Social Welfare
ప్రధానమంత్రి జనజాతీయ వికాస్ మిషన్
భారతదేశ గిరిజన అటవీ ఆర్థిక వ్యవస్థకు కొత్త అవకాశాలు
Posted On:
20 AUG 2026 11:10AM
భారత్‌లోని 10.4 కోట్ల మంది షెడ్యూల్డ్ తెగల ప్రజల్లో చాలామంది తమ వార్షిక ఆదాయంలో 20–40 శాతాన్ని చిన్న అటవీ ఉత్పత్తుల ద్వారా పొందుతున్నారు. గతంలో గిరిజనులు ఈ ఉత్పత్తులను దళారులకు గిట్టుబాటు కాని ధరలకు విక్రయించేవారు. వారి శ్రమ ఖర్చు కంటే తక్కువ ఆదాయమే లభించేది. ఈ పరిస్థితిని మార్చేందుకు ప్రభుత్వం ప్రధానమంత్రి జనజాతీయ వికాస్ మిషన్‌ను అమలు చేస్తోంది. గిరిజనులను సముదాయాల యాజమాన్యంలోని వన్‌ధన్ వికాస్ కేంద్రాలుగా సమీకరిస్తూ ముడి ఉత్పత్తుల విక్రేతల స్థాయి నుంచి విలువ జోడించే ఔత్సాహికులుగా తీర్చిదిద్దుతోంది. ఇప్పటివరకు 4,172 వన్‌ధన్ వికాస్ కేంద్రాలకు మంజూరు ఇచ్చారు. 12.48 లక్షల మంది గిరిజన సభ్యులను పథకంతో అనుసంధానించారు. ముందుగా నిర్ణయించిన కనీస మద్దతు ధరకు చిన్న అటవీ ఉత్పత్తులను ప్రభుత్వం కొనుగోలు చేస్తోంది. సంస్థల ఏర్పాటుకు పీఎంజేవీఎం నిధులు అందించడంతో పాటు ఉత్సవాలు, ఈ-కామర్స్ వేదికలు, ప్రదర్శనల ద్వారా గిరిజనులు మార్కెట్లను చేరుకునేందుకు సహకరిస్తోంది.
గిరిజన అటవీ ఆర్థిక వ్యవస్థలకు రక్షణ
అడవుల్లో నివసించే లక్షలాది గిరిజన కుటుంబాలకు తేనె, తునికాకు, ఇప్ప పువ్వులు, చింతపండు, లక్క, వెదురు, అడవి మూలికలు వంటి చిన్న అటవీ ఉత్పత్తులు కేవలం అటవీ వనరులు మాత్రమే కావు. అవి ప్రధాన జీవనోపాధి మార్గం. వారి వార్షిక ఆదాయంలో దాదాపు 20 నుంచి 40 శాతం చిన్న అటవీ ఉత్పత్తుల విక్రయం ద్వారానే లభిస్తోంది. వీటిని నేరుగా సేకరించి విక్రయిస్తున్నప్పటికీ గిరిజనులకు మార్కెట్ విలువలో కొంత భాగమే అందుతోంది. దళారులకు తక్కువ ధరలకు విక్రయించాల్సి రావడమే ఇందుకు కారణం.
ఈ పరిస్థితిని మార్చాలని ప్రధానమంత్రి జనజాతీయ వికాస్ మిషన్ లక్ష్యంగా పెట్టుకుంది. 2021–22లో ప్రారంభించిన ఈ మిషన్ కొత్త సాంకేతికతలు, పద్ధతుల్లో గిరిజనులకు నైపుణ్య శిక్షణ అందించడం ద్వారా చిన్న అటవీ ఉత్పత్తుల విలువను పెంచేందుకు వ్యవస్థీకృత మార్గాన్ని కల్పిస్తోంది. మరింత ప్రాచుర్యం పొంది ఎక్కువ ఉత్పత్తులను విక్రయించేందుకు గిరిజన సముదాయాలను విస్తృతమైన జాతీయ, డిజిటల్ మార్కెట్లతో పథకం అనుసంధానిస్తోంది. గిరిజనుల నుంచి ఉత్పత్తులను నేరుగా కొనుగోలు చేస్తూ కనీస మద్దతు ధరకు కూడా భరోసా ఇస్తోంది.
అట్టడుగు స్థాయిలో భారత గిరిజన ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తూనే అటవీ ఉత్పత్తులను సేకరించేవారు తమ సముదాయ సంస్థలకు యజమానులుగా మారేందుకు ఈ ప్రయత్నాలు సహకరిస్తున్నాయి.
చిన్న అటవీ ఉత్పత్తులు, కనీస మద్దతు ధర
పర్యావరణం, వన్యప్రాణుల పరిరక్షణ కోసం దేశంలోని అత్యధిక అడవులను ప్రభుత్వం నిర్వహిస్తున్నప్పటికీ, జీవనోపాధిని కొనసాగించేందుకు గిరిజనులు, ఇతర సంప్రదాయ అటవీ నివాస సముదాయాలకు ఈ ప్రాంతాల్లో ప్రవేశం కల్పిస్తున్నారు.

2006లో ప్రభుత్వం షెడ్యూల్డ్ తెగలు, ఇతర సంప్రదాయ అటవీ నివాసుల అటవీ హక్కుల గుర్తింపు చట్టాన్ని తీసుకొచ్చింది. దీన్ని అటవీ హక్కుల చట్టం అని కూడా పిలుస్తారు. చిన్న అటవీ ఉత్పత్తులను ఈ చట్టం ఇలా నిర్వచిస్తోంది: “వెదురు, చిన్న కట్టెలు, చెట్ల మొదళ్లు, బెత్తం, టస్సర్, పట్టుపురుగు గూళ్లు, తేనె, మైనం, లక్క, తునికాకు లేదా కేందూ ఆకులు, ఔషధ మొక్కలు, మూలికలు, వేర్లు, దుంపలు, ఇలాంటి మొక్కల మూలం కలిగిన కలపేతర అటవీ ఉత్పత్తులన్నీ.” పీఎంజేవీఎం కింద 87 చిన్న అటవీ ఉత్పత్తులకు ప్రభుత్వం కనీస మద్దతు ధరను ప్రకటించింది.
అటవీ నివాస సముదాయాలు జీవనాధారం, జీవనోపాధి కోసం చారిత్రకంగా అటవీ ఉత్పత్తులపై ఆధారపడిన విషయాన్ని అటవీ హక్కుల చట్టం గుర్తిస్తోంది.
కలపేతర చిన్న అటవీ ఉత్పత్తులను సేకరించి, విక్రయించే హక్కులను గిరిజనులకు కల్పిస్తోంది. పంచాయతీల నిబంధనలను షెడ్యూల్డ్ ప్రాంతాలకు విస్తరించే చట్టం–1996 గిరిజన గ్రామ పంచాయతీలకు చిన్న అటవీ ఉత్పత్తులపై యాజమాన్య హక్కులను కూడా కల్పిస్తోంది.
గిరిజన ఉత్పత్తుల మార్కెటింగ్, అభివృద్ధి బాధ్యతలు కలిగిన ట్రైబల్ కోఆపరేటీవ్ మార్కెటింగ్ డెవెలప్‌మెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(ట్రైఫెడ్).. ఉత్పత్తుల మార్కెట్ ధరతో సంబంధం లేకుండా ముందుగా నిర్ణయించిన కనీస మద్దతు ధరకు కలపేతర అటవీ ఉత్పత్తులను కొనుగోలు చేస్తోంది. గిరిజనాభివృద్ధి సహకార సంఘాలు, అటవీ అభివృద్ధి సంస్థలతో కూడిన రాష్ట్ర అమలు సంస్థల వ్యవస్థ ద్వారా కొనుగోళ్లు చేపడుతోంది. 2013–14 నుంచి పథకం కింద రాష్ట్ర ప్రభుత్వాలు ₹693.98 కోట్ల విలువైన 2,67,954 మెట్రిక్ టన్నుల చిన్న అటవీ ఉత్పత్తులను కొనుగోలు చేశాయి.

గిరిజనులకు పీఎంజేవీఎం ఎలా సహకరిస్తుంది?
కనీస మద్దతు ధరకు కొనుగోలు చేయడంతో పాటు గిరిజనులకు నైపుణ్య శిక్షణ, సాంకేతికత, మార్కెటింగ్, మౌలిక సదుపాయాల సహాయాన్ని కూడా పీఎంజేవీఎం అందిస్తోంది.
వన్‌ధన్ వికాస్ కేంద్రాలుగా గిరిజనుల సమీకరణ
గిరిజన అటవీ ఉత్పత్తుల సేకరణదారులను స్వయం సహాయక సంఘాలుగా మిషన్ సమీకరిస్తోంది. దాదాపు 300 మంది గిరిజనులతో కూడిన 15 స్వయం సహాయక సంఘాలను కలిపి ఒక వన్‌ధన్ వికాస్ కేంద్రంగా ఏర్పాటు చేస్తారు. కేంద్రంలోని సభ్యుల్లో కనీసం 60 శాతం మంది షెడ్యూల్డ్ తెగల సముదాయాలకు చెందినవారై ఉండాలి.
2018 ఏప్రిల్ 14న ప్రారంభించిన వన్‌ధన్ యోజన పీఎంజేవీఎంలో భాగం. వన్‌ధన్ వికాస్ కేంద్రాల నమూనాకు ఇది పునాది. గిరిజన సముదాయాల్లో ఈ నమూనా అమలుకు చోదకశక్తిగా నిలుస్తోంది.
నైపుణ్య శిక్షణ, నిధులు, సాంకేతిక సహాయం
వన్‌ధన్ వికాస్ కేంద్రాల్లో చిన్న అటవీ ఉత్పత్తుల సేకరణదారులకు శాస్త్రీయ సేకరణ పద్ధతులతో సహా నైపుణ్య, ఇతర శిక్షణ కార్యక్రమాలను ప్రభుత్వం నిర్వహిస్తోంది.
స్వయం సహాయక సంఘాలకు అందించే ఇతర సదుపాయాలు:
* లబ్ధిదారుడి ఇల్లు లేదా ప్రభుత్వ/గ్రామ పంచాయతీ భవనంలో ఏర్పాటు చేసే మౌలిక సదుపాయాలు
* స్థానికంగా లభించే చిన్న అటవీ ఉత్పత్తుల ఆధారంగా కోత, జల్లెడ పరికరాలు, పొట్టు తీసే యంత్రాలు, డ్రైయర్లు, ప్యాకేజింగ్ సాధనాలతో కూడిన ప్రాథమిక శుద్ధి పరికరాలు
* ముడి పదార్థాలు, శిక్షణ కిట్లతో 30 మంది సభ్యులకు సుస్థిర సేకరణ, విలువ జోడింపుపై శిక్షణ
* ఆర్థిక సంస్థలు, బ్యాంకులు, జాతీయ షెడ్యూల్డ్ తెగల ఆర్థికాభివృద్ధి సంస్థతో అనుసంధానం ద్వారా నిర్వహణ మూలధనం
* అద్దె ప్రాతిపదికన నిల్వ, రవాణా సదుపాయం
మార్కెటింగ్, వ్యాపార సహాయం
విలువ జోడింపుతో పాటు తుది ఉత్పత్తులకు స్థానిక, సుదూర మార్కెట్లతో అనుసంధాన కేంద్రాలుగా కూడా వన్‌ధన్ వికాస్ కేంద్రాలు పనిచేస్తున్నాయి.
* గిరిజనులు తమ ఉత్పత్తులను సులభంగా విక్రయించేలా చిన్న అటవీ ఉత్పత్తుల ప్రధాన కొనుగోలు ప్రాంతాలైన స్థానిక సంతల చుట్టూ వన్‌ధన్ వికాస్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు.
* గిరిజన ప్రాంతాల్లో 5 వేలకుపైగా సంతలు ఉన్నాయి.
* శాశ్వత నిర్మాణాలు, నిల్వ సదుపాయాలు, తాగునీరు, నీడ, తూకం పరికరాలతో సంతలను దశలవారీగా ఆధునికీకరిస్తున్నారు.
* ఉత్పత్తుల విలువ జోడింపు లేదా మార్కెటింగ్ కోసం వన్‌ధన్ వికాస్ కేంద్రాలు ప్రైవేటు సంస్థలు లేదా లాభాపేక్ష లేని సంస్థలతో భాగస్వామ్యం కుదుర్చుకోవచ్చు.
* వ్యాపార ఒప్పందాలపై మెరుగైన నిర్ణయాలు తీసుకొనేందుకు రోజువారీ ధరలు, ఈ-కామర్స్ అవకాశాలతో కూడిన మార్కెట్ సమాచారాన్ని వన్‌ధన్ వికాస్ కేంద్రాలకు ట్రైఫెడ్ అందిస్తోంది.
పీఎంజేవీఎం అందించే ఇతర సహాయం:
* ఉత్సవాలు, ప్రదర్శనలు, చేతివృత్తుల మేళాల ద్వారా గిరిజన ఉత్పత్తుల బ్రాండింగ్, ప్రచారం, ప్రకటనలు
* వన్‌ధన్ వికాస్ కేంద్రాలు, ఇతర పథక ఆస్తులకు జియో ట్యాగింగ్
* గిరిజన ఉత్పత్తులకు భౌగోళిక సూచికలు, నిర్దిష్ట భౌగోళిక మూలం కలిగి, ఆ ప్రాంతం కారణంగా ప్రత్యేక నాణ్యత లేదా గుర్తింపు పొందిన ఉత్పత్తులపై ఉపయోగించే గుర్తు
* సమాచార సాంకేతికత, ఈ-కామర్స్ వేదికల నిర్మాణం, ఆధునికీకరణ
* పరిశోధన, అభివృద్ధి సహాయం
పీఎంజేవీఎం పథకం కింద:
* 4,172 వన్‌ధన్ వికాస్ కేంద్రాలకు మంజూరు ఇవ్వగా, 2,911 కేంద్రాలు పనిచేస్తున్నాయి. 2026 జూలై 31 నాటికి వీటి ద్వారా దాదాపు ₹168 కోట్ల విక్రయాలు నమోదయ్యాయి.
* 12.48 లక్షల మంది గిరిజన సభ్యులను వన్‌ధన్ వికాస్ కేంద్రాలతో అనుసంధానించారు.

గిరిజన మహిళల సాధికారతకు వన్‌ధన్ వికాస్ కేంద్రాల సహకారం
అటవీ ఉత్పత్తుల సేకరణ, విక్రయాల్లో అత్యధిక కార్యకలాపాలను మహిళలే నిర్వహిస్తున్నారు. దీంతో గిరిజన మహిళల ఆర్థిక సాధికారతకు పీఎంజేవీఎం కీలక సాధనంగా నిలుస్తోంది.
అరుణాచల్‌ప్రదేశ్‌లోని లేపరాడా జిల్లాలో 300 మంది మహిళా స్వయం సహాయక సంఘ సభ్యులు, రైతులతో న్యిగమానే, హో యోర్బే, మెడుమ్‌హాగ్‌డమ్ వన్‌ధన్ వికాస్ కేంద్రాన్ని 2021 అక్టోబరులో ఏర్పాటు చేశారు. స్థానికంగా లభించే కలపేతర అటవీ, వ్యవసాయ ఉత్పత్తులను శుద్ధి చేసి మార్కెట్‌లో విక్రయించగల వస్తువులుగా ఈ కేంద్రం మారుస్తోంది. తయారు చేస్తున్న ఉత్పత్తులు:
* కింగ్ మిరపకాయలతో కింగ్ చిల్లీ పచ్చడి(భూత్ జొలోకియా ఈశాన్య భారత ప్రత్యేక రకం)
* వెదురు మొగ్గలతో బాంబూ షూట్ పచ్చడి(ఈశాన్య భారత్‌లో సాధారణంగా లభించే చిన్న అటవీ ఉత్పత్తి)
* స్థానికంగా పండించిన పసుపుతో పసుపు పొడి
* స్థానికంగా పండించిన అల్లంతో అల్లం పొడి
* అరుణాచల్‌ప్రదేశ్‌లో సమృద్ధిగా పండే అనాస పండ్లతో అనాస జామ్
* అనాస పండ్లతో అనాస స్క్వాష్
* నారింజ పండ్లతో ఆరెంజ్ స్క్వాష్
ఈ వన్‌ధన్ వికాస్ కేంద్రం 2022–23 నుంచి ₹11 లక్షల విలువైన ఉత్పత్తులను విక్రయించింది. మహిళలకు సాధికారత కల్పించడంతో ఏడాది పొడవునా ఆదాయం కోసం కాలానుగుణ వ్యవసాయంపైనే ఆధారపడాల్సిన అవసరం తొలగింది. మహిళలు ఈ వ్యాపారానికి ఉమ్మడి యజమానులు. వారు కేవలం కార్మికులు మాత్రమే కాదు- బ్రాండ్, సంస్థలోనూ వాటా కలిగి ఉన్నారు.
సుస్థిర అటవీ ఆర్థిక వ్యవస్థ దిశగా
అటవీ ప్రాంతాల్లో నివసించే గిరిజనులకు ప్రధానమంత్రి జనజాతీయ వికాస్ మిషన్ జీవనోపాధి అవకాశాలను కల్పిస్తోంది. కలపేతర అటవీ ఉత్పత్తులను తయారు చేసి మార్కెటింగ్ చేసేందుకు వ్యవస్థీకృత మార్గాన్ని అందిస్తోంది. స్థానికంగా లభిస్తూ సంప్రదాయ పద్ధతులపై ఆధారపడిన ఈ ఉత్పత్తులు సముదాయ యాజమాన్యం–మార్కెట్ పోటీతత్వం మధ్య సమతుల్యత కలిగిన అటవీ ఆధారిత ఆర్థిక వ్యవస్థకు ప్రాతినిధ్యం వహిస్తున్నాయి.
భారీ పరిశ్రమల్లో తయారైన, ప్లాస్టిక్ ప్యాకేజింగ్‌తో కూడిన వస్తువులు ప్రపంచాన్ని అధికంగా ప్రభావితం చేస్తున్న వేళ సహజమైన, సముదాయాల యాజమాన్యంలోని, అడవుల్లో పుట్టిన ఉత్పత్తులు భారత్ అందిస్తున్న ప్రత్యేక ప్రత్యామ్నాయం. సబ్‌కా సాథ్–సబ్‌కా వికాస్ స్ఫూర్తికి పీఎంజేవీఎం ప్రతిరూపంగా నిలుస్తోంది. భారత అభివృద్ధి ప్రస్థానం మారుమూల అడవులకు, వాటిని తమ నివాసంగా భావించే సముదాయాలకు చేరేలా భరోసా ఇస్తోంది. చివరకు వికసిత్ భారత్@2047 లక్ష్య సాధనకు ఇది దోహదపడుతుంది.
References:
Ministry of Tribal Affairs:
https://tribal.gov.in/downloads/Livelihood/Guidelines/PMJVMGuidelines.pdf
https://tribal.nic.in/FRA/data/FRARulesBook.pdf
https://tribal.nic.in/fra.aspx
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2247596®=3&lang=1
https://trifed.tribal.gov.in/en/division/mfp-for-msp
https://trifed.tribal.gov.in/en/pmvdy
https://trifed.tribal.gov.in/index.php/en/pmvdy/guideline
https://trifed.tribal.gov.in/sites/default/files/2024-11/Success%20Stories.pdf
https://forestsclearance.nic.in/writereaddata/Frequently%20Asked%20Questions.pdf
Ministry of Finance:
https://www.indiabudget.gov.in/economicsurvey/doc/eschapter/echap13.pdf
Pradhan Mantri Janjatiya Vikas Mission
****
(Explainer ID: 159696)
आगंतुक पटल : 15
Provide suggestions / comments