Social Welfare
ప్రతి పాఠశాలా ఆదర్శ పాఠశాలే
భవిష్యత్తుకు తగిన పాఠశాలల కోసం పీఎం శ్రీ పథకంతో భారత్ ముందడుగు
Posted On:
09 SEP 2026 12:23PM
2022 సెప్టెంబర్ 7న ప్రారంభమైన ప్రధానమంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా (పీఎం శ్రీ) పథకం.. జాతీయ విద్యా విధానం (ఎన్‌ఈపీ) 2020 దార్శనికతకు అనుగుణంగా 14,500కు పైగా ఆదర్శ పాఠశాలలను తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకుంది. 2022–23 నుంచి 2026–27 వరకు మొత్తం ₹27,360 కోట్ల వ్యయంతో మౌలిక సదుపాయాలు, బోధనా విధానాలు, సమ్మిళిత విద్య, సుస్థిరతను ఈ పథకం బలోపేతం చేస్తోంది. విద్యార్థులకు 21వ శతాబ్ద నైపుణ్యాలను అందిస్తోంది. 2026 జులై నాటికి లక్ష్యంలో దాదాపు 90 శాతమైన 13,092 పాఠశాలలను 36 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎంపిక చేశారు. వీటిలో కేవీఎస్, ఎన్‌వీఎస్, ఎన్‌సీఈఆర్‌టీ పరిధిలోని పాఠశాలలు కూడా ఉన్నాయి. నిర్దేశిత నాణ్యతా ప్రమాణాల ఆధారంగా మూడు దశల ఛాలెంజ్ విధానంలో పాఠశాలలను ఎంపిక చేస్తారు. సమీప పాఠశాలలకు మార్గదర్శక సంస్థలుగా పనిచేసేలా వీటిని రూపొందించారు. మౌలిక సదుపాయాలకే పరిమితమైన అభివృద్ధి నుంచి సమగ్ర, సమాన, భవిష్యత్తుకు సిద్ధమైన విద్య దిశగా మార్పునకు పీఎం శ్రీ పాఠశాలలు నిదర్శనంగా నిలుస్తున్నాయి.
పీఎం శ్రీ: ఆదర్శమైన పాఠశాలల నిర్మాణం

భారత పాఠశాల విద్యా వ్యవస్థలో కీలక మార్పు కనిపిస్తోంది. నాణ్యత, సమానత్వం, సమ్మిళిత విద్య, భవిష్యత్తుకు ఉపయోగపడే అభ్యాసానికి ప్రాధాన్యం పెరుగుతోంది. 14.71 లక్షల పాఠశాలల్లో 24.69 కోట్లకు పైగా విద్యార్థులు చదువుతున్నారు. ప్రతి విద్యార్థి సమగ్ర వికాసానికి తోడ్పడే అనుకూల వాతావరణం కల్పించటం, అభ్యసన ఫలితాలను మెరుగుపరచటంపై విద్యా వ్యవస్థ మరింత దృష్టి సారిస్తోంది. ఈ మార్పునకు జాతీయ విద్యా విధానం (ఎన్‌ఈపీ) 2020 విస్తృత మార్గదర్శక చట్రాన్ని అందిస్తోంది. పీఎం శ్రీ కార్యక్రమం ఆ దార్శనికతను పాఠశాల స్థాయిలో ఆచరణలోకి తెస్తూ, విధాన లక్ష్యాలను సంస్థాగత పద్ధతులుగా మారుస్తోంది. 2022 సెప్టెంబర్ 7న ప్రారంభమైన ప్రధానమంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా (పీఎం శ్రీ) పథకం.. కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ పాఠశాల విద్య, అక్షరాస్యత విభాగం అమలు చేస్తున్న కేంద్ర ప్రాయోజిత పథకం. ఇప్పటికే ఉన్న పాఠశాలల్లో నాణ్యతను పెంచి, జాతీయ విద్యా విధానం 2020 సమర్థ అమలును చాటే ఆదర్శ సంస్థలుగా తీర్చిదిద్దటం దీని లక్ష్యం. మొత్తం ₹27,360 కోట్ల ప్రాజెక్టు వ్యయంతో 14,500కు పైగా పాఠశాలలను ఆదర్శ సంస్థలుగా బలోపేతం చేయటంపై పథకం దృష్టి పెట్టింది. నాణ్యమైన మౌలిక సదుపాయాలు, తగిన అభ్యసన వనరులు, విభిన్న అనుభవాలతో సురక్షిత, ఉత్సాహభరిత, ఆహ్లాదకర అభ్యసన వాతావరణాన్ని ఈ పాఠశాలలు అందించాలన్నది సంకల్పం.
2026 జులై నాటికి రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 13,092 పాఠశాలలను పీఎం శ్రీ పాఠశాలలుగా ఎంపిక చేశారు. వీటిలో కేంద్రీయ విద్యాలయ సంఘటన్ (కేవీఎస్), నవోదయ విద్యాలయ సమితి (ఎన్‌వీఎస్), జాతీయ విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎన్‌సీఈఆర్‌టీ) పరిధిలోని పాఠశాలలు ఉన్నాయి. నిర్దేశిత లక్ష్యంలో ఇది దాదాపు 90 శాతం. ఈ పథకంతో 20 లక్షలకు పైగా విద్యార్థులకు నేరుగా ప్రయోజనం కలగనుంది.
పీఎం శ్రీ వ్యూహాత్మక ప్రాధాన్యాలు
ఒక్కో పాఠశాలను బలోపేతం చేయటానికే ఈ పథకం పరిమితం కాదు. పీఎం శ్రీ పాఠశాలలు తమ ప్రాంతాలకు ఆదర్శంగా నిలుస్తాయి. ఉత్తమ విధానాలను పంచుకుంటూ, మార్గదర్శనం, చేయూత, సహకారం, పాఠశాలల సమూహాల ఏర్పాటు ద్వారా సమీప పాఠశాలలకు అండగా ఉంటాయి. దీని ప్రభావం క్రమంగా విస్తరించి, మరిన్ని పాఠశాలలు ఆదర్శ ప్రమాణాలకు చేరుకోవాలన్నది లక్ష్యం.
జీవితాంతం నేర్చుకునే ఆసక్తిని పెంపొందించే విద్య ఈ పథకానికి మూలాధారం. నేర్చుకోవటం, అవసరం లేని విషయాలను విడిచిపెట్టటం, కొత్తగా మళ్లీ నేర్చుకోవటం వంటి సామర్థ్యం, దృక్పథాన్ని విద్యార్థుల్లో పెంపొందిస్తుంది. సమానత్వం, సమ్మిళితత్వం, భిన్నత్వంతో కూడిన సమాజ నిర్మాణానికి తోడ్పడే చురుకైన, ఉత్పాదక, బాధ్యతాయుత పౌరులను తీర్చిదిద్దటం విస్తృత లక్ష్యం.
పీఎం శ్రీతో పాఠశాల విద్యకు మరింత బలం

ప్రధానమంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా (పీఎం శ్రీ) పథకాన్ని 2022–23 నుంచి 2026–27 వరకు ఐదేళ్లపాటు అమలు చేస్తున్నారు. మొత్తం ప్రాజెక్టు వ్యయం ₹27,360 కోట్లు. ఇందులో కేంద్ర వాటా ₹18,128 కోట్లు. ప్రాజెక్టు ఆమోద మండలి (పీఏబీ) కేటాయింపుల్లో కేంద్ర వాటా 2023–24లో ₹2,520 కోట్ల నుంచి 2026–27లో ₹5,224 కోట్లకు పెరిగింది. ఈ పెరుగుదల దాదాపు 107 శాతం. పీఎం శ్రీ పాఠశాలల బలోపేతానికి పెట్టుబడులు ఏ స్థాయిలో పెరుగుతున్నాయో ఇది తెలియజేస్తోంది.
పీఎం శ్రీ పాఠశాలలు: ఎన్‌ఈపీ 2020 దార్శనికత దిశగా ముందడుగు
జాతీయ విద్యా విధానం 2020లోని అన్ని అంశాలను ఆచరణలో చూపటం పీఎం శ్రీ పథకం లక్ష్యం. మేధో వికాసానికే పరిమితం కాకుండా, 21వ శతాబ్దానికి అవసరమైన కీలక నైపుణ్యాలు కలిగిన సమగ్ర వ్యక్తులను తీర్చిదిద్దటంపై దృష్టి సారిస్తుంది. విభిన్న సామాజిక నేపథ్యాలు, వివిధ అభ్యసన సామర్థ్యాలు కలిగిన విద్యార్థులకు సమాన, సమ్మిళిత, ఆనందకర విద్యా వాతావరణాన్ని కల్పించటం ఈ పథకం లక్ష్యం. ప్రతి చిన్నారికీ సురక్షిత, ఉత్సాహభరిత వాతావరణంలో ఆహ్వానం, ఆదరణ, సహకారం లభించేలా విద్యార్థులను అభ్యసన ప్రక్రియలో చురుగ్గా భాగస్వాములను చేసేలా ఈ పాఠశాలలను రూపొందించారు.

పీఎం శ్రీలో నాణ్యత, ప్రతిభపై కీలక అంశాలు

నాణ్యమైన విద్య, ఆధునిక మౌలిక సదుపాయాలు, సమ్మిళిత విధానాలు, సుస్థిర అభివృద్ధి ద్వారా ఎన్‌ఈపీ 2020 కీలక సూత్రాలను ఆచరణలో చూపే ఆదర్శ పాఠశాలలుగా పీఎం శ్రీ పాఠశాలలను రూపొందించారు.
- సమ్మిళిత అభ్యసనం: విభిన్న నేపథ్యాలు, బహుభాషా అవసరాలు, వేర్వేరు అభ్యసన సామర్థ్యాలను పరిగణనలోకి తీసుకుంటూ నాణ్యమైన, సమాన, ఆనందకర విద్యను అందిస్తుంది.
- మార్గదర్శనం: పీఎం శ్రీ పాఠశాలలు ఆదర్శ పాఠశాలలుగా నిలిచి, తమ ప్రాంతాల్లోని ఇతర పాఠశాలలకు నాయకత్వం, మార్గదర్శనం అందిస్తాయి.
- హరిత పాఠశాలలు: పాఠశాల నాణ్యతకు కీలక ప్రమాణంగా సుస్థిర, పర్యావరణహిత పద్ధతులను ప్రోత్సహిస్తాయి.
- అనుభవపూర్వక అభ్యసనం: పునాది దశలో ఆటలు, బొమ్మల ఆధారిత అభ్యసనంతో పాటు అనుభవపూర్వక, సమగ్ర, ఏకీకృత, అన్వేషణ ఆధారిత, విద్యార్థి కేంద్రిత పద్ధతులకు ప్రాధాన్యం ఇస్తుంది.
- అభ్యసన ఫలితాలు: అభ్యసన ఫలితాలు, జ్ఞాన వినియోగాన్ని మెరుగుపరచేందుకు పాఠ్యప్రణాళిక, బోధన, మూల్యాంకనంపై దృష్టి పెడుతుంది.
- నాణ్యమైన మౌలిక సదుపాయాలు: పాఠశాల వసతులను తగిన స్థాయి, పనితీరు, సౌందర్యం, భద్రత వంటి ప్రమాణాలపై అంచనా వేస్తుంది.
- భవిష్యత్తుకు సిద్ధం చేసే నైపుణ్యాలు: 21వ శతాబ్ద నైపుణ్యాలపై అవగాహన కల్పిస్తూ, స్థానిక ఔత్సాహిక పారిశ్రామిక వ్యవస్థతో పాఠశాలలను అనుసంధానిస్తుంది.
- నాణ్యతా మూల్యాంకనం: పీఎం శ్రీ పాఠశాలల నాణ్యతను అంచనా వేసి, పర్యవేక్షించేందుకు పాఠశాల నాణ్యతా మూల్యాంకన చట్రం (ఎస్‌క్యూఏఎఫ్) క్రమబద్ధమైన విధానాన్ని అందిస్తుంది.
పీఎం శ్రీ పాఠశాలల ఆరు మూలస్తంభాలు
ఎన్‌ఈపీ 2020లోని తొమ్మిది అధ్యాయాల నుంచి రూపొందించిన ఆరు ప్రధాన మూలస్తంభాల ఉప విభాగాల అభివృద్ధిపై పీఎం శ్రీ పాఠశాలల పథకం ఆధారపడి ఉంది. అవి ఇలా ఉన్నాయి:
పాఠశాల విద్యను పీఎం శ్రీ పాఠశాలలు ఎలా మారుస్తాయి?
చిన్నారే కేంద్రంగా అభ్యసన రూపకల్పన
పీఎం శ్రీ పాఠశాలలు తమ అనుబంధ సంస్థకు అనుగుణంగా సీబీఎస్‌ఈ లేదా సంబంధిత రాష్ట్రం, కేంద్రపాలిత ప్రాంత పాఠ్యప్రణాళికను అనుసరిస్తాయి. ఎన్‌ఈపీ 2020 నిర్దేశించిన 5+3+3+4 పాఠ్య, బోధనా నిర్మాణానికి అనుగుణంగా రూపొందించిన జాతీయ పాఠ్య చట్రం లేదా రాష్ట్ర పాఠ్య చట్రం ప్రకారం వీటి పాఠ్యప్రణాళిక ఉంటుంది. ప్రధాన సూత్రాలు, రాజ్యాంగ విలువలకు కట్టుబడి స్థానిక అవసరాలకు అనుగుణంగా పాఠ్యప్రణాళికను మార్చుకునే వెసులుబాటు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఉంది.
బ్యాగ్‌లెస్ డేస్, స్థానిక కళాకారుల వద్ద శిక్షణ, స్థానిక కళలు, హస్తకళలు, సంప్రదాయాల అధ్యయనం, ముఖ్య సాంస్కృతిక వేడుకల నిర్వహణ, దేశీయ విజ్ఞానం, పద్ధతుల పరిరక్షణ ద్వారా పీఎం శ్రీ పాఠశాలలు అనుభవపూర్వక అభ్యసనాన్ని ప్రోత్సహిస్తాయి.
సమానత్వం, సమ్మిళితత్వం, బహుభాషా అభ్యసనం
గ్రామీణ, తగిన సేవలు అందని వర్గాలు సహా విభిన్న నేపథ్యాల విద్యార్థులకు నాణ్యమైన విద్య అందేలా చూస్తూ సమ్మిళిత, సమాన విద్యలో పీఎం శ్రీ పాఠశాలలు కీలక పాత్ర పోషించాయి. విద్యా అంతరాలను తగ్గించటంపై దృష్టి పెట్టి దేశవ్యాప్తంగా మరింత సమానమైన అభ్యసన వాతావరణాన్ని కల్పించటానికి తోడ్పడ్డాయి.
ముఖ్యంగా ప్రారంభ తరగతుల్లో మాతృభాష, స్థానిక లేదా ప్రాంతీయ భాషను బోధన, అభ్యసన మాధ్యమంగా వాడటాన్ని కూడా ఈ పథకం ప్రోత్సహిస్తోంది. తాజా యూడైస్ ప్లస్ 2025–26 సమాచారం ప్రకారం.. పీఎం శ్రీ పాఠశాలల్లో 6,102 మంది సంస్కృత ఉపాధ్యాయులు, 1,994 మంది ఉర్దూ ఉపాధ్యాయులు, 9,152 మంది ప్రాంతీయ భాషా ఉపాధ్యాయులు ఉన్నారు.
స్థానిక భాషల ద్వారా అభ్యసనానికి మద్దతు ఇవ్వటంలో సమాజ భాగస్వామ్యాన్ని కూడా ప్రోత్సహిస్తోంది. ప్రతి చిన్నారిలో పునాది అక్షరాస్యత, సంఖ్యా నైపుణ్యాలు బలంగా పెంపొందించేందుకు ఈ విధానం ఎంతో కీలకం.
సాంకేతికత ఆధారిత అభ్యసనం
బోధన–అభ్యసన వాతావరణంలో సాంకేతికతను క్రమబద్ధంగా అనుసంధానించటం పీఎం శ్రీ పాఠశాలల ప్రధాన విజయాల్లో ఒకటి. సమాచార, కమ్యూనికేషన్ సాంకేతికత (ఐసీటీ) సదుపాయాలు, స్మార్ట్ తరగతి గదులు, ఇంటర్నెట్ అనుసంధానం, డిజిటల్ అభ్యసన వేదికలు, స్టెమ్ ఆధారిత కార్యక్రమాలు మరింత పరస్పర చర్యతో కూడిన, అనుభవపూర్వక, విద్యార్థి కేంద్రిత విద్యా వాతావరణాన్ని సృష్టించేందుకు తోడ్పడుతున్నాయి. ఈ చర్యలు విభిన్న అభ్యసన వనరులను అందుబాటులోకి తేవటంతో పాటు డిజిటల్ అక్షరాస్యత, సాంకేతిక సామర్థ్యాలు, విమర్శనాత్మక ఆలోచన, సమస్య పరిష్కార నైపుణ్యాల అభివృద్ధికి మద్దతు ఇస్తున్నాయి. దీక్ష వంటి వేదికలు నాణ్యమైన డిజిటల్ విద్యా వనరులకు నిలయాలుగా పనిచేస్తున్నాయి. ఉపాధ్యాయులు, విద్యార్థుల మధ్య అభ్యసన సామగ్రి పంచుకోవటానికి, విస్తృతంగా అందించటానికి వీలు కల్పిస్తూ సాంకేతికత ఆధారిత బోధనా పద్ధతులను బలోపేతం చేస్తున్నాయి.
విద్యార్థుల సమగ్ర వికాసం
విద్యాభ్యాసంతో పాటు పాఠ్యేతర కార్యక్రమాలు, క్రీడలు, కళలు, జీవన నైపుణ్యాల విద్యను అనుసంధానిస్తూ పీఎం శ్రీ పాఠశాలలు విద్యార్థుల వికాసానికి సమగ్ర విధానాన్ని అనుసరిస్తాయి. సంప్రదాయ విద్యా విజయాలకు మించి నాయకత్వ సామర్థ్యాలు, సృజనాత్మకత, సామాజిక–భావోద్వేగ నైపుణ్యాలు, వ్యక్తుల మధ్య సంబంధాల సామర్థ్యాన్ని పెంపొందించటానికి ఈ బహుముఖ విధానం తోడ్పడుతుంది. విభిన్న అభ్యసన, భాగస్వామ్య అవకాశాలను కల్పిస్తూ భవిష్యత్తులో ఎదురయ్యే విద్యా, వృత్తి, సామాజిక సవాళ్లను ఎదుర్కొనే సామర్థ్యం, దృఢత్వం, పరిస్థితులకు అనుగుణంగా మారే నేర్పును విద్యార్థులకు అందించాలని ఈ పాఠశాలలు భావిస్తున్నాయి.
ఉపాధ్యాయులకు సాధికారత
జిల్లా విద్య, శిక్షణ సంస్థల (డైట్‌లు) సహకారంతో క్రమబద్ధమైన వృత్తిపర అభివృద్ధి కార్యక్రమాల ద్వారా ఉపాధ్యాయుల సామర్థ్యం, సంస్థాగత నాయకత్వాన్ని బలోపేతం చేయాలని పీఎం శ్రీ పాఠశాలలు లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఈ కార్యక్రమం కింద సామర్థ్య నిర్మాణ కార్యక్రమాలకు ఒక్కో డైట్‌కు ₹3 లక్షల వరకు ఆర్థిక సాయం అందిస్తారు. సబ్జెక్టు ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు, ప్రత్యేక విద్యా ఉపాధ్యాయులు, ఐసీటీ ఉపాధ్యాయులు, ప్రధాన శిక్షకుల శిక్షణకు ఒక్కో ఉపాధ్యాయుడికి ₹2,500 వరకు సాయం అందుతుంది.
విద్యా నాయకత్వం, పాఠశాల నిర్వహణ, సామర్థ్య ఆధారిత బోధనా ప్రణాళికపై ప్రధానోపాధ్యాయులకు శిక్షణ ఇస్తారు. దీంతో సంస్థాగత ప్రణాళిక, విద్యా నిర్వహణను వారు బలోపేతం చేయగలుగుతారు. సమగ్ర ప్రగతి పత్రం, పాఠశాల భద్రత, మానసిక ఆరోగ్యం, శ్రేయస్సు, ప్రాథమిక స్థాయి కౌన్సెలింగ్, ఐసీటీ అనుసంధానం వంటి అంశాల్లో ఉపాధ్యాయులకు వృత్తిపర శిక్షణ అందుతుంది. బోధనా సామర్థ్యాలు, పాఠశాల నాయకత్వాన్ని మెరుగుపరచటం, విద్యా సిబ్బందిలో నిరంతర వృత్తిపర అభివృద్ధిని ప్రోత్సహించటం ఈ చర్యల లక్ష్యం.
విస్తరిస్తున్న జాతీయ వ్యవస్థ
రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎంపిక చేసిన 13,092 పాఠశాలలతో పీఎం శ్రీ కార్యక్రమం విస్తృత జాతీయ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసింది. వీటిలో కేంద్రీయ విద్యాలయ సంఘటన్ (కేవీఎస్), నవోదయ విద్యాలయ సమితి (ఎన్‌వీఎస్), జాతీయ విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎన్‌సీఈఆర్‌టీ) పరిధిలోని సంస్థలు ఉన్నాయి. 725 జిల్లాలు, 8,340 బ్లాకులు లేదా పట్టణ స్థానిక సంస్థలకు విస్తరించిన ఈ కార్యక్రమం దేశవ్యాప్తంగా విస్తృత సంస్థాగత, భౌగోళిక పరిధిని ఏర్పరచుకుంది.

ఎంపిక చేసిన 13,092 పాఠశాలల్లో 1,305 ప్రాథమిక పాఠశాలలు, 3,102 ప్రాథమికోన్నత పాఠశాలలు, 3,141 మాధ్యమిక పాఠశాలలు, 5,544 ఉన్నత మాధ్యమిక పాఠశాలలు ఉన్నాయి. ఈ నెట్‌వర్క్‌లో 80 కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు (కేజీబీవీలు), 913 కేవీఎస్ పాఠశాలలు, 620 ఎన్‌వీఎస్ పాఠశాలలు, 4 ఎన్‌సీఈఆర్‌టీ పాఠశాలలు కూడా ఉన్నాయి. పీఎం శ్రీ పాఠశాలల పరిధి ఎంత వేగంగా విస్తరిస్తోందో ఈ నెట్‌వర్క్ పరిమాణం, వైవిధ్యం తెలియజేస్తున్నాయి.
నాణ్యతా ప్రమాణాల ఆధారంగా ఎంపిక
ఛాలెంజ్ విధానంలో పీఎం శ్రీ పాఠశాలలను ఎంపిక చేస్తారు. ఆదర్శ పాఠశాలలుగా మారేందుకు సాయం పొందటం కోసం పాఠశాలలు పోటీపడతాయి. నిర్దిష్ట గడువులతో మూడు దశల్లో ఎంపిక ప్రక్రియ సాగుతుంది. ఆ దశలు ఇలా ఉన్నాయి:
* మొదటి దశ: అవగాహన ఒప్పందంపై సంతకం
ఎంపికైన పాఠశాలలకు అవసరమైన సాయం అందించటం, పీఎం శ్రీ పాఠశాలలకు నిర్దేశించిన నాణ్యతా ప్రమాణాలు సాధించేందుకు అనుకూల పరిస్థితులు కల్పించటం వంటి కట్టుబాట్లను పేర్కొంటూ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు కేంద్రంతో అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదుర్చుకుంటాయి.
* రెండో దశ: అర్హత కలిగిన పాఠశాలల గుర్తింపు
నిర్దేశిత కనీస ప్రమాణాలు, యూడైస్ ప్లస్ సమాచారంలో అందుబాటులో ఉన్న సంబంధిత సూచికల ఆధారంగా పీఎం శ్రీ పాఠశాలల ఎంపికకు అర్హమైన విద్యాసంస్థల జాబితాను రూపొందిస్తారు.
* మూడో దశ: ఛాలెంజ్ పద్ధతిలో ఎంపిక
రెండో దశలో గుర్తించిన అర్హ పాఠశాలలు, నిర్దేశిత ప్రమాణాలను పాటిస్తున్నట్లు చూపేందుకు ఛాలెంజ్ ఆధారిత ఎంపిక ప్రక్రియలో పాల్గొంటాయి. నిర్దేశించిన నిబంధనలకు అనుగుణంగా పాఠశాలలు పోటీపడి, పేర్కొన్న అవసరాలను పూర్తి చేయాలి.
* సంబంధిత రాష్ట్రాలు లేదా కేంద్రపాలిత ప్రాంతాలు, కేవీఎస్ లేదా ఎన్‌వీఎస్ అధికారులు ప్రత్యక్ష తనిఖీల ద్వారా నిబంధనల అమలును పరిశీలించి ధ్రువీకరిస్తారు. ఆపై పాఠశాలల జాబితాను మంత్రిత్వ శాఖకు సిఫారసు చేస్తారు.
పాఠశాలల తుది ఎంపిక కోసం కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖలో పాఠశాల విద్య, అక్షరాస్యత కార్యదర్శి నేతృత్వంలో నిపుణుల కమిటీని ఏర్పాటు చేస్తారు. పక్కా భవనం, అవరోధాలు లేని ప్రవేశం, భద్రతా చర్యలు, వేర్వేరు మరుగుదొడ్లు, తాగునీరు, చేతులు కడుక్కునే సదుపాయాలు, విద్యుత్తు, ఉపాధ్యాయులకు గుర్తింపు కార్డులు, గ్రంథాలయం లేదా క్రీడా సదుపాయాలు వంటి కనీస ప్రమాణాలను పాఠశాలలు తప్పనిసరిగా పాటించాలి. ప్రాథమిక, ఉన్నత మాధ్యమిక స్థాయుల్లో విద్యార్థుల నమోదు రాష్ట్ర సగటు కంటే ఎక్కువగా ఉండాలి. ఛాలెంజ్ పద్ధతిలో పట్టణ పాఠశాలలు కనీసం 70 శాతం, గ్రామీణ పాఠశాలలు కనీసం 60 శాతం మార్కులు సాధించాలి. మౌలిక సదుపాయాలు, అభ్యసన ఫలితాలు, బోధనా విధానాలు, పీఎం పోషణ్, వృత్తి విద్య, హరిత కార్యక్రమాలు, భాగస్వాముల నిబద్ధత వంటి అంశాలను మూల్యాంకనం చేస్తారు.
విస్తృత మార్పునకు ఆదర్శాలుగా పాఠశాలలు
మౌలిక సదుపాయాల కేంద్రిత పాఠశాల అభివృద్ధి నుంచి సమగ్ర, సమ్మిళిత, సమాన, భవిష్యత్తుకు సిద్ధమైన విద్యా సంస్థల ఏర్పాటు దిశగా పీఎం శ్రీ కీలక మార్పును సూచిస్తోంది. నాణ్యమైన, సామర్థ్య ఆధారిత అభ్యసనం, ఉపాధ్యాయులకు నిరంతర వృత్తిపర శిక్షణ, సాంకేతికత ఆధారిత విద్య, సురక్షిత, సమ్మిళిత, అనుకూల పాఠశాల వాతావరణానికి ప్రాధాన్యం ఇవ్వటం ద్వారా జాతీయ విద్యా విధానం (ఎన్‌ఈపీ) 2020 దార్శనికత, ప్రాధాన్యాలను ఈ కార్యక్రమం ఆచరణలోకి తెస్తోంది.
ఆదర్శ సంస్థలుగా పీఎం శ్రీ పాఠశాలలు వినూత్న విద్యా పద్ధతులను ఆచరణలో చూపి, విస్తృతంగా పంచుకోవాలి. సమీప పాఠశాలలు వాటిని తమ అవసరాలకు అనుగుణంగా స్వీకరించి అమలు చేయగలవు. తద్వారా పాఠశాల విద్యా వ్యవస్థ అంతటా మెరుగుదలకు ఈ సంస్థలు దోహదం చేస్తాయి. మరింత సమాన, సమ్మిళిత, భవిష్యత్తుకు సిద్ధమైన భారత నిర్మాణంలో అర్థవంతంగా పాలుపంచుకునేందుకు అవసరమైన విజ్ఞానం, నైపుణ్యాలు, విలువలు కలిగిన సమర్థ, ఆత్మవిశ్వాసం గల, సృజనాత్మక, బాధ్యతాయుత విద్యార్థులను తీర్చిదిద్దటం ప్రధాన లక్ష్యం.
References
Ministry of Education
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2290004®=48&lang=2
https://pmshri.education.gov.in/#aboutPmshri
https://pmshri.education.gov.in/assets/pdf/part1_pmshri.pdf
https://pmshri.education.gov.in/faqs
https://pmshri.education.gov.in/#main-content
https://www.pib.gov.in/PressReleaseDetail.aspx?PRID=2291330®=1&lang=1
https://education.vikaspedia.in/viewcontent/education/policies-and-schemes/pm-schools-for-rising-india-scheme?lgn=en
https://sansad.in/getFile/annex/271/AU1144_1PgQNc.pdf?source=pqars
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2291279®=1&lang=1
https://x.com/EduMinOfIndia/status/1567485212476702721
NITI Aayog
https://www.niti.gov.in/sites/default/files/2026-05/School-Education-System-in-India.pdf?utm_source=chatgpt.com
Click here to see pdf
***
(Explainer ID: 159935)
आगंतुक पटल : 12
Provide suggestions / comments