Farmer's Welfare
భారతదేశ మఖానా రంగం: సంప్రదాయ పంట నుంచి ప్రపంచ సూపర్‌ఫుడ్ వరకు
Posted On:
19 AUG 2026 10:45AM
మఖానా: శరవేగంగా ఎదుగుతున్న భారత సూపర్‌ఫుడ్ రంగం
శాస్త్రీయంగా యూరియేల్ ఫెరాక్స్‌గా పిలిచే మఖానా ప్రధానంగా లోతు తక్కువగా ఉన్న చెరువులు, సరస్సులు, చిత్తడి నేలల్లో పెరిగే జల పంట. మొక్క విత్తనమే తినదగిన భాగం. విత్తనాన్ని వేయించడం లేదా శుద్ధి చేసిన తర్వాత పేలాలుగా మార్చి ఫాక్స్ నట్‌గా తింటారు. ప్రపంచంలో అతిపెద్ద మఖానా ఉత్పత్తిదారుగా భారత్ నిలిచింది. ప్రధానంగా బిహార్, పశ్చిమ బెంగాల్, అసోంలో అనుకూలమైన వ్యవసాయ, వాతావరణ పరిస్థితులు, దీర్ఘకాలిక సాగు పద్ధతులు ఈ స్థానానికి దోహదపడ్డాయి.
కొన్నేళ్లుగా మఖానా బిహార్ సంప్రదాయ ఆహారం నుంచి దేశవ్యాప్తంగా విస్తృతంగా వినియోగించే ఆరోగ్యకరమైన ఆహారంగా పరిణామం చెందింది. ఆరోగ్యంపై పెరిగిన అవగాహన, ప్రభుత్వ అనుకూల విధానాలు ఈ పరివర్తనకు చోదకశక్తిగా నిలిచాయి. విలువ జోడించిన మఖానా ఉత్పత్తులను తయారు చేసే అంకుర సంస్థల వృద్ధి, రైతు ఉత్పత్తిదారుల సంస్థల పాత్ర పెరగడం కూడా ఈ రంగ విస్తరణకు దోహదపడ్డాయి. మఖానా రంగ ప్రాధాన్యం పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర బడ్జెట్ 2025–26లో జాతీయ మఖానా మండలి ఏర్పాటును ప్రభుత్వం ప్రకటించింది. 2025 సెప్టెంబరు 15న బిహార్‌లో మండలిని అధికారికంగా ప్రారంభించారు. మఖానా విలువ గొలుసును బలోపేతం చేసి ఆధునికీకరించే దిశగా ఈ కార్యక్రమం కీలక ముందడుగు.
ఈ రంగానికి మరింత సహాయం అందించేందుకు 2025–26 నుంచి 2030–31 వరకు ₹476.03 కోట్ల మొత్తం కేటాయింపుతో మఖానా అభివృద్ధి కేంద్ర రంగ పథకానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. పరిశోధన, ఆవిష్కరణలకు ప్రోత్సాహం, నాణ్యమైన విత్తనాల అందుబాటు మెరుగుదల, రైతుల నైపుణ్యాల బలోపేతంపై పథకం దృష్టి సారిస్తోంది. పంట కోత, కోత అనంతర పద్ధతుల ఆధునికీకరణ, విలువ జోడింపు, బ్రాండింగ్, మార్కెటింగ్, ఎగుమతుల ప్రోత్సాహం, నాణ్యత నియంత్రణ వ్యవస్థల బలోపేతం కూడా దీని లక్ష్యాలు. మఖానా అభివృద్ధి కేంద్ర రంగ పథకం కింద 2025–26కు ₹30 కోట్లు, 2026–27కు ₹90 కోట్లు ఆమోదించారు.
భారత్‌లో మఖానా వృద్ధి
మఖానా ఉత్పత్తిలో భారత్ ప్రపంచ అగ్రగామిగా కొనసాగుతోంది. భారత మఖానా ఉత్పత్తిలో దాదాపు నాలుగింట మూడొంతుల వాటా బిహార్‌దే. ప్రపంచ సరఫరాలోనూ ఈ రాష్ట్రం దాదాపు 80–85 శాతం అందిస్తోంది. మఖానా సాగు ప్రధానంగా ఉత్తర బిహార్‌లో కేంద్రీకృతమైంది.

ముఖ్యంగా కోసి పరీవాహక ప్రాంతంలోని సుపౌల్, సహర్సా, మధేపురా జిల్లాలతో పాటు సమీపంలోని మిథిల, సీమాంచల్ ప్రాంతాల్లో మఖానా సాగు అధికంగా ఉంది. దీంతో బిహార్ మఖానా రంగానికి ప్రధాన కేంద్రంగా నిలిచింది.
కేంద్ర వ్యవసాయం, రైతుల సంక్షేమ విభాగంలోని ఉద్యాన గణాంకాల విభాగం తుది అంచనా ప్రకారం.. 2024–25లో భారత్‌లో మొత్తం మఖానా ఉత్పత్తి 63,910 మెట్రిక్ టన్నులుగా ఉంది. సగటు ఉత్పాదకత హెక్టారుకు 2.03 మెట్రిక్ టన్నులు. రెండో ముందస్తు అంచనాల ప్రకారం 2025–26లో దేశ మొత్తం మఖానా ఉత్పత్తి 80,590 మెట్రిక్ టన్నులు. సగటు ఉత్పాదకత హెక్టారుకు 2.34 మెట్రిక్ టన్నులు. 2025–26లో 60 వేల మెట్రిక్ టన్నుల ఉత్పత్తితో బిహార్ దేశంలో అగ్రస్థానంలో ఉంది. రాష్ట్ర సగటు ఉత్పాదకత హెక్టారుకు 2 మెట్రిక్ టన్నులు.
సంప్రదాయంగా చెరువుల్లో సాగు చేసే మఖానాలో క్షేత్ర ఆధారిత సాగు వంటి ఆధునిక పద్ధతులు, స్వర్ణ వైదేహి, సబౌర్ మఖానా–1 వంటి మెరుగైన రకాలు ఉత్పాదకత పెరుగుదలకు దోహదపడ్డాయి. సాగు విస్తీర్ణం పెరగడం, ఉత్పాదకత మెరుగుపడటం, సాగులో నష్టభయం తగ్గడం ఈ వృద్ధికి తోడ్పడ్డాయి.
మఖానా మార్కెట్‌లో దేశీయ ఉత్పత్తి, వినియోగ ధోరణులు
భారత్ ఏటా 0.6 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా మఖానాను ఉత్పత్తి చేస్తోంది. ఇందులో దాదాపు 40 శాతానికి సమానమైన 0.23–0.25 లక్షల మెట్రిక్ టన్నులను ఎగుమతి చేస్తుండగా, మిగిలిన మొత్తాన్ని దేశీయంగా వినియోగిస్తున్నారు. సహజ పదార్థాలతో కూడిన, మొక్కల ఆధారిత సూపర్‌ఫుడ్‌లకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో భారత పటిష్ఠ ఉత్పత్తి పునాది మఖానాను అంతర్జాతీయ మార్కెట్లలో ప్రీమియం చిరుతిండిగా నిలుపుతోంది.
దేశీయ మఖానా మార్కెట్ 2021–22 నుంచి 2024–25 మధ్య ఏటా 17–18 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఆరోగ్యంపై పెరిగిన అవగాహన, ప్రీమియం ఉత్పత్తులకు ఆదరణ, బ్రాండెడ్ సంస్థల విస్తరణ ఈ వృద్ధికి చోదకశక్తిగా నిలిచాయి. బలమైన దేశీయ డిమాండ్ ఎగుమతి మార్కెట్లలోని హెచ్చుతగ్గుల నుంచి ఈ రంగానికి రక్షణ కల్పించింది.
2029–30 నాటికి మార్కెట్ విలువ ₹11 వేల కోట్ల నుంచి ₹12 వేల కోట్లకు చేరుతుందని అంచనా. 2022 నుంచి 2025 ఆర్థిక సంవత్సరాల మధ్య ఉత్పత్తి పరిమాణం కేవలం 4–5 శాతం మాత్రమే పెరిగింది. 2020–2022 మధ్య కిలోకు దాదాపు ₹500గా ఉన్న సగటు ధర 2025లో దాదాపు ₹1,250కు పెరిగింది. ఆరోగ్య కేంద్రీకృత చిరుతిళ్లకు అధిక డిమాండ్, ప్రీమియం బ్రాండింగ్, డిమాండ్‌కు అనుగుణంగా సరఫరా పెరగకపోవడం ఈ ధరల వృద్ధికి కారణాలు.
దేశీయ నెలవారీ వినియోగ అంచనా(పేలాలుగా మార్చిన మఖానా)
దేశంలో పేలాలుగా మార్చిన మఖానా నెలవారీ వినియోగం 3 వేల నుంచి 3,500 మెట్రిక్ టన్నులుగా అంచనా. చిరుతిళ్లకు డిమాండ్ అత్యధికంగా ఉండే పండుగల సమయంలో వినియోగం దాదాపు 5 వేల మెట్రిక్ టన్నులకు పెరుగుతుంది.
దేశీయ వినియోగంలో బ్రాండెడ్ వేగంగా అమ్ముడయ్యే వినియోగ వస్తువుల సంస్థలు, వ్యవస్థీకృత చిరుతిళ్ల తయారీ సంస్థల వాటా నెలకు 1,800–2,000 మెట్రిక్ టన్నులుగా ఉంది. ఈ విభాగంలో ప్రీమియం ఉత్పత్తులకు వేగంగా పెరుగుతున్న ఆదరణ, రిటైల్ మార్కెట్ విస్తరణ దీనికి చోదకశక్తిగా ఉన్నాయి. విడిగా విక్రయించే, అసంఘటిత రిటైల్ మార్కెట్ నెలకు 1,200–1,400 మెట్రిక్ టన్నుల వాటాను అందిస్తోంది. ప్యాకేజ్డ్ ఉత్పత్తులకు క్రమంగా ఆదరణ పెరుగుతున్నప్పటికీ, ద్వితీయ, తృతీయ శ్రేణి మార్కెట్లలో ఈ విభాగం ఇప్పటికీ కీలకంగా ఉంది.
స్థానిక క్షేత్రాల నుంచి ప్రపంచ విక్రయ కేంద్రాలకు: ఎగుమతి ప్రస్థానం
2025కు ముందు మఖానాను సాధారణ హార్మనైజ్డ్ సిస్టమ్ ఆఫ్ నామెన్‌క్లేచర్ కోడ్‌ల కింద వర్గీకరించేవారు. దీంతో ఉత్పత్తులవారీ ఎగుమతి సమాచారం అందుబాటులో ఉండేది కాదు. ఈ లోటును పరిష్కరించేందుకు పేలాలుగా మార్చిన మఖానా, ఇతర మఖానా ఉత్పత్తులకు విదేశీ వాణిజ్య డైరెక్టరేట్ జనరల్ 2025లో ప్రత్యేక హెచ్‌ఎస్‌ఎన్ కోడ్‌ను ప్రవేశపెట్టింది. 2025–26లో భారత్ 7,264.89 మెట్రిక్ టన్నుల మఖానా ఉత్పత్తులను ఎగుమతి చేసింది. వీటి ఎగుమతి విలువ 19,296.08 లక్షలు.

భారత మఖానా ఎగుమతి మార్కెట్లు కొన్ని దేశాల్లోనే అధికంగా కేంద్రీకృతమై ఉన్నాయి. మొత్తం మఖానా ఎగుమతుల్లో అమెరికా 40 శాతం, కెనడా 20 శాతం, యూఏఈ 17 శాతం కలిపి 77 శాతం వాటాను కలిగి ఉన్నాయి. అయితే అధిక పరిమాణంలో దిగుమతి చేసుకుంటున్న ఈ మార్కెట్లలో యూనిట్ ధరలు తక్కువగా ఉన్నాయి. అమెరికాలో కిలోకు 19.5 డాలర్లు, కెనడాలో 15.8 డాలర్లు, యూఏఈలో 13.3 డాలర్లు లభిస్తున్నాయి. దీనికి భిన్నంగా జర్మనీ–కిలోకు 26 డాలర్లు, నేపాల్–21.6 డాలర్లు, ఆస్ట్రేలియా–21 డాలర్లు వంటి చిన్న మార్కెట్లు పరిమిత పరిమాణంలో 1 నుంచి 5 శాతం దిగుమతి చేసుకున్నప్పటికీ ప్రీమియం ధరలను అందిస్తున్నాయి. యునైటెడ్ కింగ్‌డమ్ 10 శాతం మార్కెట్ వాటా, కిలోకు సగటున 20 డాలర్ల ధరతో సమతుల స్థితిని కలిగి ఉంది. మొత్తం ఆదాయాన్ని పెంచేందుకు అమెరికా, గల్ఫ్ మార్కెట్లకు అతీతంగా అధిక ధరలు చెల్లించే ప్రాంతాలపై దృష్టి సారించి ఎగుమతులను వైవిధ్యభరితం చేసే అవకాశం ఉందని ఇది సూచిస్తోంది. స్థానిక
మఖానా సాగు విస్తరణ, రైతులకు సహాయం
పథకం కింద రాష్ట్రాల్లో అదనంగా 1,010 హెక్టార్లను మఖానా సాగు పరిధిలోకి తీసుకొచ్చారు. 73 హెక్టార్లను విత్తనోత్పత్తి కార్యక్రమం కింద చేర్చారు. మెరుగైన మఖానా ఉత్పత్తి సాంకేతికతలను ప్రదర్శించేందుకు మొత్తం 89 ముందస్తు క్షేత్ర ప్రదర్శనలు నిర్వహించారు. రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, కేంద్ర వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, భారత వ్యవసాయ పరిశోధన మండలి సంస్థలు తదితర చోట్ల నిర్వహించిన సదస్సులు, అధ్యయన పర్యటనలు, శిక్షణ కార్యక్రమాల ద్వారా రైతుల సామర్థ్యాన్ని పెంచారు. మఖానా అభివృద్ధి కేంద్ర రంగ పథకం కింద 2025–26లో దేశవ్యాప్తంగా మొత్తం 8,159 మంది రైతులు ప్రయోజనం పొందారు.
కరకరలాడే మఖానా వెనుక శాస్త్రం: పోషక విలువల్లో ప్రత్యేకత
మఖానాలో కార్బోహైడ్రేట్లు, నాణ్యమైన మాంసకృత్తులు, పీచు పదార్థంతో పాటు మెగ్నీషియం, పొటాషియం, ఫాస్ఫరస్, ఇనుము వంటి ముఖ్యమైన సూక్ష్మ పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. తక్కువ సోడియం, కొలెస్ట్రాల్ రహిత కూర్పు కారణంగా విస్తృత ఆహార అవసరాలకు అనువుగా ఉంటుంది.

పోషక, ఆరోగ్య ప్రయోజనాలకు ప్రసిద్ధి చెందిన మఖానా ప్రపంచ సూపర్‌ఫుడ్‌గా మరింత గుర్తింపు పొందుతోంది. తక్కువ గ్లైసెమిక్ లోడ్ కారణంగా మధుమేహాన్ని నియంత్రించుకునే వారికి అనువుగా ఉంటుంది. గుండె ఆరోగ్యానికి సహకరిస్తూ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. వృద్ధాప్య ప్రభావాలను తగ్గించే లక్షణాలు కూడా దీనికి ఉన్నట్లు గుర్తించారు. బాదం, అక్రోట్, జీడిపప్పు వంటి సాధారణంగా వినియోగించే పప్పుల కంటే మఖానా పోషక కూర్పు మెరుగైనదని అధ్యయనాలు సూచిస్తున్నాయి.
ఇందులో కొవ్వు చాలా తక్కువగా(100 గ్రాములకు 0.33 గ్రాములు) ఉంటుంది. పీచు పదార్థం అధికంగా ఉండటంతో పాటు పలు ముఖ్యమైన అమైనో ఆమ్లాలను అందిస్తుంది. దీనిలోని మాంసకృత్తుల జీర్ణ సామర్థ్యం దాదాపు 95 శాతం. ముఖ్యమైన అమైనో ఆమ్లాల సూచీ, రసాయన స్కోరు చేపల్లోని స్థాయికి సమానంగా ఉన్నాయి.
సూపర్‌ఫుడ్ తయారీ: విత్తనం నుంచి చిరుతిండి వరకు
మఖానా ఉత్పత్తి విలువ గొలుసులో పలు దశలు ఉంటాయి. పంట కోత, విత్తనాల సేకరణ క్షేత్రస్థాయిలో జరుగుతాయి. శుభ్రపరచడం, ఎండబెట్టడం ప్రాథమిక శుద్ధిలో భాగం. వేయించడం లేదా పేలాలుగా మార్చడం, గ్రేడింగ్, మెరుగులు దిద్దడం, ప్యాకేజింగ్ వంటి కార్యకలాపాలు ద్వితీయ శుద్ధి, విలువ జోడింపు పరిధిలోకి వస్తాయి.


క్షేత్రస్థాయి ఉత్పత్తి
చెరువుల సిద్ధం, విత్తనాలను వెదజల్లడం, పంట నిర్వహణ, నీటి వనరుల నుంచి చేతితో పంట కోత వంటి కార్యకలాపాలు క్షేత్రస్థాయి ఉత్పత్తిలో భాగంగా ఉన్నాయి. ఈ దశలో అధికంగా మానవ శ్రమ అవసరం. నైపుణ్యం కలిగిన చేతిపనిపై ఆధారపడుతుంది. నీటి అడుగున విత్తనాలను సేకరించాల్సి ఉండటంతో ఈ ప్రక్రియ ప్రత్యేకంగా కష్టతరమైనది. సంప్రదాయ సాగు పద్ధతులే ఇప్పటికీ ఈ రంగంలో అధికంగా కొనసాగుతున్నాయి. యాంత్రీకరణ పరిమితంగానే ఉంది.
ప్రాథమిక శుద్ధి
సంప్రదాయ పనిముట్లు, పద్ధతులను ఉపయోగిస్తూ ప్రధానంగా ఇళ్లు లేదా గ్రామస్థాయిలో మఖానా ప్రాథమిక శుద్ధి చేపడతారు. ముడి విత్తనాలను ఎండబెట్టి, శుభ్రపరిచిన తర్వాత అధిక ఉష్ణోగ్రత వద్ద వేయిస్తారు. వేడిచేసిన విత్తనాలను పేలాలుగా మార్చడంతో అవి సాధారణంగా చిరుతిండిగా వినియోగించే తేలికైన, కరకరలాడే రూపాన్ని పొందుతాయి. పేలాలుగా మార్చిన తర్వాత మఖానాకు మెరుగులు దిద్ది, పరిమాణం, నాణ్యత ఆధారంగా వేరు చేసి గ్రేడ్ చేస్తారు. పెద్ద పరిమాణం, అధిక నాణ్యత కలిగిన మఖానాకు మార్కెట్‌లో ఎక్కువ ధర లభిస్తుంది.

ద్వితీయ శుద్ధి.. విలువ జోడింపు


పేలాలుగా మార్చిన తుది మఖానాకు మెరుగులు దిద్ది ప్యాక్ చేస్తారు. ఇటీవలి సంవత్సరాల్లో ద్వితీయ శుద్ధి సంప్రదాయ ఉత్పత్తులను దాటి విస్తరించింది. ప్రస్తుతం వివిధ రుచుల మఖానా, తక్షణమే తినగల చిరుతిళ్లు, మఖానా పిండి, ఇతర ఉత్పత్తులు ఇందులో ఉన్నాయి. విలువ జోడింపు, ఉపాధి కల్పనకు ఈ విభాగంలో బలమైన అవకాశాలు ఉన్నాయి.
జాతీయ మఖానా పరిశోధన కేంద్రం(ఎన్ఆర్‌సీఎం)
పరిశోధన, సామర్థ్య నిర్మాణం ద్వారా భారత మఖానా రంగాన్ని ఆధునికీకరించడంలో జాతీయ మఖానా పరిశోధన కేంద్రం(ఎన్ఆర్‌సీఎం) కీలక పాత్ర పోషిస్తోంది. ఈ రంగంలో మెరుగైన సాగు, శుద్ధి పద్ధతులను కూడా ప్రోత్సహిస్తోంది. అధిక దిగుబడి ఇచ్చే మఖానా, ముళ్లు లేని నీటి చెస్ట్‌నట్ రకాలను కేంద్రం అభివృద్ధి చేసింది. నీటిని సమర్థంగా వినియోగించే సమీకృత వ్యవసాయ విధానాలను ప్రవేశపెట్టింది. మఖానా, చేపల సమీకృత సాగును కూడా ప్రారంభించింది. కొన్నేళ్లుగా రైతులు, కృషి విజ్ఞాన కేంద్రాలు, వివిధ సంస్థలకు 15,824.1 కిలోల అధిక దిగుబడి ఇచ్చే మఖానా విత్తనాలను పంపిణీ చేసింది. నాబార్డ్, రాష్ట్ర మత్స్య విభాగాలు, బిహార్ ఉద్యాన అభివృద్ధి సొసైటీ తదితర సంస్థలు ప్రధాన లబ్ధిదారుల్లో ఉన్నాయి.
2012–2023 మధ్య 3 వేల మందికి పైగా రైతులకు మెరుగైన సాగు, శుద్ధి, మార్కెటింగ్ పద్ధతుల్లో శిక్షణ ఇచ్చారు. సమర్థ నీటి వినియోగం, తగిన పంటల విధానాలు, సమతుల పోషకాల నిర్వహణపై శిక్షణ దృష్టి సారించింది. గ్రామీణ జీవనోపాధి, మఖానా ఆధారిత వ్యవసాయ పరిశ్రమల వృద్ధికి సహకరిస్తూ 24 సంస్థలకు సాంకేతిక సహాయం కూడా అందించింది.
సామర్థ్య నిర్మాణ ప్రయత్నాలను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, బిహార్ కేంద్ర వ్యవసాయ విశ్వవిద్యాలయంతో కలిసి శిక్షకులకు శిక్షణ ఇచ్చే విధానాన్ని జాతీయ మఖానా పరిశోధన కేంద్రం ప్రతిపాదించింది. మఖానా విలువ గొలుసు అంతటా విస్తరణ సేవలను బలోపేతం చేయడం ఈ విధానం లక్ష్యం. సాగు, శుద్ధి, గ్రేడింగ్, ఎండబెట్టడం, పేలాలుగా మార్చడం, ప్యాకేజింగ్, బ్రాండింగ్ ఇందులో ఉన్నాయి.
మఖానాను పేలాలుగా మార్చడం, విలువ జోడించిన ఉత్పత్తుల తయారీ కోసం పలు పరికరాలు, యంత్రాలను కూడా కేంద్రం అభివృద్ధి చేసింది. వాణిజ్య ఉత్పత్తి కోసం ఈ సాంకేతికతల లైసెన్సులను తయారీ సంస్థలకు ఇచ్చింది. మఖానా విత్తనాలను శుభ్రపరిచే యంత్రం, విత్తనాల గ్రేడర్, ప్రాథమిక వేయింపు యంత్రం, పేలాల తయారీ యంత్రం, పేలాలుగా మార్చిన మఖానా గ్రేడర్ వీటిలో ఉన్నాయి. పలు విలువ జోడించిన ఉత్పత్తుల తయారీ సాంకేతికతలను కూడా వాణిజ్య వినియోగం కోసం బదిలీ చేసింది.
పోషకాహారం, రైతులు, ప్రపంచ మార్కెట్లను అనుసంధానిస్తున్న పంట
ఆరోగ్యంపై పెరుగుతున్న అవగాహన, విస్తరిస్తున్న దేశీయ డిమాండ్, బలమైన ఎగుమతి అవకాశాలతో భారత వ్యవసాయ, ఆహార రంగాల్లో అత్యంత వేగంగా ఎదుగుతున్న విభాగాల్లో మఖానా ఒకటిగా ఆవిర్భవించింది. అనుకూలమైన వ్యవసాయ, వాతావరణ పరిస్థితులు, సంప్రదాయ నైపుణ్యం, నిరంతర సాంకేతిక పురోగతి సహకారంతో ప్రపంచ మఖానా ఉత్పత్తిలో భారత్ అగ్రస్థానంలో కొనసాగుతోంది.
మొత్తం విలువ గొలుసులో ఈ రంగాన్ని బలోపేతం చేయాలన్న పటిష్ఠ నిబద్ధతకు జాతీయ మఖానా మండలి ఏర్పాటు నిదర్శనం. ఇదే సమయంలో జాతీయ మఖానా పరిశోధన కేంద్రం వంటి సంస్థలు పరిశోధనను ముందుకు తీసుకెళ్తూ రైతుల నైపుణ్యాలను మెరుగుపరుస్తున్నాయి. విలువ జోడింపుకు కూడా సహకరిస్తున్నాయి.
ఆరోగ్యకరమైన, మొక్కల ఆధారిత, ప్రీమియం ఆహార ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ పెరుగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో రైతుల ఆదాయం, గ్రామీణ ఉపాధి, వ్యవసాయ ఎగుమతుల వృద్ధికి మఖానా గణనీయంగా దోహదపడే అనుకూల స్థితిలో ఉంది.
References
Ministry of Agriculture & Farmers Welfare
https://horticulture.bihar.gov.in/HORTMIS/BAIPP/Downloads/ModelDPRMakhana.pdf
https://horticulture.bihar.gov.in/MainSite/Documents/Publication/Makhana.pdf
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2203165®=3&lang=2
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2099490®=3&lang=2
Ministry of Commerce & Industry
https://apeda.gov.in/sites/default/files/study_reports/Makhana_Report_English.pdf
https://apeda.gov.in/sites/default/files/2026-01/MIC_November_Monthly_dashboard_Makhana_311225.pdf
https://icrier.org/pdf/SBrief_Makhana.pdf
Ministry of Food Processing Industries
https://pmfme.mofpi.gov.in/pmfme/newsletters/enewsmakhanaspecial6.html
PIB Backgrounder
https://www.pib.gov.in/FactsheetDetails.aspx?Id=150318®=3&lang=2
See PDF
PIB Research
***
(Explainer ID: 159678)
आगंतुक पटल : 28
Provide suggestions / comments