Economy
ఈ-శ్రమ్ పోర్టల్‌కు ఐదేళ్లు
సమ్మిళిత సామాజిక భద్రతా వ్యవస్థ నిర్మాణం
Posted On:
25 AUG 2026 2:27PM
2026 ఆగస్టు 26తో ఈ-శ్రమ్ పోర్టల్ ఐదేళ్లు పూర్తి చేసుకుంది. భారత అసంఘటిత రంగ కార్మికులకు సామాజిక భద్రతను బలోపేతం చేసే ప్రయాణంలో ఇది కీలక మైలురాయి. కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ 2021లో ప్రారంభించిన ఈ పోర్టల్... ఆధార్‌తో అనుసంధానించిన దేశ తొలి అసంఘటిత కార్మికుల జాతీయ సమాచార నిధిని రూపొందించింది. నమోదైన ప్రతి కార్మికుడికి ప్రత్యేక సార్వత్రిక ఖాతా సంఖ్యను అందిస్తోంది. సంక్షేమం, ఉద్యోగాలు, నైపుణ్యాభివృద్ధి, అప్రెంటిస్‌షిప్, పింఛను సేవలను అనుసంధానించే డిజిటల్ వేదికగా ఇది అభివృద్ధి చెందింది. 31.89 కోట్లకు పైగా నమోదులతో ప్రయోజనాల పంపిణీ, దేశవ్యాప్త వినియోగ సౌలభ్యం, ఆధారాలతో కూడిన విధాన రూపకల్పనను ఈ-శ్రమ్ మెరుగుపరిచింది. సమ్మిళిత, సాంకేతిక ఆధారిత సామాజిక భద్రతా వ్యవస్థను నిర్మించాలన్న ప్రభుత్వ దార్శనికతను ఇది ముందుకు తీసుకెళ్తోంది.
భారత అసంఘటిత రంగ కార్మికులకు సాధికారత
వికసిత భారత్ లక్ష్యసాధన దిశగా దేశం ముందుకు సాగుతున్న వేళ, అపారమైన కార్మికశక్తికి సాధికారత కల్పించడం సమ్మిళిత, సుస్థిర వృద్ధికి అత్యంత కీలకం. వ్యవసాయ కూలీలు, నిర్మాణ కార్మికులు, గృహ కార్మికులు, వీధి వ్యాపారులు, వలస కార్మికులు, గిగ్, ప్లాట్‌ఫామ్ కార్మికులు సహా అనేక వర్గాలు అసంఘటిత రంగంలో ఉన్నాయి. వీరంతా భారత కార్మికశక్తికి, ఆర్థిక వ్యవస్థకు కీలక స్తంభంగా నిలుస్తున్నారు. సామాజిక భద్రత, సంక్షేమ సేవలను వారికి అందుబాటులోకి తీసుకురావడం ప్రభుత్వ ప్రధాన ప్రాధాన్యాల్లో ఒకటిగా కొనసాగుతోంది.

ఈ నిబద్ధతకు కొనసాగింపుగా 2021 ఆగస్టు 26న ఈ-శ్రమ్ పోర్టల్ ప్రారంభమైంది. అప్పటి నుంచి ఇది ఐదేళ్లు పూర్తి చేసుకుంది. అసంఘటిత రంగ కార్మికుల కోసం సమగ్ర సామాజిక భద్రతా వ్యవస్థను నిర్మించాలన్న భారత ప్రయత్నాల్లో ఇది కీలక మైలురాయి.
ఈ-శ్రమ్ వెనుక దార్శనికత
జాతీయ సమాచార కేంద్రం (ఎన్‌ఐసీ) అభివృద్ధి చేసిన ఈ-శ్రమ్ పోర్టల్... ఆధార్ ధ్రువీకరణతో కూడిన దేశ తొలి అసంఘటిత కార్మికుల జాతీయ సమాచార నిధిని (ఎన్‌డీయూడబ్ల్యూ) రూపొందించింది. నమోదైన ప్రతి కార్మికుడికి ప్రత్యేకమైన 12 అంకెల సార్వత్రిక ఖాతా సంఖ్యను (యూఏఎన్) అందిస్తుంది. ప్రధాన లక్ష్యాలు:
* వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాల సంక్షేమ పథకాల మధ్య సమన్వయం కల్పిస్తూ సామాజిక భద్రతా సేవల పంపిణీని మెరుగుపరచడం.
* అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్‌ఫేస్‌ల ద్వారా కార్మికుల సమాచారాన్ని ప్రభుత్వ సంస్థలతో సురక్షితంగా పంచుకునే వీలు కల్పించడం. సంక్షేమ పథకాలను సమర్థంగా అమలు చేయడానికి, ఆధారాలతో కూడిన విధానాలను రూపొందించడానికి ఇది తోడ్పడుతుంది.
* వలస, నిర్మాణ కార్మికులు దేశవ్యాప్తంగా సామాజిక భద్రత, సంక్షేమ ప్రయోజనాలను పొందేందుకు, ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి మారినప్పటికీ వాటిని కొనసాగించేందుకు వీలు కల్పించడం.
* జాతీయ అత్యవసర పరిస్థితులు, సంక్షోభాల సమయంలో సకాలంలో ప్రణాళికలు రూపొందించి స్పందించేందుకు తోడ్పడే సమగ్ర జాతీయ సమాచార నిధిని సృష్టించడం.
‘‘అసంఘటిత కార్మికుడు’’ పరిధిలో ఇంటి నుంచి పనిచేసే కార్మికుడు, స్వయం ఉపాధి పొందుతున్న వ్యక్తి లేదా అసంఘటిత రంగంలో వేతనానికి పనిచేసే కార్మికుడు ఉంటారు. ఈఎస్‌ఐసీ, ఈపీఎఫ్‌వోలో సభ్యత్వం లేని లేదా ప్రభుత్వ ఉద్యోగి కాని సంఘటిత రంగ కార్మికుడు కూడా ఈ పరిధిలోకి వస్తారు.
ఏకగవాక్ష పరిష్కారంగా పరిణామం
2024 అక్టోబర్ 21న ఈ-శ్రమ్ ఏకగవాక్ష పరిష్కారాన్ని ప్రారంభించడంతో, కార్మికుల నమోదు వ్యవస్థగా ఉన్న ఈ-శ్రమ్ పోర్టల్ సమీకృత సేవల పంపిణీ వేదికగా మారింది. ప్రస్తుతం ఇది సంక్షేమం, ఉపాధి, నైపుణ్యాభివృద్ధి, పింఛను సేవలను అనుసంధానిస్తోంది. ఒకే డిజిటల్ వేదిక ద్వారా విస్తృత స్థాయిలో కార్మిక సేవలను అందించాలన్న 2024–25 కేంద్ర బడ్జెట్ దార్శనికతకు ఇది అనుగుణంగా ఉంది. నమోదిత కార్మికులు తమకు అర్హత ఉన్న పథకాలను తెలుసుకోవడంతోపాటు ఇప్పటికే పొందిన ప్రయోజనాలను పరిశీలించవచ్చు. ప్రభుత్వ పోర్టళ్ల మధ్య సమన్వయాన్ని కూడా ఈ వేదిక ప్రోత్సహిస్తుంది. అసంఘటిత కార్మికులకు సామాజిక భద్రతను మరింత చేరువ చేస్తూ సేవల పంపిణీని మెరుగుపరుస్తుంది.
* ఏకగవాక్ష పరిష్కారం 15 సామాజిక భద్రత, సంక్షేమ పథకాలను ఒకే వేదికపైకి తీసుకొచ్చింది. ప్రధానమంత్రి శ్రమ యోగి మాన్‌ధన్ యోజన (పీఎం–ఎస్‌వైఎం), ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన (పీఎంఎస్‌బీవై), ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన (పీఎంజేజేబీవై), జాతీయ సామాజిక సహాయ కార్యక్రమం (ఎన్‌ఎస్‌ఏపీ), ఒకే దేశం–ఒకే రేషన్ కార్డు (ఓఎన్‌ఓఆర్‌సీ), ప్రధానమంత్రి ఆవాస్ యోజన–గ్రామీణ్ (పీఎంఏవై–జీ) తదితర పథకాలు ఇందులో ఉన్నాయి.
* ఈ-శ్రమ్‌లో నమోదైన కార్మికులు పోర్టల్ ద్వారా ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజనల్లో సులభంగా చేరవచ్చు. పీఎంఎస్‌బీవై కింద ప్రమాదవశాత్తు మరణం లేదా శాశ్వత వైకల్యం సంభవిస్తే ₹2 లక్షలు, పాక్షిక వైకల్యానికి ₹1 లక్ష బీమా ప్రయోజనం పొందవచ్చు. ఏ కారణంతోనైనా మరణం సంభవిస్తే పీఎంజేజేబీవై కింద ₹2 లక్షల జీవిత బీమా రక్షణ లభిస్తుంది.
* ఉపాధి అవకాశాల కోసం కార్మికులను జాతీయ వృత్తి సేవతో (ఎన్‌సీఎస్) పోర్టల్ అనుసంధానిస్తుంది. నైపుణ్యాభివృద్ధి, అప్రెంటిస్‌షిప్ కోసం స్కిల్ ఇండియా డిజిటల్ హబ్‌ను అందుబాటులోకి తీసుకొస్తుంది. తమకు అర్హత ఉండే ప్రభుత్వ పథకాలను గుర్తించేందుకు కార్మికులు మైస్కీమ్‌ను కూడా ఉపయోగించుకోవచ్చు.
* అర్హులైన కార్మికులు పోర్టల్ ద్వారా ప్రధానమంత్రి శ్రమ యోగి మాన్‌ధన్ పథకంలో చేరవచ్చు. అర్హత నిబంధనలకు లోబడి 60 ఏళ్ల వయసు చేరిన తర్వాత ఈ పథకం కింద నెలకు కనీసం ₹3,000 హామీతో కూడిన పింఛను లభిస్తుంది.
* భాషిణి వేదిక సహకారంతో 2025లో 22 భాషల్లో సేవలను ప్రవేశపెట్టారు.
* వలస కార్మికుల కుటుంబ వివరాలను నమోదు చేసే సదుపాయం పోర్టల్‌లో ఉంది.
* నిర్మాణ కార్మికుల సమాచారాన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో పంచుకునేందుకు ఇది వీలు కల్పిస్తుంది. సంబంధిత భవన, ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ మండళ్ల(బీఓసీడబ్ల్యూ)లో వారి నమోదుకు ఇది దోహదపడుతుంది.
* అసంఘటిత కార్మికుల జాతీయ సమాచార నిధిలో భాగంగా గిగ్, ప్లాట్‌ఫామ్ కార్మికులను గుర్తించి నమోదు చేసేందుకు ఈ-శ్రమ్ వేదికను అందిస్తోంది. ఇప్పటివరకు సుమారు 11.5 లక్షల మంది ప్లాట్‌ఫామ్ కార్మికులు పోర్టల్‌లో నమోదయ్యారు. ఈ సమాచార నిధి... అలాంటి కార్మికులకు అనువైన సామాజిక భద్రత, సంక్షేమ చర్యలను రూపొందించి అమలు చేయడానికి తోడ్పడగలదు.

ఈ-శ్రమ్ నమోదు: అర్హత, ప్రక్రియ
ఈ-శ్రమ్ పోర్టల్‌లో నమోదు సులభం, అందుబాటులో ఉంటుంది. ఇది ఒకసారి పూర్తి చేయాల్సిన ప్రక్రియ.
అర్హత: అసంఘటిత రంగంలో పనిచేస్తున్న 16 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయసున్న ఏ కార్మికుడైనా ఈ-శ్రమ్ పోర్టల్‌లో నమోదు చేసుకోవచ్చు. కార్మికుడు ఆదాయపు పన్ను చెల్లింపుదారు కాకూడదు. ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) లేదా ఉద్యోగుల రాష్ట్ర బీమా సంస్థ (ఈఎస్‌ఐసీ)లో సభ్యత్వం ఉండకూడదు.
పరిధి: అనేక వర్గాలకు చెందిన అసంఘటిత కార్మికులను పోర్టల్ పరిధిలోకి తీసుకొచ్చారు. నిర్మాణ కార్మికులు, వలస కార్మికులు, గిగ్, ప్లాట్‌ఫామ్ కార్మికులు, వీధి వ్యాపారులు, గృహ కార్మికులు, వ్యవసాయ కార్మికులతోపాటు ఇతర అసంఘటిత రంగ కార్మికులు ఇందులో ఉన్నారు.
ఎలా నమోదు చేసుకోవాలి: కార్మికులు ఈ-శ్రమ్ పోర్టల్‌ను సందర్శించి నమోదు చేసుకోవచ్చు. సమీప ఉమ్మడి సేవా కేంద్రం (సీఎస్‌సీ) లేదా రాష్ట్ర సేవా కేంద్రం ద్వారా కూడా నమోదు చేసుకోవచ్చు. జిల్లా, ఉప జిల్లా స్థాయుల్లో రాష్ట్ర ప్రభుత్వ క్షేత్రస్థాయి అధికారులు నమోదుకు సహకరిస్తారు.
నమోదు ఖర్చు: ఈ-శ్రమ్ పోర్టల్‌లో నమోదు పూర్తిగా ఉచితం. నమోదు సంస్థకు లేదా సేవా ప్రదాతకు కార్మికులు ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు.
అవసరమైన పత్రాలు: నమోదుకు ఆధార్ సంఖ్య(ఆధార్ ఈ-కేవైసీ కోసం), మొబైల్ నంబరు(ఆధార్‌తో అనుసంధానించినదానికి ప్రాధాన్యం) అవసరం.
భారత అసంఘటిత కార్మికశక్తికి విస్తరిస్తున్న సేవలు
గత ఐదేళ్లలో ఈ-శ్రమ్ పోర్టల్‌లో జరిగిన నమోదులు లింగం, వయసు, వృత్తి, రాష్ట్రాల వారీగా విస్తృత భాగస్వామ్యాన్ని ప్రతిబింబిస్తున్నాయి.(ఈ వివరాలు 2026 ఆగస్టు 18 నాటివి)

* మొత్తం నమోదులు: పోర్టల్‌లో 31.89 కోట్ల నమోదులు నమోదయ్యాయి.
* లింగాల వారీ వివరాలు: నమోదిత కార్మికుల్లో మహిళలు 54.28 శాతం, పురుషులు 45.72 శాతం ఉన్నారు.
* వయసుల వారీ వివరాలు: నమోదిత కార్మికుల్లో 16–18 ఏళ్ల వారు 0.08 శాతం, 18–40 ఏళ్ల వారు 55.21 శాతం, 40–50 ఏళ్ల వారు 24.18 శాతం, 50 ఏళ్లు పైబడినవారు 20.53 శాతం ఉన్నారు. ఈ వివరాలు 2026 ఆగస్టు 20 నాటివి.
* అత్యధిక నమోదులు ఉన్న వృత్తులు: వ్యవసాయం, గృహ కార్మికులు, నిర్మాణం, వస్త్ర తయారీ రంగాల్లో అత్యధిక నమోదులు ఉన్నాయి.
* అగ్ర రాష్ట్రాలు: ఉత్తరప్రదేశ్, బిహార్, పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర అత్యధిక నమోదులు నమోదు చేశాయి.
* నమోదు విధానం: అత్యధిక నమోదులు ఉమ్మడి సేవా కేంద్రాల ద్వారా పూర్తికాగా, తర్వాతి స్థానంలో స్వీయ నమోదు ఉంది.
కార్మిక సంక్షేమ భవిష్యత్తుకు పునాదులు
భారత అసంఘటిత కార్మికుల కోసం సమ్మిళిత, సాంకేతిక ఆధారిత సామాజిక భద్రతా వ్యవస్థకు ఈ-శ్రమ్ పోర్టల్ బలమైన పునాది వేసింది. అసంఘటిత కార్మికులకు దేశవ్యాప్త డిజిటల్ గుర్తింపు, సమాచార నిధిని రూపొందించడం ద్వారా ప్రభుత్వ సహాయాన్ని మరింత లక్షితంగా, పారదర్శకంగా అందించేందుకు వీలు కల్పించింది. పరిధి, సేవలు నిరంతరం విస్తరిస్తున్న నేపథ్యంలో మరింత సమ్మిళితమైన, భవిష్యత్ అవసరాలకు సిద్ధమైన కార్మికశక్తి నిర్మాణంలో ఈ-శ్రమ్ కీలక డిజిటల్ స్తంభంగా కొనసాగుతోంది.
References
Ministry of Labour & Employment
https://eshram.gov.in/
https://maandhan.in/
https://www.youtube.com/watch?v=b5anRFQBono
https://www.pib.gov.in/pressreleasepage.aspx?prid=1749294®=48&lang=2
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2090895®=48&lang=2
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2099153®=3&lang=2
https://www.pib.gov.in/PressReleaseIframePage.aspx?PRID=2109421®=48&lang=2
https://eshramwebportal-megh.azureedge.net/nduwwsmedia/sites/default/files/pdf/leaflets/leaflet-en.pdf
Ministry of Electronics & IT
https://www.nic.gov.in/newsletter-content/products-services/
Ministry of Finance
https://www.indiabudget.gov.in/doc/bspeech/bs2024_25.pdf
Click here to see pdf
PIB Research
***
(Explainer ID: 159725)
आगंतुक पटल : 15
Provide suggestions / comments