Economy
రహదారులకు సరికొత్త రూపు: భారత్‌లో విస్తరిస్తున్న విద్యుత్ వాహనాల వ్యవస్థ
Posted On:
05 AUG 2026 11:37AM
భారత్ వేగంగా విద్యుత్ వాహనాల (ఈవీలు) వైపు అడుగులు వేస్తోంది. విద్యుత్ ఆధారిత రవాణా ఇప్పుడు ఆర్థిక వృద్ధి, ఇంధన భద్రత, పరిశుభ్రమైన భవిష్యత్తుకు కీలక చోదకశక్తిగా మారుతోంది. 2016 నుంచి ఈవీల విక్రయాలు దాదాపు 46 రెట్లు పెరగడం వినియోగదారుల అభిరుచిలో వచ్చిన స్పష్టమైన మార్పును సూచిస్తోంది. ఎగుమతులు 2020లో 1.2 మిలియన్ అమెరికన్ డాలర్ల నుంచి 2024లో 84 మిలియన్ అమెరికన్ డాలర్లకు పెరిగాయి. దీంతో భారత్ వర్ధమాన ఈవీ కేంద్రంగా ఎదుగుతోంది. జాతీయ తయారీ మిషన్, ఆటోమొబైల్, ఆటో విడిభాగాల పరిశ్రమకు ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం, పీఎం ఎలక్ట్రిక్ డ్రైవ్ రివల్యూషన్ ఇన్ ఇన్నోవేటివ్ వెహికల్ ఎన్‌హాన్స్‌మెంట్ పథకం (పీఎం ఈ–డ్రైవ్) వంటి ప్రభుత్వ కార్యక్రమాలు మరింత స్వావలంబనతో కూడిన విద్యుత్ రవాణా వ్యవస్థను బలోపేతం చేస్తున్నాయి.
విద్యుత్ రవాణా దిశగా భారత్ అడుగులు
రద్దీ నగరాల్లో రోజువారీ ప్రయాణాలు మొదలు చిన్న పట్టణాల్లో చివరి మైలు అనుసంధానం వరకు దేశవ్యాప్తంగా రవాణా వ్యవస్థ సరికొత్త రూపు సంతరించుకుంటోంది. ఈ పరివర్తనకు విద్యుత్ రవాణా కేంద్రంగా నిలుస్తోంది. దేశ వాతావరణ కార్యాచరణ వ్యూహం, సుస్థిర రవాణా దార్శనికతలో ఈ సాంకేతిక మార్పు కీలకంగా మారుతోంది. ప్రభుత్వ ప్రోత్సాహకాలు, పెరుగుతున్న పర్యావరణ అవగాహన, వేగవంతమైన సాంకేతిక పురోగతితో ఆటోమొబైల్ పరిశ్రమ భవిష్యత్తును తీర్చిదిద్దే జాతీయ ప్రాధాన్య రంగంగా ఈవీలు ఎదిగాయి.
భారత్‌లో రవాణా పరివర్తన పర్యావరణ పరమైన అవసరం మాత్రమే కాదు.. ఇదొక ఆర్థిక అవకాశం కూడా. దేశంలోని అతిపెద్ద, అత్యంత ప్రభావవంతమైన పరిశ్రమల్లో ఒకటైన ఆటోమొబైల్ రంగాన్ని ఇది పునర్నిర్మిస్తోంది. ఇంధన భద్రతను బలోపేతం చేసే వ్యూహాత్మక సాధనంగా ఈ మార్పు ఎదుగుతోంది. శిలాజ ఇంధనాల దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గిస్తూ, ఆర్థిక వ్యవస్థను సమర్థవంతమైన అల్ప కర్బన వృద్ధి మార్గంలో ముందుకు నడిపిస్తోంది.
విద్యుత్ వాహనం (ఈవీ) అంటే ఏమిటి?
బ్యాటరీలో నిల్వ చేసిన శక్తితో పనిచేసే విద్యుత్ మోటారు ద్వారా నడిచే వాహనాన్ని విద్యుత్ వాహనం అంటారు. బయటి విద్యుత్ వనరు ద్వారా దీన్ని తిరిగి ఛార్జ్ చేసుకోవచ్చు.
విద్యుత్ వాహనాల్లో నాలుగు రకాలు ఉన్నాయి:
- పూర్తిగా విద్యుత్‌తో నడిచే బ్యాటరీ విద్యుత్ వాహనాలు (బీఈవీలు).
- వాహనాన్ని నడిపేందుకు అంతర్గత కంబషన్ ఇంజిన్, విద్యుత్ మోటారును కలిపి వినియోగించే హైబ్రిడ్ విద్యుత్ వాహనాలు (హెచ్‌ఈవీలు), ప్లగ్–ఇన్ హైబ్రిడ్ విద్యుత్ వాహనాలు. విద్యుత్‌తో మాత్రమే ఎక్కువ దూరం ప్రయాణించేందుకు వీలుగా పీహెచ్‌ఈవీల్లో బయటి విద్యుత్ వనరుతో ఛార్జ్ చేసుకునే బ్యాటరీ ప్యాక్‌లు కూడా ఉంటాయి.
- రసాయన శక్తి నుంచి విద్యుత్ శక్తిని ఉత్పత్తి చేసే ఫ్యూయల్ సెల్ విద్యుత్ వాహనాలు (ఎఫ్‌సీఈవీలు).

భారత్‌లో ఈవీ విప్లవం: గత దశాబ్దపు ప్రయాణం
విద్యుత్ రవాణా దిశగా భారత్ ప్రయాణం 2015లో ప్రారంభమైంది. ఈవీల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు జాతీయ విద్యుత్ రవాణా మిషన్ ప్రణాళిక, ఫేమ్ పథకాన్ని ప్రారంభించడం ఈ ప్రయాణానికి నాంది పలికింది. స్పష్టమైన వ్యూహాత్మక ప్రాధాన్యాలు ఈ చర్యకు ప్రేరణగా నిలిచాయి. పెట్రోలియం ఇంధనాల దిగుమతులపై పెరుగుతున్న వ్యయాన్ని తగ్గించడం, నగరాల్లో తీవ్రమవుతున్న వాయు కాలుష్యాన్ని కట్టడి చేయడం వీటిలో ఉన్నాయి. భారత్ మొత్తం ఉద్గారాల్లో దాదాపు 9 శాతం వాటా ఉన్న రవాణా రంగం నుంచి వెలువడే హరిత గృహ వాయు ఉద్గారాలను తగ్గించడం కూడా దీని లక్ష్యం.
జాతీయ విద్యుత్ రవాణా మిషన్ ప్రణాళిక (ఎన్‌ఈఎంఎంపీ 2020)
భారత్‌లో ఈవీల వినియోగం, దేశీయ తయారీని వేగవంతం చేసేందుకు అవసరమైన వ్యూహాత్మక కార్యాచరణ ప్రణాళికను ఎన్‌ఈఎంఎంపీ 2020 నిర్దేశిస్తుంది. ఇంధన భద్రతను బలోపేతం చేయడం, పరిశుభ్రమైన సుస్థిర రవాణాను ప్రోత్సహించడం అనే రెండు లక్ష్యాలతో దీన్ని రూపొందించారు.
భారత్‌లో హైబ్రిడ్, విద్యుత్ వాహనాల వేగవంతమైన వినియోగం, తయారీ (ఫేమ్ ఇండియా)
ఎన్‌ఈఎంఎంపీ 2020 కార్యాచరణలో భాగంగా ఈవీల వినియోగాన్ని పెంచేందుకు 2015లో ఫేమ్ ఇండియా పథకాన్ని ప్రారంభించారు. కొనుగోలుదారులకు ప్రోత్సాహకాలు అందించడంతో పాటు ఛార్జింగ్ మౌలిక సదుపాయాల ఏర్పాటు, తయారీ రంగానికి ఈ పథకం మద్దతు ఇచ్చింది. తొలి దశ 2019 మార్చి వరకు కొనసాగగా, తర్వాత రెండో దశను 2024 ఏప్రిల్ వరకు ఐదేళ్లపాటు అమలు చేశారు.
మీకు తెలుసా?
ఈవీల వినియోగ వాటా 2015–16 ఆర్థిక సంవత్సరంలో 0.08 శాతం నుంచి 2025–26లో 8.26 శాతానికి పెరిగింది.
కొవిడ్ అనంతర కాలంలో, ముఖ్యంగా 2021–22 ఆర్థిక సంవత్సరంలో కీలక మలుపు చోటుచేసుకుంది. లక్షిత విధాన ప్రోత్సాహకాలు, పెరిగిన రాయితీలు, వాహనాల లభ్యత మెరుగుపడటంతో ఈవీల వినియోగం వేగవంతమైన వృద్ధి దశలోకి ప్రవేశించింది. ఈ కాలంలో మార్కెట్ నిర్మాణంలోనూ గణనీయమైన మార్పు వచ్చింది. 2019–20, 2020–21 ఆర్థిక సంవత్సరాల్లో తొలినాళ్ల వినియోగంలో ఈ–రిక్షాలదే ఆధిపత్యం కాగా, ఆ తర్వాత విద్యుత్ ద్విచక్ర వాహనాలకు ఆదరణ వేగంగా పెరిగింది. 2024–25 నాటికి అవి అగ్రశ్రేణి విభాగంగా నిలిచాయి. అనధికారిక ఉమ్మడి రవాణా నుంచి ప్రధాన స్రవంతి వ్యక్తిగత, వాణిజ్య వినియోగం దిశగా విస్తృత పరివర్తన చోటుచేసుకుంటున్నట్లు ఇది సూచిస్తోంది.
వేగవంతమైన పయనం: ప్రపంచ విస్తరణ నడుమ భారత్‌లో పెరుగుతున్న ఈవీల వృద్ధి
ప్రపంచవ్యాప్తంగా వినియోగదారుల్లో ఈవీలకు ఆదరణ పెరుగుతోంది. మెరుగైన ప్రయాణ పరిధితో పోటీ ధరల్లో పలు నమూనాలు మార్కెట్‌లోకి వస్తున్నాయి. దీనికి తోడు ప్రజా ఛార్జింగ్ మౌలిక సదుపాయాలు వేగంగా విస్తరిస్తున్నాయి. భారత్‌లోనూ బలమైన విధాన మద్దతు, పెరుగుతున్న విక్రయాలు, నమోదుల్లో ఈ జోరు కనిపిస్తోంది. దేశీయ తయారీ, ఛార్జింగ్ నెట్‌వర్క్‌లతో కూడిన వ్యవస్థ విస్తరిస్తుండటం ఈవీల వినియోగ పెరుగుదలకు మరింత అండగా నిలుస్తోంది.
భారత్ ఈవీ ప్రగతి సూచిక–పెరుగుతున్న విక్రయాలు, నమోదులు, ఎగుమతులు
2016లో దాదాపు 50 వేల ఈవీల విక్రయాలతో ప్రారంభమైన భారత్ మార్కెట్ 2025 నాటికి 23 లక్షల వాహనాల విక్రయ స్థాయికి చేరింది. భారత్ ఈవీ మార్కెట్ 46 రెట్లు పెరిగినట్లు ఇది తెలియజేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఈవీ విక్రయాలు 2016లో 9.18 లక్షల నుంచి 2024లో 1.878 కోట్లకు పెరిగి దాదాపు 20 రెట్ల వృద్ధిని నమోదు చేయగా, భారత్ వృద్ధి ప్రపంచ ధోరణులను అధిగమించింది.
మీకు తెలుసా?
2025లో ఉత్తర్‌ప్రదేశ్ అతిపెద్ద ఈవీ మార్కెట్‌గా అవతరించింది. 4 లక్షలకు పైగా వాహనాలతో దేశ ఈవీ విక్రయాల్లో 18 శాతం వాటాను నమోదు చేసింది. 2.66 లక్షల వాహనాలతో మహారాష్ట్ర 12 శాతం వాటా సాధించగా, 2 లక్షల వాహనాలతో కర్ణాటక మొత్తం విక్రయాల్లో 9 శాతం వాటాతో తర్వాతి స్థానాల్లో నిలిచాయి.
2020లో ప్రపంచ ఈవీ వినియోగ స్థాయిలో భారత్ వాటా ఐదో వంతు మాత్రమే. 2024 నాటికి ఇది ప్రపంచ స్థాయిలో ఐదింట రెండొంతులకు పైగా పెరిగింది. 2025లో విక్రయమైన మోటారు ద్విచక్ర వాహనాలు (12.8 లక్షలు), మూడు చక్రాల వాహనాలు (8 లక్షలు) ఈ పురోగతికి ప్రధానంగా దోహదపడ్డాయి.

గత దశాబ్దంలో ఈవీ నమోదులు 62 శాతానికి పైగా వార్షిక సమ్మిళిత వృద్ధి రేటుతో గణనీయంగా పెరిగాయి. ఈవీల వినియోగం వేగంగా విస్తరిస్తున్నట్లు ఇది సూచిస్తోంది. విధాన మద్దతు, సాంకేతిక పురోగతి, విద్యుత్ రవాణాపై వినియోగదారుల్లో పెరుగుతున్న విశ్వాసం ప్రధాన చోదకశక్తులుగా నిలుస్తున్నాయి.

ఇటీవలి సంవత్సరాల్లో దేశీయంగా గణనీయమైన ఆదరణ పొందిన భారతీయ ఈవీలు ఇప్పుడు అంతర్జాతీయ మార్కెట్లలోనూ వేగంగా విస్తరిస్తున్నాయి. ఎగుమతులు 2020లో 1.2 మిలియన్ అమెరికన్ డాలర్ల నుంచి 2024లో 84 మిలియన్ అమెరికన్ డాలర్లకు పెరిగాయి. నేపాల్, ఇండోనేషియా, జపాన్ ప్రధాన ఎగుమతి గమ్యస్థానాలుగా నిలిచాయి.
విస్తరిస్తున్న మౌలిక సదుపాయాలు
మౌలిక సదుపాయాల పరంగా భారత్‌లో ప్రజా ఈవీ ఛార్జింగ్ నెట్‌వర్క్ వేగంగా విస్తరిస్తోంది. భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్(బీహెచ్ఈఎల్) వివరాల ప్రకారం 2026 జులై నాటికి అందుబాటులో ఉన్న 52,718 ప్రజా ఛార్జింగ్ కేంద్రాల్లో 16,561 కేంద్రాలు వేగవంతమైన ఈవీ ఛార్జింగ్ సదుపాయాలు కలిగి ఉన్నాయి.
వినియోగదారుల ప్రదేశం ఆధారంగా సమీప ఛార్జింగ్ కేంద్రాన్ని గుర్తించేందుకు ఈ–అమృత్ సాధనం సహాయపడుతుంది. పరిశ్రమలోని ప్రధాన సంస్థలు ఛార్జింగ్ మౌలిక సదుపాయాలను చురుగ్గా మెరుగుపరుస్తున్నాయి. ఉదాహరణకు హ్యుందాయ్ మోటార్ ఇండియా 2024లో కీలక నగరాల్లో 11 కొత్త కేంద్రాలతో తన అత్యంత వేగవంతమైన ఛార్జింగ్ నెట్‌వర్క్‌ను విస్తరించింది. ముంబయి, పుణె, అహ్మదాబాద్, హైదరాబాద్, గురుగ్రామ్, బెంగళూరుతో పాటు ప్రధాన జాతీయ రహదారుల వెంబడి వీటిని ఏర్పాటు చేసింది.
భారత విద్యుత్ రవాణా సూచీ (ఐఈఎంఐ)
పరిశుభ్రమైన రవాణా భవిష్యత్తు దిశగా కీలక చర్యగా నీతి ఆయోగ్ 2025 ఆగస్టులో భారత విద్యుత్ రవాణా సూచీని ప్రారంభించింది. దేశంలోనే తొలిసారిగా రూపొందించిన ఈ కార్యాచరణ చట్రం విద్యుత్ రవాణా పురోగతిలో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల పనితీరును పరిశీలించి, పోల్చుతుంది. రవాణా విద్యుదీకరణ, ఛార్జింగ్ మౌలిక సదుపాయాల సంసిద్ధత, ఈవీ పరిశోధన, ఆవిష్కరణ అనే మూడు మూల స్తంభాలకు సంబంధించిన 16 సూచికల ఆధారంగా పనితీరును మదింపు చేస్తుంది. ప్రతి ప్రాంతంలోని ఈవీ వ్యవస్థ సామర్థ్యంపై ఇది స్పష్టమైన చిత్రాన్ని అందిస్తుంది.
స్కోర్ల ఆధారంగా ప్రాంతాలను అగ్రగాములు(బలమైన వ్యవస్థలతో ముందంజలో ఉన్నవి), పురోగతి సాధిస్తున్నవి, ప్రత్యేక జోక్యం అవసరమైన ఆకాంక్షిత ప్రాంతాలుగా వర్గీకరిస్తారు. బలమైన, పరిణతి చెందిన ఈవీ వ్యవస్థలతో దిల్లీ, మహారాష్ట్ర, చండీగఢ్ అగ్రగాములుగా నిలిచాయి.
వేగం పుంజుకున్న దేశీయ తయారీ: అంకుర సంస్థలు, కృత్రిమ మేధ అండ
అసెంబ్లింగ్ ఆధారిత మార్కెట్ నుంచి సమగ్ర ఈవీ తయారీ కేంద్రంగా భారత్ అభివృద్ధి చెందుతోంది. విస్తరిస్తున్న సరఫరాదారుల వ్యవస్థ అండతో దేశీయ ఉత్పత్తి ఇప్పుడు బ్యాటరీ ప్యాక్‌లు, మోటార్లు, డ్రైవ్‌ట్రెయిన్‌లు, పవర్ ఎలక్ట్రానిక్స్, వైరింగ్, ఛార్జింగ్ పరికరాల వరకు విస్తరించింది. టాటా మోటార్స్, మహీంద్రా, టీవీఎస్, బజాజ్ ఆటో వంటి ప్రముఖ అసలు పరికరాల తయారీ సంస్థలు (ఓఈఎంలు) పరిశోధన–అభివృద్ధి, గిగా ఫ్యాక్టరీలు, ప్రత్యేక ఈవీ వేదికల్లో పెట్టుబడుల ద్వారా తమ సామర్థ్యాన్ని పెంచుతున్నాయి. ఇదే సమయంలో విన్‌ఫాస్ట్, టెస్లా, ప్రముఖ కొరియా, జపాన్ బ్యాటరీ సంస్థలు భారత్‌లో భారీ స్థాయి తయారీ అవకాశాలను పరిశీలిస్తున్నాయి. ఈ విస్తరణ స్థానిక ఉత్పత్తిని బలోపేతం చేస్తూ, ధరల పోటీతత్వాన్ని మెరుగుపరుస్తూ, ప్రపంచ ఈవీ సరఫరా గొలుసుల్లో భారత్‌ను అంతర్భాగంగా నిలుపుతోంది.
సుజుకీ తొలి మేడ్ ఇన్ ఇండియా ప్రపంచ వ్యూహాత్మక బ్యాటరీ ఈవీ ‘ఈ విటారా’
భారత్ హరిత రవాణా ప్రయాణంలో 2025 ఆగస్టులో చరిత్రాత్మక మైలురాయి నమోదైంది. సుజుకీ తొలి ప్రపంచ వ్యూహాత్మక బ్యాటరీ విద్యుత్ వాహనం(బీఈవీ) ‘ఈ విటారా’ ప్రారంభోత్సవం ఈ ఘట్టానికి గుర్తుగా నిలిచింది. భారత్‌లో తయారైన ఈ బ్యాటరీ విద్యుత్ వాహనాలను ఐరోపా, జపాన్ వంటి అభివృద్ధి చెందిన మార్కెట్లతో సహా 100కు పైగా దేశాలకు ఎగుమతి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ మైలురాయితో సుజుకీ ఈవీలకు ప్రపంచ తయారీ కేంద్రంగా భారత్ అవతరించింది.
భారత అంకుర సంస్థలు ఈవీల్లోని అవకాశాలను అందిపుచ్చుకుంటున్నాయి. ఛార్జింగ్ మౌలిక సదుపాయాల లభ్యతను పెంచడం, బ్యాటరీ స్థాయి ఆవిష్కరణలను మెరుగుపరచడం, తక్కువ వ్యయంతో తయారీని ప్రోత్సహించడం, సమాచార ఆధారిత పరిష్కారాలను అందించడంలో అవి ఉత్ప్రేరకాలుగా పనిచేస్తున్నాయి. ప్రస్తుతం దేశంలో దాదాపు 400 ఈవీ అంకుర సంస్థలు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. భారత్‌లో రూపుదిద్దుకుంటున్న ఈవీ వ్యవస్థకు అవి కీలక భాగస్వాములుగా ఎదుగుతున్నాయి. దీనికి తోడు మొత్తం డ్రైవింగ్ అనుభవాన్ని మెరుగుపరిచేందుకు అభివృద్ధి చెందుతున్న ఈవీ వ్యవస్థ కృత్రిమ మేధను వినియోగిస్తోంది. స్వర ఆధారిత దిశానిర్దేశం, ఎప్పటికప్పుడు ట్రాఫిక్ సమాచారం, తెలివైన మార్గ ప్రణాళిక వంటి సదుపాయాలు ఇందులో ప్రధానమైనవి. స్వర ఆధారిత నియంత్రణలు, అనుసంధానిత సదుపాయాలు, అందుబాటుపై దృష్టి సారించిన ప్రత్యేకతలతో కృత్రిమ మేధ సురక్షితమైన, సమ్మిళిత రవాణాకు సైతం దోహదపడుతోంది.
పెరుగుతున్న పెట్టుబడుల జోరు
ఈ రంగంలో పెట్టుబడుల కార్యకలాపాలు బలంగా కొనసాగుతున్నాయి. భారత్ ఈవీ వ్యవస్థ 2024తో పోలిస్తే దాదాపు 27 శాతం అధికంగా 2024–25 ఆర్థిక సంవత్సరంలో 1.4 బిలియన్ అమెరికన్ డాలర్లకు పైగా నిధులను సమీకరించింది. ఈ నిధుల్లో అత్యధిక భాగాన్ని ఈవీ తయారీ సంస్థలు ఆకర్షించాయి. అవి దాదాపు 1.2 బిలియన్ అమెరికన్ డాలర్లను సమీకరించాయి. ఈవీ పెట్టుబడుల్లో దిల్లీ అగ్ర నగరంగా నిలిచింది.
భారత్ ఈవీ రంగానికి వ్యూహాత్మక విధాన జోక్యాలు
ప్రభుత్వం 2015 నుంచి ఆటోమొబైల్ పరిశ్రమకు పలు పథకాలతో విద్యుత్ రవాణాను ప్రోత్సహిస్తోంది. లక్షిత విధాన జోక్యాలు, ఆర్థిక ప్రోత్సాహకాలు, మిషన్ ఆధారిత కార్యక్రమాల ద్వారా ఈవీల వినియోగాన్ని వేగవంతం చేసేందుకు వ్యూహాత్మక విధానాన్ని అనుసరిస్తోంది. ఫేమ్, ఆధునిక రసాయన ఘటాలకు ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం, బ్యాటరీల స్థానికీకరణ వంటి కీలక కార్యక్రమాలు బలమైన, భవిష్యత్తుకు సిద్ధమైన రవాణా వ్యవస్థ నిర్మాణాన్ని లక్ష్యంగా పెట్టుకున్నాయి.
ప్రగతిశీల విధానాలు, ఛార్జింగ్ మౌలిక సదుపాయాల విస్తరణ, బలమైన పెట్టుబడి మద్దతుతో భారత్ ఈవీ పరివర్తనకు రాష్ట్రాలు కీలక చోదకశక్తులుగా ఎదుగుతున్నాయి.
* 2025 డిసెంబరు నాటికి 29 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఈవీ విధానాలను ప్రకటించగా, మరో నాలుగు ప్రాంతాల్లో ముసాయిదా దశలో ఉన్నాయి.
* 15 నుంచి 25 శాతం మూలధన రాయితీలు, ప్రాధాన్య ప్రాతిపదికన భూమి కేటాయింపు, స్టాంపు సుంకం మినహాయింపులు, 100 శాతం వరకు రాష్ట్ర జీఎస్టీ తిరిగి చెల్లింపు వంటి ప్రోత్సాహకాలు పెట్టుబడిదారుల వ్యయాన్ని తగ్గిస్తున్నాయి.
* తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్, హరియాణా, ఉత్తర్‌ప్రదేశ్ వంటి అగ్రగామి రాష్ట్రాలు బలమైన తయారీ వ్యవస్థలకు కేంద్రంగా ఉంటూ ప్రధాన ఈవీ హబ్‌లుగా మారాయి.
దిల్లీ ఈవీ విధానం
భారత్‌లోని అత్యంత ప్రగతిశీల ఈవీ విధానాల్లో దిల్లీ ఈవీ విధానం ఒకటి. నగరంలో వాహన ఉద్గారాలను తగ్గించడం, గాలి నాణ్యతను మెరుగుపరచడం దీని లక్ష్యం.
దిల్లీ–జాతీయ రాజధాని ప్రాంతంలో పాత, అధిక ఉద్గారాలు వెలువరించే ట్రక్కులు, బస్సుల స్థానంలో కొత్త వాహనాలను ప్రవేశపెట్టేందుకు సమగ్ర పథకానికి ప్రభుత్వం 2026 జూన్‌లో ఆమోదం తెలిపింది. గాలి నాణ్యతను మెరుగుపరచడం, పరిశుభ్రమైన రవాణాను ప్రోత్సహించడం ఈ కార్యక్రమం లక్ష్యం. ₹9,585 కోట్ల వ్యయంతో చేపట్టే రెండేళ్ల పథకం ద్వారా దిల్లీ–జాతీయ రాజధాని ప్రాంతంలోని దిల్లీ, హరియాణా, రాజస్థాన్, ఉత్తర్‌ప్రదేశ్‌లో దాదాపు 1.91 లక్షల ట్రక్కులు, 16,329 బస్సులతో కలిపి సుమారు 2.07 లక్షల వాణిజ్య వాహనాల మార్పిడికి మద్దతు అందిస్తారు.

జాతీయ తయారీ మిషన్ (ఎన్‌ఎంఎం)
ఆవిష్కరణ ఆధారిత వృద్ధికి కీలకమైన ‘విత్తన’ రంగంగా ఈవీలను జాతీయ తయారీ మిషన్–2025 గుర్తించింది. ఈ మిషన్ 2035 నాటికి సాధించేందుకు ప్రతిష్ఠాత్మక లక్ష్యాలను నిర్దేశించుకుంది. స్థూల దేశీయోత్పత్తిలో తయారీ రంగం వాటాను 2023లోని 12.9 శాతం నుంచి 25 శాతానికి రెట్టింపు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీనికి తోడు 14.3 కోట్ల ఉద్యోగాలను సృష్టిస్తూ, సరకు ఎగుమతులను 1.2 ట్రిలియన్ అమెరికన్ డాలర్లకు పెంచాలని ఎన్‌ఎంఎం సంకల్పించింది. అధునాతన తయారీని ప్రోత్సహించడం, సాంకేతిక అభివృద్ధికి ఊతమివ్వడం, ప్రపంచ విలువ గొలుసుల్లో ఈవీ ఉత్పత్తిని అనుసంధానించడం ద్వారా భారత్ ఈవీ వ్యవస్థను ఇది బలోపేతం చేస్తుంది. లక్షిత క్లస్టర్ ఆధారిత జోక్యాలు, విధాన మద్దతు ద్వారా దేశీయ ఈవీ తయారీ సామర్థ్యాన్ని వేగవంతం చేయాలని ఎన్‌ఎంఎం లక్ష్యంగా పెట్టుకుంది.
పీఎం ఎలక్ట్రిక్ డ్రైవ్ రివల్యూషన్ ఇన్ ఇన్నోవేటివ్ వెహికల్ ఎన్‌హాన్స్‌మెంట్ పథకం (పీఎం ఈ–డ్రైవ్)
2024లో ప్రకటించిన పీఎం ఈ–డ్రైవ్ పథకం భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ చేపట్టిన కీలక కార్యక్రమం. లక్షిత డిమాండ్ ప్రోత్సాహకాలు, దేశీయ తయారీకి మద్దతు, ఛార్జింగ్ మౌలిక సదుపాయాల విస్తరణ ద్వారా ఈవీల వినియోగాన్ని వేగవంతం చేయడం దీని లక్ష్యం. ₹10,900 కోట్ల కేటాయింపుతో చేపట్టిన ఈ పథకం విద్యుత్ ద్విచక్ర వాహనాలు, మూడు చక్రాల వాహనాలు, ట్రక్కులు, బస్సులు, అంబులెన్సులతో సహా పలు విభాగాలకు వర్తిస్తుంది. పథకంలోని దశలవారీ తయారీ కార్యక్రమం(పీఎంపీ) నిర్దేశిత ఈవీ విడిభాగాలను దేశీయంగానే తయారు చేయాలని ఆదేశిస్తుంది.
28 లక్షలకు పైగా ఈవీలకు మద్దతు అందించాలని పీఎం ఈ–డ్రైవ్ పథకం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో 2026 జనవరి నాటికే 22.12 లక్షల వాహనాలు విక్రయమయ్యాయి. వినియోగదారుల కొనుగోలు వ్యయాన్ని తగ్గించే ముందస్తు ప్రోత్సాహకాలు ఇందుకు దోహదపడ్డాయి. ప్రజా రవాణా విద్యుదీకరణకు ఈ పథకం ప్రాధాన్యం ఇస్తుంది. దేశవ్యాప్తంగా 14,028 విద్యుత్ బస్సులకు ₹4,391 కోట్లు కేటాయించారు. వీటిలో బెంగళూరు, దిల్లీ, ముంబయి, హైదరాబాద్, అహ్మదాబాద్, పుణె, సూరత్ సహా ఏడు ప్రధాన నగరాలకు 13,800 బస్సులు కేటాయించారు. తొలి దశలో కేటాయించిన 10,900 విద్యుత్ బస్సులకు టెండర్ల ప్రక్రియ ఇప్పటికే పూర్తయింది. దేశవ్యాప్తంగా ప్రజా ఈవీ ఛార్జింగ్ కేంద్రాల ఏర్పాటుకు ₹2,000 కోట్లు ప్రత్యేకంగా కేటాయించారు. భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ పరిధిలోని వాహన పరీక్ష సంస్థల ఆధునికీకరణ, మెరుగుదలకు మరో ₹780 కోట్లు కేటాయించారు.
పర్యావరణ కాలుష్యం, ఇంధన భద్రతకు సంబంధించిన కీలక సవాళ్లను పరిష్కరిస్తూనే సుస్థిర రవాణా పరిష్కారాలను ముందుకు తీసుకెళ్లేందుకు ఈ పథకం సిద్ధమైంది. భారత్‌లో పరిశుభ్రమైన, మరింత సుస్థిర రవాణా భవిష్యత్తు దిశగా ఇది కీలక అడుగుగా నిలుస్తోంది.

పీఎం ఈ–బస్ సేవ–చెల్లింపు భద్రతా యంత్రాంగం (పీఎస్‌ఎం) పథకం
పీఎం ఈ–బస్ సేవ–పీఎస్‌ఎం పథకం–2024 కింద ప్రవేశపెట్టే ప్రతి బస్సుకు 12 ఏళ్ల వరకు చెల్లింపు భద్రత కల్పిస్తారు. సాధారణంగా ఒప్పందం కుదిరిన రెండేళ్లలోపు ఈ బస్సులను సేవల్లోకి తీసుకొస్తారు. ప్రభుత్వ–ప్రైవేటు భాగస్వామ్య పద్ధతిలో మొత్తం 10 వేల విద్యుత్ బస్సులను ప్రవేశపెట్టనున్నారు. పట్టణ ప్రాంతాల్లో నగర బస్సు సేవలను బలోపేతం చేయడం దీని లక్ష్యం. పలు రకాల జోక్యాలతో కూడిన ఈ పథకం బస్సుల నిర్వహణ, డిపో మౌలిక సదుపాయాలు, ఛార్జింగ్ నెట్‌వర్క్‌లు, హరిత రవాణా కార్యక్రమాలకు ప్రభుత్వ మద్దతు అందిస్తుంది.

2026 ఫిబ్రవరిలో గుజరాత్‌లోని భావ్‌నగర్‌లో 50 విద్యుత్ బస్సులను ప్రారంభించారు. మహారాష్ట్రలోని నాగ్‌పూర్, చండీగఢ్, అస్సాంలోని గువాహటి నగరాలను కూడా తొలి విడత అమలులో చేర్చారు.
భారత్‌లో విద్యుత్ ప్రయాణికుల కార్ల తయారీ ప్రోత్సాహక పథకం (ఎస్‌పీఎంఈపీసీఐ)
ఎస్‌పీఎంఈపీసీఐ పథకం–2024 విద్యుత్ కార్ల తయారీని ప్రోత్సహిస్తోంది. ఈ పథకం కింద కనీసం ₹4,150 కోట్ల పెట్టుబడి పెట్టాలి. మూడో ఏడాది నాటికి కనీసం 25 శాతం దేశీయ విలువ జోడింపు, ఐదో ఏడాది నాటికి 50 శాతం దేశీయ విలువ జోడింపును కూడా సాధించాలి. పరిశుభ్రమైన, పచ్చదనంతో కూడిన, మరింత స్వావలంబన సాధించిన భారత్ లక్ష్యంగా భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఈ పథకాన్ని ప్రారంభించింది. ఈవీలను ప్రోత్సహించడం ద్వారా వాయు కాలుష్యం, చమురు దిగుమతులు, వాణిజ్య లోటును తగ్గిస్తూ ఆవిష్కరణలు, ఉద్యోగాలు, ఆర్థిక వృద్ధికి ఊతమివ్వాలని లక్ష్యంగా పెట్టుకుంది.
ఆటోమొబైల్, ఆటో విడిభాగాల పరిశ్రమకు ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం (పీఎల్‌ఐ–ఆటో)
ఈవీలతో సహా అధునాతన ఆటోమోటివ్ సాంకేతికతలో భారత్ తయారీ సామర్థ్యాలను బలోపేతం చేయడం పీఎల్‌ఐ–ఆటో పథకం–2021 లక్ష్యం. కనీసం 50 శాతం దేశీయ విలువ జోడింపుతో దేశీయ తయారీని ప్రోత్సహించేందుకు ఈ పథకం ఆర్థిక ప్రోత్సాహకాలు అందిస్తుంది. ఆటోమొబైల్ విలువ గొలుసు అంతటా పెట్టుబడులను ఆకర్షించడం కూడా దీని లక్ష్యం. విద్యుత్ రవాణాపై పథకానికి ఉన్న బలమైన దృష్టిని ప్రతిబింబిస్తూ, ఆమోదం పొందిన దరఖాస్తుదారులకు మొత్తం ₹2,377.56 కోట్ల ప్రోత్సాహకాలను పంపిణీ చేశారు. ఇందులో విద్యుత్ ద్విచక్ర, మూడు చక్రాల, నాలుగు చక్రాల వాహనాలు, విద్యుత్ బస్సులతో సహా పలు విభాగాల ఈవీ తయారీ సంస్థలకు 2026 జనవరి నాటికి ₹2,319.88 కోట్లు కేటాయించారు.
ఆత్మనిర్భర్ భారత్ దార్శనికతకు అనుగుణంగా రూపొందిన పీఎల్‌ఐ పథకం 14 రంగాల్లో పారిశ్రామిక వృద్ధికి కీలక చోదకశక్తిగా ఎదిగింది. ఎలక్ట్రానిక్స్, ఔషధాలు, ఆటోమొబైల్ రంగాల్లో పోటీతత్వాన్ని పెంచుతోంది.
ఆధునిక రసాయన ఘటాల బ్యాటరీ నిల్వ జాతీయ కార్యక్రమానికి పీఎల్‌ఐ పథకం(పీఎల్‌ఐ ఏసీసీ)
పీఎల్‌ఐ ఏసీసీ పథకం–2021కు ₹18,100 కోట్లు కేటాయించారు. దేశీయ బ్యాటరీ తయారీని ప్రోత్సహించడం దీని లక్ష్యం. భారత్‌లో మొత్తం 50 గిగావాట్ గంటల ఏసీసీ సామర్థ్యాన్ని ఏర్పాటు చేయాలని సంకల్పించింది. విక్రయాలతో అనుసంధానించిన ప్రోత్సాహకాల ద్వారా అధునాతన, దీర్ఘ ప్రయాణ పరిధి కలిగిన ఈవీ బ్యాటరీల అభివృద్ధికి కూడా పథకం మద్దతు ఇస్తుంది. ప్రారంభ సన్నాహక కాలం అనంతరం పథకం 2025 జనవరి 1 నుంచి 2029 డిసెంబరు 31 వరకు కొనసాగే పనితీరు దశలోకి ప్రవేశించింది.
ఏసీసీలు కొత్త తరం అధునాతన ఇంధన నిల్వ సాంకేతికతలు. ఇవి విద్యుత్ శక్తిని విద్యుత్ రసాయన లేదా రసాయన శక్తి రూపంలో నిల్వ చేసి, అవసరమైనప్పుడు తిరిగి విద్యుత్ శక్తిగా మారుస్తాయి.
ఈవీ మొత్తం వ్యయంలో 35 నుంచి 40 శాతం బ్యాటరీదే. వాహనంలోని విడిభాగాలన్నింటిలో ఇదే అత్యధిక వ్యయంతో కూడినది. అందువల్ల వాహనాల ధరలను తగ్గించడం, ఇంధన భద్రతను మెరుగుపరచడం, ఉద్యోగాలను సృష్టించడం, ప్రపంచ పోటీతత్వాన్ని పెంచడం కోసం దేశీయ ఏసీసీ తయారీని భారీ స్థాయిలో విస్తరించడం అత్యంత కీలకం.
ఈవీలపై తక్కువ జీఎస్టీ
భారత్‌లో అన్ని విద్యుత్ కార్లు, ద్విచక్ర, మూడు చక్రాల వాహనాలకు 5 శాతం రాయితీ జీఎస్టీ రేటు వర్తిస్తుంది. సంప్రదాయ వాహనాలతో పోలిస్తే వీటిపై పన్ను భారం గణనీయంగా తక్కువగా ఉంటుంది.
ముందుకు సాగుతున్న భారత్: ఈవీ వృద్ధి అవకాశాలు
దిగుమతులపై ఆధారపడిన మార్కెట్ నుంచి ప్రపంచస్థాయి పోటీతత్వం కలిగిన ఈవీ తయారీ కేంద్రంగా భారత్ తనను తాను పునర్నిర్మించుకుంటోంది. ఇంధన భద్రత, చమురు దిగుమతుల తగ్గింపు, 2070 నాటికి నికర శూన్య ఉద్గారాల లక్ష్య సాధన వంటి వ్యూహాత్మక ప్రాధాన్యాలకు ఇది అనుగుణంగా ఉంది.

‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమం ద్వారా సంపూర్ణ దేశీయ ఈవీ ఉత్పత్తిపై దృష్టి సారించారు.
* 2025లో 3.71 బిలియన్ అమెరికన్ డాలర్ల విలువ కలిగిన భారత్ ఈవీ మార్కెట్ 54.94 శాతం వార్షిక సమ్మిళిత వృద్ధి రేటుతో 2034 నాటికి 191.04 బిలియన్ అమెరికన్ డాలర్లకు చేరుతుందని అంచనా.
* భారత ఈవీ బ్యాటరీ మార్కెట్ 21.70 శాతం వార్షిక సమ్మిళిత వృద్ధి రేటుతో 2025లోని 2.71 బిలియన్ అమెరికన్ డాలర్ల నుంచి 2034 నాటికి 15.90 బిలియన్ అమెరికన్ డాలర్లకు పెరిగే అవకాశం ఉంది.
* ప్రపంచ ఈవీ30@30 కార్యక్రమానికి అనుగుణంగా 2030 నాటికి మొత్తం వాహన విక్రయాల్లో 30 శాతం విద్యుత్ వాహనాలే ఉండాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుంది.
* 2030 నాటికి దేశవ్యాప్తంగా 13.2 లక్షల ఛార్జింగ్ కేంద్రాల ఏర్పాటుతో ఈవీ వ్యవస్థ మరింత బలోపేతం కానుంది.
డిమాండ్, ఉత్పత్తి ప్రోత్సాహకాలు, స్థానికీకరణ విధానాలు, ప్రారంభ దశ ఛార్జింగ్ మౌలిక సదుపాయాలతో భారత్ భారీ స్థాయి విస్తరణలో నిర్ణయాత్మక దశకు చేరుకుంది. ప్రపంచ సరఫరా గొలుసులు పునర్వ్యవస్థీకరణ చెందుతున్న నేపథ్యంలో ఈవీ తయారీ పెట్టుబడులకు అత్యంత ఆకర్షణీయమైన గమ్యస్థానాల్లో భారత్ ఒకటిగా నిలుస్తుందని అంచనా.
దేశీయ సామర్థ్యాలు బలోపేతం అవుతున్న కొద్దీ భారత్ ఎగుమతి కేంద్రంగా ఎదిగేందుకు సిద్ధంగా ఉంది. విద్యుత్ ద్విచక్ర వాహనాలు, చిన్న పరిమాణ ఈవీలు, బ్యాటరీ ప్యాక్‌లు, కీలక డ్రైవ్‌ట్రెయిన్ విడిభాగాల వంటి పలు రకాలకు ఇది వర్తిస్తుంది. పరిశోధన–అభివృద్ధి పెట్టుబడులు, ప్రపంచ భాగస్వామ్యాలు దీనికి అండగా నిలుస్తున్నాయి.
రాబోయే రోజులను దృష్టిలో ఉంచుకుని కార్పొరేట్ సగటు ఇంధన సామర్థ్య ప్రమాణాల తదుపరి దశలైన కేఫ్–3 (2027–2032), కేఫ్–4 (2033–2037)ను ప్రభుత్వం రూపొందిస్తోంది. ప్రపంచ సమన్వయ తేలికపాటి వాహన పరీక్షా విధానం (డబ్ల్యూఎల్‌టీపీ) ఆధారంగా మరింత కఠినమైన కార్బన్ డైఆక్సైడ్ ఉద్గార లక్ష్యాలను ఇవి ప్రతిపాదిస్తున్నాయి. కేఫ్–3కు కిలోమీటరుకు 91.7 గ్రాముల కార్బన్ డైఆక్సైడ్, కేఫ్–4కు కిలోమీటరుకు 70 గ్రాముల కార్బన్ డైఆక్సైడ్ పరిమితులను ప్రతిపాదించారు. సూపర్ క్రెడిట్ యంత్రాంగంతో కలిపి ఈ ప్రమాణాలను అమలు చేసే అవకాశం ఉంది. సంప్రదాయ కార్లు, ప్లగ్–ఇన్ సదుపాయం లేని హైబ్రిడ్ వాహనాల విక్రయాల కంటే ఈవీ విక్రయాలను పెంచడం ద్వారా అసలు పరికరాల తయారీ సంస్థలు నిర్దేశిత ప్రమాణాలను మరింత సులభంగా చేరుకునేందుకు ఇది వీలు కల్పించనుంది.
భారత్‌లో కార్పొరేట్ సగటు ఇంధన సామర్థ్య ప్రమాణాలను 2017లో ప్రవేశపెట్టారు. ఈవీలతో సహా అధిక ఇంధన సామర్థ్యం, తక్కువ ఉద్గారాలు కలిగిన ప్రయాణికుల వాహనాలను ఉత్పత్తి చేసే దిశగా అసలు పరికరాల తయారీ సంస్థలను నడిపించేందుకు వీటిని రూపొందించారు. అన్ని వాహన విభాగాల్లో సామర్థ్య మెరుగుదలను ప్రోత్సహించడం ద్వారా ఈవీల వినియోగ పురోగతిలో ఈ ప్రమాణాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. భారీ స్థాయిలో మొత్తం ఇంధన వినియోగం, కార్బన్ డైఆక్సైడ్ ఉద్గారాలను కూడా తగ్గిస్తున్నాయి.
పరివర్తన అంచున
రవాణా రంగంలో నిర్ణయాత్మక పరివర్తన అంచున భారత్ నిలిచింది. డిమాండ్ వేగంగా పెరుగుతోంది, తయారీ విస్తరిస్తోంది, సాంకేతిక సామర్థ్యాలు పురోగమిస్తున్నాయి. ఫలితంగా పరిశోధన–అభివృద్ధి, ఈవీ తయారీకి ప్రపంచ కేంద్రంగా దేశం వేగంగా ఎదుగుతోంది. మెరుగైన ఆర్థిక వనరుల లభ్యత, పెరుగుతున్న అవగాహన, సాంకేతిక పురోగతి, విశ్వసనీయ ఛార్జింగ్ సదుపాయాలు, నైపుణ్యం కలిగిన శ్రామికశక్తి వంటి కీలక అంశాలు భారత్ ఈవీ పరివర్తనను వేగవంతం చేస్తున్నాయి. సంస్కరణల ఆధారిత విధాన వాతావరణం భారీ స్థాయిలో ఆకర్షణీయమైన, దీర్ఘకాలిక ప్రయోజనాన్ని కల్పిస్తోంది.
మరింత లోతైన సరఫరా గొలుసు అనుసంధానం, బ్యాటరీల వేగవంతమైన స్థానికీకరణ, బలమైన ఛార్జింగ్ మౌలిక సదుపాయాలు భవిష్యత్తు ప్రయాణాన్ని నిర్దేశిస్తాయి. ప్రపంచ ఈవీ రంగంలో భారత్ నాయకత్వాన్ని ఈ మూల స్తంభాలు సమష్టిగా తీర్చిదిద్దనున్నాయి.
References
Prime Minister's Office
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2160822®=3&lang=2
Ministry of Heavy Industries
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2200852®=3&lang=1
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2237556®=3&lang=1
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2117485®=3&lang=2
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2222608®=3&lang=2
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2227596®=3&lang=2
https://heavyindustries.gov.in/en/pli-scheme-national-programme-advanced-chemistry-cell-acc-battery-storage
https://sansad.in/getFile/rsnew/Committee_site/Committee_File/ReportFile/17/215/332_2026_3_14.pdf?source=rajyasabha
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2222604®=3&lang=1
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2237554®=3&lang=2
https://sansad.in/getFile/loksabhaquestions/annex/187/AU1779_LB4HdS.pdf?source=pqals
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2260368®=3&lang=1
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2287125®=3&lang=1
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2287131®=3&lang=1
Ministry of Housing and Urban Affairs
https://pm-ebus-sewa.mohua.gov.in/
Ministry of Environment, Forest and Climate Change
https://teriin.org/files/EV-Charging-in-India-Ecosystem-Perspectives-and-Skilling-Opportunities.pdf
Ministry of Finance
https://www.indiabudget.gov.in/economicsurvey/doc/echapter.pdf
https://www.pib.gov.in/Pressreleaseshare.aspx?PRID=1580536®=3&lang=2
Ministry of Road Transport & Highways
https://vahan.parivahan.gov.in/vahan4dashboard/vahan/dashboardview.xhtml;jsessionid=7E3B85C812D7040175EF101A79811DD4
https://sansad.in/getFile/annex/270/AU585_GCe0A2.pdf?source=pqars
Ministry of Commerce and Industry
https://www.investindia.gov.in/team-india-blogs/governments-ev-policies-driving-indias-green-revolution
https://www.investindia.gov.in/team-india-blogs/inside-indias-ev-manufacturing-ecosystem-key-investment-trends-government-policies
https://www.startupindia.gov.in/content/sih/en/ams-application/accelerator-program.html?applicationId=5ce7f127e4b08f8b1a974283
Government of NCT of Delhi
https://transport.delhi.gov.in/transport/delhi-ev-policy
Cabinet
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2268342®=3&lang=1
Council on Energy, Environment and Water
https://www.ceew.in/gfc/publications/navigating-indias-electric-mobility-transition#:~:text=At%20the%20national%20level%2C%20India's,began%20to%20surge%20from%20FY22
https://www.ceew.in/gfc/solutions-factory/publications/CEEW-Navigating_India%27s_Electric_Mobility_Transition_WEB.pdf
https://www.ceew.in/gfc/tools_and_dashboards/electric-mobility/national-volume-monitor
https://www.ceew.in/press-releases/india-on-track-to-exceed-2030-ndc-target-on-carbon-emissions-reduction
https://www.ceew.in/news/cop-26-ceew-unpacks-indias-2070-net-zero-target-and-other-climate-mitigation-measures
International Energy Agency
https://iea.blob.core.windows.net/assets/7ea38b60-3033-42a6-9589-71134f4229f4/GlobalEVOutlook2025.pdf
US Department of Energy
https://afdc.energy.gov/vehicles/electric
https://afdc.energy.gov/laws/12660%20;%20https://afdc.energy.gov/vehicles/electric
IBEF
https://www.ibef.org/industry/electric-vehicle
https://www.ibef.org/news/india-s-electric-vehicle-market-accounts-for-8-of-new-vehicle-registrations-in-2025-vahan-portal-data
Others
https://ddnews.gov.in/en/indias-ev-sales-cross-2-3-million-in-2025-market-share-rises-to-8/
https://www.newsonair.gov.in/indias-electric-vehicle-market-accounts-for-8-of-new-vehicle-registrations-in-2025-vahan-portal-data/
https://ddnews.gov.in/en/pm-modi-flags-off-50-electric-buses-for-gujarats-bhavnagar-under-pm-e-bus-sewa-scheme/
https://www.newsonair.gov.in/over-29000-public-ev-charging-stations-installed-in-india-mos-bhupathiraju-srinivasa-varma/
https://www.iea.org/reports/global-ev-outlook-2026
Niti Aayog
https://niti.gov.in/sites/default/files/2025-08/Electric-Vehicles-WEB-LOW-Report.pdf
https://niti.gov.in/sites/default/files/2026-01/Trade_Watch_Quarterly_April_June_Q1_FY26.pdf
https://e-amrit.niti.gov.in/charging-map
https://niti.gov.in/sites/default/files/2025-08/India-Electric-Mobility-Index-2024-Report.pdf
https://e-amrit.niti.gov.in/benefits-of-electric-vehicles
https://www.pib.gov.in/PressReleseDetailm.aspx?PRID=2152243®=3&lang=2#:~:text=It%20enables%20states%20to%20benchmark,learn%20from%20each%20other's%20successes.%E2%80%9D
PIB Archives
https://www.pib.gov.in/PressNoteDetails.aspx?NoteId=155094&ModuleId=3®=3&lang=2
https://www.pib.gov.in/PressNoteDetails.aspx?NoteId=157304&ModuleId=3®=3&lang=1
Click here to see Pdf
***
(Explainer ID: 159485)
आगंतुक पटल : 92
Provide suggestions / comments