Social Welfare
భారత న్యాయవ్యవస్థలో డిజిటల్ పరివర్తన
ఈ–కోర్ట్స్ మిషన్ మోడ్ ప్రాజెక్టు
Posted On:
07 AUG 2026 12:38PM
ఈ–కోర్ట్స్ మిషన్ మోడ్ ప్రాజెక్టు భారత్‌లో కాగితాలపై ఆధారపడిన న్యాయవ్యవస్థను డిజిటల్ సదుపాయాలతో కూడిన, పురోగతిని గుర్తించగల న్యాయ సేవల వ్యవస్థగా మార్చింది. 2014 నుంచి కేసుల దాఖలు, పరిష్కారం దాదాపు మూడు రెట్లు పెరిగాయి. ప్రతి సంవత్సరం దాఖలైన కేసుల కంటే ఎక్కువ కేసులను న్యాయస్థానాలు స్థిరంగా పరిష్కరిస్తున్నాయి. 753 కోట్లకు పైగా కోర్టు రికార్డు పేజీలను డిజిటలీకరించారు. వేలాది ఈ–సేవా కేంద్రాలు న్యాయ సేవలను మరింత అందుబాటులోకి తెస్తూ డిజిటల్ అంతరాన్ని తగ్గిస్తున్నాయి. ఈ సంస్కరణలతో న్యాయవ్యవస్థ వేగవంతంగా, పారదర్శకంగా, ప్రతి ఒక్కరికీ మరింత చేరువగా మారుతోంది.
భారత న్యాయవ్యవస్థ డిజిటలీకరణ
వంద కోట్లకు పైగా ప్రజలకు సేవలందించే భారత న్యాయవ్యవస్థ చాలాకాలంగా కాగితపు రికార్డులు, భౌతిక మౌలిక సదుపాయాలపై ఆధారపడుతోంది. కేసులు, పత్రాలకు సంబంధించిన పనుల కోసం న్యాయస్థానాలు, ఇతర కార్యాలయాలకు వెళ్లే క్రమంలో అనేకమంది ప్రజలు అధిక ప్రయాణ ఖర్చులు, ఇతర వ్యయాలను భరించాల్సి వచ్చేది. ఈంతో ప్రజలకు న్యాయ సేవలు నెమ్మదిగా, సంక్లిష్టంగా, వ్యయభరితంగా అందేవి.
ఈ సవాళ్ల పరిష్కారానికి ప్రభుత్వం ఈ–కోర్ట్స్ మిషన్ మోడ్ ప్రాజెక్టును 2007లో ప్రారంభించింది. వివిధ కోర్టు కార్యకలాపాలు, పత్రాలను డిజిటలీకరించడం ద్వారా విచారణ ప్రక్రియను క్రమబద్ధంగా వేగవంతం చేయడం ఈ మిషన్ లక్ష్యం. న్యాయవాదులు, న్యాయమూర్తులు, గుమాస్తాలతో సహా భాగస్వాములందరికీ న్యాయ ప్రక్రియను తక్కువ వ్యయంతో, సులభంగా, పారదర్శకంగా అందుబాటులోకి తెస్తోంది. ప్రస్తుతం మూడో దశలో కొనసాగుతున్న ఈ మిషన్ సాంకేతికత సాయంతో న్యాయవ్యవస్థను సమూలంగా మార్చింది.

మొదటి దశ (2011–2015)లో 14 వేలకు పైగా న్యాయస్థానాలను కంప్యూటరీకరించారు. సాంకేతిక ఆధారిత న్యాయ సేవలకు అవసరమైన ప్రాథమిక నెట్‌వర్క్ మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసి మిషన్‌కు పునాది వేశారు.
రెండో దశ (2015–2023)లో పౌర కేంద్రీకృత సేవలను విస్తరించారు. జాతీయ న్యాయ సమాచార గ్రిడ్(ఎన్‌జేడీజీ), ఈ–ఫైలింగ్, ఈ–సేవా కేంద్రాలను ప్రవేశపెట్టారు. ఈ–సేవా కేంద్రం డిజిటల్ కోర్టు సేవలను అందించే భౌతిక సహాయ కేంద్రంగా పనిచేస్తుంది. ఈ దశలో వీడియో కాన్ఫరెన్సింగ్ మౌలిక సదుపాయాలు ఐదు రెట్లకు పైగా విస్తరించాయి. తద్వారా న్యాయ విచారణల్లో వర్చువల్‌గా పాల్గొనే సదుపాయం గణనీయంగా మెరుగుపడింది.

ప్రాజెక్టు ప్రస్తుతం మూడో దశలో (2023–2027) ఉంది.
రికార్డుల భారీ స్థాయి డిజిటలీకరణ, వర్చువల్ విచారణల విస్తృత వినియోగం, న్యాయ సంస్థల మధ్య లోతైన పరస్పర అనుసంధానం, కృత్రిమ మేధ(ఏఐ), విశ్లేషణ, ఆప్టికల్ క్యారెక్టర్ రికగ్నిషన్(ఓసీఆర్) వంటి ఆధునిక సాంకేతికతల వినియోగం ద్వారా డిజిటల్, కాగిత రహిత, మరింత మేధో సామర్థ్యం కలిగిన న్యాయస్థానాల దిశగా మార్పును ఈ దశ లక్ష్యంగా పెట్టుకుంది.
ఈ దశలో సాధించిన పురోగతి:
|
క్రమ సంఖ్య
|
అంశం
|
సాధించిన పురోగతి
|
|
1
|
పూర్తిస్థాయిలో పనిచేసే ఈ–సేవా కేంద్రాలు
|
కోర్టు ప్రాంగణాల్లో 1,806 కేంద్రాల ఏర్పాటు
|
|
2
|
కాగిత రహిత న్యాయస్థానాలకు మౌలిక సదుపాయాల ఏర్పాటు
|
474 న్యాయస్థానాలకు అవసరమైన హార్డ్‌వేర్
|
|
3
|
పటిష్ఠ డిజిటల్ మౌలిక సదుపాయాల ద్వారా కేసుల విచారణ కోసం వర్చువల్ కోర్టుల విస్తరణ
|
538 న్యాయస్థానాల్లో సదుపాయం
|
|
4
|
కేసుల ఈ–ఫైలింగ్ అమలు
|
4,519 న్యాయస్థానాలు
|
|
5
|
అందుబాటులో ఉన్న వీడియో కాన్ఫరెన్సింగ్ మౌలిక సదుపాయాల విస్తరణ, ఆధునికీకరణ
|
న్యాయస్థానాలు, జైళ్లు, ఆసుపత్రులతో సహా 7,553 కేంద్రాల్లో సదుపాయం
|
|
6
|
ఐసీటీ మౌలిక సదుపాయాలు నిరంతరం పనిచేసేందుకు సౌర విద్యుత్తు సదుపాయాలు
|
1,626 కోర్టు ప్రాంగణాల్లో ఏర్పాటు
|
|
7
|
నేషనల్ సర్వీస్ అండ్ ట్రాకింగ్ ఆఫ్ ఎలక్ట్రానిక్ ప్రాసెసెస్ సదుపాయం
|
6,895 న్యాయస్థానాల్లో అందుబాటు
|
|
8
|
అన్ని హైకోర్టులు, జిల్లా కోర్టుల వెబ్‌సైట్లను ఎస్3వాస్ వేదికకు తరలించడం
|
734 కోర్టు వెబ్‌సైట్ల తరలింపు
|
|
9
|
రెండో దశలో న్యాయస్థానాలు, న్యాయాధికారులకు అదనపు హార్డ్‌వేర్
|
18,380 న్యాయస్థానాలకు అందజేత
|
|
10
|
న్యాయస్థానాలు, పోలీసులు, జైళ్లు, ఫోరెన్సిక్ ప్రయోగశాలల మధ్య డేటా, సమాచారం సులభంగా బదిలీ అయ్యేందుకు ఇంటర్ ఆపరేబుల్ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్‌తో అనుసంధానం
|
అన్ని హైకోర్టుల్లో ఐసీజేఎస్ అమలు
|
|
11
|
భాగస్వాములందరికీ శిక్షణ
|
2,372 శిక్షణ కార్యక్రమాలు
|
|
12
|
జ్ఞాన నిర్వహణ
|
లెర్నింగ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌ను అభివృద్ధి చేస్తున్న ఐఐటీ మద్రాస్
|
|
13
|
అనుసంధానం
|
సాఫ్ట్‌వేర్ డిఫైన్డ్ వైడ్ ఏరియా నెట్‌వర్క్ సాంకేతికతతో 174 కేంద్రాల అనుసంధానం
|
న్యాయస్థానాల డిజిటలీకరణతో ప్రయోజనాలు
వర్చువల్ కోర్టులు, వీడియో కాన్ఫరెన్సింగ్ సదుపాయాలు, కేసుల స్థితిని గుర్తించే వ్యవస్థలు, పెండింగ్, పరిష్కారమైన కేసులను చూపించే డ్యాష్‌బోర్డులు, ఇతర డిజిటల్ సాధనాలు కోర్టు కార్యకలాపాలను క్రమబద్ధీకరించి వేగవంతం చేశాయి. ఈ సంస్కరణలు భాగస్వాములందరికీ ప్రయోజనం చేకూరుస్తున్నాయి.

జాతీయ న్యాయ సమాచార గ్రిడ్‌తో పెండింగ్, పరిష్కారమైన కేసుల్లో పారదర్శకత
రెండో దశలో ప్రారంభించిన జాతీయ న్యాయ సమాచార గ్రిడ్(ఎన్‌జేడీజీ) కోర్టు ఉత్తర్వులు, తీర్పులు, కేసుల వివరాలను ఎప్పటికప్పుడు గుర్తించే ప్రజలకు అందుబాటులో ఉన్న ఆన్‌లైన్ డ్యాష్‌బోర్డు. న్యాయవ్యవస్థలోని అన్ని స్థాయుల్లో పెండింగ్‌లో ఉన్న కేసుల వివరాలు ఇందులో ఉంటాయి.
సుప్రీంకోర్టు, హైకోర్టులు, జిల్లా కోర్టుల కోసం ఎన్‌జేడీజీలో మూడు ప్రత్యేక డ్యాష్‌బోర్డులు ఉన్నాయి. కింది అంశాలను గుర్తించడం ద్వారా దేశవ్యాప్తంగా న్యాయస్థానాల పనితీరుపై సమగ్ర సమాచారాన్ని ఇవి అందిస్తాయి:
* దేశవ్యాప్తంగా హైకోర్టులు, దిగువ న్యాయస్థానాల్లో పెండింగ్‌లో ఉన్న, పరిష్కారమైన కేసుల సంఖ్య.
* కేసుల స్వీకరణ, విచారణ, తీర్పు, పరిష్కారం వంటి కేసుల విభాగం, విచారణ దశలవారీ పంపిణీ.
* కక్షిదారులు అందుబాటులో లేకపోవడం, పత్రాలు పెండింగ్‌లో ఉండటం, కోర్టు స్టేలు, ఇతర ప్రక్రియాపరమైన అంశాలతో సహా కేసుల జాప్యానికి కారణాలు, ఆ జాప్యం కొనసాగిన వ్యవధి.
పెండింగ్ కేసుల సమాచారాన్ని ప్రజలకు అందుబాటులో ఉంచడం ద్వారా వ్యవస్థలో పారదర్శకత, జవాబుదారీతనాన్ని మెరుగుపరచడం ఎన్‌జేడీజీ లక్ష్యం. న్యాయ ప్రణాళిక, పర్యవేక్షణ, హైకోర్టు న్యాయమూర్తులు, జిల్లా న్యాయమూర్తులు, హైకోర్టు రిజిస్ట్రీల దూర పరిపాలనకు కూడా ఇది తోడ్పడింది.
పత్రాల ఈ–ఫైలింగ్‌తో వేగవంతమైన ప్రక్రియ
గతంలో ఫిర్యాదులు, లిఖితపూర్వక వాదనలు, ప్రత్యుత్తరాలు, ఇతర దరఖాస్తుల వంటి కోర్టు పత్రాలను ప్రజలు, న్యాయవాదులు స్వయంగా హాజరై దాఖలు చేయాల్సి వచ్చేది. ఈ–ఫైలింగ్ వ్యవస్థతో ఆ అవసరం తొలగింది. ఇప్పుడు ఎక్కడి నుంచైనా ఆన్‌లైన్‌లో పత్రాలను దాఖలు చేయవచ్చు. న్యాయ సేవలను మరింత సమ్మిళితం చేసేందుకు ఈ వ్యవస్థ ఆంగ్లంతో పాటు ప్రాంతీయ భాషలకు మద్దతు ఇస్తోంది. జిల్లా కోర్టులు, హైకోర్టులు, సుప్రీంకోర్టులో పనిచేస్తోంది.
ఈ–ఫైలింగ్ వ్యవస్థ కింది సదుపాయాలను అందిస్తుంది:
* ఆన్‌లైన్ చెల్లింపులు
* వకాలత్‌నామాల ఆన్‌లైన్ సమర్పణ
* పత్రాలపై ఈ–సంతకం
* ప్రమాణాల ఆన్‌లైన్ వీడియో రికార్డింగ్
* దరఖాస్తుల దాఖలు
* న్యాయవాదులు, కక్షిదారులకు పోర్ట్‌ఫోలియో నిర్వహణ
* కేసులను ఉమ్మడిగా నిర్వహించేందుకు సహచరులు, జూనియర్లను భాగస్వాములుగా చేర్చడం
* పూర్తయిన, పెండింగ్‌లో ఉన్న అన్ని కేసుల స్థితిని గుర్తించే డ్యాష్‌బోర్డులు
* సాధారణంగా దాఖలు చేసే వివిధ అభ్యర్థనలకు సిద్ధంగా ఉన్న నమూనాలు
ప్రారంభించినప్పటి నుంచి 2026 జూన్ 30 వరకు:
* ఈ–ఫైలింగ్ వేదిక ద్వారా 1.25 కోట్లకు పైగా కేసులను దాఖలు చేశారు.
* ఈ–చెల్లింపుల వ్యవస్థ ద్వారా కోర్టు రుసుముల కింద ₹1,404 కోట్లు, జరిమానాల కింద ₹75 కోట్ల లావాదేవీలు జరిగాయి.

పాత కోర్టు రికార్డుల డిజిటలీకరణతో సమర్థంగా నిల్వ చేయడం, తిరిగి పొందడం
మిషన్ మూడో దశలో కోట్లాది పాత కోర్టు రికార్డులను డిజిటలీకరిస్తున్నారు. దీనివల్ల విలువైన రికార్డులను భౌతిక నష్టం నుంచి పరిరక్షించవచ్చు. వాటిని వెతకడం, పరిశోధించడం మరింత వేగంగా, సమర్థంగా మారుతుంది.
దూరం నుంచి విచారణలతో తక్కువ వ్యయానికే న్యాయ ప్రక్రియలో పాల్గొనే అవకాశం
కక్షిదారులు, న్యాయవాదులు, సాక్షులు, ఇతర భాగస్వాములు వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ఇప్పుడు దూరం నుంచే విచారణల్లో పాల్గొనవచ్చు. దీంతో ప్రయాణ అవసరం తగ్గింది. నగరాలు, రాష్ట్రాల పరిధికి అతీతంగా న్యాయస్థానాలను సులభంగా ఆశ్రయించే అవకాశం లభిస్తూ న్యాయ సేవలు మరింత అందుబాటులోకి వచ్చాయి.

* న్యాయస్థానాలు, జైళ్లు, ఆసుపత్రులతో సహా 7,553 కేంద్రాలకు వీడియో కాన్ఫరెన్సింగ్ సదుపాయాలను విస్తరించారు.
* దేశవ్యాప్తంగా న్యాయస్థానాలు ఈ విధానంలో 4.18 కోట్లకు పైగా దూర విచారణలను నిర్వహించాయి.
* 11 హైకోర్టుల్లో కోర్టు విచారణల ప్రత్యక్ష ప్రసారం అందుబాటులో ఉంది.
* ట్రాఫిక్ చలాన్లను ఆన్‌లైన్‌లో పరిష్కరించేందుకు 31 వర్చువల్ కోర్టులను ఏర్పాటు చేశారు. ఈ కోర్టులకు ₹1,135.79 కోట్ల విలువైన 11.33 కోట్ల చలాన్లు వచ్చాయి.
* పరస్పర అనుసంధానిత నేర న్యాయవ్యవస్థ కింద 2024లో ప్రారంభించిన న్యాయ శ్రుతి.. నిందితులు, సాక్షులు, పోలీసు అధికారులు, ప్రాసిక్యూటర్లు, శాస్త్రీయ నిపుణులు, ఖైదీలు వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా వర్చువల్‌గా హాజరై వాంగ్మూలం ఇచ్చే వీలు కల్పిస్తుంది. దీనివల్ల సమయం, వనరులు ఆదా అవుతుండగా కేసుల పరిష్కారం వేగవంతమవుతోంది.
పోలీసులు, న్యాయస్థానాలు, జైళ్లు, ఫోరెన్సిక్ వ్యవస్థల అనుసంధానం
డిజిటలీకరణ ఇప్పుడు న్యాయస్థానాలకే పరిమితం కాకుండా మొత్తం నేర న్యాయ ప్రక్రియను అనుసంధానిస్తోంది.
* ఐసీజేఎస్(ఇంటర్ ఆపరేబుల్ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్): పోలీసులు, న్యాయస్థానాలు, జైళ్లు, ఫోరెన్సిక్ విభాగాలు, ప్రాసిక్యూషన్ మధ్య ఎఫ్ఐఆర్లు, అభియోగ పత్రాలు, ఉత్తర్వులు, నివేదికలను ఎలక్ట్రానిక్ విధానంలో ఇచ్చిపుచ్చుకునే వేదిక.
* సీసీటీఎన్‌ఎస్(క్రైమ్ & క్రిమినల్ ట్రాకింగ్ నెట్‌వర్క్ ఆండ్ సిస్టమ్): ఎఫ్‌ఐఆర్ నుంచి అభియోగ పత్రం వరకు పోలీసు ప్రక్రియలను కంప్యూటరీకరిస్తుంది. న్యాయ సంహితకు అనుసంధానమైన గడువు హెచ్చరికలను దర్యాప్తు అధికారులకు అందిస్తుంది.
* ఐటీఎస్‌ఎస్‌వో(ఇన్‌వెస్టిగేషన్ ట్రాకింగ్ సిస్టమ్ ఫర్ సెక్సువల్ అఫెన్సెస్): మహిళలు, చిన్నారులపై లైంగిక నేరాల కేసుల్లో అభియోగ పత్రాల దాఖలు గడువులకు అనుగుణంగా దర్యాప్తును పర్యవేక్షించే డ్యాష్‌బోర్డు.
* ఈ–సాక్ష్య: డిజిటల్ సాక్ష్యాలను సురక్షితంగా సేకరించి, నిర్వహించే యాప్. సాక్ష్యాల సేకరణ నుంచి కోర్టులో సమర్పించే వరకు వాటి సమగ్రతను పరిరక్షిస్తుంది.
* ఈ–సమన్స్: కోర్టు సమన్లను ఎలక్ట్రానిక్ విధానంలో రూపొందించి, పంపించి, అమలు చేసే వ్యవస్థ.
* మెడ్‌లీపీఆర్(మెడికల్ లీగల్ ఎగ్జామినేషన్ ఆండ్ పోస్ట్‌మార్టమ్ రిపోర్టింగ్): వైద్య, చట్టపరమైన పరీక్షలు, శవపరీక్ష నివేదికల కోసం ఆసుపత్రులు వినియోగించే ఆన్‌లైన్ వ్యవస్థ.
* న్యాయ శ్రుతి: నిందితులు, సాక్షులు, పోలీసులు, ప్రాసిక్యూటర్లు, ఫోరెన్సిక్ నిపుణులు వర్చువల్‌గా వాంగ్మూలం ఇచ్చేందుకు వీలు కల్పించే వీడియో కాన్ఫరెన్సింగ్ వేదిక.
* ఈ–ఫోరెన్సిక్: ఫోరెన్సిక్ ప్రయోగశాలల్లో కేసుల ప్రారంభం నుంచి ముగింపు వరకు డిజిటల్ నిర్వహణ.
* ఈ–ప్రిజన్: జైళ్లు, ఖైదీల నిర్వహణకు క్లౌడ్ ఆధారిత జాతీయ నెట్‌వర్క్.
* ఈ–ప్రాసిక్యూషన్: సకాలంలో న్యాయ సలహాలు అందేందుకు పోలీసులు, ప్రాసిక్యూషన్‌ను అనుసంధానించే డిజిటల్ వర్క్‌ఫ్లో వ్యవస్థ.
* ఎన్‌ఏఎఫ్‌ఐఎస్(నేషనల్ ఆటోమేటెడ్ ఫింగర్‌ప్రింట్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్): నేర రికార్డులతో వేలిముద్రలను ఎప్పటికప్పుడు సరిపోల్చే కేంద్రీకృత బయోమెట్రిక్ సమాచార భాండాగారం.
డిజిటల్ వేదికలతో న్యాయ కార్యకలాపాల నిరంతర పర్యవేక్షణ
న్యాయవాదులు, కక్షిదారులు, న్యాయమూర్తులు, ఇతరులు యాప్‌లు, బహుభాషా ఈ–కోర్ట్స్ సేవల పోర్టల్, ఈ–మెయిల్, ఎస్ఎంఎస్ వంటి డిజిటల్ వేదికల ద్వారా ఇప్పుడు కేసుల స్థితి, తాజా సమాచారాన్ని తెలుసుకోవచ్చు. ఈ సేవలు కేసుల పర్యవేక్షణ, పారదర్శకతను మెరుగుపరిచాయి. న్యాయస్థానాలను స్వయంగా సందర్శించాల్సిన అవసరాన్ని తగ్గించి, న్యాయ సేవల అందజేతను సులభతరం చేశాయి.
* ప్రతిరోజూ 4 లక్షలకు పైగా ఎస్‌ఎంఎస్‌లు, 6 లక్షల ఈ–మెయిళ్లు పంపుతున్నారు.
* బహుభాషా ఈ–కోర్ట్స్ సేవల పోర్టల్ ప్రతిరోజూ దాదాపు 35 లక్షల సందర్శనలను నమోదు చేస్తోంది.
* ఈ–కోర్ట్స్ సర్వీసెస్ మొబైల్ యాప్ 3.84 కోట్ల డౌన్‌లోడ్‌లను నమోదు చేసింది. కేసుల స్థితి, రోజువారీ విచారణ జాబితాలు వంటి సంబంధిత సమాచారాన్ని న్యాయవాదులు, కక్షిదారులకు అందిస్తుంది.
* జస్ట్‌ఐఎస్ యాప్ 22,594 డౌన్‌లోడ్‌లను నమోదు చేసింది. న్యాయమూర్తులు తమ న్యాయ కార్యకలాపాలను సమర్థంగా నిర్వహించడానికి, పర్యవేక్షించడానికి ఇది తోడ్పడుతుంది.
* జీపీఎస్ ఆధారిత సమన్ల పంపిణీ కోసం నేషనల్ సర్వీస్ అండ్ ట్రాకింగ్ ఆఫ్ ఎలక్ట్రానిక్ ప్రాసెసెస్:
సమన్లు, నోటీసులను ఎలక్ట్రానిక్ విధానంలో ఎప్పటికప్పుడు అందించేందుకు న్యాయస్థాన సిబ్బంది కేంద్రీకృత, జీపీఎస్ ఆధారిత వెబ్, మొబైల్ యాప్ అయిన ఎన్‌ఎస్‌టీఈపీని వినియోగిస్తారు. గతంలోని నెమ్మదైన కాగిత ఆధారిత ప్రక్రియ స్థానంలో పారదర్శకమైన, పర్యవేక్షించగల డిజిటల్ వ్యవస్థను ఎన్‌ఎస్‌టీఈపీ అందించింది. తద్వారా జిల్లాలు, రాష్ట్రాల మధ్య సమన్లను వేగంగా అందించవచ్చు.
ఈ–సేవా కేంద్రాలతో న్యాయ ప్రక్రియపై మెరుగైన అవగాహన
కోర్టు ప్రాంగణాల్లో ఏర్పాటు చేసిన ఈ–సేవా కేంద్రాలు పౌరహిత సహాయ కేంద్రాలుగా పనిచేస్తాయి. వివిధ న్యాయ విధానాలు, ప్రక్రియలపై ప్రజలు ఇక్కడ మార్గదర్శనం పొందవచ్చు. ఈ కేంద్రాలు కింది సదుపాయాలను అందిస్తాయి:
* కేసు స్థితి, తదుపరి విచారణ తేదీ, సంబంధిత వివరాలపై సందేహాలకు సమాధానాలు ఇవ్వడం.
* ధ్రువీకరించిన ప్రతుల కోసం ఆన్‌లైన్ దరఖాస్తులను ప్రాసెస్ చేయడం.
* పిటిషన్ల ఈ–ఫైలింగ్‌కు సహకరించడం—కాగితపు ప్రతులను స్కాన్ చేయడం, ఈ–సంతకాలు జోడించడం, సీఐఎస్‌లో అప్‌లోడ్ చేయడం, ఫైలింగ్ సంఖ్యను రూపొందించడం.
* ఈ–స్టాంప్ పత్రాల ఆన్‌లైన్ కొనుగోలు, ఈ–చెల్లింపుల్లో సహాయం చేయడం.
* ఆధార్ ఆధారిత డిజిటల్ సంతకాల కోసం కక్షిదారులు దరఖాస్తు చేసి, వాటిని పొందేందుకు తోడ్పడటం.
ఈ–కోర్ట్స్ మొబైల్ యాప్‌ను ఆండ్రాయిడ్/ఐఓఎస్ ఫోన్లలో డౌన్‌లోడ్ చేసుకోవడంపై అవగాహన కల్పించి, సహాయం అందించడం.
* బంధువులను జైలులో కలిసేందుకు ఈ–ములాఖత్ అపాయింట్‌మెంట్లను బుక్ చేయడం.
* న్యాయమూర్తుల సెలవుల వివరాలపై సందేహాలకు సమాధానాలు ఇవ్వడం.
* జిల్లా, హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయ సేవల ప్రాధికార సంస్థలు/కమిటీల ద్వారా ఉచిత న్యాయ సహాయం పొందేలా కక్షిదారులకు మార్గదర్శనం చేయడం.
* చలాన్లు, ఇతర స్వల్ప నేరాలను ఆన్‌లైన్‌లో రాజీ చేయడంతో సహా వర్చువల్ కోర్టుల ద్వారా ట్రాఫిక్ చలాన్ల పరిష్కారానికి సహకరించడం.
* వీడియో కాన్ఫరెన్స్ విచారణను ఏర్పాటు చేసుకోవడం, అందులో పాల్గొనే విధానాన్ని వివరించడం.
* తీర్పులు/ఉత్తర్వుల ప్రతులను ఈ–మెయిల్, వాట్సాప్ లేదా ఇతర డిజిటల్ మార్గాల్లో అందించడం.
* 2026 జూన్ 30 నాటికి అన్ని హైకోర్టుల్లో 49 ఈ–సేవా కేంద్రాలు, జిల్లా కోర్టుల్లో 2,535 ఈ–సేవా కేంద్రాలు పనిచేస్తున్నాయి.
కృత్రిమ మేధ, మెషీన్ లెర్నింగ్‌తో డిజిటల్ న్యాయ సేవలకు మరింత ఊతం
మిషన్ మూడో దశలో తదుపరి కార్యాచరణగా 2027 నాటికి హైకోర్టుల్లో కృత్రిమ మేధ, మెషీన్ లెర్నింగ్ ప్రవేశపెడుతున్నారు. మొత్తం ₹7,210 కోట్ల కేటాయింపులో ₹53.57 కోట్లను ఈ అభివృద్ధికి కేటాయించారు. ఈ సాంకేతికతల అనుసంధానం న్యాయ పరిశోధన, కేసుల నిర్వహణ, ప్రసంగాల లిఖిత రూపాంతరం, అనువాదాలు, న్యాయ నిర్ణయాలకు మద్దతును మెరుగుపరుస్తుంది.
ప్రయోగాత్మక పరిశీలనలో ఉన్న ముఖ్య కార్యక్రమాలు:
* రాజ్యాంగ ధర్మాసనం ముందున్న కేసుల్లో మౌఖిక వాదనలను కృత్రిమ మేధ, యంత్ర అభ్యసన సాధనాలు లిఖిత రూపంలోకి మారుస్తాయి. ఈ పాఠ్య ప్రతులను సుప్రీంకోర్టు వెబ్‌సైట్‌లో ప్రచురిస్తారు.
* ఎల్ఈజీఆర్ఏఏ(లీగల్ రీసెర్చ్ ఆండ్ అనలిసిస్ అసిస్టెంట్) న్యాయ పరిశోధన, పత్రాల విశ్లేషణలో న్యాయమూర్తులకు సహాయపడుతుంది.
* డిజిటల్ కోర్ట్స్ 2.1 ద్వారా న్యాయమూర్తులు, న్యాయాధికారులు కేసులను కాగిత రహిత విధానంలో నిర్వహించవచ్చు. కేసులకు సంబంధించిన సమాచారం, పనులన్నింటికీ ఇది ఒకే వేదికను అందిస్తుంది.
* ఉత్తర్వులు, తీర్పులను నిర్దేశించడంలో సహాయపడేందుకు ఇందులో మాటలను పాఠ్యంగా మార్చే ఏఎస్‌ఆర్–శ్రుతి, అనువాదానికి పాణిని సాధనాలు ఉన్నాయి.
* జాతీయ సమాచార విజ్ఞాన కేంద్రం సహకారంతో ఈ–ఎస్‌సీఆర్ పోర్టల్ ద్వారా తీర్పులను 18 భారతీయ భాషల్లోకి అనువదిస్తున్నారు. 2025 మార్చి నాటికి 36,344 హిందీ అనువాదాలతో సహా 83 వేలకు పైగా తీర్పులను అనువదించారు.
* ఐఐటీ మద్రాస్‌తో కలిసి రూపొందించిన కృత్రిమ మేధ సాధనం ఈ–ఫైలింగ్ పిటిషన్లలోని లోపాలను స్వయంచాలకంగా గుర్తించి, కేసు డేటా/మెటాడేటాను సంగ్రహిస్తుంది. 200 మంది అడ్వకేట్స్–ఆన్–రికార్డ్‌కు నమూనా వ్యవస్థ వినియోగ సదుపాయం కల్పించారు. దీన్ని ఈ–ఫైలింగ్ వ్యవస్థ, కోర్టు కేసుల నిర్వహణ సాఫ్ట్‌వేర్ ఐసీఎంఐఎస్‌తో అనుసంధానించే ప్రక్రియ కొనసాగుతోంది.
సమూలంగా మారిన న్యాయవ్యవస్థ
ఈ–కోర్ట్స్ మిషన్ భారత న్యాయవ్యవస్థను ఆధునికీకరించి, డిజిటలీకరించింది. న్యాయస్థానాలకు స్వయంగా వెళ్లడం, కాగితపు పత్రాలను సమర్పించడం వంటి ప్రయాసతో కూడిన ప్రక్రియల స్థానంలో మరింత సులభమైన, పర్యవేక్షించగల, సమర్థమైన వ్యవస్థను తీసుకొచ్చింది. కొత్త కృత్రిమ మేధ సాధనాలు వివిధ భాగస్వాములు మరింత సమర్థంగా పనిచేసేందుకు సహాయపడుతున్నాయి. ఈ చర్యలతో ఎవరైనా ఎక్కడి నుంచైనా న్యాయ సేవలను పొందవచ్చు. ప్రజలకు న్యాయ సేవల అందజేత ఇప్పుడు మరింత పారదర్శకంగా, వేగంగా, తక్కువ వ్యయంతో సాగుతోంది.

మరింత అందుబాటులోకి వచ్చిన పారదర్శక, సమర్థ న్యాయవ్యవస్థ
ఈ–కోర్ట్స్ మిషన్ గతంలో అధికంగా కాగితపు పత్రాలు, సంక్లిష్ట ప్రక్రియలపై ఆధారపడి, పారదర్శకత కొరవడిన న్యాయవ్యవస్థను సులభంగా చేరుకోగల, పారదర్శకమైన, సాంకేతిక ఆధారిత ఆన్‌లైన్ వ్యవస్థగా మార్చింది. జాతీయ న్యాయ సమాచార గ్రిడ్ తొలిసారిగా పెండింగ్ కేసుల వివరాలను ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది. పాత కోర్టు రికార్డులకు చెందిన 753 కోట్లకు పైగా పేజీలను డిజిటలీకరించి, సులభంగా వెతికే అవకాశం కల్పించారు.
ఈ కొత్త సాధనాలు, సాంకేతికతతో పెరుగుతున్న కేసుల భారాన్ని న్యాయవ్యవస్థ సమర్థంగా నిర్వహించగలుగుతోంది. మూడో దశ 2027 వరకు కొనసాగే క్రమంలో ప్రజలు ఎక్కడ ఉన్నా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా అందరికీ పనిచేసే న్యాయవ్యవస్థ లక్ష్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్తోంది.
References:
Press Information Bureau:
Ministry of Law and Justice & Others:
Click here to see pdf
***
(Explainer ID: 159543)
आगंतुक पटल : 44
Provide suggestions / comments