Farmer's Welfare

జనపనార: భారత స్వర్ణ నార

వినూత్న విధానాలతో జీవనోపాధులకు భరోసా

Posted On: 07 SEP 2026 6:12PM

ముడి జనపనార ఉత్పత్తిలో భారత్‌ ప్రపంచంలో అగ్రస్థానంలో ఉంది. లక్షల మందికి జీవనోపాధి కల్పించడంతోపాటు స్థిరమైన పారిశ్రామిక వృద్ధికి ఇది తోడ్పడుతోంది. 2025–26 ఆర్థిక సంవత్సరంలో భారత్‌ 76 లక్షల బేళ్ల ముడి జనపనార, 12.80 లక్షల మెట్రిక్‌ టన్నుల జనపనార ఉత్పత్తులు తయారు చేసింది. ఇదే కాలంలో రూ.225.11 కోట్ల విలువైన 22,700 మెట్రిక్‌ టన్నుల ముడి జనపనార, రూ.3,155.27 కోట్ల విలువైన 1,71,300 మెట్రిక్‌ టన్నుల జనపనార ఉత్పత్తులను ఎగుమతి చేసింది. ప్రభుత్వ చర్యలతో రైతుల ఆదాయం పెరిగింది. ఉత్పత్తి నుంచి మార్కెట్‌ వరకు వ్యవస్థ ఆధునిక రూపు సంతరించుకుంది. వివిధ రకాల ఉత్పత్తుల తయారీకి ప్రోత్సాహం లభించింది. సహజంగా నేలలో కలిసిపోయే గుణం, విస్తరిస్తున్న వినియోగాలతో కృత్రిమ పదార్థాలకు జనపనార కీలక ప్రత్యామ్నాయంగా మారుతోంది. ఆవిష్కరణలు, మార్కెట్‌ విస్తరణ, డిజిటల్‌ సాంకేతికత భారత స్వర్ణ నార పరిశ్రమను అంతర్జాతీయంగా పోటీపడే, పర్యావరణ హిత రంగంగా తీర్చిదిద్దుతున్నాయి.

భారత స్వర్ణ నార పరిశ్రమ
భారత్‌లో అత్యంత ప్రాధాన్యమున్న సహజ నారల్లో జనపనార ఒకటి. విస్తృత వినియోగం, పర్యావరణ హిత లక్షణాల కారణంగా దీనికి ప్రత్యేక గుర్తింపు ఉంది. వ్యాపార, పారిశ్రామిక అవసరాలు దాదాపు ఒకేలా ఉండటంతో జనపనార, మెస్తాను కలిపి ముడి జనపనారగా వర్గీకరిస్తారు. తక్కువ వర్షపాతం ఉన్న వ్యవసాయ వాతావరణ ప్రాంతాల్లో జనపనారకు తక్కువ ఖర్చుతో కూడిన ప్రత్యామ్నాయంగా మెస్తా అనే కాండపు నార పంటను సాగు చేస్తారు. బంగారు వర్ణం, పట్టులాంటి మెరుపు కారణంగా జనపనారను సాధారణంగా “స్వర్ణ నార”గా పిలుస్తారు.



ముడి జనపనార ఉత్పత్తిలో భారత్‌ ప్రపంచంలో మొదటి స్థానంలో ఉంది. ఆహార ధాన్యాల ఉత్పత్తికి సంబంధించిన మూడో ముందస్తు అంచనాల ప్రకారం.. జనపనార, మెస్తా ఉత్పత్తి 2024–25లో 88.02 లక్షల బేళ్ల నుంచి 2025–26లో 94.03 లక్షల బేళ్లకు పెరిగింది. 2026 జూలై నాటికి ప్రపంచ జనపనార ఉత్పత్తుల్లో భారత్‌ వాటా దాదాపు 75 శాతం. జనపనార ఉత్పత్తుల తయారీలోనూ భారత్‌ అగ్రస్థానంలో ఉంది. దేశ తూర్పు ప్రాంతంలో, ముఖ్యంగా పశ్చిమ బెంగాల్‌లో ఈ పరిశ్రమకు బలమైన పారిశ్రామిక పునాది ఉంది. వ్యవస్థీకృత మిల్లులు, విభిన్న జనపనార ఉత్పత్తుల యూనిట్లలో దాదాపు 3.70 లక్షల మంది కార్మికులకు ప్రత్యక్ష ఉపాధి లభిస్తోంది. జనపనార సాగు చేసే దాదాపు 40 లక్షల రైతు కుటుంబాలకు ఈ రంగం జీవనాధారంగా ఉంది. 2025 డిసెంబర్‌ నాటికి దేశంలో 120 సమీకృత జనపనార మిల్లులు ఉన్నాయి. అత్యధికంగా పశ్చిమ బెంగాల్‌లోనే 89 మిల్లులు ఉన్నాయి.

జనపనార ఉత్పత్తుల తయారీలో భారత్‌ పూర్తిగా ఆత్మనిర్భర‌త‌తో కొనసాగుతోంది. దేశీయ ఉత్పత్తి జాతీయ అవసరాలను తగినంతగా తీరుస్తోంది. 2025–26లో జనపనార ఉత్పత్తుల దేశీయ వినియోగం 12.05 లక్షల మెట్రిక్‌ టన్నులు. మొత్తం 12.80 లక్షల మెట్రిక్‌ టన్నుల ఉత్పత్తిలో ఇది 94 శాతం. ఇదే ఆర్థిక సంవత్సరంలో రూ.3,155.27 కోట్ల విలువైన 1.71 లక్షల మెట్రిక్‌ టన్నుల జనపనార ఉత్పత్తులను భారత్‌ ఎగుమతి చేసింది. రూ.225.11 కోట్ల విలువైన 22,700 మెట్రిక్‌ టన్నుల ముడి జనపనార కూడా విదేశాలకు వెళ్లింది.

భారత్‌లో జనపనార ఉత్పత్తి చరిత్ర
భారత్‌లో జనపనార చరిత్ర క్రీస్తుపూర్వం మూడో శతాబ్దం నాటిదని ఆధారాలు చెబుతున్నాయి. అయితే బ్రిటిష్‌ వలస పాలనలో సైనిక అవసరాలకు వ్యూహాత్మక వినియోగం కారణంగా ఇది ప్రధాన వాణిజ్య పంటగా ఎదిగింది. ఈస్ట్‌ ఇండియా కంపెనీ బెంగాల్‌లో అనేక జనపనార మిల్లులను ఏర్పాటు చేయడంతో ఆ ప్రాంతం సాగు, ప్రాసెసింగ్‌కు కేంద్రంగా మారింది.

1947లో స్వాతంత్య్రం, ఆ తర్వాత దేశ విభజనతో బెంగాల్‌లో సమగ్రంగా ఉన్న జనపనార ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింది. జనపనార సాగు ప్రాంతాల్లో దాదాపు 80 శాతం తూర్పు పాకిస్థాన్‌లోకి(ప్రస్తుత బంగ్లాదేశ్‌లోకి) వెళ్లింది. కానీ అత్యధిక మిల్లులు భారత్‌లోనే మిగిలాయి. దీంతో మిల్లులకు అవసరమైన ముడి సరకు తీవ్రంగా కొరత ఏర్పడింది. ఈ అసమతుల్యతను సరిచేసేందుకు ప్రభుత్వం 1949 సెప్టెంబర్‌లో “మరింత జనపనార పండించండి” ప్రచారాన్ని ప్రారంభించింది. వరి స్థానంలో జనపనార సాగు చేపట్టాలని రైతులను ప్రోత్సహించింది. ఫలితంగా ముడి జనపనార ఉత్పత్తి 1951–52లో 6.7 లక్షల టన్నుల నుంచి 1961–62లో 14.56 లక్షల టన్నులకు పెరిగి రెట్టింపునకు పైగా చేరింది. నిత్యావసర వస్తువుల ప్యాకింగ్‌కు జనపనార బస్తాల వినియోగాన్ని తప్పనిసరి చేస్తూ తీసుకొచ్చిన జనపనార ప్యాకేజింగ్‌ చట్టం–1987 ఈ రంగాన్ని మరింత బలోపేతం చేసింది. భారత జనపనార రైతులకు స్థిరమైన మార్కెట్‌ ఏర్పడింది. కాలక్రమంలో గ్రామీణ జీవనోపాధులు, పర్యావరణ హిత పారిశ్రామిక వృద్ధికి దోహదం చేసే వ్యూహాత్మక హరిత నారగా జనపనార ఎదిగింది.

ప్రస్తుతం దేశ ముడి జనపనార సాగులో పశ్చిమ బెంగాల్‌ అగ్రస్థానంలో ఉంది. ఆ తర్వాత బిహార్‌, అస్సాం, ఒడిశా, ఝార్ఖండ్‌ ఉన్నాయి. సాధారణంగా మార్చి–ఏప్రిల్‌లో విత్తి, 100–110 రోజుల్లో పంట కోస్తారు. పంట కాలంలో 700–1,500 మిల్లీమీటర్ల వర్షపాతంతో కూడిన వేడి, తేమ వాతావరణం జనపనారకు అనుకూలం. అందుకే తూర్పు, ఈశాన్య భారతంలో సాగు కేంద్రీకృతమై ఉంది. ప్రధానంగా వర్షాధారంగా పండిస్తారు. చిన్న, సన్నకారు రైతులే ఈ పంటను ఎక్కువగా సాగు చేస్తున్నారు.

జనపనార ఎందుకు ముఖ్యమైన సహజ నార?
జనపనార సహజంగా నేలలో కలిసిపోతుంది; మళ్లీ వినియోగించవచ్చు. వేగంగా పెరగడం, తక్కువ ఖర్చు, విస్తృత లభ్యత దీని ప్రత్యేకతలు. ఇది బలంగా, మన్నికగా, గాలి ప్రసరించేలా ఉండటంతో అనేక అవసరాలకు ఉపయోగపడుతుంది. ప్యాకేజింగ్‌, నిర్మాణం, వ్యవసాయం, పారిశ్రామిక వస్త్రాల్లో విస్తృతంగా వినియోగిస్తున్నారు. వేడి, శబ్దాన్ని నిరోధించడం, తేమను అధికంగా గ్రహించడం, స్థిర విద్యుత్‌ను తక్కువగా ఉత్పత్తి చేయడం వంటి ప్రయోజనాలూ ఉన్నాయి. సహజ, కృత్రిమ నారలతో సులభంగా కలపవచ్చు. దీంతో విలువ ఆధారిత ఉత్పత్తులు, వస్త్రాల తయారీకి విస్తృత అవకాశాలు లభిస్తున్నాయి.

జనపనారను ఆహారంగా తీసుకోవచ్చా?
జనపనార ఆకులను ఆఫ్రికా, పశ్చిమాసియా, ఆగ్నేయాసియాలో చాలాకాలంగా కూరగా తింటున్నారు. జపాన్‌లో వీటిని ఆరోగ్యకరమైన ఆహారంగా విస్తృతంగా గుర్తించి వినియోగిస్తున్నారు. జనపనార ఆకుల్లో విటమిన్లు, కెరోటినాయిడ్లు, కాల్షియం, పొటాషియం, పీచు పదార్థం సమృద్ధిగా ఉంటాయి. ఆరోగ్యానికి మేలు చేసే ఆహార వనరుగా వాటి విలువను ఇది తెలియజేస్తోంది. జనపనార ఆకులతో యాంటీ ఆక్సిడెంట్‌ మూలికా పానీయాలు, ఆరోగ్య సంరక్షణ ఉత్పత్తులు తయారు చేసే సాంకేతికతలను కూడా అభివృద్ధి చేశారు.



జనపనార జియోటెక్స్‌టైల్‌: స్థిరమైన మౌలిక సదుపాయాలకు సహజ వస్త్రం
జనపనార జియోటెక్స్‌టైల్‌(జేజీటీ) సాంకేతిక వస్త్రాల విభాగానికి చెందిన బహుళ ప్రయోజనాల జనపనార ఉత్పత్తి. సివిల్‌ ఇంజినీరింగ్‌, నేల కోత నియంత్రణ, రహదారుల నిర్మాణం, నదీ తీరాల రక్షణ వంటి అనేక రంగాల్లో దీన్ని ఉపయోగించవచ్చు. ప్రత్యేక శుద్ధి, నేయడం వంటి ప్రక్రియల ద్వారా జనపనార నారతో జేజీటీని తయారు చేస్తారు.

సమర్థ పనితీరు, పర్యావరణ అనుకూలత, మెరుగైన సాంకేతిక–భౌతిక లక్షణాలు, పోటీ ధర కారణంగా దీని వినియోగం పెరుగుతోంది. జేజీటీ పూర్తిగా నేలలో కలిసిపోవడంతో మట్టి నిర్మాణం, సారాన్ని మెరుగుపరుస్తుంది. నేలను స్థిరంగా ఉంచడం, కోతను నియంత్రించడం, దెబ్బతిన్న భూభాగాల్లో పర్యావరణ పునరుద్ధరణకు సమర్థ సహజ పరిష్కారంగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. నేల ఉష్ణోగ్రతను తక్కువగా ఉంచి, ఉపరితలంపై ప్రభావాన్ని తగ్గించడం ద్వారా స్థానిక సూక్ష్మ వాతావరణాన్ని నియంత్రిస్తుంది. విత్తనాలు మొలకెత్తడానికి, మొక్కలు తొలిదశలో బలంగా పెరగడానికి దోహదం చేస్తుంది.

జనపనార జియోటెక్స్‌టైల్‌ వినియోగాలు
సివిల్‌ ఇంజినీరింగ్‌, నేల సంరక్షణ, మౌలిక సదుపాయాల అభివృద్ధిలో అనేక అవసరాలకు పనికొచ్చే సహజ పదార్థంగా జనపనార జియోటెక్స్‌టైల్‌ గుర్తింపు పొందింది:
- మట్టి కట్టలు, కొండ వాలుల కోత ప్రాంతాలు, నదీ తీరాలు, కాలువలు, వర్షపు నీటి నిల్వ నిర్మాణాల్లో వాలుల రక్షణకు విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. ప్రారంభ దశలో ఎక్కువ తన్యతా బలం, గరుకైన ఉపరితలం ఉండటంతో నేల స్థిరత్వాన్ని పెంచి, కోతను తగ్గిస్తుంది.
- రహదారులు, సరకు రవాణా మార్గాలు, రైల్వే పట్టాల పునాది నిర్మాణంలో జేజీటీ బరువును సమంగా పంపిణీ చేసి, నేల కుంగడాన్ని నియంత్రిస్తుంది. నిర్వహణ అవసరాలు, మొత్తం వినియోగ కాల వ్యయం తగ్గుతాయి.
- ముఖ్యంగా కొండ ప్రాంతాల్లోని భూగర్భ నీటి పారుదల వ్యవస్థల్లో నీటి ప్రవాహాన్ని నియంత్రిస్తూ మట్టి కొట్టుకుపోకుండా అడ్డుకుంటుంది. ముందుగా తయారుచేసిన నిలువు కాలువల ద్వారా మెత్తని నేలను స్థిరపరిచేందుకు కూడా జేజీటీని ఉపయోగిస్తారు. దీంతో నేల త్వరగా దృఢపడి, బరువును మోయగల సామర్థ్యం పెరుగుతుంది.

 



ఇటీవలి సంవత్సరాల్లో జాతీయ జనపనార బోర్డు జియోటెక్స్‌టైల్‌ను ఇంజినీరింగ్‌ పదార్థంగా అభివృద్ధి చేసి, వినియోగాన్ని ప్రోత్సహిస్తోంది. డిజైన్‌ ప్రమాణాలు, కొనుగోలు ప్రక్రియ, పరీక్ష విధానాలు, ఏర్పాటు పద్ధతులపై తుది వినియోగదారులకు సాంకేతిక సహకారం అందిస్తోంది.

కామన్వెల్త్‌ క్రీడలు–2026లో జనపనార దుస్తులతో భారత బృందం
జనపనార–విస్కోస్‌ మిశ్రమ దుస్తులను 2026 కామన్వెల్త్‌ క్రీడల్లో భారత క్రీడాకారులు, బృంద సభ్యులు ధరించారు. జాతీయ జనపనార బోర్డు ఈ దుస్తులను అభివృద్ధి చేసింది. న్యూఢిల్లీలోని జాతీయ ఫ్యాషన్‌ టెక్నాలజీ సంస్థ(నిఫ్ట్‌) వాటిని రూపొందించింది. పూర్తిగా నేలలో కలిసిపోయే జనపనార–విస్కోస్‌ మిశ్రమ వస్త్రం స్థిరమైన, వినూత్న వస్త్ర పరిష్కారంగా ఎంత ఉపయోగకరమో ఈ కార్యక్రమం చాటింది. భారత తయారీదారుల నైపుణ్యాన్ని ప్రపంచానికి పరిచయం చేస్తూ, దేశ జనపనార పరిశ్రమకు అంతర్జాతీయ గుర్తింపు తెచ్చింది.

పొలం నుంచి మార్కెట్‌ వరకు: జనపనార రంగానికి ప్రభుత్వ ప్రోత్సాహం
భారత జనపనార రంగాన్ని బలోపేతం చేసేందుకు ప్రభుత్వం అనేక విధానపరమైన చర్యలు చేపట్టింది. ముడి జనపనార కనీస మద్దతు ధర(ఎంఎస్‌పీ)ని నిరంతరం పెంచడం ఇందులో ప్రధానమైనది. 2026–27 ఆర్థిక సంవత్సరానికి క్వింటాల్‌ ముడి జనపనార ఎంఎస్‌పీని రూ.5,925గా నిర్ణయించారు. దేశవ్యాప్త సగటు ఉత్పత్తి వ్యయంపై రైతులకు 61.8 శాతం ఆదాయం లభిస్తుంది. 2014–15లో క్వింటాల్‌కు రూ.2,400గా ఉన్న ఎంఎస్‌పీతో పోలిస్తే ఇది దాదాపు 147 శాతం పెరుగుదల. రైతులకు ఎంఎస్‌పీ కింద చెల్లించిన మొత్తం కూడా పెరిగింది. 2004–05 నుంచి 2013–14 వరకు రూ.441 కోట్లు చెల్లించగా, 2014–15 నుంచి 2025–26 వరకు ఈ మొత్తం రూ.1,342 కోట్లకు చేరింది.



జనపనార ప్యాకేజింగ్‌ పదార్థాల(వస్తువుల ప్యాకింగ్‌లో తప్పనిసరి వినియోగం) చట్టాన్ని ప్రభుత్వం అమలు చేస్తోంది. ఏ వస్తువులను, ఎంత మేరకు తప్పనిసరిగా జనపనారతో ప్యాక్‌ చేయాలో ఈ చట్టం నిర్దేశిస్తుంది. ఆహార ధాన్యాల్లో నూరు శాతం, చక్కెరలో 20 శాతం జనపనార బస్తాల్లోనే ప్యాక్‌ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.

జనపనార సాగు, ప్రాసెసింగ్‌కు ఇచ్చే సహాయ కార్యక్రమాలను ప్రభుత్వం జాతీయ జనపనార అభివృద్ధి కార్యక్రమం కింద ఏకీకృతం చేసింది.

భారత జనపనార సంస్థ
భారత జనపనార సంస్థ లిమిటెడ్‌(జేసీఐ) ముడి జనపనార ఎంఎస్‌పీ విధానం అమలుకు ఏకైక నోడల్‌ సంస్థ. మార్కెట్‌ ధర ఎంఎస్‌పీ కంటే తగ్గినప్పుడు రైతుల నుంచి నేరుగా కొనుగోలు చేసి వారి ప్రయోజనాలను కాపాడుతుంది. గ్రామీణ ప్రాంతాల్లోని జేసీఐ శాఖాపరమైన కొనుగోలు కేంద్రాలు(డీపీసీ)లు రైతుల నుంచి ముడి జనపనారను నేరుగా సేకరిస్తాయి. పశ్చిమ బెంగాల్‌, అస్సాం, బిహార్‌, ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా, త్రిపుర రాష్ట్రాల్లో జేసీఐకి దాదాపు 110 డీపీసీలు ఉన్నాయి.



జాతీయ జనపనార అభివృద్ధి కార్యక్రమం(ఎన్‌జేడీపీ)
జనపనార రంగ అభివృద్ధి, ప్రోత్సాహానికి జాతీయ జనపనార అభివృద్ధి కార్యక్రమం(ఎన్‌జేడీపీ) సమగ్ర పథకంగా పనిచేస్తోంది. 2021–22 నుంచి 2025–26 వరకు రూ.485.58 కోట్ల వ్యయంతో జాతీయ జనపనార బోర్డు దీన్ని అమలు చేస్తోంది. వ్యవసాయ ఉత్పాదకత, రైతుల ఆదాయం పెంపుతోపాటు జూట్‌–ఐకేర్‌, జనపనార ఉత్పత్తుల వైవిధ్య పథకం అనే రెండు ప్రధాన విభాగాల ద్వారా కొత్త ఉత్పత్తుల తయారీపై దృష్టి పెడుతోంది. ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయంగా జనపనార వినియోగాన్ని ప్రోత్సహించేందుకు సదస్సులు, ప్రదర్శనలు, అవగాహన కార్యక్రమాలకు కూడా మద్దతు ఇస్తోంది.

జాతీయ జనపనార బోర్డు(ఎన్‌జేబీ)
సాగు నుంచి తుది ఉత్పత్తి వరకు జనపనార రంగ అభివృద్ధి, ప్రోత్సాహం, ఉత్పత్తుల వైవిధ్యానికి జాతీయ జనపనార బోర్డు(ఎన్‌జేబీ) నోడల్‌ సంస్థగా పనిచేస్తోంది. దీని ప్రధాన విధులు:


-సాగు పద్ధతులు, నార నాణ్యతను మెరుగుపరచడం;
- ఉత్పాదకత, ప్రమాణాలను పెంచడం;
- దేశీయ, ఎగుమతి మార్కెట్లను ప్రోత్సహించడం;
- పరిశోధన, విలువ ఆధారిత కొత్త ఉత్పత్తులకు మద్దతు ఇవ్వడం;
- సామర్థ్య పెంపు, మార్కెట్‌ అభివృద్ధి ద్వారా ఎంఎస్‌ఎంఈలు, కళాకారులను బలోపేతం చేయడం.

జూట్‌–ఐకేర్‌(ఇంప్రూవ్డ్ క‌ల్టివేష‌న్ ఆండ్ అడ్వాన్స్‌డ్ రెట్టింగ్ ఎక్స‌ర్‌సైజ్‌) పథకం
మెరుగైన సాగు, ఆధునిక నానబెట్టే ప్రక్రియ కార్యక్రమమైన జూట్‌–ఐకేర్‌ను 2015–16లో ప్రారంభించారు. జనపనార ఉత్పాదకత, నార నాణ్యతను పెంచడం దీని లక్ష్యం. శాస్త్రీయ సాగు, యంత్రాల వినియోగం, మెరుగైన నానబెట్టే పద్ధతుల ద్వారా ఈ లక్ష్యాన్ని సాధిస్తున్నారు. రాయితీతో ధ్రువీకరించిన విత్తనాలు, క్షేత్ర ప్రదర్శనలు, యంత్ర సహాయం ద్వారా చిన్న, సన్నకారు రైతులకు మద్దతు ఇస్తున్నారు. కేంద్ర జనపనార, అనుబంధ నారల పరిశోధన సంస్థ(సీఆర్ఐజేఏఎఫ్‌), భారత జనపనార సంస్థ సహకారంతో పథకాన్ని అమలు చేస్తున్నారు. ప్రధానమంత్రి కృషి సించాయి యోజన, రాష్ట్రీయ కృషి వికాస్‌ యోజన సమన్వయంతో జనపనారను నానబెట్టే చెరువుల నిర్మాణానికీ సహాయం అందిస్తున్నారు.

జనపనార ఉత్పత్తుల వైవిధ్య పథకం
జనపనార ప్రాసెసింగ్‌, మార్కెటింగ్‌, విక్రయాలకు మద్దతు ఇచ్చే పలు కార్యక్రమాలు ఈ పథకంలో ఉన్నాయి.

జనపనార ప్రాసెసింగ్‌కు సహాయం: జనపనార ముడి పదార్థాల బ్యాంకు(జేఆర్‌ఎంబీ)
వివిధ జనపనార ఉత్పత్తుల తయారీకి అసంఘటిత రంగం, చిన్న ఉత్పత్తి యూనిట్లకు ముడి పదార్థాలు అందుబాటులో ఉండేలా జనపనార ముడి పదార్థాల బ్యాంకు సహాయం చేస్తుంది. మిల్లు గేటు ధరకు వాస్తవ రవాణా ఖర్చును కలిపి ఆర్థికంగా అందుబాటులో ఉండే ధరకు ముడి సరకు ఇస్తుంది. విభిన్న జనపనార ఉత్పత్తులు తయారు చేసే కళాకారులు, మహిళా స్వయం సహాయక సంఘాలు, ఎంఎస్‌ఎంఈలకు నాణ్యమైన ముడి పదార్థాలను క్రమం తప్పకుండా అందిస్తోంది. గ్రామీణ జీవనోపాధుల పెంపునకూ ఇది తోడ్పడుతోంది.

తయారీ, మార్కెటింగ్‌, విక్రయాలకు చర్యలు
పలు ఉప పథకాల ద్వారా విలువ ఆధారిత ఉత్పత్తులు, ఆధునికీకరణ, మార్కెట్‌ విస్తరణకు జనపనార ఉత్పత్తుల వైవిధ్య పథకం ప్రోత్సాహం ఇస్తోంది:
- ప్లాంటు, యంత్రాల కొనుగోలుకు మూలధన రాయితీ: వివిధ జనపనార ఉత్పత్తులు తయారు చేసే మిల్లులు, ఎంఎస్‌ఎంఈలకు యంత్రాల వ్యయంలో 30 శాతం రాయితీ అందిస్తుంది.
- జనపనార వనరుల–ఉత్పత్తి కేంద్రాలు: కళాకారులు, మహిళా స్వయం సహాయక సంఘాలు, ఔత్సాహికులు, స్వచ్ఛంద సంస్థలు, సహకార సంఘాల సభ్యులకు సమూహాల ఆధారంగా శిక్షణ, ఉత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేస్తుంది.
- జ‌నపనార రిటైల్‌ విక్రయ కేంద్రాలు: వివిధ జనపనార ఉత్పత్తుల రిటైల్‌, షోరూమ్‌ విక్రయాలకు 25 శాతం సాయం అందిస్తుంది. ఒక్కో యూనిట్‌కు గరిష్ఠంగా రూ.9 లక్షల వరకు ఇస్తుంది.
- వివిధ జనపనార ఉత్పత్తుల ఎగుమతులకు ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకం: ఎగుమతి చేసిన ఉత్పత్తుల్లో వినియోగించిన ముడి జనపనార పరిమాణం, ఎగుమతుల ద్వారా వచ్చిన విలువ ఆధారంగా ఎగుమతిదారులకు ప్రోత్సాహకాలు అందిస్తుంది.

బ్రాండింగ్‌, నాణ్యతా భరోసా, మార్కెట్‌ ప్రోత్సాహానికి చర్యలు
జూట్‌ మార్క్‌ ఇండియా చిహ్నం

జనపనార, జనపనార మిశ్రమ ఉత్పత్తుల్లో ప్రామాణికత, నాణ్యతా భరోసా, పర్యావరణ హిత లక్షణాలకు జూట్‌ మార్క్‌ ఇండియా చిహ్నం ప్రతీకగా నిలుస్తుంది. క్రమబద్ధమైన ఆకృతిలో రూపొందించిన జనపనార కట్టలు సహజ నార బలం, కళాకారుల నైపుణ్యం, ఉత్పత్తి వ్యవస్థలో ప్రమాణాలను సూచిస్తాయి. ఉత్పత్తులు నాణ్యతా ప్రమాణాలు పాటిస్తున్నట్లు ఈ చిహ్నం ధ్రువీకరిస్తుంది. మిశ్రమ ఉత్పత్తుల్లో జనపనార శాతాన్ని కూడా నిర్ధారిస్తుంది. దీంతో వినియోగదారుల విశ్వాసం, బ్రాండ్‌ గుర్తింపు పెరుగుతాయి.

 


దేశీయ మార్కెటింగ్‌ కార్యక్రమాలు
2025–26 ఆర్థిక సంవత్సరంలో ప్రధాన నగరాల్లో 57కు పైగా ప్రాంతీయ జనపనార మేళాలను ప్రభుత్వం నిర్వహించింది. భారత అంతర్జాతీయ వాణిజ్య ప్రదర్శన, సూరజ్‌కుండ్‌ మేళా, భారత్‌ టెక్స్‌ వంటి ప్రముఖ కార్యక్రమాలు వీటిలో ఉన్నాయి.

జనపనార చేనేత సంస్థలు: స్వయం సహాయక సంఘాల నుంచి ఎగుమతి మార్కెట్లకు
బ్రాండింగ్‌, ప్రదర్శనల ద్వారా ప్రచారం, క్రమబద్ధమైన మార్కెట్‌ సదుపాయాలతో క్షేత్రస్థాయిలో జనపనార సంస్థలు మెరుగైన ఫలితాలు సాధించాయి. ఉత్తరాఖండ్‌లోని రిషికేశ్‌కు చెందిన భారతీయ గ్రామోత్థాన్‌ సంస్థ, పశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్‌ హేడెన్‌ హాల్‌ ఇన్‌స్టిట్యూట్‌, ఉత్తర్‌ప్రదేశ్‌లోని లఖ్‌నవూకు చెందిన జూట్‌ ఆర్టిసన్స్‌ గిల్డ్‌ అసోసియేషన్‌, ఒడిశాలోని కటక్‌కు చెందిన రూరల్‌ ఆర్గనైజేషన్‌ ఫర్‌ సోషల్‌ యాక్షన్‌ విజయగాథలు ఇందుకు ఉదాహరణలు. జాతీయ జనపనార బోర్డు కార్యక్రమాల కింద శిక్షణ పొందిన వీరు మార్గదర్శనం, మార్కెట్‌ అనుసంధానాన్ని ఉపయోగించుకుని వ్యవస్థీకృత జనపనార చేనేత ఉత్పత్తిలోకి ప్రవేశించారు. న్యూఢిల్లీలోని ఐఐటీఎఫ్‌, టెక్స్‌–ట్రెండ్స్‌ ఇండియా, ముంబయిలోని గిఫ్ట్‌టెక్స్‌ ప్రదర్శన వంటి ప్రధాన వాణిజ్య మేళాల్లో పాల్గొన్నారు. కొనుగోలుదారులతో నేరుగా సంప్రదింపులు జరిపి, భారీ ఎగుమతి ఆర్డర్లు పొందారు. మార్కెటింగ్‌ నైపుణ్యాలను పెంచుకున్నారు. ఫలితంగా సభ్యుల వ్యక్తిగత ఆదాయం, ఉత్పత్తి సామర్థ్యం, సామాజిక గుర్తింపు గణనీయంగా పెరిగాయి.

     

     



సరఫరా వ్యవస్థలో డిజిటల్‌, సాంకేతిక చర్యలు
జూట్‌–స్మార్ట్‌

2016 నుంచి ఆహార ధాన్యాల ప్యాకింగ్‌కు ఉపయోగించే జనపనార బస్తాల కొనుగోలు, సరఫరా కార్యకలాపాల పూర్తి నిర్వహణ కొనసాగుతోంది.

ఈ బాధ్యతను జనపనార కమిషనర్‌ కార్యాలయం నిర్వహిస్తోంది. ఈ పనుల కోసం ప్రారంభం నుంచి చివరి వరకు సేవలు అందించే జూట్‌–స్మార్ట్‌ ఈ–గవర్నెన్స్‌ సాఫ్ట్‌వేర్‌ వేదికను రూపొందించి, 2016 నవంబర్‌లో అమల్లోకి తెచ్చింది. 2026 ఆగస్టు వరకు ఈ వేదిక ద్వారా రూ.లక్ష కోట్లకు పైగా విలువైన 303 లక్షల బేళ్ల బీ.ట్విల్‌ జనపనార బస్తాలను(ఒక్కో బేల్‌లో 500 బస్తాలు) కొనుగోలు చేశారు. పంజాబ్‌, హరియాణా, ఒడిశా, తెలంగాణ, పశ్చిమ బెంగాల్‌, బిహార్‌, ఆంధ్రప్రదేశ్‌, భారత ఆహార సంస్థ సహా 20కి పైగా రాష్ట్ర కొనుగోలు సంస్థలు ఈ వేదికను వినియోగించాయి.

2026లో సరఫరా వ్యవస్థలోని పలు ప్రక్రియలను డిజిటల్‌ రూపంలోకి తీసుకొచ్చేందుకు జూట్‌–స్మార్ట్‌ను మరింత మెరుగుపరిచారు. రవాణాదారులు, ముడి జనపనార వ్యాపారులు, దిగుమతిదారులను వేదికలో చేర్చారు. ముడి జనపనార వ్యాపారులు, దిగుమతిదారులు, మిల్లుల నమోదు పూర్తిగా డిజిటల్‌ రూపంలో జరుగుతోంది. నిబంధనల అమలును సులభతరం చేసేందుకు అవసరమైన రిటర్నులను కూడా పూర్తిగా ఆన్‌లైన్‌లో అందిస్తున్నారు.

జనపనార పంట సమాచార వ్యవస్థ
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) పరిధిలోని నేష‌న‌ల్ రిమోట్ సెన్సింగ్ సెంట‌ర్‌(ఎన్‌ఆర్‌ఎస్‌సీ), భారత జనపనార సంస్థ, జాతీయ జనపనార బోర్డు సహకారంతో జనపనార పంట సమాచార వ్యవస్థను అభివృద్ధి చేసింది. సుదూర గ్రహణ సాంకేతికత, క్షేత్రస్థాయి సమాచారంతో జనపనార సాగును పర్యవేక్షించడం దీని పని. ఈ కార్యక్రమంలో భాగంగా రెండు ప్రధాన సాధనాలను రూపొందించారు:
ఏ. భువన్‌ జంప్‌: క్షేత్రస్థాయిలో జనపనార పంట పర్యవేక్షణకు మొబైల్‌ యాప్‌.
బీ. పట్‌సన్‌(మొబైల్‌ యాప్‌ ఆధారిత క్షేత్ర పరిశీలనలతో జనపనార ముందస్తు అంచనా వ్యవస్థ): అధికారులు, భాగస్వాములు సరైన నిర్ణయాలు తీసుకునేందుకు దాదాపు తక్షణ పంట పర్యవేక్షణ, విశ్లేషణను అందించే వెబ్‌ వేదిక.

మార్కెట్‌ అభివృద్ధి, ప్రోత్సాహక పథకం
జాతీయ జనపనార అభివృద్ధి కార్యక్రమం కింద ప్రభుత్వం మార్కెట్‌ అభివృద్ధి, ప్రోత్సాహక పథకాన్ని అమలు చేస్తోంది. దేశీయ, ఎగుమతి మార్కెట్లలో వివిధ జనపనార ఉత్పత్తుల ప్రచారం, విక్రయాలకు ఔత్సాహికులు, ఎగుమతిదారులకు ఇది మద్దతు ఇస్తోంది.

కార్మిక సంక్షేమ పథకం(ఉపకార వేతన పథకం)
జనపనార పరిశ్రమలో పనిచేసే కార్మికులకు మెరుగైన పని పరిస్థితులు, సదుపాయాలు, ప్రోత్సాహకాలు కల్పించాలని జాతీయ జనపనార బోర్డు చట్టం–2008 నిర్దేశిస్తోంది. దీనికి అనుగుణంగా జనపనార మిల్లులు, వివిధ జనపనార ఉత్పత్తుల ఎంఎస్‌ఎంఈ యూనిట్ల కార్మికుల కుమార్తెలు పదో తరగతి, ఇంటర్మీడియట్‌ ఉత్తీర్ణులైతే జాతీయ జనపనార బోర్డు ఉపకార వేతనం లేదా ప్రోత్సాహక సాయం అందిస్తోంది.

జనపనారతో స్థిరమైన భవిష్యత్తు
భారత జనపనార రంగం స్థిరమైన, సమ్మిళిత అభివృద్ధికి కీలక చోదకశక్తిగా ఎదిగింది. సాగు నుంచి మార్కెట్‌ వరకు లక్షల మంది రైతులు, కార్మికులు, కళాకారులు, ఔత్సాహికులకు జీవనోపాధి కల్పిస్తోంది. ప్రభుత్వ విధానపరమైన మద్దతు, ఆవిష్కరణలు, మెరుగైన ఉత్పత్తి ఈ రంగ పోటీతత్వాన్ని పెంచాయి. గ్రామీణ జీవనోపాధులు, పర్యావరణ పరిరక్షణ, పారిశ్రామిక వృద్ధికి జనపనార దోహదం చేస్తోంది. పర్యావరణ హిత, స్థిరమైన పదార్థాల వైపు భారత్‌ సాగిస్తున్న మార్పులో దీని ప్రాధాన్యం మరింత పెరుగుతోంది. నిరంతర పెట్టుబడులు, ఆవిష్కరణలు, ప్రజల భాగస్వామ్యం ఈ రంగ పూర్తి సామర్థ్యాన్ని వెలికితీస్తాయి.

 

References

National Jute Board

https://jute.com/jute/

https://jute.com/jute/njb/21

https://jute.dac.gov.in/pdf/StatusPaper.pdf

https://www.nitiforstates.gov.in/public-assets/Policy/policy_files/SNC504A000660.pdf

Ministry of Agriculture and Farmers Welfare

https://www.ncfc.gov.in/change-jute-area.html

https://agriwelfare.gov.in/Documents/Time_Series_3rdAE_2025_26_En.pdf

Ministry of Commerce & Industry

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2122016

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2117470

https://www.ibef.org/exports/jute-industry-india

Ministry of Textiles

https://www.texmin.gov.in/static/uploads/2025/12/c865d599cae0c357c02d247a8a82d24e.pdf

https://www.texmin.gov.in/static/uploads/2026/05/5c48e80d2180ca3194b9e9b01340696d.pdf

https://sansad.in/getFile/loksabhaquestions/annex/182/AU2512_P6JQIu.pdf?source=pqals

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2222478&reg=48&lang=2

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2282076&reg=1&lang=1

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2200812&reg=3&lang=1

https://sansad.in/getFile/loksabhaquestions/annex/171/AU4409.pdf?source=pqals

https://sansad.in/getFile/annex/259/AU2191.pdf?source=pqars

https://sansad.in/getFile/annex/255/AU2392.pdf?source=pqars

https://www.jutecorp.in/jute-i-care/

Cabinet Committee on Economic Affairs

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2232106&reg=3&lang=1

World Bank

https://thedocs.worldbank.org/en/doc/088011224509316922-0560011976/original/WorldBankGroupArchivesfolder30124862.pdf

Click here for pdf file

 

***

(Explainer ID: 159921) आगंतुक पटल : 69
Provide suggestions / comments
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Urdu , English , हिन्दी , Marathi , Bengali , Assamese , Tamil , Kannada , Malayalam