Social Welfare
క్రీడా దేశ నిర్మాణం
ఖేలో ఇండియా నుంచి అంతర్జాతీయ ప్రతిభ దిశగా ప్రయాణం
Posted On:
03 AUG 2026 5:10PM
పునరుద్ధరించిన ఖేలో ఇండియా పథకానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలపడం భారత క్రీడా ప్రయాణంలో కీలక ముందడుగు. జాతీయ క్రీడా సమాఖ్యలకు మెరుగైన సహాయంతో కూడిన ఈ పథకానికి 2026–27 నుంచి 2030–31 వరకు మొత్తం ₹36,441 కోట్ల వ్యయాన్ని నిర్దేశించారు. ప్రతిభను మరింత సమర్థంగా గుర్తించడం, విస్తృత అవకాశాలు కల్పించడం, క్రీడాకారులకు నిరంతర సహాయం అందించడం ద్వారా క్షేత్రస్థాయి భాగస్వామ్యం నుంచి అంతర్జాతీయ పతక వేదికల వరకు స్పష్టమైన ప్రగతి మార్గాన్ని రూపొందించాలని ఈ కార్యక్రమం లక్ష్యంగా పెట్టుకుంది. ఇతర కార్యక్రమాల తోడ్పాటుతో క్రీడా ప్రతిభను తీర్చిదిద్దుతూ, రేపటి ఛాంపియన్లను సిద్ధం చేస్తోంది.
క్రీడా భారత స్ఫూర్తి
వ్యక్తులను తీర్చిదిద్దుతూ, దేశాలను ప్రపంచ వేదికపై ఉన్నత స్థానానికి చేర్చే అపార శక్తి క్రీడలకు ఉంది. క్రీడలు పౌరుల్లో వ్యక్తిత్వాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయి. అదే సమయంలో క్రీడా మహాశక్తిగా ఒక దేశం ఎదుగుతున్న విషయాన్ని ప్రపంచానికి చాటుతాయి. క్రీడా మైదానంలో సాధించే విజయం దేశ ప్రజల్లో అపారమైన గర్వాన్ని నింపుతుంది. కులం, వర్గం, మతాలకు అతీతంగా ప్రజలను ఏకం చేస్తుంది. ఈ ఉమ్మడి గర్వం సంతోషకరమైన, ఆరోగ్యకరమైన, మరింత సంఘటిత సమాజ నిర్మాణానికి తోడ్పడుతుంది.

భారత క్రీడా రంగానికి యువతే అతిపెద్ద బలం. దేశ జనాభాలో దాదాపు 65 శాతం మంది 35 ఏళ్లలోపు వారే. ఈ అపార సామర్థ్యాన్ని గుర్తించిన యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా యువజన వికాసానికి ఊతమిస్తూ, క్రీడా ప్రతిభను ప్రోత్సహిస్తోంది. 2026–27 కేంద్ర బడ్జెట్‌లో మంత్రిత్వ శాఖకు రికార్డు స్థాయిలో ₹4,479.88 కోట్లు కేటాయించారు. 2013–14లో ఈ కేటాయింపు ₹1,219 కోట్లుగా ఉంది.
ఈ పరివర్తనలో కీలకంగా నిలుస్తున్న ఖేలో ఇండియా కార్యక్రమం ఇప్పుడు గణనీయంగా విస్తరించిన కొత్త దశలోకి ప్రవేశించింది. పోటీలు, మౌలిక సదుపాయాలకు మించి విస్తృత దార్శనికతతో రూపొందించిన పథకానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
పాఠశాల మైదానాలు, గ్రామీణ క్రీడా ప్రాంగణాల నుంచి ఎదిగే యువ క్రీడాకారులకు ఇకపై స్పష్టమైన ప్రగతి మార్గం అందుబాటులోకి వస్తుంది. ప్రతిభను తొలిదశలో గుర్తించిన తర్వాత నాణ్యమైన శిక్షణ, శాస్త్రీయ సహకారం, క్రమమైన పోటీ అవకాశాలు కల్పిస్తారు. బలమైన సంస్థలు, విస్తృత భాగస్వామ్యాలు ప్రతిభావంతులైన క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయి దిశగా స్థిరంగా పురోగమించేందుకు దోహదపడతాయి. పలు కీలక కార్యక్రమాల తోడ్పాటుతో ఖేలో ఇండియా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ప్రజల విస్తృత భాగస్వామ్యంతో పాటు క్రీడా ప్రతిభను ప్రోత్సహిస్తోంది. ప్రతి స్థాయిలో ప్రతిభను గుర్తించి, తీర్చిదిద్దేందుకు అవసరమైన మౌలిక సదుపాయాలు, శాస్త్రీయ శిక్షణ, ఆర్థిక సహాయాన్ని ఈ ప్రయత్నాలు అందిస్తున్నాయి. భౌగోళిక పరిస్థితులు, పరిమిత వనరులు లేదా అవకాశాల కొరత కారణంగా ప్రతిభ వెనుకబడకుండా చూడాలని ఈ పథకం లక్ష్యంగా పెట్టుకుంది.
ఇటీవలి సంవత్సరాల్లో భారత్ నిర్మించిన క్రీడా పునాదిపై ఈ దార్శనికత రూపుదిద్దుకుంది. 2026 కామన్వెల్త్ క్రీడల్లో భారత్ నాలుగో స్థానంలో నిలవడం దేశంలో పెరుగుతున్న క్రీడా బలానికి మరో నిదర్శనం. ఇలాంటి సందర్భాల ప్రాధాన్యం కేవలం పతకాలకే పరిమితం కాదు.
ఖేలో ఇండియా దార్శనికత

భారత క్రీడా రంగానికి బలమైన పునాది వేయాలన్న లక్ష్యంతో 2017లో ప్రారంభించిన ఖేలో ఇండియా పథకం అప్పటికే అమల్లో ఉన్న మూడు కార్యక్రమాలను ఒకే వేదికపైకి తీసుకొచ్చింది. రాజీవ్ గాంధీ ఖేల్ అభియాన్, పట్టణ క్రీడా మౌలిక సదుపాయాల పథకం, జాతీయ క్రీడా ప్రతిభాన్వేషణ పథకాలను క్రీడాభివృద్ధికి ఉద్దేశించిన ఏకీకృత వ్యవస్థలో విలీనం చేశారు.
క్రీడా వ్యవస్థలోని ప్రతి దశను బలోపేతం చేసేందుకు ఈ పథకం సమగ్ర విధానాన్ని అనుసరిస్తోంది. ఇందులో ఐదు ప్రధాన స్తంభాలు ఉన్నాయి:
* ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తించి, వృత్తిపరమైన ప్రతిభ దిశగా మార్గనిర్దేశం చేసేందుకు వివిధ స్థాయుల్లో శిక్షణ కేంద్రాల ఏర్పాటు.
* ప్రత్యేక అభివృద్ధి కార్యక్రమాల ద్వారా శిక్షకులు, సహాయక సిబ్బంది సామర్థ్యాన్ని పెంపొందించడం.
* క్రీడాకారుల ప్రదర్శనను మెరుగుపరిచేందుకు క్రీడా విజ్ఞానం, అధునాతన సాంకేతికత వినియోగాన్ని విస్తరించడం.
* చైతన్యవంతమైన క్రీడా సంస్కృతిని ప్రోత్సహించి, పోటీపడే అవకాశాలు కల్పించేందుకు పోటీలు, లీగ్‌ల నిర్వహణ.
* శిక్షణ, పోటీ క్రీడా కార్యక్రమాలకు అవసరమైన మౌలిక సదుపాయాల అభివృద్ధి.
రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రణాళికల ద్వారా ప్రతి జిల్లాలో ఒక ఖేలో ఇండియా శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని మిషన్ లక్ష్యంగా పెట్టుకుంది. క్రీడా విజ్ఞానం, మనస్తత్వశాస్త్రం, పోషకాహార మద్దతుతో కూడిన పద్ధతిబద్ధమైన క్రీడాకారుల ప్రగతి మార్గాలను కూడా ప్రోత్సహిస్తోంది. సమాచార ఆధారిత వేదికలు క్రీడాకారుల పురోగతిని ఎప్పటికప్పుడు పరిశీలించేందుకు వీలు కల్పిస్తున్నాయి. ఈ సమగ్ర విధానం ద్వారా 2036 నాటికి ప్రపంచంలోని అగ్రశ్రేణి క్రీడా దేశాల సరసన భారత్‌ను నిలపాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఖేలో ఇండియాలో పెరుగుతున్న పెట్టుబడులు
2017–18 నుంచి 2019–20: పథకం పునరుద్ధరణకు మూడేళ్ల కాలానికి ₹1,756 కోట్లకు ఆమోదం.
2020–21: ఏడాది కాలానికి ₹328.77 కోట్ల కేటాయింపు.
2021–22 నుంచి 2025–26: కార్యకలాపాల విస్తరణ, క్రీడా మౌలిక సదుపాయాల బలోపేతం కోసం ఐదేళ్ల కాలానికి ఆర్థిక వ్యయాన్ని ₹3,790.50 కోట్లకు పెంచారు.
2026–27: ఫలితాల ఆధారిత అమలుతో పథకం కొత్త దశలోకి ప్రవేశిస్తున్న నేపథ్యంలో నిరంతర సహాయాన్ని బలోపేతం చేస్తూ ₹924.35 కోట్లు కేటాయించారు.
ఖేలో ఇండియా పథకం ప్రధాన విజయాలు (2026 జులై నాటికి):
* మొత్తం ₹3,176 కోట్ల పెట్టుబడితో 349 కొత్త క్రీడా మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు ఆమోదం.
* క్షేత్రస్థాయి శిక్షణ, క్రీడాకారులకు సహాయాన్ని బలోపేతం చేసేందుకు 1,067 ఖేలో ఇండియా కేంద్రాల (కేఐసీలు) ఏర్పాటు.
* వివిధ క్రీడాంశాల్లో ప్రతిభను తీర్చిదిద్దేందుకు 267 అకాడమీలకు సహాయం.
* శిక్షణ, పరికరాలు, వైద్య సంరక్షణ, వ్యక్తిగత ఖర్చుల కోసం నెలవారీ భృతితో 2,745 మంది ఖేలో ఇండియా క్రీడాకారులకు (కేఐఏలు) సహాయం.
నిరంతర పెట్టుబడులు, స్పష్టమైన దీర్ఘకాలిక దార్శనికతతో భారత్‌కు బలమైన ఛాంపియన్ల శ్రేణిని ఖేలో ఇండియా సిద్ధం చేస్తోంది.
పునరుద్ధరించిన ఖేలో ఇండియా పథకం: క్షేత్రస్థాయి నుంచి అంతర్జాతీయ ప్రతిభకు మార్గం
2026–27 నుంచి 2030–31 వరకు ఖేలో ఇండియా పథకం గణనీయంగా విస్తరించిన కొత్త దశలోకి ప్రవేశించింది. జాతీయ క్రీడా సమాఖ్యలకు మెరుగైన సహాయంతో కలిపి ఈ పథకానికి మొత్తం ₹36,441 కోట్ల వ్యయాన్ని నిర్దేశించారు.
సమగ్ర క్రీడాకారుల అభివృద్ధి మార్గం
తొలిసారిగా యువ క్రీడాకారులకు ప్రతిభ గుర్తింపు, శాస్త్రీయ శిక్షణ, అంతర్జాతీయ పోటీల అనుభవం, ఒలింపిక్ సన్నద్ధత వరకు ప్రతి దశలో పద్ధతిబద్ధమైన సహాయం లభిస్తుంది. దేశవ్యాప్త క్రీడా వ్యవస్థ కింది సంస్థలను ఒకే వేదికపైకి తీసుకొస్తుంది:
* జాతీయ ప్రతిభా కేంద్రాలు
* ఖేలో ఇండియా ప్రతిభా కేంద్రాలు
* భారత క్రీడా ప్రాధికార సంస్థ శిక్షణ కేంద్రాలు
* ఖేలో ఇండియా గుర్తింపు పొందిన అకాడమీలు
* ఖేలో ఇండియా కేంద్రాలు
* సాయుధ దళాల యువ క్రీడా కంపెనీలు
ఈ సంస్థలు దేశవ్యాప్తంగా ఆధునిక మౌలిక సదుపాయాలు, వృత్తిపరమైన శిక్షణ, క్రీడా విజ్ఞాన సహాయాన్ని అందిస్తాయి.
ఖేలో ఇండియా ఫీడర్ పాఠశాలలు, ఖేలో ఇండియా ఉత్కృష్ట విద్యాలయాలను కూడా ఈ పథకం కొత్తగా ప్రవేశపెడుతోంది. ఈ కార్యక్రమాలు క్రీడలను ప్రధాన విద్యా ప్రవాహంతో అనుసంధానించడంతో పాటు ప్రతిభావంతులైన బాలలను తొలిదశలో గుర్తించి, పద్ధతిబద్ధంగా తీర్చిదిద్దేందుకు వీలు కల్పిస్తాయి.
భారత క్రీడాకారుల పరిధి విస్తరణ
కొత్తగా ప్రవేశపెట్టిన ‘ఎమర్జింగ్ ఖేలో ఇండియా అథ్లెట్స్’ విభాగం పద్ధతిబద్ధమైన శిక్షణ పొందే క్రీడాకారుల సంఖ్యను దాదాపు పదింతలు పెంచుతుంది. బలమైన ప్రతిభ గుర్తింపు వ్యవస్థతో పాటు క్షేత్రస్థాయి పోటీల నుంచి ఖేలో ఇండియా, టాప్స్ వరకు స్పష్టమైన ప్రగతి మార్గం.. క్రీడాకారులు తొలిదశలో గుర్తింపు పొందిన నాటి నుంచి అంతర్జాతీయ స్థాయికి చేరేవరకు అండగా నిలుస్తుంది.
మరిన్ని పోటీలు.. విస్తృత అవకాశాలు
పాఠశాల, విశ్వవిద్యాలయ, ప్రాంతీయ, ప్రత్యేక క్రీడాంశాల లీగ్‌లు క్రీడాకారులకు క్రమమైన పోటీ అనుభవాన్ని అందిస్తాయి. మహిళలు, దివ్యాంగ క్రీడాకారులు, స్వదేశీ క్రీడలకు మరిన్ని అవకాశాలు కల్పిస్తారు. జాతీయ క్రీడలు, ప్రధాన అంతర్జాతీయ క్రీడా కార్యక్రమాలకు కూడా సహాయం అందిస్తారు.
శారీరక దృఢత్వం, శిక్షణ, సాంకేతికత
విస్తరించిన ఫిట్ ఇండియా ఉద్యమం చురుకైన జీవనశైలి, విస్తృత ప్రజా భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తుంది. జాతీయ కోచ్ గుర్తింపు మండలి శిక్షణ ప్రమాణాలను బలోపేతం చేస్తుంది. ఏకీకృత డిజిటల్ వేదిక క్రీడాకారుల సమాచారం, మౌలిక సదుపాయాలు, పోటీలు, మదింపులు, నిధుల వివరాలను అనుసంధానిస్తుంది.
క్రీడా ప్రతిభకు భాగస్వామ్యాలు
ప్రైవేటు అకాడమీలు, కార్పొరేట్ సంస్థలతో భాగస్వామ్యాల ద్వారా క్రీడాభివృద్ధికి పెట్టుబడులు, నైపుణ్యం అందుబాటులోకి వస్తాయి. జాతీయ క్రీడా సమాఖ్యలకు అందించే మెరుగైన సహాయం శిక్షణ, క్రీడా విజ్ఞానం, పరికరాలు, సాధన, అంతర్జాతీయ పోటీల అనుభవాన్ని బలోపేతం చేస్తుంది.
అంతర్జాతీయ క్రీడా లక్ష్యాల దిశగా భారత్
ఖేలో భారత్ నీతి–2025, జాతీయ విద్యా విధానం–2020కు అనుగుణంగా ఈ పథకం క్రీడలను విద్య, శారీరక దృఢత్వం, సాంకేతికత, అత్యున్నత స్థాయి శిక్షణతో అనుసంధానిస్తుంది. 2030 కామన్వెల్త్ క్రీడలకు సన్నద్ధత, ఒలింపిక్–పారాలింపిక్ క్రీడలకు ఆతిథ్యం ఇవ్వాలన్న భారత ఆకాంక్షలు, వికసిత్ భారత్@2047 దార్శనికతకు ఈ పథకం అండగా నిలుస్తుంది.
ఖేలో ఇండియా క్రీడలు: భవిష్యత్ ఛాంపియన్లకు వేదిక
2018లో ఖేలో ఇండియా పాఠశాల క్రీడల ప్రారంభంతో ఖేలో ఇండియా ఉద్యమం కొత్త దశలోకి ప్రవేశించింది. న్యూఢిల్లీలో నిర్వహించిన ఈ పోటీలు దేశవ్యాప్తంగా యువ క్రీడా ప్రతిభను ఒకే వేదికపైకి తీసుకొచ్చాయి.

అదే ఏడాది భారత ఒలింపిక్ సంఘం ఈ కార్యక్రమంలో భాగస్వామిగా చేరింది. 2019 నుంచి ఈ పోటీలకు ఖేలో ఇండియా యూత్ గేమ్స్ (కేఐవైజీ)గా పేరు మార్చారు. ఖేలో ఇండియా పరిధిలో ప్రధాన క్రీడా పోటీలుగా ఇవి కొనసాగుతున్నాయి.
వివిధ క్రీడాంశాల్లో క్రీడాకారులకు మరిన్ని అవకాశాలు కల్పించే దిశగా ఖేలో ఇండియా క్రీడలు క్రమంగా విస్తరించాయి. ఏటా నిర్వహించే పోటీల్లో రాష్ట్రాలు, విశ్వవిద్యాలయాలకు ప్రాతినిధ్యం వహించే క్రీడాకారులు పాల్గొంటున్నారు. పోటీపడటం, ప్రతిభ చాటడం, ఉన్నత స్థాయి పోటీలకు సన్నద్ధం కావడంలో ఈ వేదిక వారికి సహాయపడుతోంది. 2018 నుంచి ఇప్పటివరకు ఖేలో ఇండియా క్రీడల్లో 63,000 మందికి పైగా క్రీడాకారులు పాల్గొన్నారు.
ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ (కేఐయూజీ), ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ (కేఐడబ్ల్యూజీ)ను 2020లో ప్రవేశపెట్టారు. 2023లో ఖేలో ఇండియా పారా గేమ్స్ (కేఐపీజీ) ప్రారంభమయ్యాయి. 2025లో ఖేలో ఇండియా బీచ్ గేమ్స్ (కేఐబీజీ), ఖేలో ఇండియా వాటర్ స్పోర్ట్స్ ఫెస్టివల్ ప్రారంభంతో ఈ కార్యక్రమం మరింత విస్తరించింది. ఖేలో ఇండియా ట్రైబల్ గేమ్స్ (కేఐటీజీ) 2026లో తొలిసారిగా జరిగాయి.
యువ క్రీడాకారులు అత్యుత్తమ ప్రతిభ దిశగా ముందుకు సాగేందుకు జాతీయ వేదికను కల్పిస్తూ ఖేలో ఇండియా క్రీడలు దేశ క్రీడా సంస్కృతిని మరింత బలోపేతం చేస్తున్నాయి.
భారత క్రీడా విజయాలకు ఊతం
భారత క్రీడా రంగ పురోగతి మౌలిక సదుపాయాలు, పోటీలకు మాత్రమే పరిమితం కాలేదు. క్రీడాకారుల అభివృద్ధి, వర్ధమాన ప్రతిభను గుర్తించడం, దీర్ఘకాలిక క్రీడా సామర్థ్యాన్ని నిర్మించడంలో పలు లక్ష్య నిర్దేశిత కార్యక్రమాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఈ ప్రయత్నాలన్నీ కలిసి క్షేత్రస్థాయి భాగస్వామ్యం నుంచి ప్రపంచ స్థాయి విజయాల వరకు మరింత బలమైన ప్రగతి మార్గాన్ని రూపొందిస్తున్నాయి.
టార్గెట్ ఒలింపిక్ పోడియం పథకం (టాప్స్)
ఒలింపిక్, పారాలింపిక్ క్రీడల్లో భారత్ ప్రదర్శనను మెరుగుపరిచేందుకు యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ 2014 సెప్టెంబర్‌లో టార్గెట్ ఒలింపిక్ పోడియం పథకాన్ని (టాప్స్) ప్రారంభించింది. క్రీడాకారులకు సమగ్ర సహాయం అందించేందుకు ప్రత్యేక సాంకేతిక సహాయక బృందాన్ని ఏర్పాటు చేస్తూ 2018 ఏప్రిల్‌లో పథకాన్ని పునర్వ్యవస్థీకరించారు.
విదేశీ శిక్షణ, అంతర్జాతీయ పోటీలు, శిక్షణ శిబిరాలు, ప్రత్యేక పరికరాలు, నెలకు ₹50,000 భృతి ద్వారా టాప్స్ క్రీడాకారులకు సహాయం అందిస్తోంది. జూనియర్ క్రీడాకారులకు నెలకు ₹25,000 భృతి అందించేందుకు అభివృద్ధి బృందాన్ని కూడా ప్రవేశపెట్టారు.
2026 ఏప్రిల్ నాటికి ఈ పథకం 51 మంది కోర్ క్రీడాకారులు, 52 మంది పారా కోర్ క్రీడాకారులు, 130 మంది అభివృద్ధి విభాగ క్రీడాకారులకు సహాయం అందిస్తోంది. టోక్యో 2020, పారిస్ 2024 ఒలింపిక్ క్రీడల్లో భారత్ పతకాలు సాధించడంలో టాప్స్ కీలక పాత్ర పోషించింది.
కీర్తి
9 నుంచి 18 ఏళ్లలోపు బాలల్లో క్రీడా ప్రతిభను గుర్తించి, తీర్చిదిద్దేందుకు ఖేలో ఇండియా రైజింగ్ టాలెంట్ ఐడెంటిఫికేషన్ (కీర్తి) కార్యక్రమం కృషి చేస్తోంది. పారదర్శకమైన, ప్రతిభ ఆధారిత ఎంపికకు ప్రతిభ మదింపు కేంద్రాలు, ప్రామాణిక మదింపు విధానాలు, కృత్రిమ మేధ, సమాచార విశ్లేషణ సహా అధునాతన సమాచార సాంకేతిక సాధనాలను వినియోగిస్తోంది.
ప్రస్తుతం మూడు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 174 ప్రతిభ మదింపు కేంద్రాలు పనిచేస్తున్నాయి. ఇప్పటివరకు 1,87,921 మదింపులు పూర్తి చేశారు. 2036 నాటికి ప్రపంచంలోని అగ్రశ్రేణి 10 క్రీడా దేశాల్లో ఒకటిగా, 2047 నాటికి తొలి ఐదు క్రీడా దేశాల్లో ఒకటిగా భారత్‌ను నిలిపేందుకు స్థిరమైన క్రీడా ప్రతిభ శ్రేణిని నిర్మించాలని కీర్తి లక్ష్యంగా పెట్టుకుంది.
క్రీడా వస్తువుల తయారీ
2026–27 కేంద్ర బడ్జెట్‌లో క్రీడా వస్తువుల తయారీకి ₹500 కోట్ల కేటాయింపుతో ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రకటించారు. అధిక నాణ్యతతో, అందుబాటు ధరల్లో క్రీడా వస్తువులను ఉత్పత్తి చేసే ప్రపంచ కేంద్రంగా భారత్ స్థానాన్ని బలోపేతం చేయాలని ఈ కార్యక్రమం లక్ష్యంగా పెట్టుకుంది.
దేశీయ తయారీ సామర్థ్యాన్ని విస్తరించడం, క్రీడా పరికరాల రూపకల్పనలో పరిశోధన, ఆవిష్కరణలను ప్రోత్సహించడం, పదార్థ విజ్ఞానాన్ని అభివృద్ధి చేయడం, ప్రపంచ క్రీడా సరఫరా వ్యవస్థల్లో భారత్ ఉనికిని బలోపేతం చేయడం, తయారీతో పాటు అనుబంధ రంగాల్లో ఉపాధి కల్పించడం ఈ కార్యక్రమ ప్రధాన లక్ష్యాలు.
ఈ కార్యక్రమాలు భారత క్రీడా వ్యవస్థను బలోపేతం చేస్తూ, ప్రపంచ వేదికపై ఆత్మవిశ్వాసంతో పోటీ పడేలా క్రీడాకారులను సన్నద్ధం చేస్తున్నాయి.
ప్రపంచ క్రీడా వేదికపై భారత్ పురోగతి
భారత క్రీడా వ్యవస్థలో పెట్టిన పెట్టుబడులు ప్రపంచ వేదికపై ఫలితాలను అందిస్తున్నాయి. ప్రధాన అంతర్జాతీయ క్రీడా పోటీల్లో భారత్ ప్రదర్శన.. ఒలింపిక్, పారాలింపిక్, బహుళ క్రీడాంశాల్లో దేశానికి పెరుగుతున్న బలాన్ని ప్రతిబింబిస్తోంది. క్రీడాకారుల మెరుగైన అభివృద్ధి, నాణ్యమైన శిక్షణ సహాయం, నిరంతర పెట్టుబడులు ప్రపంచ వేదికపై నిలకడైన పురోగతికి దోహదపడ్డాయి. క్రీడాకారుల భాగస్వామ్యం, పతకాల సంఖ్యలో స్థిరమైన పెరుగుదల.. మరింత పోటీతత్వం కలిగిన క్రీడా దేశంగా భారత్ ఆవిర్భావాన్ని చాటుతోంది.
ఒలింపిక్ క్రీడలు
2016 నుంచి 2024 మధ్య భారత్ ఒలింపిక్ ప్రయాణంలో విశేష పరివర్తన చోటుచేసుకుంది. రియో 2016లో రెండు పతకాలు సాధించిన భారత్.. టోక్యో 2020లో ఏడు పతకాలకు పురోగమించింది. పారిస్ 2024లో ఆరు పతకాలు సాధించి అదే జోరును కొనసాగించింది. టోక్యో 2020లో నీరజ్ చోప్రా అథ్లెటిక్స్‌లో భారత్‌కు తొలి ఒలింపిక్ స్వర్ణ పతకాన్ని అందించారు. భారత్ తరఫున ఒలింపిక్స్‌లో నిలకడగా పతకాలు సాధించిన క్రీడాకారుల్లో మీరాబాయి చాను కూడా ఒకరిగా నిలిచారు.
|
సంవత్సరం
|
ఆతిథ్య నగరం
|
భారత క్రీడాకారులు
|
సాధించిన పతకాలు
|
|
2016
|
రియో డి జనీరో
|
117
|
2
|
|
2020
|
టోక్యో
|
119
|
7
|
|
2024
|
పారిస్
|
117
|
6
|
పారాలింపిక్ క్రీడలు
గత మూడు పారాలింపిక్ క్రీడల్లో భారత్ అసాధారణ పురోగతిని సాధించింది. రియో 2016లో నాలుగు పతకాలు సాధించిన భారత్.. టోక్యో 2020లో 19 పతకాలకు చేరుకుంది. పారిస్ 2024లో 29 పతకాలతో భారత్ తన పారాలింపిక్ చరిత్రలోనే అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేసింది. అవని లేఖరా, సుమిత్ అంటిల్, ప్రమోద్ భగత్ దేశం తరఫున అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారుల్లో ఉన్నారు. టాప్స్, ఖేలో ఇండియా పారా గేమ్స్ వంటి కార్యక్రమాలు దివ్యాంగ క్రీడాకారులకు అందించే సహాయాన్ని బలోపేతం చేశాయి.
|
సంవత్సరం
|
ఆతిథ్య నగరం
|
భారత క్రీడాకారులు
|
సాధించిన పతకాలు
|
స్వర్ణం
|
రజతం
|
కాంస్యం
|
|
2016
|
రియో డి జనీరో
|
19
|
4
|
2
|
1
|
1
|
|
2020
|
టోక్యో
|
54
|
19
|
5
|
8
|
6
|
|
2024
|
పారిస్
|
84
|
29
|
7
|
9
|
13
|
ఆసియా క్రీడలు
పెద్ద క్రీడా బృందాలను పంపడంతో పాటు మరిన్ని పతకాలు సాధిస్తూ ఆసియా క్రీడల్లో భారత్ తన ప్రదర్శనను నిలకడగా మెరుగుపరచుకుంది. ఇంచియాన్ 2014లో 57 పతకాలు సాధించిన దేశం.. జకార్తా 2018లో 69 పతకాలకు చేరుకుంది. హాంగ్‌జౌ 2023లో అత్యధికంగా 107 పతకాలు సాధించి భారత్ చరిత్ర సృష్టించింది. నీరజ్ చోప్రా, లవ్లీనా బోర్గోహైన్, సాత్విక్‌సాయిరాజ్ రాంకిరెడ్డి, చిరాగ్ శెట్టి ఈ విజయంలో కీలక పాత్ర పోషించిన వారిలో ఉన్నారు.
|
సంవత్సరం
|
ఆతిథ్య నగరం
|
భారత క్రీడాకారులు
|
సాధించిన పతకాలు
|
స్వర్ణం
|
రజతం
|
కాంస్యం
|
|
2014
|
ఇంచియాన్
|
541
|
57
|
11
|
9
|
37
|
|
2018
|
జకార్తా
|
570
|
69
|
15
|
24
|
30
|
|
2023
|
హాంగ్‌జౌ
|
655
|
107
|
28
|
38
|
41
|
కామన్వెల్త్ క్రీడలు
కామన్వెల్త్ క్రీడల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచే దేశాల్లో భారత్ ఒకటిగా కొనసాగుతోంది. గ్లాస్గో 2014లో 64 పతకాలు సాధించిన భారత్.. గోల్డ్‌కోస్ట్ 2018లో 66 పతకాలకు చేరుకుంది. ఆ తర్వాత బర్మింగ్‌హామ్ 2022లో 61 పతకాలు సాధించింది. రెజ్లింగ్, వెయిట్‌లిఫ్టింగ్, టేబుల్ టెన్నిస్, బ్యాడ్మింటన్, అథ్లెటిక్స్ విభాగాలు భారత్ విజయాలకు నిలకడగా తోడ్పడుతున్నాయి. పీవీ సింధు, వినేశ్ ఫోగట్, అచింత షియులి దేశం తరఫున విశేష ప్రతిభ కనబరిచిన క్రీడాకారుల్లో ఉన్నారు.
|
సంవత్సరం
|
ఆతిథ్య నగరం
|
భారత క్రీడాకారులు
|
సాధించిన పతకాలు
|
స్వర్ణం
|
రజతం
|
కాంస్యం
|
|
2014
|
గ్లాస్గో
|
215
|
64
|
15
|
30
|
19
|
|
2018
|
గోల్డ్‌కోస్ట్
|
218
|
66
|
26
|
20
|
20
|
|
2022
|
బర్మింగ్‌హామ్
|
210
|
61
|
22
|
16
|
23
|
ప్రపంచ క్రీడా వేదికపై భారత్ సాధిస్తున్న విజయాలు దేశ క్రీడా వ్యవస్థ బలాన్ని, అంతర్జాతీయ స్థాయిలో రాణించాలన్న క్రీడాకారుల దృఢ సంకల్పాన్ని ప్రతిబింబిస్తున్నాయి.
కామన్వెల్త్ క్రీడలు–2026
2026 కామన్వెల్త్ క్రీడలు జులై 23 నుంచి ఆగస్టు 2 వరకు గ్లాస్గోలో జరిగాయి. నాలుగు వేదికల్లో నిర్వహించిన ఈ క్రీడల్లో ఆరు పూర్తి సమీకృత పారా క్రీడలు సహా 10 క్రీడాంశాల్లో 74 దేశాల క్రీడాకారులు పాల్గొన్నారు. భారత్ 13 స్వర్ణాలు, 17 రజతాలు, తొమ్మిది కాంస్యాలతో మొత్తం 39 పతకాలు సాధించి నాలుగో స్థానంలో నిలిచింది.

భారత్ తరఫున 124 మంది సభ్యులతో కూడిన బృందం పాల్గొంది. ఇందులో 78 మంది పురుషులు, 46 మంది మహిళా క్రీడాకారులు ఉన్నారు. పలు క్రీడాంశాల్లో దేశంలో పెరుగుతున్న ప్రతిభ లోతును ఈ బృందం ప్రతిబింబించింది.
పారా పవర్‌లిఫ్టింగ్‌లో ఝండు కుమార్ కాంస్య పతకం సాధించి భారత్ పతకాల ఖాతా తెరిచారు. పురుషుల 60 కిలోల వెయిట్‌లిఫ్టింగ్ విభాగంలో రజతం గెలిచిన రిషికాంత సింగ్, దివ్యాంగేతర విభాగంలో భారత్‌కు తొలి పతకం అందించిన క్రీడాకారుడిగా నిలిచారు. స్నాచ్‌లో కొత్త కామన్వెల్త్ క్రీడల రికార్డును కూడా నెలకొల్పారు.
గ్లాస్గోలో భారత్‌కు తొలి స్వర్ణ పతకాన్ని అందించిన మీరాబాయి చాను మరో చారిత్రక ఘట్టాన్ని ఆవిష్కరించారు. ఈ విజయంతో ఆమె వరుసగా మూడో కామన్వెల్త్ క్రీడల టైటిల్‌ను సొంతం చేసుకున్నారు. పురుషుల 65 కిలోల వెయిట్‌లిఫ్టింగ్ విభాగంలో ముత్తుపాండి రాజా రజతం సాధించి భారత్ పతకాల సంఖ్యను పెంచారు.
భారత ప్రస్థానంలో బాక్సింగ్ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. భారత బాక్సర్లు ఏడు స్వర్ణాలు సహా 10 పతకాలు సాధించారు. ఒకే కామన్వెల్త్ క్రీడల్లో బాక్సింగ్‌లో ఏ దేశమూ సాధించని అత్యుత్తమ ప్రదర్శన ఇది. స్వర్ణ పతక విజేతల్లో సాక్షి చౌధరి ఒకరు కాగా, ఒలింపిక్ పతక విజేత లవ్లీనా బోర్గోహైన్ రజతం సొంతం చేసుకున్నారు.
గ్లాస్గోలో భారత క్రీడాకారులు పలు తొలి ఘనతలను నమోదు చేశారు. జూడోలో అస్మితా డే దేశానికి తొలి కామన్వెల్త్ క్రీడల స్వర్ణ పతకాన్ని అందించారు. ఆ తర్వాత హర్ష్ టోకస్ ఇదే క్రీడలో మరో స్వర్ణం సాధించారు. ఒకే కామన్వెల్త్ క్రీడల్లో రెండు వ్యక్తిగత పతకాలు గెలిచిన తొలి భారత ట్రాక్ అండ్ ఫీల్డ్ క్రీడాకారుడిగా గుల్వీర్ సింగ్ నిలిచారు. డెకాథ్లాన్‌లో తేజస్విన్ శంకర్ భారత్‌కు తొలి పతకాన్ని అందించారు. పురుషుల జావెలిన్ త్రోలో నీరజ్ చోప్రా సాధించిన రజతం.. పలు క్రీడాంశాల్లో భారత్ పెరుగుతున్న బలాన్ని ప్రతిబింబించిన ఈ ప్రస్థానంలో మరో చిరస్మరణీయ ఘట్టంగా నిలిచింది.
ఖేలో ఇండియా నుంచి గ్లాస్గో కీర్తి వరకు
అరుంధతి స్వర్ణ ప్రయాణం: ఖేలో ఇండియా నుంచి గ్లాస్గో వరకు

గణితంపై మంచి పట్టు కలిగిన ప్రతిభావంతురాలైన విద్యార్థిని అరుంధతి చౌధరి సంప్రదాయ వృత్తికి బదులుగా బాక్సింగ్ రింగ్‌ను ఎంచుకున్నారు. కోటాకు చెందిన ఈ యువ బాక్సర్ ప్రయాణంలో కీలక దశలో ఖేలో ఇండియా క్రీడలు జాతీయ వేదికను కల్పించాయి. ఢిల్లీ 2018, పుణె 2019, గువాహటి 2020 పోటీల్లో వరుసగా మూడు స్వర్ణ పతకాలు సాధించి ఆమె ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు.
గ్లాస్గో 2026లో మహిళల 70 కిలోల బాక్సింగ్ టైటిల్‌ను గెలుచుకున్న అరుంధతి తన ప్రస్థానంలో మరో స్వర్ణాధ్యాయాన్ని లిఖించారు. తొలిదశలో లభించే అవకాశాలు వర్ధమాన ప్రతిభను కామన్వెల్త్ ఛాంపియన్‌గా ఎలా తీర్చిదిద్దగలవో ఆమె ప్రయాణం చాటుతోంది.
అస్మితా డే: ఖేలో ఇండియా ఛాంపియన్ నుంచి జూడో చరిత్ర వరకు

అంతర్జాతీయ క్రీడా వేదికలకు ఎంతో దూరంగా ఉన్న త్రిపురలోని బెలోనియాలో అస్మితా డే ప్రయాణం మొదలైంది. ఆమె తండ్రి సైకిల్ మెకానిక్‌గా పనిచేసేవారు. జూడో ద్వారా అస్మితా డే మౌనంగా ఒక గొప్ప కలను నిర్మించుకున్నారు.
ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ ఆ కలకు జాతీయ వేదికను కల్పించాయి. పలు స్వర్ణ పతకాలు ఆమె ఆత్మవిశ్వాసాన్ని బలోపేతం చేయడంతో పాటు భారత జూడోలో తన రాకను చాటాయి.
అదే ఆత్మవిశ్వాసంతో ఆమె 2026లో గ్లాస్గోకు చేరుకున్నారు. ఉత్కంఠభరిత ఫైనల్‌లో ఒత్తిడిని అధిగమించి కెనడాకు చెందిన హెడీ క్వాచ్‌ను ఓడించారు. ఈ విజయంతో భారత్‌కు తొలి కామన్వెల్త్ క్రీడల జూడో ఛాంపియన్‌గా ఆమె చరిత్ర సృష్టించారు.
క్రీడా ప్రతిభ సాధన దిశగా
భారత క్రీడా ప్రయాణం మరింత వేగం పుంజుకుంటోంది. నిరంతర పెట్టుబడులు, బలమైన సహాయక వ్యవస్థలు, క్రీడాకారుల లక్ష్య నిర్దేశిత అభివృద్ధి.. దీర్ఘకాలిక విజయాలకు పటిష్ఠ పునాది వేస్తున్నాయి. అంతర్జాతీయ పోటీల్లో పెరుగుతున్న భాగస్వామ్యం, మెరుగైన ప్రదర్శనలు ఈ ప్రయత్నాల ప్రభావాన్ని ప్రతిబింబిస్తున్నాయి. 2026 కామన్వెల్త్ క్రీడలు కొనసాగుతున్న తరుణంలో భారత క్రీడాకారులు దృఢ సంకల్పం, దేశం పట్ల గర్వంతో పోటీ పడుతున్నారు. వారి ప్రతి ప్రదర్శన రాబోయే తరానికి పెద్ద కలలు కని, ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకునే స్ఫూర్తినిస్తోంది. భవిష్యత్ వైపు అడుగులు వేస్తున్న భారత్.. ఛాంపియన్లను తీర్చిదిద్దడంతో పాటు ప్రపంచంలోని అగ్రశ్రేణి క్రీడా దేశాల సరసన తన స్థానాన్ని మరింత బలోపేతం చేసేందుకు కట్టుబడి ఉంది.
References:
PIB Backgrounders:
Ministry of Youth Affairs and Sports
Ministry of Textiles
Commonwealth Sport:
Olympic Games:
Others
Click here to see pdf
***
(Explainer ID: 159439)
आगंतुक पटल : 7
Provide suggestions / comments