం, నిరంతర సంస్థాగత సహకారం కోసం బ్రిక్స్ పట్టణ పరిశోధన, విజ్ఞాన నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేశారు.
* బ్రిక్స్ ఎంఎస్‌ఎంఈ సహకార పోర్టల్: అన్ని బ్రిక్స్ సభ్య దేశాలకు అందుబాటులో ఉండే డిజిటల్ వ్యవస్థగా ఇది పనిచేస్తుంది. ఎంఎస్‌ఎంఈలు, సాంకేతిక కేంద్రాలు, క్లస్టర్లు, వాణిజ్య సంఘాలు, ఆర్థిక సంస్థలు, శిక్షణ, సామర్థ్య నిర్మాణ సంస్థలు, విధానకర్తలు, ఇతర సంబంధిత భాగస్వాములకు మద్దతు ఇస్తుంది. ఎంఎస్‌ఎంఈలకు మార్కెట్లు, ఆర్థిక వనరులు అందేలా బ్రిక్స్‌ను వినియోగించేందుకు ఎంఎస్‌ఎంఈ ఆర్థిక సేవలపై సంస్థాగత చర్చ, ఎంఎస్‌ఎంఈల అంతర్జాతీయీకరణపై కార్యాచరణ ప్రణాళిక కూడా కీలక ఫలితాలుగా నిలిచాయి.
* బ్రిక్స్ ఇంక్యుబేటర్ నెట్‌వర్క్: బ్రిక్స్ దేశాల్లోని జాతీయ నోడల్ సంస్థలు, ఎంపిక చేసిన ఇంక్యుబేటర్లు, అంకుర సంస్థలను అనుసంధానించే డిజిటల్ వేదిక లేదా నెట్‌వర్క్ ఇది. నమోదు, భాగస్వామ్య ఇంక్యుబేటర్లతో అనుసంధానానికి వీలు కల్పిస్తుంది. అర్హత కలిగిన అంకుర సంస్థలను ఇతర బ్రిక్స్ దేశాల్లోని ఇంక్యుబేటర్లకు సిఫారసు చేసేందుకు అవకాశం ఇస్తుంది.
* బ్రిక్స్ అంకుర సంస్థల ఆవిష్కరణ నిధి: ప్రారంభ, వృద్ధి దశలోని అంకుర సంస్థలకు ఆర్థిక వనరులను అందించటం, బ్రిక్స్ దేశాల్లో ఆవిష్కరణ ఆధారిత ఔత్సాహికతను పెంపొందించటం దీని లక్ష్యం.
*  బ్రిక్స్ విజ్ఞాన, పరిశోధన భాండాగారం: బ్రిక్స్ దేశాల మధ్య శాస్త్రీయ విజ్ఞానాన్ని నిల్వ చేసి, పంచుకునే క్రమబద్ధమైన వేదికగా దీన్ని స్వాగతించారు.
* బ్రిక్స్ రవాణా సరఫరా గొలుసు సహకార చట్రం: వివిధ రంగాల రవాణా వ్యవస్థ ప్రతిఘటన సామర్థ్యం, సుస్థిరతను బలోపేతం చేసే స్వచ్ఛంద, ఏకాభిప్రాయ ఆధారిత చట్రం ఇది. సాంకేతిక వినిమయం, సరకు, నౌకాయాన సేవలపై విజ్ఞాన మార్పిడి, స్థానిక అసెంబ్లీ, తయారీ వ్యవస్థలు, సామర్థ్య నిర్మాణాన్ని ప్రోత్సహిస్తూ ఛిన్నాభిన్నమైన సరఫరా గొలుసులు, బలహీన అనుసంధాన సమస్యలను పరిష్కరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. పర్యావరణపరంగా సుస్థిరమైన, వాతావరణ మార్పులను తట్టుకునే రవాణా పద్ధతులను కూడా ముందుకు తీసుకెళ్తుంది.
* ప్రపంచ విలువ గొలుసుల్లో బ్రిక్స్ సహకారం: 2026–2030 జీవీసీ కార్యాచరణ ప్రణాళిక కింద సాంకేతిక మండలి, జీవీసీ ఉమ్మడి అధ్యయనం ఉంటాయి. ప్రపంచ విలువ గొలుసులు ప్రతిఘటన సామర్థ్యం, సమర్థత, ఉత్పాదకతతో పనిచేసేలా బ్రిక్స్ సహకారాన్ని మెరుగుపరచటం; సభ్య దేశాల మధ్య మార్కెట్లను తెరవటం, ఆర్థిక వైవిధ్యాన్ని ముందుకు తీసుకెళ్లటం లక్ష్యం.
* కస్టమ్స్ వ్యవహారాల్లో సహకారం, పరస్పర పాలనా సాయంపై బ్రిక్స్ ఒప్పందం: వేగవంతమైన వాణిజ్యం, తక్కువ లావాదేవీ ఖర్చులు, మరింత సురక్షిత సరిహద్దులు, విశ్వసనీయ వాణిజ్య సదుపాయం, వ్యాపార సౌలభ్య మెరుగుదల, అక్రమ వాణిజ్య నిరోధానికి మద్దతుగా ఒప్పందంపై సూత్రప్రాయ ఆమోదం, సంతకం చేసేందుకు సంసిద్ధతను సభ్య దేశాలు ధ్రువీకరించాయి.
* ప్రమాణీకరణ రంగంలో సహకారం: బ్రిక్స్ జాతీయ ప్రమాణాల సంస్థల అధిపతులు అవగాహన ఒప్పందంపై సంతకం చేశారు. ప్రమాణాల రూపకల్పన, స్వీకరణ, అమలులో సహకారాన్ని బలోపేతం చేయటానికి ఇది అధికారిక చట్రాన్ని అందిస్తుంది. సమాచార వినిమయం, ఉత్తమ పద్ధతుల మార్పిడి, సాంకేతిక సహకారం, సామర్థ్య నిర్మాణాన్ని ప్రోత్సహిస్తుంది. నాణ్యమైన మౌలిక సదుపాయాలను బలోపేతం చేసి, వినియోగదారుల రక్షణను మెరుగుపరుస్తుంది. వాణిజ్యానికి సాంకేతిక అడ్డంకులను తగ్గిస్తుంది.
* బ్రిక్స్ యువజన సహకార చట్రం 2026: భవిష్యత్తు చర్చలు, అనుభవాల వినిమయం, బ్రిక్స్ యువజన విభాగంలో ఆచరణాత్మక కార్యక్రమాల పరిశీలనకు మార్గనిర్దేశం చేస్తూ కొనసాగింపు, సమన్వయం, క్రమబద్ధమైన సహకారానికి ఆధార పత్రంగా దీన్ని ఆమోదించారు.
* క్రీడా సాంకేతిక సహకారానికి సంస్థాగత రూపం: ఉత్తమ పద్ధతులు, సంస్థాగత అనుభవాలు, సాంకేతిక సమాచారం, పరిశోధన అంశాల మార్పిడి రూపంలో క్రీడా సాంకేతికతపై సహకారాన్ని ప్రోత్సహించేందుకు కొత్త కార్యబృందాన్ని ఏర్పాటు చేశారు.

భారత 2026 బ్రిక్స్ అధ్యక్షతలో మంత్రుల సమావేశాల ఫలితాలు ఆచరణాత్మక సహకారం, సమ్మిళిత వృద్ధి, ప్రపంచ దక్షిణ దేశాలకు మరింత బలమైన స్వరంపై నిరంతర దృష్టిని ప్రతిబింబిస్తున్నాయి.

2026: మరింత సమ్మిళిత భవిష్యత్తు దిశగా బ్రిక్స్‌కు భారత్ దిశానిర్దేశం
ప్రపంచవ్యాప్తంగా కీలక మార్పులు చోటుచేసుకుంటున్న సమయంలో భారత్ 2026 బ్రిక్స్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టింది. అంతర్జాతీయ వ్యవస్థ ఆర్థిక విభజన, సాంకేతిక అంతరాయాలు, భౌగోళిక రాజకీయ అనిశ్చితిని ఎదుర్కొంటోంది. వాతావరణ మార్పు, వనరులపై ఒత్తిడి మరింత సంక్లిష్టతను పెంచుతున్నాయి. పరస్పరం ముడిపడిన ఈ సవాళ్లను ఎదుర్కొనేందుకు సమ్మిళిత, ఆచరణాత్మక, విభిన్న జాతీయ పరిస్థితులకు స్పందించే సహకారం అవసరం.

చర్చలు, సమన్వయ చర్యల ద్వారా ఈ సవాళ్లను పరిష్కరించేందుకు బ్రిక్స్ కీలక మార్గాన్ని అందిస్తోంది. విస్తరించిన సభ్యత్వంతో ప్రధాన వర్ధమాన ఆర్థిక వ్యవస్థల విభిన్న దృక్పథాలు ఒకే వేదికపైకి వస్తున్నాయి. అభివృద్ధి, వాతావరణ చర్యలు, సాంకేతికత, ఇంధనం, ఆర్థిక ప్రతిఘటన సామర్థ్యంలో సహకారాన్ని కూటమి ముందుకు తీసుకెళ్లగలదు. ప్రపంచ సంస్థల్లో సంస్కరణలపై చర్చలకూ తోడ్పడగలదు.

కూటమి పరిమాణాన్ని పెంచటానికే భారత లక్ష్యం పరిమితం కాదు. విస్తృత ప్రాతినిధ్యాన్ని అర్థవంతమైన సహకారం, స్పష్టమైన ఫలితాలుగా మార్చటమే లక్ష్యం. ప్రస్తుత వ్యవస్థల సామర్థ్యాన్ని బలోపేతం చేస్తూనే విభిన్న సభ్యుల మధ్య ఏకాభిప్రాయాన్ని నిర్మించాలని భారత అధ్యక్షత భావిస్తోంది. మరింత సమ్మిళిత ప్రపంచ వ్యవస్థకు నిర్మాణాత్మక శక్తిగా బ్రిక్స్‌ను బలోపేతం చేయాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుంది.

References

Cabinet

Special Service and Features

 

Prime Minister's Office

Ministry of Commerce & Industry

Ministry of Environment, Forest and Climate Change

Ministry of Micro, Small & Medium Enterprises

BRICS

Ministry of External Affairs

Ministry Of Agriculture and Farmers Welfare

  • https://sansad.in/getFile/loksabhaquestions/annex/185/AU271_UZhNkJ.pdf?source=pqals

Ministry of Health and Family Welfare

Click here to see pdf

***

(Explainer ID: 159960) आगंतुक पटल : 5
Provide suggestions / comments
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Bengali , Assamese , Kannada