Infrastructure
క్యూల నుంచి క్లిక్‌ల వరకు: భారతీయ రైల్వే ప్రయాణికుల రిజర్వేషన్ వ్యవస్థ నాలుగు దశాబ్దాల ప్రస్థానం
Posted On:
06 AUG 2026 2:10PM
క్యూల నుంచి క్లిక్‌ల దాకా భారతీయ రైల్వే ప్రయాణికుల రిజర్వేషన్ విధానంలో సమూల మార్పు తీసుకొచ్చింది. ప్రపంచంలోని అతిపెద్ద ప్రజా రిజర్వేషన్ వ్యవస్థల్లో ఒకటి ఇప్పుడు సాంకేతికత ఆధారంగా పనిచేస్తోంది. నిరంతర ఆధునికీకరణతో టికెట్ బుకింగ్ మరింత వేగంగా, విశ్వసనీయంగా మారింది. ఆధునికీకరించిన ప్రయాణికుల రిజర్వేషన్ వ్యవస్థ మరింత మెరుగైన, అవాంతరాలు లేని ప్రయాణ అనుభవాన్ని అందిస్తోంది.
రైల్వే రిజర్వేషన్లకు వెన్నెముక
ప్రపంచంలోని అతిపెద్ద రైలు నెట్‌వర్క్‌లలో ఒకటైన భారతీయ రైల్వే ప్రతిరోజూ లక్షల మంది ప్రయాణికులను అనుసంధానిస్తోంది. ఉద్యోగం, విద్య, వైద్యం, వ్యాపారం లేదా కుటుంబ అవసరాల కోసం ప్రయాణించే వారంతా తమ ప్రయాణాలను ప్రణాళిక చేసుకునేందుకు విశ్వసనీయ రిజర్వేషన్ వ్యవస్థపై ఆధారపడతారు. ప్రతి రిజర్వ్‌డ్ టికెట్ వెనుక ప్రయాణికుల రిజర్వేషన్ వ్యవస్థ (పీఆర్‌ఎస్) ఉంటుంది. దాదాపు నాలుగు దశాబ్దాలుగా రైల్వే బుకింగ్‌లకు సాంకేతిక ఆధారిత వెన్నెముకగా ఇది పనిచేస్తోంది. 1986లో ప్రవేశపెట్టిన పీఆర్‌ఎస్ మొదట మానవ ఆధారిత రిజర్వేషన్ కౌంటర్ల స్థానాన్ని భర్తీ చేసింది. ఆ తర్వాత ఆన్‌లైన్, మొబైల్ టికెట్ బుకింగ్‌కు మద్దతు ఇచ్చే స్థాయికి పరిణామం చెందింది.
వినియోగదారుల సంఖ్య, ఆన్‌లైన్ సేవల వినియోగం పెరగడంతో వేగవంతమైన, విశ్వసనీయమైన, అవాంతరాలు లేని బుకింగ్ సదుపాయాలపై అంచనాలు కూడా పెరిగాయి. ముఖ్యంగా తత్కాల్ రిజర్వేషన్ల సమయంలో గరిష్ఠ బుకింగ్ వేళల్లో భారీ డిమాండ్ ఏర్పడుతోంది. గత కాలపు అవసరాలకు అనుగుణంగా రూపొందించిన మౌలిక సదుపాయాలపై ఇది తీవ్ర ఒత్తిడిని పెంచుతోంది. మారుతున్న ఈ అవసరాలను తీర్చేందుకు భారతీయ రైల్వే పీఆర్‌ఎస్‌ను సమగ్రంగా ఆధునికీకరిస్తోంది. కొత్త పీఆర్‌ఎస్ బుకింగ్ సామర్థ్యాన్ని పెంచడంతో పాటు ప్రయాణికుల అవసరాలకు ప్రాధాన్యం ఇచ్చే సదుపాయాలను ప్రవేశపెట్టి, ఎలాంటి ఒత్తిడినైనా తట్టుకునే ఆన్‌లైన్ మౌలిక వ్యవస్థను రూపొందిస్తుంది.
ప్రయాణికుల రిజర్వేషన్ వ్యవస్థ నాలుగు దశాబ్దాల ప్రస్థానం
భారతీయ రైల్వే నెట్‌వర్క్ అంతటా రిజర్వ్‌డ్ టికెట్ల జారీని నిర్వహించే కంప్యూటరీకృత వేదిక పీఆర్‌ఎస్. రిజర్వ్‌డ్ టికెట్లను బుక్ చేసుకోవడం, వివరాలు మార్చుకోవడం, రద్దు చేసుకోవడానికి ఇది ప్రయాణికులకు వీలు కల్పిస్తుంది. సీట్ల కేటాయింపు, నిరీక్షణ జాబితాలు, రద్దుకు ప్రతిగా రిజర్వేషన్ (ఆర్‌ఏసీ), రిజర్వేషన్ చార్టులు, ప్రయాణికుల విచారణలను కూడా నిర్వహిస్తుంది. రిజర్వేషన్ కేంద్రాలు, ఆన్‌లైన్ బుకింగ్ మార్గాలను అనుసంధానించడం ద్వారా రైల్వే రిజర్వేషన్లను మరింత సమర్థంగా, పారదర్శకంగా, అందుబాటులోకి పీఆర్‌ఎస్ తీసుకొచ్చింది.
మానవ ఆధారిత రిజర్వేషన్ రిజిస్టర్లు, కౌంటర్ బుకింగ్ స్థానంలో పీఆర్‌ఎస్ ఎలక్ట్రానిక్ వ్యవస్థను ప్రవేశపెట్టింది. రైల్వే నెట్‌వర్క్ విస్తరించిన కొద్దీ దేశవ్యాప్త రిజర్వేషన్ వేదికగా పీఆర్‌ఎస్ పరిణామం చెందింది. దేశంలోని ఏ రైలుకైనా ఒకే ప్రాంతం నుంచి టికెట్లు బుక్ చేసుకునే సదుపాయాన్ని ప్రయాణికులకు కల్పించింది. ప్రస్తుతం కౌంటర్లు, వెబ్సైట్లు, మొబైల్ యాప్‌ల ద్వారా రిజర్వేషన్లకు పీఆర్‌ఎస్ మద్దతు ఇస్తోంది. ఆన్‌లైన్ రిజర్వేషన్ల కోసం ప్రయాణికులు భారతీయ రైల్వే క్యాటరింగ్, పర్యాటక సంస్థ (ఐఆర్‌సీటీసీ) వెబ్‌సైట్, మొబైల్ యాప్ ద్వారా పీఆర్‌ఎస్‌ను వినియోగిస్తారు. అవాంతరాలు లేని డిజిటల్ వేదిక ద్వారా ఎక్కడి నుంచైనా రిజర్వ్‌డ్ టికెట్లు బుక్ చేసుకునేందుకు ఇది వీలు కల్పిస్తుంది.
మానవ ఆధారిత రిజర్వేషన్ రిజిస్టర్లు, కౌంటర్ బుకింగ్ స్థానంలో పీఆర్‌ఎస్ ఎలక్ట్రానిక్ వ్యవస్థను ప్రవేశపెట్టింది. రైల్వే నెట్‌వర్క్ విస్తరించిన కొద్దీ కంప్యూటరీకృత మెరుగైన రిజర్వేషన్, టికెటింగ్ దేశవ్యాప్త నెట్‌వర్క్ (కాన్సర్ట్) ద్వారా పీఆర్‌ఎస్ జాతీయ రిజర్వేషన్ వేదికగా పరిణామం చెందింది. రైలు బయలుదేరే లేదా గమ్యస్థానంతో సంబంధం లేకుండా అనుసంధానిత రిజర్వేషన్ కేంద్రం నుంచి దేశంలోని ఏ రైలుకైనా టికెట్లు బుక్ చేసుకునేందుకు ఇది ప్రయాణికులకు వీలు కల్పించింది. కాలక్రమంలో రిజర్వేషన్ కౌంటర్లకు పరిమితమైన బుకింగ్ మార్గాలు వెబ్సైట్లు, మొబైల్ యాప్‌లకు విస్తరించాయి. ప్రస్తుతం ప్రయాణికులు ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్, మొబైల్ యాప్ ద్వారా ఆన్‌లైన్‌లో పీఆర్‌ఎస్‌ను వినియోగిస్తూ ఎక్కడి నుంచైనా రిజర్వ్‌డ్ టికెట్లు బుక్ చేసుకుంటున్నారు.
పీఆర్‌ఎస్ పరిణామంలో కీలక మైలురాళ్లు
|
సంవత్సరం
|
మైలురాయి
|
|
1986
|
పీఆర్‌ఎస్ ప్రవేశంతో భారత్‌లో రైల్వే రిజర్వేషన్ల కంప్యూటరీకరణకు నాంది పలికింది.
|
|
1990వ దశకం
|
రైల్వే జోన్ల అంతటా పీఆర్‌ఎస్ నెట్‌వర్క్ విస్తరించింది. పరస్పరం అనుసంధానమైన దేశవ్యాప్త నెట్‌వర్క్ ద్వారా రిజర్వేషన్లకు అవకాశం లభించింది.
|
|
2002
|
ఇంటర్నెట్ ఆధారిత టికెట్ బుకింగ్‌ను ప్రవేశపెట్టడంతో రిజర్వేషన్ సేవలు భౌతిక కౌంటర్లకు మించి విస్తరించాయి.
|
|
2014
|
ఆన్‌లైన్ బుకింగ్ సామర్థ్యం, ప్రయాణికుల అనుభవాన్ని మెరుగుపరచేందుకు తదుపరి తరం ఈ–టికెటింగ్ వ్యవస్థను (ఎన్‌జీఈటీ) ప్రారంభించారు.
|
|
2025
|
రైల్‌వన్ యాప్‌ను ప్రారంభించారు. గణనీయంగా మెరుగైన బుకింగ్, విచారణ సామర్థ్యంతో తదుపరి తరం పీఆర్‌ఎస్‌ను అభివృద్ధి చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
|
|
2026 ఆగస్టు
|
ఆధునికీకరించిన పీఆర్‌ఎస్‌కు రైళ్లను దశలవారీగా మార్చే ప్రక్రియ ప్రారంభమైంది. రైల్వే రిజర్వేషన్ల డిజిటల్ పరివర్తనలో ఇది కొత్త దశకు నాంది పలికింది.
|
ఈ కార్యక్రమాలు పారదర్శకత, కార్యాచరణ సామర్థ్యాన్ని మెరుగుపరిచాయి.
పీఆర్‌ఎస్: భారీ స్థాయిలో పనిచేసే డిజిటల్ వేదిక
2025 జూన్ నుంచి 2026 జూన్ మధ్య ప్రయాణికులు పీఆర్‌ఎస్ ద్వారా 65.08 కోట్ల రిజర్వ్‌డ్ టికెట్లను బుక్ చేసుకున్నారు. వీటిలో 57.90 కోట్ల టికెట్లను, అంటే 89 శాతాన్ని ఆన్‌లైన్‌లో బుక్ చేశారు. రైలు ప్రయాణికులు డిజిటల్ సేవలను వేగంగా స్వీకరిస్తున్నట్లు ఇది తెలియజేస్తోంది.
ప్రస్తుతం పీఆర్‌ఎస్ ప్రపంచంలోని అతిపెద్ద ఆన్‌లైన్ రైల్వే బుకింగ్ వేదికల్లో ఒకటిగా ఉంది. రైల్వే సమాచార వ్యవస్థల కేంద్రం దీన్ని అభివృద్ధి చేసి, నిర్వహిస్తోంది. పలు బుకింగ్ మార్గాల ద్వారా ప్రతిరోజూ 20.5 లక్షల మందికి పైగా ప్రయాణికులకు ఇది సేవలు అందిస్తోంది. పీఆర్‌ఎస్ లావాదేవీల్లో దాదాపు 73 శాతం నగదు రహితంగా జరుగుతున్నాయి. దేశంలో ప్రజలు నేరుగా వినియోగించే అతిపెద్ద ఆన్‌లైన్ వేదికల్లో ఒకటిగా పీఆర్‌ఎస్ పరిణామం చెందింది.

డిజిటల్ ఇండియా అవసరాల సాధన
పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చేందుకు అధిక లావాదేవీలను నిర్వహించడంతో పాటు వేగవంతమైన, విశ్వసనీయమైన, మరింత సురక్షితమైన సేవలను అందించే బుకింగ్ వ్యవస్థ భారతీయ రైల్వేకు అవసరం.
రిజర్వేషన్ వ్యవస్థను బలోపేతం చేసేందుకు భారతీయ రైల్వే ప్రయాణికుల ప్రయోజనాలకు ప్రాధాన్యం ఇచ్చే పలు సంస్కరణలను ప్రవేశపెట్టింది:
· ప్రయాణికుల బుకింగ్ ధోరణులకు మెరుగ్గా అనుగుణంగా ఉండేలా ముందస్తు రిజర్వేషన్ వ్యవధిని (ఏఆర్‌పీ) 120 రోజుల నుంచి 60 రోజులకు తగ్గించారు.
· న్యాయబద్ధత, పారదర్శకతను మెరుగుపరచేందుకు 2025 జులైలో ఆధార్ ధ్రువీకరణతో కూడిన తత్కాల్ బుకింగ్‌ను ప్రవేశపెట్టారు.
· ఆటోమేటెడ్ బాట్లు, అనధికార ఏజెంట్ల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు తర్వాత ఓటీపీ ఆధారిత ధ్రువీకరణను చేర్చారు. ఇటానియం సర్వర్లు, ఓపెన్వీఎంఎస్ వేదికపై 2010లో ఏర్పాటు చేసిన ప్రస్తుత పీఆర్‌ఎస్‌ను అప్పటి డిజిటల్ డిమాండ్‌కు అనుగుణంగా రూపొందించారు. ఇప్పుడు దీన్ని క్లౌడ్ సదుపాయంతో కూడిన తదుపరి తరం రిజర్వేషన్ వ్యవస్థగా ఆధునికీకరిస్తున్నారు.
ఆధునికీకరించిన పీఆర్‌ఎస్ కింది సదుపాయాలను అందిస్తుంది:
· ప్రస్తుత వ్యవస్థలో నిమిషానికి 32 వేల టికెట్ బుకింగ్‌లతో పోలిస్తే 1.5 లక్షలకు పైగా టికెట్ల బుకింగ్ సామర్థ్యం.
· ప్రస్తుత నిమిషానికి 4 లక్షల విచారణల స్థానంలో 40 లక్షలకు పైగా విచారణలను నిర్వహించే సామర్థ్యం.
· బుకింగ్, విచారణల కోసం పలు భాషల్లో వినియోగదారులకు అనుకూలమైన వ్యవస్థ.
· భవిష్యత్తులో ప్రయాణికుల డిమాండ్‌ను తీర్చేందుకు అధిక విస్తరణ సామర్థ్యం, సౌలభ్యం, విశ్వసనీయత.

పునఃరూపకల్పన చేసిన ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ ద్వారా ప్రయాణికుల సదుపాయాలను కూడా బలోపేతం చేస్తున్నారు. 2026 జులైలో ప్రారంభించిన బీటా వెర్షన్‌లో సరళమైన వ్యవస్థ, తక్కువ బుకింగ్ దశలు, అన్ని తరగతుల్లో సీట్ల లభ్యత వివరాలు ఉన్నాయి. సులభమైన బుకింగ్ అనుభవాన్ని కల్పించేందుకు కొత్త పోర్టల్‌ను తదుపరి తరం పీఆర్‌ఎస్‌తో అనుసంధానిస్తారు.
రైల్వే టికెటింగ్‌తో పాటు ఐఆర్‌సీటీసీ తన పర్యాటక వేదిక ద్వారా హోటల్ బుకింగ్‌లు, విశ్రాంతి గదులు, లాంజ్ బుకింగ్‌లు, పర్యాటక ప్యాకేజీలు, విమాన టికెట్లు, బస్సు టికెట్లు వంటి ప్రయాణ సంబంధిత సేవలను కూడా అందిస్తోంది.
సీఆర్ఐఎస్: రైల్వే సాంకేతికతను ముందుకు నడిపిస్తున్న సంస్థ
1986లో ఏర్పాటైన రైల్వే సమాచార వ్యవస్థల కేంద్రం (సీఆర్ఐఎస్) భారతీయ రైల్వేకు అవసరమైన సమాచార సాంకేతిక మౌలిక వ్యవస్థను రూపొందించి, అభివృద్ధి చేసి, నిర్వహిస్తుంది. దాదాపు నాలుగు దశాబ్దాల్లో రైల్వే బుకింగ్‌ల కంప్యూటరీకరణ నుంచి సమగ్ర డిజిటల్ వేదికల అభివృద్ధి వరకు క్రిస్ విస్తరించింది. ప్రస్తుతం ఈ సంస్థ రూపొందించిన పరిష్కారాలు ప్రతిరోజూ లక్షల మంది ప్రయాణికులు, రైల్వే సిబ్బందికి సేవలు అందిస్తున్నాయి.
ప్రయాణికులకు ప్రాధాన్యం ఇచ్చే డిజిటల్ సేవలు
ప్రయాణికులు భారతీయ రైల్వే సేవలను వినియోగించే విధానాన్ని మార్చిన పీఆర్‌ఎస్‌తో సహా పలు వేదికలను క్రిస్ అభివృద్ధి చేసింది.
· రిజర్వేషన్ లేని టికెటింగ్ వ్యవస్థ (యూటీఎస్): రిజర్వేషన్ అవసరం లేని ప్రయాణాలకు కాగితరహిత, మొబైల్ టికెటింగ్‌కు మద్దతు ఇస్తుంది.
· జాతీయ రైలు విచారణ వ్యవస్థ (ఎన్‌టీఈఎస్): రైళ్ల రాకపోకల తాజా స్థితి, సమయ పట్టికలు, రాక లేదా బయలుదేరే వివరాలను అందిస్తుంది.
· రైల్‌కనెక్ట్: 2017లో ప్రవేశపెట్టిన రైల్‌కనెక్ట్ మొబైల్ యాప్ పీఆర్‌ఎస్ సేవలను స్మార్ట్‌ఫోన్లకు తీసుకొచ్చింది. ఆన్‌లైన్ టికెట్ బుకింగ్, టికెట్ రద్దు, పీఎన్ఆర్ విచారణలకు ఇది వీలు కల్పించింది.
· రైల్‌వన్: 2025 జులైలో ప్రారంభించిన రైల్‌వన్ ఒక సమగ్ర మొబైల్ యాప్. రైల్వే సేవలను సులభంగా పొందేందుకు పలు విధులను ఒకే వ్యవస్థలో అందిస్తుంది. జులై 22 నాటికి ఆండ్రాయిడ్, ఐఓఎస్ పరికరాల్లో ఈ యాప్ 4.55 కోట్లకు పైగా డౌన్‌లోడ్‌లను నమోదు చేసింది. ప్రస్తుతం ప్రతిరోజూ దాదాపు 9.65 లక్షల టికెట్ బుకింగ్‌లకు వీలు కల్పిస్తోంది. కృత్రిమ మేధ ఆధారిత నిరీక్షణ జాబితా టికెట్ ఖరారు అంచనా దీని తాజా సదుపాయాల్లో ఒకటి. టికెట్ బుకింగ్ సమయంలోనే నిరీక్షణ జాబితాలోని టికెట్ ప్రయాణానికి ముందుగా ఖరారయ్యే అవకాశాన్ని ఇది అంచనా వేస్తుంది. అంచనా కచ్చితత్వం 53 శాతం నుంచి 94 శాతానికి మెరుగుపడటంతో ప్రయాణికులు పూర్తి సమాచారంతో ప్రయాణ నిర్ణయాలు తీసుకోగలుగుతున్నారు.
· రైల్‌మదద్: ప్రయాణికుల ఫిర్యాదులు, అభిప్రాయాలు, సేవా అభ్యర్థనలకు సమగ్ర వేదికను అందిస్తుంది. రైల్‌మదద్ వెబ్‌సైట్, మొబైల్ యాప్, సంక్షిప్త సందేశం, రైల్వే సహాయవాణి 139 ద్వారా ప్రయాణికులు సహాయం పొందవచ్చు. ఫిర్యాదులను సకాలంలో పరిష్కరించేందుకు ఈ వేదిక ఆటోమేటిక్ ఫిర్యాదు కేటాయింపు, ఉన్నతస్థాయికి స్వయంచాలక బదిలీ వ్యవస్థలను వినియోగిస్తుంది. గత మూడేళ్లలో పరిష్కరించిన ఫిర్యాదుల వివరాలు:
|
సంవత్సరం
|
పరిష్కరించిన ఫిర్యాదుల శాతం
|
|
2023-24
|
99.98%
|
|
2024-25
|
99.99%
|
|
2025-26
|
99.98%
|
· కోచ్‌మిత్ర: ప్రయాణ సమయంలో పరిశుభ్రత, ఇతర సహాయం వంటి రైల్లోని సదుపాయాలను కోరేందుకు ప్రయాణికులకు సహాయపడుతుంది.
· రైల్ సుగమ్: రైల్వే సేవలు, సరకు రవాణా, ప్రయాణికుల సదుపాయాలకు సంబంధించిన సమాచారాన్ని అందిస్తుంది.
· రైల్ రాజభాష: డిజిటల్ సాధనాల ద్వారా రైల్వే పరిపాలనలో హిందీ వినియోగానికి మద్దతు ఇస్తుంది.
రైల్వే కార్యకలాపాలకు సాంకేతిక అండ
ప్రయాణికుల సేవలకు మించి రైల్వే సామర్థ్యాన్ని మెరుగుపరిచే డిజిటల్ వ్యవస్థలను క్రిస్ అభివృద్ధి చేసింది.
· సరుకు రవాణా కార్యకలాపాల సమాచార వ్యవస్థ (ఎఫ్‌ఓఐఎస్): సరకు రవాణా, వ్యాగన్ల నిర్వహణ, రవాణా ప్రణాళికను డిజిటలీకరిస్తుంది.
· సిబ్బంది నిర్వహణ వ్యవస్థ (సీఎంఎస్): సిబ్బంది విధుల ప్రణాళిక, నియామకం, పర్యవేక్షణను క్రమబద్ధీకరిస్తుంది.
· ఈ–దృష్టి: రైల్వే పనితీరు, కార్యాచరణ సూచికల పర్యవేక్షణకు డ్యాష్‌బోర్డులను అందిస్తుంది.
· ఆపూర్తి: సేకరణ, టెండర్ల నిర్వహణ ప్రక్రియలను డిజిటలీకరిస్తుంది.
· చాలక్ దళ్, చేతితో పట్టుకునే టెర్మినళ్లు: క్షేత్రస్థాయి కార్యకలాపాలు, తనిఖీలు, తాజా పరిస్థితుల పర్యవేక్షణకు మద్దతు ఇస్తాయి.
వర్ధమాన సాంకేతికతల స్వీకరణ
అధునాతన డిజిటల్ పరిష్కారాల ద్వారా రైల్వే సాంకేతికతను క్రిస్ నిరంతరం ఆధునికీకరిస్తోంది. కృత్రిమ మేధ (ఏఐ), యంత్ర అభ్యసనం (ఎంఎల్), భారీ సమాచార విశ్లేషణ, క్లౌడ్ కంప్యూటింగ్‌ను స్వీకరిస్తోంది. రైల్వే అనువర్తనాల్లో బ్లాక్‌చైన్, అంతర్జాల ఆధారిత పరికరాల అనుసంధానం (ఐఓటీ), ఆగ్మెంటెడ్/వర్చువల్ రియాలిటీ (ఏఆర్/వీఆర్) సాంకేతికతలను కూడా వినియోగిస్తోంది. ఈ సాంకేతికతలను కింది అవసరాలకు ఉపయోగిస్తున్నారు:
· రైళ్ల ఆలస్యం, నిరీక్షణ జాబితా టికెట్ల ఖరారును అంచనా వేయడం.
· రైలు మార్గాలు, సమయ పట్టికలను మరింత సమర్థంగా రూపొందించడం.
· ఇంధన వినియోగాన్ని అంచనా వేయడం.
· రైల్వే ఆస్తులకు ముందస్తు నిర్వహణ సదుపాయం కల్పించడం.
· ప్రణాళిక, కార్యాచరణ నిర్ణయాలను మెరుగుపరచడం.
తదుపరి తరం పీఆర్‌ఎస్ ఈ సాంకేతిక పునాదిపై రూపుదిద్దుకుంటోంది. వేగవంతమైన, తెలివైన, విస్తరణ సామర్థ్యం కలిగిన రిజర్వేషన్ వేదికను రూపొందించేందుకు క్లౌడ్ ఆధారిత మౌలిక వ్యవస్థను అధునాతన డిజిటల్ సాంకేతికతలతో మేళవిస్తుంది.
భవిష్యత్తుకు సిద్ధమైన రిజర్వేషన్ వ్యవస్థ
దాదాపు నాలుగు దశాబ్దాలుగా భారతీయ రైల్వేలో కొనసాగుతున్న డిజిటల్ పరివర్తనకు ప్రయాణికుల రిజర్వేషన్ వ్యవస్థ అద్దం పడుతోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా లక్షల మంది ప్రయాణికులు విశ్వసించే రిజర్వేషన్ వేదికగా ఇది నిలిచింది. ఈ బలమైన పునాదిపై తదుపరి తరం పీఆర్‌ఎస్ రూపుదిద్దుకుంటోంది. ఇవి సమష్టిగా వేగవంతమైన, విశ్వసనీయమైన, అవాంతరాలు లేని రైల్వే సేవలను అందిస్తాయి. ప్రయాణికుల అవసరాలు నిరంతరం మారుతున్న నేపథ్యంలో భారతీయ రైల్వే భవిష్యత్తుకు సిద్ధమైన రిజర్వేషన్ వ్యవస్థను నిర్మిస్తోంది.
References
Centre for Railway Information Systems:
https://cris.org.in/loadpage?page=indexNew#home
Ministry of Railways
https://indianrail.gov.in/enquiry/PNR/PnrEnquiry.jsp
https://sr.indianrailways.gov.in/view_detail.jsp?lang=0&id=0,4,268&dcd=19160&did=17678519509983E5D5568AFF4D66322B878236BFF8C69
https://www.pib.gov.in/Pressreleaseshare.aspx?PRID=1685036®=48&lang=2
https://www.pib.gov.in/Pressreleaseshare.aspx?PRID=1566211&lang=2®=48
https://indianrailways.gov.in/railwayboard/uploads/directorate/eff_res/work_Study/2019-20/208_SR_2019-20.pdf
https://www.pmf.irctc.co.in/cn/TermsAndConditions.html
https://www.pib.gov.in/PressReleaseIframePage.aspx?PRID=2141145®=48&lang=2
https://indianrailways.gov.in/railwayboard/uploads/directorate/eff_res/work_Study/2019-20/81_NR_2019-20.pdf
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2258800®=3&lang=1
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2154363®=48&lang=2
https://www.pib.gov.in/PressReleaseIframePage.aspx?PRID=2140614®=48&lang=2
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2285066®=48&lang=1
https://www.pib.gov.in/PressReleaseIframePage.aspx?PRID=2065879®=48&lang=2
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2135694®=48&lang=2
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=1486017®=48&lang=2
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2140614®=48&lang=2
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2287719®=48&lang=1
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=1514686®=48&lang=2
Click to see PDF
***
(Explainer ID: 159457)
आगंतुक पटल : 14
Provide suggestions / comments