• Sitemap
  • Advance Search
Energy & Environment

ప్రపంచ ఏనుగుల దినోత్సవం

Posted On: 12 AUG 2026 11:35AM

ప్ర‌పంచ ఏనుగుల దినోత్స‌వం ఏనుగుల పర్యావరణ, సాంస్కృతిక ప్రాధాన్యాన్ని చాటుతోంది. ప్రపంచంలోని అడవి ఆసియా ఏనుగుల్లో దాదాపు 60 శాతం భారత్‌లోనే ఉన్నాయి. ప్రాజెక్ట్‌ ఎలిఫెంట్‌, ఏనుగుల సంరక్షణ ప్రాంతాలు, రక్షిత కారిడార్ల ద్వారా దేశం సంరక్షణ చర్యలను బలోపేతం చేసింది. శాస్త్రీయ పర్యవేక్షణ, సాంకేతిక ఆధారిత సంరక్షణ, ప్రజల భాగస్వామ్యం మానవులు, ఏనుగుల మధ్య సహజీవనానికి మరింత అండగా నిలుస్తున్నాయి. ఏనుగులు, పర్యావరణ వ్యవస్థలు, భారత సహజ వారసత్వ పరిరక్షణపై కేంద్ర ప్రభుత్వ నిబద్ధతకు ఈ నిరంతర కృషి అద్దం పడుతోంది.

భారతదేశ‌ అడవుల్లో సున్నిత మనసున్న మహాకాయం
ప్రపంచంలోని అడవి ఆసియా ఏనుగుల్లో దాదాపు 60 శాతం భారత్‌లోనే ఉన్నాయి. ప్రపంచ ఏనుగుల సంరక్షణలో దేశం పోషిస్తున్న కీలక పాత్రను ఇది స్పష్టం చేస్తోంది. ఏనుగులకు లోతైన సాంస్కృతిక ప్రాధాన్యం ఉంది. ఆరోగ్యకరమైన పర్యావరణ వ్యవస్థల్లోనూ అవి కీలక పాత్ర పోషిస్తాయి. పర్యావరణ వ్యవస్థకు ఆధారమైన జాతిగా అడవులను పరిరక్షిస్తూ, జీవవైవిధ్యానికి దోహదపడుతూ, పర్యావరణ సమతుల్యతను కాపాడతాయి. దేశవ్యాప్తంగా ఏకకాల ఏనుగుల జనాభా అంచనా (ఎస్‌ఏఐఈఈ)–2021-25 ప్రకారం భారత్‌లో 22,446 అడవి ఏనుగులు ఉన్నట్లు అంచనా. 33 ఏనుగుల సంరక్షణ ప్రాంతాలు, గుర్తించిన 150 కారిడార్లలో వీటికి రక్షణ కల్పిస్తున్నారు.

 



సుసంపన్నమైన ఈ ఏనుగుల వారసత్వం.. పెరుగుతున్న సంరక్షణ సవాళ్లను ఎదుర్కోవాల్సిన బాధ్యత కూడా దేశంపై ఉంది. ప్రతి ఏటా ఆగస్టు 12న నిర్వహించే ప్రపంచ ఏనుగుల దినోత్సవం నిరంతర ప్రపంచస్థాయి కార్యాచరణ అవసరాన్ని గుర్తుచేస్తుంది. ఆవాసాల నష్టం, విభజన, వేట, అక్రమ వన్యప్రాణి వ్యాపారం, మానవులు, ఏనుగుల మధ్య సంఘర్షణ వంటి సమస్యల పరిష్కారంపై భారత్‌ సంరక్షణ చర్యలు దృష్టి సారిస్తున్నాయి. చట్టపరమైన రక్షణ, ఆవాసాల సంరక్షణ, శాస్త్రీయ పర్యవేక్షణ, ప్రజల భాగస్వామ్యాన్ని దేశం తన సంరక్షణ కృషిలో మేళవిస్తోంది. సాంకేతిక ఆధారిత చర్యలు ఈ ప్రయత్నాలను మరింత బలోపేతం చేస్తూ అడవుల్లో ఏనుగుల దీర్ఘకాలిక మనుగడకు దోహదపడుతున్నాయి.

భారత్‌లో ఏనుగులకు తరగని ప్రాధాన్యం
భారత సహజ, సాంస్కృతిక వారసత్వంలో ఏనుగులు అంతర్భాగం. పర్యావరణ వ్యవస్థ ఆరోగ్యం, సాంస్కృతిక సంప్రదాయాలు, సామాజిక గుర్తింపుల్లో వాటికి విశేష ప్రాధాన్యం ఉంది.

పర్యావరణ ప్రాధాన్యం
అడవుల నిర్మాణం, పర్యావరణ వ్యవస్థ పనితీరును తీర్చిదిద్దే మూలాధార జాతులు ఏనుగులు. సహజంగా వలస వెళ్లే వీటి సంచార పరిధి 100 నుంచి 3 వేల చదరపు కిలోమీటర్ల వరకు ఉంటుంది. సుదూర ప్రాంతాలకు సంచరించే క్రమంలో ఇతర వన్యప్రాణులకు ఉపయోగపడే మార్గాలు, నీటి గుంటలను ఇవి రూపొందిస్తాయి. ఏనుగుల ఆహారపు అలవాట్లు పోషకాల చక్రానికి దోహదం చేస్తాయి. విత్తన వ్యాప్తితో అడవుల పునరుత్పత్తికి తోడ్పడతాయి. విభజనకు గురైన అడవులను అనుసంధానించి, జన్యు వైవిధ్యం వృద్ధి చెందేందుకు అనుకూల పరిస్థితులను కల్పిస్తాయి. అందువల్ల ఏనుగుల సంరక్షణ పర్యావరణ అనుసంధానం, అడవుల ఆరోగ్యం, విస్తృత జీవవైవిధ్యాన్ని బలోపేతం చేస్తుంది.

సాంస్కృతిక, సామాజిక ప్రాధాన్యం

 


భారత మత సంప్రదాయాలు, సాంస్కృతిక ఆచారాలు, సామాజిక గుర్తింపులను శతాబ్దాలుగా ఏనుగులు ప్రభావితం చేశాయి. ఉత్తర భారత సంప్రదాయాల్లో గణేశుడు జ్ఞానం, విఘ్నాల తొలగింపునకు ప్రతీక. చారిత్రకంగా ఏనుగులు రాజ చిహ్నాలుగా అధికారం, ప్రతిష్ఠకు సూచికగా నిలిచాయి. దక్షిణ భారతదేశంలో ఆలయ ఏనుగులు ఇప్పటికీ మతపరమైన ఆచారాలు, ఉత్సవాల్లో భాగంగా ఉన్నాయి. ఈశాన్య రాష్ట్రాల్లోని ప్రజలు గణేశుడిని తమ దేవతల స్వరూపంగా ఆరాధిస్తూ ఏనుగులను ఎంతో గౌరవిస్తారు. కొన్ని వర్గాలు సంప్రదాయంగా ఏనుగులను పెద్దలుగా, జ్ఞానానికి ప్రతీకలుగా భావిస్తాయి. భారత సాంస్కృతిక వారసత్వం, సామాజిక జీవితంలో ఏనుగులకు ఉన్న శాశ్వత స్థానాన్ని ఈ సంప్రదాయాలు చాటుతున్నాయి.

 



మహాకాయాల గణన: భారత్‌లో ఏనుగుల ప్రస్తుత స్థితి
భారత్‌ ఏనుగుల సంరక్షణ విజయగాథను గణాంకాలు స్పష్టంగా తెలియజేస్తాయి. సంరక్షణ ప్రాంతాల వ్య‌వ‌స్థ‌ నుంచి కారిడార్ల పునరుద్ధరణ వరకు ప్రతి గణాంకం దశాబ్దాల నిరంతర సంస్థాగత కృషిని ప్రతిబింబిస్తోంది.

ప్రాజెక్ట్‌ ఎలిఫెంట్‌: సమగ్ర సంరక్షణ కార్యాచరణ
ప్రాజెక్ట్‌ ఎలిఫెంట్ అనేది ఏనుగుల సంరక్షణకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ప్రధాన కార్యక్రమం. కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ అమలు చేస్తున్న ఈ కార్యక్రమం ఏనుగుల ఆవాసాల రక్షణ, పెంపుడు ఏనుగుల సంరక్షణ, మానవులు, ఏనుగుల మధ్య సంఘర్షణ తగ్గింపునకు రాష్ట్రాలకు ఆర్థిక, సాంకేతిక సహాయం అందిస్తుంది. కృత్రిమ మేధ ఆధారిత పర్యవేక్షణ, రేడియో కాలరింగ్‌, జన్యు సమాచార భాండాగారాలు, ముందస్తు హెచ్చరిక వ్యవస్థల ద్వారా శాస్త్రీయ సంరక్షణను కూడా ప్రోత్సహిస్తుంది.

డీఎన్‌ఏ ఆధారిత నమూనాల సేకరణ
ప్రాజెక్ట్‌ ఎలిఫెంట్‌ కింద చేపట్టిన శాస్త్రీయ పర్యవేక్షణ ఏనుగుల జనాభా అంచనాను బలోపేతం చేసింది. ఎస్‌ఏఐఈఈ–2021-25లో భారత్‌ తొలిసారిగా డీఎన్‌ఏ ఆధారిత ఏకకాల ఏనుగుల గణనను చేపట్టింది. ప్రత్యేక జన్యు ముద్రల ద్వారా ఒక్కో ఏనుగును గుర్తించేందుకు శాస్త్రవేత్తలు పేడ నమూనాలను విశ్లేషించారు. వివిధ ప్రాంతాల్లో పునరావృతమైన నమూనాలను గుర్తించి, జనాభా అంచనాల కచ్చితత్వాన్ని మెరుగుపరచేందుకు ఇది సహాయపడింది. డీఎన్‌ఏ ప్రొఫైలింగ్‌, బ్లాక్‌ గణన, నిర్దేశిత రేఖల వెంట సర్వేలను ఎస్‌ఏఐఈఈ మేళవించి ఏనుగుల జనాభా అంచనాకు మరింత శాస్త్రీయ దృఢత్వాన్ని కల్పించింది.

భారత్‌ ఏనుగుల కారిడార్లకు రక్షణ
భారత్‌లో ఏనుగుల సంరక్షణలో కారిడార్లు కీలక పాత్ర పోషిస్తాయి. మానవ అభివృద్ధి కార్యకలాపాలు లేదా ఇతర కారణాలతో విభజనకు గురైన పూర్వ సహజ ఆవాసాలను ఇవి అనుసంధానిస్తాయి. విడిపోయిన ఆవాసాలను కలిపేందుకు అభివృద్ధి చేసిన ప్రాంతాలే ఏనుగుల కారిడార్లు. విభజనకు గురైన ఆవాసాల మధ్య ఏనుగులు సురక్షితంగా సంచరించేందుకు ఇవి వీలు కల్పిస్తాయి. తద్వారా ఆరోగ్యకరమైన, జన్యు వైవిధ్యం కలిగిన ఏనుగుల జనాభాను కాపాడటంతో పాటు మానవులు, ఏనుగుల సంఘర్షణను తగ్గించేందుకు సహాయపడతాయి. పర్యావరణ అనుసంధానాన్ని కొనసాగిస్తూ ఏనుగుల జనాభా దీర్ఘకాలిక మనుగడకు కూడా మద్దతు ఇస్తాయి. ప్రాజెక్ట్‌ ఎలిఫెంట్‌ కింద ఏనుగుల ఆవాసాలు ఉన్న 14 రాష్ట్రాల్లో కారిడార్లను ప్రభుత్వం గుర్తించి, ధ్రువీకరించింది.

భారత వన్యప్రాణి సంస్థ సాంకేతిక సహకారంతో రూపొందించిన ‘ఎలిఫెంట్‌ కారిడార్స్‌ ఆఫ్‌ ఇండియా–2023’ ప్రకారం ఈ కారిడార్లు నాలుగు ప్రాంతాల్లో విస్తరించి ఉన్నాయి. తూర్పు–మధ్య ప్రాంతంలో అత్యధికంగా 52 కారిడార్లు ఉండగా, ఈశాన్యంలో 48, దక్షిణ ప్రాంతంలో 32, ఉత్తర ప్రాంతంలో 18 ఉన్నాయి. పశ్చిమ బెంగాల్‌లో అత్యధికంగా 26 కారిడార్లు ఉన్నాయి. దేశంలోని మొత్తం కారిడార్లలో ఇవి 17 శాతానికి పైగా ఉన్నాయి. ఈ నెట్‌వర్క్‌లో 19 అంతర్రాష్ట్ర కారిడార్లు, భారత్‌, నేపాల్‌ను అనుసంధానించే ఆరు అంతర్జాతీయ కారిడార్లు ఉన్నాయి. పర్యవేక్షణ వివరాల ప్రకారం.. 59 కారిడార్లలో (40 శాతం) ఏనుగుల సంచారం పెరిగింది. 29 కారిడార్లలో (19 శాతం) స్థిరంగా ఉండగా, మరో 29 కారిడార్లలో (19 శాతం) తగ్గింది. 15 కారిడార్లలో పరిస్థితులు దెబ్బతిన్నాయి.



ఈ కారిడార్ల రక్షణ ఆవాసాల అనుసంధానాన్ని బలోపేతం చేసి, సంఘర్షణను తగ్గిస్తూ భారత్‌లో ఏనుగుల జనాభా దీర్ఘకాలిక సంరక్షణకు మద్దతు ఇస్తుంది.

కారిడార్ల నిరంతర సంరక్షణ
శాస్త్రీయ పర్యవేక్షణ, సరిహద్దుల నిర్ధారణ, రాష్ట్రాల కార్యాచరణ, నిర్వహణ ప్రణాళికల్లో అనుసంధానం ద్వారా పర్యావరణపరంగా కీలకమైన ఈ మార్గాలను ప్రభుత్వం నిరంతరం బలోపేతం చేస్తోంది. ప్రస్తుతం 150 కారిడార్లు ఏనుగుల సంచారానికి తోడ్పడుతున్నాయి. ఈ నిరంతర కృషి ఆవాసాల అనుసంధానాన్ని బలోపేతం చేస్తూ భారత అటవీ ప్రాంతాల్లో ఏనుగులకు మరింత సురక్షితమైన సంచారాన్ని కల్పిస్తోంది.

విస్తరిస్తున్న సంరక్షణ ప్రాంతాల నెట్‌వర్క్‌

 


ఏనుగుల సంరక్షణ ప్రాంతాలు 2014 నుంచి స్థిరంగా విస్తరిస్తూ ప్రస్తుతం ఏనుగుల ఆవాసాలు ఎక్కువగా ఉన్న 14 రాష్ట్రాల్లో 80,777 చదరపు కిలోమీటర్ల పరిధికి చేరాయి. ఈ విస్తరణతో అదనంగా 8,610 చదరపు కిలోమీటర్ల ప్రాంతం రక్షణ పరిధిలోకి వచ్చింది. కీలక ఆవాసాలకు రక్షణ కల్పించి, పర్యావరణ అనుసంధానాన్ని బలోపేతం చేసింది. శాస్త్రీయ నిర్వహణను కూడా మెరుగుపరుస్తూ భారత్‌లో అడవి ఏనుగుల దీర్ఘకాలిక మనుగడకు మరింత బలమైన పునాదిని ఏర్పాటు చేసింది.

ప్రాజెక్ట్‌ ఎలిఫెంట్‌, శాస్త్రీయ జనాభా అంచనా, రక్షిత సంరక్షణ ప్రాంతాలు, అనుసంధానిత కారిడార్లు సమష్టిగా ఏనుగుల సంరక్షణను సమగ్ర ప్రాంతీయ కార్యక్రమంగా మార్చాయి. ఆసియా ఏనుగుల భవిష్యత్తుకు భరోసా కల్పించేందుకు సంప్రదాయ సంరక్షణ విలువలను ఆధునిక విజ్ఞానశాస్త్రంతో మేళవించాలన్న ప్రభుత్వ నిబద్ధతను ఈ కార్యక్రమాలు చాటుతున్నాయి.

గణనకు మించి: ప్రతి ఏనుగుకూ రక్షణ
ఏనుగుల జనాభాను అంచనా వేయడం సంరక్షణలో ఒక భాగం మాత్రమే. దీర్ఘకాలిక విజయానికి సురక్షిత ఆవాసాలు, బలమైన చట్టపరమైన రక్షణలు, స్థానిక ప్రజలతో శాంతియుత సహజీవనం అవసరం. విజ్ఞానశాస్త్రం, సాంకేతికత, మౌలిక సదుపాయాలు, ప్రజా సంక్షేమాన్ని మేళవించిన సమగ్ర సంరక్షణ విధానాన్ని కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తోంది. అడవుల్లోనూ, మానవులతో పంచుకునే భూభాగాల్లోనూ ఏనుగులకు ఈ కార్యక్రమాలు రక్షణ కల్పిస్తున్నాయి.

ఏనుగుల ఆవాసాల నిర్వహణను మెరుగుపరిచేందుకు భారత్‌ చర్యలు చేపట్టింది. ఏనుగుల సంరక్షణ ప్రాంతాల కోసం నిర్వహణ సామర్థ్య మదింపు కార్యాచరణను 2023లో ప్రారంభించారు. శివాలిక్‌, కాజీరంగా–కర్బీ ఆంగ్లాంగ్‌, మయూర్‌భంజ్‌, నీలగిరి అనే నాలుగు ప్రాతినిధ్య సంరక్షణ ప్రాంతాల్లో దీన్ని ప్రయోగాత్మకంగా పరీక్షించారు. ఆ అనుభవం ఆధారంగా కాంపా నిధుల మద్దతుతో దేశవ్యాప్తంగా ఏనుగుల సంరక్షణ ప్రాంతాలకు ప్రభుత్వం ఈ కార్యాచరణను విస్తరిస్తోంది. కొలవగల సంరక్షణ ఫలితాల ఆధారంగా పారదర్శక మదింపు, పరిస్థితులకు అనుగుణమైన నిర్వహణను ఇది వ్యవస్థీకృతం చేస్తుంది.

దేశంలోని ఏనుగుల ఆవాస ప్రాంతాలన్నింటి కోసం ప్రాంతీయ కార్యాచరణ ప్రణాళికలను రూపొందించడం ద్వారా మంత్రిత్వ శాఖ ఇటీవల ఈ ప్రాంత ఆధారిత విధానాన్ని మరింత ముందుకు తీసుకెళ్లింది. ఏనుగులు రాష్ట్రాల సరిహద్దులను దాటి సంచరిస్తాయని ఈ ప్రణాళికలు గుర్తిస్తున్నాయి. ఆవాసాల అనుసంధానం, మానవులు–ఏనుగుల సంఘర్షణ, ప్రాంతీయ నిర్వహణకు సంబంధించిన సవాళ్ల పరిష్కారానికి వివిధ పరిపాలనా పరిధుల మధ్య సమన్వయంతో కూడిన చర్యలు అవసరమని స్పష్టం చేస్తున్నాయి. ప్రాంతీయ స్థాయిలో ప్రాధాన్య సంరక్షణ, సంఘర్షణ తగ్గింపు చర్యలను రాష్ట్రాలు చేపట్టేందుకు ఈ ప్రణాళికలు ఉమ్మడి కార్యాచరణను అందిస్తాయి.

ఏనుగులకు రైల్వేలను మరింత సురక్షితంగా మార్చడం

 


రైల్వే మార్గాల్లో ఏనుగుల మరణాలను తగ్గించేందుకు ప్రభుత్వం నిర్ణయాత్మక చర్యలు చేపట్టింది. 3,452.4 కిలోమీటర్ల పరిధిలోని 127 సున్నితమైన రైల్వే మార్గ భాగాల్లో సంయుక్త సర్వేలు నిర్వహించారు. దీనికి తోడు 14 రాష్ట్రాల్లో 1,965.2 కిలోమీటర్ల పరిధిలోని 77 మార్గ భాగాల్లో అండ‌ర్‌పాస్‌లు, ఓవ‌ర్‌పాస్‌లు, ర్యాంపులు, లెవల్‌ క్రాసింగ్‌లు, వంతెనల మార్పులతో కూడిన 705 నిర్మాణాల ద్వారా ఉపశమన చర్యలు చేపట్టాలని సిఫార్సు చేశారు. ఆప్టికల్‌ ఫైబర్‌ ఆధారిత ప్ర‌వేశ‌ గుర్తింపు, భూప్ర‌కంప‌న‌ సెన్సర్లు, ఉష్ణోగ్రత ఆధారిత కెమెరాలు వంటి సాంకేతికతలను ఈ నిర్మాణాత్మక చర్యలకు జోడిస్తున్నారు.

కృత్రిమ మేధ ఆధారిత పంపిణీ శబ్ద గ్రహణ వ్యవస్థలు ప్రస్తుతం లోకో పైలట్లు, స్టేషన్‌ మాస్టర్లు, నియంత్రణ గదులకు ఎప్పటికప్పుడు హెచ్చరికలు అందిస్తున్నాయి. ఏనుగులకు సంబంధించిన ప్రతి రైలు ప్రమాదంపై సంబంధిత రాష్ట్ర అటవీ శాఖతో కలిసి సంయుక్త దర్యాప్తు చేపడుతున్నారు. ఈ నిరంతర చర్యలతో రైళ్లు ఢీకొనడం వల్ల మరణించిన ఏనుగుల సంఖ్య 2013లో 26 నుంచి 2024లో 12కు తగ్గింది. ఇది 50 శాతానికి పైగా తగ్గుదల.

జన్యు సమాచారంతో పెంపుడు ఏనుగులకు రక్షణ
శాస్త్రీయ పర్యవేక్షణ ద్వారా పెంపుడు ఏనుగుల అక్రమ వ్యాపారం, తరలింపును అరికట్టేందుకు ప్రభుత్వం రక్షణ చర్యలను బలోపేతం చేసింది. వన్యప్రాణుల రక్షణ చట్టం–1972 కింద విక్రయం, రవాణా, కొనుగోలుకు సంబంధించిన కేసులను చర్యల కోసం రాష్ట్ర ప్రధాన వన్యప్రాణి సంరక్షణ అధికారులకు పంపుతారు. నమోదిత పెంపుడు ఏనుగుల డీఎన్‌ఏ వివరాలు, శరీర ఆకృతి లక్షణాలు, యాజమాన్య సమాచారంతో కూడిన జాతీయ జన్యు సమాచార భాండాగారాన్ని 'గజ్‌ సూచనా' మొబైల్‌ యాప్‌ రూపొందించింది. ఏనుగులను తరలించే ముందు వాటి గుర్తింపును ఈ సమాచార భాండాగారం ధ్రువీకరిస్తుంది. న్యాయ విచారణల్లో విశ్వసనీయమైన నేర నిర్ధారణ ఆధారాలను కూడా అందిస్తుంది.

పెంపుడు ఏనుగుల బదిలీ లేదా రవాణా నిబంధనలు–2024
పెంపుడు ఏనుగుల తరలింపును నియంత్రించేందుకు ప్రభుత్వం పెంపుడు ఏనుగుల బదిలీ లేదా రవాణా నిబంధనలు–2024ను ప్రకటించింది. పెంపుడు ఏనుగుల అంతర్రాష్ట్ర బదిలీలను ఉన్నతస్థాయి కమిటీ పరిశీలిస్తుంది. 2023 మార్చి 3 నాటి సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ కమిటీని ఏర్పాటు చేశారు. యాప్‌, నిబంధనలు, కమిటీ సమష్టిగా పారదర్శకతను బలోపేతం చేసి పెంపుడు ఏనుగుల అక్రమ బదిలీని అరికడతాయి.

శాంతియుత సహజీవనానికి ప్రజలకు మద్దతు
వన్యప్రాణుల సంరక్షణలో స్థానిక ప్రజలు సమాన భాగస్వాములైనప్పుడే విజయం సాధ్యమవుతుంది. కేంద్ర ప్రాయోజిత ప్రాజెక్ట్‌ టైగర్‌ అండ్‌ ఎలిఫెంట్‌, వన్యప్రాణుల ఆవాసాల అభివృద్ధి పథకాల కింద ప్రభుత్వం పరిహార సహాయం అందిస్తోంది. మరణం లేదా శాశ్వత వైకల్యానికి ₹10 లక్షలు, తీవ్ర గాయాలకు ₹2 లక్షలు, స్వల్ప గాయాల చికిత్సకు ₹25 వేల వరకు సహాయం అందుతుంది. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నిబంధనలకు అనుగుణంగా పంటలు, ఆస్తి నష్టానికి పరిహారం చెల్లిస్తారు.

మానవులు, వన్యప్రాణుల సంఘర్షణపై మార్గదర్శకం ద్వారా సంఘర్షణ నిర్వహణను ప్రభుత్వం మరింత బలోపేతం చేసింది. సమస్యాత్మక ప్రాంతాల మ్యాపింగ్‌, సత్వర స్పందన బృందాలు, రాష్ట్ర, జిల్లా స్థాయి సమీక్షా కమిటీలు, వేగవంతమైన పరిహారాన్ని ఇది సిఫార్సు చేస్తుంది. ఏనుగుల సంఘర్షణ తగ్గింపునకు ప్రత్యేక మార్గదర్శకాలను 2023లో జారీ చేశారు. భాగస్వాముల మధ్య సమన్వయాన్ని ఇవి మరింత మెరుగుపరుస్తాయి. ఈ చర్యలన్నీ ఏనుగులు, ప్రజలకు రక్షణ కల్పిస్తూ దేశంలోని ఏనుగుల ఆవాస ప్రాంతాల్లో సురక్షితమైన, సుస్థిర సహజీవనాన్ని బలోపేతం చేస్తున్నాయి.

ఆరాధన నుంచి బాధ్యత దిశగా
ఏనుగులతో భారత్‌కు ఉన్న అనుబంధం నాగరిక విలువలు, ఆధునిక సంరక్షణ మధ్య విశిష్ట సమన్వయాన్ని ప్రతిబింబిస్తుంది. శతాబ్దాలుగా పూజలందుకుంటున్న ఏనుగులు ప్రకృతి పరిరక్షణ, పర్యావరణ సమతుల్యతపై భారత్‌ నిబద్ధతకు నిరంతరం స్ఫూర్తినిస్తున్నాయి. శాస్త్రీయ పరిశోధన, సాంకేతికత, బలమైన సంస్థలు, ప్రజల భాగస్వామ్యంతో ఈ వారసత్వం ఇప్పుడు మరింత బలోపేతమవుతోంది.

ఏనుగుల సంరక్షణకు కేంద్ర ప్రభుత్వం సమగ్ర కార్యాచరణను రూపొందించింది. ఆవాసాలకు రక్షణ, ఏనుగుల సంరక్షణ ప్రాంతాల విస్తరణ, కారిడార్ల పరిరక్షణ, రైల్వే భద్రత మెరుగుదల, పెంపుడు ఏనుగుల తరలింపు నియంత్రణ వంటి చర్యలు ఇందులో ఉన్నాయి. మానవులు, ఏనుగుల సంఘర్షణతో ప్రభావితమైన ప్రజలకు అందిస్తున్న సహాయం మానవులు, వన్యప్రాణుల మధ్య సహజీవనాన్ని మరింత బలోపేతం చేస్తోంది.

భారత్‌ ప్రపంచ ఏనుగుల దినోత్సవం–2026 జ‌రుపుకుంటున్న‌ వేళ ఏనుగుల సంరక్షణపై దేశ నిబద్ధత అచంచలంగా కొనసాగుతోంది. రక్షణ పొందిన ప్రతి ఆవాసం, పునరుద్ధరించిన ప్రతి కారిడార్‌, ప్రతి సామాజిక భాగస్వామ్యం ఆసియా ఏనుగుల భవిష్యత్తును బలోపేతం చేస్తాయి. వికసిత భారత్‌ లక్ష్యంలో భాగంగా దేశం తన సహజ వారసత్వం, నాగరిక సంపదను భావితరాల కోసం నిరంతరం పరిరక్షిస్తోంది.

References 

MINISTRY OF ENVIRONMENT, FOREST AND CLIMATE CHANGE

 

 

Others

 

World Elephant Day

 

***

(Explainer ID: 159538) आगंतुक पटल : 11
Provide suggestions / comments
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , हिन्दी , Bengali , Assamese , Kannada