• Sitemap
  • Advance Search
Farmer's Welfare

భారతదేశ‌ కొబ్బరి రంగం

కల్పవృక్షం నుంచి ప్రపంచ ప్రఖ్యాతి వరకు

Posted On: 18 AUG 2026 12:01PM

భారతదేశ‌ కొబ్బరి రంగం గ్రామీణ జీవనోపాధి, వ్యవసాయ వృద్ధి, సాంస్కృతిక సంప్రదాయాలకు ఆసరాగా నిలుస్తోంది. దాదాపు కోటి మంది రైతులతో సహా 3 కోట్ల మంది ఈ రంగంపై ఆధారపడి ఉన్నారు. ప్రపంచ కొబ్బరి ఉత్పత్తిలో భారత్‌ మొదటి స్థానంలో ఉంది. సాగు విస్తీర్ణంలో కేరళం, ఉత్పత్తిలో తమిళనాడు, ఉత్పాదకతలో ఆంధ్రప్రదేశ్‌ ముందంజలో ఉన్నాయి. సంప్రదాయ ఉత్పత్తుల నుంచి వర్జిన్‌ కొబ్బరి నూనె, కొబ్బరి పాలు, యాక్టివేటెడ్‌ కార్బన్‌ వంటి విలువ జోడించిన ఉత్పత్తుల వరకు భారత ఎగుమతులు విస్తరించాయి. ప్రధానంగా కొబ్బరి అభివృద్ధి మండలి ద్వారా కొబ్బరి వ్యవస్థను బలోపేతం చేసే పలు పథకాలను ప్రభుత్వం అమలు చేస్తోంది. 2025–26లో దాదాపు 2,175 హెక్టార్లను కొత్తగా సాగు పరిధిలోకి తీసుకురాగా, 1,672 హెక్టార్లలో పునరుజ్జీవన కార్యక్రమాలు చేపట్టారు. సుస్థిరత, ఎగుమతులు, రైతుల ఆదాయాన్ని బలోపేతం చేసేందుకు కేంద్ర బడ్జెట్‌ 2026–27లో కొబ్బరి ప్రోత్సాహక పథకాన్ని ప్రకటించారు. నిరంతర విధానపరమైన సహాయంతో భారతదేశ‌ కొబ్బరి రంగం ఉత్పత్తి, విలువ జోడింపు, ఎగుమతులు, జీవనోపాధి రంగాల్లో స్థిరంగా పురోగమిస్తోంది.

కొబ్బరి: జీవనోపాధి, సాంస్కృతిక సంపద
జీవితానికి అవసరమైనవన్నీ అందించే వృక్షంగా ‘కల్పవృక్షం’ పేరుతో పూజలు అందుకొనే కొబ్బరి చెట్టు భారత వారసత్వం, సంస్కృతి, వ్యవసాయ ఆర్థిక వ్యవస్థలో లోతుగా పెనవేసుకుంది. ప్రపంచ నాగరికతలు దీన్ని వెయ్యి ఉపయోగాల చెట్టుగా కొనియాడాయి. కొబ్బరి విశిష్టత దాని అసాధారణ బహుళ ప్రయోజనాల్లోనే ఉంది. ఆహారం, పానీయం, ఔషధం, పీచు, కలప, ఇంధనం, విభిన్న ముడి పదార్థాలను ఇది అందిస్తోంది. కుటుంబాలు, సంప్రదాయ ఆచారాలు, విలువ జోడించిన పరిశ్రమలతో విస్తరిస్తున్న వ్యవస్థకు ఈ వనరులు ఆసరాగా నిలుస్తున్నాయి.

భారత్‌లో కొబ్బరి సాగుకు దాదాపు మూడు వేల ఏళ్ల చరిత్ర ఉన్నట్లు ఆధారాలు ఉన్నాయి. గ్రామీణ ఉపాధి, ఆర్థిక స్థిరత్వానికి ఇది ఇప్పటికీ కీలక చోదకశక్తిగా కొనసాగుతోంది. కోటి మంది రైతులతో సహా దాదాపు 3 కోట్ల మంది కొబ్బరి రంగంపై ఆధారపడి ఉన్నారు. దీంతో గ్రామీణ జీవనోపాధికి ఈ రంగం అత్యంత కీలకంగా మారింది. చిన్న, సన్నకారు రైతులు ప్రధానంగా కొబ్బరిని సాగు చేస్తున్నారు. సమ్మిళిత వృద్ధి, వ్యవసాయ ఆధారిత ఆర్థిక వ్యవస్థల బలోపేతానికి ఈ పంట సన్నిహితంగా అనుసంధానమైంది. ఛత్తీస్‌గఢ్‌లో రైతులు కొబ్బరి సాగును ఆచరణీయమైన జీవనోపాధి మార్గంగా స్వీకరించడం దీని ప్రాధాన్యం పెరుగుతోందనడానికి ఒక ఉదాహరణ.

ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్‌ పీఠభూమి రైతులు సంప్రదాయంగా వరి, చిరుధాన్యాలు, మొక్కజొన్న, చిన్న అటవీ ఉత్పత్తులపై ఆధారపడేవారు. కొండగావ్‌లోని కొబ్బరి అభివృద్ధి మండలి ప్రదర్శన, విత్తనోత్పత్తి క్షేత్రం చేపట్టిన ప్రయత్నాలతో కొబ్బరి సాగు క్రమంగా ఆశాజనకమైన జీవనోపాధి మార్గంగా ఆవిర్భవించింది. చిన్న కొబ్బరి మొక్కల మధ్య ఖాళీ ప్రదేశాల్లో తగిన అంతర పంటలు సాగు చేసేలా రైతులకు శిక్షణ ఇచ్చారు. కొబ్బరి దిగుబడి ప్రారంభమయ్యే వరకు ఈ విధానం వారికి ఆదాయాన్ని అందించింది.

ఛత్తీస్‌గఢ్‌లో కొబ్బరి ఆధారిత బహుళ అంచెల వ్యవసాయం
వీరిలో బకావండ్‌ బ్లాక్‌కు చెందిన 36 ఏళ్ల ఎంబీఏ పట్టభద్రుడు శ్రీ ఈశాంశ్‌ సింగ్‌ రాథోడ్‌ ప్రముఖ ఉదాహరణగా నిలిచారు. వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన ఆయన కార్పొరేట్‌ రంగంలోనూ పనిచేశారు. మండలి నుంచి సాంకేతిక మార్గదర్శనం పొందిన తర్వాత పద్ధతి ప్రకారం కొబ్బరి సాగు చేపట్టారు. ఎక్కువగా పొట్టి రకాలకు చెందిన 2,500 కొబ్బరి చెట్లను నాటారు. వీటిలో దాదాపు 500 చెట్లు దిగుబడి ఇవ్వడం ప్రారంభించాయి.

శ్రీ రాథోడ్‌ అధిక విలువ కలిగిన పండ్లు, కూరగాయలను సమీకరించిన బహుళ అంచెల పంటల విధానాన్ని అనుసరించారు. కొబ్బరి తోటలో 4 వేల అనాస మొక్కలు, 800 డ్రాగన్‌ ఫ్రూట్‌ మొక్కలు, వెయ్యి మామిడి చెట్లు, 600 నిమ్మజాతి చెట్లతో పాటు అరటి, జామ, బొప్పాయి, లిచీ, కాఫీ, స్ట్రాబెర్రీ, కాలానుగుణ కూరగాయలను సాగు చేశారు. ఈ వైవిధ్యభరిత నమూనా భూమి ఉత్పాదకతను పెంచుతూ నిరంతర ఆదాయానికి భరోసా ఇచ్చింది. ఆయన క్షేత్రానికి కొబ్బరి సాగు ద్వారా ఏటా ₹5–6 లక్షల ఆదాయం లభించింది. అంతర పంటల ద్వారా మరో ₹10 లక్షల వరకు రావడంతో కొబ్బరి సాగు అత్యంత లాభదాయకంగా మారింది. ఆయన విజయం బస్తర్‌లోని పలువురు రైతులు కొబ్బరి ఆధారిత ఈ వ్యవస్థను సుస్థిరమైన, ఇతర ప్రాంతాల్లోనూ అమలు చేయగల నమూనాగా పరిగణించేందుకు ప్రేరణనిచ్చింది.

ప్రపంచ కొబ్బరి ఆర్థిక వ్యవస్థలో భారత్‌
ప్రపంచ కొబ్బరి ఆర్థిక వ్యవస్థలో భారత్‌కు ప్రముఖ స్థానం ఉంది. ప్రపంచ కొబ్బరి ఉత్పత్తిలో భారత్‌ మొదటి స్థానంలో, సాగు విస్తీర్ణంలో మూడో స్థానంలో ఉంది. ప్రపంచ మొత్తంలో భారత్‌ వాటా వరుసగా 31.24 శాతం, 17.90 శాతం. కేంద్ర వ్యవసాయం, రైతుల సంక్షేమ విభాగం గణాంకాల ప్రకారం, 2024–25లో భారత్‌ 21.9 లక్షల హెక్టార్లలో దాదాపు 20,301.22 మిలియన్ల కొబ్బరికాయలను ఉత్పత్తి చేసింది. సగటు ఉత్పాదకత హెక్టారుకు 9,249 కొబ్బరికాయలుగా ఉంది.



దేశంలో అత్యధిక కొబ్బరి సాగు విస్తీర్ణం కేరళంలో ఉంది. దాదాపు 7.54 లక్షల హెక్టార్లలో సాగు చేస్తూ సుమారు 5,149.87 మిలియన్ల కొబ్బరికాయలను ఉత్పత్తి చేస్తోంది. కొబ్బరి ఉత్పత్తిలో తమిళనాడు ముందంజలో ఉండగా, ఉత్పాదకతలో ఆంధ్రప్రదేశ్‌ మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాత పశ్చిమ బెంగాల్‌, తమిళనాడు ఉన్నాయి.



ప్రాథమిక ఉత్పత్తిని దాటి కొబ్బరి రంగం వ్యవసాయ ఎగుమతులకు కీలకంగా సహకరించే రంగంగా ఆవిర్భవిస్తూ భారత ఎగుమతి ఆకాంక్షలకు మద్దతు ఇస్తోంది. 2030 నాటికి 2 ట్రిలియన్‌ అమెరికన్‌ డాలర్లు, 2047 నాటికి 21 ట్రిలియన్‌ అమెరికన్‌ డాలర్ల ఎగుమతులను సాధించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

ఈ ఎగుమతి లక్ష్యాలకు మద్దతుగా భారత కొబ్బరి ఉత్పత్తుల ఎగుమతులు ఇటీవలి సంవత్సరాల్లో స్థిరమైన వృద్ధిని నమోదు చేశాయి. 2025–26లో కొబ్బరి ఉత్పత్తుల ఎగుమతులు ₹7,038.35 కోట్లకు–794.70 మిలియన్‌ అమెరికన్‌ డాలర్లకు చేరాయి. గత ఏడాది నమోదైన ₹4,349.03 కోట్లతో పోలిస్తే 62 శాతం వృద్ధి కనిపించింది. భారత కొబ్బరి ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్‌ పెరుగుతున్నట్లు ఇది తెలియజేస్తోంది. 2001–02లో ఎగుమతులు కేవలం ₹25.3 కోట్లుగా ఉన్నప్పటి నుంచి సాధించిన గణనీయ పురోగతిని కూడా ఈ వృద్ధి ప్రతిబింబిస్తోంది. ఆ సమయంలో ఎగుమతులు ప్రధానంగా కొబ్బరి చిప్పల బొగ్గు, కొబ్బరి నూనె, కొబ్బరికాయలు, ఎండు కొబ్బరి వంటి సంప్రదాయ ఉత్పత్తులకే పరిమితమయ్యాయి.

 



కాలక్రమంలో భారత కొబ్బరి ఎగుమతులు సంప్రదాయ వస్తువుల నుంచి వైవిధ్యభరితమైన విలువ జోడించిన ఉత్పత్తులకు విస్తరించాయి. వర్జిన్‌ కొబ్బరి నూనె, కొబ్బరి పాలు, కొబ్బరి నీటికి ఉన్న ప్రపంచ డిమాండ్‌ను ప్రస్తుతం ఈ రంగం తీరుస్తోంది. నిర్దిష్ట అవసరాలకు ఉపయోగపడే ఇతర ఉత్పత్తులను కూడా సరఫరా చేస్తూ అంతర్జాతీయ మార్కెట్లలో భారత పోటీతత్వాన్ని పటిష్ఠం చేస్తోంది. గతంలో ప్రధాన గమ్యస్థానంగా ఉన్న మధ్యప్రాచ్యాన్ని దాటి మార్కెట్‌ పరిధి విస్తరించింది. ప్రస్తుతం ఐరోపా, అమెరికా ఖండాలు, ఆస్ట్రేలియాలోని మార్కెట్లకు ఎగుమతులు చేరుతున్నాయి.

గత ఐదేళ్లలో అమెరికా, యూఏఈ, శ్రీలంక, జర్మనీ, రష్యా, టర్కియే, బెల్జియం, యునైటెడ్‌ కింగ్‌డమ్‌, నెదర్లాండ్స్‌ ప్రధాన వాణిజ్య భాగస్వాములుగా ఆవిర్భవించాయి. యాక్టివేటెడ్‌ కార్బన్‌, కొబ్బరి నూనె, తాజా/శీతలీకరించిన/తురిమిన కొబ్బరి, కొబ్బరి గుజ్జు, ఎండు కొబ్బరి ముఖ్యమైన ఎగుమతి ఉత్పత్తుల్లో ఉన్నాయి. వీటిలో యాక్టివేటెడ్‌ కార్బన్‌ ఎగుమతి పరిమాణంలో నిరంతరం అగ్రస్థానంలో ఉంది.

సంస్థాగత వెన్నెముక: కొబ్బరి అభివృద్ధి మండలి పాత్ర
1981 జనవరి 12న ఏర్పాటైన కొబ్బరి అభివృద్ధి మండలి కేంద్ర వ్యవసాయ, రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తోంది. భారత్‌లో కొబ్బరి సాగు, పరిశ్రమ సమగ్ర అభివృద్ధిని ఇది పర్యవేక్షిస్తోంది. కొచ్చి ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న మండలి 22 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈ రంగ అభ్యున్నతి, పరివర్తనలో ముందంజలో ఉంది. ప్రధాన ప్రాధాన్య రంగాలు:
* నాణ్యమైన నాటే సామగ్రి ఉత్పత్తి పెంపు
* కొబ్బరి సాగు విస్తీర్ణం పెంపు
* ప్రస్తుత కొబ్బరి తోటల్లో ఉత్పాదకత మెరుగుదల
* ప్రధాన చీడపీడలు, వ్యాధుల నియంత్రణ
* ఉత్పత్తుల వైవిధ్యం, ఉప ఉత్పత్తుల వినియోగానికి ప్రోత్సాహం
కొబ్బరి అభివృద్ధి మండలి కింద కార్యకలాపాల అమలుకు 2025–26లో ₹147.21 కోట్లు విడుదల చేశారు.

కొబ్బరి రంగానికి ప్రభుత్వ సహాయక చర్యలు
కొబ్బరి రంగం కోసం ప్రభుత్వం బహుముఖ విధానాన్ని అనుసరిస్తోంది. కొబ్బరి గుజ్జుకు కనీస మద్దతు ధర, లక్ష్యిత అభివృద్ధి పథకాలు, విలువ గొలుసు అంతటా నైపుణ్యాభివృద్ధి, వ్యాపార సంస్థల ఏర్పాటుకు ప్రత్యేక కార్యక్రమాలను ఈ విధానం సమీకరిస్తోంది.

కొబ్బరి గుజ్జుకు కనీస మద్దతు ధర 2025–26: గిట్టుబాటు ఆదాయానికి భరోసా
ఎండబెట్టిన కొబ్బరి గింజ భాగమైన కొబ్బరి గుజ్జు కనీస మద్దతు ధర పరిధిలోని 22 నిర్దేశిత వ్యవసాయ పంటల్లో ఒకటి. భారత్‌లో ప్రధానంగా మిల్లింగ్‌ కొబ్బరి గుజ్జు, బాల్‌ కొబ్బరి గుజ్జు అనే రెండు రకాలను ఉత్పత్తి చేస్తున్నారు. నూనె తయారీకి ప్రధానంగా ఉపయోగించే మిల్లింగ్‌ రకాన్ని చిప్ప నుంచి వేరు చేసిన కొబ్బరి గింజ భాగాన్ని ఎండబెట్టి తయారు చేస్తారు. బాల్‌ లేదా తినదగిన కొబ్బరి గుజ్జును ఎండు ఫలంగా, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో వినియోగిస్తారు. పూర్తిగా పండిన కొబ్బరికాయలను చిప్పలోని గింజ గట్టిపడే వరకు ఎండబెట్టి దీన్ని తయారు చేస్తారు.

కొబ్బరి గుజ్జు కొనుగోలుకు నేషనల్‌ అగ్రికల్చరల్‌ కోఆపరేటివ్‌ మార్కెటింగ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌(నాఫెడ్‌), నేషనల్‌ కోఆపరేటివ్‌ కన్జ్యూమర్స్‌ ఫెడరేషన్‌(ఎన్‌సీసీఎఫ్‌) కేంద్ర నోడల్‌ సంస్థలుగా పనిచేస్తున్నాయి. కొనుగోలు కార్యకలాపాలకు సహకరించేలా రాష్ట్రస్థాయి సంస్థలను కూడా తగిన విధంగా భాగస్వాములను చేస్తున్నారు.

2026 సీజన్‌లో కొబ్బరి రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించేందుకు కొబ్బరి గుజ్జుకు పెంచిన కనీస మద్దతు ధరను కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. మిల్లింగ్‌ కొబ్బరి గుజ్జుకు క్వింటాల్‌కు ₹12,027, బాల్‌ కొబ్బరి గుజ్జుకు క్వింటాల్‌కు ₹12,500గా ధర నిర్ణయించారు. 2025 కనీస మద్దతు ధరతో పోలిస్తే మిల్లింగ్‌ రకానికి క్వింటాల్‌కు ₹445, బాల్‌ రకానికి క్వింటాల్‌కు ₹400 పెరుగుదల నమోదైంది.

అధిక కనీస మద్దతు ధర కొబ్బరి రైతులకు మెరుగైన గిట్టుబాటు ఆదాయాన్ని అందిస్తుంది. దేశీయంగా, ప్రపంచవ్యాప్తంగా కొబ్బరి ఉత్పత్తులకు పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చేందుకు కొబ్బరి గుజ్జు ఉత్పత్తిని పెంచేలా రైతులను ప్రోత్సహిస్తుంది.

కొబ్బరి సాగు, ఉత్పాదకతకు కీలక కార్యక్రమాలు
ప్రధానంగా కొబ్బరి అభివృద్ధి మండలి ద్వారా కొబ్బరి వ్యవస్థను బలోపేతం చేసే పలు పథకాలను ప్రభుత్వం అమలు చేస్తోంది. నాణ్యమైన నాటే సామగ్రి అందుబాటును మెరుగుపరచడం, సాగు విస్తీర్ణాన్ని పెంచడం, ఉత్పాదకతను మెరుగుపరచడం, సాంకేతికత వినియోగాన్ని ప్రోత్సహించడం, మార్కెట్‌ అభివృద్ధికి సహకరించడం వీటి లక్ష్యాలు.

నాణ్యమైన నాటే సామగ్రి ఉత్పత్తి
నాణ్యమైన నాటే సామగ్రి అందుబాటుకు భరోసా ఇవ్వడం ద్వారా ఈ పథకం కొబ్బరి విలువ గొలుసును పునాది దశలోనే బలోపేతం చేస్తోంది. విత్తనోత్పత్తి క్షేత్రాలు, విత్తన తోటలు, నర్సరీల ఏర్పాటు, నాణ్యత ధ్రువీకరణ వ్యవస్థలు పథకంలోని ప్రధాన చర్యలు.

ప్రదర్శన, విత్తనోత్పత్తి క్షేత్రం(డీఎస్పీ)
పథకం కింద వివిధ రాష్ట్రాల్లో కొత్త ప్రదర్శన, విత్తనోత్పత్తి క్షేత్రాల(డీఎస్పీఎఫ్‌)ను కొబ్బరి అభివృద్ధి మండలి(సీడీబీ) ఏర్పాటు చేస్తోంది. శాస్త్రీయ కొబ్బరి సాగు పద్ధతులను ఇవి ప్రదర్శించడంతో పాటు నాణ్యమైన నాటే సామగ్రిని వాణిజ్యపరంగా ఉత్పత్తి చేస్తాయి.

పథకం కింద ఆర్థిక సహాయం:
* కొత్త డీఎస్పీఎఫ్‌ల‌ ఏర్పాటు: కొత్తగా ఏర్పాటు చేసిన క్షేత్రాలకు తొలి రెండేళ్లలో ₹30 లక్షలను బడ్జెట్‌ నుంచి కేటాయిస్తారు.
* ప్రస్తుత క్షేత్రాల నిర్వహణ: మూడో సంవత్సరం నుంచి క్షేత్ర నిర్వహణకు హెక్టారుకు ఏటా ₹లక్ష వరకు ఆర్థిక సహాయం అందిస్తారు. దిగుబడి స్థిరపడే వరకు(15 నుంచి 20 ఏళ్లు) ఈ సహాయం కొనసాగుతుంది.

దేశవ్యాప్తంగా ఏర్పాటు చేసిన 11 డీఎస్పీఎఫ్‌ల‌లో 2.41 లక్షల నాణ్యమైన కొబ్బరి మొక్కలను 2025–26లో మండలి ఉత్పత్తి చేసింది.

నాణ్యమైన నాటే సామగ్రి ఉత్పత్తికి సహకరించే ఇతర పథకాలు:
* న్యూక్లియస్‌ కొబ్బరి విత్తన తోట ఏర్పాటు: 
నాణ్యమైన కొబ్బరి మొక్కలు, మెరుగైన రకాల ఉత్పత్తికి కొబ్బరి విత్తన తోటల ఏర్పాటుకు సహకరిస్తుంది. 2025–26లో పథకం కింద ₹24 లక్షలు కేటాయించగా, ₹20.29 లక్షలు వినియోగించారు.
* చిన్న కొబ్బరి నర్సరీల ఏర్పాటు: ప్రభుత్వ, ప్రైవేటు నర్సరీల ఏర్పాటు ద్వారా నాణ్యమైన కొబ్బరి మొక్కల ఉత్పత్తిని ప్రోత్సహిస్తోంది. 2025–26లో ఏటా 1.06 లక్షల మొక్కల సంయుక్త ఉత్పత్తి సామర్థ్యం కలిగిన 12 కొత్త నర్సరీల ఏర్పాటుకు సహాయం అందించారు. ప్రస్తుతం ఉన్న ఆరు నర్సరీల నిర్వహణకు కూడా సహాయం అందించారు.
* కొబ్బరి నర్సరీలకు గుర్తింపు, రేటింగ్‌: నర్సరీల గుర్తింపు, నాణ్యత అంచనా ద్వారా అసలైన, నాణ్యమైన నాటే సామగ్రి అందుబాటుకు భరోసా ఇస్తోంది.
* ప్రభుత్వ రంగ నర్సరీల్లో నాణ్యమైన నాటే సామగ్రి ఉత్పత్తికి సహాయం: అర్హత కలిగిన ప్రభుత్వ రంగ నర్సరీలకు ఆర్థిక సహాయం అందించడం ద్వారా కొబ్బరి మొక్కల ఉత్పత్తికి మద్దతు ఇస్తోంది. నర్సరీలను బలోపేతం చేసేందుకు 2025–26లో ₹239.35 లక్షలు అందించారు. రాష్ట్ర ప్రభుత్వ విభాగాలు, రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, ప్రభుత్వ రంగ సంస్థలు(పీఎస్‌యూ), కృషి విజ్ఞాన కేంద్రాలు(కేవీకే), కొబ్బరి అభివృద్ధి మండలి ప్రదర్శన, విత్తనోత్పత్తి(డీఎస్పీ) క్షేత్రాలు లబ్ధిదారుల్లో ఉన్నాయి. అంచనా ప్రకారం 6,850–7,500 హెక్టార్లలో కొత్తగా కొబ్బరి నాటేందుకు సరిపడే 11.97 లక్షల నాణ్యమైన నాటే మొక్కల ఉత్పత్తికి ఈ సహాయం తోడ్పడింది.

కొబ్బరి సాగు విస్తీర్ణం పెంపు
అనుకూలమైన కొత్త ప్రాంతాల్లో శాస్త్రీయ కొబ్బరి సాగు కోసం ఆర్థిక సహాయం, ప్రోత్సాహక రాయితీలు, సాంకేతిక సహకారం అందించడంపై ఈ కార్యక్రమం దృష్టి సారిస్తోంది. ప్రస్తుతం కొబ్బరి సాగు చేస్తున్న ప్రాంతాలను స్థిరీకరించి మొత్తం ఉత్పత్తిని కూడా మెరుగుపరుస్తోంది.

కొత్త ప్రాంతాల్లో కొబ్బరి మొక్కలు నాటేందుకు పథకం కింద హెక్టారుకు ₹56 వేల ఆర్థిక సహాయం అందిస్తున్నారు. ఈ మొత్తాన్ని రెండు సమాన వార్షిక వాయిదాల్లో విడుదల చేస్తారు. ఒక్కో లబ్ధిదారుకు గరిష్ఠంగా 2 హెక్టార్లు, కనిష్ఠంగా 0.08 హెక్టార్లకు–20 సెంట్లు రాయితీ లభిస్తుంది.

2024–25లో అదనంగా 2,979 హెక్టార్లను కొత్త కొబ్బరి సాగు పరిధిలోకి తీసుకురావడానికి ₹209.24 లక్షలు వినియోగించారు. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో 13,068 మంది రైతులు ఈ కార్యక్రమం ద్వారా ప్రయోజనం పొందారు.

2025–26లో కొబ్బరి సాగు విస్తీర్ణాన్ని పెంచడంపై ప్రధానంగా దృష్టి సారించారు. పలు రాష్ట్రాల్లో దాదాపు 2,175 హెక్టార్ల కొత్త విస్తీర్ణాన్ని సాగు పరిధిలోకి తీసుకొచ్చారు. కేరళం, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా, పశ్చిమ బెంగాల్‌, గుజరాత్‌, అసోం, అరుణాచల్‌ప్రదేశ్‌ ఈ రాష్ట్రాల్లో ఉన్నాయి. తోటల ఏర్పాటు, నిర్వహణకు ₹632.77 లక్షల ఆర్థిక సహాయం అందించారు. దీర్ఘకాలిక ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచేందుకు ఇది సహకరించింది.

ప్రస్తుత కొబ్బరి తోటల్లో సుస్థిర ఉత్పాదకత మెరుగుదలకు సమగ్ర కార్యక్రమం
కొబ్బరి ఆధారిత పంటల వ్యవస్థలతో సహా సమీకృత వ్యవసాయ పద్ధతుల ద్వారా కొబ్బరి తోటల ఉత్పత్తి, ఉత్పాదకతను మెరుగుపరచడం ఈ పథకం లక్ష్యం.

కొబ్బరి ఆధారిత పంటల విధానం ద్వారా ఉత్పాదకత మెరుగుదల ఈ సమగ్ర కార్యక్రమంలో ప్రధాన భాగం. సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాల వ్యవసాయ/ఉద్యాన విభాగాలు లేదా నేరుగా కొబ్బరి అభివృద్ధి మండలి ద్వారా క్లస్టర్ల ప్రాతిపదికన దీన్ని అమలు చేస్తున్నారు. వ్యయంలో నూటికి నూరు శాతం రాయితీగా హెక్టారుకు ₹42 వేలు, ఒక్కో లబ్ధిదారుకు గరిష్ఠంగా 2 హెక్టార్ల వరకు అందిస్తారు. ఈ మొత్తాన్ని రెండు సమాన వార్షిక వాయిదాల్లో విడుదల చేస్తారు.

2025–26లో పలు రాష్ట్రాల్లో 18,800 హెక్టార్లను పథకం పరిధిలోకి తీసుకొచ్చారు. 266 క్లస్టర్లుగా ఏర్పాటైన 48,696 మంది రైతులు ప్రయోజనం పొందారు. ఇందుకు ₹3,943 లక్షలు కేటాయించారు. రాష్ట్ర ప్రభుత్వ పథకాల సమన్వయం ద్వారా నాలుగు రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో మరో 5,935 హెక్టార్లను ₹1,246 లక్షల ఆర్థిక సహాయంతో పరిధిలోకి తీసుకొచ్చారు. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌, కేరళం, అసోం, గోవా, పుదుచ్చేరి ఇందులో ఉన్నాయి.

2025–26లో ఈ కార్యక్రమం కింద 8,089 హెక్టార్లకు పైగా విస్తీర్ణం, 33,250 మంది రైతులతో కేరళం గణనీయమైన వాటా కలిగి ఉంది.

ప్రస్తుత సంవత్సరంలో ప్రధాన కొబ్బరి సాగు రాష్ట్రాల్లో దేశవ్యాప్తంగా 22,430 హెక్టార్లలో ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు.

ఈ కార్యక్రమంలోని ఇతర భాగాలు:
* జల వనరుల సృష్టి: 
కొబ్బరి తోటలకు సాగునీటి సదుపాయం కల్పించేందుకు సామూహిక చెరువులు, వ్యవసాయ కుంటలు, జలాశయాల అభివృద్ధికి సహకరిస్తుంది.
* సేంద్రియ వ్యవసాయ ప్రోత్సాహం: ఉత్పత్తి, ధ్రువీకరణ, శుద్ధి, మార్కెటింగ్‌కు సహాయం అందించడం ద్వారా సేంద్రియ పద్ధతులను రైతులు స్వీకరించేందుకు తోడ్పడుతుంది.
* వ్యవసాయ యాంత్రీకరణ: శిక్షణ, ప్రదర్శనల ద్వారా వ్యవసాయ యంత్రాల వినియోగాన్ని ప్రోత్సహిస్తోంది. పరికరాల కొనుగోలు, పంట కోత అనంతర సాంకేతికతలు, శుద్ధి సాంకేతికతలకు ఆర్థిక సహాయం అందిస్తోంది.

కొబ్బరి తోటల్లో పునర్నాట్లు, పునరుజ్జీవనం
వ్యాధుల బారినపడిన, దిగుబడి ఇవ్వని, పాత, వయసు మళ్లిన చెట్ల స్థానంలో నాణ్యమైన మొక్కలను నాటడం ద్వారా కొబ్బరి ఉత్పత్తి, ఉత్పాదకతను పెంచడం ఈ పథకం లక్ష్యం. సమగ్ర సాగు పద్ధతుల ద్వారా మిగిలిన చెట్లను పునరుజ్జీవింపజేయడంపైనా దృష్టి సారిస్తోంది. రాష్ట్రాలవారీ సమస్యలను పరిష్కరిస్తూ ప్రాజెక్టుల ప్రాతిపదికన పథకాన్ని అమలు చేస్తున్నారు. రెండేళ్లలో హెక్టారుకు ₹54 వేల వరకు సహాయం అందిస్తున్నారు.

గత ఐదేళ్లలో ₹130.46 కోట్ల వ్యయంతో 25,517 హెక్టార్లను పథకం పరిధిలోకి తీసుకొచ్చారు. 2025–26లో 1,672 హెక్టార్లలో పునరుజ్జీవన కార్యక్రమాలు చేపట్టారు. వ్యాధిగ్రస్త చెట్ల తొలగింపు, కొత్త మొక్కల పునర్నాట్లు, ప్రస్తుత తోటల పునరుజ్జీవనం ఇందులో ఉన్నాయి.

కొబ్బరి వ్యవస్థను బలోపేతం చేసే అనుబంధ కార్యక్రమాలు
ప్రధాన కార్యక్రమాలతో పాటు కొబ్బరి విలువ గొలుసును బలోపేతం చేసేందుకు కొబ్బరి అభివృద్ధి మండలి పలు అనుబంధ పథకాలను అమలు చేస్తోంది:
* సాంకేతిక ప్రదర్శన/నాణ్యత పరీక్ష ప్రయోగశాల: కొబ్బరి ఆధారిత సంస్థలు, విలువ జోడించిన ఉత్పత్తుల కోసం సాంకేతిక ప్రదర్శన, నాణ్యత పరీక్షలు, శిక్షణ, ఇంక్యుబేషన్‌, సలహా సేవలను అందిస్తోంది.
* మార్కెట్‌ సమాచారం, పరిశోధన–ఎగుమతుల ప్రోత్సాహం: కొబ్బరి ఉత్పత్తుల మార్కెట్‌ అభివృద్ధి, ఉత్పత్తుల ప్రచారం, నాణ్యత మెరుగుదల, దేశీయ–అంతర్జాతీయ మార్కెట్ల విస్తరణకు సహకరిస్తోంది.
* కొబ్బరి పొట్టు, పీచు ఉత్పత్తులు మినహా ఇతర కొబ్బరి ఉత్పత్తులన్నింటికీ కొబ్బరి అభివృద్ధి మండలి ఎగుమతుల ప్రోత్సాహక మండలిగా పనిచేస్తోంది. కొబ్బరి ఉత్పత్తుల ఎగుమతిదారులకు నమోదు సదుపాయం కల్పిస్తూ 2025–26 వరకు 8,299 మంది ఎగుమతిదారులకు, 2026 జూలై 31 వరకు 8,700 మందికి నమోదు ఇచ్చింది. కొబ్బరి ఆధారిత ఉత్పత్తుల ఎగుమతి వ్యాపారం గత ఐదేళ్లలో–2021–22 నుంచి 2025–26 వరకు–₹3,236.83 కోట్ల నుంచి ₹7,038.35 కోట్లకు పెరిగింది.
* దేశీయ, అంతర్జాతీయ వాణిజ్య ప్రదర్శనల్లో ఔత్సాహికులు పాల్గొనేందుకు మండలి సహకరిస్తోంది. గత ఐదేళ్లలో 20 దేశీయ వాణిజ్య ప్రదర్శనల్లో 72 మంది ఔత్సాహికులు, అంతర్జాతీయ ప్రదర్శనల్లో 224 మంది ఎగుమతిదారులు పాల్గొనేందుకు సహాయం అందించింది.
* కొనుగోలుదారు, విక్రేత సమావేశాల్లో(బీఎస్ఎం) ఔత్సాహికులు పాల్గొనేలా ప్రధాన పరిశ్రమ సంస్థలతో మండలి కలిసి పనిచేస్తోంది. గత ఐదేళ్లలో 215 మంది ఔత్సాహికుల కోసం 392 దేశీయ కొనుగోలుదారు–విక్రేత సమావేశాలను నిర్వహించేందుకు సహకరించింది. 2022 ఏప్రిల్‌ 26–28 మధ్య నిర్వహించిన వర్చువల్‌ వాణిజ్య ప్రదర్శన కూడా ఇందులో ఉంది. ఇందులో కొబ్బరి ఉత్పత్తుల తయారీకి చెందిన 53 సంస్థలు, 347 మంది కొనుగోలుదారులు పాల్గొన్నారు. అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌, లులూ ఇండియా, లులూ దుబాయ్‌, నెస్టో గ్రూప్‌ వంటి ప్రముఖ సంస్థలతో నాలుగు సంస్థాగత సమావేశాలు, 371 వ్యక్తిగత వ్యాపార సమావేశాలు నిర్వహించారు. గత ఐదేళ్లలో ఆరుగురు ఔత్సాహికుల కోసం మూడు అంతర్జాతీయ కొనుగోలుదారు–విక్రేత సమావేశాలకు కూడా మండలి సహకరించింది.
* ప్రపంచ వాణిజ్యంపై అవగాహన కల్పించే లక్ష్యంతో ‘ప్రపంచ కొబ్బరి పరిశ్రమ–శిఖరాగ్రం దిశగా ప్రయాణం’ ఇతివృత్తంతో కొబ్బరి ఉత్పత్తుల వాణిజ్యం–మార్కెటింగ్‌పై అంతర్జాతీయ సదస్సును 2023 ఫిబ్రవరి 27–28 తేదీల్లో హైదరాబాద్‌లో నిర్వహించారు. ప్రపంచవ్యాప్తంగా భాగస్వాములు ఇందులో పాల్గొన్నారు. కొబ్బరి ఉత్పత్తుల వైద్య, ఆరోగ్య ప్రయోజనాలను నిర్ధారించే లక్ష్యంతో ఇంట‌ర్నేష‌న‌ల్ కోకోన‌ట్ క‌మ్యూనిటీ(ఐసీసీ) సహకారంతో 2025 ఆగస్టు 19–22 మధ్య కోయంబత్తూరులో అంతర్జాతీయ కోకో ఆరోగ్య సదస్సును నిర్వహించారు. 2025 సెప్టెంబరు 24–26 మధ్య ఫిలిప్పీన్స్‌లోని మనీలాలో జరిగిన వ‌ర‌ల్డ్ కోకోన‌ట్ కాంగ్రెస్‌–2025(డ‌బ్ల్యూసీసీ)లోనూ ప్రాతినిధ్యం వహించారు.
శుద్ధి సాంకేతికత, ప్యాకేజింగ్‌, ఎగుమతి ప్రక్రియలు, విదేశీ వాణిజ్య విధానాలు, మార్కెట్‌ అభివృద్ధి తదితర అంశాలపై వివిధ సంస్థల సహకారంతో ఎగుమతిదారులు, ఔత్సాహికుల కోసం మండలి సదస్సులు, కార్యశాలలను నిర్వహిస్తోంది.
* ఉత్పత్తుల నాణ్యత, సుస్థిరత, కార్మికుల ఆరోగ్యం, సంక్షేమం, పర్యావరణ పరిరక్షణకు భరోసా ఇచ్చే లక్ష్యంతో నాణ్యత ధ్రువీకరణకు సహాయక పథకాలను మండలి అమలు చేస్తోంది.
* నాణ్యమైన కొబ్బరి ఉత్పత్తులకు సొంత బ్రాండ్‌లను నిర్మించుకోవడంలో ఔత్సాహికులకు సహకరించేందుకు బ్రాండ్‌ ప్రచారానికి కూడా మండలి సహాయం అందిస్తోంది. గత ఐదేళ్లలో తొమ్మిది యూనిట్లకు సహాయం అందించింది.
* కొబ్బరి శుద్ధి యూనిట్లతో అనుసంధానమైన నిరుద్యోగ యువతకు పని ప్రదేశంలోనే అంతర్గత శిక్షణగా నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాన్ని మండలి అమలు చేస్తోంది. నైపుణ్యం కలిగిన కార్మికులను అభివృద్ధి చేయడం, కొబ్బరి నుంచి నాణ్యమైన శుద్ధి ఉత్పత్తుల తయారీకి సహకరించడం దీని లక్ష్యం. గత ఐదేళ్లలో–2021–22 నుంచి 2025–26 వరకు–24 బృందాలకు చెందిన 240 మంది శిక్షణార్థులకు నైపుణ్య శిక్షణ సహాయం అందించారు.
* కొబ్బరి శుద్ధి ఉత్పత్తులను ప్రోత్సహించడం, మార్కెట్‌ అవగాహన–డిమాండ్‌ను సృష్టించడం కోసం కొబ్బరి కియోస్క్‌లు లేదా రిటైల్‌ విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. గత ఐదేళ్లలో 15 కియోస్క్‌లకు సహాయం అందించారు.
* మండలి ప్రారంభించిన ఇతర పథకాలు:
ఏ) రైతు సమూహాలు ఉత్పత్తులను ఒకేచోట సమీకరించి, సామూహికంగా మార్కెటింగ్‌ చేసేందుకు కొనుగోలు కేంద్రాల ఏర్పాటు. దీంతో బేరసారాల సామర్థ్యం పెరిగి, మధ్యవర్తుల సంఖ్య తగ్గి, మెరుగైన ఆదాయం లభిస్తుంది. రెండు రైతు ఉత్పత్తిదారుల సంస్థలకు సహాయం అందించారు.
బీ) కొబ్బరి రైతులు, ఔత్సాహికులు, రైతు ఉత్పత్తిదారుల సంస్థలు, సహకార సంఘాలు నాణ్యమైన ఉత్పత్తులను తయారు చేసేలా ప్రోత్సహించి, సాధికారత కల్పించేందుకు మిల్లింగ్‌ కొబ్బరి గుజ్జు/బాల్‌ కొబ్బరి గుజ్జు/కనిష్ఠంగా శుద్ధి చేసిన లేత కొబ్బరికాయల కోసం ప్రాథమిక శుద్ధి కేంద్రాల ఏర్పాటు.
* ధరల మద్దతు పథకం కింద మిల్లింగ్‌, బాల్‌ కొబ్బరి గుజ్జు కొనుగోలుకు కనీస మద్దతు ధర ప్రకటనపై మండలి సిఫారసులు అందిస్తోంది. కొబ్బరి ఉత్పత్తుల దిగుమతులు/ఎగుమతులు తదితర అంశాలపై ఇతర విధాన సిఫారసులు కూడా చేస్తోంది.
* ప్రపంచ మార్కెట్‌లో ఉత్పత్తుల నాణ్యతకు భరోసా ఇచ్చేందుకు కొబ్బరి అభివృద్ధి మండలిని సమీకృత నియంత్రణ అంచనా వ్యవస్థలో చేర్చారు.
* టెక్నాల‌జీ మిష‌న్ ఆన్ కోకోన‌ట్‌(టీఎంఓసీ): చీడపీడలు–వ్యాధుల నిర్వహణ, శుద్ధి, ఉత్పత్తుల వైవిధ్యం, ఇతర సాంకేతిక ఆధారిత కార్యక్రమాలకు అవసరమైన సాంకేతికతల అభివృద్ధి–వినియోగానికి సహకరిస్తోంది.
* కేర సురక్ష బీమా పథకం: కొబ్బరి చెట్లు ఎక్కే కార్మికులు, నీరా సాంకేతిక నిపుణులు, సంకరజాతి అభివృద్ధి కార్మికులు, కొబ్బరి రంగంలో పనిచేసే ఇతర కార్మికులకు ప్రమాద బీమా రక్షణ కల్పిస్తోంది.

కొబ్బరి ప్రోత్సాహక పథకం: రంగానికి కొత్త ఊతం
చీడపీడల వ్యాప్తి, వేరుకుళ్లు వ్యాధి, వయసు మళ్లిన తోటల సమస్యలను పరిష్కరించేందుకు కేంద్ర బడ్జెట్‌ 2026–27లో కొబ్బరి ప్రోత్సాహక పథకాన్ని ప్రకటించారు. లక్ష్యిత చర్యల ద్వారా కొబ్బరి ఉత్పత్తి, ఉత్పాదకతను పెంచడం ఈ పథకం ఉద్దేశం. ప్రధాన చర్యలు:
* భారీ స్థాయిలో నాణ్యమైన కొబ్బరి మొక్కల ఉత్పత్తి
* అనుకూల ప్రాంతాల్లో కొబ్బరి సాగు విస్తరణ
* పాత, దిగుబడి ఇవ్వని కొబ్బరి తోటల్లో దశలవారీ పునర్నాట్లు, పునరుజ్జీవనం
* సమగ్ర పంట ఆరోగ్య నిర్వహణ పద్ధతుల స్వీకరణ
* విలువ జోడింపు, ఎగుమతులను బలోపేతం చేసేందుకు సమీకృత కొబ్బరి శుద్ధి యూనిట్ల ఏర్పాటు

జీడిపప్పు, కోకో రంగాలతో సహా అధిక విలువ కలిగిన వ్యవసాయానికి కేటాయించిన ₹350 కోట్ల విస్తృత కార్యక్రమంలో ఈ పథకం భాగంగా ఉంది. ఈ చర్యల ద్వారా కొబ్బరి రంగంలో సుస్థిరత, ప్రతికూల పరిస్థితులను తట్టుకొనే సామర్థ్యాన్ని బలోపేతం చేయాలని పథకం లక్ష్యంగా పెట్టుకుంది. కొబ్బరి రైతుల ఆదాయాన్ని మెరుగుపరుస్తూనే 2030వ దశకంలో కొబ్బరి, కొబ్బరి పీచు ఎగుమతుల్లో భారత్‌ను ప్రపంచ అగ్రగామిగా నిలపాలని లక్ష్యంగా పెట్టుకుంది.

నైపుణ్యాభివృద్ధి, వ్యాపార సంస్థల ఏర్పాటు కార్యక్రమాలు
కొబ్బరి రంగానికి ప్రధాన నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను కొబ్బరి అభివృద్ధి మండలి(డీడీబీ) అమలు చేస్తోంది. పంట కోత, శుద్ధి, విలువ జోడింపు రంగాల్లో శిక్షణ పొందిన, స్వావలంబన కలిగిన, సంస్థల ఏర్పాటుకు సిద్ధమైన శ్రామికశక్తిని ఈ కార్యక్రమాలు రూపొందిస్తున్నాయి.

దశాబ్దానికి పైగా కాలంగా మండలి ఫ్రెండ్స్‌ ఆఫ్‌ కోకోనట్‌ ట్రీ(ఎఫ్ఓసీటీ) కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. యాంత్రిక పరికరాలతో కొబ్బరి చెట్లు ఎక్కడం, మొక్కల సంరక్షణ, ఔత్సాహికత, సమాచార నైపుణ్యాల్లో నిరుద్యోగ యువతకు ఈ కార్యక్రమం శిక్షణ ఇస్తోంది. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో 2024–25లో నిర్వహించిన కార్యక్రమాల ద్వారా 378 మంది చెట్లు ఎక్కే కార్మికులకు శిక్షణ ఇచ్చారు.

దీనికి అదనంగా కొబ్బరి చెట్టులోని వివిధ భాగాలతో హస్తకళా వస్తువులను రూపొందించేందుకు అవసరమైన కళాత్మక నైపుణ్యాలను కొబ్బరి హస్తకళల శిక్షణ కార్యక్రమం నిరుద్యోగ యువతకు అందిస్తోంది.

2025లో విడివిడిగా నిర్వహించే శిక్షణ కార్యక్రమాల నుంచి వ్యవస్థీకృత సంస్థాగత అభివృద్ధి దిశగా కొబ్బరి అభివృద్ధి మండలి కొత్త కార్యక్రమాలను ప్రారంభించింది:

కోకోమిత్ర(కొబ్బరి చెట్లు ఎక్కే కార్మికుల కార్యదళం): శిక్షణ పొందిన కార్మికులను 6–10 మంది సభ్యులతో కూడిన నమోదిత యూనిట్లుగా ఏర్పాటు చేస్తుంది. రైతులకు సకాలంలో సేవలు అందించేందుకు ఆధునిక చెట్లు ఎక్కే పరికరాలు, మొక్కల సంరక్షణ సాధనాలు, రవాణా సహాయాన్ని ఈ బృందాలకు అందిస్తారు.

కేర కౌశల్‌ కేంద్రం: కొబ్బరి చిప్ప, కలప, పీచుతో ఉత్పత్తుల తయారీలో ప్రత్యేకత కలిగిన కొబ్బరి హస్తకళా కేంద్రాల వ్యవస్థను దేశవ్యాప్తంగా అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. చట్టబద్ధ సంస్థలుగా నమోదయ్యే 15 మంది సభ్యులతో కూడిన హస్తకళా ఉత్పత్తి బృందాలను ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తుంది.

ఆమోదం పొందిన ప్రతి కేర కౌశల్‌ కేంద్రానికి 2026–27 నుంచి ₹2.67 లక్షల ఆర్థిక సహాయం లభిస్తుంది. పనిముట్లు–పరికరాలు, ఫర్నిచర్‌, నిల్వ అలమారలు–రాక్‌లు, అవసరమైన సేవలు, అనుకోని ఖర్చులు వంటి ఉమ్మడి సదుపాయాల ఏర్పాటుకు ఈ సహాయం అందిస్తారు. హస్తకళా ఉత్పత్తుల మార్కెటింగ్‌ కార్యకలాపాలకు కూడా కార్యక్రమం సహకరిస్తుంది. కొబ్బరి ఆధారిత సూక్ష్మ సంస్థలు, గ్రామీణ ఔత్సాహికత, సుస్థిర జీవనోపాధిని ఇది ప్రోత్సహిస్తోంది.

నీరా సేకరణ, శుద్ధి సాంకేతిక నిపుణుల శిక్షణ కార్యక్రమం: పోషకాలు కలిగిన, ఆల్కహాల్‌ లేని ఆరోగ్య పానీయమైన నీరాను కొబ్బరి పుష్పగుచ్ఛాల నుంచి పులియకముందే సేకరిస్తారు. సురక్షితమైన, శాస్త్రీయ నీరా సేకరణ–శుద్ధికి నైపుణ్యం కలిగిన సాంకేతిక నిపుణులను రూపొందించేందుకు ఏడు రోజుల క్షేత్రస్థాయి శిక్షణను ఈ కార్యక్రమం అందిస్తోంది. నీరా లైసెన్సులు కలిగిన రైతు ఉత్పత్తిదారుల సంస్థల ద్వారా శిక్షణ నిర్వహిస్తున్నారు.

2025–26లో మండలి 414 అవగాహన–శిక్షణ కార్యక్రమాలను నిర్వహించింది. కొబ్బరి అభివృద్ధి మండలి పథకాలు, శాస్త్రీయ సాగు సాంకేతికత, కొబ్బరి విలువ జోడింపు అంశాలను వీటిలో వివరించారు.

సంప్రదాయం, ప్రపంచ వృద్ధి కూడలిలో కొబ్బరి రంగం
తరతరాలుగా ‘క‌ల్ప‌ వృక్షం’గా గౌరవం పొందుతున్న కొబ్బరి భారత సాంస్కృతిక, గ్రామీణ జీవనంలో లోతుగా పెనవేసుకుంది. కాలక్రమంలో ఈ రంగం సంప్రదాయ సాగు పద్ధతులను దాటి విస్తృతంగా అభివృద్ధి చెందింది. బలమైన విధానపరమైన సహాయం, రైతుల సమీకరణ, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు కొబ్బరి విలువ గొలుసును పటిష్ఠం చేశాయి.

నాటే సామగ్రిని మెరుగుపరచడం, సాగును విస్తరించడం, వయసు మళ్లిన తోటలను పునరుజ్జీవింపజేయడం కోసం చేపడుతున్న ప్రయత్నాలు రైతులకు కొత్త అవకాశాలను సృష్టిస్తున్నాయి. ఇదే సమయంలో విలువ జోడించిన కొబ్బరి ఉత్పత్తులకు పెరుగుతున్న డిమాండ్‌ ప్రపంచ మార్కెట్లలో భారత ఉనికిని విస్తరిస్తోంది. నిరంతర సంస్థాగత సహకారంతో భారత కొబ్బరి రంగం సంప్రదాయ సాంస్కృతిక చిహ్నం నుంచి ప్రపంచ ప్రాధాన్యం కలిగిన రంగంగా పరిణామం చెందింది.

References:

Ministry of Agriculture & Farmers Welfare

https://coconutboard.gov.in/docs/icj/icj-2023-02.pdf

https://coconutboard.gov.in/docs/icj/icj-2025-11.pdf

https://coconutboard.gov.in/docs/icj/icj-2026-03.pdf

https://coconutboard.gov.in/docs/farming-success-story.pdf

https://coconutboard.gov.in/docs/icj/icj-2026-04.pdf

https://coconutboard.gov.in/docs/operational-guidelines.pdf

https://coconutboard.gov.in/About.aspx

https://coconutboard.gov.in/docs/FPO-concept-note.pdf

https://coconutboard.gov.in/ProducerSocieties.aspx

https://coconutboard.gov.in/docs/anreport2024-25english.pdf

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2203006&reg=3&lang=1

https://agriwelfare.gov.in/Documents/DAFW_AnnualReport_2025_26_En.pdf

https://sansad.in/getFile/loksabhaquestions/annex/185/AU2600_MjCQOQ.pdf?source=pqals

https://sansad.in/getFile/annex/270/AS89_vpvBlL.pdf?source=pqars

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2211783&reg=3&lang=2

https://sansad.in/getFile/loksabhaquestions/annex/187/AU4007_gp2V3z.pdf?source=pqals

https://www.pib.gov.in/PressReleaseDetail.aspx?PRID=2241416&reg=3&lang=1

https://www.pib.gov.in/PressReleseDetailm.aspx?PRID=2236048&reg=3&lang=1

https://coconutboard.gov.in/docs/icj/icj-2024-01.pdf

https://sansad.in/getFile/annex/270/AS89_vpvBlL.pdf?source=pqars

https://coconutboard.gov.in/docs/Handicraft-Training.pdf

https://coconutboard.gov.in/docs/icj/icj-2025-07.pdf

https://coconutboard.gov.in/docs/icj/icj-2026-02.pdf

Ministry of Finance

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2221410&reg=3&lang=2

PIB Backgrounders

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2253483&reg=3&lang=1

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2177219&reg=3&lang=2

Click here for the pdf file. 

 

***

(Explainer ID: 159677) आगंतुक पटल : 13
Provide suggestions / comments
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , हिन्दी , Bengali , Assamese , Tamil , Kannada , Malayalam