Social Welfare
అంకెలకు మించి: భారతదేశ పాఠశాల విద్యలో ప్రగతి
యూడైస్+ 2025–26 నివేదిక (ఎన్‌ఈపీ నిర్మాణం)
Posted On:
17 AUG 2026 3:05PM
2025-26 యూడైస్+ నివేదిక భారత పాఠశాల విద్యపై సమగ్ర అంచనాను అందిస్తోంది. దేశంలోని 14.67 లక్షల పాఠశాలలు, 1.03 కోట్ల మంది ఉపాధ్యాయులు, 24.72 కోట్ల మంది విద్యార్థుల వివరాలను ఇందులో పొందుపరిచారు. విద్యార్థుల నమోదు, స్థూల నమోదు నిష్పత్తి, ఉపాధ్యాయుల అందుబాటు, విద్యార్థి–ఉపాధ్యాయ నిష్పత్తి, విద్యార్థుల కొనసాగింపు, తదుపరి తరగతులకు మారే రేట్లలో మెరుగుదల నమోదైనట్లు నివేదిక వెల్లడించింది. చదువు మానివేత(డ్రాపౌట్) రేట్లు తగ్గినట్లు కూడా పేర్కొంది. డిజిటల్, భౌతిక మౌలిక సదుపాయాల్లో పురోగతి, మహిళా ఉపాధ్యాయుల భాగస్వామ్యం పెరుగుదల, లింగ సమానత్వం, సామాజిక సమ్మిళితత్వం, అందుబాటులో ఉండే విద్యలో నిరంతర పురోగతిని కూడా నివేదిక నమోదు చేసింది. జాతీయ విద్యా విధానం–2020 కింద ఆధారాలతో కూడిన ప్రణాళిక రూపకల్పనకు ఈ అంశాలు మరింత బలం చేకూరుస్తున్నాయి.
విద్యలో సమాచార ఆధారిత పాలన: యూడైస్+ వెల్లడిస్తున్న అంశాలు
యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్ ప్లస్ (యూడైస్+) అనేది దేశవ్యాప్తంగా పాఠశాల విద్యకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని సేకరించి, నిర్వహించేందుకు పాఠశాల విద్య, అక్షరాస్యత విభాగం అభివృద్ధి చేసిన డిజిటల్ వేదిక. 2018–19లో ప్రారంభమైనప్పటి నుంచి ఆధారాలతో కూడిన ప్రణాళిక, విధాన రూపకల్పన, విద్యా ప్రగతి పర్యవేక్షణకు యూడైస్+ తోడ్పడుతోంది. అందరికీ విద్యావకాశాలు, సమానత్వం, నాణ్యమైన అభ్యాసం, విద్యార్థుల కొనసాగింపును మెరుగుపరచాలని లక్ష్యంగా పెట్టుకున్న జాతీయ విద్యా విధానం–2020 అమలును పర్యవేక్షించే కీలక సమాచార నిధిగా కూడా ఇది పనిచేస్తోంది.
పాఠశాల విద్య ముఖచిత్రం
యూడైస్+ 2025–26 నివేదిక ప్రకారం.. భారత పాఠశాల విద్యావ్యవస్థ దాదాపు 14.67 లక్షల పాఠశాలలు, 1.03 కోట్ల మంది ఉపాధ్యాయులు, 24.72 కోట్లకు పైగా నమోదిత విద్యార్థులతో మరింత బలోపేతమవుతోంది. విద్యార్థుల నమోదు స్థిరంగా కొనసాగడం, ఉపాధ్యాయుల అందుబాటు మెరుగుపడటంతో ఒక్కో పాఠశాలలో సగటున ఏడుగురు ఉపాధ్యాయులు, 169 మంది విద్యార్థులు ఉన్నారు. ఫలితంగా మొత్తం విద్యార్థి–ఉపాధ్యాయ నిష్పత్తి 24:1గా ఉంది. ఇది జాతీయ విద్యా విధానం–2020 సిఫారసు చేసిన 30:1 ప్రమాణం కంటే మెరుగైన స్థాయి.

స్థూల నమోదు నిష్పత్తి: పాఠశాల విద్యకు విస్తరిస్తున్న అందుబాటు

మాధ్యమిక దశలో స్థూల నమోదు నిష్పత్తి 71.7 శాతానికి మెరుగుపడగా, మధ్య దశలో ఇది 89.6 శాతంగా కొనసాగింది. పాఠశాల విద్యలోని అన్ని దశల్లో విద్యార్థుల నమోదు సమతులంగా ఉంది. మొత్తం నమోదులో మాధ్యమిక దశ వాటా 27.16 శాతం కాగా, ఆ తర్వాత సన్నాహక దశ 25.60 శాతం, మధ్య దశ 25.58 శాతం, ప్రారంభ దశ 21.66 శాతం వాటా కలిగి ఉన్నాయి. ఈ సమతుల నమోదు, మాధ్యమిక దశలో పెరుగుతున్న స్థూల నమోదు నిష్పత్తి విద్యావకాశాల విస్తరణలో భారత్ నిరంతర ప్రగతిని ప్రతిబింబిస్తున్నాయి. పాఠశాల విద్యా ప్రస్థానం అంతటా విద్యార్థుల భాగస్వామ్యం కొనసాగుతున్నట్లు కూడా వెల్లడిస్తున్నాయి.
అనుకూల విద్యార్థి–ఉపాధ్యాయ నిష్పత్తి: మెరుగవుతున్న అభ్యాస ఫలితాలు

2025–26లో పాఠశాల విద్యలోని అన్ని దశల్లో విద్యార్థి–ఉపాధ్యాయ నిష్పత్తి ఉపాధ్యాయుల అందుబాటులో నిరంతర మెరుగుదలను ప్రతిబింబించింది. పునాది దశలో ఈ నిష్పత్తి 10:1, సన్నాహక దశలో 12:1, మధ్య దశలో 17:1, మాధ్యమిక దశలో 21:1గా ఉంది.
ఈ అత్యంత అనుకూల నిష్పత్తులు ప్రతి విద్యార్థిపై ఎక్కువగా దృష్టి సారించేందుకు వీలు కల్పిస్తున్నాయి. తరగతి గదిలో ప్రభావవంతమైన భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తూ మెరుగైన అభ్యాస ఫలితాలకు అనువైన వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి.
విద్యార్థి–ఉపాధ్యాయ నిష్పత్తి
నిర్దిష్ట విద్యా స్థాయిలో ఒక్కో ఉపాధ్యాయుడికి ఉన్న విద్యార్థుల సంఖ్యను విద్యార్థి–ఉపాధ్యాయ నిష్పత్తి సూచిస్తుంది. ఉదాహరణకు 10:1 నిష్పత్తి ఉంటే, ఆ దశలో సగటున ప్రతి పది మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడు అందుబాటులో ఉన్నారని అర్థం. తక్కువ విద్యార్థి–ఉపాధ్యాయ నిష్పత్తి ఉంటే ప్రతి విద్యార్థిపై ఉపాధ్యాయులు ఎక్కువగా దృష్టి సారించగలుగుతారు. ఉపాధ్యాయులు–విద్యార్థుల మధ్య మెరుగైన అనుబంధం ఏర్పడి బోధన, అభ్యాస నాణ్యత పెరుగుతుంది.
మెరుగైన విద్యార్థుల కొనసాగింపు–తగ్గిన డ్రాపౌట్ రేట్లు


పిల్లలను భారత పాఠశాల విద్యావ్యవస్థలో కొనసాగించడంలో స్థిరమైన పురోగతి సాధించినట్లు యూడైస్+ 2025–26 నివేదిక వెల్లడించింది. చదువు మానివేత రేటు సన్నాహక దశలో 1.8 శాతానికి, మాధ్యమిక దశలో 7 శాతానికి తగ్గింది. మధ్య దశలో స్వల్పంగా పెరిగి 3.6 శాతానికి చేరినప్పటికీ, మూడు దశల్లోనూ చదువు మానివేత రేట్లు 2022–23తో పోలిస్తే గణనీయంగా తక్కువగా ఉన్నాయి.
విద్యార్థుల కొనసాగింపు రేట్లలోనూ ఈ సానుకూల ధోరణి కనిపించింది. పునాది దశలో 98.5 శాతం, సన్నాహక దశలో 91.1 శాతం, మధ్య దశలో 83.7 శాతం, మాధ్యమిక దశలో 51.9 శాతం కొనసాగింపు రేటు నమోదైంది. వరుస విద్యా దశల మధ్య మార్పిడి రేట్లు కూడా పటిష్ఠంగా ఉన్నాయి. పునాది దశ నుంచి సన్నాహక దశకు 99.2 శాతం, మధ్య దశకు 93.8 శాతం, మాధ్యమిక దశకు 88.3 శాతం మంది విద్యార్థులు చేరుకున్నారు. విద్యావకాశాల కొనసాగింపు, విద్యార్థుల పురోగతి స్పష్టంగా మెరుగవుతున్నట్లు ఈ గణాంకాలు తెలియజేస్తున్నాయి.
ఒకే ఉపాధ్యాయుడు ఉన్న పాఠశాలలు, విద్యార్థులు లేని పాఠశాలల్లో తగ్గుదల
2025–26లో ఒకే ఉపాధ్యాయుడితో పనిచేస్తున్న పాఠశాలల సంఖ్య దాదాపు 3 శాతం తగ్గి 1,00,843కు చేరింది. విద్యార్థుల నమోదు లేని పాఠశాలల సంఖ్య గత ఏడాది 2024–25తో పోలిస్తే 29 శాతం తగ్గి 5,663కు చేరింది. ఉపాధ్యాయుల కేటాయింపును హేతుబద్ధీకరించడం, వారి నియామకాన్ని సమర్థంగా నిర్వహించడం, దేశవ్యాప్తంగా విద్యార్థుల అవసరాలకు అనుగుణంగా విద్యా వనరులను సమర్థంగా వినియోగించేందుకు కొనసాగుతున్న ప్రయత్నాలను ఈ మెరుగుదల ప్రతిబింబిస్తోంది.

లింగ సమానత్వం–సామాజిక సమ్మిళితత్వం
మరింత సమ్మిళిత పాఠశాల విద్యావ్యవస్థ దిశగా నిరంతర పురోగతి సాధించినట్లు యూడైస్+ 2025–26 నివేదిక వెల్లడించింది. మొత్తం విద్యార్థుల నమోదులో బాలికల వాటా 48.4 శాతంగా ఉంది. పాఠశాలల్లో సమతుల లింగ నిష్పత్తిని ఇది సూచిస్తోంది. బోధనా రంగంలోనూ మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారు. మొత్తం ఉపాధ్యాయుల్లో మహిళల వాటా 54.9 శాతం.

పాఠశాలల్లో నమోదైన విద్యార్థుల సామాజిక కూర్పు విస్తృత ప్రాతినిధ్యాన్ని ప్రతిబింబిస్తోంది. మొత్తం నమోదులో ఇతర వెనుకబడిన తరగతుల విద్యార్థులు 44.9 శాతంతో అత్యధిక వాటా కలిగి ఉన్నారు. ఆ తర్వాత సాధారణ వర్గం 27.5 శాతం, షెడ్యూల్డ్ కులాలు 17.7 శాతం, షెడ్యూల్డ్ తెగలు 10 శాతం వాటా కలిగి ఉన్నాయి. షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల విద్యార్థులు కలిపి మొత్తం నమోదులో 27.7 శాతం ఉన్నారు. పాఠశాల విద్యకు సమాన అవకాశాలను ప్రోత్సహించేందుకు కొనసాగుతున్న ప్రయత్నాలను ఇది ప్రతిబింబిస్తోంది. సమ్మిళితత్వంపై ఈ నిబద్ధత ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు కూడా విస్తరించింది. ఈ వర్గంలో 57.16 శాతం మంది బాలురు, 42.84 శాతం మంది బాలికలు ఉన్నారు. అందుబాటులో ఉండే మౌలిక సదుపాయాలు, ప్రత్యేక సహాయక సేవలు, విద్యార్థులందరికీ సమాన అభ్యాస అవకాశాల ద్వారా సమ్మిళిత విద్యను ముందుకు తీసుకెళ్లేందుకు భారత్ చూపుతున్న నిబద్ధతను ఈ సమాచారం తెలియజేస్తోంది.
మౌలిక సదుపాయాల అభివృద్ధి
బోధన, అభ్యాసానికి మరింత అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించేందుకు పాఠశాల మౌలిక సదుపాయాలను ఆధునికీకరించడంలో గణనీయ పురోగతి సాధించినట్లు యూడైస్+ 2025–26 నివేదిక వెల్లడించింది. డిజిటల్ రంగంలో కంప్యూటర్లు ఉన్న పాఠశాలల వాటా 69.9 శాతానికి, అంతర్జాల అనుసంధానం ఉన్న పాఠశాలల వాటా 67.4 శాతానికి పెరిగింది. సాంకేతిక ఆధారిత విద్యకు అవకాశాలు విస్తరించాయి.

పాఠశాలల్లో ప్రాథమిక మౌలిక సదుపాయాలు కూడా స్థిరంగా మెరుగుపడ్డాయి:
* 95 శాతం పాఠశాలల్లో విద్యుత్ సదుపాయం
* 99.5 శాతం పాఠశాలల్లో సురక్షిత తాగునీరు
* 98.5 శాతం పాఠశాలల్లో బాలికల మరుగుదొడ్లు
* 97.2 శాతం పాఠశాలల్లో బాలుర మరుగుదొడ్లు
* 96.9 శాతం పాఠశాలల్లో చేతులు కడుక్కునే సదుపాయాలు
* 90.5 శాతం పాఠశాలల్లో గ్రంథాలయాలు
* 29.9 శాతం పాఠశాలల్లో వర్షపు నీటి సంరక్షణ సదుపాయాలు
* 58.2 శాతం పాఠశాలల్లో చేతి పట్టీలతో కూడిన ర్యాంపులు
ఈ డిజిటల్, భౌతిక సదుపాయాల విస్తరణ భారత విద్యారంగంలో అందుబాటు, సమ్మిళితత్వం, సమగ్ర నాణ్యతను మెరుగుపరచేందుకు కొనసాగుతున్న నిబద్ధతను ప్రతిబింబిస్తోంది.
ప్రగతి విశ్లేషణ: యూడైస్+ 2025–26 నివేదికలోని కీలక అంశాలు
అందుబాటు, సమానత్వం, నాణ్యత, మౌలిక సదుపాయాల్లో మెరుగుదల ద్వారా భారత పాఠశాల విద్యావ్యవస్థను బలోపేతం చేయడంలో నిరంతర పురోగతి సాధించినట్లు యూడైస్+ 2025–26 నివేదిక వెల్లడించింది. ఉపాధ్యాయుల అందుబాటు, అనుకూల విద్యార్థి–ఉపాధ్యాయ నిష్పత్తి, విద్యార్థుల కొనసాగింపు, తదుపరి విద్యా దశకు మార్పిడి, లింగ సమానత్వం, సామాజిక సమ్మిళితత్వం, డిజిటల్ సంసిద్ధత, పాఠశాల మౌలిక సదుపాయాల్లో సాధించిన కీలక పురోగతిని కొత్త నివేదిక ప్రముఖంగా ప్రస్తావించింది. దేశవ్యాప్తంగా విద్యా ఫలితాలను మెరుగుపరచేందుకు కొనసాగుతున్న ప్రయత్నాలకు ఇది నిదర్శనం.
సమగ్ర జాతీయ సమాచార నిధిగా యూడైస్+ ఆధారాలతో కూడిన ప్రణాళిక, సమాచారపూర్వక విధాన రూపకల్పన, పాఠశాల విద్యారంగ సమర్థ పర్యవేక్షణకు నిరంతరం తోడ్పడుతోంది. సమానమైన, సమ్మిళితమైన, సాంకేతిక ఆధారిత, విద్యార్థి కేంద్రీకృత విద్యావ్యవస్థను రూపొందించాలన్న జాతీయ విద్యా విధానం–2020 దార్శనికత దిశగా స్థిరమైన పురోగతి సాగుతున్నట్లు ఈ నివేదిక ఫలితాలు పునరుద్ఘాటిస్తున్నాయి.
References:
Ministry of Education
https://udiseplus.gov.in/#/en/page/publications https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2282141®=48&lang=1
https://dashboard.udiseplus.gov.in/
Click here to see PDF
PIB Research
***
(Explainer ID: 159593)
आगंतुक पटल : 22
Provide suggestions / comments