Rural Prosperity
వైబ్రెంట్ విలేజెస్ ప్రోగ్రామ్
సమ్మిళిత అభివృద్ధితో భారత సరిహద్దులకు మరింత బలం
Posted On:
06 SEP 2026 10:52AM
భారత సరిహద్దు గ్రామాల పాత్రకు వైబ్రెంట్ విలేజెస్ కార్యక్రమం (వీవీపీ) కొత్త నిర్వచనం ఇచ్చింది. అవి ఇకపై మారుమూల సరిహద్దు ప్రాంతాలు మాత్రమే కావు. జాతీయ భద్రత, అభివృద్ధిలో వ్యూహాత్మక భాగస్వాములుగా మారాయి. వీవీపీ–1, వీవీపీ–2 దశల్లో అమలవుతున్న ఈ కార్యక్రమానికి రూ.11,639 కోట్లను ఖర్చు చేస్తున్నారు. భారత అంతర్జాతీయ భూ సరిహద్దుల వెంట ఉన్న గ్రామాల్లో రహదారి అనుసంధానం, విద్యుత్తు, టెలికమ్యూనికేషన్, ఆరోగ్య సంరక్షణ, విద్య, జీవనోపాధి అవకాశాలను విస్తరిస్తోంది. చైతన్యవంతమైన, విపత్తులను తట్టుకోగల, సంపన్న సరిహద్దు సమాజాలను నిర్మించటం వీవీపీ లక్ష్యం. ఈ కార్యక్రమం ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తూ, సుస్థిర ఆర్థిక అవకాశాలను కల్పిస్తోంది. సరిహద్దుల్లో అభివృద్ధి చెందుతున్న జనావాసాలను కొనసాగించటం ద్వారా దేశ సరిహద్దు భద్రతను బలోపేతం చేస్తోంది.
సరిహద్దు గ్రామాలకు ఎందుకింత ప్రాధాన్యం?

భారత్ ఏడు పొరుగు దేశాలతో 15,000 కిలోమీటర్లకు పైగా అంతర్జాతీయ భూ సరిహద్దును పంచుకుంటోంది. బంగ్లాదేశ్‌తో 4,096.7 కిలోమీటర్ల మేర సుదీర్ఘ సరిహద్దు ఉంది. ఆ తర్వాత చైనాతో 3,488 కిలోమీటర్లు, పాకిస్థాన్‌తో 3,323 కిలోమీటర్ల సరిహద్దు ఉంది. మిగతా సరిహద్దు నేపాల్, మయన్మార్, భూటాన్, అఫ్గానిస్థాన్ దేశాలతో ఉంది.
దశాబ్దాలుగా అనేక సరిహద్దు గ్రామాలు కఠిన భౌగోళిక పరిస్థితులు, బలహీన అనుసంధానం, పరిమిత మౌలిక సదుపాయాలు, కొద్దిపాటి జీవనోపాధి అవకాశాల కారణంగా ఇతర ప్రాంతాలకు దూరంగా ఉండిపోయాయి. ఈ సవాళ్లతో ప్రజలు వలస వెళ్లారు. ఫలితంగా పలు సరిహద్దు ప్రాంతాల్లో జనసాంద్రత తగ్గింది. దీర్ఘకాలంగా కొనసాగుతున్న ఈ సమస్యలను పరిష్కరించేందుకు 2023లో వైబ్రెంట్ విలేజెస్ ప్రోగ్రామ్‌ను(వీవీపీ) ప్రారంభించారు. భారత సరిహద్దుల వెంట ఎంపిక చేసిన గ్రామాల సమగ్ర అభివృద్ధిని వేగవంతం చేయటం దీని లక్ష్యం. సరిహద్దు భద్రతా దళాలకు అక్కడి ప్రజలు కళ్లు, చెవులుగా పనిచేస్తారన్న గుర్తింపుతో చైతన్యవంతమైన, సురక్షిత, సంపన్న సరిహద్దు సమాజాలను నిర్మించాలని సంకల్పించారు. ఈ జనావాసాలను దేశంలోని చివరి గ్రామాలుగా కాకుండా తొలి గ్రామాలుగా చూడటం ద్వారా దృక్పథంలో వచ్చిన మార్పునూ ఈ కార్యక్రమం సూచిస్తోంది.
ఉత్తర సరిహద్దు గ్రామాలతో ప్రారంభమైన ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం దశలవారీగా భూ సరిహద్దు అంతటికీ విస్తరించింది. సాధికారత పొందిన సరిహద్దు సమాజాలే సురక్షిత, బలమైన వికసిత్ భారత్–2047కు పునాది.
మీకు తెలుసా? 1999 కార్గిల్ చొరబాటుపై తొలి హెచ్చరిక రాడార్ లేదా గస్తీ బృందం నుంచి రాలేదు. 1999 మే 3న కార్గిల్ ప్రాంతంలో అనుమానాస్పద కదలికలను స్థానికులే తొలిసారి గుర్తించి సమాచారం ఇచ్చారు. దేశ రక్షణలో తొలి వరుసగా సరిహద్దు సమాజాలకు ఉన్న ప్రాధాన్యాన్ని ఇది చాటుతోంది.

రెండు దశలు.. ఒకే లక్ష్యం
భారత అంతర్జాతీయ భూ సరిహద్దు మొత్తాన్ని కలుపుతూ వైబ్రెంట్ విలేజెస్ ప్రోగ్రామ్‌ను ప్రభుత్వం రెండు దశల్లో అమలు చేస్తోంది. ఉత్తర సరిహద్దు గ్రామాలను వీవీపీ–1 పరిధిలోకి తీసుకొచ్చారు. ఇతర అంతర్జాతీయ భూ సరిహద్దులకు ఇదే విధానాన్ని వీవీపీ–2 విస్తరిస్తోంది. రెండు దశల్లో రూ.11,639 కోట్ల ఉమ్మడి కేటాయింపుతో 2,616కు పైగా గ్రామాలను అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

రూపకల్పనలో రెండు దశల మధ్య వ్యత్యాసం ఉన్నా, లక్ష్యం ఒక్కటే. రాష్ట్రాలతో కలిసి వీవీపీ–1ను కేంద్ర ప్రాయోజిత పథకంగా అమలు చేస్తున్నారు. వీవీపీ–2 పూర్తిగా కేంద్ర నిధులతో సాగే కేంద్ర రంగ పథకం. జీవన పరిస్థితులను మెరుగుపరచటం, స్థానికంగా ఉపాధి అవకాశాలు కల్పించటం, సరిహద్దు సమాజాలకు సాధికారత అందించటం రెండు దశల లక్ష్యం. ‘తొలి గ్రామాలను’ చైతన్యవంతమైన అభివృద్ధి కేంద్రాలుగా తీర్చిదిద్దటం ద్వారా దేశ సరిహద్దు భద్రతను బలోపేతం చేస్తున్నాయి.
వీవీపీ–1: ఉత్తర సరిహద్దు సమాజాల బలోపేతం

ఉత్తర సరిహద్దు గ్రామాల కోసం వీవీపీ తొలి దశను 2022–23 కేంద్ర బడ్జెట్‌లో ప్రకటించారు. అరుణాచల్ ప్రదేశ్‌లోని అంజావ్ జిల్లా కిబితూలో 2023 ఏప్రిల్ 10న ప్రారంభించారు. నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలోని 19 జిల్లాల్లో ఉత్తర సరిహద్దును ఆనుకుని ఉన్న 46 బ్లాకుల గ్రామాలను గుర్తించారు. వీటిలో సుమారు 1.42 లక్షల జనాభా కలిగిన 662 వ్యూహాత్మక గ్రామాల సమగ్ర అభివృద్ధికి తొలి ప్రాధాన్యం ఇచ్చారు. అరుణాచల్ ప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, సిక్కిం, ఉత్తరాఖండ్, కేంద్రపాలిత ప్రాంతమైన లద్దాఖ్ ఇందులో ఉన్నాయి. 2022–23 నుంచి 2026–27 ఆర్థిక సంవత్సరాల వరకు రూ.4,800 కోట్ల కేటాయింపుతో పథకానికి ఆమోదం లభించింది. ఇందులో రహదారి అనుసంధానానికి రూ.2,500 కోట్లు కేటాయించారు. మారుమూల సరిహద్దు గ్రామాల్లో అభివృద్ధి అంతరాన్ని తగ్గించటం కార్యక్రమం లక్ష్యం. దేశంలోని ఇతర ప్రాంతాల్లో అందుబాటులో ఉన్న స్థాయి నాణ్యమైన మౌలిక సదుపాయాలు, అత్యవసర సేవలను ఈ గ్రామాలకూ అందించేందుకు కృషి చేస్తోంది.
మీకు తెలుసా? వ్యూహాత్మక ప్రదేశం, చరిత్ర, అభివృద్ధి అవసరాల దృష్ట్యా వీవీపీ ప్రారంభానికి కిబితూను ఎంపిక చేశారు. అరుణాచల్ ప్రదేశ్ అంజావ్ జిల్లాలో ఉన్న కిబితూ.. భారత్‌లో తూర్పు వైపు చివరన ఉన్న జనావాస గ్రామాల్లో ఒకటి. 1962 భారత్–చైనా యుద్ధంలో ఈ ప్రాంతంలో తీవ్ర పోరాటం జరిగింది. కఠిన భౌగోళిక పరిస్థితులు, స్వల్ప అనుసంధానం, వలసలు దీని అభివృద్ధికి చాలాకాలంగా ఆటంకంగా నిలిచాయి. దేశ సరిహద్దు ప్రాంతాలకు ముందుగా అభివృద్ధిని తీసుకెళ్లాలన్న ప్రభుత్వ దార్శనికతను కిబితూ నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించటం ప్రతిబింబించింది.
వీవీపీ–1 కింద కీలక చర్యలు
అన్ని కాలాల్లో ఉపయోగించగల రహదారులు, తాగునీరు, నిరంతర విద్యుత్తు, మొబైల్, ఇంటర్నెట్ అనుసంధానం, అవసరమైన ఆరోగ్య, విద్యా మౌలిక సదుపాయాలకు ఈ కార్యక్రమం మద్దతు ఇస్తుంది. జీవనోపాధి, జీవన ప్రమాణాలను మెరుగుపరచేందుకు పర్యాటక సదుపాయాలు, బహుళ ప్రయోజన సామాజిక కేంద్రాలను కూడా ప్రోత్సహిస్తోంది. హబ్–స్పోక్ నమూనాలో జీవనోపాధి సాయం అందిస్తున్నారు. సామాజిక ఔత్సాహికత, యువత, మహిళల సాధికారత, పర్యాటకం, స్థానిక సంస్కృతి ప్రోత్సాహం, ఒక బ్లాకు–ఒక ఉత్పత్తి సంస్థలకు ఊతమిస్తోంది. వివిధ పథకాల సమన్వయం ద్వారా వీవీపీ–1 రూపొందించిన సేవల నమూనాను రెండో దశలో మిగిలిన భూ సరిహద్దు ప్రాంతాలకు విస్తరిస్తున్నారు.

మీకు తెలుసా? భారత్ దాదాపు నాలుగు దశాబ్దాలుగా సరిహద్దు గ్రామాలకు సాయం అందిస్తోంది. సరిహద్దు ప్రాంత అభివృద్ధి కార్యక్రమాన్ని(బీఏడీపీ) 1986–87లో పశ్చిమ సరిహద్దు వెంట ప్రారంభించారు. ఆ తర్వాత అంతర్జాతీయ సరిహద్దు నుంచి తొలి జనావాసానికి 10 కిలోమీటర్ల పరిధిలోని గ్రామాలకు విస్తరించారు. 16 రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 111 జిల్లాలను ఈ కార్యక్రమం పరిధిలోకి తీసుకొచ్చారు. 2004–05 నుంచి 39,000కు పైగా అభివృద్ధి పనులకు అనుమతి ఇచ్చారు. ఈ కార్యక్రమం ప్రస్తుతం ముగింపు దశలో ఉంది. ఈ పునాదిపై ఎంపిక చేసిన సరిహద్దు గ్రామాల అభివృద్ధిపై వీవీపీ దృష్టి సారిస్తోంది. అర్హత కలిగిన ప్రతి ప్రభుత్వ పథకం వారికి అందేలా చూస్తోంది. ప్రజలు సొంత గ్రామాల్లోనే ఉండేందుకు తోడ్పడుతూ, సరిహద్దు భద్రతకు మరింత బలం చేకూరుస్తోంది.
వీవీపీ–2: అన్ని భూ సరిహద్దులకు నమూనా విస్తరణ
వీవీపీ–2కు కేంద్ర మంత్రివర్గం 2025 ఏప్రిల్ 2న ఆమోదం తెలిపింది. తొలి దశకు భిన్నంగా వీవీపీ–2కు కేంద్రం పూర్తి నిధులు సమకూరుస్తోంది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ (ఎంహెచ్‌ఏ) దీన్ని అమలు చేస్తోంది. అసోంలోని కాచార్ జిల్లా నాథన్‌పూర్ గ్రామంలో 2026 ఫిబ్రవరి 20న అధికారికంగా ప్రారంభించారు. 2028–29 ఆర్థిక సంవత్సరం వరకు ఈ పథకానికి రూ.6,839 కోట్ల కేటాయింపు ఉంది.
అంతర్జాతీయ భూ సరిహద్దులను ఆనుకుని ఉన్న 334 బ్లాకుల్లో సమగ్ర అభివృద్ధి కోసం 1,954 గ్రామాలను గుర్తించారు. ఈ బ్లాకులు 15 రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లో ఉన్నాయి. అరుణాచల్ ప్రదేశ్, అసోం, బిహార్, గుజరాత్, మణిపూర్, మేఘాలయ, మిజోరం, నాగాలాండ్, పంజాబ్, రాజస్థాన్, సిక్కిం, త్రిపుర, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలతో పాటు జమ్మూ కశ్మీర్, లద్దాఖ్ కేంద్రపాలిత ప్రాంతాలు ఇందులో ఉన్నాయి. పనులు పునరావృతం కాకుండా వీవీపీ–1 పరిధిలో ఇప్పటికే ఉన్న ఉత్తర సరిహద్దు బ్లాకులను మినహాయించారు.

వీవీపీ–2 కింద చేపట్టే చర్యలు
సరిహద్దు గ్రామాలను బలోపేతం చేసేందుకు వీవీపీ–2 కింద సమగ్ర ప్యాకేజీకి భారత ప్రభుత్వం ఆమోదం తెలిపింది. మౌలిక సదుపాయాలు, సహకార సంఘాలు, స్వయం సహాయక సంఘాల (ఎస్‌హెచ్‌జీలు) ద్వారా విలువ గొలుసులు, స్మార్ట్ తరగతి గదులు, పర్యాటక సర్క్యూట్లు, సుస్థిర జీవనోపాధికి ఈ పథకం మద్దతు ఇస్తుంది. రహదారి అనుసంధానం, ఆరోగ్య సంరక్షణ, ఆర్థిక సమ్మిళితత్వం, నైపుణ్యాభివృద్ధి, టెలికాం అనుసంధానాన్ని కూడా ప్రోత్సహిస్తోంది. జీవన పరిస్థితులను మెరుగుపరచటం, ఉపాధి కల్పించటం, ప్రజలు సరిహద్దు గ్రామాల్లోనే నివసించేలా ప్రోత్సహించటం లక్ష్యం. ఏకీకృత అభివృద్ధి చట్రం కింద భారత భూ సరిహద్దు మొత్తానికి వైబ్రెంట్ విలేజెస్ ప్రోగ్రామ్‌ను విస్తరిస్తోంది.
మీకు తెలుసా? సంపన్న, సురక్షిత సరిహద్దు ప్రాంతాలను నిర్మించాలని వీవీపీ–2 లక్ష్యంగా పెట్టుకుంది. బలమైన సరిహద్దు సమాజాల ద్వారా సీమాంతర నేరాలను నిరోధించటం, నియంత్రించటంపై ప్రత్యేక దృష్టి పెడుతోంది.
పథకాల సమన్వయంతో అభివృద్ధి
గ్రామ కార్యాచరణ ప్రణాళికల ఆధారంగా వీవీపీని అమలు చేస్తున్నారు. స్థానిక అవసరాలకు అనుగుణంగా సరిహద్దు, రాష్ట్ర, గ్రామ ప్రత్యేక చర్యల ద్వారా లక్ష్యాలను సాధిస్తారు. వివిధ పథకాల సమన్వయ విధానాన్ని అనుసరిస్తూ, ప్రస్తుత నిబంధనల ప్రకారం పథకాల ప్రయోజనాలన్నీ అర్హులకు అందేలా చూస్తున్నారు. కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన (పీఎంజీఎస్‌వై)–4 కింద అన్ని కాలాల్లో ఉపయోగించగల రహదారులను అభివృద్ధి చేస్తోంది.
సరిహద్దు గ్రామాలు ప్రత్యేక సవాళ్లను ఎదుర్కొంటున్నందున వాటి పరిష్కారానికి పథకాల మార్గదర్శకాల్లో సడలింపులను క్యాబినెట్ కార్యదర్శి నేతృత్వంలోని ఉన్నతాధికార కమిటీ సిఫారసు చేయవచ్చు. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నోడల్ మంత్రిత్వ శాఖగా వ్యవహరిస్తోంది. సమన్వయ ప్రణాళిక, అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వాలు, జిల్లా పాలనా యంత్రాంగాలు, సరిహద్దు భద్రతా దళాలతో సన్నిహితంగా పనిచేస్తోంది.
క్షేత్రస్థాయిలో ప్రభావం
ప్రారంభమైనప్పటి నుంచి ఉత్తర సరిహద్దు గ్రామాల్లో సమ్మిళిత, సుస్థిర అభివృద్ధికి వైబ్రెంట్ విలేజెస్ కార్యక్రమం–1 పునాది వేసింది.

2026 జులై నాటికి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ రూ.3,020.32 కోట్ల వ్యయంతో 1,248 ప్రాజెక్టులకు అనుమతి ఇచ్చింది. వివిధ పథకాల సమన్వయం కింద కేంద్ర మంత్రిత్వ శాఖలు, విభాగాలు మరో 1,655 ప్రాజెక్టులకు అనుమతి ఇచ్చాయి. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు రూ.953.47 కోట్లు విడుదల చేశారు. 283 ప్రాజెక్టులు పూర్తయినట్లు అవి నివేదించాయి. అనుమతి పొందిన ప్రాజెక్టుల రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతాల వారీ వివరాలు కింద ఉన్నాయి.
|
క్రమ సంఖ్య
|
రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతం
|
కేంద్ర హోం శాఖ ఆమోదించిన ప్రాజెక్టులు
|
|
1
|
అరుణాచల్ ప్రదేశ్
|
832
|
|
2
|
హిమాచల్ ప్రదేశ్
|
98
|
|
3
|
లద్దాఖ్ (కేంద్రపాలిత ప్రాంతం)
|
79
|
|
4
|
సిక్కిం
|
87
|
|
5
|
ఉత్తరాఖండ్
|
152
|
| |
మొత్తం
|
1,248
|
అనుసంధానం: రహదారులు, పొడవైన వంతెనలు
మొత్తం రూ.2,481.93 కోట్ల వ్యయంతో 111 రహదారి ప్రాజెక్టులకు అనుమతి ఇచ్చారు. ఇంతకుముందు రహదారి సదుపాయం లేని 134 గ్రామాలను ఈ రహదారులు అనుసంధానిస్తాయి. ఈ ప్రాజెక్టుల కింద మొత్తం 35 పొడవైన వంతెనలకూ అనుమతి లభించింది. మెరుగైన రహదారులతో ప్రయాణం సులభమవుతుంది. స్థానిక మార్కెట్లు విస్తరించటంతో పాటు ఈ గ్రామాల్లో పర్యాటక రంగానికి ఊతం లభిస్తుందని అంచనా.
కొత్త ఆదాయ వనరుగా పర్యాటకం
క్షేత్రస్థాయిలో కార్యక్రమం పరిధిలో స్పష్టంగా కనిపిస్తున్న ప్రధాన అంశాల్లో పర్యాటకం ఒకటి. వీవీపీ–1 కింద రూ.145 కోట్ల వ్యయంతో 327 పర్యాటక ప్రాజెక్టులకు ఆమోదం ఇచ్చారు. వీటిలో సందర్శనా కేంద్రాలు, సాహస పర్యాటకం, పర్యావరణ పర్యాటకం, ఎకో రిసార్టులు, ట్రెక్కింగ్ మార్గాలు, పర్యాటక కేంద్రాలు ఉన్నాయి.
ప్రజలకు చేరువవడం, సేవల అందజేత
2026 జులై 31 వరకు 8,800కు పైగా కార్యక్రమాలు నిర్వహించారు. వీటిలో అవగాహన కార్యక్రమాలు, సేవల శిబిరాలు, ఆరోగ్య, పశువైద్య శిబిరాలు, నైపుణ్య శిక్షణ ఉన్నాయి. అరుణాచల్ ప్రదేశ్‌లో 2,990, లద్దాఖ్‌లో 2,221 కార్యక్రమాలు నిర్వహించారు. ఉత్తరాఖండ్‌లో 2,038, హిమాచల్ ప్రదేశ్‌లో 1,037, సిక్కింలో 530 కార్యక్రమాలు జరిగాయి.
మీకు తెలుసా? వికసిత్ వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రామ్ సరిహద్దు గ్రామాలను భారత యువతకు సజీవ తరగతి గదులుగా మారుస్తోంది. 2026లో ప్రతి రాష్ట్రం, కేంద్రపాలిత ప్రాంతం నుంచి వచ్చిన 400కు పైగా వాలంటీర్లు లద్దాఖ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లోని 74 సరిహద్దు గ్రామాల్లో వారం రోజులు గడిపారు. సామాజిక సేవ, సాంస్కృతిక పరస్పర వినిమయం, క్షేత్రస్థాయి అభివృద్ధిలో పాలుపంచుకున్నారు.
వీవీపీ: మౌలిక సదుపాయాలకు మించిన ప్రభావం
వైబ్రెంట్ విలేజెస్ కార్యక్రమ ప్రభావం మౌలిక సదుపాయాలకే పరిమితం కాదు. భద్రత, జీవనోపాధి, పాలన, సమాజ ప్రతిఘటన సామర్థ్యాన్ని కూడా బలోపేతం చేస్తోంది.
భద్రత: జనావాసాలతో నిండిన, ఆత్మవిశ్వాసం గల సరిహద్దు ప్రాంతం భద్రతా దళాల విధులకు సహకరిస్తుంది. దేశానికి వ్యూహాత్మక బలంగా పనిచేసే దృఢమైన సరిహద్దు జనాభాను రూపొందించటం రెండు దశల లక్ష్యం.
జనాభా, తిరుగు వలసలు: జీవనోపాధి అవకాశాలు, మెరుగైన అనుసంధానం కుటుంబాలు సరిహద్దు గ్రామాల్లోనే ఉండేందుకు కారణమవుతున్నాయి. అరుణాచల్ ప్రదేశ్‌లోని కురుంగ్ కుమే, దిబాంగ్ వ్యాలీ, షి–యోమి జిల్లాల సరిహద్దు గ్రామాల ప్రజలు తిరిగి తమ గ్రామాలకు వస్తున్నారు. ఇది కార్యక్రమ ప్రభావాన్ని సూచిస్తోంది.
ఆర్థిక వ్యవస్థ: గతంలో ఆర్థిక అవకాశాలు పరిమితంగా ఉన్న ప్రాంతాల్లో సరిహద్దు పర్యాటకం, సహకార సంఘాలు, ఎస్‌హెచ్‌జీలు, రైతు ఉత్పత్తిదారుల సంస్థలు స్థానిక ఆదాయ వనరులను సృష్టిస్తున్నాయి. సరిహద్దు భద్రతా దళాల స్థానిక కొనుగోళ్లతో గ్రామంలోనే స్థిరమైన మార్కెట్ అందుతోంది.
పాలన: ప్రయోజనాల సంపూర్ణ విస్తరణ విధానం ద్వారా గ్రామాల్లోని ప్రతి అర్హ కుటుంబాన్ని ఇప్పటికే అమలులో ఉన్న కేంద్ర, రాష్ట్ర పథకాల పరిధిలోకి తీసుకొస్తున్నారు. పలు విభాగాల పనులను క్రమబద్ధంగా అమలు చేసేందుకు గ్రామ కార్యాచరణ ప్రణాళికలు జిల్లా పాలనా యంత్రాంగానికి ఉమ్మడి సాధనంగా ఉపయోగపడుతున్నాయి.
ఈ నాలుగు అంశాలు కలిపి ఒకే భావనను తెలియజేస్తున్నాయి. సరిహద్దుల్లో అభివృద్ధి, భద్రత పరస్పర విరుద్ధ లక్ష్యాలు కావు. అవి ఒకదానికొకటి బలం చేకూరుస్తాయి.
మీకు తెలుసా? అరుణాచల్ ప్రదేశ్‌లో ఇండో–టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐటీబీపీ) వైబ్రెంట్ గ్రామాల నుంచి పాలు, కూరగాయలు, గుడ్లు, ధాన్యాలను నేరుగా కొనుగోలు చేస్తోంది. దీంతో సరిహద్దు చెక్‌పోస్టు సమీపంలోని వ్యవసాయ క్షేత్రాలకు నమ్మకమైన కొనుగోలుదారుగా మారుతోంది.
అనుసంధానం, స్వావలంబనతో కూడిన సరిహద్దు దిశగా
దేశ పురోగతిలో భారత సరిహద్దు సమాజాలకు పూర్తి భాగస్వామ్యం కల్పిస్తామన్న హామీయే వైబ్రెంట్ విలేజెస్ కార్యక్రమం. మెరుగైన మౌలిక సదుపాయాలు, సుస్థిర జీవనోపాధి, ప్రభుత్వ పథకాల సమన్వయంతో సొంత ప్రాంతాలకు దగ్గరగానే అవకాశాలు అందుతున్నాయి. సరిహద్దు పర్యాటకం, స్థానిక సంస్థలు ఈ ప్రాంత సామర్థ్యాన్ని వెలికితీస్తున్నాయి. గ్రామాలు మరింత చైతన్యవంతంగా, సంపన్నంగా, స్వావలంబనతో ఎదిగే కొద్దీ భారత సరిహద్దులకు బలం చేకూరుస్తాయి. 2047 నాటికి సురక్షిత, సమ్మిళిత వికసిత్ భారత్ దార్శనికతను ముందుకు తీసుకెళ్తాయి.
References
Prime Minister’s Office
Cabinet
Ministry of Home Affairs
Ministry of Youth Affairs and Sports
Press Information Bureau (Research Unit)
Sansad TV
Click here to see pdf
***
(Explainer ID: 159950)
आगंतुक पटल : 12
Provide suggestions / comments