Farmer's Welfare
ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన
ప్రతి రైతుకూ అందుబాటు ధరలో పంటల బీమా
Posted On:
29 AUG 2026 6:46PM
ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన (పీఎంఎఫ్‌బీవై) దేశవ్యాప్తంగా కరవు, వరదలు, తుపానులు, వడగళ్ల వానలు, చీడపీడలు, వ్యాధులు, విత్తనాలు వేయలేని పరిస్థితులు, స్థానిక విపత్తులు, నీటి ముంపు నష్టం, అకాల వర్షాలు, నిర్దేశిత కోత అనంతర నష్టాలకు సమగ్ర బీమా రక్షణ అందిస్తోంది. 2026–27కు ₹12,200 కోట్ల కేటాయింపుతో పీఎంఎఫ్‌బీవై రైతుల దృఢత్వాన్ని పెంచడం, జీవనోపాధిని రక్షించడం, ఆదాయాన్ని స్థిరీకరించడం, వాతావరణ మార్పులను తట్టుకునే వ్యవసాయానికి మద్దతు ఇవ్వడాన్ని కొనసాగిస్తోంది. ఖరీఫ్–2016లో పథకం ప్రారంభమైనప్పటి నుంచి రబీ–2025–26 వరకు పదేళ్లలో 92.46 కోట్లకు పైగా రైతు దరఖాస్తులకు బీమా రక్షణ కల్పించారు. 26.33 కోట్లకు పైగా రైతు దరఖాస్తులకు ₹2.06 లక్షల కోట్లకు మించిన పరిహారాన్ని చెల్లించారు. సాంకేతికత ఆధారిత దిగుబడి అంచనా వ్యవస్థ (యెస్–టెక్), వాతావరణ సమాచార నెట్‌వర్క్, డేటా వ్యవస్థ (విండ్స్) వంటి సాంకేతిక కార్యక్రమాల అనుసంధానం ద్వారా పరిహారాల పరిష్కారాన్ని వేగవంతంగా, న్యాయంగా, పారదర్శకంగా చేపడుతూ పథకాన్ని మరింత బలోపేతం చేశారు.
పంటల బీమాతో గ్రామీణ జీవనోపాధికి భరోసా
ప్రకృతి విపత్తులు, ప్రతికూల వాతావరణం, చీడపీడలు, వ్యాధుల కారణంగా ఏర్పడే పంట నష్టాల నుంచి రైతులను పంటల బీమా రక్షిస్తుంది. సకాలంలో అందే పరిహారం ఆదాయ నష్టాన్ని ఎదుర్కోవడానికి, పంట నష్టం నుంచి కోలుకోవడానికి, రుణాలు తిరిగి చెల్లించడానికి, తర్వాతి పంట కాలంలో పెట్టుబడి పెట్టడానికి రైతులకు తోడ్పడుతుంది. వ్యవసాయ దృఢత్వాన్ని పెంచి, జీవనోపాధిని రక్షించడంతోపాటు అనిశ్చిత పరిస్థితుల్లోనూ వ్యవసాయ ఉత్పత్తి కొనసాగేందుకు మద్దతు ఇస్తుంది.
అత్యధిక సంఖ్యలో రైతులను పంటల బీమా పరిధిలోకి తీసుకురావాలనే లక్ష్యంతో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనను (పీఎంఎఫ్‌బీవై) 2016 ఫిబ్రవరి 18న ప్రారంభించారు. విత్తనాలు వేయకముందు నుంచి పంట కోత తర్వాతి వరకు వివిధ దశల్లో ఎదురయ్యే నష్టాలకు ఇది రక్షణ కల్పిస్తుంది. విత్తనాలు వేయలేకపోవడం లేదా నాట్లు విఫలం కావడం, పంట మధ్య దశలో విస్తృతంగా ఎదురయ్యే ప్రతికూల పరిస్థితులు, వడగళ్ల వానలు, నీటి ముంపు, కొండచరియలు విరిగిపడటం వంటి స్థానిక విపత్తుల వల్ల వ్యక్తిగత భూకమతాలకు కలిగే నష్టం, తుపానులు, అకాల వర్షాలు, నిర్దేశిత ఇతర ముప్పుల కారణంగా పంట కోత తర్వాత ఏర్పడే నష్టాలు ఇందులో ఉన్నాయి. రైతులు విస్తృతంగా పాల్గొనేలా ప్రీమియం రేట్లను తక్కువగా, అందుబాటులో ఉంచారు. పంటల బీమా, రైతులకు రక్షణపై కొనసాగుతున్న నిబద్ధతను బలోపేతం చేస్తూ 2026–27 కేంద్ర బడ్జెట్‌లో పీఎంఎఫ్‌బీవైకి ప్రభుత్వం ₹12,200 కోట్లు కేటాయించింది.
పంట నష్టాలకు పీఎంఎఫ్‌బీవై ఆర్థిక రక్షణ కల్పించి, రైతుల ఆదాయాన్ని స్థిరీకరించేందుకు తోడ్పడుతుంది. ఆధునిక వ్యవసాయ పద్ధతులు, పంటల వైవిధ్యీకరణ, ఉత్పత్తి సంబంధిత ముప్పులను తట్టుకునే సామర్థ్యాన్ని కూడా ప్రోత్సహిస్తుంది.
ఆచరణలో పీఎంఎఫ్‌బీవై: రైతు దృఢత్వానికి నిదర్శనమైన కథ
అస్సాంలోని నాగావ్ జిల్లా చంఖాలా గ్రామానికి చెందిన చిన్న రైతు అన్వర్ హుస్సేన్ కుటుంబ జీవనోపాధి పూర్తిగా వ్యవసాయంపైనే ఆధారపడి ఉంది. భారీ వర్షాలతో పంటకు తీవ్ర నష్టం కలగడంతో రుణాలను తిరిగి చెల్లించడం, తర్వాతి పంటకు పెట్టుబడి సమకూర్చడం ఎలా అనే అనిశ్చితిని ఆయన ఎదుర్కొన్నారు.
అదృష్టవశాత్తూ అన్వర్ కేవలం ₹100 నామమాత్రపు ప్రీమియం చెల్లించి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనలో చేరారు. పంట నష్టాన్ని అంచనా వేసిన తర్వాత పథకం కింద ఆయనకు ₹50,600 పరిహారం లభించింది. సకాలంలో అందిన ఈ ఆర్థిక సహాయం నష్టం నుంచి కోలుకోవడానికి, రుణంలో కొంత భాగాన్ని తిరిగి చెల్లించడానికి, తర్వాతి సీజన్‌కు అవసరమైన ఉత్పాదకాలను కొనుగోలు చేయడానికి తోడ్పడింది. ఆర్థిక సంక్షోభంలో చిక్కుకోకుండా కొత్త ఆత్మవిశ్వాసంతో వ్యవసాయాన్ని కొనసాగించగలిగారు. సంక్షోభ సమయంలో పీఎంఎఫ్‌బీవై రక్షణ కవచంగా పనిచేస్తుందని చెబుతూ తన గ్రామంలోని ఇతర రైతులు కూడా పంటలకు బీమా చేయించుకోవాలని ప్రస్తుతం ఆయన గట్టిగా ప్రోత్సహిస్తున్నారు.

రైతులందరికీ సమ్మిళిత బీమా రక్షణ
నిర్దేశిత అర్హత నిబంధనలకు లోబడి కౌలు రైతులు, భాగస్వామ్య సాగుదారులతో సహా రైతులందరికీ పీఎంఎఫ్‌బీవై సమ్మిళిత పంటల బీమా రక్షణ అందిస్తోంది. రైతులకు బీమా చేయదగిన ప్రయోజనం ఉండాలి. రాష్ట్రాల వారీగా ముందే నిర్ణయించిన నిబంధనల ప్రకారం చెల్లుబాటయ్యే భూ పత్రాలు, కౌలు ఒప్పందాలు లేదా విత్తన ధ్రువపత్రాలు సమర్పించాలి. నిర్దేశిత గడువులోగా దరఖాస్తు చేసుకోవాలి. సమ్మిళిత ముప్పు రక్షణ కోసం వ్యవసాయ రంగంలోని రుణగ్రహీతలు, రుణం తీసుకోని రైతులిద్దరినీ పీఎంఎఫ్‌బీవై పరిధిలోకి తీసుకొచ్చారు.
* రుణం తీసుకోని రైతులు అంటే పంట రుణాలు లేనివారు లేదా ప్రామాణికం కాని కిసాన్ క్రెడిట్ కార్డు అనుసంధాన రుణాలు కలిగినవారు. పంటల బీమా కోసం వారు స్వచ్ఛందంగా పీఎంఎఫ్‌బీవైలో చేరవచ్చు. గత పదేళ్లలో మొత్తం రైతుల్లో సగటున 50 శాతం మంది రుణం తీసుకోని రైతులుగా స్వచ్ఛందంగా చేరారు. రైతుల్లో పథకంపై ఉన్న విశ్వాసానికి ఇది నిదర్శనం.
* రుణగ్రహీత రైతులు అంటే బ్యాంకులు లేదా ఆర్థిక సంస్థల నుంచి కాలానుగుణ పంట రుణాలు తీసుకుని, క్రియాశీలంగా ఉన్న ప్రామాణిక రుణాలు లేదా కిసాన్ క్రెడిట్ కార్డులు కలిగినవారు. సంబంధిత బ్యాంకులు వారి రుణ మొత్తం నుంచి ప్రీమియాన్ని స్వయంచాలకంగా మినహాయిస్తాయి.
* పంటకు బీమా చేసి, నిర్ణీత గడువులో సంబంధిత ప్రీమియాన్ని బీమా కంపెనీకి చెల్లించిన పక్షంలో పంట నష్టం లేదా పంట కోల్పోవడానికి దారితీసే అన్ని సహజ, వాతావరణ విపత్తులకు పీఎంఎఫ్‌బీవై సాధారణంగా సమగ్ర ముప్పు రక్షణ అందిస్తుంది. అయితే, నోటిఫై చేయని ప్రాంతాల్లో పంట నష్టాలు, బీమా పరిధిలోని పంట జీవన చక్రానికి వెలుపల(అంటే విత్తనాలు వేయకముందు లేదా పొలం నుంచి పంటను తరలించిన తర్వాత) కలిగే నష్టాలు, నిర్లక్ష్యం లేదా మానవ చర్యలు లేదా నివారించగల ముప్పుల కారణంగా ఏర్పడే నష్టాలకు రక్షణ వర్తించదు.

బీమా పరిధిలోని ముప్పులు
సాగు, పంట కోతలోని వివిధ దశల్లో కలిగే నష్టాలకు పీఎంఎఫ్‌బీవై రక్షణ అందిస్తుంది:
* దిగుబడి నష్టాలు(నోటిఫై చేసిన ప్రాంతం ఆధారంగా నిలిచిన పంటలకు): కరవు, వర్షాభావ పరిస్థితులు, వరదలు, నీటి ముంపు, తుపానులు, వడగళ్ల వానలు, పిడుగుపాటు, చీడపీడలు, వ్యాధులు వంటి నివారించలేని ముప్పులకు ప్రాంత ఆధారిత రక్షణ అందిస్తుంది.
* విత్తనాలు వేయలేని పరిస్థితి: బీమా కలిగిన రైతులు ఖర్చు చేసినప్పటికీ ప్రతికూల వాతావరణ పరిస్థితుల వల్ల విత్తనాలు వేయలేకపోతే బీమా మొత్తంలో గరిష్ఠంగా 25 శాతం వరకు పరిహారానికి అర్హులు.
* కోత అనంతర నష్టాలు: పొలంలో ఎండబెట్టడానికి ‘కోసి విస్తరించిన స్థితిలో’ ఉంచిన పంటలకు నిర్దేశిత తుపాను, అకాల వర్షాల కారణంగా కలిగే నష్టాలపై కోత తర్వాత 14 రోజుల వరకు బీమా రక్షణ ఉంటుంది.
* స్థానిక విపత్తులు: వడగళ్ల వానలు, కొండచరియలు విరిగిపడటం, నీటి ముంపు, మేఘ విస్ఫోటనం, సహజ అగ్నిప్రమాదం కారణంగా వ్యక్తిగత క్షేత్రస్థాయిలో కలిగే నష్టాలకు నిర్దేశిత నిబంధనల ప్రకారం రక్షణ లభిస్తుంది.
అయితే యుద్ధం, అణు ముప్పులు, అల్లర్లు, దొంగతనం, నిర్దేశిత కోత అనంతర పరిస్థితులు, నివారించగల ఇతర ముప్పుల వల్ల కలిగే నష్టాలు పీఎంఎఫ్‌బీవై పరిధిలోకి రావు.
పీఎంఎఫ్‌బీవై ప్రగతి, విజయాలు
ఇటీవలి సంవత్సరాల్లో రైతుల భాగస్వామ్యం, బీమా రక్షణ, సంస్థాగత విస్తృతిలో పీఎంఎఫ్‌బీవై గణనీయ ప్రగతి సాధించింది. ఖరీఫ్ ఆహార ధాన్యాలు, నూనెగింజల పంటలకు రైతులు గరిష్ఠంగా 2 శాతం, రబీ పంటలకు 1.5 శాతం ప్రీమియం చెల్లిస్తారు. వాణిజ్య, ఉద్యాన పంటలకు గరిష్ఠ ప్రీమియం 5 శాతం. మిగిలిన ప్రీమియాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 50:50 నిష్పత్తిలో రాయితీగా భరిస్తాయి. ఈశాన్య, హిమాలయ రాష్ట్రాలు లేదా కేంద్రపాలిత ప్రాంతాల్లోని రైతులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల రాయితీ వాటా 90:10 నిష్పత్తిలో ఉంటుంది. అందుబాటు ప్రీమియం విధానం దేశవ్యాప్తంగా రైతుల విస్తృత వర్గాలకు పంటల బీమాను చేరువ చేసింది.

* ఖరీఫ్–2026లో ప్రస్తుతం 25 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో పీఎంఎఫ్‌బీవై అమలవుతోంది.
* పథకం ప్రారంభమైనప్పటి నుంచి 92.46 కోట్లకు పైగా రైతు దరఖాస్తులకు బీమా రక్షణ కల్పించారు. 26.33 కోట్లకు పైగా రైతు దరఖాస్తులకు ₹2.06 లక్షల కోట్లకు మించిన పరిహారం అందింది.
* ఖరీఫ్–2025లో 269.38 లక్షల హెక్టార్లకు సంబంధించి 229.77 లక్షల మంది రైతులకు పంటల బీమా రక్షణ కల్పించారు. పంట సంబంధిత ముప్పుల నుంచి వారికి భరోసా లభించింది. ఖరీఫ్–2026లో నమోదైన రైతుల సంఖ్య, బీమా పరిధిలోని విస్తీర్ణం ఇప్పటికే ఖరీఫ్–2025 స్థాయిని అధిగమించాయి. 2026 ఆగస్టు 27 నాటికి 278.12 లక్షల హెక్టార్లకు సంబంధించి 241.38 లక్షల మంది రైతులకు బీమా రక్షణ కల్పించారు. పంటల బీమా నిరంతర విస్తృతిని ఇది ప్రతిబింబిస్తోంది.
* ఖరీఫ్–2025కు సంబంధించి అర్హులైన 60.89 లక్షల మంది రైతులకు ₹9,837.61 కోట్ల పరిహారాన్ని ఇప్పటికే చెల్లించారు. పంట నష్టాలను ఎదుర్కొనేందుకు ఇది కీలక ఆర్థిక సహాయాన్ని అందించింది.
* 2024–25లో జాతీయ స్థాయి నమోదులు రికార్డు స్థాయికి చేరాయి. 4 కోట్లకు పైగా రైతులకు సంబంధించిన 15.23 కోట్లకు మించిన దరఖాస్తులకు బీమా రక్షణ కల్పించగా, 623 లక్షల హెక్టార్లకు పైగా విస్తీర్ణాన్ని బీమా పరిధిలోకి తీసుకొచ్చారు.
* కౌలు రైతులు, భాగస్వామ్య సాగుదారులకు పథకంలో రక్షణ ఉంది. 2018 నుంచి రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో కలిపి 1.44 కోట్లకు పైగా అటువంటి రైతులు నమోదయ్యారు.
రాష్ట్రాల వారీ ప్రగతి, ముఖ్యాంశాలు
ప్రధాన రాష్ట్రాల పునరాగమనం.. పెరుగుతున్న విశ్వాసానికి నిదర్శనం
గతంలో పథకం నుంచి వైదొలిగిన లేదా సొంతంగా బీమాయేతర పంట నష్ట సహాయ పథకాలను ప్రారంభించిన ప్రధాన వ్యవసాయ రాష్ట్రాలు పీఎంఎఫ్‌బీవైలోకి తిరిగి వస్తున్నాయి. పీఎంఎఫ్‌బీవై వ్యవస్థపై రాష్ట్ర ప్రభుత్వాల విశ్వాసం గణనీయంగా పెరిగినట్లు ఈ క్రమబద్ధ పునరాగమనం సూచిస్తోంది.
* ఆంధ్రప్రదేశ్ 2022 ఖరీఫ్ నుంచి తిరిగి చేరింది.
* ఝార్ఖండ్ 2024 ఖరీఫ్ నుంచి తిరిగి చేరింది.
* పశ్చిమ బెంగాల్ 2026 ఖరీఫ్ నుంచి తిరిగి చేరింది.
* బిహార్ జాతీయ పథక పరిధిలోకి తిరిగి రావాలని నిర్ణయించి, రబీ–2026–27 నుంచి పీఎంఎఫ్‌బీవై అమలు చేపట్టనుంది.
ప్రాంతీయ బీమాయేతర సహాయ నమూనాలతో పోలిస్తే కేంద్రీకృత పథకం అందించే అసమాన సామర్థ్యం, ఆర్థిక రక్షణ కవచాన్ని ఈ పునరాగమన పరిణామం స్పష్టం చేస్తోంది.
మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక విధానం నిలిపివేత ప్రభావం
ప్రాంతీయ నమోదు ధోరణులను వివరంగా పరిశీలిస్తే 2025–26 సీజన్‌లో బీమా పొందిన రైతు దరఖాస్తుల సంఖ్య జాతీయ స్థాయిలో స్వల్పంగా తగ్గడానికి ప్రధానంగా మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ కారణమని తెలుస్తోంది. పథకంపై రైతుల విశ్వాసం విస్తృతంగా తగ్గిందని ఇది సూచించదు. అమలు విధానంలో వచ్చిన మార్పే దీనికి కారణం.
* రెండు రాష్ట్రాలు 2023, 2024లో ‘సార్వత్రిక విధానాన్ని’ అమలు చేశాయి. రైతులందరి తరఫున రాష్ట్ర ప్రభుత్వమే ప్రీమియం మొత్తాన్ని పూర్తిగా భరించడంతో ఖరీఫ్–2024లో నమోదులు అత్యధికంగా ఉన్నాయి.
* 2025లో రైతుల ప్రీమియంపై 100 శాతం రాయితీ విధానాన్ని రెండు రాష్ట్రాలు నిలిపివేశాయి. ఫలితంగా ఊహించినట్లే రైతుల నమోదులు తగ్గాయి:
- ఖరీఫ్–2025లో ఆంధ్రప్రదేశ్‌లో రైతుల నమోదు 77 శాతం తగ్గింది. ఖరీఫ్–2024లో 31.92 లక్షలుగా ఉన్న సంఖ్య ఖరీఫ్–2025లో 7.43 లక్షలకు తగ్గింది. ఖరీఫ్–2026లో ఈ ధోరణి మారింది. 2026 ఆగస్టు 28 నాటికి 16.22 లక్షల మంది రైతులు నమోదయ్యారు. ఖరీఫ్–2025తో పోలిస్తే ఇది 108 శాతం పెరుగుదల.
- ఇదే విధంగా ఖరీఫ్–2025లో మహారాష్ట్రలో రైతుల నమోదు 40 శాతం తగ్గింది. ఖరీఫ్–2024లో 76.59 లక్షలుగా ఉన్న సంఖ్య ఖరీఫ్–2025లో 45.99 లక్షలకు తగ్గింది. ఖరీఫ్–2026లో 2026 ఆగస్టు 28 నాటికి 42.55 లక్షల మంది రైతులు నమోదయ్యారు. ఖరీఫ్–2025 నమోదుల్లో 92 శాతాన్ని చేరుకున్నారు. కొన్ని అదనపు పరిహారాలను రాష్ట్రం పథకం నుంచి మినహాయించడంతో ఈ స్వల్ప తగ్గుదల కనిపించింది.
ఇతర ప్రధాన రాష్ట్రాల్లో స్థిరమైన, బలమైన వృద్ధి
రాష్ట్రాల వారీగా అమలు చేసిన విధాన మార్పులతో కొన్ని ప్రాంతాల్లో నమోదులు తగ్గినప్పటికీ, ఇతర ప్రధాన వ్యవసాయ రాష్ట్రాల్లో ఖరీఫ్–2025లో రైతుల నమోదులో బలమైన వృద్ధి నమోదైంది:
* ఉత్తరప్రదేశ్ అత్యధికంగా 35 శాతం వృద్ధితో అగ్రస్థానంలో నిలిచింది. బీమా పొందిన రైతుల సంఖ్య 15.48 లక్షల నుంచి 20.84 లక్షలకు పెరిగింది.
* హరియాణా స్థిరమైన వృద్ధిని కొనసాగిస్తూ 20 శాతం పెరుగుదల నమోదు చేసింది. ఖరీఫ్–2024లో 3.75 లక్షల మంది రైతులకు బీమా ఉండగా, ఖరీఫ్–2025లో 4.49 లక్షల మంది రైతులకు రక్షణ కల్పించింది. 2023–2024 మధ్య నమోదైన 82 శాతం అసాధారణ వృద్ధికి ఇది కొనసాగింపు.
* రాజస్థాన్‌లో బీమా పొందిన రైతుల సంఖ్య 30.59 లక్షల నుంచి 36.45 లక్షలకు పెరిగి 19 శాతం వృద్ధి నమోదైంది.
మధ్యప్రదేశ్‌లో 12 శాతం వృద్ధితో బీమా పొందిన రైతుల సంఖ్య 26.80 లక్షలకు చేరింది.
* ఛత్తీస్‌గఢ్‌లో బీమా పొందిన రైతుల సంఖ్య 9 శాతం పెరిగి 15.75 లక్షలకు చేరింది.
* ఒడిశాలో 5 శాతం వృద్ధితో బీమా పొందిన రైతుల సంఖ్య 24.92 లక్షలకు చేరింది.
భారత ప్రధాన వ్యవసాయ ప్రాంతాల్లో వ్యవసాయ ముప్పు రక్షణ కోసం రైతుల నుంచి స్వచ్ఛందంగా బలమైన గిరాకీ ఉందని ఈ స్థిరమైన సానుకూల వృద్ధి ధోరణులు వెల్లడిస్తున్నాయి.
పీఎంఎఫ్‌బీవై అమలు బలోపేతానికి ప్రభుత్వ కీలక కార్యక్రమాలు
పారదర్శకమైన, సకాలంలో, కచ్చితమైన పంటల బీమా సేవలను అందించే పటిష్ఠమైన డిజిటల్, పాలనా వ్యవస్థ ద్వారా పీఎంఎఫ్‌బీవై అమలవుతోంది.
* జాతీయ పంటల బీమా పోర్టల్ (ఎన్‌సీఐపీ): రైతుల డిజిటల్ నమోదు, రాయితీల నిర్వహణ, సమన్వయం, సమాచార వ్యాప్తికి వీలు కల్పిస్తుంది. బీమా పొందిన రైతుల వివరాలను తెలుసుకోవడం, అర్హత గల పరిహారాన్ని లెక్కించడం, రైతుల బ్యాంకు ఖాతాలకు నేరుగా పరిహారాన్ని ఎలక్ట్రానిక్ విధానంలో బదిలీ చేయడానికి కూడా తోడ్పడుతుంది.
* ఎన్‌సీఐపీతో భూ రికార్డుల అనుసంధానం: రాష్ట్రాల ఎలక్ట్రానిక్ భూ రికార్డుల ద్వారా బీమా పరిధిలోని విస్తీర్ణాన్ని ధ్రువీకరించడానికి వీలు కల్పిస్తుంది. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్, కర్ణాటక, హరియాణా, హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఒడిశాలో భూ రికార్డుల డిజిటల్ ధ్రువీకరణ అమలవుతోంది. భూకమతం, బీమా విస్తీర్ణం, రైతును సరిగ్గా గుర్తించేందుకు ఈ రాష్ట్రాల్లో బీమా పరిధిలోని దాదాపు 85 శాతం విస్తీర్ణాన్ని సమీకృత భూ రికార్డుల ద్వారా ధ్రువీకరిస్తున్నారు.
* డిజిక్లెయిమ్ మాడ్యూల్: ఖరీఫ్–2022 నుంచి ప్రవేశపెట్టిన ఈ వ్యవస్థ ఎన్‌సీఐపీలో పరిహారాన్ని పారదర్శకంగా లెక్కించి, పరిష్కరించడానికి వీలు కల్పిస్తుంది. ఎన్‌సీఐపీ ద్వారా పరిహార దరఖాస్తులను పరిశీలించి, ప్రజా ఆర్థిక నిర్వహణ వ్యవస్థ ద్వారా చెల్లింపులు చేస్తారు. రైతు స్థాయి వరకు పరిహార ప్రక్రియ మొత్తాన్ని పర్యవేక్షించడానికి కూడా ఇది వీలు కల్పిస్తుంది. ప్రారంభమైనప్పటి నుంచి డిజిటల్ వేదిక ద్వారా ₹55,000 కోట్లకు పైగా పరిహారాన్ని లెక్కించి చెల్లించారు.
* పంట కోత ప్రయోగం(సీసీఈ)–అగ్రి యాప్: పంట కోత ప్రయోగాల ద్వారా లభించే దిగుబడి సమాచారాన్ని డిజిటల్ పద్ధతిలో నమోదు చేసి, ఎన్‌సీఐపీలో అప్‌లోడ్ చేయడానికి వీలు కల్పిస్తుంది. ఈ సమాచారంతో బీమా యూనిట్ వాస్తవ దిగుబడిని లెక్కిస్తారు. దాని ఆధారంగా పంట దిగుబడి నష్టానికి చెల్లించాల్సిన అర్హత గల పరిహారాన్ని నిర్ణయిస్తారు. పంట కోత ప్రయోగాలను బీమా కంపెనీలు ప్రత్యక్షంగా పరిశీలించేందుకు కూడా ఇది వీలు కల్పిస్తుంది. తద్వారా పారదర్శకత పెరిగి, పరిహారాన్ని సకాలంలో పరిష్కరించడానికి తోడ్పడుతుంది.

పంటల బీమా సేవలను బలోపేతం చేస్తున్న డిజిటల్ ఆవిష్కరణలు
పీఎంఎఫ్‌బీవై డిజిటల్ వేదిక రైతులు, బీమా సంస్థలు, ఆర్థిక సంస్థలు, ప్రభుత్వ విభాగాలను ఒకే సమాచార సాంకేతిక వ్యవస్థలో అనుసంధానిస్తుంది. తక్షణ సమాచార మార్పిడి, పారదర్శక నిర్వహణ, క్రమబద్ధమైన పంటల బీమా సేవలకు వీలు కల్పిస్తుంది. ప్రాంతం, పంట, పథకానికి సంబంధించిన నోటిఫికేషన్లను పోర్టల్ డిజిటలీకరిస్తుంది. మానవ ప్రమేయంతో జరిగే ప్రక్రియలను తగ్గించి, ముఖ్యంగా మారుమూల ప్రాంతాలు, ఆర్థికంగా బలహీన వర్గాల రైతులకు బీమాను మరింత చేరువ చేస్తుంది.
* సాంకేతికత ఆధారిత దిగుబడి అంచనా వ్యవస్థ(యెస్ టెక్): న్యాయమైన, కచ్చితమైన పంట దిగుబడి అంచనాలను అందించేందుకు రిమోట్ సెన్సింగ్, సాంకేతిక ఆధారిత పద్ధతులను ఉపయోగిస్తుంది. ఖరీఫ్–2023లో వరి, గోధుమ పంటలకు దీన్ని ప్రారంభించారు. ఖరీఫ్–2024లో సోయాబీన్‌కు విస్తరించారు. తొలుత యెస్–టెక్ ద్వారా అంచనా వేసిన దిగుబడులకు కనీసం 30 శాతం వెయిటేజీ ఇవ్వగా, ప్రస్తుతం కొన్ని రాష్ట్రాల్లో దాన్ని 50 శాతం వరకు పెంచారు.
* వాతావరణ సమాచార నెట్‌వర్క్, డేటా వ్యవస్థ(విండ్స్): బ్లాక్, గ్రామ పంచాయతీ స్థాయుల్లో అత్యంత స్థానిక వాతావరణ సమాచారాన్ని సేకరించేందుకు స్వయంచాలక వాతావరణ కేంద్రాలు, స్వయంచాలక వర్షమాపకాలను ఉపయోగిస్తుంది. పండ్లు, కూరగాయలు, తోట పంటల కోసం వాతావరణ ఆధారిత పంటల బీమా పథకం అమలు; యెస్–టెక్ ద్వారా పంట దిగుబడి అంచనా; విపత్తు నిర్వహణ; వాతావరణ అంచనా; పరామితుల ఆధారిత ఇతర బీమా ఉత్పత్తులకు ఈ సమాచారం మద్దతు ఇస్తుంది.
* పంటల తక్షణ చిత్రాలు, పరిశీలనల సేకరణ(క్రోపిక్): నిర్దిష్ట బీమా యూనిట్‌లో సాధారణ పంట ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు ధ్రువీకరించేందుకు భౌగోళిక గుర్తింపుతో కూడిన ఛాయాచిత్రాలను ఉపయోగిస్తుంది. చిత్ర విశ్లేషణ ద్వారా పంట నష్టం అంచనా, దిగుబడి నిర్ధారణకు కూడా ఇది తోడ్పడాలని ప్రతిపాదించారు. ఇందుకు దేశవ్యాప్త ప్రయోగాత్మక కార్యక్రమాలను ప్రారంభించే ప్రక్రియ కొనసాగుతోంది.
* కృషి రక్షక్ పోర్టల్, సహాయవాణి: రైతులు ఫిర్యాదులను నమోదు చేయడానికి, సహాయం కోరడానికి, పంటల బీమా సమస్యల పరిష్కార పురోగతిని తెలుసుకోవడానికి ప్రత్యేక టోల్‌ఫ్రీ సహాయవాణి(14447)ను అందిస్తోంది. 2024 జనవరిలో దేశవ్యాప్తంగా దీన్ని ప్రారంభించారు. అప్పటి నుంచి బీమా పొందిన రైతులకు సంబంధించిన 26.12 లక్షల ఫిర్యాదులను 99.66 శాతం పరిష్కార రేటుతో పరిష్కరించారు.
* అభ్యాస నిర్వహణ వ్యవస్థ(ఎల్ఎంఎస్): డిజిటల్ వేదిక ద్వారా భాగస్వాముల్లో పంటల బీమాపై పరిజ్ఞానం, అవగాహనను విస్తరిస్తుంది. మధ్యవర్తుల నమోదు యాప్(ఎయిడ్) ద్వారా రుణం తీసుకోని రైతులను వారి ఇంటి వద్దే నమోదు చేయవచ్చు. బీమా మధ్యవర్తుల ద్వారా పంటల బీమాను మరింత చేరువ చేస్తుంది. ఇదే విధంగా పంట నష్టం అంచనా యాప్(క్లాప్)ను స్థానిక విపత్తుల కింద వ్యక్తిగత క్షేత్రస్థాయిలో పంట నష్టం పరిధిని డిజిటల్ విధానంలో నమోదు చేయడానికి ఉపయోగిస్తున్నారు. పంట నష్టం సర్వేల ద్వారా సమాచారం సేకరించి, పరిహారాన్ని వేగంగా, పారదర్శకంగా లెక్కించి పరిష్కరించడానికి ఇది వీలు కల్పిస్తుంది.
రైతుల వేగవంతమైన నమోదు, కచ్చితమైన నష్టం అంచనా, సకాలంలో పరిహార పరిష్కారం, సమర్థమైన ఫిర్యాదుల పరిష్కారానికి వీలు కల్పిస్తూ ఈ సాంకేతిక చర్యలు పీఎంఎఫ్‌బీవైలో కీలక మార్పు తీసుకొచ్చాయి.
పునర్వ్యవస్థీకరించిన వాతావరణ ఆధారిత పంటల బీమా పథకం(ఆర్‌డబ్ల్యూబీసీఐఎస్)
పీఎంఎఫ్‌బీవైకి అనుబంధంగా ప్రతికూల వాతావరణ పరిస్థితుల నుంచి తలెత్తే ముప్పులను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం పునర్వ్యవస్థీకరించిన వాతావరణ ఆధారిత పంటల బీమా పథకాన్ని (ఆర్‌డబ్ల్యూబీసీఐఎస్) అమలు చేస్తోంది. ఇది వాతావరణ సూచీ ఆధారిత పథకం. వాస్తవంగా అంచనా వేసిన పంట దిగుబడి నష్టాలకు బదులుగా నిర్దేశిత వాతావరణ ప్రమాణాలను పంట నష్టానికి ప్రత్యామ్నాయ సూచికగా ఉపయోగించి అర్హత గల పరిహారాన్ని నిర్ణయిస్తారు. ఈ పథకంలో పంట జీవన చక్రాన్ని మొక్క పెరుగుదల సంబంధిత ప్రత్యేక దశలుగా విభజిస్తారు. ప్రతి దశలో పంటకు ఉండే నష్టం ముప్పు ఆధారంగా బీమా మొత్తాన్ని కేటాయిస్తారు.
నిర్దేశిత ప్రామాణిక యూనిట్ ప్రాంతాల్లో ఈ పథకం ‘ప్రాంత విధానం’ ఆధారంగా పనిచేస్తుంది. నోటిఫై చేసిన స్థానిక వాతావరణ కేంద్రాల్లో కొలిచిన వర్షపాతం లోటు లేదా అధిక వర్షపాతం, వర్షాభావ కాలాలు, తీవ్ర ఉష్ణోగ్రతలు, తేమ, గాలి వేగం వంటి గణించదగిన వాతావరణ అంశాలు ముందుగా నిర్ణయించిన పరిమితులను దాటినప్పుడు పరిహారం చెల్లిస్తారు. వడగళ్ల వానలు, మేఘ విస్ఫోటనాల వంటి తీవ్రమైన స్థానిక ముప్పులకు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు అదనపు క్షేత్రస్థాయి రక్షణను కూడా అందించవచ్చు. పంట రకాన్ని బట్టి పీఎంఎఫ్‌బీవై తరహాలోనే 1.5 శాతం నుంచి 5 శాతం వరకు అందుబాటు ప్రీమియం రేట్లు ఉండటంతో పండ్లు, కూరగాయలు, తోట పంటలకు ఈ పథకం ఎంతో ఆదరణ పొందిన రక్షణ కవచంగా కొనసాగుతోంది. ఖరీఫ్–2026లో 12.31 లక్షల హెక్టార్లకు సంబంధించిన 25.95 లక్షల రైతు దరఖాస్తులకు ఇది బీమా రక్షణ కల్పించింది.
పీఎంఎఫ్‌బీవైతో వ్యవసాయ ముప్పు నిర్వహణలో పరివర్తన
గత దశాబ్దంలో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన(పీఎంఎఫ్‌బీవై) భారత వ్యవసాయ ముప్పు నిర్వహణ వ్యవస్థకు కీలక స్తంభంగా అవతరించింది. వాతావరణ మార్పులు, తీవ్ర వాతావరణ ఘటనలు, జీవ సంబంధిత ముప్పుల నుంచి కోట్లాది రైతులకు ఆర్థిక భద్రత కల్పిస్తోంది. అందుబాటు ప్రీమియంతో పంట జీవన చక్రం మొత్తానికి సమగ్ర రక్షణను కలిపి అందించడం ద్వారా ఆదాయ నష్టాల పట్ల రైతుల దుర్బలతను తగ్గించింది. ఆధునిక ఉత్పాదకాలు, మెరుగైన విత్తనాలు, ఉత్తమ వ్యవసాయ పద్ధతుల్లో పెట్టుబడి పెట్టే వారి సామర్థ్యాన్ని కూడా బలోపేతం చేసింది.
ఎన్‌సీఐపీ, డిజిక్లెయిమ్, సీసీఈ అగ్రి యాప్, క్లాప్, యెస్–టెక్, విండ్స్ వంటి డిజిటల్ వేదికలు, కార్యక్రమాలు పీఎంఎఫ్‌బీవై కింద పరిహార పరిష్కారంలో పారదర్శకత, కచ్చితత్వం, వేగాన్ని పెంచాయి. ఈ సాంకేతికతలు పథకాన్ని మరింత సమర్థంగా, జవాబుదారీతనంతో పనిచేసేలా చేశాయి. వాతావరణ మార్పులను తట్టుకునే వ్యవసాయం దిశగా భారత్ ముందుకు సాగుతున్న నేపథ్యంలో రైతుల జీవనోపాధిని రక్షించడం, వ్యవసాయ రంగ దృఢత్వాన్ని పెంపొందించడం, జాతీయ ఆహార భద్రతను బలోపేతం చేయడంలో పీఎంఎఫ్‌బీవై రాబోయే సంవత్సరాల్లోనూ కీలక పాత్ర పోషించేందుకు సన్నద్ధంగా ఉంది.
References
Ministry of Agriculture and Farmers Welfare
https://pmfby.gov.in/pdf/New%20Schemes-english_.pdf
https://agriwelfare.gov.in/en/CropInsurance
https://www.myscheme.gov.in/schemes/pmfby
https://agriwelfare.gov.in/en/CropInsurance
https://www.pib.gov.in/PressReleseDetail.aspx?PRID=2097959®=3&lang=1
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2089250®=3&lang=2
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2148513®=3&lang=2
Microsoft Word - lu431
https://sansad.in/getFile/loksabhaquestions/annex/186/AU1610_Vz2gT8.pdf?source=pqals
https://sansad.in/getFile/loksabhaquestions/annex/184/AU269_UCTI1z.pdf?source=pqals
https://sansad.in/getFile/loksabhaquestions/annex/186/AU2752_K8yh1l.pdf?source=pqalshttps://sansad.in/getFile/loksabhaquestions/annex/186/AU2582_mUayeg.pdf?source=pqals
https://sansad.in/getFile/loksabhaquestions/annex/186/AU2608_FGMVt9.pdf?source=pqals
https://sansad.in/getFile/loksabhaquestions/annex/187/AU496_DO5aVo.pdf?source=pqals
https://sansad.in/getFile/loksabhaquestions/annex/184/AU431_EwtiAQ.pdf?source=pqals
https://sansad.in/getFile/loksabhaquestions/annex/184/AU431_EwtiAQ.pdf?source=pqalsHhttps://www.myscheme.gov.in/schemes/pmfby
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2004173®=48&lang=2
https://agriwelfare.gov.in/en/CropInsurance
https://pmfby.gov.in/pdf/New%20Schemes-english_.pdf
https://sansad.in/getFile/loksabhaquestions/annex/186/AU2582_mUayeg.pdf?source=pqals
https://pmfby.gov.in/adminStatistics/dashboard
https://pmfby.gov.in/aboutUs
https://pmfby.gov.in/pdf/RWBCIS_Revised_Guidelines_1.pdf
Ministry of Finance
https://www.indiabudget.gov.in/doc/eb/allsbe.pdf
Success Story
https://www.youtube.com/watch?v=sXEjHod1ltY
PIB Backgrounders
https://www.pib.gov.in/PressNoteDetails.aspx?id=155010&NoteId=155010&ModuleId=3®=3&lang=2
https://www.pib.gov.in/FactsheetDetails.aspx?ModuleId=16&NoteId=150838&id=150838&lang=2®=48&utm_source
Click here to see PDF
***
(Explainer ID: 159786)
आगंतुक पटल : 9
Provide suggestions / comments