Farmer's Welfare
పర్ డ్రాప్ మోర్ క్రాప్‌తో వ్యవసాయంలో తెలివిగా నీటి వినియోగం
నీటి సమర్థ వినియోగంతో భారత వ్యవసాయంలో మార్పు
Posted On:
29 AUG 2026 12:34PM
నీటి వినియోగ సామర్థ్యాన్ని మెరుగుపరచడం, వ్యవసాయ ఉత్పాదకతను పెంచడం కోసం పర్ డ్రాప్ మోర్ క్రాప్ (పీడీఎంసీ) పథకం సూక్ష్మ సేద్యాన్ని ప్రోత్సహిస్తోంది. 2026 జూలై నాటికి ఈ పథకం కింద 115 లక్షల హెక్టార్లకు పైగా విస్తీర్ణాన్ని సూక్ష్మ సేద్యం పరిధిలోకి తీసుకొచ్చారు. ప్రత్యక్ష ప్రయోజన బదిలీ ద్వారా ఆర్థిక సహాయం, డిజిటల్ అమలుతో పారదర్శకత పెరిగి, అందుబాటు ధరల్లో సూక్ష్మ సేద్య సదుపాయాలు రైతులకు మరింత చేరువయ్యాయి. అధిక దిగుబడులు, గణనీయమైన నీటి పొదుపు, తగ్గిన సాగు ఖర్చులు, పెరిగిన రైతుల ఆదాయాన్ని స్వతంత్ర అధ్యయనాలు వెల్లడించాయి. ప్రతి నీటి బొట్టును సమర్థంగా వినియోగించడం ద్వారా వనరుల పొదుపుతో కూడిన సుస్థిర వ్యవసాయాన్ని పీడీఎంసీ బలోపేతం చేస్తోంది.
పర్ డ్రాప్ మోర్ క్రాప్ (పీడీఎంసీ)తో సాగునీటి సామర్థ్యానికి ఊతం
భారత్‌లో అందుబాటులో ఉన్న నీటి వనరుల్లో 80 శాతానికి పైగా వ్యవసాయ సేద్యానికి వినియోగిస్తున్నారు. అయితే, నికర సాగు విస్తీర్ణంలో దాదాపు 50 శాతానికే సాగునీటి సదుపాయాలు ఉన్నాయి. అందువల్ల నీటి వినియోగ సామర్థ్యాన్ని మెరుగుపరచడం జాతీయ ప్రాధాన్యంగా మారింది. వ్యవసాయంలో నీటి వినియోగ సామర్థ్యాన్ని పెంచేందుకు సూక్ష్మ సేద్యం ఒక ముఖ్యమైన పరిష్కారం. అతి తక్కువ నష్టంతో పంటలకు నేరుగా నీటిని అందించడమే దీనికి కారణం. క్షేత్రస్థాయిలో నీటిని సమర్థంగా వినియోగించడాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం కేంద్ర ప్రాయోజిత పర్ డ్రాప్ మోర్ క్రాప్ పథకాన్ని అమలు చేస్తోంది. బిందు సేద్యం, తుంపర సేద్యం వంటి సూక్ష్మ సేద్య వ్యవస్థలకు ఇది మద్దతు ఇస్తుంది.

ఈ పథకం కింద సూక్ష్మ సేద్య వ్యవస్థలను ఏర్పాటు చేసేందుకు ఒక్కో లబ్ధిదారుకు గరిష్ఠంగా ఐదు హెక్టార్ల వరకు ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తుంది. చిన్న, సన్నకారు రైతులకు 55 శాతం, ఇతర రైతులకు 45 శాతం ఆర్థిక సహాయం లభిస్తుంది. గత మూడేళ్లలో ₹8,123.24 కోట్ల కేంద్ర సహాయాన్ని విడుదల చేశారు. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు సొంత బడ్జెట్ల నుంచి అదనపు రాయితీలు కూడా అందిస్తున్నాయి. ఏడేళ్ల తర్వాత అదే భూమికి రైతులు మరోసారి సహాయం పొందవచ్చు.
ఈ కార్యక్రమం మొదట 2006 జనవరిలో సూక్ష్మ సేద్యం కోసం కేంద్ర ప్రాయోజిత పథకం(సీఎస్ఎస్)గా ప్రారంభమైంది. 2010–11లో దీన్ని సూక్ష్మ సేద్యంపై జాతీయ మిషన్(ఎన్ఎంఎంఐ)గా ఉన్నతీకరించారు. 2014–15 ఆర్థిక సంవత్సరంలో ‘క్షేత్రస్థాయి నీటి నిర్వహణ’ విభాగం కింద జాతీయ సుస్థిర వ్యవసాయ మిషన్(ఎన్ఎంఎస్ఏ)లో భాగంగా మారింది. 2015–16 నుంచి 2021–22 వరకు దీన్ని అధికారికంగా పర్ డ్రాప్ మోర్ క్రాప్(పీడీఎంసీ)గా పిలిచారు. ప్రధానమంత్రి కృషి సించాయీ యోజన(పీఎంకేఎస్‌వై)లో ప్రధాన విభాగంగా అమలు చేశారు. 2022–23 నుంచి పీడీఎంసీని ప్రధానమంత్రి రాష్ట్రీయ కృషి వికాస్ యోజన(పీఎం-ఆర్‌కేవీవై) కింద అమలు చేస్తున్నారు.
ప్రధానమంత్రి రాష్ట్రీయ కృషి వికాస్ యోజన
2007–08లో ప్రారంభమైన రాష్ట్రీయ కృషి వికాస్ యోజన వ్యవసాయం, అనుబంధ రంగాల సమగ్ర అభివృద్ధిని ప్రోత్సహిస్తుంది. సుస్థిర వ్యవసాయానికి ఊతమిస్తూ తొమ్మిది పథకాలను ఒకే గొడుగు కిందకు తీసుకొచ్చేలా 2024 అక్టోబర్‌లో దీన్ని ప్రధానమంత్రి రాష్ట్రీయ కృషి వికాస్ యోజన(పీఎం-ఆర్‌కేవీవై)గా పునర్వ్యవస్థీకరించారు. పర్ డ్రాప్ మోర్ క్రాప్(పీడీఎంసీ), వ్యవసాయ యాంత్రీకరణ, భూసార ఆరోగ్య నిర్వహణ, పంటల వైవిధ్యీకరణ, వ్యవసాయ అంకుర సంస్థలకు యాక్సెలరేటర్ ఫండ్ వంటి విభాగాలు ఇందులో ఉన్నాయి. స్థానిక వ్యవసాయ అవసరాల ఆధారంగా ఒక విభాగం నుంచి మరో విభాగానికి నిధులను మళ్లించే వెసులుబాటును రాష్ట్ర ప్రభుత్వాలకు కల్పించడం పునర్వ్యవస్థీకరించిన పథక ప్రధాన ప్రత్యేకత. వాతావరణ మార్పులను తట్టుకునే సామర్థ్యం వంటి కొత్త సవాళ్లను ఎదుర్కోవడం, పంట ఉత్పాదకతను పెంచడం, విలువ శ్రేణి అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లడం దీని లక్ష్యం. 2025–26లో పీఎం–ఆర్‌కేవీవైకి మొత్తం ₹8,957.72 కోట్లు విడుదల చేశారు లేదా మంజూరు చేశారు. ఇందులో పీడీఎంసీ పథకానికి ప్రత్యేకంగా ₹3,226.36 కోట్లు కేటాయించారు.
పీడీఎంసీ వ్యూహాత్మక ప్రాధాన్య రంగాలు
పంట ఉత్పాదకత, రైతుల ఆదాయాన్ని పెంచేందుకు పీడీఎంసీ పథకం కచ్చితమైన నీటి నిర్వహణను ప్రోత్సహిస్తుంది. పోషకాల వినియోగ సామర్థ్యాన్ని మెరుగుపరచేందుకు నీటితో ఎరువుల సరఫరా, ఫెర్టిగేషన్‌ను ప్రోత్సహిస్తూ నీటి కొరత, భూగర్భ జలాలపై ఒత్తిడి ఉన్న ప్రాంతాలకు ప్రాధాన్యం ఇస్తుంది. మొక్క వేర్లు ఎక్కువగా విస్తరించే ప్రాంతానికి సాగునీటితో కలిపి నేరుగా ఎరువులను అందించే ప్రక్రియను ఫెర్టిగేషన్ అంటారు. బోరుబావులు, నదుల నుంచి ఎత్తిపోతల పథకాలు, సౌరశక్తితో నడిచే సాగునీటి వ్యవస్థలతో సూక్ష్మ సేద్య అనుసంధానానికి కూడా పీడీఎంసీ మద్దతు ఇస్తుంది. నీటి వనరులను గరిష్ఠంగా ఉపయోగించుకునేందుకు ఇతర ప్రభుత్వ కార్యక్రమాలతో సమన్వయాన్ని ప్రోత్సహిస్తుంది. వ్యవసాయం, ఉద్యానవన రంగాల్లో సూక్ష్మ సేద్యానికి సంబంధించిన శాస్త్రీయ పురోగతికి కూడా పథకం ఊతమిస్తోంది.

సూక్ష్మ సేద్య ప్రయోజనాలు
మొక్కల వేర్ల ప్రాంతానికి నేరుగా నీటిని అందించడం ద్వారా సూక్ష్మ సేద్యం నీటి వృథాను తగ్గించి, సాగునీటి సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది. నీరు, విద్యుత్, ఎరువులు, శ్రమ వినియోగాన్ని తగ్గిస్తుంది. నీరు, పోషకాలను కచ్చితమైన మోతాదులో అందించడం ద్వారా పంట మెరుగ్గా పెరిగి, ఉత్పాదకత పెరుగుతుంది. ఉద్యాన పంటల సాగును కూడా ఈ సాంకేతికత ప్రోత్సహిస్తుంది. పంటల సాంద్రతను పెంచి, అంతగా ఉపయోగంలో లేని భూములను ఉత్పాదక సాగులోకి తీసుకొస్తుంది. పెట్టుబడి ఖర్చులను తగ్గించి, వ్యవసాయ రాబడులను పెంచడం ద్వారా సూక్ష్మ సేద్యం సుస్థిర వ్యవసాయానికి తోడ్పడుతుంది. రైతుల జీవనోపాధిని బలోపేతం చేసి, దీర్ఘకాలిక ఆహార, పోషక భద్రతను ప్రోత్సహిస్తుంది.
పీడీఎంసీ ద్వారా దేశవ్యాప్తంగా విస్తరిస్తున్న సూక్ష్మ సేద్యం
పథకం ప్రారంభమైనప్పటి నుంచి 2026 జూలై నాటికి పీడీఎంసీ కింద 115 లక్షల హెక్టార్లను సూక్ష్మ సేద్యం పరిధిలోకి తీసుకొచ్చారు. ఇది భారత నికర సాగు విస్తీర్ణంలో దాదాపు 8.11 శాతం. 2025–26లో:
1. పీడీఎంసీ కింద సూక్ష్మ సేద్యం అత్యధిక విస్తీర్ణానికి చేరిన రాష్ట్రాల్లో మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, గుజరాత్, రాజస్థాన్ ఉన్నాయి.
2. ఈ పథకం ద్వారా 12.30 లక్షల మంది రైతులకు ప్రయోజనం చేకూరింది.
3. లబ్ధిదారుల్లో దాదాపు 20 శాతం మంది మహిళలు.

నీటి సమర్థ వినియోగాన్ని మరింత ప్రోత్సహించి రైతుల ఆదాయాన్ని పెంచేందుకు పీడీఎంసీ పథకంలో ప్రభుత్వం కొత్త వెసులుబాట్లను ప్రవేశపెట్టింది. ‘ఇతర చర్యలు’ విభాగం కింద డిగ్గీలు(భారీ నీటి నిల్వ ట్యాంకులు లేదా వ్యవసాయ కుంటలు) నీటి సంరక్షణ వ్యవస్థల నిర్మాణం వంటి సూక్ష్మస్థాయి నీటి నిల్వ, పరిరక్షణ కార్యకలాపాలను చేపట్టేందుకు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు అవకాశం కల్పించింది. స్థానిక అవసరాల ఆధారంగా వ్యక్తిగత లేదా సామూహిక వినియోగానికి ఈ వ్యవస్థలను అభివృద్ధి చేయవచ్చు. తద్వారా సూక్ష్మ సేద్యానికి విశ్వసనీయమైన, సుస్థిర నీటి లభ్యతను నిర్ధారించడంలో ఇవి తోడ్పడతాయి.

ముఖ్యంగా సవరించిన మార్గదర్శకాలు ఈ నీటి సంరక్షణ ప్రాజెక్టులకు గతంలో ఉన్న నిధుల పరిమితులను తొలగించాయి. సాధారణ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఇలాంటి కార్యకలాపాలకు గతంలో మొత్తం కేటాయింపులో 20 శాతం వరకు మాత్రమే నిధులను వినియోగించే అవకాశం ఉండేది. ఈశాన్య రాష్ట్రాలు, హిమాలయ రాష్ట్రాలు, జమ్మూ–కశ్మీర్, లద్దాఖ్ కేంద్రపాలిత ప్రాంతాలకు ఈ పరిమితి 40 శాతంగా ఉండేది. ఇప్పుడు నిర్దిష్ట స్థానిక అవసరాల ఆధారంగా ఈ పరిమితులను మించి నిధులను వినియోగించే వెసులుబాటు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు లభించింది.
ముంపు సేద్యం నుంచి బిందు సేద్యం వైపు
ఆంధ్రప్రదేశ్‌లోని పల్నాడుకు చెందిన రైతు ఎల్‌ఏఎం శ్రీనివాసరావు రాష్ట్ర సూక్ష్మ సేద్య ప్రాజెక్టు, పీడీఎంసీ పథకం కింద బిందు సేద్యాన్ని స్వీకరించారు. సంప్రదాయ ముంపు సేద్యం స్థానంలో తన రెండెకరాల నిమ్మ తోటలో బిందు సేద్య వ్యవస్థను ఏర్పాటు చేశారు. కొత్త వ్యవస్థ ద్వారా ఫెర్టిగేషన్ పద్ధతిలో నీరు, పోషకాలు కచ్చితంగా అందాయి. ఫలితంగా ఎకరాకు దిగుబడి 90 క్వింటాళ్ల నుంచి 105 క్వింటాళ్లకు పెరిగింది. సాగు ఖర్చు ₹3 లక్షల నుంచి ₹2.4 లక్షలకు తగ్గింది. మార్కెట్ ధరలు స్థిరంగా ఉండటంతో ఆయన నికర ఆదాయం ₹1.5 లక్షల నుంచి ₹2.85 లక్షలకు పెరిగింది. అదనంగా ₹1.35 లక్షలు ఆర్జించారు. ఉత్పాదకత, రైతుల ఆదాయాన్ని పెంచడంలో సూక్ష్మ సేద్య ప్రయోజనాలను ఇది చాటుతోంది.
పీడీఎంసీ కింద సూక్ష్మ సేద్య వ్యవస్థల రకాలు
పీడీఎంసీ కింద రెండు ప్రధాన సూక్ష్మ సేద్య వ్యవస్థలు ఉన్నాయి:

బిందు సేద్య వ్యవస్థ
పక్క నుంచి ఉండే ట్యూబ్‌కు అమర్చిన లేదా ట్యూబ్‌లోనే ఏర్పాటు చేసిన నీటి బొట్టు విడుదల పరికరాల ద్వారా మొక్కల వేర్ల ప్రాంతానికి నీటిని అందించే పద్ధతిని బిందు సేద్య సాంకేతికత అంటారు. సరళంగా చెప్పాలంటే సన్నని పైపులు లేదా గొట్టాలపై అమర్చిన చిన్న రంధ్రాల ద్వారా(వీటిని ఎమిటర్లు అంటారు) మొక్కల వేర్లకు నెమ్మదిగా, నేరుగా నీటిని అందించే పద్ధతి ఇది. మొక్క చుట్టూ అవసరమైన ప్రాంతానికే నీరు అందడంతో వృథా తగ్గి, వినియోగ సామర్థ్యం మెరుగుపడుతుంది.
బిందు సేద్య వ్యవస్థల్లో రెండు రకాలు ఉన్నాయి:
* ఆన్‌లైన్ బిందు సేద్యం: మొక్క ఉన్న ప్రతి చోట పైపుపై అమర్చిన చిన్న డ్రిప్పర్ల ద్వారా నీటిని అందిస్తారు. సమాన దూరంలో లేని పంటలకు ఇది అనుకూలం.
* ఇన్‌లైన్ బిందు సేద్యం: పైపులో నిర్దిష్ట దూరాల్లో అంతర్గతంగా అమర్చిన డ్రిప్పర్ల నుంచి నీరు వెలువడుతుంది. ఈ వ్యవస్థలో మొక్కలన్నింటికీ సమానంగా నీరు అందుతుంది.

తుంపర సేద్య వ్యవస్థ
తుంపర సేద్యంలో పైపుల వ్యవస్థకు అమర్చిన నాజిళ్ల ద్వారా ఒత్తిడితో నీటిని గాలిలోకి వెదజల్లుతారు. ఇది వర్షాన్ని పోలిన పరిస్థితిని సృష్టించి పంటలకు సమానంగా నీటిని అందిస్తుంది. మొక్కల సాంద్రత చాలా ఎక్కువగా ఉండే పంటలకు తుంపర సేద్య వ్యవస్థ అనుకూలం. తృణధాన్యాలు, పప్పుధాన్యాలు, విత్తన పంటలు, సుగంధ ద్రవ్యాలు, ఇతర పొలం పంటలకు దీన్ని విస్తృతంగా ఉపయోగిస్తారు.
తుంపర సేద్య వ్యవస్థను కింది రకాలుగా వర్గీకరించారు:
* పోర్టబుల్ స్ప్రింక్లర్లు: ఈ వ్యవస్థలో ప్రధాన, ఉప ప్రధాన పైపులను అవసరాన్ని బట్టి పొలంలోని వివిధ ప్రాంతాలకు తరలించవచ్చు. దీంతో పంట నీటి అవసరాలకు అనుగుణంగా సేద్యం చేయవచ్చు. మైదాన ప్రాంతాలతోపాటు ఎత్తుపల్లాల భూముల్లోనూ వీటిని ఉపయోగించవచ్చు.
* మైక్రో స్ప్రింక్లర్లు: ఇవి తక్కువ వ్యాసార్థంలో నీటిని చల్లుతాయి. ఆకుకూరలు, నర్సరీలు, మొక్కలను బయట వాతావరణానికి అలవాటు చేసే ప్రక్రియలో ఎక్కువగా ఉపయోగిస్తారు. సాగునీరు అందించడంతోపాటు మొక్కల సమీపంలోని సూక్ష్మ వాతావరణ పరిస్థితులను మార్చడంలో మైక్రో స్ప్రింక్లర్లు తోడ్పడతాయి.
* మినీ స్ప్రింక్లర్లు: వేరుశనగ, బంగాళాదుంప, ఉల్లిపాయ, అల్లం, తక్కువ ఎత్తులో పెరిగే పశుగ్రాస పంటల వంటి దగ్గరదగ్గరగా పెరిగే పంటలకు సాధారణంగా ఉపయోగిస్తారు. మంచు ప్రభావం నుంచి పంటలను రక్షించేందుకు కూడా ఇవి అనుకూలం. మైక్రో స్ప్రింక్లర్ల కంటే వీటి వ్యాసార్థం ఎక్కువ.
* సెమి-పర్మనెంట్ స్ప్రింక్లర్లు: ఈ వ్యవస్థలో ప్రధాన, పక్క పైపులను భూమి కింద శాశ్వతంగా ఏర్పాటు చేస్తారు. పైకి వచ్చే పైపులకు అమర్చిన స్ప్రింక్లర్ నాజిళ్లను వివిధ ప్రాంతాలకు తరలించవచ్చు. పంట నీటి అవసరాల ఆధారంగా పొలంలోని వివిధ భాగాలకు సేద్యం చేసేందుకు ఇది వీలు కల్పిస్తుంది.
* లార్జ్ వాల్యూమ్ స్ప్రింక్లర్లు(రెయిన్ గన్స్): ఒకటి లేదా రెండు స్ప్రింక్లర్లతో ఎక్కువ విస్తీర్ణానికి నీటిని అందించాల్సిన చోట వీటిని ఉపయోగిస్తారు. గంటకు 10,000 లీటర్ల నుంచి 32,000 లీటర్ల వరకు నీటిని విడుదల చేస్తాయి. 24 మీటర్ల నుంచి 36 మీటర్ల వరకు నీటిని వెదజల్లగలవు. ఇవి పనిచేయడానికి అధిక ఒత్తిడి, ఎక్కువ నీటి విడుదల సామర్థ్యం కలిగిన పైపులు, పంపులు అవసరం. తక్కువ సమయంలో ఎక్కువ విస్తీర్ణంలోని పంటలకు నీటిని అందించేందుకు వీటికి ప్రాధాన్యం ఇస్తారు.
పీడీఎంసీ అమలు వ్యవస్థ
ప్రధానమంత్రి రాష్ట్రీయ కృషి వికాస్ యోజన కింద పీడీఎంసీ అమలవుతున్నందున ఆ పథక సమగ్ర సంస్థాగత వ్యవస్థనే అనుసరిస్తుంది. జాతీయ స్థాయిలో జాతీయ నిర్వహణ మండలి మార్గదర్శకత్వం, ప్రణాళికలకు వ్యూహాత్మక దిశను అందిస్తుంది.
రాష్ట్ర స్థాయిలో మూడంచెల వ్యవస్థ ద్వారా ఇది పనిచేస్తుంది. ఉన్నత స్థాయిలో రాష్ట్రస్థాయి మంజూరు కమిటీ ప్రణాళికలను ఆమోదిస్తుంది. వివిధ విభాగాల మధ్య ప్రణాళిక, అమలును అంతర్ విభాగ కార్యబృందం సమన్వయం చేస్తుంది.
జిల్లా స్థాయిలో జిల్లాస్థాయి అమలు కమిటీ కార్యాచరణను పర్యవేక్షించి, వివిధ విభాగాల మధ్య సమన్వయాన్ని నిర్ధారిస్తుంది.
ప్రభావ అంచనా అధ్యయనాలు
పీడీఎంసీ పథకం సానుకూల ప్రభావాన్ని స్వతంత్ర అధ్యయనాలు ప్రముఖంగా ప్రస్తావించాయి. 2020–21లో నీతి ఆయోగ్ చేపట్టిన మూల్యాంకనం పథకం జాతీయ ప్రాధాన్యాలకు అనుగుణంగా ఉందని గుర్తించింది. నీటి వినియోగ సామర్థ్యాన్ని మెరుగుపరచడం, పంట ఉత్పాదకతను పెంచడం, ఉపాధి కల్పించడం, రైతుల ఆదాయాన్ని పెంచడం ఇందులో ఉన్నాయి. రైతుల ఆదాయం 10 శాతం నుంచి 69 శాతం వరకు పెరిగినట్లు అధ్యయనం వెల్లడించింది. నీటి వినియోగ సామర్థ్యం 30 నుంచి 70 శాతం వరకు మెరుగుపడింది. ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలను కూడా ఈ పథకం సృష్టించింది.
అంతేకాకుండా సూక్ష్మ సేద్యం ద్వారా లభించిన భారీ వనరుల ప్రయోజనాలను 2020–21 ఆర్థిక సర్వే గణాంకాలతో వెల్లడించింది. 20 నుంచి 48 శాతం నీటి పొదుపు, 10 నుంచి 17 శాతం విద్యుత్ పొదుపు, 30 నుంచి 40 శాతం శ్రమ ఖర్చుల తగ్గింపు, 11 నుంచి 19 శాతం ఎరువుల పొదుపు నమోదైనట్లు సర్వే తెలిపింది. పంట దిగుబడి 20 నుంచి 38 శాతం వరకు పెరిగినట్లు కూడా పేర్కొంది. ఆరు రాష్ట్రాల్లో పథకం అమలును అంచనా వేస్తూ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ అహ్మదాబాద్(ఐఐఎంఏ) 2023లో నిర్వహించిన మరో అధ్యయనం... భూగర్భ జలమట్టాలు తగ్గడం, నిర్దిష్ట పంటల అవసరాలకు అనుకూలత, దీర్ఘకాలిక వ్యవసాయ ప్రయోజనాల కోసం రైతులు ప్రధానంగా సూక్ష్మ సేద్యాన్ని స్వీకరిస్తున్నట్లు నిర్ధారించింది.
వ్యవసాయానికి సమర్థంగా నీరు ఉండేలా భవిష్యత్తు నిర్మాణం
సూక్ష్మ సేద్య సాంకేతికతల ద్వారా నీటిని సమర్థంగా వినియోగించడాన్ని ప్రోత్సహిస్తూ పర్ డ్రాప్ మోర్ క్రాప్(పీడీఎంసీ) పథకం భారత సాగునీటి విధానంలో పరివర్తన తీసుకొచ్చింది. ఆధునిక సాగునీటి సదుపాయాలను విస్తరించడంతోపాటు నీటి వినియోగ సామర్థ్యం, పంట ఉత్పాదకత, రైతుల ఆదాయాన్ని మెరుగుపరిచింది.
పటిష్ఠమైన సంస్థాగత వ్యవస్థలు, డిజిటల్ అమలు, ఇతర ప్రభుత్వ కార్యక్రమాలతో సమన్వయం ద్వారా దేశవ్యాప్తంగా సుస్థిర సాగునీటి పద్ధతులను పీడీఎంసీ బలోపేతం చేసింది. భారత నీటి వనరులపై ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో వనరులను సమర్థంగా వినియోగించే సుస్థిర వ్యవసాయాన్ని ముందుకు తీసుకెళ్లడంలో పీడీఎంసీ కీలక పాత్ర పోషిస్తోంది.
References
Ministry of Agriculture & Farmers Welfare
https://pdmc.da.gov.in/
https://www.pmksy.gov.in/microirrigation/Archive/August2015.pdf
https://horticulturedept.ap.gov.in/Horticulture/NewSuccessStories.aspx
https://rkvy.da.gov.in/static/download/pdf/PM_RKVY_Guidelines_2024.pdf
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2179856®=3&lang=2
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2061649®=48&lang=2
https://sansad.in/getFile/loksabhaquestions/annex/186/AS23_qnphui.pdf?source=pqals
https://sansad.in/getFile/loksabhaquestions/annex/185/AU448_bMl0qu.pdf?source=pqals
https://sansad.in/getFile/loksabhaquestions/annex/182/AU2428_kPCRmr.pdf?source=pqals
https://www.pib.gov.in/PressNoteDetails.aspx?NoteId=159085&ModuleId=3®=17&lang=6
https://sansad.in/getFile/lsapps/loksabhaquestions/annex/187/AU3949_3xRqy3.pdf?source=lsapps
https://sansad.in/getFile/lsapps/loksabhaquestions/annex/184/AU2767_zvN42a.pdf?source=lsapps
https://www.iima.ac.in/sites/default/files/2024-09/3.%20Micro%20Irrigation_Final%20Report_2023_final_compressed_compressed_compressed_compressed.pdf
https://sansad.in/getFile/loksabhaquestions/annex/13/AU2359.pdf?source=pqals
Food and Agriculture Organisation
https://www.fao.org/4/a1336e/a1336e16.pdf
Government of Punjab
https://tupkasinchayee.punjab.gov.in/home/mischeme
Click here to see pdf
PIB Research
***
(Explainer ID: 159787)
आगंतुक पटल : 4
Provide suggestions / comments