• Sitemap
  • Advance Search
Economy

జాతీయ చేనేత దినోత్సవం 2026

నేత కార్మికులకు గౌరవం, సంప్రదాయాల పునరుజ్జీవం, కొత్త అవకాశాల విస్తరణ

Posted On: 06 AUG 2026 1:30PM

ఆగస్టు 7న నిర్వహించే జాతీయ చేనేత దినోత్సవం భారతదేశ నేత వారసత్వాన్ని చాటుతుంది. దేశంలోని 35.22 లక్షల మంది నేత కార్మికులు, అనుబంధ కార్మికుల సేవలను గుర్తిస్తుంది. వీరిలో 72 శాతానికి పైగా మహిళలే. ప్రాంతీయ పరిజ్ఞానంలో బలమైన మూలాలు కలిగిన రంగంగా 2026 చేనేత దినోత్సవం దీన్ని ప్రతిబింబిస్తోంది. డిజైన్‌, డిజిటల్‌ వేదికలు, ప్రపంచ మార్కెట్ల ద్వారా చేనేత కొత్త రూపు సంతరించుకుంటోంది. ప్రభుత్వ మద్దతు, పురస్కారాలు, మార్కెట్‌ సదుపాయాలు, ప్రామాణికతకు రక్షణ చర్యలు ఈ సంప్రదాయాలను గ్రామీణ సమాజాల నుంచి విస్తృత జాతీయ, అంతర్జాతీయ ప్రేక్షకులకు చేరుస్తున్నాయి.

మారుతున్న వస్త్ర రంగంలో జాతీయ చేనేత దినోత్సవం 2026
భారతదేశ చేనేత సంప్రదాయానికి లోతైన చారిత్రక మూలాలు ఉన్నాయి. దీని తొలి ఆనవాళ్లు సింధూ లోయ నాగరికత కాలం నాటివి. నూలు వడకడం, వస్త్రాలు నేయడం గురించి రుగ్వేదం, రామాయణం, మహాభారతంలో ప్రస్తావనలు ఉన్నాయి. భారతీయ పత్తి, పట్టు అత్యుత్తమ నాణ్యతకు సంబంధించిన వివరాలు ఈ గ్రంథాలతో పాటు కౌటిల్యుడి రచనల్లోనూ కనిపిస్తాయి.

శతాబ్దాలుగా నేత నైపుణ్యాలు, పద్ధతులు ఒక తరం నుంచి మరో తరానికి అందుతూ వచ్చాయి. దేశంలోని వివిధ ప్రాంతాలకు ప్రత్యేకమైన ఆచరణల ద్వారా ఈ సంప్రదాయాలు పరిణామం చెందాయి. 2015లో జాతీయ చేనేత దినోత్సవాన్ని ప్రారంభించడంతో సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న ఈ వారసత్వానికి ప్రత్యేక జాతీయ వేదిక లభించింది.

చేనేత ఇప్పటికీ చేతి నైపుణ్యం, గృహ ఆధారిత సంస్థల్లో బలమైన మూలాలు కలిగి ఉంది. చేనేత వస్త్రం గుర్తింపు నేత కార్మికుడు, ప్రాంతం, దాని తయారీలో వినియోగించే పరిజ్ఞానంతో సన్నిహితంగా ముడిపడి ఉంటుంది. ఇదే సమయంలో చేనేత రంగ పరిధి నిరంతరం మారుతోంది. ఆధునిక డిజైన్లు, డిజిటల్‌ వేదికలు, జాతీయ–అంతర్జాతీయ ప్రదర్శనలు భారతీయ వస్త్రాలను కొత్త వినియోగదారులకు చేరువ చేస్తూ వాటి ప్రాచుర్యాన్ని విస్తరిస్తున్నాయి.

జాతీయ చేనేత దినోత్సవం
ప్రతి ఏటా ఆగస్టు 7న జాతీయ చేనేత దినోత్సవాన్ని నిర్వహిస్తారు. దేశీయ ఉత్పత్తులను ప్రోత్సహించి, స్వావలంబనకు పిలుపునిచ్చిన స్వదేశీ ఉద్యమం 1905లో ఇదే రోజున ప్రారంభమైంది. ఆ ఘట్టానికి గుర్తుగా ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. భారతదేశ నేత సంప్రదాయాలను చాటడంతో పాటు చేనేత కార్మికులు అందిస్తున్న సామాజిక–ఆర్థిక, సాంస్కృతిక సేవలకు గుర్తింపు ఇస్తుంది.

ఈ ప్రయాణంలో 2026 వేడుక కీలక ఘట్టంగా నిలుస్తోంది. ఆధునిక వినియోగదారుల్లో చేనేతకు పెరుగుతున్న ప్రాధాన్యం, ప్రపంచ మార్కెట్లలో విస్తరిస్తున్న గుర్తింపును ఇది ప్రతిబింబిస్తోంది.

భారత చేనేత వెనుక నిలిచిన శ్రామికులు
ఈ రంగానికి సంబంధించి సమగ్ర అధికారిక గణన అయిన నాలుగో అఖిల భారత చేనేత జనగణన–2019-20 దేశంలో దాదాపు 31.45 లక్షల చేనేత కుటుంబాలు ఉన్నట్లు నమోదు చేసింది. దేశవ్యాప్తంగా 35.22 లక్షల మంది చేనేత కార్మికులు, అనుబంధ కార్మికులు ఉన్నట్లు కూడా లెక్కించింది. వీరిలో 8.48 లక్షల మంది నూలు చుట్టడం, పడుగు సిద్ధం చేయడం, రంగులు వేయడం, వస్త్రాలకు మెరుగులు దిద్దడం వంటి మగ్గానికి ముందు, తర్వాత చేపట్టే పనుల్లో నిమగ్నమైన అనుబంధ కార్మికులు. సామాజిక, భౌగోళిక ధోరణులు సైతం చేనేత రంగానికి గ్రామీణ జీవనోపాధితో సన్నిహిత సంబంధం ఉన్నట్లు తెలియజేస్తున్నాయి.

చేనేత జనగణన
* భారత్‌ ఇప్పటివరకు 1987-88, 1995-96, 2009-10, 2019-20లో నాలుగు చేనేత జనగణనలు నిర్వహించింది.
* సగటున 8 నుంచి 12 ఏళ్ల వ్యవధిలో వీటిని నిర్వహిస్తారు.

చేనేత కార్మికుల గుర్తింపు, నమోదు
జనగణనలో నమోదైన కార్మికులకు పహచాన్‌/ఈ–పహచాన్‌ కార్డులు అందించారు. ఈ సదుపాయాన్ని మరింత విస్తరించేందుకు 2025 జనవరిలో ఈ–పహచాన్‌ పోర్టల్‌ను ప్రారంభించారు. కొత్త కార్మికులు, గతంలో నమోదు కానివారు ఇందులో పేర్లు నమోదు చేసుకోవచ్చు. ఇప్పటికే నమోదైన కార్మికులు తమ వివరాలను నవీకరించుకోవడంతో పాటు కార్డులను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

2026 జులై నాటికి అదనంగా దాదాపు 84 వేల మంది కార్మికులకు ఈ–పహచాన్‌ కార్డుల కోసం ఆమోదం లభించింది.

మహిళలే చోదకశక్తిగా ఉన్న రంగం
భారత చేనేత శ్రామికశక్తిలో మహిళలే అధిక సంఖ్యలో ఉన్నారు. నేత, అనుబంధ కార్యకలాపాల్లో నిమగ్నమైన మొత్తం కార్మికుల్లో 25.46 లక్షల మంది, అంటే 72 శాతానికి పైగా మహిళలే.

విభిన్న వర్గాలకు జీవనాధారం
చేనేత శ్రామికుల్లో 4.84 లక్షల మంది షెడ్యూల్డ్‌ కులాలు, 6.28 లక్షల మంది షెడ్యూల్డ్‌ తెగలు, 12.67 లక్షల మంది ఇతర వెనుకబడిన తరగతులకు చెందినవారు ఉన్నారు.

దీనికి తోడు దేశవ్యాప్తంగా 28.20 లక్షల మగ్గాలు ఉన్నట్లు లెక్క‌లు చెప్తున్నాయి. వీటిలో 25.30 లక్షల మగ్గాలు గ్రామీణ ప్రాంతాల్లో, 2.90 లక్షల మగ్గాలు పట్టణ ప్రాంతాల్లో ఉన్నాయి. అంటే ప్రతి పది చేనేత మగ్గాల్లో దాదాపు తొమ్మిది గ్రామీణ భారతంలోనే ఉన్నాయి.

చేనేత కార్మికులకు సమగ్ర సహాయక వ్యవస్థ
జాతీయ చేనేత అభివృద్ధి కార్యక్రమం, ముడిసరకుల సరఫరా పథకం ఈ రంగానికి ప్రధాన కార్యాచరణ సహాయక వ్యవస్థగా నిలుస్తున్నాయి.

1) జాతీయ చేనేత అభివృద్ధి కార్యక్రమం (ఎన్‌హెచ్‌డీపీ)
2021-22 నుంచి 2025-26 వరకు అమలు చేసేందుకు ఎన్‌హెచ్‌డీపీని రూపొందించారు. చేనేత కార్మికుల సంక్షేమంపై దృష్టి సారిస్తూ, అవసరాల ఆధారంగా చేనేత రంగ సమగ్ర అభివృద్ధికి ఈ కార్యక్రమం తోడ్పడుతుంది.

 



ప్రభుత్వ చేనేత సంస్థలు, జాతీయ–రాష్ట్ర స్థాయి చేనేత సంస్థల ద్వారా ఎన్‌హెచ్‌డీపీ అంశాలను అమలు చేస్తారు. నేత కార్మికుల సహకార సంఘాలు, సమాఖ్యలు, చేనేత ఉత్పత్తిదారుల కంపెనీలు, భాగస్వామ్య బ్యాంకులు కూడా అమలు సంస్థలుగా వ్యవహరిస్తాయి.

వృత్తిపరమైన నిర్వహణతో సభ్యుల యాజమాన్యంలో నడిచే సంస్థలుగా నేత కార్మికులను చేనేత ఉత్పత్తిదారుల కంపెనీలు సంఘటితం చేస్తాయి. ఎన్‌హెచ్‌డీపీ కింద 2020-21 నుంచి 2026-27 మధ్య 200 చేనేత ఉత్పత్తిదారుల కంపెనీలను ఏర్పాటు చేశారు.

కింది కీలక అంశాల ద్వారా ఈ కార్యక్రమం విస్తృత సహాయాన్ని అందిస్తుంది:
ఏ) చిన్న క్లస్టర్ల అభివృద్ధి కార్యక్రమం (ఎస్‌సీడీపీ)

చిన్న చేనేత క్లస్టర్ల ప్రత్యేక అభివృద్ధి అవసరాలను తీర్చేందుకు ఎస్‌సీడీపీ కింద ₹2 కోట్ల వరకు ఆర్థిక సహాయం అందిస్తారు. మెరుగైన మగ్గాలు, వెలుతురు సదుపాయాలు, పని షెడ్లు, డిజైన్‌, ఉత్పత్తుల అభివృద్ధి, మార్కెటింగ్‌కు ఈ సహాయం వర్తిస్తుంది.
* 2021-22 నుంచి 2026-27 జూన్‌ వరకు ఈ కార్యక్రమం కింద 357 క్లస్టర్లకు ఆమోదం తెలిపారు.
* దీనికి తోడు 2025-26లో పని షెడ్లు, మగ్గాలు, అనుబంధ పరికరాలు, ఎలక్ట్రానిక్‌ జకార్డ్‌ల వంటి కీలక సదుపాయాల కోసం ₹94 కోట్లు విడుదల చేశారు.

ఎస్‌సీడీపీ ప్రభావం
పని షెడ్ల నిర్మాణం:
 ఈ కార్యక్రమం కింద పని షెడ్ల నిర్మాణం ద్వారా చేనేత లబ్ధిదారులకు మెరుగైన పని ప్రదేశాలు అందుతున్నాయి. ఈ షెడ్ల నిర్మాణానికి నేత కార్మికులు 100 శాతం వరకు రాయితీ పొందుతున్నారు. ఈ జోక్యంతో కింది ఫలితాలు నమోదయ్యాయి:
* సగటు రోజువారీ ఉత్పత్తి 53 శాతం పెరిగింది.
* సగటు పని గంటలు 60 శాతం పెరగగా, నెలవారీ పని దినాలు 28 శాతం పెరిగాయి.
* సగటు రోజువారీ ఆదాయం 42 శాతం పెరిగి ₹328 నుంచి ₹465కు చేరింది.

 


ఎలక్ట్రానిక్‌ జకార్డ్‌: ఒక్కో పడుగు దారాన్ని నియంత్రించేందుకు ఎలక్ట్రానిక్‌ జకార్డ్‌లు డిజిటల్‌ నియంత్రణలను వినియోగిస్తాయి. దీంతో వేగంగా, మరింత సౌలభ్యంగా, క్లిష్టమైన నమూనాలతో వస్త్రాలను నేయవచ్చు. వీటి వినియోగంతో చేనేత కార్మికుల ఉత్పాదకత, ఆదాయం మెరుగుపడ్డాయి.
* సగటు రోజువారీ ఉత్పత్తి 55 శాతం పెరిగింది.
* 96 శాతం మంది లబ్ధిదారులు ఉత్పాదకత పెరిగినట్లు తెలిపారు.
* సగటు రోజువారీ వేతనం 56 శాతం పెరిగి ₹360 నుంచి ₹560కు చేరింది.
* సగటు నెలవారీ ఆదాయం ₹9,600 నుంచి ₹15 వేలకు పెరిగింది.

బీ) చేనేత మార్కెటింగ్‌ సహాయం (హెచ్‌ఎంఏ)
చేనేత మార్కెటింగ్‌ సహాయం కింద నేత కార్మికులు, చేనేత సంస్థలు తమ ఉత్పత్తులను నేరుగా విక్రయించేందుకు వేదికలు కల్పిస్తారు. దేశీయ, ఎగుమతి మార్కెట్ల ప్రోత్సాహం, పట్టణ హాట్‌ల ఏర్పాటు, మార్కెటింగ్‌ ప్రోత్సాహకాలకు ఇది మద్దతు ఇస్తుంది. వివిధ అంశాల కింద సాధించిన కీలక విజయాలు ఇవి:

* 2021-22 నుంచి 2026-27 జూన్‌ వరకు జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయుల్లో చేనేత ఉత్పత్తుల విక్రయాలను సులభతరం చేసేందుకు 960కి పైగా కార్యక్రమాలు నిర్వహించారు. వీటిలో జాతీయ, రాష్ట్ర, జిల్లా చేనేత ప్రదర్శనలు, హస్తకళా మేళాలు, ఇతర మార్కెటింగ్‌ కార్యక్రమాలు ఉన్నాయి.

* చేనేత రంగానికి విశిష్ట సేవలు అందించిన వారిని హెచ్‌ఎంఏ కింద రెండు జాతీయ స్థాయి పురస్కారాలైన సంత్‌ కబీర్‌ చేనేత పురస్కారం, జాతీయ చేనేత పురస్కారంతో సత్కరిస్తారు. తాజాగా పూర్తయిన పురస్కారాల ప్రక్రియలో 2024 పురస్కారాలను జాతీయ చేనేత దినోత్సవం–2025 సందర్భంగా అందజేశారు. ఐదుగురు సంత్‌ కబీర్‌ పురస్కార గ్రహీతలు, 19 మంది జాతీయ చేనేత పురస్కార గ్రహీతలతో కలిపి మొత్తం 24 మందిని సత్కరించారు. పురస్కార గ్రహీతల్లో ఆరుగురు మహిళలు, ఒక దివ్యాంగ నేత కార్మికుడు ఉన్నారు.

అసాధారణ నైపుణ్యం, నేత సంప్రదాయాలు, సామాజిక సంక్షేమం, రంగ అభివృద్ధికి విశిష్ట సేవలు అందించిన నేత కార్మికులకు సంత్‌ కబీర్‌ చేనేత పురస్కారం అందిస్తారు. ఈ పురస్కారం కింద ₹3.5 లక్షలు, ప్రత్యేకంగా అమర్చిన బంగారు నాణెం, తామ్రపత్రం, శాలువా, ధ్రువపత్రం అందిస్తారు.

నైపుణ్యం, అంకితభావం, ఆవిష్కరణలకు గుర్తింపుగా జాతీయ చేనేత పురస్కారం అందిస్తారు. దీని కింద ₹2 లక్షలు, తామ్రపత్రం, శాలువా, ధ్రువపత్రం అందజేస్తారు.

సీ) రాయితీ రుణాలు/నేత ముద్ర పథకం
ఈ పథకం కింద చేనేత రంగానికి మూడేళ్లపాటు 6 శాతం రాయితీ వడ్డీ రేటుతో రుణాలు అందిస్తారు. దీనికి తోడు ప్రభుత్వం 7 శాతం వరకు వడ్డీ రాయితీ కల్పిస్తుంది. మార్జిన్‌ మనీ సహాయం అందించడంతో పాటు రుణ హామీ రుసుములను కూడా భరిస్తుంది. ఆర్థిక సహాయాన్ని సకాలంలో బదిలీ చేసేందుకు చేనేత కార్మికుల ముద్ర పోర్టల్‌ తోడ్పడుతుంది.
* 2021-22 నుంచి 2026-27 జూన్‌ వరకు దాదాపు ₹280 కోట్లకు పైగా విలువైన 40 వేలకు పైగా రుణాలకు ఆమోదం తెలిపారు.
* 2026-27లో ఇప్పటివరకు ₹7.45 కోట్ల విలువైన 967 రుణాలకు ఆమోదం లభించింది.

డీ) చేనేత కార్మికుల సంక్షేమం (సామాజిక భద్రతా చర్యలు)
చేనేత కార్మికులు, అనుబంధ శ్రామికులకు సంక్షేమ చర్యల ద్వారా సామాజిక భద్రత కల్పించడంతో పాటు వారి పిల్లలకు ఉపకార వేతనాలు అందిస్తారు. వీటిలో కింది పథకాలు ఉన్నాయి:
* ప్రధానమంత్రి జీవన్‌ జ్యోతి బీమా యోజన (పీఎంజేజేబీవై): 18 నుంచి 50 ఏళ్ల వయసున్న చేనేత కార్మికులు, అనుబంధ శ్రామికులకు ఏటా పునరుద్ధరించుకునే జీవిత బీమాను ఈ పథకం అందిస్తుంది. ఏ కారణంతోనైనా మరణిస్తే ₹2 లక్షల బీమా ప్రయోజనం లభిస్తుంది.
* ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన (పీఎంఎస్‌బీవై): 18 నుంచి 70 ఏళ్ల వయసున్న చేనేత కార్మికులు, అనుబంధ శ్రామికులకు ఏటా పునరుద్ధరించుకునే ప్రమాద బీమాను ఈ పథకం అందిస్తుంది. ప్రమాద మరణం లేదా శాశ్వత సంపూర్ణ వైకల్యానికి ₹2 లక్షలు, శాశ్వత పాక్షిక వైకల్యానికి ₹1 లక్ష అందిస్తుంది.
* ఉపకార వేతనం: గుర్తింపు పొందిన వస్త్ర సాంకేతిక డిప్లొమా, అండర్‌ గ్రాడ్యుయేట్‌, పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సులు చదువుతున్న ఒక్కో చేనేత కార్మికుడి ఇద్దరు పిల్లలకు ఏటా ₹2 లక్షల వరకు ఉపకార వేతనం అందిస్తారు. పథకం ప్రారంభమైనప్పటి నుంచి 2026 జూన్‌ నాటికి 531 దరఖాస్తులకు ఆమోదం తెలిపారు.

పీఎంజేజేబీవై, పీఎంఎస్‌బీవై పనితీరు
* ఈ పథకాల్లో చేరిన చేనేత కార్మికులు, అనుబంధ శ్రామికుల సంఖ్య 2021-22లో 1,11,957 నుంచి 2026-27 మే నాటికి 2,02,393కు పెరిగింది. ఇది 80.8 శాతం వృద్ధి.
* ఈ కాలంలో విడుదల చేసిన నిధులు ₹204.83 లక్షల నుంచి ₹335 లక్షలకు పెరిగాయి. ఇది 63.6 శాతం వృద్ధి.

ఈ) మెగా క్లస్టర్ల అభివృద్ధి కార్యక్రమం
భారీ క్లస్టర్ల అభివృద్ధి కార్యక్రమం కింద ఒక్కో భారీ చేనేత క్లస్టర్‌లో కనీసం 10 వేల మగ్గాలు/క్లస్టర్లు ఉంటాయి. ఐదేళ్లలో ఒక్కో క్లస్టర్‌కు ₹30 కోట్ల వరకు కేంద్ర సహాయం అందుతుంది.
* ఎనిమిది మెగా క్లస్టర్ల పనులు పూర్తై కార్యకలాపాలు కొనసాగుతుండగా, మరో నాలుగు క్లస్టర్లు అమలు దశలో ఉన్నాయి.
* ఈ కార్యక్రమం కింద ₹370.72 కోట్ల ఆర్థిక సహాయం విడుదల చేయగా, మొత్తం 1,62,682 మంది చేనేత కార్మికులు ప్రయోజనం పొందారు.

ఎఫ్‌) అవసరాల ఆధారిత ప్రత్యేక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు
ఈ కార్యక్రమం కింద ఉత్పత్తుల అభివృద్ధి, ఉత్పాదకత, నాణ్యత మెరుగుదల, విలువ జోడింపు, మార్కెటింగ్‌కు ₹12 కోట్ల వరకు సహాయం అందిస్తారు.
* ఆరు హస్తకళా–చేనేత గ్రామాలు కార్యకలాపాలు నిర్వహిస్తుండగా, మరో మూడు అమలు దశలో ఉన్నాయి.

2) ముడిసరకుల సరఫరా పథకం (ఆర్‌ఎంఎస్‌ఎస్‌)
అన్ని రకాల నూలు రవాణా వ్యయాన్ని తిరిగి చెల్లించడం ద్వారా నూలు లభ్యతకు ఈ పథకం మద్దతు ఇస్తుంది. నిర్దేశిత పరిమాణ నిబంధనలకు లోబడి ఎంపిక చేసిన నూలు రకాలపై 15 శాతం ధర రాయితీని కూడా అందిస్తుంది.

 



2026-27లో ఎన్‌హెచ్‌డీపీ, ఆర్‌ఎంఎస్‌ఎస్‌ అమలు కొనసాగుతోంది. వీటికి వరుసగా ₹205 కోట్లు, ₹200 కోట్ల బడ్జెట్‌ కేటాయింపులు చేశారు.

3) చేనేత–సంప్రదాయ హస్తకళలకు జీఎస్టీ ఊరట
2025 సెప్టెంబరులో జరిగిన 56వ జీఎస్టీ మండలి సమావేశంలో సిఫార్సు చేసిన తదుపరి తరం జీఎస్టీ సంస్కరణల్లో చేనేత రంగానికి మద్దతు ఇచ్చే చర్యలు ఉన్నాయి.
* జీఎస్టీ హేతుబద్ధీకరణలో భాగంగా 36 హస్తకళా ఉత్పత్తులపై పన్ను రేటును 12 శాతం నుంచి 5 శాతానికి తగ్గించారు.
* పత్తి చేనేత రగ్గులు, చేతితో నేసిన తివాచీలను కూడా 5 శాతం జీఎస్టీ పరిధిలోకి తీసుకొచ్చారు.
* గృహ, పారిశ్రామిక కుట్టు యంత్రాలపై పన్ను రేటును కూడా 12 శాతం నుంచి 5 శాతానికి తగ్గించారు. దీంతో టైలరింగ్‌ యూనిట్ల వ్యయం తగ్గడంతో పాటు దేశీయ తయారీకి ప్రోత్సాహం లభిస్తోంది.

4) కేంద్ర బడ్జెట్‌ 2026-27: భారత చేనేతకు కొత్త విధాన ప్రోత్సాహం
కేంద్ర బడ్జెట్‌ 2026-27లో పలు కొత్త చర్యల ద్వారా వస్త్ర రంగానికి ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చారు:
* వస్త్ర రంగ ముడిసరకుల పునాదిని బలోపేతం చేసేందుకు జాతీయ ఫైబర్‌ పథకాన్ని రూపొందించారు. సహజ, మానవ నిర్మిత, నవతరం ఫైబర్లలో స్వావలంబనను ఇది ప్రోత్సహిస్తుంది.
* వస్త్ర రంగ విస్తరణ–ఉపాధి పథకం కింద సంప్రదాయ క్లస్టర్లను ఆధునికీకరిస్తారు. యంత్రాలు, సాంకేతిక నవీకరణలు, ఉమ్మడి పరీక్ష–ధ్రువీకరణ కేంద్రాలకు ఈ పథకం మూలధన సహాయం అందిస్తుంది.
* ఇప్పటికే అమల్లో ఉన్న పథకాలను జాతీయ చేనేత–హస్తకళల కార్యక్రమం అనుసంధానించి బలోపేతం చేస్తుంది. రెండు రంగాలకు లక్షిత సహాయం అందేలా చూస్తుంది.
* మహాత్మా గాంధీ గ్రామ స్వరాజ్‌ కార్యక్రమం ఖాదీ, చేనేత, హస్తకళలను బలోపేతం చేస్తూ నేత కార్మికులు, గ్రామీణ పరిశ్రమలు, గ్రామీణ యువత, ఒక జిల్లా–ఒక ఉత్పత్తి కార్యక్రమానికి ప్రయోజనం చేకూరుస్తుంది. ప్రపంచ మార్కెట్‌ అనుసంధానాలు, బ్రాండింగ్‌, శిక్షణ, నైపుణ్యాభివృద్ధి, ఉత్పత్తి ప్రక్రియలు, నాణ్యత మెరుగుదలపై ఇది దృష్టి సారిస్తుంది.

ఒక జిల్లా–ఒక ఉత్పత్తి కార్యక్రమం జిల్లాల ప్రత్యేక ఉత్పత్తులు, సమతుల ప్రాంతీయ అభివృద్ధి, స్థానిక కళాకారులు–పారిశ్రామికవేత్తలకు విస్తృత మార్కెట్‌ అవకాశాలను ప్రోత్సహిస్తుంది.

డిజైన్‌, ఆవిష్కరణలతో చేనేతకు కొత్త రూపు
భారత చేనేత సంప్రదాయాలు ప్రాంతీయ ఫైబర్లు, పద్ధతులు, ఆకృతులు, తరతరాల నేత పరిజ్ఞానంలో బలమైన మూలాలు కలిగి ఉన్నాయి. ఇదే సమయంలో ఈ వస్త్రాలను ప్రదర్శించే వేదికలు విస్తరిస్తున్నాయి. ప్రభుత్వ సంస్థలు, కార్యక్రమాల మద్దతుతో ప్రాంతీయ నేత సంప్రదాయాలు కొత్త వేదికలకు చేరుతున్నాయి.

సంప్రదాయ వస్త్రాలను ఆధునిక డిజైన్‌, విస్తృత సాంస్కృతిక వేదికల ద్వారా ఎలా ప్రదర్శిస్తున్నారో ఇటీవలి పలు ప్రదర్శనలు తెలియజేస్తున్నాయి.

ఈ ప్రదర్శనలకు తోడు సహకార వేదికలు చేనేత రంగంలో ప్రయోగాలకు కొత్త అవకాశాలను కల్పిస్తున్నాయి.

చేనేత అభివృద్ధి కమిషనర్‌ కార్యాలయం, జాతీయ ఫ్యాషన్‌ సాంకేతిక సంస్థ 2026 ఏప్రిల్‌లో జరిగిన 61వ ఫెమినా మిస్‌ ఇండియా పోటీల్లో ‘విశ్వ సూత్ర’ను ఆవిష్కరించాయి. భువనేశ్వర్‌లో ప్రదర్శించిన ఈ సేకరణ దేశంలోని 30 చేనేత రకాలను ఒకే వేదికపైకి తీసుకొచ్చింది. 30 దేశాల స్ఫూర్తితో ఒక్కో చేనేత రకానికి కొత్త రూపం ఇచ్చి, భారత వస్త్రాలను అంతర్జాతీయ దుస్తుల ఆకృతులు, ప్రభావాలతో మేళవించారు. ప్రామాణికత, ప్రాంతీయ గుర్తింపులను కాపాడుతూనే భారత చేనేతను ప్రపంచ డిజైన్‌ కథనంలో భాగంగా ఈ సమ్మేళనాలు నిలిపాయి.



బ్రీతింగ్‌ థ్రెడ్స్‌’ భారత్‌ టెక్స్‌–2025లో చేనేతను ఆధునిక ఫ్యాషన్‌లోకి తీసుకొచ్చింది. ఐదు రాష్ట్రాల్లో నేసిన వస్త్రాలతో 30 దుస్తుల రూపాలను ప్రదర్శించింది. ఈ వస్త్రాలు పశ్చిమ బెంగాల్‌, మధ్యప్రదేశ్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, కర్ణాటక, రాజస్థాన్‌ నుంచి వచ్చాయి. చందేరీ, మహేశ్వరి, జమ్దానీ, ఖున్‌, బనారసీ, కోటా డోరియా, ముర్షిదాబాద్‌ నేత రకాలకు వస్త్ర ఉపరితల అల్లికలు, తాడు అలంకరణల ద్వారా ఆధునిక రూపం కల్పించారు.

 



గోవాలో జరిగిన భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవం–2025లో చేనేత అభివృద్ధి కమిషనర్‌ కార్యాలయం ‘హ్యాండ్లూమ్‌ శారీస్‌ ఇన్‌ మోషన్‌: 70 ఎంఎం ఆన్‌ రన్‌వే’ ప్రదర్శన ద్వారా అత్యున్నత ఫ్యాషన్‌, సంస్కృతి, సినిమాను ఒకే వేదికపైకి తీసుకొచ్చింది. 1940ల నాటి హుందాతనంతో కూడిన చీరకట్టు నుంచి 2020ల ప్రయోగాత్మక ఆకృతుల వరకు భారతీయ సినిమా శైలుల్లో వచ్చిన మార్పులను ఈ ప్రదర్శన ఆవిష్కరించింది. టస్సర్‌, ఇకత్‌ పష్మీనా, బనారసీ, చందేరీ, వెంకటగిరి, కుత్తంపల్లి సహా ప్రాంతీయ నేత సంప్రదాయాలకు ప్రాతినిధ్యం వహించే 40కి పైగా చీరలను ప్రదర్శించారు. పిచ్వాయ్‌, పట్టచిత్ర, వార్లీ, కలంకారీ, మధుబని, గోండ్‌, భిల్‌ కళా పద్ధతులతో పురస్కార గ్రహీతలైన కళాకారులు పలు చీరలపై చేతితో చిత్రాలు వేశారు.
 


డిజైన్‌ పరిధి విస్తరణ
* వీవ్‌ ది ఫ్యూచర్‌ 4.0–అప్‌సైక్లింగ్‌ ఎడిషన్‌: 
ఈ కార్యక్రమం 2026 జులై 12 నుంచి 17 వరకు న్యూఢిల్లీలోని దిల్లీ హాట్‌లో జరిగింది. పునర్వినియోగ ఆధారిత డిజైన్‌లో పనిచేస్తున్న 100కు పైగా బ్రాండ్లు, కళాకారులు, పునఃశుద్ధి సంస్థలు, ఆవిష్కర్తలను ప్రదర్శన ఒకే వేదికపైకి తీసుకొచ్చింది. మెరుగైన రూపంలో పునర్వినియోగం, మరమ్మతు, సుస్థిర ఉత్పత్తి, బాధ్యతాయుత వినియోగాన్ని ప్రోత్సహించింది.
* చేనేత హ్యాకథాన్‌ 2026: జాతీయ చేనేత దినోత్సవం–2026 సందర్భంగా కేంద్ర వస్త్ర మంత్రిత్వ శాఖ ‘వీవింగ్‌ ఇన్నోవేషన్‌’ పేరుతో చేనేత హ్యాకథాన్‌–2026ను ప్రారంభించింది. చేనేత రంగానికి ఆచరణాత్మక పరిష్కారాలను రూపొందించాల్సిందిగా విద్యార్థులు, నేత కార్మికులు, కళాకారులు, పరిశోధకులు, అంకుర సంస్థలు, నిపుణులను ఈ పోటీ ఆహ్వానిస్తోంది. డిజైన్‌, సుస్థిరత, డిజిటల్‌ సాంకేతికత, మార్కెట్‌ అవకాశాలు, బ్రాండింగ్‌, ఉత్పాదకత, పారిశ్రామిక వ్యవస్థ దీని ప్రధాన ఇతివృత్తాలు.

ఈ ప్రదర్శనలు భారత చేనేతకు విస్తరిస్తున్న గుర్తింపును చాటుతున్నాయి. ఫ్యాషన్‌ ప్రదర్శనలు, అందాల పోటీలు, సినిమా, వస్త్ర ప్రదర్శనలు, సహకార డిజైన్‌ వేదికల ద్వారా ప్రాంతీయ నేత రకాలు విస్తృత సాంస్కృతిక, సృజనాత్మక రంగాల్లోకి ప్రవేశిస్తున్నాయి. మార్కెట్‌ అవకాశాలు, భారత చేనేత ఎగుమతుల ఉనికిని కూడా కలిగి ఉన్న విస్తృత విజయగాథలో ఈ పెరుగుతున్న ప్రాచుర్యం భాగంగా నిలుస్తోంది.

మార్కెట్‌ అవకాశాలు, కొనుగోలుదారుల విశ్వాసానికి బలం
ప్రత్యేక డిజైన్లు, పరిమిత పరిమాణాల్లో ఉత్పత్తి, పర్యావరణహిత ప్రక్రియల కారణంగా దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లలో చేనేత ఉత్పత్తులకు బలమైన డిమాండ్‌ ఏర్పడింది.

భారత చేనేత ఎగుమతులు 2025-26లో దాదాపు ₹1,330.96 కోట్లుగా నమోదయ్యాయి. ఈ కాలంలో యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌, అమెరికా, ఫ్రాన్స్‌, బ్రిటన్‌, స్పెయిన్‌ ప్రధాన ఎగుమతి గమ్యస్థానాలుగా నిలిచాయి.

చేనేత ఉత్పత్తులు విస్తృతమైన, విభిన్న మార్కెట్లకు చేరుతున్న కొద్దీ వాటి ప్రామాణికత, నాణ్యత, మూలాన్ని నిర్ధారించడం మరింత కీలకంగా మారుతోంది. ప్రభుత్వ మద్దతుతో కూడిన గుర్తులు, బ్రాండింగ్‌ వ్యవస్థలు, భౌగోళిక గుర్తింపు నమోదు, చట్టపరమైన రక్షణలు అసలైన చేనేత ఉత్పత్తులను గుర్తించడంతో పాటు ప్రఖ్యాత నేత సంప్రదాయాలను పరిరక్షించడంలో సహాయపడుతున్నాయి. డిజిటల్‌ వేదికలు కూడా మార్కెట్‌ అవకాశాలను విస్తరిస్తున్నాయి.

* ప్రభుత్వ కొనుగోలుదారులకు ఉత్పత్తులను సరఫరా చేసేందుకు దాదాపు 1.50 లక్షల మంది నేత కార్మికులు, చేనేత సంస్థలు ప్రభుత్వ ఈ–మార్కెట్‌ వేదికలో చేరాయి.

ధ్రువీకరించిన నేత కార్మికులు, ఉత్పత్తిదారుల బృందాలు భౌగోళిక గుర్తింపు పొందిన వస్తువులతో సహా అసలైన ఉత్పత్తులను నేరుగా వినియోగదారులకు విక్రయించేందుకు ‘ఇండియా హ్యాండ్‌మేడ్‌’ వేదిక వీలు కల్పిస్తుంది. 2023-24 నుంచి 2026 జూన్‌ మధ్య 4,186 మంది నేత కార్మికులు, కళాకారులు ఈ వేదికలో చేరారు.



చేనేత గుర్తు: ఉత్పత్తిని చేతితో నేసినట్లు నిర్ధారణ
2006లో ప్రారంభించిన చేనేత గుర్తు పథకం చేనేత ఉత్పత్తులకు సమష్టి, ప్రత్యేక గుర్తింపును అందిస్తుంది. చేతితో నేసిన వస్తువులను ప్రోత్సహిస్తూ, తాము కొనుగోలు చేస్తున్న ఉత్పత్తి నిజంగా చేతితో నేసినదేనని కొనుగోలుదారులకు భరోసా ఇస్తుంది. ఉత్పత్తి లేదా దాని తయారీదారును సులభంగా గుర్తించడంలోనూ సహాయపడుతుంది.
* 2026 జూన్‌ 30 నాటికి 29,402 చేనేత గుర్తు నమోదులు జారీ చేశారు;
* మొత్తం 815 చిల్లర విక్రయ కేంద్రాలు ఈ గుర్తు కలిగిన ఉత్పత్తులను విక్రయిస్తున్నాయి.

ఇండియా హ్యాండ్‌లూమ్‌ బ్రాండ్‌: నాణ్యతకు భరోసా
2015 ఆగస్టు 7న నిర్వహించిన తొలి జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఇండియా హ్యాండ్‌లూమ్‌ బ్రాండ్‌ను ప్రారంభించారు. అత్యున్నత నాణ్యత, ప్రామాణిక సంప్రదాయ డిజైన్లు, లోపరహిత తయారీ, పర్యావరణంపై ఎలాంటి ప్రతికూల ప్రభావం లేని ప్రత్యేక చేనేత ఉత్పత్తులను ఇది ప్రోత్సహిస్తుంది. రంగు వెలిసిపోని సహజ ఫైబర్‌ ఉత్పత్తులు, చర్మానికి హాని కలిగించని రంగులు, సామాజిక ప్రమాణాల అనుసరణకు ఈ ధ్రువీకరణ భరోసా ఇస్తుంది.
* 2026 జూన్‌ నాటికి 184 విభాగాల్లో 2,305 నమోదులు జారీ చేశారు.

జీఐ గుర్తింపులు: ప్రాంతీయ నేత రకాల గుర్తింపునకు రక్షణ
భౌగోళిక గుర్తింపుల చట్టం–1999 నమోదిత భౌగోళిక గుర్తింపులను అనధికార వినియోగం నుంచి రక్షిస్తుంది. చట్టవిరుద్ధ తయారీ లేదా మార్కెటింగ్‌పై నమోదిత వినియోగదారులు పోలీసు అధికారులను ఆశ్రయించవచ్చు. రక్షణ చర్యలను బలోపేతం చేయాలని రాష్ట్రాల చేనేత, వస్త్ర శాఖలకు సూచించారు.
* 2026 ఆగస్టులో వెల్లడించిన వివరాల ప్రకారం 106 చేనేత ఉత్పత్తులు, ఆరు ఉత్పత్తుల చిహ్నాలు, 227 హస్తకళా ఉత్పత్తులు జీఐ నమోదు పొందాయి.

నిర్దిష్ట ప్రాంతంలో తయారయ్యే వస్తువుల నాణ్యత, ఖ్యాతి లేదా ప్రత్యేక లక్షణాలకు ఆ భౌగోళిక ప్రాంతంతో సంబంధం ఉన్నట్లు జీఐ గుర్తు తెలియజేస్తుంది.

ప్రత్యేకంగా చేనేతకు కేటాయించిన ఉత్పత్తులకు చట్టపరమైన రక్షణ
చేనేత చట్టం–1985 పవర్‌లూమ్‌లు, మిల్లుల చొరబాటు నుంచి నేత కార్మికులతో పాటు భారత సాంస్కృతిక వారసత్వాన్ని రక్షిస్తుంది. నిర్దేశిత 11 వస్త్ర ఉత్పత్తులను ప్రత్యేకంగా చేనేత తయారీకి కేటాయిస్తుంది.

చేనేతకు మాత్రమే కేటాయించిన వస్తువులను పవర్‌లూమ్‌లపై ఉత్పత్తి చేయకుండా నిరోధించేందుకు ప్రభుత్వ సంస్థలు పవర్‌లూమ్‌ యూనిట్లను తనిఖీ చేస్తాయి.

చేనేతదే భవిష్యత్తు
జాతీయ చేనేత దినోత్సవం–2026 ఒక సంప్రదాయం మనుగడను మాత్రమే కాకుండా రాబోయే అవకాశాలను పరిశీలించే సందర్భాన్ని అందిస్తోంది.

భారత చేనేతలో ప్రాంతం, సమాజం, నైపుణ్యానికి సంబంధించిన జ్ఞాపకాలు నిక్షిప్తమై ఉన్నాయి. అయినప్పటికీ ప్రతి తరంతో దీని కథ కొత్త రూపంలో ఆవిష్కృతమవుతోంది. ఆధునిక జీవనంలో చేనేతకు పెరుగుతున్న ప్రాధాన్యం, తన ప్రత్యేకతను కోల్పోకుండానే వారసత్వం సమకాలీనంగా కొనసాగగలదని చాటుతోంది.

భారత నేత వస్త్రాల ద్వారా ప్రపంచం దేశ విశిష్టతను మరింతగా తెలుసుకుంటున్న వేళ చేనేత వారసత్వ పరిజ్ఞానాన్ని కొత్త ఆకాంక్షలతో అనుసంధానిస్తోంది. నేత కార్మికుల చేతుల నుంచి ప్రాంతీయ గుర్తింపులను విశాల ప్రపంచానికి చేరవేస్తోంది.

References:

Ministry of Textiles:

https://handlooms.nic.in/assets/img/Statistics/3736.pdf

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2153746&reg=48&lang=2

https://sansad.in/getFile/annex/265/AS135_suGmAI.pdf?source=pqars

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2148300&reg=48&lang=2

https://sansad.in/getFile/loksabhaquestions/annex/185/AU4300_zg5b8v.pdf?source=pqals

https://handlooms.nic.in/assets/img/Statistics/Background_note_on_handloom_sector.pdf

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2146379&lang=2&reg=48

https://www.texmin.gov.in/static/uploads/2026/05/5c48e80d2180ca3194b9e9b01340696d.pdf

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2290320&reg=48&lang=1

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2286966&lang=1&reg=1

https://sansad.in/getFile/loksabhaquestions/annex/187/AU5220_ml9Xxl.pdf?source=pqals

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2253525&reg=48&lang=2

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2103763&reg=48&lang=2

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2194154&reg=48&lang=2

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2283412&reg=48&lang=2

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2152924&reg=48&lang=2

https://sansad.in/getFile/annex/270/AU2558_zikFcF.pdf?source=pqars

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2152551&lang=2&reg=48

https://handlooms.nic.in/assets/img/Final%20Revised%20%20Guidelines%20NHDP%2012.04.2023.pdf

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2163905&reg=48&lang=2

https://www.pib.gov.in/PressReleaseIframePage.aspx?PRID=1812498&reg=48&lang=2

Ministry of Finance:

https://www.indiabudget.gov.in/doc/eb/sbe98.pdf

Ministry of Commerce & Industry:

https://ipindia.gov.in/gi-introduction

Ministry of MSME:

https://www.coek.in/events

Office of the Principal Scientific Adviser to the Government of India:

https://www.psa.gov.in/livelihood/10117

Handloom Export Promotion Council (HEPC):

https://www.hepcindia.com/img/HS%20Code%20Wise%20Handloom%20Data%20from%202009-10%20to%202025-26.pdf

https://www.hepcindia.com/top_20_countries

PIB Archives:

https://www.pib.gov.in/PressNoteDetails.aspx?ModuleId=3&NoteId=154978&reg=48&lang=2

Others:

https://www.esquireindia.co.in/style/just-landed/fdci-khadi-samant-chauhan-shows-at-moscow-fashion-week

 

Click to see pdf

 

 

***

(Explainer ID: 159455) आगंतुक पटल : 23
Provide suggestions / comments
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , हिन्दी , Bengali , Kannada