Economy
కంటైనర్ తయారీ సహాయ పథకం: భారత సముద్ర రంగ భవిష్యత్తుకు పునాది
Posted On:
11 AUG 2026 10:47AM
వాణిజ్యం, తయారీ రంగాల్లో భారతదేశ ఆకాంక్షలు పెరుగుతున్న నేపథ్యంలో బలమైన దేశీయ కంటైనర్ తయారీ రంగానికి పునాది అవసరం మరింత పెరిగింది. ₹10 వేల కోట్ల కేటాయింపుతో ప్రతిపాదించిన కంటైనర్ తయారీ సహాయ పథకం(సీఎంఏఎస్) కంటైనర్ వ్యవస్థ అంతటా తయారీ, పెట్టుబడులు, సాంకేతిక అభివృద్ధిని ప్రోత్సహించాలని లక్ష్యంగా పెట్టుకుంది. నౌకాయానం, ఓడరేవులు, సరకు రవాణా రంగాల్లో చేపడుతున్న విస్తృత సంస్కరణలతో కలిసి ఈ కార్యక్రమం భారత్ సముద్ర రంగ సామర్థ్యాలను బలోపేతం చేసి, ఉపాధిని సృష్టిస్తుందని అంచనా. అంతర్జాతీయ వాణిజ్యంలో దేశ దీర్ఘకాలిక పోటీతత్వానికి కూడా మద్దతు ఇవ్వనుంది.
దేశీయ కంటైనర్ తయారీ అవసరం
ప్రపంచ వాణిజ్యం ప్రస్తుతం కంటైనర్ ఆధారిత సరకు రవాణాపై ఎక్కువగా ఆధారపడుతోంది. ఐక్యరాజ్య సమితి వాణిజ్య, అభివృద్ధి సదస్సు(యూఎన్‌సీటీఏడీ) ప్రకారం ప్రపంచ సరకు వాణిజ్య పరిమాణంలో దాదాపు 80 శాతం సముద్ర మార్గంలోనే రవాణా అవుతోంది. అంతర్జాతీయ వాణిజ్యానికి సముద్ర రవాణా వెన్నెముకగా నిలుస్తోంది. ఇదే సమయంలో అంతర్జాతీయ వాణిజ్య విలువలో కంటైనర్ సరకు వాటా దాదాపు మూడింట రెండొంతులు. ప్రపంచ సరఫరా గొలుసులకు మద్దతు ఇవ్వడంలో సమర్థమైన కంటైనర్ సరకు రవాణాకు ఉన్న వ్యూహాత్మక ప్రాధాన్యాన్ని ఈ ధోరణులు స్పష్టం చేస్తున్నాయి.
ఇటీవలి సంవత్సరాల్లో భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతలు, సరఫరా గొలుసుల్లో ఆటంకాలు, మారుతున్న నౌకాయాన మార్గాలు ప్రపంచవ్యాప్తంగా వస్తువుల తరలింపులోని బలహీనతలను బహిర్గతం చేశాయి. ఈ ఆటంకాలు సరకు రవాణా ఛార్జీల్లో అస్థిరతకు దారితీసి, సముద్ర రవాణా వ్యవస్థలపై ఒత్తిడిని పెంచాయని యూఎన్‌సీటీఏడీ పేర్కొంది. దీంతో నౌకా కంటైనర్లతో సహా కీలక రవాణా సాధనాల దేశీయ తయారీ సామర్థ్యాలను పెంచుకోవడంపై పలు దేశాలు ప్రధానంగా దృష్టి సారిస్తున్నాయి.
ప్రపంచ తయారీ, అంతర్జాతీయ వాణిజ్యంలో భారత్ పాత్ర పెరుగుతుండటంతో కంటైనర్ సరకు రవాణాకు డిమాండ్ గణనీయంగా పెరిగింది. ఎగుమతి, దిగుమతి వాణిజ్యం విస్తరిస్తూ, సరకు రవాణా రంగం వేగంగా అభివృద్ధి చెందుతున్నప్పటికీ ఖాళీ కంటైనర్ల కోసం భారత్ ప్రధానంగా దిగుమతులపైనే ఆధారపడుతోంది. దేశీయ డిమాండ్‌ను తీర్చడంతో పాటు కంటైనర్లను అవసరమైన ప్రాంతాలకు తరలించేందుకు భారత్ ఏటా దాదాపు 20 లక్షల ఖాళీ కంటైనర్లను దిగుమతి చేసుకుంటోంది. దీంతో కంటైనర్ల లభ్యత ప్రపంచ మార్కెట్ హెచ్చుతగ్గులు, సరకు రవాణా ధరల్లో అస్థిరత, సరఫరా గొలుసు ఆటంకాలకు ప్రభావితమవుతోంది.
ఈ సవాళ్లను గుర్తించిన ప్రభుత్వం కంటైనర్ తయారీ సహాయ పథకాన్ని(సీఎంఏఎస్) ప్రకటించింది. దేశీయ తయారీని ప్రోత్సహించడం, విలువ గొలుసు అంతటా పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా ప్రపంచస్థాయి పోటీతత్వం కలిగిన కంటైనర్ తయారీ వ్యవస్థను భారత్‌లో ఏర్పాటు చేయడం దీని లక్ష్యం. దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించి, సరఫరా గొలుసు స్థిరత్వాన్ని బలోపేతం చేయాలని కూడా ఈ కార్యక్రమం సంకల్పించింది. మేక్ ఇన్ ఇండియా, మారిటైమ్ అమృత్‌కాల్ విజన్–2047, బహుళ రవాణా మార్గాల అభివృద్ధి కింద ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు ఇది అనుబంధంగా ఉంటుంది. సముద్ర రంగం, వాణిజ్యంలో భారత్ దీర్ఘకాలిక ఆకాంక్షల సాధనకు దోహదపడుతుంది.
కంటైనర్లు అంటే ఏమిటి?
నౌకలు, రైళ్లు, రోడ్డు వాహనాల ద్వారా సరకు రవాణా చేసేందుకు ఉపయోగించే ప్రామాణిక ఉక్కు పెట్టెలను షిప్పింగ్ కంటైనర్లు అంటారు. రవాణా మధ్యలో వస్తువులను దించి తిరిగి ప్యాకింగ్ చేయాల్సిన అవసరం లేకుండా వీటి ద్వారా ఒక రవాణా సాధనం నుంచి మరోదానికి సరకు తరలించవచ్చు. అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన ఐఎస్‌ఓ ప్రమాణాలకు అనుగుణంగా వీటిని తయారు చేస్తారు. దీంతో వివిధ రవాణా మార్గాల మధ్య అవాంతరాలు లేని సరకు తరలింపు, సమర్థమైన ప్రపంచ వాణిజ్యం సాధ్యమవుతాయి. 20 అడుగులు, 40 అడుగుల కంటైనర్లను ఎక్కువగా వినియోగిస్తారు. కంటైనర్ల సామర్థ్యాన్ని కొలిచే ప్రామాణిక ప్రమాణమైన ఇరవై అడుగుల సమాన యూనిట్లలో(టీఈయూలు) వీటిని లెక్కిస్తారు.

కంటైనర్ తయారీ సహాయ పథకం అంటే ఏమిటి?
కంటైనర్ తయారీ సహాయ పథకాన్ని కేంద్ర బడ్జెట్ 2026-27లో ప్రకటించారు. ఆర్థిక, సంస్థాగత మద్దతుతో పోటీతత్వం కలిగిన దేశీయ కంటైనర్ తయారీ పరిశ్రమను నెలకొల్పేందుకు చేపట్టిన లక్షిత కార్యక్రమమిది.
ఐదేళ్లలో ₹10 వేల కోట్ల కేటాయింపుతో ప్రతిపాదించిన ఈ పథకం కొత్త తయారీ కేంద్రాల స్థాపన, ప్రస్తుతం ఉన్న యూనిట్ల విస్తరణకు మద్దతు ఇస్తుంది. భారత్‌లో పెరుగుతున్న నౌకా కంటైనర్ల డిమాండ్‌ను తీర్చేందుకు తయారీ సామర్థ్యాన్ని పెంచడం కూడా దీని లక్ష్యం.
ప్రస్తుతం ఉన్న ఉత్పత్తి సామర్థ్యంతో పోలిస్తే దాదాపు పది రెట్లు అధికంగా ఏటా 7.5 లక్షల ఇరవై అడుగుల సమాన యూనిట్ల దేశీయ తయారీ సామర్థ్యాన్ని సాధించాలని ఈ కార్యక్రమం లక్ష్యంగా పెట్టుకుంది. దాదాపు ₹80 వేల కోట్ల మార్కెట్ అవకాశాన్ని సృష్టించడంతో పాటు అంతర్జాతీయ పోటీతత్వం కలిగిన నౌకా కంటైనర్ల విశ్వసనీయ తయారీదారుగా భారత్‌ను నిలుపుతుందని అంచనా.
కంటైనర్ తయారీ విలువ గొలుసును బలోపేతం చేసేందుకు పథకం కింద అందించే సహాయం:
* కొత్త గ్రీన్‌ఫీల్డ్ తయారీ కేంద్రాల ఏర్పాటుకు మూలధన సహాయం
* ప్రస్తుతం ఉన్న బ్రౌన్‌ఫీల్డ్ తయారీ యూనిట్ల విస్తరణకు మద్దతు
* దేశీయ కంటైనర్ తయారీ పోటీతత్వాన్ని మెరుగుపరచేందుకు కార్యాచరణ సహాయం
* పరీక్షల మౌలిక సదుపాయాలు, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు, సామర్థ్య నిర్మాణానికి మద్దతు
* సమగ్ర సముద్ర రంగ వ్యవస్థ నిర్మాణం
దేశీయ పునాదులతో కూడిన సమగ్ర కంటైనర్ వ్యవస్థను నిర్మించాలన్న విస్తృత వ్యూహంలో సీఎంఏఎస్ ఒక భాగం. భారత్ కంటైనర్ షిప్పింగ్ లైన్(బీసీఎస్‌ఎల్) ఏర్పాటుకు ఓడరేవులు, నౌకాయానం, జలమార్గాల మంత్రిత్వ శాఖ 2026 ఫిబ్రవరిలో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. భారత నౌకాయాన సంస్థ(ఎస్‌సీఐ), భారత కంటైనర్ సంస్థ(కాన్‌కార్), జవహర్‌లాల్ నెహ్రూ పోర్ట్ అథారిటీ, వి.ఓ. చిదంబరనార్ పోర్ట్ అథారిటీ, సాగరమాల ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్‌ను ఈ కార్యక్రమం ఒకే వేదికపైకి తీసుకొస్తుంది. వివిధ పరిమాణాల్లో 51 కంటైనర్ నౌకల సముదాయ అభివృద్ధి, దేశీయ కంటైనర్ల కొనుగోలుకు దాదాపు ₹99,149 కోట్ల పెట్టుబడులను ప్రతిపాదించారు.
ఈ సమన్వయ విధానం ప్రభుత్వం చేపడుతున్న విస్తృత సరకు రవాణా కార్యక్రమాలకు అనుబంధంగా ఉంటుంది. వీటిలో:
ఓడరేవులు, రైల్వేలు, జాతీయ రహదారులు, పారిశ్రామిక కేంద్రాల మధ్య అనుసంధానాన్ని మెరుగుపరిచే పీఎం గతిశక్తి
కార్యాచరణ సామర్థ్యానికి మద్దతు ఇచ్చే జాతీయ సరకు రవాణా విధానం
ఓడరేవుల ఆధారిత అభివృద్ధిని ప్రోత్సహించే సాగరమాల కార్యక్రమం
పెరుగుతున్న భారత్ వాణిజ్య పరిమాణాలకు అవసరమైన స్థిరమైన, సమగ్ర సరకు రవాణా వ్యవస్థకు ఈ కార్యక్రమాలు మద్దతు ఇస్తాయి.
ఉపాధి, తయారీ అవకాశాలు
సరకు రవాణా వ్యవస్థ స్థిరత్వాన్ని మెరుగుపరచడంతో పాటు సీఎంఏఎస్ భారీగా ఉపాధిని సృష్టించి, పారిశ్రామిక అభివృద్ధిని ప్రోత్సహిస్తుందని అంచనా.
కంటైనర్ తయారీ, అనుబంధ పరిశ్రమల్లో దాదాపు 3 వేల ప్రత్యక్ష ఉద్యోగాలు, 50 వేలకు పైగా పరోక్ష ఉద్యోగాలను సృష్టించే సామర్థ్యం ఈ పథకానికి ఉంది.

ఈ కార్యక్రమం కింది అనుబంధ పరిశ్రమల్లోనూ వృద్ధికి ఊతమిస్తుందని అంచనా:
* కంటైనర్ల మూలల్లో అమర్చే కాస్టింగ్‌లు
* చెక్క చట్రాలు
* కార్టెన్ ఉక్కు
ఇటీవలి పురోగతి, పరిశ్రమ స్పందన
ప్రపంచ నౌకాయాన సంస్థ ఏపీ మోలర్–మెర్స్క్ కోసం భారత్‌లో తయారైన తొలి ఎగుమతి–దిగుమతి నౌకా కంటైనర్(ఎగ్జిమ్)ను 2026 జులైలో విడుదల చేయడంతో సముద్ర రంగ తయారీలో దేశం కీలక మైలురాయిని సాధించింది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని దాద్రిలో మెర్స్క్–కాన్‌కార్ అంతర్గత కంటైనర్ డిపోలో దీన్ని ఆవిష్కరించారు.
అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన ఐఎస్‌ఓ ప్రమాణాలు, సురక్షిత కంటైనర్ల అంతర్జాతీయ ఒప్పందానికి అనుగుణంగా ఈ కంటైనర్‌ను తయారు చేశారు. దీంతో ప్రపంచ నౌకాయాన నెట్‌వర్క్‌లలో వినియోగించేందుకు ఇది అనువుగా ఉంది. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణమైన నౌకా కంటైనర్లను తయారు చేసే భారత్ సామర్థ్యాన్ని ఈ ఆవిష్కరణ చాటింది.
డీసీఎం శ్రీరామ్ గ్రూపునకు భారత్‌లో తయారయ్యే మరో వెయ్యి నౌకా కంటైనర్ల కోసం మెర్స్క్ ఆర్డర్ ఇవ్వడం మరో కీలక మైలురాయి. భారత్‌లో రూపుదిద్దుకుంటున్న తయారీ సామర్థ్యానికి తొలి వాణిజ్యపరమైన ఆమోదంగా ఈ ఆర్డర్ నిలుస్తోంది. అత్యున్నత నాణ్యత కలిగిన నౌకా కంటైనర్లను తయారు చేయగల భారత్ సామర్థ్యంపై ప్రపంచ నౌకాయాన సంస్థల్లో విశ్వాసం పెరుగుతున్నట్లు కూడా ఇది సూచిస్తోంది.
ప్రభుత్వ విధాన జోక్యాలు వాణిజ్యపరమైన ఫలితాలుగా మారడం ప్రారంభమైనట్లు ఈ పరిణామాలు తెలియజేస్తున్నాయి. ప్రపంచ సముద్ర రంగ విలువ గొలుసులో కీలక తయారీ కేంద్రంగా ఎదగాలన్న భారత్ ఆకాంక్షను ఇవి మరింత బలోపేతం చేస్తున్నాయి.
విస్తృత సముద్ర రంగ పరివర్తనలో భాగం
భారత సముద్ర రంగాన్ని బలోపేతం చేస్తున్న విస్తృత సంస్కరణల్లో సీఎంఏఎస్ ఒక భాగం. దేశీయ కంటైనర్ ఉత్పత్తిని ప్రోత్సహించడంతో పాటు ప్రభుత్వం పలు శాసన, సంస్థాగత, మౌలిక సదుపాయాల కార్యక్రమాలను ప్రవేశపెట్టింది. వ్యాపార నిర్వహణ సౌలభ్యాన్ని మెరుగుపరుస్తూ భారత సముద్ర రంగ వ్యవస్థను ఆధునికీకరించడం ఈ చర్యల ఉమ్మడి లక్ష్యం.
వాణిజ్య నౌకాయాన చట్టం–2025, తీరప్రాంత నౌకాయాన చట్టం–2025, భారత ఓడరేవుల చట్టం–2025 అమలు వీటిలో ఉన్నాయి. నౌకాయానం, తీరప్రాంత వాణిజ్యం, ఓడరేవుల పాలనకు ఈ చట్టాలు నవీకరించిన న్యాయపరమైన కార్యాచరణను అందిస్తున్నాయి. ఒకే దేశం–ఒకే ఓడరేవు ప్రక్రియ, మారిటైమ్ సింగిల్ విండో, ఈ–సముద్ర వంటి డిజిటల్ కార్యక్రమాలు ఈ సంస్కరణలకు అనుబంధంగా ఉన్నాయి. ఇవి నియంత్రణ ప్రక్రియలను సరళీకరించి, పత్రాల అవసరాన్ని తగ్గిస్తూ ఓడరేవులు, నౌకాయాన సేవల్లో కార్యాచరణ సామర్థ్యాన్ని మెరుగుపరుస్తాయి.
ప్రభుత్వం ₹70 వేల కోట్ల నౌకా నిర్మాణ ఆర్థిక సహాయ ప్యాకేజీని కూడా ప్రకటించింది. దేశీయ నౌకా నిర్మాణ సామర్థ్యాలను పెంచి, సముద్ర రంగ తయారీలో మరిన్ని పెట్టుబడులను ప్రోత్సహించడం దీని లక్ష్యం. ప్రతిపాదిత భారత్ కంటైనర్ షిప్పింగ్ లైన్‌తో కలిసి నౌకా నిర్మాణం, కంటైనర్ తయారీ, నౌకాయాన సేవలు, ఓడరేవులు, బహుళ రవాణా మార్గాలను కలిగి ఉన్న సమగ్ర సముద్ర రంగ వ్యవస్థను నిర్మించడం ఈ చర్యల లక్ష్యం.
వధావన్ ఓడరేవు, గలాథియా బే అంతర్జాతీయ కంటైనర్ ట్రాన్స్‌షిప్‌మెంట్ పోర్ట్, టూనా టెక్రా కంటైనర్ టెర్మినల్, వి.ఓ. చిదంబరనార్ పోర్టులోని ఔటర్ హార్బర్ కంటైనర్ టెర్మినల్ వంటి ప్రధాన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు వేగంగా పురోగమిస్తున్నాయి. భారత్ సముద్ర రంగ మౌలిక సదుపాయాలను విస్తరించి, సరకు నిర్వహణ సామర్థ్యాన్ని పెంచడం వీటి లక్ష్యం.
కంటైనర్ పోర్ట్ పనితీరు సూచీ–2025లో మూడు భారతీయ ఓడరేవులు ప్రస్తుతం ప్రపంచంలోని తొలి 30 స్థానాల్లో నిలిచాయి. ఓడరేవుల సామర్థ్యంలో నిరంతర మెరుగుదలను ఇది ప్రతిబింబించడంతో పాటు ప్రపంచ సముద్ర వాణిజ్యంలో భారత్ స్థానాన్ని మరింత బలోపేతం చేస్తోంది.
ముందడుగు
ప్రపంచస్థాయి పోటీతత్వం కలిగిన సముద్ర రంగ తయారీ వ్యవస్థ నిర్మాణం దిశగా సీఎంఏఎస్ కీలక అడుగుగా నిలుస్తోంది. కంటైనర్ ఉత్పత్తిని ప్రోత్సహించడం, దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడం ద్వారా సరఫరా గొలుసు స్థిరత్వాన్ని బలోపేతం చేసి, ఉపాధిని సృష్టిస్తూ ప్రపంచ వాణిజ్యంలో భారత్ పోటీతత్వాన్ని పెంచుతుందని అంచనా. విస్తృత సముద్ర రంగ సంస్కరణల మద్దతుతో భారత్‌ను ప్రముఖ సముద్ర రంగ తయారీ, సరకు రవాణా కేంద్రంగా నిలిపే సామర్థ్యం సీఎంఏఎస్‌కు ఉంది.
References
Ministry of Ports, Shipping and Waterways
https://sansad.in/getFile/annex/270/AU2875_nAmH3t.pdf?source=pqars&utm
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2221817®=48&lang=2
https://dgma.gov.in/download/1775649151_69d6417f46b3f_dgs-nmdc-address-01042026.pdf?utm
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2222805&lang=1®=3&utm
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2280831&lang=1®=3&utm
UNCTAD
https://unctad.org/topic/transport-and-trade-logistics/review-of-maritime-transport?utm
https://unctad.org/publication/review-maritime-transport-2025?utm
Click here to see pdf
***
(Explainer ID: 159522)
आगंतुक पटल : 16
Provide suggestions / comments