Culture & Tourism

వారసత్వ సంప‌ద‌కు అస‌లైన గుర్తింపు

ప్రపంచ వారసత్వ జాబితా దిశగా సారనాథ్ ప్రయాణం

Posted On: 26 AUG 2026 11:59AM

దక్షిణ కొరియాలోని బుసాన్‌లో జరిగిన ప్రపంచ వారసత్వ కమిటీ 48వ సమావేశంలో సారనాథ్‌ ప్రాచీన బౌద్ధ క్షేత్రాన్ని యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో చేర్చడంతో భారత సుసంపన్న సాంస్కృతిక వారసత్వానికి మరో అంతర్జాతీయ గుర్తింపు లభించింది. బుద్ధ భగవానుడు తొలి బోధన చేసిన ప్రదేశమైన సారనాథ్‌... ఆయన జీవితంతో ముడిపడిన నాలుగు ప్రధాన బౌద్ధ పుణ్యక్షేత్రాల్లో ఒకటి. ఈ గుర్తింపుతో భారత్‌లోని యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాల సంఖ్య 45కు చేరింది. దీంతో ప్రపంచంలో ఆరో స్థానం, ఆసియా పసిఫిక్ ప్రాంతంలో రెండో స్థానంలో భారత్ నిలిచింది. బౌద్ధమత జన్మభూమిగా భారత గుర్తింపును ఈ పరిణామం మరింత బలోపేతం చేసింది. అసాధారణ విశ్వవ్యాప్త విలువ కలిగిన వారసత్వాన్ని పరిరక్షించాలన్న దేశ నిబద్ధతను కూడా పునరుద్ఘాటించింది.

 

భారత వారసత్వ ప్రస్థానంలో మైలురాయి

 

వారసత్వం గతాన్ని గుర్తుచేసే చిహ్నం మాత్రమే కాదు. అది వర్తమానాన్ని తీర్చిదిద్ది, భవిష్యత్తుకు దిశానిర్దేశం చేస్తుంది. సమాజాలు తరతరాలుగా పరిరక్షిస్తూ ముందుకు తీసుకెళ్తున్న కథలు, సంప్రదాయాలు, విలువలను ప్రతిబింబిస్తుంది. సాంస్కృతిక, సహజ వారసత్వ సంపదలు గుర్తింపు, విజ్ఞానం, స్ఫూర్తికి వెలకట్టలేని వనరులు.

 

2026 జూలై 25 సాయంత్రం, దక్షిణ కొరియాలోని బుసాన్‌లో జరిగిన ప్రపంచ వారసత్వ కమిటీ 48వ సమావేశంలో సారనాథ్‌ ప్రాచీన బౌద్ధ క్షేత్రం యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో చోటు దక్కించుకుంది. దీంతో యునెస్కో గుర్తింపు పొందిన భారత ప్రపంచ వారసత్వ ప్రదేశాల సంఖ్య 45కు చేరింది.

 

ఈ గుర్తింపు ప్రపంచ వారసత్వ జాబితాలో చేరిన మరో ప్రదేశానికి మాత్రమే పరిమితం కాదు. వైవిధ్యభరిత సంప్రదాయాలు, విశిష్ట నిర్మాణశైలి, సుదీర్ఘ చరిత్రతో రూపుదిద్దుకున్న భారత సుసంపన్న సాంస్కృతిక వారసత్వానికి లభించిన గౌరవం. ప్రస్తుత, భవిష్యత్ తరాల ప్రయోజనం కోసం 196 భాగస్వామ్య దేశాల్లో అసాధారణ విశ్వవ్యాప్త విలువ కలిగిన ప్రదేశాలను పరిరక్షించాలని ప్రపంచ వారసత్వ ఒప్పందం నిర్దేశించిన స్ఫూర్తిని కూడా ఇది బలోపేతం చేస్తుంది.

 

యునెస్కోగా ప్రసిద్ధి చెందిన ఐక్యరాజ్య సమితి విద్యా, వైజ్ఞానిక, సాంస్కృతిక సంస్థ మానవాళికి అసాధారణ విలువ కలిగిన సాంస్కృతిక, సహజ వారసత్వాన్ని గుర్తించడం, రక్షించడం, పరిరక్షించడాన్ని ప్రోత్సహిస్తుంది. 1972లో యునెస్కో ఆమోదించిన ప్రపంచ సాంస్కృతిక, సహజ వారసత్వ పరిరక్షణ ఒప్పందం ఈ నిబద్ధతకు పునాది.

 

2026 జూలై నాటికి యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో 173 దేశాలకు చెందిన 1,273 ప్రదేశాలు ఉన్నాయి. వీటిలో 991 సాంస్కృతిక, 240 సహజ, 42 మిశ్రమ ప్రదేశాలు ఉన్నాయి. 2024 అక్టోబర్ నాటికి 196 భాగస్వామ్య దేశాలు ప్రపంచ వారసత్వ ఒప్పందాన్ని ఆమోదించాయి. ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థల ఒప్పందాల్లో అత్యంత ఆదరణ, గుర్తింపు పొందిన ఒప్పందాల్లో ఇది ఒకటిగా నిలిచింది.

 

ప్రపంచ వారసత్వ భావన జాతీయ సరిహద్దులను అధిగమిస్తుంది కాబట్టి దీనికి ప్రత్యేకత ఉంది. ఈ ప్రదేశాలు ఆయా దేశాల భూభాగాల్లోనే ఉన్నప్పటికీ, వాటి ప్రాధాన్యం మొత్తం మానవాళికి చెందుతుంది. రాబోయే తరాల కోసం సమష్టిగా సంరక్షించి, రక్షించాల్సిన ఉమ్మడి వారసత్వంగా వీటిని గుర్తిస్తారు.

 

సారనాథ్ కథ

 

బౌద్ధ సంప్రదాయంలో సారనాథ్‌కు విశిష్ట స్థానం ఉంది. ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో ఉన్న సార‌నాథ్‌.. నాలుగు ప్రధాన బౌద్ధ పుణ్యక్షేత్రాల్లో ఒకటి. యునెస్కో ప్రపంచ వారసత్వ గుర్తింపులో పరస్పరం అనుసంధానమైన చౌఖండీ స్తూపం, సారనాథ్ పురావస్తు అవశేషాలు ఉన్నాయి. పురావస్తు సముదాయంలో ధమేఖ్ స్తూపం, ధర్మరాజిక స్తూపం, మూలగంధకుటి విహారం, అశోక స్తంభంతోపాటు అనేక ఇతర ప్రాచీన అవశేషాలు ఉన్నాయి. ఇవన్నీ సమష్టిగా ఈ ప్రాచీన క్షేత్ర చారిత్రకత‌ను పరిరక్షిస్తున్నాయి.

 

బౌద్ధ సంప్రదాయంలో రిషిపటణం, ఇసిపటణం, మృగదావగా ప్రసిద్ధి చెందిన సారనాథ్‌లోనే గౌతమ బుద్ధుడు క్రీ.పూ. 6వ శతాబ్దంలో తన తొలి బోధన చేశారు. ధర్మచక్ర ప్రవర్తన లేదా ‘ధర్మచక్రాన్ని తిప్పడం’గా ప్రసిద్ధి చెందిన

 ఈ బోధన బౌద్ధ సంఘ ఆవిర్భావానికి, ఆర్య అష్టాంగ మార్గ సూత్రాల స్థాపనకు నాంది పలికింది.

 

శతాబ్దాలుగా రాజులు, బౌద్ధ సంఘాలు, సామాన్య ప్రజల ఆదరణతో సారనాథ్ అభివృద్ధి చెందింది. బుద్ధుడి తొలి బోధన, మొదటి ఐదుగురు శిష్యులతో ఆయన సమావేశానికి సంబంధించిన ప్రదేశం చుట్టూ అనేక స్తూపాలు, ఆలయాలు, విహారాలు నిర్మించారు. దాదాపు 16 శతాబ్దాల నిరంతర అభివృద్ధిని ఈ క్షేత్రం ప్రతిబింబిస్తుంది. ఇక్కడి కట్టడాలు క్రీ.పూ. 4–3వ శతాబ్దాల మౌర్య పూర్వకాలం నుంచి క్రీ.శ. 12వ శతాబ్దం వరకు విస్తరించి ఉన్నాయి. 12వ శతాబ్దంలో సారనాథ్ క్షీణించి, విధ్వంసానికి గురైంది. 18వ శతాబ్దంలో తిరిగి గుర్తించే వరకు ఈ క్షేత్రం మరుగున పడిపోయింది.

 

గుర్తింపు దిశగా ప్రయాణం

ప్రపంచ వారసత్వ గుర్తింపు దిశగా సారనాథ్ ప్రయాణం సుదీర్ఘంగా, ఎంతో జాగ్రత్తగా సాగింది. ఈ ప్రాచీన క్షేత్రాన్ని 1998లో భారత ప్రపంచ వారసత్వ తాత్కాలిక జాబితాలో చేర్చారు.

 

 

ప్రపంచ వారసత్వ కమిటీ పరిశీలన కోసం 2025 జనవరిలో ప్రతిపాదన సమర్పించారు. తర్వాత 18 నెలలపాటు యునెస్కో సలహా సంస్థలతో సాంకేతిక సమావేశాలు జరిగాయి. ప్రతిపాదిత ప్రదేశం అర్హతను పరిశీలించేందుకు అంతర్జాతీయ స్మారక కట్టడాలు, ప్రదేశాల మండలి(ఐకోమోస్) మూల్యాంకన బృందం పరిశీలన చేపట్టింది. యునెస్కో సలహా సంస్థల్లో ఒకటైన ఐకోమోస్ ప్రపంచ వారసత్వ జాబితాకు ప్రతిపాదించిన సాంస్కృతిక, మిశ్రమ ప్రదేశాలను మూల్యాంకనం చేస్తుంది. దక్షిణ కొరియాలోని బుసాన్‌లో జరిగిన ప్రపంచ వారసత్వ కమిటీ 48వ సమావేశంలో తీసుకున్న చరిత్రాత్మక నిర్ణయంతో ఈ ప్రక్రియ పూర్తయింది.

 

ప్రపంచ వారసత్వ ఒప్పంద పరిధిలోని యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో ప్రమాణాలు (iii), (vi) కింద సారనాథ్‌ ప్రాచీన బౌద్ధ క్షేత్రాన్ని ప్రతిపాదించారు.

 

నాలుగు ప్రధాన బౌద్ధ పుణ్యక్షేత్రాల్లో ఒకటిగా సారనాథ్‌కు కొనసాగుతున్న ఆధ్యాత్మిక ప్రాధాన్యాన్ని ప్రమాణం (iii) గుర్తిస్తుంది. శతాబ్దాలుగా ఈ క్షేత్రంలో నిర్మించిన, పునర్నిర్మించిన అనేక మతపరమైన కట్టడాలు, స్మారకాలు ఈ ప్రాధాన్యాన్ని ప్రతిబింబిస్తాయి.

 

బౌద్ధ సమాజానికి అసాధారణ ప్రాధాన్యం కలిగిన బుద్ధుడి జీవిత ఘట్టాలతో సారనాథ్‌కు ఉన్న ప్రత్యక్ష, స్పష్టమైన అనుబంధాన్ని ప్రమాణం (vi) గుర్తిస్తుంది. బోధ్‌గయలో సంబోధి(జ్ఞానోదయం పొందిన తర్వాత) ఆయన చేసిన తొలి బోధన, మొదటి శిష్యులతో సమావేశం ఈ ఘట్టాల్లో ఉన్నాయి. ఈ సంఘటనలు, బుద్ధుడి బోధనలు, త్రిరత్న భావనకు కొనసాగుతున్న ప్రాధాన్యాన్ని శతాబ్దాలుగా సారనాథ్‌లో నిర్మించిన అనేక కట్టడాలు ప్రతిబింబిస్తున్నాయి.

 

ప్రపంచ వారసత్వ ఒప్పంద విస్తృత లక్ష్యాన్ని కూడా ఈ గుర్తింపు ప్రతిబింబిస్తుంది. ప్రస్తుత, భవిష్యత్ తరాల కోసం అసాధారణ విశ్వవ్యాప్త విలువ కలిగిన వారసత్వాన్ని పరిరక్షించి, ప్రోత్సహించాలని యునెస్కో లక్ష్యంగా పెట్టుకుంది.

 

సారనాథ్‌: శాంతికి ప్రపంచ వారసత్వం

సారనాథ్ కేవలం పురావస్తు క్షేత్రం కాదు. జపాన్‌, థాయ్‌లాండ్‌, శ్రీలంక, మయన్మార్‌, వియత్నాం, దక్షిణ కొరియా, కంబోడియా, మంగోలియా సహా అనేక దేశాల బౌద్ధులకు ఇది ప్రపంచ పుణ్యక్షేత్రంగా కొనసాగుతోంది. ప్రపంచంలో అత్యంత పవిత్రమైన బౌద్ధ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన సారనాథ్‌... బౌద్ధమత జన్మభూమిగా భారత గుర్తింపును మరింత బలోపేతం చేస్తోంది. బౌద్ధ దేశాలతో సాంస్కృతిక సంబంధాలు, అంతర్జాతీయ భాగస్వామ్యానికి వారధిగా నిలుస్తోంది.

 

సారనాథ్‌కు గుర్తింపు లభించడంతో బుద్ధుడి జీవితంతో ముడిపడిన నాలుగు ప్రధాన బౌద్ధ పుణ్యక్షేత్రాల్లో మూడు ఇప్పుడు యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో ఉన్నాయి. నేపాల్‌లోని లుంబిని, బిహార్‌లోని బోధ్‌గయ మహాబోధి ఆలయం, ఉత్తరప్రదేశ్‌లోని సారనాథ్ వీటిలో ఉన్నాయి. భారత్‌లోని సాంచీ, నలంద, అజంతా; శ్రీలంకలోని అనురాధపుర; బంగ్లాదేశ్‌లోని పహార్‌పూర్‌; ప్రస్తుత పాకిస్థాన్‌లోని తక్షశిల, తఖ్త్‌–ఇ–బాహీ వంటి ఇతర ముఖ్యమైన బౌద్ధ ప్రపంచ వారసత్వ ప్రదేశాల సరసన ఇవి నిలుస్తున్నాయి.

 

సారనాథ్ అసాధారణ విశ్వవ్యాప్త విలువను రక్షించాలన్న భారత నిబద్ధతను కూడా ఈ గుర్తింపు పునరుద్ఘాటిస్తోంది. భవిష్యత్ తరాల కోసం క్షేత్ర ప్రామాణికత, సమగ్రతను పరిరక్షించేందుకు ప్రభుత్వం పర్యాటక రంగాన్ని సుస్థిరంగా నిర్వహిస్తుంది. పరివర్తన నియంత్రిత ప్రాంతంలో ప్రణాళిక లేని అభివృద్ధిని అడ్డుకుంటుంది.

 

భారత వారసత్వ విజయానికి సంస్థాగత సహకారం

ప్రతి విజయవంతమైన ప్రతిపాదన వెనుక ఏళ్ల తరబడి సాగిన సంస్థాగత కృషి ఉంటుంది. ప్రపంచ వారసత్వ ప్రదేశాలకు సంబంధించి భారత్ అనుసరిస్తున్న విధానం కేంద్ర సంస్థలు, రాష్ట్ర ప్రభుత్వాలు, అంతర్జాతీయ సంస్థల మధ్య సన్నిహిత సమన్వయంపై ఆధారపడి ఉంది.

 

సాంస్కృతిక మంత్రిత్వ శాఖ

సాంస్కృతిక అంశాలపై యునెస్కోతో భారత సంప్రదింపులకు కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ నాయకత్వం వహిస్తుంది. యునెస్కో సాంస్కృతిక ఒప్పందాల కింద భారత్‌ ఇచ్చిన హామీలను అమలు చేస్తుంది. ప్రపంచ వారసత్వ ప్రదేశాలు, అమూర్త సాంస్కృతిక వారసత్వ అంశాల ప్రతిపాదనలను సమన్వయం చేస్తుంది. అంతర్జాతీయ వారసత్వ పరిరక్షణ ప్రమాణాలను మంత్రిత్వ శాఖ ప్రోత్సహిస్తుంది. యునెస్కో, అంతర్జాతీయ సాంస్కృతిక సహకారం ద్వారా సాంస్కృతిక దౌత్యాన్ని బలోపేతం చేస్తుంది.

 

భారత పురావస్తు సర్వేక్షణ సంస్థ‌

భారత ప్రభుత్వం తరఫున ప్రపంచ వారసత్వ సంబంధిత అంశాలకు భారత పురావస్తు సర్వేక్షణ సంస్థ‌ (ఏఎస్ఐ) ప్రధాన సంస్థగా పనిచేస్తోంది. 28 ప్రపంచ వారసత్వ ప్రదేశాలతో సహా కేంద్ర రక్షిత జాబితాలోని 3,688 స్మారక కట్టడాల పరిరక్షణ, నిర్వహణ బాధ్యతలను చేపడుతోంది. ప్రాచీన స్మారకాలు, పురావస్తు ప్రదేశాలు–అవశేషాల చట్టం–1958; పురావస్తు వస్తువులు, కళా సంపదల చట్టం–1972 అమలుతోపాటు తాగునీరు, మరుగుదొడ్లు, నడక మార్గాలు, ప్రకృతి దృశ్యాల రూపకల్పన వంటి సందర్శక సదుపాయాలను కల్పిస్తోంది. ప్రతి స్మారక కట్టడం అవసరాలు, వనరుల లభ్యత ఆధారంగా పరిరక్షణ, నిర్వహణ పనులు క్రమం తప్పకుండా చేపడుతోంది.

 

విస్తరిస్తున్న భారత ప్రపంచ వారసత్వ జాబితా

మన వారసత్వం కేవలం రాళ్లు, లిపులు లేదా శిథిలాలతో నిర్మితమైనది కాదు. ఆలయ గోడల నుంచి వినిపించే ప్రతి భావ‌న‌లో, ప్రాచీన కోటలపై కనిపించే ప్రతి చెక్కడంలో, తరతరాలుగా సంక్రమిస్తున్న ప్రతి జానపద గీతంలో అది సజీవంగా ఉంటుంది. భారత నాగరికత కథను వివరిస్తూ దేశ సుసంపన్న సాంస్కృతిక, సహజ సంపదను ప్రతిబింబిస్తుంది.

 

దేశం

ప్రపంచ వారసత్వ ప్రదేశాలు(2026 జూలై నాటికి)

ఇటలీ

62

చైనా

61

ఫ్రాన్స్

56

జర్మనీ

55

స్పెయిన్

50

భారత్

45

మెక్సికో

36

యునైటెడ్ కింగ్‌డమ్

35

రష్యా

33

 

ప్రస్తుతం భారత్‌లో యునెస్కో గుర్తింపు పొందిన 45 ప్రపంచ వారసత్వ ప్రదేశాలు ఉన్నాయి. వీటిలో 37 సాంస్కృతిక, 7 సహజ, ఒక మిశ్రమ ప్రదేశం ఉన్నాయి. దీంతో భారత్ ప్రపంచంలో ఆరో స్థానంలో, ఆసియా–పసిఫిక్ ప్రాంతంలో రెండో స్థానంలో నిలిచింది.

 

భారత్‌కు తొలి ప్రపంచ వారసత్వ గుర్తింపులు ఒకే ఏడాది లభించాయి. ఆగ్రా కోట, తాజ్‌మహల్‌, ఎల్లోరా గుహలు, అజంతా గుహలు 1983లో జాబితాలో చేరాయి. అప్పటి నుంచి కోటలు, ఆలయాలు, గుహలు, రైల్వేలు, దిగుడు బావులు, ప్రణాళికాబద్ధ నగరాలు, జాతీయ పార్కులు ఈ జాబితాలో చోటు సంపాదించాయి.

 

గత ఏడాది పారిస్‌లోని యునెస్కో ప్రధాన కార్యాలయంలో జరిగిన ప్రపంచ వారసత్వ కమిటీ 47వ సమావేశంలో భారత మరాఠా సైనిక భూదృశ్యాలు జాబితాలో చేరాయి. ఈ ఏడాది బుసాన్‌లో జరిగిన 48వ సమావేశంలో సారనాథ్‌కు గుర్తింపు లభించడంతో భారత ప్రదేశాల సంఖ్య 45కు చేరింది. ప్రపంచ స్థాయిలో ఆరో స్థానం, ఆసియా–పసిఫిక్ ప్రాంతంలో రెండో స్థానాన్ని భారత్ కొనసాగిస్తోంది. భవిష్యత్ ప్రపంచ వారసత్వ ప్రతిపాదనకు తప్పనిసరి తొలి దశ అయిన భారత తాత్కాలిక జాబితాలోని ప్రదేశాల సంఖ్య కూడా 69కి పెరిగింది.

 

భారత్‌లోని యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితా:

సంవత్సరం

ప్రదేశం

రాష్ట్రం/కేంద్రపాలిత ప్రాంతం

విభాగం

1983

ఆగ్రా కోట

ఉత్తరప్రదేశ్

సాంస్కృతిక

1983

అజంతా గుహలు

మహారాష్ట్ర

సాంస్కృతిక

1983

ఎల్లోరా గుహలు

మహారాష్ట్ర

సాంస్కృతిక

1983

తాజ్‌మహల్‌

ఉత్తరప్రదేశ్

సాంస్కృతిక

1984

కోణార్క్ సూర్య దేవాలయం

ఒడిశా

సాంస్కృతిక

1984

మహాబలిపురం స్మారక కట్టడాల సముదాయం

తమిళనాడు

సాంస్కృతిక

1985

కాజిరంగా జాతీయ పార్కు

అస్సాం

సహజ

1985

కియోలాదేవ్ జాతీయ పార్కు

రాజస్థాన్

సహజ

1985

మానస్ వన్యప్రాణి అభయారణ్యం

అస్సాం

సహజ

1986

ఖజురాహో స్మారక కట్టడాల సముదాయం

మధ్యప్రదేశ్

సాంస్కృతిక

1986

ఫతేపూర్ సిక్రీ

ఉత్తరప్రదేశ్

సాంస్కృతిక

1986

గోవా చర్చిలు, కాన్వెంట్లు

గోవా

సాంస్కృతిక

1986

హంపి స్మారక కట్టడాల సముదాయం

కర్ణాటక

సాంస్కృతిక

1987

సుందర్‌బన్స్ జాతీయ పార్కు

పశ్చిమ బెంగాల్

సహజ

1987

ఎలిఫెంటా గుహలు

మహారాష్ట్ర

సాంస్కృతిక

1987

పట్టదకల్ స్మారక కట్టడాల సముదాయం

కర్ణాటక

సాంస్కృతిక

1987, 2004

సజీవ మహా చోళ దేవాలయాలు

తమిళనాడు

సాంస్కృతిక

1988, 2005

నందాదేవి, పూలలోయ జాతీయ పార్కులు

ఉత్తరాఖండ్

సహజ

1989

సాంచీ బౌద్ధ స్మారకాలు

మధ్యప్రదేశ్

సాంస్కృతిక

1993

హుమాయూన్ సమాధి

ఢిల్లీ

సాంస్కృతిక

1993

కుతుబ్ మినార్‌, అనుబంధ స్మారకాలు

ఢిల్లీ

సాంస్కృతిక

1999, 2005, 2008

భారత పర్వత రైల్వేలు

పశ్చిమ బెంగాల్‌, తమిళనాడు, హిమాచల్‌ప్రదేశ్

సాంస్కృతిక

2002

బోధ్‌గయ మహాబోధి ఆలయ సముదాయం

బిహార్

సాంస్కృతిక

2003

భీమ్‌బేట్కా రాతి గుహలు

మధ్యప్రదేశ్

సాంస్కృతిక

2004

చంపానేర్–పావగఢ్ పురావస్తు పార్కు

గుజరాత్

సాంస్కృతిక

2004

ఛత్రపతి శివాజీ టెర్మినస్

మహారాష్ట్ర

సాంస్కృతిక

2007

ఎర్రకోట సముదాయం

ఢిల్లీ

సాంస్కృతిక

2010

జంతర్ మంతర్‌, జైపూర్

రాజస్థాన్

సాంస్కృతిక

2012

పశ్చిమ కనుమలు

కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు

సహజ

2013

రాజస్థాన్ కొండకోటలు

రాజస్థాన్

సాంస్కృతిక

2014

గ్రేట్ హిమాలయన్ జాతీయ పార్కు పరిరక్షణ ప్రాంతం

హిమాచల్‌ప్రదేశ్

సహజ

2014

పటాన్‌లోని రాణి కీ వావ్‌–రాణి దిగుడు బావి

గుజరాత్

సాంస్కృతిక

2016

నలంద మహావిహార పురావస్తు ప్రదేశం

బిహార్

సాంస్కృతిక

2016

ఖాంగ్‌చెండ్‌జోంగా జాతీయ పార్కు

సిక్కిం

మిశ్రమ

2016

లె కార్బూజియే నిర్మాణ కృతి

చండీగఢ్

సాంస్కృతిక

2017

అహ్మదాబాద్ చారిత్రక నగరం

గుజరాత్

సాంస్కృతిక

2018

ముంబయి విక్టోరియన్ గోతిక్‌, ఆర్ట్ డెకో నిర్మాణ సముదాయాలు

మహారాష్ట్ర

సాంస్కృతిక

2019

జైపూర్ నగరం

రాజస్థాన్

సాంస్కృతిక

2021

ధోలావీరా: హరప్పా నగరం

గుజరాత్

సాంస్కృతిక

2021

కాకతీయ రుద్రేశ్వర–రామప్ప ఆలయం

తెలంగాణ

సాంస్కృతిక

2023

హొయసల పవిత్ర నిర్మాణ సముదాయాలు

కర్ణాటక

సాంస్కృతిక

2023

శాంతినికేతన్

పశ్చిమ బెంగాల్

సాంస్కృతిక

2024

మొయిదామ్స్‌–అహోం వంశపు గుట్ట సమాధుల వ్యవస్థ

అస్సాం

సాంస్కృతిక

2025

భారత మరాఠా సైనిక భూదృశ్యాలు

మహారాష్ట్ర, తమిళనాడు

సాంస్కృతిక

2026

సారనాథ్‌ ప్రాచీన బౌద్ధ క్షేత్రం

ఉత్తరప్రదేశ్

సాంస్కృతిక

భారత సుసంపన్న సాంస్కృతిక వారసత్వ ప్రోత్సాహానికి ప్రభుత్వ కార్యక్రమాలు

విస్తారమైన సాంస్కృతిక, సహజ వారసత్వాన్ని రక్షించడం, పునరుద్ధరించడం, ప్రోత్సహించడం కోసం భారత్ అనేక అర్థవంతమైన చర్యలు చేపట్టింది. దేశ శాశ్వత సంప్రదాయాలు, చారిత్రక సంపదలను కాపాడాలన్న ప్రభుత్వ నిబద్ధతను ఈ కార్యక్రమాలు ప్రతిబింబిస్తున్నాయి. పరిరక్షణ, డిజిటలీకరణ, అంతర్జాతీయ సహకారం, ప్రజల భాగస్వామ్యంపై కేంద్రీకృత కృషి ద్వారా భారత సుసంపన్న వారసత్వానికి రక్షణ కల్పిస్తున్నారు.

 

పురావస్తు సంపద పునరుద్ధరణ

భారత్ ఇప్పటివరకు 669 పురావస్తు వస్తువులను స్వదేశానికి తీసుకొచ్చింది. వీటిలో 656 వస్తువులు 2014 తర్వాత తిరిగి వచ్చాయి. సాంస్కృతిక మంత్రిత్వ శాఖ, భారత పురావస్తు సర్వేక్షణ, విదేశాల్లోని భారత దౌత్య కార్యాలయాలు, చట్ట అమలు సంస్థలు ఈ ప్రయత్నంలో భాగస్వాములుగా ఉన్నాయి. ఇటీవల అమెరికా చట్ట అమలు సంస్థలు 657 భారతీయ కళాఖండాలను భారత రాయబార కార్యాలయానికి అప్పగించాయి. చోళుల కాలంనాటి శివ నటరాజ విగ్రహం, పరవైతో కూడిన సుందరార్ విగ్రహం, సోమస్కంద విగ్రహం తిరిగి వచ్చిన ముఖ్య కళాఖండాల్లో ఉన్నాయి.

 

వారసత్వాన్ని దత్తత తీసుకోండి

2017 సెప్టెంబర్‌లో ప్రారంభమై, 2023 సెప్టెంబర్‌లో కొత్త రూపు సంతరించుకున్న ‘అడాప్ట్ ఎ హెరిటేజ్ 2.0’ కార్యక్రమం ప్రైవేటు కంపెనీలు, ప్రభుత్వ రంగ సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, ట్రస్టులు, సంఘాలతో సహకారానికి ఒక వ్యవస్థను రూపొందించింది.

 

జాతీయ ప్రాధాన్యం కలిగిన రక్షిత స్మారక కట్టడాల్లో సందర్శకులకు అనుకూలమైన సదుపాయాలను అభివృద్ధి చేసి, నిర్వహించడంపై ఈ కార్యక్రమం దృష్టి పెడుతుంది. కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్‌) నిధులు, ఇతర విరాళాల ద్వారా సహాయం అందుతుంది. సందర్శకుల అనుభవాన్ని మెరుగుపరచడం దీని లక్ష్యం.

 

2026 మార్చి నాటికి ‘అడాప్ట్ ఎ హెరిటేజ్ 2.0’ కార్యక్రమం కింద మొత్తం 30 అవగాహన ఒప్పందాలు కుదిరాయి.

 

ప్రదేశాల మెరుగైన నిర్వహణ, ప్రజల విస్తృత భాగస్వామ్యం రూపంలో ఈ కార్యక్రమం ఇప్పటికే స్పష్టమైన ఫలితాలను చూపుతోంది. దత్తత తీసుకున్న స్మారక కట్టడాల్లో సందర్శకుల విశేష భాగస్వామ్యం దీనికి నిదర్శనం. 2024–25 ఆర్థిక సంవత్సరంలో ఈ ప్రదేశాలను మొత్తం 1.359 కోట్ల మంది సందర్శించారు.

 

సందర్శకుల్లో బలమైన ఆసక్తిని ఈ గణాంకాలు సూచిస్తున్నాయి. కార్యక్రమం కింద మెరుగైన సదుపాయాలు, సేవలు, క్షేత్రస్థాయి సహకారం దత్తత వారసత్వ ప్రదేశాల్లో సందర్శకుల అనుభవాన్ని మెరుగుపరచి, భాగస్వామ్యాన్ని పెంచుతున్నట్లు స్పష్టమవుతోంది.

 

జ్ఞాన్ భారతం మిషన్

2025లో ప్రారంభమైన జ్ఞాన్ భారతం మిషన్ భారత విస్తారమైన రాతప్రతుల వారసత్వాన్ని పరిరక్షించడం, డిజిటలీకరించడం, ప్రజలకు చేరవేయడం లక్ష్యంగా ప్రభుత్వం చేపట్టిన ప్రధాన కార్యక్రమం. రాతప్రతుల్లో నిక్షిప్తమైన ప్రాచీన విజ్ఞాన వ్యవస్థల పరిరక్షణపై ఇది దృష్టి సారిస్తుంది. డిజిటల్ సమాచార నిధులు, పరిరక్షణ వ్యవస్థల ద్వారా పరిశోధనకు, ప్రజల భాగస్వామ్యానికి వాటిని అందుబాటులోకి తీసుకొస్తుంది.

 

సున్నితమైన ఈ రాతప్రతులను కాపాడటంతోపాటు ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉంచేందుకు ఆధునిక సాంకేతికతలను కూడా ఈ కార్యక్రమం వినియోగిస్తుంది.

 

దీనికి అదనంగా రాతప్రతులను గుర్తించడం, నమోదు చేయడం, సమగ్ర జాతీయ సమాచార నిధిని రూపొందించడం కోసం 2026 మార్చిలో జాతీయ రాతప్రతుల సర్వే ప్రారంభమైంది. సర్వేలో 1.19 కోట్లకు పైగా రాతప్రతుల వివరాలు అందాయి. దేశవ్యాప్తంగా డిజిటలీకరించిన రాతప్రతుల సంఖ్య 8 లక్షలకు పైగా ఉంది. వీటిలో 4.40 లక్షలకు పైగా రాతప్రతులు ప్రస్తుతం జ్ఞాన్ భారతం పోర్టల్‌లో ప్రజల పరిశీలన కోసం రాష్ట్రాల వారీగా అందుబాటులో ఉన్నాయి.

 

భారత జాతీయ పురావస్తు భాండాగారం అభిలేఖ్ పటల్ ద్వారా చారిత్రక దస్త్రాలను కూడా డిజిటలీకరిస్తోంది. 2026 ఫిబ్రవరి నాటికి పోర్టల్‌లో 18.23 కోట్ల పేజీలు, 0.73 కోట్ల సూచన మాధ్యమాలు, 0.38 కోట్ల డిజిటల్ రికార్డులు అందుబాటులో ఉన్నాయి.

 

నేష‌న‌ల్ మిష‌న్ ఆన్ మాన్యుమెంట్స్ ఆండ్ ఆంటిక్స్‌

భారత పురావస్తు సర్వేక్షణ పరిధిలో నేష‌న‌ల్ మిష‌న్ ఆన్ మాన్యుమెంట్స్ ఆండ్ ఆంటిక్స్‌అమలవుతోంది. భారత నిర్మిత వారసత్వం, పురావస్తు వస్తువులకు సంబంధించిన విశ్వసనీయ జాతీయ సమాచార నిధిని రూపొందించడం ద్వారా పరిరక్షణకు ఇది కీలక సహకారం అందిస్తుంది. దేశంలోని అన్ని స్మారకాలు, పురావస్తు వస్తువుల వివరాలను నమోదు చేసి, సమగ్ర జాబితాను రూపొందించాలని మిషన్ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ సమాచారం పరిరక్షణ పనుల ప్రణాళిక, ప్రాధాన్యాల నిర్ధారణ, పర్యవేక్షణకు ప్రత్యక్షంగా ఉపయోగపడుతుంది.

 

2026 మార్చి నాటికి నిర్మిత వారసత్వం, ప్రదేశాలతో సహా 1.84 లక్షల స్మారకాలను జాతీయ మిషన్ నమోదు చేసింది. దేశవ్యాప్తంగా 17.20 లక్షల పురావస్తు వస్తువుల వివరాలను కూడా నమోదు చేసింది.

 

గతాన్ని పరిరక్షిస్తూ... భవిష్యత్తును తీర్చిదిద్దుతూ

భారత సాంస్కృతిక వారసత్వం తరతరాల ప్రజలకు స్ఫూర్తినిస్తూ, విజ్ఞానాన్ని అందిస్తూ, వారిని అనుసంధానించే సజీవ సంపద. అసాధారణ విలువ కలిగిన ప్రదేశాలను పరిరక్షించడంతోపాటు విద్య, సాంస్కృతిక ఆదానప్రదానం, సుస్థిర అభివృద్ధిలో వాటి పాత్రను బలోపేతం చేయాలన్న దేశ నిరంతర నిబద్ధతను సారనాథ్ గుర్తింపు ప్రతిబింబిస్తుంది. భారత్ ముందుకు సాగుతున్న కొద్దీ నాగరిక వారసత్వాన్ని కాపాడటం, ప్రపంచంతో పంచుకోవడంలో వారసత్వ పరిరక్షణ కీలకంగా కొనసాగుతుంది.

 

References:

Ministry of Culture

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2260755&reg=48&lang=2

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2243788&reg=48&lang=2

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2289399&reg=48&lang=1

https://culture.gov.in/ministry/about-us

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2293807&reg=48&lang=1

https://www.pib.gov.in/PressNoteDetails.aspx?NoteId=158940&ModuleId=3&reg=48&lang=2

https://sansad.in/getFile/loksabhaquestions/annex/187/AU2704_e4BQSu.pdf?source=pqals

UNESCO

https://www.unesco.org/en/world-heritage

https://whc.unesco.org/en/statesparties/in

https://whc.unesco.org/en/list/stat#s2

https://whc.unesco.org/en/list/

Department of Culture, Uttar Pradesh

https://www.facebook.com/photo?fbid=1356550013329538&set=pcb.1356550116662861

https://www.facebook.com/photo/?fbid=1356550016662871&set=pcb.1356550116662861

https://www.facebook.com/photo/?fbid=1356550023329537&set=pcb.1356550116662861

Click here for pdf file

 

***

(Explainer ID: 159751) आगंतुक पटल : 124
Provide suggestions / comments
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Bengali , Tamil , Kannada , Malayalam