• Sitemap
  • Advance Search
Social Welfare

9వ జాతీయ పోషణ మాసోత్స‌వం

నెల రోజుల పోషకాహార వేడుక

Posted On: 08 SEP 2026 5:10PM

ప్రతి సెప్టెంబర్‌లో నిర్వ‌హించే జాతీయ పోషణ మాసోత్స‌వం.. గర్భిణులు, బాలింతలు, పిల్లలు, కిశోరులు, వారి కుటుంబాల్లో పోషకాహారం, ఆరోగ్యం, సంరక్షణకు సంబంధించిన కీలక అలవాట్లపై అవగాహన పెంచేందుకు ప్రజలను భాగస్వాములను చేసే ప్రత్యేక వేదిక. 2026 సెప్టెంబర్‌ 9న ప్రారంభమయ్యే 9వ పోషణ మాసోత్స‌వం అంగన్‌వాడీ కేంద్రాల ప్రాధాన్యాన్ని తెలియజేస్తుంది. గర్భిణులు, బాలింతలకు సమతుల, ప్రొటీన్లు సమృద్ధిగా ఉండే ఆహారం అవసరంపై అవగాహన కల్పిస్తుంది. గత పోషణ మాస కార్యక్రమాల ద్వారా మాతృ పోషణ, శిశువులు, చిన్నారుల ఆహార పద్ధతులు, ఎదుగుదల పర్యవేక్షణ, పరిశుభ్రతపై అవగాహన పెరిగింది. ఆరోగ్యకరమైన అలవాట్లలో సానుకూల మార్పు వచ్చింది. దేశవ్యాప్తంగా పోషకాహార ఫలితాలను మెరుగుపరిచే ప్రయత్నాలూ బలోపేతమయ్యాయి.

నేపథ్యం
భారత్‌ ఎదుర్కొంటున్న ప్రధాన ప్రజారోగ్య సవాళ్లలో పోషకాహార లోపం ఒకటి. ఇది మహిళలు, పిల్లల ఆరోగ్యం, ఎదుగుదల, అభ్యాసం, ఉత్పాదకతపై జీవితాంతం ప్రభావం చూపుతుంది. ఈ సమస్యపై సమన్వయంతో పోరాడేందుకు కేంద్ర ప్రభుత్వం 2018 మార్చిలో పోషణ్‌ అభియాన్‌ను ప్రారంభించింది. పలు మంత్రిత్వ శాఖల భాగస్వామ్యంతో అమలయ్యే ఈ కార్యక్రమం అభివృద్ధి ప్రణాళికల్లో పోషకాహారానికి కీలక స్థానం కల్పించింది.

2021–22 కేంద్ర బడ్జెట్‌లో ఈ కార్యక్రమాలను మిషన్‌ పోషణ్‌ 2.0 కింద ఏకీకృతం చేశారు. మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో అమలయ్యే భారత సమగ్ర జాతీయ పోషకాహార కార్యక్రమం ఇది. పోషణ్‌ 2.0లో మూడు ప్రధాన పథకాలను ఒకే కార్యాచరణ పరిధిలోకి తీసుకొచ్చారు:

1. పోషణ్‌ అభియాన్‌(సాంకేతికత ఆధారిత పర్యవేక్షణ, ప్రజల భాగస్వామ్యం, ప్రవర్తనలో మార్పు).

2. అంగన్‌వాడీ సేవలు/సమగ్ర శిశు అభివృద్ధి సేవలు (ఐసీడీఎస్‌) (అదనపు పోషకాహారం, వేడిగా వండిన భోజనం, బాల్యదశలో సంరక్షణ).

3. కిశోర బాలికల పథకం (పాఠశాలకు వెళ్లని కిశోర బాలికలకు పోషకాహార సాయం).

ప్రతి సెప్టెంబర్‌లో నిర్వహించే జాతీయ పోషణ మాసోత్స‌వం ద్వారా మిషన్‌ పోషణ్‌ 2.0 పథకం, లక్ష్యాలపై ప్రభుత్వం ప్రజల్లో అవగాహన కల్పిస్తుంది.

9వ జాతీయ పోషణ మాసాన్ని 2026 సెప్టెంబర్‌ 9న ఉత్తర్‌ప్రదేశ్‌లోని వారణాసి రుద్రాక్ష్‌ అంతర్జాతీయ సహకార, సమావేశ కేంద్రంలో ప్రారంభిస్తారు. అంగన్‌వాడీ కేంద్రాల ప్రాధాన్యాన్ని గుర్తించడం ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశం. మారుమూల ప్రాంతాల్లోని పిల్లలకు కూడా అవసరమైన సంరక్షణ, సాయం అందిస్తున్న అంగన్‌వాడీ కేంద్రాలు ప్రపంచంలోనే అతిపెద్ద శిశు సంరక్షణ వ్యవస్థగా నిలిచాయి. “హమారీ అంగన్‌వాడీ, హమారీ జిమ్మేదారీ” అనేది ఈ ఏడాది ప్రధాన ఇతివృత్తం. అంగన్‌వాడీ కేంద్రాల బాధ్యతను ప్రతి పౌరుడు స్వీకరించాలని ఇది పిలుపునిస్తోంది.



9వ జాతీయ పోషణ మాసోత్స‌వం
“హమారీ అంగన్‌వాడీ, హమారీ జిమ్మేదారీ” 
ప్రధాన ఇతివృత్తంతో జరిగే జాతీయ పోషణ మాసోత్స‌వం–2026లో పోషకాహారం, సంరక్షణ, బాల్యదశ అభివృద్ధికి సంబంధించిన సామాజిక కార్యక్రమాలకు అంగన్‌వాడీ కేంద్రాలను ప్రధాన వేదికగా తీర్చిదిద్దనున్నారు. పోషణపై సమష్టి బాధ్యత, జవాబుదారీతనాన్ని బలోపేతం చేయనున్నారు. పరస్పరం బలం చేకూర్చే ఐదు ప్రాధాన్య అంశాలపై కార్యక్రమాన్ని నిర్వహించాలని ప్రతిపాదించారు:

ఏ) తగినంత ప్రొటీన్‌, విభిన్న ఆహార వర్గాలు, స్థానిక ఆహార పదార్థాలకు ప్రాధాన్యం ఇస్తూ ఆహార వైవిధ్యాన్ని ప్రోత్సహించడం;

బీ) అదనపు పోషకాహార పథకం కింద మెనూను క్రమం తప్పకుండా మార్చడం, పరిశుభ్రత, నాణ్యతను నిర్ధారిస్తూ తాజా, వైవిధ్యభరితమైన వేడి భోజనాన్ని ప్రోత్సహించడం;

సీ) 2026 జూన్‌ 23న జారీ చేసిన మార్గదర్శకాల మేరకు కొత్తగా ఏర్పాటైన అంగన్‌వాడీ నిర్వహణ కమిటీలు, అదనపు పోషకాహార మెనూ బోర్డుల ప్రదర్శన ద్వారా పోషణపై సామాజిక బాధ్యత, జవాబుదారీతనాన్ని పెంచడం;

డీ) బాల్యదశ సంరక్షణ, విద్యకు మేధో వికాసం, తగిన పోషకాహారం ప్రాథమిక ఆధారాలని తెలియజేయడం; పిల్లలు తీసుకునే ఆహారానికి, వారి అభ్యాస సామర్థ్యానికి విడదీయలేని సంబంధం ఉందని వివరించడం;

ఈ) భారత ప్రధాన మాతృత్వ ప్రయోజన కార్యక్రమమైన ప్రధానమంత్రి మాతృ వందన యోజన పదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భాన్ని జాతీయ పోషణ మాసోత్స‌వం–2026లో నిర్వహించడం. మాతృ పోషణకు సాయం, ఆరోగ్య సేవలను పొందే అలవాట్లకు ప్రోత్సాహం, గర్భధారణ సమయంలో ఆదాయ భరోసా కల్పించడంలో పథకం పాత్రను తెలియజేయడం. ఆరోగ్యకరమైన ఎదుగుదల, మేధో వికాసం, జీవితకాల శ్రేయస్సుకు జీవితంలోని తొలి 1,000 రోజుల్లో తల్లి పోషణ, సంరక్షణ ఎంత ముఖ్యమో వివరించడం.

జాతీయ పోషణ మాసోత్స‌వం–2026కు ప్రతిపాదిత అంశాలు
1. ఆహార వైవిధ్యం, తగినంత ప్రొటీన్‌: 
తృణధాన్యాలు, చిరుధాన్యాలు, పప్పులు, పండ్లు, కూరగాయలు, గింజలు, విత్తనాలు, పాలు, పాల ఉత్పత్తులతో కూడిన వైవిధ్యభరిత ఆహారం అవసరం. మొక్కలు, జంతు ఆధారిత వనరుల నుంచి తగినంత ప్రొటీన్‌ తీసుకోవాలి. పోషక అవసరాలను తీర్చడానికి, ఆరోగ్యకరమైన ఎదుగుదలకు, అన్ని రకాల పోషకాహార లోపాలను నివారించడానికి ఇది కీలకం. ముఖ్యంగా అనుబంధ ఆహారం ప్రారంభించే దశలో ఆహార వైవిధ్యాన్ని ప్రోత్సహిస్తే పోషక ఫలితాలు మెరుగవుతాయి. చిన్న వయసు నుంచే ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు ఏర్పడతాయి.

చేపట్టగల కార్యక్రమాలు:
- ఆరోగ్యకరమైన విభిన్న వంటకాల ప్రదర్శన: వివిధ ఆహార వర్గాలకు చెందిన తక్కువ ధరలో స్థానికంగా లభించే పదార్థాలతో అంగన్‌వాడీ కేంద్రాల్లో ఆరోగ్యకరమైన వంటకాలను ప్రత్యక్షంగా తయారుచేసి చూపడం. తృణధాన్యాలు, చిరుధాన్యాలు, పప్పులు, కూరగాయలు, పండ్లు, గింజలు, విత్తనాలు, పాలు, పాల ఉత్పత్తులు, గుడ్లను వినియోగించడం.
- పోషణ మేళాలు: స్థానిక పోషకాహార పదార్థాలను ప్రదర్శించే పోషణ మేళాలు నిర్వహించడం. వంటకాల ప్రత్యక్ష ప్రదర్శనలు ఏర్పాటు చేసి, ప్రతి వయసు వారికి సమతుల, వైవిధ్యభరిత ఆహారాన్ని ఎలా సిద్ధం చేయాలో సూచనలు ఇవ్వడం.
- ‘ప్రొటీన్లు అధికంగా ఉండే ఆహారం’ ప్రచారం: మొక్కలు, జంతువుల నుంచి లభించే ప్రొటీన్‌ ఆహారాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం. పప్పులు, చిక్కుళ్లు, గింజలు, విత్తనాలు, పాలు, పాల ఉత్పత్తులు, గుడ్ల ద్వారా రోజువారీ ఆహారంలో తక్కువ ఖర్చుతో ప్రొటీన్‌ను ఎలా చేర్చవచ్చో తెలియజేయడం.
- పోషణ వాటిక పంటలు, స్థానిక ఆహారాల ప్రదర్శన: పోషణ వాటికల్లో పండించిన పంటలు, స్థానికంగా లభించే కాలానుగుణ ఆహార పదార్థాలను ప్రదర్శించడం. కుటుంబ భోజనంతోపాటు చిన్నారుల అనుబంధ ఆహారంలో వీటిని క్రమం తప్పకుండా ఉపయోగించేలా ప్రోత్సహించడం.

2. అంగన్‌వాడీ కేంద్రాల్లో తాజాగా వండిన వేడి భోజనం: లబ్ధిదారులకు తాజా, వైవిధ్యభరిత, పోషక విలువలున్న వేడి భోజనం క్రమం తప్పకుండా అందించడం అదనపు పోషకాహార పథకం నాణ్యత, వినియోగం, ప్రభావాన్ని మెరుగుపరుస్తుంది. అంగన్‌వాడీ కేంద్రాలకు లబ్ధిదారులు రోజూ వచ్చేలా ప్రోత్సహిస్తుంది. చిరుధాన్యాలు, పప్పులు, కాలానుగుణ కూరగాయలు వంటి స్థానిక పదార్థాలతో పరిశుభ్రంగా వండిన తాజా భోజనానికి ప్రాధాన్యం ఇవ్వాలి. ఇది ఆహార వైవిధ్యం అవసరాన్ని తెలియజేస్తూ, కుటుంబ స్థాయిలో ఆరోగ్యకరమైన ఆహార అలవాట్లకు దోహదం చేస్తుంది. వారానికోసారి మెనూ మార్పు, ప్రజల భాగస్వామ్యం, పటిష్ఠ నాణ్యతా తనిఖీల ద్వారా వేడి భోజనం నాణ్యత, ఆమోదాన్ని పెంచేందుకు పోషణ మాసోత్స‌వం–2026 అవకాశం కల్పిస్తోంది.

చేపట్టగల కార్యక్రమాలు:
- వారానికోసారి మెనూ మార్పు: స్థానిక పదార్థాలు, చిరుధాన్యాలు, పప్పులు, కాలానుగుణ కూరగాయలను ఉపయోగిస్తూ వారంలోని ప్రతి రోజూ వేర్వేరు వేడి భోజనం అందించేలా అంగన్‌వాడీ కేంద్రాల్లో మెనూ మార్పును అమలు చేసేందుకు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను ప్రోత్సహించడం.
- వేడి భోజనం(హెచ్‌సీఎం) తయారీ ప్రదర్శనలు: అదనపు పోషకాహార పథకం మార్గదర్శకాల మేరకు వేడి భోజనాన్ని ప్రత్యక్షంగా తయారుచేసి చూపడం. సరైన పదార్థాల ఎంపిక, పరిశుభ్రమైన తయారీ పద్ధతులు, సమతుల భోజనంపై అవగాహన కల్పించడం.
- ప్రత్యేక కార్యక్రమంగా వేడి భోజనం నాణ్యతా పరీక్షలు: ఆహార భద్రత, నాణ్యతా ప్రమాణాలను పటిష్ఠం చేసేందుకు ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ సహకారంతో దేశవ్యాప్తంగా వేడి భోజనం నమూనాలను పరీక్షించడం.
- సామాజిక వేడి భోజనం రుచి పరీక్షలు: తల్లిదండ్రులు, పంచాయతీలు, స్వయం సహాయక సంఘాలు, అంగన్‌వాడీ నిర్వహణ కమిటీల భాగస్వామ్యంతో అంగన్‌వాడీ కేంద్రాల్లో వేడి భోజనం రుచి చూసే కార్యక్రమాలు నిర్వహించడం.

3. సామాజిక బాధ్యత, జవాబుదారీతనం: 2026 జూన్‌ 23న మంత్రిత్వ శాఖ జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం ఇటీవల అంగన్‌వాడీ నిర్వహణ కమిటీ(ఏఎంసీ)లను ఏర్పాటు చేశారు. అదనపు పోషకాహార పథకంలో ప్రజల బాధ్యత, జవాబుదారీతనాన్ని పెంచేందుకు ఇది సరైన అవకాశం. అంగన్‌వాడీ పర్యవేక్షకుల అధ్యక్షతన పనిచేసే ఈ కమిటీలు ప్రజల భాగస్వామ్యంతో పర్యవేక్షణ చేపడతాయి. అంగన్‌వాడీ కేంద్రాల్లో సేవల నాణ్యత, ప్రభావాన్ని మెరుగుపరుస్తాయి. అవగాహన కల్పించడం, లబ్ధిదారులను సమీకరించడం, పోషకాహారం, బాల్యదశ సంరక్షణ సేవలను పర్యవేక్షించడం వంటి కార్యక్రమాల్లో కమిటీలను చురుగ్గా భాగస్వాములను చేసేందుకు పోషణ మాసోత్స‌వం–2026 కీలక వేదికగా ఉపయోగపడుతుంది.

ఈ ప్రయత్నానికి తోడుగా అన్ని అంగన్‌వాడీ కేంద్రాల్లో అదనపు పోషకాహార పథకం మెనూ బోర్డులను ఏర్పాటు చేయాలి. లబ్ధిదారులకు అందాల్సిన ప్రయోజనాలు, రోజువారీ మెనూను ప్రజలకు కనిపించేలా ఉంచడం ద్వారా పారదర్శకత పెరుగుతుంది. మెనూ అమలు, భోజనం నాణ్యత, సేవల కొనసాగింపును పర్యవేక్షించడంలో నిర్వహణ కమిటీలు, మెనూ బోర్డులు ప్రజల భాగస్వామ్యాన్ని పెంచగలవు. అదనపు పోషకాహారం, లబ్ధిదారుల హక్కులు, పిల్లల అవసరాలకు అనుగుణమైన సంరక్షణ పద్ధతులపై అవగాహన కూడా మెరుగవుతుంది.

చేపట్టగల కార్యక్రమాలు:
- అంగన్‌వాడీ నిర్వహణ కమిటీల(ఏఎంసీ) క్రియాశీలత: అన్ని అంగన్‌వాడీ కేంద్రాల్లో నిర్వహణ కమిటీలను క్రియాశీలం చేయాలి. ప్రజల భాగస్వామ్యానికి నాయకత్వం వహించడం, పోషకాహార సేవల అమలును సమీక్షించడం, పోషణ మాస కార్యక్రమాలకు సహకరించడం వంటి బాధ్యతలు అప్పగించాలి. పోషణ మాసంలో కనీసం ఒక కమిటీ సమావేశం జరిగేలా చూడాలి.
- అదనపు పోషకాహార మెనూ బోర్డుల ఏర్పాటు: ప్రతి అంగన్‌వాడీ కేంద్రంలో మెనూ బోర్డు ఏర్పాటు చేసేలా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు చర్యలు తీసుకోవాలి. రోజు వారీ వేడి భోజనం, ఇంటికి తీసుకెళ్లే రేషన్‌ మెనూపై లబ్ధిదారులకు అవగాహన కల్పించాలి. సేవల అమలులో పారదర్శకత, ప్రజా పర్యవేక్షణను పెంచాలి.
- భోజనం నాణ్యతపై ప్రజా పర్యవేక్షణ: భోజనం నాణ్యత, పరిమాణం, మెనూ అమలు, అదనపు పోషకాహార పథకంపై నిర్ణీత కాల వ్యవధిలో సామాజిక తనిఖీల కోసం అంగన్‌వాడీ నిర్వహణ కమిటీలు, మాతృ కమిటీలను భాగస్వాములను చేయాలి.

4: బాల్యదశ అభివృద్ధికి పోషకాహారం, తొలి ప్రేరణ: బాల్యదశ సంరక్షణ, విద్యకు మేధో వికాసం, తగిన పోషకాహారం ప్రాథమిక ఆధారాలని ప్రధాన కార్యదర్శుల సదస్సు సూచించింది. పిల్లలు తీసుకునే ఆహారానికి, వారి అభ్యాస సామర్థ్యానికి విడదీయలేని సంబంధం ఉందని ఈ అంశం వివరిస్తుంది.

జీవితంలోని తొలి 1,000 రోజుల్లో మంచి పోషకాహారం, పిల్లల అవసరాలకు అనుగుణమైన సంరక్షణ మెదడు పూర్తి స్థాయి అభివృద్ధికి అత్యంత అవసరం. ఈ కీలక సమయంలో పోషకాహార లోపం తలెత్తితే మేధో, శారీరక కదలికలు, సామాజిక, భావోద్వేగ వికాసంపై దీర్ఘకాల ప్రభావం పడుతుంది. సవరించిన గృహ సందర్శన ప్రణాళికలో 0–3 ఏళ్ల పిల్లలకు సంబంధించిన 34 వృద్ధి మైలురాళ్లను క్రమపద్ధతిలో పొందుపరిచారు. పిల్లల సంరక్షకులకు అంగన్‌వాడీ కార్యకర్తలు మెరుగైన సలహాలు ఇవ్వడానికి, బాల్యదశలో ప్రేరణాత్మక కార్యక్రమాలను ప్రోత్సహించడానికి ఇది ఉపయోగపడుతుంది.

చేపట్టగల కార్యక్రమాలు:
- సవరించిన గృహ సందర్శన ప్రణాళిక: తొలి 1,000 రోజులు, బాల్యదశలో సమన్వయంతో సలహాలు, తదుపరి పర్యవేక్షణ అందించేందుకు సవరించిన గృహ సందర్శన ప్రణాళిక అమలును వేగవంతం చేయాలి. నవచేతన, ఆధార్‌శిల పాఠ్య ప్రణాళికల అమలుతో నాణ్యమైన బాల్యదశ సంరక్షణ, విద్యను ప్రోత్సహించాలి. వయసుకు తగిన అభ్యాసం, వికాసం, పాఠశాల సంసిద్ధతను పెంపొందించాలి.
- అభివృద్ధిలో జాప్యం ఉన్న పిల్లలను నిపుణుల వద్దకు పంపడం: పిల్లల వికాసంలో జాప్యాన్ని గుర్తించడం, వారిని ఆరోగ్య వ్యవస్థలు, ఆర్‌బీఎస్‌కే బృందాల వద్దకు పంపే మార్గాలపై విస్తృత అవగాహన కల్పించాలి.
- బాల్యదశ ప్రేరణపై పోషకాహార ప్రభావం గురించి అవగాహన: మెదడు పూర్తి స్థాయి వికాసం, మేధో అభివృద్ధికి తగిన పోషకాహారం, బాల్యదశ ప్రేరణ ప్రాధాన్యంపై విస్తృత అవగాహన కార్యక్రమం చేపట్టాలి.

5: ప్రధానమంత్రి మాతృ వందన యోజన(పీఎంఎంవీవై): మాతృ ఆరోగ్యం కోసం నగదు బదిలీలు: భారత ప్రధాన మాతృత్వ ప్రయోజన కార్యక్రమమైన ప్రధానమంత్రి మాతృ వందన యోజన పదేళ్లు పూర్తి చేసుకుంటోంది. మాతృ పోషణకు సాయం చేయడం, ఆరోగ్య సేవలను పొందే అలవాట్లను ప్రోత్సహించడం, గర్భధారణ సమయంలో ఆదాయ భరోసా కల్పించడం ఈ పథకం లక్ష్యం. అర్హులైన వారందరినీ పథకం పరిధిలోకి తీసుకురావడానికి, ప్రజల్లో అవగాహన పెంచడానికి, మాతా శిశు ఆరోగ్యంలో సాధించిన దశాబ్ద కాల ప్రగతిని గుర్తుచేసుకోవడానికి పోషణ మాసోత్స‌వం–2026 అవకాశం కల్పిస్తోంది.

చేపట్టగల కార్యక్రమాలు:
- అర్హులందరికీ 100% ప్రయోజనాలు అందించే ప్రత్యేక కార్యక్రమం: పీఎంఎంవీవై కింద అర్హులైన గర్భిణులు, బాలింతలందరినీ గుర్తించి నమోదు చేసేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలి. పెండింగ్‌ దరఖాస్తులను సమీక్షించి, ధ్రువీకరణ, ఆమోదం, ప్రత్యక్ష ప్రయోజన బదిలీ ప్రక్రియలను వేగవంతం చేయాలి. పీఎంఎంవీవై డ్యాష్‌బోర్డుల ద్వారా పురోగతిని క్రమం తప్పకుండా సమీక్షించాలి.
- ప్రజా అవగాహన కార్యక్రమం: పీఎంఎంవీవై అర్హత, ప్రయోజనాలు, విడతలు, దరఖాస్తు విధానంపై ప్రచారం నిర్వహించాలి. లబ్ధిదారుల అనుభవాలు, విజయగాథలను సామాజిక, ప్రసార మాధ్యమాల ద్వారా ప్రచారం చేయాలి.
- పీఎంఎంవీవై మార్గదర్శక సాధనాల విడుదల: రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో క్షేత్రస్థాయి అమలుకు పీఎంఎంవీవై మార్గదర్శక సాధనాలను విడుదల చేయాలి. ప్రాంతీయ భాషల్లో వాటిని రూపొందించి, విస్తృతంగా అందుబాటులో ఉంచేలా ప్రోత్సహించాలి.

ప్రజల భాగస్వామ్యం: ప్రజా ఉద్యమంగా పోషకాహారం
పోషకాహార మెరుగుదలను ప్రభుత్వ కార్యక్రమంగా మాత్రమే కాకుండా నిజమైన ప్రజా ఉద్యమంగా మార్చడమే పోషణ్‌ అభియాన్‌ ప్రత్యేకత.

 

A blue and white rectangles with images of people



శిశువుల ఆహార పద్ధతులు, ఆహార వైవిధ్యం, గర్భిణుల సంరక్షణ, చేతుల పరిశుభ్రత, సంస్థాగత ఆరోగ్య సేవలను పొందే అలవాట్లలో శాశ్వత మార్పు రావాలంటే ప్రజలు బాధ్యత తీసుకుని, క్షేత్రస్థాయిలో చురుగ్గా పాల్గొనాలని ఈ కార్యక్రమం గుర్తిస్తోంది. పోషణ మాసం, పోషణ పక్వాడా ప్రపంచంలోనే అతిపెద్ద పోషకాహార ఆధారిత ప్రజా సమీకరణ కార్యక్రమాల్లో నిలిచాయి. ఆరోగ్యం, శ్రేయస్సు, రోగనిరోధక శక్తిని పెంచే అలవాట్లను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రతి సంవత్సరం నిర్ణీత నెలల్లో వీటిని నిర్వహిస్తారు.

పోషణ పక్వాడా (2026 ఏప్రిల్‌)
2018 నుంచి ప్రతి ఏటా నిర్వహిస్తున్న పోషణ పక్వాడా రెండు వారాల ప్రత్యేక ప్రజా అవగాహన కార్యక్రమం. పోషణ్‌ అభియాన్‌ కింద ప్రజల భాగస్వామ్యాన్ని పెంచడం, కీలక పోషకాహార అలవాట్లను బలోపేతం చేయడం లక్ష్యంగా ఏప్రిల్‌లో దీన్ని నిర్వహిస్తారు.

2026లో 8వ పోషణ పక్వాడాను ఏప్రిల్‌ 9 నుంచి 23 వరకు నిర్వహించారు. ఆరేళ్ల వయసు నాటికే మెదడు వికాసంలో 85 శాతానికి పైగా పూర్తవుతుందని శాస్త్రీయ ఆధారాలు చెబుతున్నాయి. తొలి 1,000 రోజుల్లో అత్యంత వేగంగా మెదడు ఎదుగుతుంది. పూర్తి స్థాయి మేధో వికాసం, శారీరక ఎదుగుదల, సమగ్ర శ్రేయస్సుకు ఇది అత్యంత కీలక కాలం.

జీవిత ప్రారంభ దశలో పిల్లలకు సంరక్షణ, పోషకాహారం ఎంతో కీలకమని గుర్తిస్తూ 8వ పోషణ పక్వాడా ప్రజా ఉద్యమాన్ని మరింత విస్తరించింది. “జీవితంలోని తొలి ఆరేళ్లలో మెదడు వికాసాన్ని గరిష్ఠ స్థాయికి తీసుకెళ్లడం” అనే శాస్త్రీయ ప్రాధాన్యమున్న అంశంపై దృష్టి పెట్టింది. ఆరోగ్యకరమైన ఎదుగుదల, మెదడు అభివృద్ధికి దోహదం చేసే పద్ధతులపై కుటుంబాలు, సమాజాల్లో అవగాహన పెంచడం దీని లక్ష్యం.

కేంద్ర ఇతివృత్తం: జీవితంలోని తొలి ఆరేళ్లలో మెదడు వికాసాన్ని గరిష్ఠ స్థాయికి తీసుకెళ్లడం ద్వారా “ఆరోగ్యానికి పోషకాహారం” అనే భావనను “మెదడు పూర్తి స్థాయి వికాసానికి పోషకాహారం, బాల్యదశ ప్రేరణ” అనే విస్తృత దృక్పథానికి తీసుకెళ్లాలని కార్యక్రమం లక్ష్యంగా పెట్టుకుంది.

8వ జాతీయ పోషణ మాసోత్స‌వం
2025 సెప్టెంబర్‌ 17న మధ్యప్రదేశ్‌లోని ధార్‌ నుంచి ప్రధానమంత్రి 8వ జాతీయ పోషణ మాసాన్ని ప్రారంభించారు. స్వస్థ్‌ నారీ, సశక్త్‌ పరివార్‌ అభియాన్‌ను కూడా అదే రోజు ప్రారంభించారు. మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని అమలు చేశాయి.

2025 జాతీయ పోషణ మాసం పోషకాహార అవగాహన, ఆరోగ్యకర జీవనశైలిని ప్రోత్సహించడంపై దృష్టి పెట్టింది. మాతృ పోషణ, శిశువులు, చిన్నారుల ఆహార పద్ధతులు, బాల్యదశ సంరక్షణ, విద్య, ఊబకాయం నివారణకు చక్కెర, నూనె వినియోగం తగ్గించడం ప్రధాన అంశాలుగా ఉన్నాయి. 20కి పైగా మంత్రిత్వ శాఖల సమన్వయంతో దేశవ్యాప్తంగా 14.33 కోట్ల కార్యక్రమాలు నిర్వహించారు.

పోషణ ట్రాకర్‌: పోషకాహార పాలనకు డిజిటల్‌ వేదిక
2021 మార్చి 1న ప్రారంభించిన పోషణ ట్రాకర్‌ మౌలిక సదుపాయాలు, సేవల అమలు పర్యవేక్షణకు ప్రధాన సాధనంగా పనిచేస్తోంది. అంగన్‌వాడీ కేంద్రాలు తెరిచిన సమాచారం, పిల్లల రోజువారీ హాజరు, బాల్యదశ సంరక్షణ, విద్య కార్యక్రమాలు, ఎదుగుదల పర్యవేక్షణ వివరాలను దాదాపు తక్షణమే సేకరించేందుకు ఈ యాప్‌ వీలు కల్పిస్తోంది. గర్భిణులు, బాలింతలు, ఆరేళ్లలోపు పిల్లలు, కిశోర బాలికలకు సంబంధించిన వివరాలను ప్రస్తుతం ఈ వ్యవస్థ పర్యవేక్షిస్తోంది.



2026 జూలై 31 నాటికి దేశవ్యాప్తంగా దాదాపు 13.99 లక్షల అంగన్‌వాడీ కేంద్రాలు పనిచేస్తున్నాయి. వీటిలో 13.30 లక్షల మంది అంగన్‌వాడీ కార్యకర్తలు సేవలందిస్తున్నారు. ఈ విస్తృత క్షేత్రస్థాయి వ్యవస్థ దాదాపు 8.94 కోట్ల మంది లబ్ధిదారులకు చేరువైంది.

ఆరు నెలల నుంచి ఆరేళ్లలోపు పిల్లల సంఖ్య 7.2 కోట్లకు పైగా ఉంది. మొత్తం లబ్ధిదారుల్లో వీరే అత్యధికం. బాల్యదశ పోషణ, వికాసానికి ఇస్తున్న ప్రాధాన్యాన్ని ఈ గణాంకాలు తెలియజేస్తున్నాయి.

గర్భిణులు, బాలింతల సంఖ్య కలిపి దాదాపు 1.1 కోట్లు. జీవితంలోని కీలకమైన తొలి 1,000 రోజుల్లో మాతృ ఆరోగ్యానికి ప్రభుత్వం ఇస్తున్న నిరంతర ప్రాధాన్యాన్ని ఇది సూచిస్తోంది.

ఆరోగ్యవంతమైన కుటుంబాలు, ఆరోగ్యవంతమైన దేశం దిశగా
సాంకేతికత ఆధారంగా దాదాపు తక్షణ పర్యవేక్షణను, ప్ర‌జా ఉద్య‌మం ద్వారా భారీ ప్రజా భాగస్వామ్యాన్ని సమన్వయం చేస్తూ జాతీయ పోషణ మాసోత్స‌వం పోషకాహారాన్ని దేశవ్యాప్త ప్రజా ఉద్యమంగా మార్చింది. మిషన్‌ పోషణ్‌ 2.0 సమగ్ర కార్యాచరణ పరిధిలో ఏటా జరిగే ఈ ప్రచారం సేవల అమలులో లోపాలను తగ్గిస్తోంది. ఆహార వైవిధ్యాన్ని ప్రోత్సహిస్తూ, పిల్లల జీవితంలోని తొలి కీలక సంవత్సరాలకు ప్రాధాన్యం ఇస్తోంది. ఆరోగ్యవంతమైన, పోషకాహార లోపం లేని భారత్‌ నిర్మాణానికి దోహదం చేస్తోంది.

 

References

 

Ministry of Women and Child Development

https://www.pib.gov.in/Pressreleaseshare.aspx?PRID=1910097&reg=48&lang=2

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2180384&reg=48&lang=2

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2249920&reg=48&lang=2

https://www.poshantracker.in/aboutus

https://www.pib.gov.in/PressReleaseDetail.aspx?PRID=2307291&reg=48&lang=1

https://cdn.poshantracker.in/public-assets/pdf/Resources/Awareness/Navchetana/Navchetana_en.pdf

 

Ministry of Health and Family Welfare

https://www.nfhsiips.in/nfhsuser/assets/National%20Family%20Health%20Survey%20(NFHS-6)%202023-2024%20Fact%20Sheets.pdf

https://www.nfhsiips.in/nfhsuser/publication.php

 

PIB Backgrounders

https://static.pib.gov.in/WriteReadData/specificdocs/documents/2025/sep/doc2025918640501.pdf

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2251769&reg=3&lang=1

 

UNICEF

https://www.unicef.org/laos/ensuring-healthy-start-first-1000-days-0

9th Rashtriya Poshan Maah

 

***

(Explainer ID: 159920) आगंतुक पटल : 50
Provide suggestions / comments
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Kannada , Malayalam , हिन्दी , Bengali , Assamese