• Sitemap
  • Advance Search
Farmer's Welfare

సహకార రంగంలో వికేంద్రీకృత ధాన్య నిల్వ ప్రణాళిక

“భారత్‌లో వికేంద్రీకృత ధాన్య నిల్వ వ్యవస్థ బలోపేతం”

Posted On: 03 SEP 2026 12:15PM

భారత్‌లో వ్యవసాయ ఉత్పత్తి పెరుగుతుండటం, ఆహార భద్రతకు విస్తృత ప్రాధాన్యం ఇస్తుండటంతో దేశవ్యాప్తంగా వికేంద్రీకృత ధాన్య నిల్వ మౌలిక సదుపాయాల అవసరం మరింత పెరిగింది. 2023లో ప్రారంభించిన సహకార రంగంలో వికేంద్రీకృత ధాన్య నిల్వ ప్రణాళిక, ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల (పీఏసీఎస్‌) ద్వారా నిల్వ, ప్రాసెసింగ్‌, సేకరణ, పంపిణీ వ్యవస్థలను మెరుగుపరిచేందుకు ఉద్దేశించిన కార్యక్రమం. ఇప్పటికే అమల్లో ఉన్న ప్రభుత్వ పథకాలను అనుసంధానిస్తూ సమీకృత, సహకార సంఘాల ఆధారిత విధానాన్ని ఈ ప్రణాళిక అనుసరిస్తోంది. సంస్థాగత సమన్వయం, ఆర్థిక సహాయ యంత్రాంగాలు దీనికి మద్దతు ఇస్తున్నాయి. 11 రాష్ట్రాల్లోని 11 పీఏసీఎస్‌లలో 9,750 మెట్రిక్‌ టన్నుల నిల్వ సామర్థ్యంతో ప్రయోగాత్మక ప్రాజెక్టులుగా ప్రారంభమైన ఈ కార్యక్రమం క్రమంగా విస్తరించింది. 2026 జూలై నాటికి దేశవ్యాప్తంగా 313 పీఏసీఎస్‌లలో గోదాముల నిర్మాణం పూర్తికాగా, 1.80 లక్షల మెట్రిక్‌ టన్నులకు పైగా నిల్వ సామర్థ్యం అందుబాటులోకి వచ్చింది. నాణ్యతా ప్రమాణాలు, పారదర్శకత, నిర్వహణ సాధ్యాసాధ్యాలకు కూడా ఈ ప్రణాళిక ప్రాధాన్యం ఇస్తోంది.

విస్తరిస్తున్న వ్యవసాయ ఆర్థిక వ్యవస్థకు నిల్వ సామర్థ్యం ఏర్పాటు
సంప్రదాయ నిల్వ పద్ధతులు, వికేంద్రీకృత స్థానిక వ్యవస్థలు, ఆధునిక మౌలిక సదుపాయాల సమ్మేళనంతో భారత్‌లో ధాన్య నిల్వ వ్యవస్థ రూపుదిద్దుకుంది. ఈ సమీకృత విధానం ఆహార ధాన్యాల సంరక్షణను బలోపేతం చేసి, దేశ ఆహార భద్రతకు మద్దతు ఇచ్చింది. మట్టి పాత్రలు, భూగర్భ గోతులు, మట్టి పూతతో నిర్మించిన నిల్వ కట్టడాలు వంటి సంప్రదాయ పద్ధతులు గోదాములు, సైలో ఆధారిత మౌలిక సదుపాయాలతోపాటు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. అయితే వ్యవసాయ ఉత్పత్తి పెరగడం, ఆహార భద్రత అవసరాలు విస్తరించడంతో దేశవ్యాప్తంగా ఆధునిక, వికేంద్రీకృత నిల్వ సదుపాయాల ఆవశ్యకత అధికమైంది.

మూడో ముందస్తు అంచనాల(2025–26) ప్రకారం దేశంలో మొత్తం ఆహార ధాన్యాల ఉత్పత్తి 376.563 మిలియన్‌ టన్నులుగా అంచనా వేశారు. గత ఏడాది నమోదైన 357.732 మిలియన్‌ టన్నులతో పోలిస్తే ఇది దాదాపు 18.8 మిలియన్‌ టన్నులు (5.3 శాతం) అధికం. జాతీయ ఆహార భద్రత చట్టం–2013 కింద ప్రపంచంలోనే అతిపెద్ద ఆహార భద్రత కార్యక్రమాల్లో ఒకదాన్ని భారత్‌ అమలు చేస్తోంది. ఈ కార్యక్రమం సుమారు 80 కోట్ల మందికి వర్తిస్తోంది. ఈ అవసరాలను తీర్చడం పటిష్ఠమైన ధాన్య నిల్వ సదుపాయాల నెట్‌వర్క్‌పై ఆధారపడి ఉంటుంది. భారత ఆహార సంస్థ(ఎఫ్‌సీఐ), రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు నిర్వహించే కేంద్రీకృత నిల్వ మౌలిక సదుపాయాలు కీలకంగా కొనసాగుతుండగా, వికేంద్రీకృత సదుపాయాలు కూడా అంతే అవసరం. ఉత్పత్తి కేంద్రాలకు సమీపంలో నిల్వ సదుపాయాలు ఉండాల్సిన అవసరాన్ని సహకార మంత్రిత్వ శాఖ ప్రస్తావించింది. సేకరణ కేంద్రాల మధ్య రవాణా వ్యయాన్ని తగ్గించడం, ఆహార ధాన్యాల వృథాను కనిష్ఠ స్థాయికి తీసుకురావడం, ఆహార భద్రతకు మద్దతు ఇవ్వడంపై ఈ సదుపాయాలు దృష్టి సారిస్తాయి.



ఈ నేపథ్యంలో సహకార రంగంలో వికేంద్రీకృత ధాన్య నిల్వ ప్రణాళికను 2023 మే 31న ప్రయోగాత్మక ప్రాజెక్టుగా అమల్లోకి తీసుకొచ్చారు. సహకార సంఘాల ద్వారా వికేంద్రీకృత ధాన్య నిల్వ వ్యవస్థను బలోపేతం చేసే దిశగా ఈ కార్యక్రమం కీలక అడుగుగా నిలిచింది. సహకార వ్యవస్థే కేంద్రంగా సాగే ఈ కార్యక్రమ లక్ష్యాలు:
* ఆహార ధాన్యాల వృథాను తగ్గించి, ఆహార భద్రతను బలోపేతం చేయడం,
* రైతులు గిట్టుబాటు కాని ధరలకు పంటను విక్రయించాల్సిన పరిస్థితులను నివారించేందుకు మరింత వెసులుబాటు కల్పించి, మెరుగైన ధర లభించేలా చూడటం,
* సేకరణ కేంద్రాలు, గోదాములు, చౌక ధరల దుకాణాల మధ్య రవాణా వ్యయాన్ని తగ్గించడం,
* వ్యవసాయ కార్యకలాపాల వైవిధ్యీకరణ ద్వారా ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల (పీఏసీఎస్‌) పాత్రను విస్తరించడం (పీఏసీఎస్‌లు గ్రామస్థాయిలో గ్రామీణ రుణగ్రహీతలకు స్వల్పకాలిక రుణాలు, ఆర్థిక సేవలు అందించే సంస్థలు. రుణ చెల్లింపుల సేకరణకు కూడా సహకరిస్తాయి),
* రైతులకు అధిక ఆదాయ అవకాశాలను కల్పించడం.

సమీకృత మౌలిక సదుపాయాలు, పథకాల అనుసంధాన వ్యవస్థ
సహకార రంగంలో వికేంద్రీకృత ధాన్య నిల్వ ప్రణాళిక కింద పీఏసీఎస్‌ స్థాయిలో సమీకృత వ్యవసాయ మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రస్తుతం అమల్లో ఉన్న కింది ప్రభుత్వ పథకాల అనుసంధానం ద్వారా ఈ యంత్రాంగం పనిచేస్తుంది:
* వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి (ఏఐఎఫ్‌) పథకం: పంట కోత అనంతర మౌలిక సదుపాయాల ఏర్పాటు, ఆధునికీకరణకు ఆర్థిక సహాయం, వడ్డీ రాయితీ అందిస్తుంది.
* వ్యవసాయ మార్కెటింగ్‌ మౌలిక సదుపాయాల పథకం (ఏఎంఐ): ఆహార ధాన్యాల నిల్వ సదుపాయాల నిర్మాణానికి బ్యాక్‌-ఎండెడ్‌ మూలధన రాయితీని అందిస్తుంది.
* వ్యవసాయ యాంత్రీకరణ ఉప కార్యక్రమం (ఎస్‌ఎంఏఎం): కస్టమ్‌ హైరింగ్‌ కేంద్రాల ఏర్పాటు, వ్యవసాయ యంత్రాల అందుబాటుకు తోడ్పడుతుంది.
* ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార శుద్ధి పరిశ్రమల క్రమబద్ధీకరణ పథకం (పీఎంఎఫ్‌ఎంఈ): సూక్ష్మ ఆహార శుద్ధి యూనిట్ల క్రమబద్ధీకరణ, వృద్ధిని ప్రోత్సహిస్తుంది.

ఈ పథకాల అనుసంధానం ద్వారా పీఏసీఎస్‌లు సమీకృత గ్రామీణ సేవా కేంద్రాలుగా ఎదగడానికి అవకాశం కలుగుతుంది. ఫలితంగా వ్యవసాయ మౌలిక సదుపాయాలు బలోపేతం కావడంతోపాటు విలువ ఆధారిత సరఫరా వ్యవస్థలు మెరుగుపడి, రైతుల ఆదాయం పెరుగుతుంది.

సహకార రంగంలో వికేంద్రీకృత ధాన్య నిల్వ ప్రణాళిక కింద అందుబాటులోకి వచ్చే ప్రధాన సదుపాయాలు, సేవలు:
* కస్టమ్‌ హైరింగ్‌ కేంద్రాలు:
 రైతులకు అద్దెకు ఇచ్చేందుకు వ్యవసాయ యంత్రాలను సమకూర్చుకునే అవకాశాన్ని పీఏసీఎస్‌లకు కల్పిస్తాయి. ట్రాక్టర్లు, హార్వెస్టర్లు, టిల్లర్లు, ఇతర వ్యవసాయ యంత్రాలు వీటిలో ఉండవచ్చు.
* చౌక ధరల దుకాణాలు: స్థానిక సమాజాల్లో ధాన్యం పంపిణీ, ప్రాసెస్‌ చేసిన ఆహార ఉత్పత్తుల విక్రయానికి తోడ్పడతాయి.
* ప్రాథమిక ప్రాసెసింగ్‌ యూనిట్లు: ధాన్యాన్ని శుభ్రపరచడం, వర్గీకరించడం, ఆరబెట్టడం వంటి ప్రాసెసింగ్‌ కార్యకలాపాలను చేపడతాయి. తద్వారా ఉత్పత్తుల నాణ్యత, మార్కెట్‌ అవకాశాలు మెరుగుపడతాయి.
* సేకరణ కేంద్రాలు: రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు, ఎఫ్‌సీఐ తరఫున పీఏసీఎస్‌లు చేపట్టే ధాన్యం సేకరణకు సహకరిస్తాయి.
* సహకార నిల్వ నమూనా కింద 50 మెట్రిక్‌ టన్నులు, 100 మెట్రిక్‌ టన్నులు, 200 మెట్రిక్‌ టన్నుల సామర్థ్యంతో సైలో ఆధారిత నిల్వ మౌలిక సదుపాయాలను ఈ ప్రణాళిక కల్పిస్తుంది.
ప్రణాళికలో పాల్గొనే పీఏసీఎస్‌లకు వర్తించే సంస్థాగత, అర్హత ప్రమాణాలను కూడా అమలు విధానం నిర్దేశిస్తోంది.



పీఏసీఎస్‌ల ఎంపిక, సంస్థాగత వ్యవస్థ
‘మార్గదర్శిక’ (ప్రామాణిక నిర్వహణ విధానం) ప్రకారం, జిల్లా సహకార అభివృద్ధి కమిటీలు (డీసీడీసీలు) పీఏసీఎస్‌లను గుర్తించి, ఆమోదిస్తాయి. నిల్వ సదుపాయాలకు డిమాండ్‌ ఉన్న ప్రాంతాల్లో పీఏసీఎస్‌లను ఎంపిక చేస్తారు.
మౌలిక సదుపాయాల అభివృద్ధికి భూమికి సంబంధించిన షరతులను కూడా ప్రణాళిక నిర్దేశిస్తోంది. పీఏసీఎస్‌లకు సాధ్యమైనంతవరకు సొంత భూమి ఉండాలి. ఆ భూమిలో నీరు నిలిచే పరిస్థితి ఉండకూడదు, అటవీ ప్రాంతంలోనూ ఉండకూడదు. భూమి వినియోగానికి పీఏసీఎస్‌ సభ్యుల సమ్మతి అవసరం. లీజు భూమి అయితే, లీజు కాలం 20 ఏళ్లకు పైగా ఉండాలి.



అమలు యంత్రాంగం:
జాతీయ సహకార అభివృద్ధి సంస్థ (ఎన్‌సీడీసీ) సహకార రంగంలో వికేంద్రీకృత ధాన్య నిల్వ ప్రణాళికకు అమలు సంస్థగా వ్యవహరిస్తోంది. జాతీయ, రాష్ట్ర, జిల్లా స్థాయుల్లో సమన్వయం ద్వారా అమలుకు మద్దతు లభిస్తోంది. జాతీయ స్థాయిలో అంతర్‌ మంత్రిత్వ కమిటీ (ఐఎంసీ) ప్రణాళిక అమలు తీరును సమగ్రంగా పర్యవేక్షిస్తుంది. భాగస్వామ్య సంస్థలు, ఏజెన్సీల మధ్య కార్యాచరణ సమన్వయానికి జాతీయ స్థాయి సమన్వయ కమిటీ (ఎన్‌ఎల్‌సీసీ) తోడ్పడుతుంది. రాష్ట్ర, జిల్లా స్థాయుల్లో అమలు, సమన్వయానికి రాష్ట్ర సహకార అభివృద్ధి కమిటీలు (ఎస్‌సీడీసీలు), జిల్లా సహకార అభివృద్ధి కమిటీలు (డీసీడీసీలు) సహకరిస్తాయి.

ఆర్థిక సహాయం, ప్రాజెక్టుల సాధ్యత
ఈ ప్రణాళిక కింద ప్రాజెక్టుల ఆర్థిక సాధ్యతను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం పలు చర్యలు చేపట్టింది. ఏఎంఐ పథకం కింద రాయితీని 25 శాతం నుంచి 33.33 శాతానికి పెంచడం, మార్జిన్‌ మనీ అవసరాన్ని 20 శాతం నుంచి 10 శాతానికి తగ్గించడం, గోదాముల నిర్మాణ వ్యయ ప్రమాణాలను సవరించడం వీటిలో ఉన్నాయి.

అర్హత గల పథకాల కింద వడ్డీ రాయితీ, రుణ సహాయ యంత్రాంగాల ద్వారా కూడా ఆర్థిక మద్దతు లభిస్తుంది. ఏఎంఐ పథకం కింద అర్హత గల ప్రాజెక్టులకు రాయితీని చేరవేసే సంస్థగా జాతీయ వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి బ్యాంకు (నాబార్డ్‌) వ్యవహరిస్తుంది. రాష్ట్ర సహకార బ్యాంకులు, జిల్లా కేంద్ర సహకార బ్యాంకులు పీఏసీఎస్‌లకు ప్రధాన రుణ సంస్థలుగా పనిచేస్తాయి. అమలు వ్యవస్థ కింద రుణాలను మంజూరు చేసి, పంపిణీ చేసే బాధ్యత ఈ సంస్థలపై ఉంటుంది.

భాగస్వామ్య సహకార సంఘాలపై ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు నాబార్డ్‌ ప్రత్యేక రీఫైనాన్స్‌ సదుపాయాన్ని కూడా ప్రణాళిక వినియోగిస్తుంది. దీనికి ఏఐఎఫ్‌ కింద లభించే 3 శాతం వడ్డీ రాయితీని కలిపితే, పీఏసీఎస్‌లకు వర్తించే రుణ వడ్డీ రేటు 1 శాతానికి తగ్గుతుంది.

నిర్దేశిత షరతులకు లోబడి, ప్రణాళిక కింద ఏర్పాటు చేసిన అర్హత గల గోదాములను కచ్చితంగా అద్దెకు తీసుకునేందుకు ఎఫ్‌సీఐకి కూడా అనుమతి ఇచ్చారు. ఈ చర్య నిల్వ ప్రాజెక్టుల ఆర్థిక సాధ్యతను పెంచి, పీఏసీఎస్‌ల విస్తృత భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తుంది.

అమలు వ్యవస్థ కార్యరూపం దాల్చిన అనంతరం దశలవారీ విస్తరణ వ్యూహంతో ప్రణాళిక ముందుకు సాగింది.

ప్రయోగాత్మక దశ నుంచి విస్తరణ వరకు
ప్రయోగాత్మక ప్రాజెక్టులతో ప్రారంభమై, విస్తృత స్థాయి అమలు దిశగా ప్రణాళిక దశలవారీగా పురోగమించింది. ప్రయోగాత్మక దశ కింద 11 రాష్ట్రాల్లోని 11 పీఏసీఎస్‌లలో గోదాముల నిర్మాణం పూర్తికాగా, 9,750 మెట్రిక్‌ టన్నుల నిల్వ సామర్థ్యం అందుబాటులోకి వచ్చింది. మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌, గుజరాత్‌, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, తమిళనాడు, తెలంగాణ, అస్సాం, కర్ణాటక, త్రిపుర రాష్ట్రాల్లో ఈ ప్రయోగాత్మక ప్రాజెక్టులను అమలు చేశారు. సహకార సంఘాల స్థాయిలో స్థానిక నిల్వ మౌలిక సదుపాయాల సాధ్యతను ఈ ప్రాజెక్టులు నిరూపించి, కార్యాచరణకు కీలక పునాదిని వేశాయి.

ఈ పునాదిపై అమలు గణనీయంగా విస్తరించింది. 2026 జూలై నాటికి ప్రణాళిక కింద 1,012 పీఏసీఎస్‌లు లేదా సహకార సంఘాలను గుర్తించారు. అదే సమయానికి 313 పీఏసీఎస్‌లలో గోదాముల నిర్మాణం పూర్తికాగా, 1.80 లక్షల మెట్రిక్‌ టన్నులకు పైగా నిల్వ సామర్థ్యం అందుబాటులోకి వచ్చింది.

ఆలోచన దశ నుంచి విస్తృత స్థాయి అమలు దిశగా చోటుచేసుకున్న మార్పును ఈ పురోగతి ప్రతిబింబిస్తోంది.



ఆచరణలో సహకార నిల్వ విధానం: నెర్పింగళై పీఏసీఎస్‌
మహారాష్ట్రలోని అమరావతికి చెందిన నెర్పింగళై పీఏసీఎస్‌, సహకార రంగంలో వికేంద్రీకృత ధాన్య నిల్వ ప్రణాళిక కింద 3,000 మెట్రిక్‌ టన్నుల సామర్థ్యం గల గోదామును నిర్మించింది. వ్యవసాయ మార్కెటింగ్‌ మౌలిక సదుపాయాల పథకం (ఏఎంఐ), వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి (ఏఐఎఫ్‌) కింద ఈ ప్రాజెక్టుకు మద్దతు లభించింది. నాబార్డ్‌ రీఫైనాన్స్‌ సహాయంతో ప్రాజెక్టుపై ప్రభావవంతమైన రుణ వడ్డీ రేటు 1 శాతానికి తగ్గింది. సుమారు 300 మంది రైతులు, దాదాపు 32,000 సోయాబీన్‌ బస్తాలను ఈ గోదాములో నిల్వ చేస్తున్నారు. నిల్వ చేసిన పంటపై సంఘం దాదాపు రూ.4.50 కోట్ల ముందస్తు రుణాలను కూడా అందించింది. దీనివల్ల రైతులకు అవసరమైన నగదు అందుబాటులోకి వచ్చి, గిట్టుబాటు కాని ధరలకు పంటను విక్రయించాల్సిన పరిస్థితి తగ్గింది. అద్దె ఆదాయం ద్వారా పీఏసీఎస్‌కు ఏటా దాదాపు రూ.7.68 లక్షలు, వడ్డీ ఆదాయం ద్వారా దాదాపు రూ.54 లక్షలు లభిస్తాయని అంచనా. ఈ గోదాము చుట్టుపక్కల రైతులకు నిల్వ సదుపాయాన్ని మెరుగుపరచడంతోపాటు సహకార సంఘ ఆదాయ వనరులను బలోపేతం చేసింది. స్థానికంగా ఉపాధి అవకాశాలను కూడా ఈ కార్యక్రమం కల్పించింది. రైతు సహాయ వ్యవస్థలు, గ్రామీణ సహకార సంస్థలకు వికేంద్రీకృత నిల్వ మౌలిక సదుపాయాలు ఎలా తోడ్పడగలవో ఈ ప్రాజెక్టు చాటుతోంది.

 


నెర్పింగళై పీఏసీఎస్‌ గోదాము, సంఘ సభ్యుడు
మూలం: సహకార మంత్రిత్వ శాఖ

నాణ్యతా ప్రమాణాలు, బ్రాండింగ్‌, పారదర్శకత
పథకం కింద ఏర్పాటు చేసే నిల్వ మౌలిక సదుపాయాలకు ప్రణాళిక ఏకరీతి బ్రాండింగ్‌ మార్గదర్శకాలను నిర్దేశిస్తోంది. ప్రతి నిల్వ నిర్మాణంపై ఆమోదిత ధాన్య నిల్వ లోగో, నిర్దేశిత రంగుల నమూనాను ప్రదర్శించాలి. కార్యక్రమానికి సులభంగా గుర్తించగల ప్రత్యేక గుర్తింపును కల్పించడం, భాగస్వాముల్లో అవగాహన పెంచడం దీని లక్ష్యం.



నాణ్యత హామీ:
గోదాముల నిర్మాణం, నిర్వహణకు సంబంధించిన నాణ్యతా ప్రమాణాలను ఈ నమూనా నిర్దేశిస్తోంది. నిల్వ నిర్మాణాలు గిడ్డంగుల అభివృద్ధి, నియంత్రణ ప్రాధికార సంస్థ (డబ్ల్యూడీఆర్‌ఏ) ప్రమాణాలకు అనుగుణంగా ఉండటంతోపాటు స్థానిక పర్యావరణ పరిస్థితులకు సరిపడాలి. ధాన్యం చెడిపోకుండా, నాణ్యత నిలిచేలా సరైన గాలి ప్రసరణ వ్యవస్థలతోపాటు మన్నికైన, తుప్పు పట్టని నిర్మాణ సామగ్రిని ఉపయోగించాలి.

నిర్మాణ నమూనా నిర్దేశాలు, భద్రతా ప్రమాణాల పాటింపును నిర్ధారించేందుకు క్రమం తప్పకుండా తనిఖీలు, నాణ్యత ఆడిట్లు నిర్వహించాలి. ప్రాజెక్టు పురోగతిని పీఏసీఎస్‌ సభ్యులు పర్యవేక్షించాలి. అమలు విధానంలో పారదర్శకత, జవాబుదారీతనం పెంచేందుకు ప్రాజెక్టు నిర్వహణ సలహాదారులు (పీఎంసీలు) నిర్మాణ కార్యకలాపాలు, వ్యయానికి సంబంధించిన తాజా సమాచారాన్ని పంచుకుంటారు.

ప్రణాళిక కింద ఏర్పాటు చేసిన మౌలిక సదుపాయాలు దీర్ఘకాలం మన్నికగా, జవాబుదారీతనంతో కొనసాగుతూ, నిర్దేశిత నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా ఉండేలా చూడటం ఈ చర్యల ఉద్దేశం.

భారత్‌లో వికేంద్రీకృత ధాన్య నిల్వ వ్య‌వ‌స్థ‌ బలోపేతం
సహకార సంఘాల ద్వారా వ్యవసాయ మౌలిక సదుపాయాలను మెరుగుపరిచే సమీకృత విధానానికి సహకార రంగంలో వికేంద్రీకృత ధాన్య నిల్వ ప్రణాళిక ప్రతిరూపంగా నిలుస్తోంది. పీఏసీఎస్‌ స్థాయిలో నిల్వ, ప్రాసెసింగ్‌, సేకరణ, పంపిణీని అనుసంధానించడం ద్వారా ఉత్పత్తి కేంద్రాలకు సమీపంలో ఆహార ధాన్యాల నిర్వహణను ఈ ప్రణాళిక బలోపేతం చేస్తోంది.

ఈ కార్యక్రమం ఆహార భద్రతను మరింత పటిష్ఠం చేయడంతోపాటు వృథాను తగ్గించి, గ్రామీణ సహకార సంస్థలను బలోపేతం చేస్తుంది. ప్రస్తుతం అమల్లో ఉన్న పథకాల అనుసంధానం, సంస్థాగత సమన్వయం, ఆర్థిక సహాయ యంత్రాంగాల ద్వారా ప్రణాళిక దశలవారీ విస్తరణకు మద్దతు లభిస్తోంది. దేశంలో వికేంద్రీకృత వ్యవసాయ మౌలిక సదుపాయాలు, దీర్ఘకాలిక ఆహార ధాన్య నిర్వహణ వ్యవస్థలను బలోపేతం చేసే సహకార సంఘాల ఆధారిత విధానాన్ని ఈ ప్రణాళిక ప్రతిబింబిస్తోంది.

 

References

Ministry of Cooperation

https://www.cooperation.gov.in/en/worlds-largest-grain-storage-plan-cooperative-sector-0

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2146718&reg=3&lang=2

https://www.cooperation.gov.in/sites/default/files/2025-08/DGSP%20English%20Margdarshika%20SOP.pdf

https://www.cooperation.gov.in/en/worlds-largest-decentralized-grain-storage-program-cooperative-sector-ensure-food-security

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2241928&reg=3&lang=1

 

Ministry of Agriculture and Farmers Welfare and ICAR

http://www.ftic.co.il/2016NewDelhiPDF/PP047-052-A008-SESSION02.pdf

https://agriwelfare.gov.in/Documents/Time_Series_3rdAE_2025_26_En.pdf

 

Ministry of Consumer Affairs, Food & Public Distribution

https://dfpd.gov.in/WriteReadData/AnnualRecordUploadDocuments/b9c640b8-5889-4ffd-a62d-5b56c5d4f029_Food%20AR%202024-25%20English%20small%20size.pdf

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2210211

 

Ministry of Finance

https://www.indiabudget.gov.in/economicsurvey/doc/echapter.pdf

 

PIB Backgrounder

https://www.pib.gov.in/PressReleseDetailm.aspx?PRID=2172351&reg=3&lang=2

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2215759&reg=3&lang=2

https://www.pib.gov.in/FactsheetDetails.aspx?Id=150721&reg=48&lang=1

 

Click to see pdf

***

(Explainer ID: 159845) आगंतुक पटल : 23
Provide suggestions / comments
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Bengali , Assamese , Punjabi , Tamil , Kannada , Malayalam