Farmer's Welfare
జాతీయ పశు వ్యాధుల నియంత్రణ కార్యక్రమం (ఎన్‌ఏడీసీపీ)
“భారత పశుసంపదకు వ్యాధి రహిత భవిష్యత్తు”
Posted On:
22 AUG 2026 10:14AM
2019లో ప్రారంభించిన జాతీయ పశు వ్యాధుల నియంత్రణ కార్యక్రమం దేశవ్యాప్తంగా టీకాలు, నిఘా ద్వారా గాలికుంటు వ్యాధి, బ్రూసెల్లోసిస్‌ను నియంత్రించి నిర్మూలించే లక్ష్యంతో భారత్ చేపట్టిన అతిపెద్ద పశు ఆరోగ్య కార్యక్రమాల్లో ఒకటి. ఈ కార్యక్రమం కింద 147.16 కోట్ల గాలికుంటు వ్యాధి టీకా డోసులు వేశారు. 8.04 కోట్ల మంది రైతులు ప్రయోజనం పొందారు. మెరుగైన వ్యాధి నిరోధకత కారణంగా వ్యాధుల వ్యాప్తి గణనీయంగా తగ్గింది. నమోదైన గాలికుంటు వ్యాధి ప్రబలిన ఘటనలు 2019లో 132 నుంచి 2025 నాటికి 40కి తగ్గాయి. బ్రూసెల్లోసిస్ ప్రబలిన ఘటనలు 2019లో 22 నుంచి 2025లో 15కు తగ్గాయి. ఎన్‌ఎస్‌పీ ప్రతిరక్షకాల వ్యాప్తి 2019లో 20.8 శాతం నుంచి 2025లో 8.1 శాతానికి తగ్గింది. ఆధారాలతో కూడిన నిఘా, నిరంతర వ్యాధి నియంత్రణ ప్రయత్నాల ద్వారా గాలికుంటు వ్యాధి వైరస్ వ్యాప్తి తగ్గినట్లు ఇది సూచిస్తోంది. గత మూడేళ్లలో దేశంలో ఆసియా–1 సెరోటైప్ కారణంగా గాలికుంటు వ్యాధి ప్రబలిన ఘటన ఒక్కటీ నమోదు కాలేదు. బలోపేతమైన పశువైద్య మౌలిక సదుపాయాలు, డిజిటల్ పశుసంపద సమాచార నిధులు, పరిశోధన సంస్థలు, వన్ హెల్త్ కార్యక్రమాలు ఈ కార్యక్రమానికి సహకరిస్తున్నాయి. భారత్ పశుధన్ పోర్టల్‌లో 39 కోట్లకు పైగా పశువులను నమోదు చేశారు. 4,019 సంచార పశువైద్య యూనిట్లు ఇంటి వద్దకే సేవలు అందిస్తూ 136 లక్షల మంది రైతులకు ప్రయోజనం కల్పించాయి. 276 లక్షల పశువులకు చికిత్స అందించాయి. వ్యాధుల నియంత్రణ, డిజిటల్ పర్యవేక్షణ, మహమ్మారుల సంసిద్ధతను సమీకరించడం ద్వారా భారత్‌లో మరింత వ్యాధి రక్షణ కలిగిన పశుసంపద రంగ నిర్మాణానికి ఎన్‌ఏడీసీపీ దోహదపడుతోంది.
వ్యాధులు లేని పశుపోషణ రంగ నిర్మాణం
భారత గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం, అనుబంధ రంగాలకు పశుసంపద సుదీర్ఘకాలంగా కీలక జీవనోపాధి వనరుగా ఉంది. 20వ పశుగణన–2019 ప్రకారం దేశంలో మొత్తం 53.578 కోట్ల పశుసంపద ఉంది. ఇందులో 30.279 కోట్ల గోవులు, గేదెలు ఉన్నాయి. భారీ పశు జనాభా వాటి ఆరోగ్యం, సంక్షేమ ప్రాధాన్యాన్ని తెలియజేస్తోంది. అయితే గాలికుంటు వ్యాధి, బ్రూసెల్లోసిస్ వంటి అంటువ్యాధులు పాల దిగుబడి తగ్గుదల, పునరుత్పత్తి వైఫల్యం, వాణిజ్య పరిమితుల కారణంగా గతంలో భారీ ఆర్థిక నష్టాలను కలిగించాయి.
గాలికుంటు వ్యాధి అనేది ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకలు, పందులు వంటి చీలిన గిట్టలు కలిగిన జంతువులకు సోకే అత్యంత అంటువ్యాధి వైరస్. ఈ వ్యాధి పాల ఉత్పత్తిని తగ్గిస్తుంది. ఎదుగుదలను మందగింపజేస్తుంది. పునరుత్పత్తి సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తూ వ్యవసాయ పనులకు ఉపయోగించే పశువుల పని సామర్థ్యాన్ని తగ్గిస్తుంది. అంతర్జాతీయ మార్కెట్లకు ప్రవేశాన్ని కూడా పరిమితం చేస్తుంది. వ్యాధికి గురయ్యే అవకాశం ఉన్న పశువులన్నింటికీ క్రమం తప్పకుండా సామూహిక టీకాలు వేయడంపైనే సమర్థ గాలికుంటు వ్యాధి నియంత్రణ ఆధారపడి ఉంటుంది.
బ్రూసెల్లోసిస్ అనేది బ్రూసెల్లా అబార్టస్ బ్యాక్టీరియా కారణంగా ఆవులు, గేదెలకు సోకే పునరుత్పత్తి వ్యాధి. ప్రధానంగా పశువుల పునరుత్పత్తి అవయవాలను ప్రభావితం చేస్తూ వాటి సాధారణ పునరుత్పత్తి పనితీరుకు అంతరాయం కలిగిస్తుంది. సంతానోత్పత్తి సామర్థ్యం, పాల ఉత్పత్తిపై ప్రభావం చూపడంతో మాంసం, పాల ఉత్పత్తి తగ్గుతుంది. గోవులు, గేదెల్లో వ్యాధిని పూర్తిగా నయం చేసే చికిత్స లేకపోవడంతో టీకాలే అత్యంత సమర్థమైన, సుస్థిర నియంత్రణ మార్గం.
దేశవ్యాప్తంగా టీకాల ద్వారా గాలికుంటు వ్యాధి, బ్రూసెల్లోసిస్‌ను నియంత్రించి నిర్మూలించేందుకు ప్రభుత్వం 2019 సెప్టెంబరులో జాతీయ పశు వ్యాధుల నియంత్రణ కార్యక్రమాన్ని(ఎన్ఏడీసీపీ) ప్రారంభించింది. పశువులన్నింటికీ ఏటా రెండుసార్లు గాలికుంటు వ్యాధి టీకాలు వేయడం, 4–8 నెలల వయసున్న ఆడ దూడలకు జీవితకాలంలో ఒకసారి బ్రూసెల్లోసిస్ టీకా వేయడం ద్వారా నూటికి నూరు శాతం టీకాల లక్ష్యాన్ని ఈ కార్యక్రమం నిర్దేశించింది.

ఎన్‌ఏడీసీపీ కింద సమీకృత చర్యలతో పశు వ్యాధుల భారం తగ్గింపు
అర్హత కలిగిన పశువులన్నింటికీ ఏటా రెండుసార్లు సామూహిక టీకాలు వేయడం ద్వారా గాలికుంటు వ్యాధిని నియంత్రించడం, 4–8 నెలల వయసున్న ఆడ దూడలకు జీవితకాలంలో ఒకసారి టీకా వేయడం ద్వారా బ్రూసెల్లోసిస్‌ను నియంత్రించడం కార్యక్రమం లక్ష్యం. వ్యాధుల నిఘా, శీతల సరఫరా వ్యవస్థల కొనుగోలుకు కూడా ఇది సహకరిస్తోంది.
* వ్యాధికి గురయ్యే అవకాశం ఉన్న గోవులు, గేదెలు, చిన్న నెమరువేసే పశువులన్నింటికీ ప్రతి ఆరు నెలలకు సామూహిక గాలికుంటు వ్యాధి టీకాలు
* కార్యక్రమ సమర్థ అమలుకు ప్రజా అవగాహన ప్రచారాలు, అధికారులకు శిక్షణ
* చెవి ట్యాగింగ్, నమోదు, భారత్ పశుధన్ పోర్టల్–జాతీయ డిజిటల్ పశుసంపద మిషన్‌లో పశువుల సమాచారం అప్‌లోడ్
* టీకాలకు ముందు, తర్వాత నమూనాల పరీక్ష ద్వారా సీరో నిఘా, పర్యవేక్షణ
* నాణ్యమైన సరఫరాకు భరోసా ఇచ్చేందుకు టీకాలు, శీతల సరఫరా పరికరాల కొనుగోలు
* వ్యాధి ప్రబలిన ఘటనలపై పరిశోధన, వైరస్‌ను వేరు చేసి రకం నిర్ధారణ, క్వారంటైన్–తనిఖీ కేంద్రాల ద్వారా పశువుల రాకపోకల నియంత్రణ
* నిరంతర సమాచార సేకరణ, పర్యవేక్షణ, ప్రభావ అంచనా
* ఒక్కో టీకా డోసుకు కనీసం ₹3 చొప్పున టీకాలు వేసే సిబ్బందికి పారితోషికం
సీరో నిఘా, సీరో పర్యవేక్షణ
వ్యాధి వ్యాప్తి, నిరోధకతను అంచనా వేసేందుకు జనాభా స్థాయిలో ప్రతిరక్షకాల ఉనికిని పరిశీలించడాన్ని సీరో నిఘా అంటారు. వ్యాధి నిరోధకతను అర్థం చేసుకునేందుకు ప్రతిరక్షకాల స్థాయులను నిర్దిష్ట కాలం పాటు అనుసరించడాన్ని సీరో పర్యవేక్షణ అంటారు.
పశు ఆరోగ్యం, వ్యాధుల నియంత్రణకు ఆర్థిక నిబద్ధత
ఎన్‌ఏడీసీపీ విజయాన్ని కొనసాగిస్తూ వ్యాధుల నియంత్రణ, పశువైద్య సేవలు, పశు ఆరోగ్య సంరక్షణను పశుసంపద ఆరోగ్యం, వ్యాధుల నియంత్రణ కార్యక్రమం కింద ప్రభుత్వం సమీకరించింది. దీంతో మరింత సమగ్ర, సుస్థిర పశు ఆరోగ్య వ్యవస్థ అందుబాటులోకి వచ్చింది. సవరించిన కార్యక్రమం కింద ఎన్‌ఏడీసీపీ, పశుసంపద ఆరోగ్యం, వ్యాధుల నియంత్రణ విభాగం(ఎల్‌హెచ్&డీసీ), పశు ఔషధి కార్యక్రమాన్ని ఒకే సమగ్ర పథకంలో విలీనం చేశారు. పశు ఆరోగ్య కార్యక్రమాలను సమన్వయంతో అమలు చేసి సమర్థంగా నిర్వహించేందుకు ఇది సహకరిస్తోంది. 2026–27 ఆర్థిక సంవత్సరానికి పశుసంపద ఆరోగ్యం, వ్యాధుల నియంత్రణ కార్యక్రమానికి మొత్తం ₹2,010 కోట్లు కేటాయించారు.
గాలికుంటు వ్యాధి, బ్రూసెల్లోసిస్ నియంత్రణలో జాతీయ ప్రయత్నాలు, ఫలితాలు
దేశవ్యాప్తంగా నిరంతర టీకాలు, నిఘా, పర్యవేక్షణ ద్వారా జాతీయ పశు వ్యాధుల నియంత్రణ కార్యక్రమం(ఎన్ఏడీసీపీ) కింద చేపట్టిన చర్యల స్థాయి, సాధించిన కొలవదగిన ఫలితాలు:

గాలికుంటు వ్యాధి(ఎఫ్ఎండీ)
ఎన్‌ఏడీసీపీ కింద సంచితంగా 147.16 కోట్ల గాలికుంటు వ్యాధి టీకా డోసులు వేశారు. 8.04 కోట్ల మంది రైతులు ప్రయోజనం పొందారు.
వలస పశువుల్లో గాలికుంటు వ్యాధి ముప్పు తగ్గింపు
2024 నుంచి సంచార గొర్రెలు, మేకలకు గాలికుంటు వ్యాధి టీకాలను విస్తరించారు. వలస మార్గాల్లో వ్యాధి వ్యాప్తిని నివారించేందుకు హరియాణా, హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్, జమ్మూకశ్మీర్, లద్దాఖ్‌లలోని వలస పశు సమూహాలను కార్యక్రమం పరిధిలోకి తీసుకొచ్చారు.
మెరుగైన వ్యాధి నిరోధకత, తగ్గిన వ్యాధి ప్రబలిన ఘటనలు
* ఎఫ్ఎండీ రకం–ఓ: భారత్‌తో పాటు ప్రపంచంలోని పలు ప్రాంతాల్లో అత్యంత సాధారణంగా, విస్తృతంగా కనిపించే సెరోటైప్. ఇది తరచూ వ్యాధి ప్రబలడానికి కారణమవుతుంది.
* ఎఫ్ఎండీ రకం–ఏ: సులభంగా మార్పులకు గురయ్యే సెరోటైప్. అందువల్ల దీనికి అనుగుణమైన టీకాలు అవసరం.
* ఎఫ్ఎండీ రకం–ఆసియా 1: ప్రధానంగా భారత్‌తో సహా దక్షిణాసియాలో కనిపించే సెరోటైప్. రకం–ఓతో పోలిస్తే దీని వ్యాప్తి తక్కువ.
టీకాల తర్వాత ప్రతిరక్షకాల స్పందనను అంచనా వేసేందుకు నిర్వహించిన సీరో పర్యవేక్షణ ప్రకారం గాలికుంటు వ్యాధి వైరస్ ఓ, ఏ, ఆసియా–1 సెరోటైప్‌లపై సగటు రక్షణాత్మక వ్యాధి నిరోధకత వరుసగా 78.1 శాతం, 71.7 శాతం, 77.6 శాతంగా ఉంది. పశు సమూహాల్లో బలమైన వ్యాధి నిరోధకతను ఈ స్థాయులు సూచిస్తున్నాయి. మెరుగైన వ్యాధి నిరోధకత కారణంగా వ్యాధి వ్యాప్తి గణనీయంగా తగ్గింది. నమోదైన గాలికుంటు వ్యాధి ప్రబలిన ఘటనలు 2019లో 132 నుంచి 2025 నాటికి కేవలం 40కి తగ్గాయి. దేశవ్యాప్త టీకాల పరిధి సమర్థతకు ఇది నిదర్శనం.
బ్రూసెల్లోసిస్
ఎన్‌ఏడీసీపీ కింద 4–8 నెలల వయసున్న ఆడ దూడలకు జీవితకాలంలో ఒకసారి బ్రూసెల్లోసిస్ టీకా వేస్తున్నారు.
మెరుగైన వ్యాధి నిరోధకత, తగ్గిన వ్యాధి ప్రబలిన ఘటనలు
టీకాలు వేసిన పశువుల్లో ప్రతిరక్షకాలు అభివృద్ధి చెందిన శాతాన్ని తెలిపే సీరో కన్వర్షన్ రేటు 2025లో ఆవు దూడల్లో 75.63 శాతం, గేదె దూడల్లో 67.17 శాతంగా నమోదైనట్లు టీకాల అనంతర పర్యవేక్షణ వెల్లడించింది. సమర్థ వ్యాధి నిరోధకత ఏర్పడినట్లు ఈ ఫలితాలు సూచిస్తున్నాయి. దీంతో బ్రూసెల్లోసిస్ కేసులు గణనీయంగా తగ్గాయి. నమోదైన వ్యాధి ప్రబలిన ఘటనలు 2019లో 22 నుంచి 2025లో 15కు తగ్గాయి. కార్యక్రమ చర్యల సానుకూల ప్రభావానికి ఇది నిదర్శనం.
గోవులు, గేదెల ఉత్పాదకత, పాల ఉత్పత్తిలో మెరుగుదల
దేశీయ, గుర్తించని జాతుల పశువుల ఉత్పాదకత: దేశీయ లేదా స్థానిక పశువులు, గుర్తించని మిశ్రమ జాతుల పశువుల ఉత్పాదకత 2014–15లో ఒక్కో పశువుకు ఏటా 927 కిలోగ్రాముల నుంచి 2024–25లో 1,343.2 కిలోగ్రాములకు పెరిగింది. ఇది 44.89 శాతం వృద్ధి.
గేదెల ఉత్పాదకత: ఇదే కాలంలో గేదెల ఉత్పాదకత ఒక్కో గేదెకు ఏటా 1,880 కిలోగ్రాముల నుంచి 2,365.2 కిలోగ్రాములకు పెరిగింది. ఇది 25.80 శాతం వృద్ధి.
గోవులు, గేదెల సగటు ఉత్పాదకత: భారత్‌లో గోవులు, గేదెల సగటు ఉత్పాదకత 2014–15లో ఒక్కో పశువుకు ఏటా 1,640 కిలోగ్రాముల నుంచి 2024–25లో 2,250 కిలోగ్రాములకు పెరిగింది. ఇది 36.63 శాతం వృద్ధి. ప్రపంచంలో మరే దేశంలోనూ నమోదు కాని అత్యధిక ఉత్పాదకత పెరుగుదల ఇదే.
పాల ఉత్పత్తిలో వృద్ధి: భారత పాల ఉత్పత్తి 2014–15లో 146.31 మిలియన్ టన్నుల నుంచి 2024–25లో 247.87 మిలియన్ టన్నులకు పెరిగింది. గత దశాబ్దంలో ఇది 69.4 శాతం వృద్ధి. గోవులు–గేదెల ఉత్పాదకతను మరింత పెంచుతూ 2030 నాటికి ఒక్కో పశువుకు సగటు పాల ఉత్పత్తిని ఏటా 3 వేల కిలోగ్రాములకు చేర్చాలని పథకం లక్ష్యంగా పెట్టుకుంది.
వ్యాధుల నియంత్రణకు సంస్థాగత, మౌలిక సదుపాయాల సహాయక వ్యవస్థలు
పరిశోధన, నిఘా సహాయం
గాలికుంటు వ్యాధి, బ్రూసెల్లోసిస్ నియంత్రణను బలోపేతం చేసేందుకు భారత వ్యవసాయ పరిశోధన మండలికి చెందిన కీలక సంస్థలకు ఆర్థిక సహాయం అందిస్తున్నారు. టీకాల పరిశోధన, నాణ్యత పరీక్షలు, నిఘా, సీరో నిఘా, వ్యాధి నమూనాల రూపకల్పన, రాష్ట్రాలవారీ నమూనాల సేకరణ ఈ సహాయం పరిధిలో ఉన్నాయి. కార్యక్రమాన్ని సమర్థంగా, శాస్త్రీయ ప్రాతిపదికన అమలు చేసేందుకు ఈ చర్యలు భరోసా ఇస్తున్నాయి.
ప్రైవేటు రంగ భాగస్వామ్యంతో కేంద్రీకృత టీకాల కొనుగోలు
టీకాలు వేసేందుకు అవసరమైన పరికరాల కొనుగోలు, శీతల సరఫరా మౌలిక సదుపాయాల బలోపేతానికి రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సహాయం అందిస్తున్నారు. పశుసంవర్ధక మౌలిక సదుపాయాల అభివృద్ధి నిధి ద్వారా వ్యక్తిగత ఔత్సాహికులు, ప్రైవేటు కంపెనీలు, ఇతర అర్హత కలిగిన సంస్థలకు ఆర్థిక సహాయం అందిస్తున్నారు. పశువైద్య టీకాలు, ఔషధాల తయారీ కేంద్రాల ఏర్పాటుకు ఇది సహకరిస్తోంది.
పశువైద్య మౌలిక సదుపాయాలు, సేవల పంపిణీ
చివరి అంచె వరకు పశు ఆరోగ్య సేవలకు భరోసా ఇచ్చేందుకు పశువైద్య కేంద్రాలు, సంచార పశువైద్య యూనిట్లను బలోపేతం చేస్తున్నారు. 29 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో మొత్తం 4,019 సంచార పశువైద్య యూనిట్లు పనిచేస్తున్నాయి. 1962 ఉచిత ఫోన్ నంబరు ద్వారా ఇంటి వద్దకే పశువైద్య సేవలను అందిస్తున్నాయి. ఇప్పటివరకు ఈ కార్యక్రమం ద్వారా 136 లక్షల మంది రైతులు ప్రయోజనం పొందారు. 276 లక్షల పశువులకు చికిత్స అందించారు.
భారత్ పశుధన్ పోర్టల్ ద్వారా డిజిటల్ అనుసంధానం
పశువుల నమోదు, గాలికుంటు వ్యాధి, బ్రూసెల్లోసిస్ టీకాల సమాచారాన్ని భారత్ పశుధన్ పోర్టల్ సమీకరిస్తోంది. ప్రతి పశువుకు ప్రత్యేకమైన 12 అంకెల ట్యాగ్ గుర్తింపు సంఖ్యను కేటాయిస్తున్నారు. 2026 జూలై నాటికి 39 కోట్లకు పైగా పశువులను పోర్టల్‌లో నమోదు చేశారు. దీంతో తక్షణ పర్యవేక్షణ, మెరుగైన గుర్తింపు–అనుసరణ, పశుసంపద అభివృద్ధి కార్యక్రమాల మరింత పారదర్శకమైన సమాచార ఆధారిత అమలు సాధ్యమైంది.
కృత్రిమ మేధ ఆధారిత విశ్లేషణలు, టీకాల అనుసరణ, తక్షణ సమాచార డ్యాష్‌బోర్డులు, ఆధారాలతో కూడిన ప్రణాళిక ద్వారా భవిష్యత్తులో వ్యాధుల నిఘా, వనరుల కేటాయింపును మరింత బలోపేతం చేయవచ్చు.
అవగాహన, రైతుల భాగస్వామ్యం
గ్రామీణ భారతంలో బహుళ ప్రయోజన కృత్రిమ గర్భధారణ సాంకేతిక నిపుణుల ద్వారా రైతులకు అవగాహన సేవలను బలోపేతం చేస్తున్నారు. వీరు ఇంటి వద్దకే పశువైద్య సేవలను అందిస్తున్నారు. ఇప్పటివరకు ఆర్థిక సహాయంతో 39,810 మంది సాంకేతిక నిపుణులకు శిక్షణ ఇచ్చారు.
జాతీయ వన్ హెల్త్ మిషన్
మానవులు, పశువులు, పర్యావరణ ఆరోగ్యం ఒకదానిపై మరొకటి అంతర్గతంగా ఆధారపడి ఉంటాయనే విషయాన్ని వన్ హెల్త్ విధానం గుర్తిస్తోంది. పశు వ్యాధులను ముందుగా గుర్తించే సామర్థ్యం, నిఘా, నియంత్రణను బలోపేతం చేయడం ద్వారా జంతువుల నుంచి మనుషులకు వ్యాధులు సంక్రమించే ముప్పును తగ్గించేందుకు జాతీయ పశు వ్యాధుల నియంత్రణ కార్యక్రమం(ఎన్ఏడీసీపీ) సహకరిస్తోంది. యాంటీమైక్రోబియల్ ఔషధాలను వివేకంతో వినియోగించే విధానాన్ని ప్రోత్సహిస్తోంది. మహమ్మారులతో సహా ప్రస్తుతం ఉద్భవిస్తున్న, భవిష్యత్తులో ఎదురయ్యే ప్రజారోగ్య ముప్పులను ఎదుర్కొనే భారత సంసిద్ధత, స్థిరత్వాన్ని మెరుగుపరుస్తోంది.
2022 జూలై 7న జరిగిన 21వ సమావేశంలో ప్రధానమంత్రి శాస్త్ర, సాంకేతికత, ఆవిష్కరణల సలహా మండలి(పీఎం-ఎస్‌టీఐఏసీ) పలు మంత్రిత్వ శాఖల ఉమ్మడి ప్రయత్నంతో జాతీయ వన్ హెల్త్ మిషన్ ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. దేశంలో ప్రస్తుతం కొనసాగుతున్న వన్ హెల్త్ కార్యకలాపాలన్నింటినీ సమన్వయం చేసి, సహాయం అందించి, సమీకరించడంతో పాటు అవసరమైన చోట లోటుపాట్లను పూరించేందుకు ఈ మిషన్ పనిచేస్తుంది.
మానవుల్లో బ్రూసెల్లోసిస్‌ను తరచూ గుర్తించలేని నేపథ్యంలో టీకాలు, వ్యర్థాల సురక్షిత తొలగింపు, పటిష్ఠ జీవ భద్రత, ప్రజా అవగాహన, విభాగాల మధ్య సమన్వయ ప్రాధాన్యాన్ని నొక్కిచెబుతూ జాతీయ పాడి అభివృద్ధి మండలి(ఎన్‌డీడీబీ) బ్రూసెల్లోసిస్ నియంత్రణ నమూనా ఈ విధానాన్ని మరింత బలోపేతం చేస్తోంది.
వ్యాధుల ముప్పు పెరుగుతున్న, పర్యావరణం వేగంగా మారుతున్న పరిస్థితుల్లో ప్రజలు, పశువులు, పర్యావరణ వ్యవస్థలను రక్షించేందుకు వన్ హెల్త్ ఆచరణాత్మకమైన, సమగ్ర విధానాన్ని అందిస్తోంది.
మహమ్మారుల సంసిద్ధతకు పశు ఆరోగ్య భద్రత బలోపేతం: పాండమిక్ ఫండ్ ప్రాజెక్టు
మహమ్మారుల సంసిద్ధత, ప్రతిస్పందన కోసం భారత్‌లో పశు ఆరోగ్య భద్రత బలోపేతం అనే పాండమిక్ ఫండ్ ప్రాజెక్టును ప్రభుత్వం 2024లో ప్రారంభించింది. జీ20 పాండమిక్ ఫండ్ సహకారంతో చేపట్టిన ఈ కార్యక్రమం విలువ 25 మిలియన్ అమెరికన్ డాలర్లు. ఆసియా అభివృద్ధి బ్యాంక్(ఏడీబీ), ఐక్యరాజ్య సమితి ఆహార, వ్యవసాయ సంస్థ(ఎఫ్ఏఓ), ప్రపంచ బ్యాంకుతో భాగస్వామ్యంతో ప్రాజెక్టును అమలు చేస్తున్నారు.
మహమ్మారుల సంసిద్ధతను మెరుగుపరచేందుకు పశు ఆరోగ్య వ్యవస్థలను బలోపేతం చేయడం ద్వారా ఈ ప్రాజెక్టు ఎన్‌ఏడీసీపీకి అనుబంధంగా పనిచేస్తోంది. జన్యు, పర్యావరణ నిఘాతో సహా వ్యాధుల పర్యవేక్షణను మెరుగుపరుస్తోంది. ప్రయోగశాల మౌలిక సదుపాయాలను ఆధునికీకరిస్తూ సరిహద్దుల మధ్య సహకారాన్ని ప్రోత్సహిస్తోంది. పశువుల నుంచి మనుషులకు సంక్రమించే వ్యాధులు, సరిహద్దులు దాటి వ్యాపించే పశు వ్యాధులను ముందుగానే గుర్తించి సకాలంలో స్పందించే సామర్థ్యాన్ని ఈ చర్యలు మెరుగుపరుస్తున్నాయి.
ఈ కార్యక్రమంలో భాగంగా భారత పశు ఆరోగ్య నిర్వహణను బలోపేతం చేసే రెండు ముఖ్యమైన పత్రాలను ప్రభుత్వం విడుదల చేసింది:

* ప్రామాణిక పశువైద్య చికిత్స మార్గదర్శకాలు: శాస్త్రీయ పశువైద్య పద్ధతులు, ఔషధాల హేతుబద్ధ వినియోగం, యాంటీమైక్రోబియల్ ఔషధాల బాధ్యతాయుత నిర్వహణను ప్రోత్సహించే సమగ్ర వ్యవస్థ. యాంటీమైక్రోబియల్ నిరోధకతపై జాతీయ కార్యాచరణ ప్రణాళికకు కూడా ఇది సహకరిస్తుంది.
* పశు వ్యాధుల సంక్షోభ నిర్వహణ ప్రణాళిక: వ్యాధులు ప్రబలినప్పుడు సంసిద్ధతను బలోపేతం చేసి వేగంగా స్పందించేందుకు మార్గనిర్దేశం చేసే జాతీయ వ్యవస్థ. సకాలంలో వ్యాధిని కట్టడి చేయడం, సమర్థమైన పునరుద్ధరణ చర్యలకు సహకరిస్తుంది.
పశువైద్యులు, విధాన నిర్ణేతలు, క్షేత్రస్థాయి అధికారులకు ఈ పత్రాలు కీలక సాధనాలుగా ఉపయోగపడతాయి. పశు ఆరోగ్య సంక్షోభాలకు సకాలంలో, సమర్థంగా స్పందించేందుకు సహకరిస్తూ వ్యాధుల నిర్వహణ విధానాలను బలోపేతం చేస్తాయి.
భారత పశుసంపదకు రక్షణ
భారత్‌లో అత్యంత సమగ్రమైన, సమాచార ఆధారిత పశు ఆరోగ్య కార్యక్రమాల్లో ఒకటిగా ఎన్‌ఏడీసీపీ ఆవిర్భవించింది. దేశవ్యాప్తంగా నిరంతర టీకాలు, పటిష్ఠ నిఘా వ్యవస్థలు, డిజిటల్ అనుసంధానం, లక్ష్యిత ఆర్థిక, మౌలిక సదుపాయాల సహాయంతో గాలికుంటు వ్యాధి, బ్రూసెల్లోసిస్‌ను కొలవదగిన స్థాయిలో తగ్గించింది. వ్యాధులు ప్రబలిన ఘటనల్లో భారీ తగ్గుదల, పశు సమూహాల్లో మెరుగైన వ్యాధి నిరోధకత, గోవులు, గేదెల ఉత్పాదకతలో స్పష్టమైన పెరుగుదల కారణంగా వ్యాధుల నియంత్రణ రైతులకు ప్రత్యక్షంగా ఆర్థిక, పోషకాహార, జీవనోపాధి ప్రయోజనాలను అందిస్తున్నట్లు వెల్లడవుతోంది. పశు వ్యాధులను ముందుగా గుర్తించడం జంతువుల నుంచి మనుషులకు సంక్రమించే ముప్పును తగ్గిస్తుంది. యాంటీమైక్రోబియల్ ఔషధాల బాధ్యతాయుత నిర్వహణను బలోపేతం చేస్తూ భవిష్యత్ మహమ్మారులను ఎదుర్కొనే జాతీయ సంసిద్ధతను మెరుగుపరుస్తుంది.
గాలికుంటు వ్యాధి రహిత హోదాకు సంబంధించిన అంతర్జాతీయ ప్రమాణాలతో దశలవారీ అనుసంధానం, ప్రయోగశాలల గుర్తింపు విస్తరణ, జన్యు నిఘా, కృత్రిమ మేధ ఆధారిత వ్యాధి సమాచారం, వాతావరణ పరిస్థితులను తట్టుకొనే నిఘా వ్యవస్థలు, బలోపేతమైన వన్ హెల్త్ సమన్వయం భవిష్యత్ ప్రాధాన్యాల్లో ఉన్నాయి.
ప్రపంచంలోని అతిపెద్ద పశుసంపద టీకా కార్యక్రమాల్లో ఒకటిగా ప్రారంభమై డిజిటల్ ఆధారిత వ్యాధుల నిఘా వ్యవస్థగా ఎదిగిన ఎన్‌ఏడీసీపీ ఆరోగ్యకరమైన, అధిక ఉత్పాదకత కలిగిన, ప్రపంచస్థాయి పోటీతత్వంతో కూడిన పశుసంపద రంగానికి పునాది వేసింది. వికసిత్ భారత్–2047 దిశగా భారత్ ముందుకు సాగుతున్న వేళ ఆహార భద్రత, రైతుల శ్రేయస్సు, మహమ్మారులను తట్టుకొనే సామర్థ్యానికి భరోసా ఇచ్చేందుకు పశు ఆరోగ్యంపై నిరంతర పెట్టుబడులు కీలకంగా కొనసాగుతాయి.
References
Ministry of Fisheries, Animal Husbandry & Dairying
https://bharatpashudhan.ndlm.co.in/
https://www.dahd.gov.in/schemes/programmes/nadcp
https://www.pib.gov.in/PressReleseDetailm.aspx?PRID=2212290®=3&lang=2
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2101856
https://www.pib.gov.in/PressReleaseIframePage.aspx?PRID=1937850
https://www.pib.gov.in/PressReleaseIframePage.aspx?PRID=2117330
https://www.pib.gov.in/PressReleaseIframePage.aspx?PRID=2068146
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2157899®=3&lang=2
https://sansad.in/getFile/loksabhaquestions/annex/185/AU3729_txHX3D.pdf?source=pqals
https://sansad.in/getFile/annex/268/AU1181_cZK9ZJ.pdf?source=pqars
https://sansad.in/getFile/loksabhaquestions/annex/185/AS371_0BKEvo.pdf?source=pqals
https://www.nddb.coop/sites/default/files/pdfs/NDDB_AR_2023_24_Eng.pdf
https://sansad.in/getFile/annex/270/AS349_IOMzfo.pdf?source=pqars
https://static.pib.gov.in/WriteReadData/userfiles/key%20results.pdf
https://www.dahd.gov.in/sites/default/files/2026-04/AnnualReport2025-26.pdf
Ministry of Health and Family Welfare
https://www.psa.gov.in/oneHealthMission
Office of the Principal Scientific Advisor to the Government of India
https://psa.gov.in/CMS/web/sites/default/files/psa_custom_files/Anthology%20of%20S%26T%20Activities_compressed%20%281%29.pdf
Cabinet
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2108419®=3&lang=2
World Health Organization
https://www.who.int/health-topics/one-health#tab=tab_1
Click to see pdf
***
(Explainer ID: 159701)
आगंतुक पटल : 10
Provide suggestions / comments