Infrastructure
భారత్‌లో నౌకల పునర్వినియోగం: నియంత్రణ వ్యవస్థలో పరివర్తన, ప్రపంచ నాయకత్వం
Posted On:
11 AUG 2026 1:41PM
భారత్‌లో నౌకల పునర్వినియోగ రంగం ఆధునిక, అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణమైన పరిశ్రమగా పరిణామం చెందింది. 2025లో ప్రపంచంలోనే అగ్రగామి నౌకల పునర్వినియోగ దేశంగా భారత్ అవతరించింది. ప్రపంచ మార్కెట్‌లో దేశ వాటా 2024లో 30.1 శాతం నుంచి 2025లో 35.4 శాతానికి పెరిగింది. నౌకల పునర్వినియోగ రంగ పరిమాణం కూడా 1.86 మిలియన్ స్థూల టన్నుల నుంచి 2.99 మిలియన్ స్థూల టన్నులకు చేరింది. రీసైక్లింగ్ పరిమాణంలో ఇది దాదాపు 60 శాతం వృద్ధి. భారత్ పునర్వినియోగ సామర్థ్యానికి అలంగ్–సోసియా క్లస్టర్ వెన్నెముకగా కొనసాగుతోంది. సమగ్ర చట్టాలు, హాంకాంగ్ అంతర్జాతీయ ఒప్పందానికి అనుగుణమైన విధానాలు, యార్డుల ఆధునికీకరణతో భద్రత, నిబంధనల అనుసరణ, పోటీతత్వం బలోపేతమయ్యాయి.
సముద్ర పారిశ్రామిక రంగ పరిణామం
బలమైన సముద్ర రంగ వ్యవస్థ నౌకల నిర్మాణం, ఓడరేవుల కార్యకలాపాలకే పరిమితం కాదు. సేవా కాలం ముగిసిన నౌకలను బాధ్యతాయుతంగా నిర్వహించడం కూడా అవసరం. సముద్ర రంగ జీవనచక్రంలో నౌకల రీసైక్లింగ్ అంతర్భాగం. నిర్వహణ కాలం ముగిసిన నౌకలను సురక్షితంగా, పర్యావరణహితంగా, వనరులను సమర్థంగా వినియోగిస్తూ విడదీసేందుకు ఇది వీలు కల్పిస్తుంది. బలమైన నియంత్రణ వ్యవస్థ కింద ఈ ప్రక్రియ చేపడితే ఉక్కు, పునర్వినియోగానికి అనువైన ఇతర పదార్థాల వెలికితీత ద్వారా వృత్తాకార ఆర్థిక వ్యవస్థ లక్ష్యాలకు మద్దతు లభిస్తుంది. కార్మికుల ఆరోగ్యం, భద్రతకు భరోసా కల్పిస్తూ పర్యావరణాన్ని కూడా పరిరక్షిస్తుంది.
బలమైన చట్టాలు, మెరుగైన సంస్థాగత పర్యవేక్షణతో సంప్రదాయ నౌకల విచ్ఛిన్న పద్ధతుల నుంచి అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణమైన పరిశ్రమగా ఈ రంగం మారింది. నిబంధనల అనుసరణ, సుస్థిరత, కార్మికుల భద్రత ఇప్పుడు కార్యకలాపాల్లో ప్రధాన అంశాలుగా నిలిచాయి. ఈ సంస్కరణలు ప్రపంచస్థాయిలో భారత్ స్థానాన్ని బలోపేతం చేశాయి. పర్యావరణహిత నౌకల రీసైక్లింగ్‌కు భారత్ ప్రస్తుతం ప్రముఖ గమ్యస్థానంగా ఎదిగింది.
నౌకల రీసైక్లింగ్ ఎందుకు ముఖ్యం?
వనరుల భద్రత, ఆర్థిక వృద్ధి, పర్యావరణ సుస్థిరత పరంగా నౌకల రీసైక్లింగ్ భారత్‌కు వ్యూహాత్మక ప్రాధాన్యం కలిగి ఉంది.
పర్యావరణ ప్రాధాన్యం
* నియంత్రిత నౌకల రీసైక్లింగ్ కాలంచెల్లిన నౌకలను అసురక్షితంగా పారవేయకుండా నిరోధిస్తుంది. సముద్ర, తీరప్రాంత కాలుష్య ముప్పును తగ్గిస్తుంది.
* కఠినమైన నియంత్రణ పర్యవేక్షణ కింద ప్రమాదకర పదార్థాలను సురక్షితంగా నిర్వహించేందుకు సరైన రీసైక్లింగ్ పద్ధతులు భరోసా ఇస్తాయి.
వనరుల ప్రాధాన్యం
* దేశీయ ఉక్కు పరిశ్రమకు అవసరమైన ఇనుప తుక్కు నౌకల రీసైక్లింగ్ ద్వారా గణనీయంగా లభిస్తుంది. దిగుమతి చేసుకునే ముడిసరకులపై ఆధారపడటాన్ని తగ్గించి, సరఫరా భద్రతను బలోపేతం చేస్తుంది.
* ఉక్కును వెలికితీసి తిరిగి వినియోగించడం ద్వారా వనరులను సమర్థంగా ఉపయోగించడంతో పాటు వృత్తాకార ఆర్థిక వ్యవస్థకు ప్రోత్సాహం లభిస్తుంది.
* ప్రాథమిక ఉక్కు ఉత్పత్తితో పోలిస్తే రీసైకిల్ చేసిన ఉక్కుకు గణనీయంగా తక్కువ ఇంధనం అవసరం. గ్రీన్‌హౌజ్ వాయు ఉద్గారాలు కూడా తక్కువగా ఉంటాయి. దీంతో భారత్ సుస్థిరత, కర్బన ఉద్గారాల తగ్గింపు లక్ష్యాలకు మద్దతు లభిస్తుంది.
ఆర్థిక, పారిశ్రామిక ప్రాధాన్యం
* నౌకల రీసైక్లింగ్ రంగం భారీ స్థాయిలో ఉపాధిని సృష్టిస్తుంది. నౌకల విచ్ఛిన్నం, ప్రాసెసింగ్, పదార్థాల వెలికితీతలో నిమగ్నమైన కార్మికుల జీవనోపాధికి అండగా నిలుస్తుంది.
* అనుబంధ పరిశ్రమల విస్తృత నెట్‌వర్క్‌కు మద్దతు ఇస్తుంది. రవాణా, ఉక్కు రీ–రోలింగ్ మిల్లులు, పరికరాల సరఫరాదారులు, వ్యర్థాల నిర్వహణ సేవలు ఇందులో ఉన్నాయి.
* తిరిగి పొందిన ఉక్కు, పునర్వినియోగ విడిభాగాలు దేశీయ తయారీ, పారిశ్రామిక ఉత్పత్తికి మద్దతు ఇస్తాయి. మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్ వంటి జాతీయ కార్యక్రమాలకు ఇది అనుగుణంగా ఉంటుంది.
అగ్రస్థానంలో భారత్
భారత్‌లో నౌకల రీసైక్లింగ్ రంగం ఇటీవలి సంవత్సరాల్లో స్థిరమైన వృద్ధిని సాధించింది. ఐక్యరాజ్య సమితి వాణిజ్య, అభివృద్ధి సదస్సు తాజా నివేదిక ప్రకారం 2025లో నౌకల రీసైక్లింగ్‌లో భారత్ ప్రపంచంలో మొదటి స్థానంలో నిలిచింది. ప్రపంచ నౌకల రీసైక్లింగ్‌లో భారత్ వాటా 2024లో 30.1 శాతం నుంచి 2025లో 35.4 శాతానికి పెరిగింది. దేశ సముద్ర, పారిశ్రామిక అభివృద్ధిలో ఇది కీలక మైలురాయి.
భారత్‌లో నౌకల రీసైక్లింగ్ పరిమాణం 2024లో 1.86 మిలియన్ స్థూల టన్నుల (జీటీ) నుంచి 2025లో 2.99 మిలియన్ జీటీకి పెరిగింది. రీసైక్లింగ్ పరిమాణంలో ఇది దాదాపు 60 శాతం వృద్ధి. దేశ సామర్థ్యం విస్తరిస్తున్నట్లు ఈ పెరుగుదల స్పష్టం చేస్తోంది. ప్రపంచ మార్కెట్‌లో భారత నౌకల రీసైక్లింగ్ యార్డుల పోటీతత్వం పెరుగుతున్నట్లు కూడా సూచిస్తోంది. ప్రపంచంలో అగ్రగామి నౌకల రీసైక్లింగ్ దేశంగా ఎదగాలని మారిటైమ్ ఇండియా విజన్–2030 కింద నిర్దేశించిన లక్ష్యాన్ని భారత్ ఐదేళ్ల ముందుగానే సాధించింది.

అలంగ్–సోసియా: భారత్ నౌకల రీసైక్లింగ్ రంగానికి చోదకశక్తి
గుజరాత్‌లోని అలంగ్–సోసియా నౌకల రీసైక్లింగ్ క్లస్టర్ భారత్ రీసైక్లింగ్ సామర్థ్యానికి వెన్నెముకగా నిలుస్తోంది. ప్రపంచంలోనే అతిపెద్ద నౌకల రీసైక్లింగ్ కేంద్రంగా దీనికి గుర్తింపు ఉంది. భారత్‌లో జరిగే నౌకల రీసైక్లింగ్ కార్యకలాపాల్లో దాదాపు 98 శాతం ఈ క్లస్టర్‌లోనే సాగుతున్నాయి. ఏటా దాదాపు 6 మిలియన్ జీటీ రీసైక్లింగ్ సామర్థ్యం దీనికి ఉంది. సహజ వనరులను వినియోగించకుండానే అలంగ్‌లో ఏటా దాదాపు 3.50 మిలియన్ మెట్రిక్ టన్నుల ఉక్కు ఉత్పత్తి అవుతోంది. అధీకృత నౌకల రీసైక్లింగ్ యార్డులు, దిగువస్థాయి ఉక్కు రీ–రోలింగ్ మిల్లులు, వ్యర్థాల నిర్వహణ మౌలిక సదుపాయాలు దీనికి అండగా ఉన్నాయి. కొన్నేళ్లుగా విస్తృత ఆధునికీకరణకు నోచుకున్న ఈ క్లస్టర్ ప్రపంచ నౌకల రీసైక్లింగ్ మార్కెట్‌తో భారత్‌కు ప్రధాన అనుసంధాన కేంద్రంగా ఉంది.
నౌకల రీసైక్లింగ్ సామర్థ్యాన్ని దాదాపు రెట్టింపు చేసి 9 మిలియన్ లైట్ డిస్‌ప్లేస్‌మెంట్ టన్నులకు (ఎల్‌డీటీ) పెంచాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుంది. అలంగ్ నౌకల రీసైక్లింగ్ యార్డు ప్రణాళికాబద్ధ అభివృద్ధి ద్వారా ఈ విస్తరణ చేపడతారు. భవిష్యత్తు డిమాండ్‌ను తీర్చేందుకు సమగ్ర బృహత్ ప్రణాళికను రూపొందించారు. మౌలిక సదుపాయాల మెరుగుదల, నౌకల రీసైక్లింగ్ మార్కెట్‌లో భారత్ పోటీతత్వాన్ని బలోపేతం చేయడంపై ఈ ప్రణాళిక దృష్టి సారిస్తుంది.
అలంగ్–సోసియా నౌకల రీసైక్లింగ్ యార్డులోని భద్రతా శిక్షణ, కార్మిక సంక్షేమ సంస్థ ఇప్పటివరకు 1.5 లక్షలకు పైగా కార్మికులకు శిక్షణ ఇచ్చింది. వృత్తిపరమైన భద్రత, ప్రమాదకర పదార్థాల నిర్వహణ, అత్యవసర పరిస్థితుల్లో స్పందన వంటి అంశాలు శిక్షణలో ఉన్నాయి. దీనికి తోడు కోల్‌కతాలోని అమర్ ఐరన్ ఉద్యోగ్‌లో ఒక నౌకల రీసైక్లింగ్ యార్డు, కేరళలో స్టీల్ ఇండస్ట్రియల్స్ కేరళ లిమిటెడ్ (సిల్క్) పరిధిలో మరో యార్డు ఉన్నాయి.


అలంగ్–సోసియా నౌకల రీసైక్లింగ్ యార్డు
భారత నౌకల రీసైక్లింగ్ యార్డుల్లో ఇటీవలి సంవత్సరాల్లో భారీ స్థాయి ఆధునికీకరణ చేపట్టారు. ప్రస్తుతం కింది సదుపాయాలు, ఏర్పాట్లతో అవి కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి:
* ఇంజినీరింగ్ ప్రమాణాలతో రూపొందించి, హద్దులు నిర్దేశించిన రీసైక్లింగ్ స్థలాలు
* ద్రవాలు ఇంకని పని ఉపరితలాలు, మురుగునీటి పారుదల వ్యవస్థలు
* యాంత్రిక పదార్థాల నిర్వహణ, ఎత్తే పరికరాలు
* ప్రమాదకర వ్యర్థాల కోసం ప్రత్యేక నిల్వ ప్రదేశాలు
* అధీకృత దిగువస్థాయి వ్యర్థాల శుద్ధి, పారవేత వ్యవస్థలతో అనుసంధానాలు
* క్రమబద్ధమైన భద్రత, ఆరోగ్యం, అత్యవసర స్పందన ఏర్పాట్లు
ఈ మెరుగుదలలు భారత నౌకల రీసైక్లింగ్ యార్డుల్లో భద్రత, పర్యావరణ నిబంధనల అనుసరణ, కార్యాచరణ సామర్థ్యాన్ని బలోపేతం చేశాయి.
నియంత్రణ, నిబంధనల అనుసరణ వ్యవస్థ
నౌకల రీసైక్లింగ్ కార్యకలాపాల కోసం భారత్ సమగ్ర చట్టబద్ధ, నియంత్రణ వ్యవస్థను ఏర్పాటు చేసింది. ఇది అంతర్జాతీయ ఒప్పందాలు, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఉత్తమ పద్ధతులకు అనుగుణంగా ఉంది. నౌకను సిద్ధం చేయడం, ధ్రువీకరణ, యార్డు అనుమతి, కార్యకలాపాలు, నిబంధనల అనుసరణ పర్యవేక్షణతో సహా మొత్తం నౌకల రీసైక్లింగ్ జీవనచక్రాన్ని ఈ వ్యవస్థ నియంత్రిస్తుంది.
చట్టపరమైన, సంస్థాగత నిర్మాణం
* నౌకల రీసైక్లింగ్ చట్టం–2019: భారత్‌లో నౌకల రీసైక్లింగ్‌ను నియంత్రించే ప్రధాన చట్టపరమైన కార్యాచరణను ఈ చట్టం అందిస్తుంది. అంతర్జాతీయ ప్రమాణాలను దేశీయంగా అమలులోకి తెస్తుంది. నౌకాయాన డైరెక్టరేట్ జనరల్‌ను జాతీయ ప్రాధికార సంస్థగా నిర్దేశిస్తుంది. అనుమతులు, ధ్రువీకరణ, తనిఖీలు, అమలు యంత్రాంగాలను తప్పనిసరి చేస్తుంది.
* నౌకల రీసైక్లింగ్ నిబంధనలు–2021: విధానపరమైన, సాంకేతిక అవసరాలను నిర్దేశించడం ద్వారా ఈ నిబంధనలు చట్టాన్ని కార్యరూపంలోకి తీసుకొస్తాయి. సదుపాయాలకు అనుమతి, నౌకల రీసైక్లింగ్ ప్రణాళికలు, ప్రమాదకర పదార్థాల నిర్వహణ, కార్మికుల భద్రత, శిక్షణ, నివేదికల సమర్పణ బాధ్యతలు ఇందులో ఉన్నాయి.
* నౌకల రీసైక్లింగ్ నియంత్రణలు–2026: వివరణాత్మక కార్యాచరణ, భద్రత, పర్యావరణ ప్రమాణాల ద్వారా ఈ నియంత్రణలు అమలును బలోపేతం చేస్తాయి. నౌకల రీసైక్లింగ్ కేంద్రాలన్నింటిలో ఏకరీతి నిబంధనల అనుసరణ, సమర్థమైన పర్యవేక్షణకు మద్దతు ఇస్తాయి.
చట్టం, నిబంధనలు, నియంత్రణలు సమష్టిగా భారత్‌లో నౌకల రీసైక్లింగ్‌కు క్రమబద్ధమైన, అమలు చేయగల నియంత్రణ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నాయి. దేశీయ పద్ధతులను అంతర్జాతీయంగా ఆమోదించిన ప్రమాణాలకు అనుగుణంగా మారుస్తున్నాయి.
హాంకాంగ్ అంతర్జాతీయ ఒప్పందం(హెచ్‌కేసీ)తో అనుసంధానం
నౌకల సురక్షిత, పర్యావరణహిత రీసైక్లింగ్‌కు సంబంధించిన హాంకాంగ్ అంతర్జాతీయ ఒప్పందం ఈ రంగాన్ని నియంత్రించే ప్రధాన అంతర్జాతీయ సాధనం. నౌకలు, రీసైక్లింగ్ కేంద్రాలకు చట్టబద్ధమైన తప్పనిసరి నిబంధనలను ఇది నిర్దేశిస్తుంది. ఈ ఒప్పందం 2025 జూన్ 26 నుంచి అమలులోకి వచ్చింది. ఆ తేదీ నుంచి నిబంధనల అనుసరణ తప్పనిసరిగా మారింది. నౌకల రీసైక్లింగ్ చట్టం, నిబంధనలు, నియంత్రణల ద్వారా భారత్ తన దేశీయ వ్యవస్థను దీనికి అనుగుణంగా మార్చింది. నౌకల రీసైక్లింగ్ యార్డుల ఆధునికీకరణకు ₹53.5 కోట్ల ఆర్థిక సహాయం అందించారు. ఈ మద్దతుతో 115 కేంద్రాలు హాంకాంగ్ ఒప్పంద నిబంధనలకు అనుగుణంగా మారాయి.
గుజరాత్‌లోని అలంగ్‌లో 35 నౌకల రీసైక్లింగ్ యార్డులు ఐరోపా సమాఖ్య హరిత జాబితాలో చోటు కోసం దరఖాస్తు చేశాయి. భారత యార్డుల తనిఖీ ప్రక్రియను ఐరోపా సమాఖ్య ప్రారంభించింది. నౌకల రీసైక్లింగ్ కేంద్రాల 16వ ఐరోపా జాబితా ముసాయిదాలో శ్రీరామ్ వెసెల్ స్క్రాప్, వై.ఎస్. ఇన్వెస్ట్‌మెంట్స్‌కు చోటు లభించింది.
ఐహెచ్‌ఎంతో సురక్షిత రీసైక్లింగ్‌కు భరోసా
ప్రమాదకర పదార్థాల జాబితా (ఐహెచ్‌ఎం) సురక్షిత నౌకల రీసైక్లింగ్‌లో కీలక అంశం. నౌక సేవా కాలం అంతటా, రీసైక్లింగ్‌కు ముందు అందులో ఉన్న ప్రమాదకర పదార్థాలను ఇది గుర్తించి నమోదు చేస్తుంది. జీవితచక్ర ఆధారిత నిబంధనల అనుసరణ విధానాన్ని భారత్ పాటిస్తోంది. అధీకృత రీసైక్లింగ్ కేంద్రాల్లోకి నౌకలు ప్రవేశించే ముందు పారదర్శకత, గుర్తించగల సామర్థ్యం, సమర్థమైన ముప్పు నివారణకు ఇది భరోసా ఇస్తుంది.
షిప్-బ్రేకింగ్ క్రెడిట్ నోట్ పథకం
నౌకా నిర్మాణ ఆర్థిక సహాయ పథకం 2.0 కింద ప్రవేశపెట్టిన షిప్-బ్రేకింగ్ క్రెడిట్ నోట్ పథకం నిబంధనలకు అనుగుణంగా పనిచేసే భారత నౌకల రీసైక్లింగ్ యార్డుల్లో నౌకలను రీసైకిల్ చేసేందుకు యజమానులను ప్రోత్సహిస్తుంది. భారత నౌకా నిర్మాణ యార్డుల్లో కొత్త నౌకల నిర్మాణానికి కూడా ఊతమిస్తుంది. రీసైకిల్ చేసిన నౌక తుక్కు విలువలో 40 శాతానికి సమానమైన రుణపత్రాన్ని జారీ చేయడం ద్వారా నౌకల విచ్ఛిన్నానికి ఈ పథకం ప్రోత్సాహం అందిస్తుంది. భారత నౌకా నిర్మాణ యార్డులో నిర్మించే కొత్త నౌక విలువలో 5 శాతం వరకు చెల్లింపునకు దీన్ని వినియోగించుకోవచ్చు. సుస్థిర నౌకల రీసైక్లింగ్‌తో పాటు భారత్ నౌకా నిర్మాణ పరిశ్రమ వృద్ధికి ఈ పథకం మద్దతు ఇస్తుంది.
మాజీ ఐఎన్‌ఎస్ విరాట్–భారత్ బాధ్యతాయుత నౌకల రీసైక్లింగ్ సామర్థ్యానికి నిదర్శనం

గుజరాత్‌లోని అలంగ్‌లో మాజీ ఐఎన్‌ఎస్ విరాట్ రీసైక్లింగ్ భారత్‌లో చేపట్టిన అత్యంత కీలక నౌకల రీసైక్లింగ్ ప్రాజెక్టుల్లో ఒకటిగా నిలిచింది. భారత నౌకాదళంలో 30 ఏళ్లు, బ్రిటన్ రాయల్ నేవీలో 27 ఏళ్లు సేవలందించిన ఈ విమాన వాహక నౌకను 2017 మార్చిలో సేవల నుంచి తప్పించారు. రీసైక్లింగ్ కోసం 2020 సెప్టెంబరులో అలంగ్‌కు చేరుకుంది. ప్రపంచంలో అత్యధిక కాలం సేవలందించిన యుద్ధనౌకల్లో ఒకటిగా గిన్నిస్ ప్రపంచ రికార్డులు గుర్తించిన మాజీ ఐఎన్‌ఎస్ విరాట్.. దశాబ్దాల విశిష్ట నౌకాదళ సేవలకు ప్రతీకగా నిలిచింది. దాని చివరి ప్రయాణం పర్యావరణపరంగా బాధ్యతాయుతమైన నౌకల రీసైక్లింగ్‌లో భారత్‌కు పెరుగుతున్న సామర్థ్యాన్ని చాటింది.
సేవా కాలంలో ఈ నౌక 22,622 గంటలకు పైగా విమాన కార్యకలాపాలను నమోదు చేసింది. 2,252 రోజులు సముద్రంలో గడిపి, 5.88 లక్షల నాటికల్ మైళ్లకు పైగా ప్రయాణించింది. ఇది 10.94 లక్షల కిలోమీటర్లకు సమానం. ఇంత భారీ, సంక్లిష్టమైన నౌకను రీసైకిల్ చేయడం విలువైన పదార్థాలను సురక్షితంగా వెలికితీయగల భారత్ సామర్థ్యాన్ని చాటుతోంది. దేశంలో పరిణామం చెందుతున్న పర్యావరణ, వృత్తిపరమైన భద్రతా ప్రమాణాలను కూడా ప్రతిబింబిస్తూ ఉపాధి, ఆర్థిక కార్యకలాపాలకు మద్దతు ఇస్తోంది.
బాధ్యతాయుత రీసైక్లింగ్ వ్యవస్థకు బలం
భారత్‌లో నౌకల రీసైక్లింగ్ రంగం ఆధునిక, నియంత్రిత, అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణమైన పరిశ్రమగా పరిణామం చెందింది. వనరుల భద్రత, ఆర్థిక వృద్ధి, ఉపాధి కల్పన, పర్యావరణ సుస్థిరతకు ఈ రంగం దోహదపడుతోంది. నిరంతర మౌలిక సదుపాయాల ఆధునికీకరణ, సంస్కరణల ద్వారా నౌకల రీసైక్లింగ్ వ్యవస్థ భద్రత, పోటీతత్వాన్ని భారత్ బలోపేతం చేసింది. 2025లో ప్రపంచంలో అగ్రగామి నౌకల రీసైక్లింగ్ దేశంగా భారత్ ఎదగడం ఈ ప్రయత్నాల విజయాన్ని ప్రతిబింబిస్తోంది. మార్కెట్ వాటా, రీసైక్లింగ్ పరిమాణంలో పెరుగుదల భారత నౌకల రీసైక్లింగ్ యార్డుల విస్తరిస్తున్న సామర్థ్యం, పోటీతత్వాన్ని చాటుతోంది. మారిటైమ్ ఇండియా విజన్–2030 కింద చేపట్టిన విధాన చర్యల సమర్థతను కూడా ఈ విజయం స్పష్టం చేస్తోంది. నౌకల రీసైక్లింగ్ రంగం నిరంతరం పరిణామం చెందుతున్న నేపథ్యంలో విశ్వసనీయ గమ్యస్థానంగా కొనసాగేందుకు భారత్ పటిష్ఠ స్థితిలో ఉంది.
References
Ministry of Ports, Shipping and Waterways
https://dgma.gov.in/engineering-wing/ew-ship-recycling-in-india
https://shipmin.gov.in/en/content/nodal-responsibility-entire-shipbuilding-and-ship-repair-industry-vests-ministry-shipping
https://shipmin.gov.in/sites/default/files/Modified%20Guidelines%20for%20implementation%20of%20Shipbuilding%20Financial%20Assistance%20Scheme%20%28SBFAS%29_0.pdf
https://shipmin.gov.in/sites/default/files/Annual%20Report%202024-25%20-%20English.pdf
https://shipmin.gov.in/sites/default/files/Annual%20Report%202025-26%20english.pdf
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2098573®=48&lang=2
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2280098®=3&lang=1
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2276739®=3&lang=1
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=1659960&lang=2
Ministry of Defence
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=1483700&lang=2
Click here to see pdf
***
(Explainer ID: 159534)
आगंतुक पटल : 10
Provide suggestions / comments