Security
నక్సలిజం రహిత భారత్
సమగ్ర వ్యూహాలతో వామపక్ష తీవ్రవాదంపై విజయం
Posted On:
01 AUG 2026 11:16AM
దేశంలో వామపక్ష తీవ్రవాద(ఎల్‌డబ్ల్యూఈ) ప్రభావిత జిల్లా ఒక్కటి కూడా మిగలకపోవడంతో భారత్ ఆ సమస్య నుంచి సమర్థంగా విముక్తి పొంది చరిత్రాత్మక మైలురాయిని చేరుకుంది. భద్రతా కార్యకలాపాలు, మౌలిక సదుపాయాల విస్తరణ, లొంగిపోయిన సభ్యుల పునరావాసం, గిరిజన సంక్షేమం, మెరుగైన పాలనతో కూడిన సమగ్ర వ్యూహం ఈ పరివర్తనకు దోహదం చేసింది. సమన్వయ విధానం హింసను భారీగా తగ్గించింది. మారుమూల ప్రాంతాల్లో ప్రభుత్వ ఉనికిని పునరుద్ధరించి, సమ్మిళిత అభివృద్ధిని వేగవంతం చేసింది. తద్వారా శాంతి, శ్రేయస్సుకు శాశ్వత పునాది వేసింది.
శాంతి, భద్రతలో కొత్త శకం
దాదాపు ఆరు దశాబ్దాలపాటు భారత్ వామపక్ష తీవ్రవాదంతో పోరాడింది. ఇది దూరంగా ఉన్న లేదా ఊహాజనిత సమస్య కాదు. రహదారులు, పాఠశాలలు, సమ్మిళిత అభివృద్ధి ఫలాలకు దూరమైన గ్రామాల్లో నివసించే లక్షలాది గిరిజన కుటుంబాలు ప్రత్యక్షంగా ఎదుర్కొన్న వాస్తవం. హింస నిరంతరం కొనసాగగా, అనిశ్చితి వారి దైనందిన జీవితంలో భాగమైంది.

2026 మార్చి 31న ఈ పరిస్థితి మారింది. దేశం నక్సలిజం నుంచి సమర్థంగా విముక్తి పొంది అంతర్గత భద్రతా ప్రయాణంలో చరిత్రాత్మక మైలురాయిని చేరుకుంది. ప్రస్తుత ప్రభుత్వం 2014 మేలో అధికారంలోకి వచ్చినప్పుడు ‘రెడ్ కారిడార్’ దేశ అంతర్గత భద్రతకు అత్యంత తీవ్రమైన సవాళ్లలో ఒకటిగా ఉండేది. గతంలో అనుసరించిన విధానాలు చాలావరకు సమన్వయం లేకుండా, ఘటనలకు ప్రతిస్పందించే రీతిలో కొనసాగాయి. సమస్య మూల కారణాలను పరిష్కరించడానికి బదులు లక్షణాల నియంత్రణకే పరిమితమయ్యాయి. ఆ తర్వాత సమస్యకు పరిష్కారం చూపేందుకు మరింత సమగ్రమైన, సమన్వయంతో కూడిన వ్యూహాన్ని అనుసరించారు.
గత పన్నెండేళ్లలో పరస్పరం బలం చేకూర్చే మూడు కార్యాచరణ మార్గాలు ఈ పరివర్తనను ముందుకు నడిపించాయి. పటిష్ట భద్రతా చర్యలు, వివిధ సంస్థల మధ్య మెరుగైన సమన్వయం, క్రమబద్ధమైన లొంగుబాటు–పునరావాస వ్యవస్థలు, నిరంతర సామాజిక అనుసంధానం ద్వారా ప్రజల్లో విశ్వాసాన్ని పునరుద్ధరించారు. భౌతిక, డిజిటల్ అనుసంధానాన్ని మెరుగుపరచడం, మారుమూల ప్రాంతాలకు పాలనను విస్తరించడం, దీర్ఘకాలిక ఆర్థిక అవకాశాలను సృష్టించడం ద్వారా మౌలిక సదుపాయాలను విస్తరించారు. గౌరవప్రదమైన, సమ్మిళిత సేవల పంపిణీ, సాంస్కృతిక భాగస్వామ్యం, ప్రభావిత సముదాయాలను జాతీయాభివృద్ధి ప్రక్రియలో భాగం చేయడంపై సంక్షేమ కార్యక్రమాలు దృష్టి సారించాయి.
ఈ మూడు కార్యాచరణ మార్గాలు ఒకదానికొకటి బలం చేకూర్చాయి. భద్రత అభివృద్ధికి అవకాశం కల్పించింది. అభివృద్ధి విశ్వాసాన్ని పెంచింది. విశ్వాసం సంక్షేమ సేవల పంపిణీని వేగవంతం చేసింది. ఇది దశలవారీ ప్రక్రియ కాదు; విడదీయలేని ప్రగతి గొలుసు.
ప్రభుత్వంపై విశ్వాస పునరుద్ధరణ
సున్నితమైన, మారుమూల ప్రాంతాల్లో ప్రభుత్వ నిరంతర ఉనికి ద్వారా ప్రజల నమ్మకం, విశ్వాసాన్ని పునర్నిర్మించడంపై ఈ ప్రయత్నం దృష్టి సారించింది. సమర్థంగా స్పందించేందుకు భద్రతా సంస్థలు, పాలనా వ్యవస్థల మధ్య సమన్వయాన్ని బలోపేతం చేసింది. సముదాయాలకు, ప్రభుత్వ వ్యవస్థకు మధ్య దీర్ఘకాలంగా ఉన్న అంతరాలను ఈ విధానం తగ్గించింది.
2014కు ముందు హింస తారస్థాయికి
మావోయిస్టు సిద్ధాంతం, సాయుధ విప్లవ భావజాల స్ఫూర్తితో 1967లో పశ్చిమ బెంగాల్‌లో జరిగిన నక్సల్‌బరీ తిరుగుబాటు నుంచి వామపక్ష తీవ్రవాదం విస్తరించింది. ‘తుపాకీ గొట్టం ద్వారానే అధికారం సాధ్యం’ అన్న సరళమైన, హింసాత్మక సూత్రం దీనికి మార్గదర్శకంగా నిలిచింది. నక్సలైట్ల వద్ద ఉన్న ఆయుధాల్లో దాదాపు 92 శాతం పోలీసు ఆయుధాగారాల నుంచి నేరుగా దోచుకున్నవే. కాలక్రమంలో అనేక తీవ్రవాద సంస్థలు 2004లో సీపీఐ (మావోయిస్టు)లో విలీనమై దేశానికి అతిపెద్ద అంతర్గత భద్రతా సవాలుగా మారాయి.

వామపక్ష తీవ్రవాద చరిత్రలో 2004 నుంచి 2014 వరకు దశాబ్దం అత్యంత హింసాత్మక కాలాల్లో ఒకటిగా నిలిచింది. 2010లో 1,936 ఘటనలు, 720 మంది పౌరుల మరణాలతో హింస తారస్థాయికి చేరింది. ఆ దశాబ్దంలో మొత్తం 17,542 హింసాత్మక ఘటనలు చోటుచేసుకోగా, 1,913 మంది భద్రతా సిబ్బంది, 5,019 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు.
స్థిరమైన జాతీయ విధానం అప్పట్లో లేదు. రాష్ట్ర ప్రభుత్వాలు పరస్పర సమన్వయం లేకుండా పనిచేశాయి. భౌగోళిక విస్తరణ పరంగా కశ్మీర్, ఈశాన్య రాష్ట్రాల సమస్యల కంటే నక్సలిజమే దేశం ఎదుర్కొంటున్న అతిపెద్ద అంతర్గత భద్రతా సవాలని అప్పటి ప్రభుత్వం 2009లో బహిరంగంగా అంగీకరించింది.
విధానంలో మార్పు: విడివిడి ప్రతిస్పందన నుంచి ఏకీకృత వ్యూహం వరకు
వామపక్ష తీవ్రవాద పరిష్కారానికి జాతీయ విధానం, కార్యాచరణ ప్రణాళికను 2015లో ఆమోదించడంతో తొలి నిర్ణయాత్మక చర్య మొదలైంది. గతంలోని తాత్కాలిక విధానం స్థానంలో ప్రభుత్వ విభాగాలన్నింటినీ భాగస్వాములను చేసే క్రమబద్ధమైన వ్యవస్థను ఇది తీసుకొచ్చింది. కేంద్ర సాయుధ పోలీసు బలగాలను (సీఏపీఎఫ్) మోహరించి, ప్రత్యేక శిక్షణ అందించారు. భద్రత సంబంధిత వ్యయం, ప్రత్యేక మౌలిక సదుపాయాల పథకం, ప్రత్యేక కేంద్ర సహాయ (ఎస్‌సీఏ) పథకాల ద్వారా నిధులు కేటాయించారు. భద్రతా చర్యలతో పాటు సామాజిక–ఆర్థిక మూల కారణాల పరిష్కారంపై దృష్టి పెట్టారు. 2017లో ఎస్‌సీఏ పథకం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు దాదాపు ₹4,289.20 కోట్లు విడుదల చేశారు.
ప్రత్యేక దళాలు, ప్రత్యేక నిఘా విభాగాలు, జిల్లా పోలీసు వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు పటిష్ట పోలీస్ స్టేషన్ల నిర్మాణానికి వామపక్ష తీవ్రవాద ప్రభావిత రాష్ట్రాల్లో ప్రత్యేక మౌలిక సదుపాయాల పథకం (ఎస్ఐఎస్) కింద ₹1,761 కోట్ల విలువైన ప్రాజెక్టులకు ఆమోదం తెలిపారు.
భద్రతా దళాల కార్యాచరణ అవసరాలు, సామర్థ్య నిర్మాణం, శిక్షణ, లొంగిపోయిన వామపక్ష తీవ్రవాద సభ్యుల పునరావాసం, అమరులైన భద్రతా సిబ్బంది, పౌరుల కుటుంబాలకు పరిహార సహాయం కోసం 2014–15 నుంచి భద్రత సంబంధిత వ్యయ (ఎస్ఆర్ఈ) పథకం కింద ₹3,805.04 కోట్లు విడుదల చేశారు.
వామపక్ష తీవ్రవాదంపై చర్చలు, భద్రత, సమన్వయం అనే మూడు అంచెల వ్యూహంతో క్రమబద్ధమైన సమగ్ర విధానాన్ని భారత్ తొలిసారిగా అమలు చేసింది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పరిధిలో మరింత సమన్వయంతో కూడిన కేంద్రీకృత వ్యవస్థ ప్రభుత్వ ప్రతిస్పందనకు మార్గనిర్దేశం చేసి, విధాన అమలులో ఏకరూపతను పెంచింది.

కేంద్రీకృత ప్రణాళిక, సమన్వయ చర్యల ద్వారా నక్సలిజం భయం, హింస నుంచి భారత్‌ను విముక్తం చేయాలన్న లక్ష్యం నెరవేరింది. 2026 మార్చి 31 నాటికి దేశాన్ని నక్సలిజం రహితంగా మార్చాలని భారత ప్రభుత్వం 2024 ఆగస్టు 24న లక్ష్యం నిర్దేశించింది. తీవ్రతరం చేసిన భద్రతా కార్యకలాపాలు, పటిష్ట సమన్వయం, మౌలిక సదుపాయాల విస్తరణ, వేగవంతమైన అభివృద్ధి కార్యక్రమాల ద్వారా నిర్దేశిత సమయానికే లక్ష్యాన్ని సాధించింది.
భద్రతా వలయం నిర్మాణం
మౌలిక సదుపాయాల విస్తరణ, ప్రత్యేక దళాలు, మెరుగైన కార్యాచరణ సమన్వయం ద్వారా నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లోని భద్రతా లోటును ప్రభుత్వం క్రమపద్ధతిలో పూరించింది. రెడ్ కారిడార్ అంతటా ప్రభుత్వ ఉనికి, రాకపోకల సామర్థ్యం, నిఘా సమాచార మార్పిడి, తిరుగుబాటు నిరోధక సామర్థ్యాలను ఈ సమగ్ర విధానం మెరుగుపరిచింది.

2014కు ముందు కేవలం 66 పటిష్ఠ పోలీస్ స్టేషన్లు ఉండగా, ఆ తర్వాత 663 నిర్మించారు. గత ఏడేళ్లలో భద్రతా వలయాన్ని పటిష్టం చేయడం, ప్రాంతాలపై నియంత్రణ పెంచడం, మారుమూల అటవీ ప్రాంతాల్లో నిరంతర కార్యకలాపాలు కొనసాగించడం కోసం కొత్తగా 408 సీఏపీఎఫ్ భద్రతా శిబిరాలు ఏర్పాటు చేశారు. మారుమూల ప్రాంతాలకు బలగాలను వేగంగా తరలించడం, గాయపడినవారిని సురక్షితంగా తీసుకురావడం, నిఘా కోసం రాత్రివేళ విమానాలు దిగగల 68 హెలిప్యాడ్లను నిర్మించారు. భద్రతా దళాలకు 400 బుల్లెట్ ప్రూఫ్, పేలుడు నిరోధక వాహనాలను సమకూర్చడంతో పాటు వారి సంక్షేమం, వైద్య సహాయం కోసం ఐదు ఆసుపత్రులు నిర్మించారు.
ప్రత్యేక దళాల ఏకీకరణ: కోబ్రా, డీఆర్‌జీ, ఎస్‌టీఎఫ్, గ్రేహౌండ్స్
కోబ్రా (కమాండో బెటాలియన్ ఫర్ రిజల్యూట్ యాక్షన్), సీఆర్‌పీఎఫ్, జిల్లా రిజర్వ్ గార్డ్ (డీఆర్‌జీ), ఝార్ఖండ్ జాగ్వార్, ఛత్తీస్‌గఢ్ పోలీసు విభాగాలు, ఆంధ్రప్రదేశ్ గ్రేహౌండ్స్ వంటి రాష్ట్ర ప్రత్యేక దళాలను ఒకే వేదికపైకి తీసుకొస్తూ బహుస్థాయి ప్రత్యేక భద్రతా వ్యవస్థను రూపొందించారు. డీఆర్‌జీ, ఎస్‌టీఎఫ్, సీఆర్‌పీఎఫ్, కోబ్రా దళాలకు సంయుక్త శిక్షణ ఇవ్వడం ద్వారా స్పష్టమైన కమాండ్ వ్యవస్థతో సమన్వయంగా పనిచేసే ఏకీకృత బలగం రూపుదిద్దుకుంది.
సాంకేతికత: పరిస్థితిని మార్చిన శక్తి
2014 తర్వాత ఆధునిక సాంకేతికతను విస్తృతంగా ఉపయోగించడం ద్వారా కేంద్ర ప్రభుత్వం నక్సల్ వ్యతిరేక కార్యకలాపాలను సమూలంగా మార్చింది. మానవరహిత వైమానిక వాహనాలు (యూఏవీలు), డ్రోన్లు, ఉపగ్రహ చిత్రాలు, కృత్రిమ మేధ ఆధారిత సమాచార విశ్లేషణ ఎప్పటికప్పుడు పర్యవేక్షణ, కచ్చితమైన నిఘాకు వీలు కల్పించాయి. అధునాతన ప్రాంత గుర్తింపు వ్యవస్థలు, శాస్త్రీయ కాల్‌లాగ్ విశ్లేషణ, మొబైల్ సమాచార విశ్లేషణ, సామాజిక మాధ్యమాల పర్యవేక్షణను కార్యాచరణలోకి తీసుకొచ్చారు. కదలికలను గుర్తించడం, సమాచార మార్పిడి తీరును విశ్లేషించడం, కార్యాచరణ సామర్థ్యాన్ని పెంచడం కోసం కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సాంకేతిక ఆధారిత సమాచారాన్ని ఉపయోగించింది.
జాడ గుర్తింపు, లక్ష్య నిర్దేశం, మట్టుబెట్టడం: కీలక కార్యకలాపాలు
ప్రభుత్వం అనుసరించిన ‘జాడ గుర్తింపు, లక్ష్య నిర్దేశం, మట్టుబెట్టడం’ సిద్ధాంతం విశేష ఫలితాలను అందించింది. నిరంతర భద్రతా కార్యకలాపాలు, నిఘా సమాచారం ఆధారిత వ్యూహాల ద్వారా మూడు దశాబ్దాలకు పైగా వామపక్ష తీవ్రవాద ప్రభావంలో ఉన్న ప్రాంతాలను ప్రభుత్వం తిరిగి తన ఆధీనంలోకి తీసుకొచ్చింది.

ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్, ఆపరేషన్ ఆక్టోపస్, ఆపరేషన్ డబుల్ బుల్, ఆపరేషన్ థండర్‌స్టార్మ్, ఆపరేషన్ భీమ్‌బర్గ్, ఆపరేషన్ చక్రబంధ వంటి సమన్వయ కార్యకలాపాలు ప్రభావిత ప్రాంతాల్లో మావోయిస్టు వ్యవస్థలను గణనీయంగా బలహీనపరిచాయి. వీటిలో ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్ కీలక విజయంగా నిలిచింది. ప్రధాన మావోయిస్టు స్థావరాన్ని ధ్వంసం చేసి, 30 మందికి పైగా మావోయిస్టులను మట్టుబెట్టడంతో అరెస్టులు, లొంగుబాట్లు భారీగా పెరిగాయి. ఆపరేషన్ డబుల్ బుల్ ఫలితంగా గుమ్లా, లోహర్‌దగా, లాతేహర్ జిల్లాలు నక్సలిజం నుంచి విముక్తి పొందాయి. ఈ కార్యకలాపాలన్నీ దీర్ఘకాలంగా ప్రభావితమైన ప్రాంతాల్లో ప్రభుత్వ ఉనికిని పునరుద్ధరించాయి. తీవ్రవాద ప్రభావాన్ని తగ్గించి, మెరుగైన భద్రత, పాలన, అభివృద్ధి కార్యక్రమాలకు అనుకూల పరిస్థితులను సృష్టించాయి.

మద్దతు వ్యవస్థకు అడ్డుకట్ట
సాయుధ సభ్యులనే కాకుండా వారికి మద్దతు ఇచ్చే మొత్తం వ్యవస్థను లక్ష్యంగా చేసుకుంటూ కేంద్ర ప్రభుత్వం అన్ని సంస్థల సమగ్ర విధానాన్ని అనుసరించింది. అభివృద్ధికి ప్రభుత్వ విభాగాలన్నింటినీ భాగస్వాములను చేసే విధానాన్ని, భద్రతా కార్యకలాపాలకు అన్ని సంస్థల సమన్వయ వ్యూహాన్ని అమలు చేసింది.
నక్సల్ ఆర్థిక నెట్‌వర్క్‌లను అడ్డుకునేందుకు జాతీయ దర్యాప్తు సంస్థలో(ఎన్ఐఏ) ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశారు. 2025 డిసెంబరు నాటికి ఎన్ఐఏ ₹40 కోట్లకు పైగా విలువైన ఆస్తులను స్వాధీనం చేసుకుంది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ₹12 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేయగా, రాష్ట్ర సంస్థలు అదనంగా ₹40 కోట్ల ఆస్తులను స్వాధీనం చేసుకున్నాయి. 2025 డిసెంబరు నాటికి 111 వామపక్ష తీవ్రవాద కేసులపై దర్యాప్తు పూర్తి చేసి, 98 అభియోగ పత్రాలు దాఖలు చేశారు. 2026 జూన్ నాటికి ఎన్ఐఏ కేసుల సంఖ్య 112కు చేరగా, 100 అభియోగ పత్రాలు దాఖలయ్యాయి.

లొంగిపోయేవారికి ఎర్ర తివాచీ
ప్రభుత్వ కఠిన భద్రతా చర్యలకు పునరావాస ఆధారిత విధానం తోడైంది. ‘ఆయుధాలు వీడిన వారికి ఎర్ర తివాచీతో స్వాగతం’ అన్న స్పష్టమైన సందేశాన్ని ప్రభుత్వం ఇచ్చింది. లొంగిపోయే ఉన్నతస్థాయి సభ్యులకు తక్షణ సహాయంగా ₹5 లక్షలు, ఇతరులకు ₹2.5 లక్షలు అందించడంతో పాటు 36 నెలలపాటు నెలకు ₹10,000 భృతి ఇస్తున్నారు. లొంగుబాటుకు అదనంగా ₹50,000 ప్రోత్సాహకం అందిస్తున్నారు. సామూహికంగా లొంగిపోయిన సందర్భాల్లో ఈ మొత్తాన్ని రెట్టింపు చేయడంతో పాటు ఆయుధాలను అప్పగించినందుకు అదనపు పరిహారం ఇస్తున్నారు.

పునరావాస విధానం కారణంగా లొంగుబాట్లు క్రమంగా పెరిగాయి. 2025లోనే 2,337 మంది నక్సలైట్లు ఆయుధాలు వీడగా, 2024 నుంచి 2026 మార్చి వరకు 3,927 మంది సభ్యులు లొంగిపోయారు. పౌర సమాజ సభ్యులు, పాత్రికేయులు, సామాజిక నాయకులు, ప్రజాప్రతినిధులు ఈ ప్రయత్నాలకు మరింత బలం చేకూర్చారు. పునరావాస చర్యలపై నమ్మకం పెంచి, ప్రభావిత వ్యక్తులు జనజీవన స్రవంతిలోకి తిరిగి వచ్చేలా ప్రోత్సహించారు.
నిరంతర భద్రతా కార్యకలాపాలు, పునరావాసంతో కూడిన ఈ సమగ్ర వ్యూహ సమర్థతను ఇటీవలి పరిణామాలు మరింత స్పష్టం చేశాయి. ‘నయీ దిశ–నయీ పహల్’ నక్సల్ వ్యతిరేక కార్యక్రమం కింద కొల్హాన్, లాతేహర్ ప్రాంతాలకు చెందిన 16 మంది క్రియాశీల మావోయిస్టులు 2026 జూలై 28న రాంచీలో లొంగిపోయారు. వీరిలో ఒక ప్రాంతీయ కమాండర్, ముగ్గురు జోనల్ కమాండర్లు, ముగ్గురు సబ్ జోనల్ కమాండర్లు, ఆరుగురు ఏరియా కమాండర్లు, ముగ్గురు సాధారణ సభ్యులు ఉన్నారు. వారు 11 అధునాతన తుపాకులు, 38 మ్యాగజైన్లు, 1,562 తూటాలతో లొంగిపోయారు.
దీనికి తోడు మొత్తం ₹49 లక్షల రివార్డు ఉన్న మరో ఎనిమిది మంది మావోయిస్టులు 2026 జూలై 29న బీజాపూర్ పోలీసుల ఎదుట లొంగిపోయారు. వామపక్ష తీవ్రవాద వ్యతిరేక కార్యక్రమంలో ఇది మరో కీలక విజయంగా నిలిచింది. అదే రోజు ధన్‌బాద్–గిరిడీహ్ సరిహద్దులో ₹కోటి రివార్డు ఉన్న అగ్రశ్రేణి మావోయిస్టు నాయకుడు, పొలిట్‌బ్యూరో సభ్యుడిని భద్రతా దళాలు అరెస్టు చేశాయి. నిఘా సమాచారం ఆధారంగా చేపట్టిన సంయుక్త చర్యలో ₹15 లక్షల రివార్డు ఉన్న ప్రాంతీయ కమిటీ సభ్యుడు, ఒక మావోయిస్టు సభ్యుడు, ఇద్దరు గ్రామస్థులను కూడా అదుపులోకి తీసుకున్నారు.
ఈ భద్రతా విజయాలు శాంతిభద్రతల పునరుద్ధరణకే పరిమితం కాలేదు. దీర్ఘకాలిక అభివృద్ధికి పునాది వేశాయి. ప్రతి పటిష్ట పోలీస్ స్టేషన్, ప్రతి సీఏపీఎఫ్ శిబిరం, లొంగిపోయిన ప్రతి సభ్యుడితో గతంలో చేరుకోలేని ప్రాంతాలకు పాలన విస్తరించింది. గిరిజన సముదాయాలకు రహదారులు, పాఠశాలలు, ఆరోగ్య సదుపాయాలు, బ్యాంకింగ్ సేవలు, డిజిటల్ అనుసంధానం చేరేందుకు భద్రత ద్వారాలు తెరిచింది. స్థిరత్వం, విశ్వాస పునరుద్ధరణ ఆ తర్వాతి మౌలిక సదుపాయాల పరివర్తనకు పునాది వేసింది.
కొత్త భవిష్యత్ నిర్మాణం: మౌలిక సదుపాయాలు, అనుసంధానం
నక్సలిజాన్ని అంతం చేయాలన్న సంకల్పం నక్సలైట్ల నిర్మూలనకే పరిమితం కాలేదు. పెద్ద నగరాల్లో అందుబాటులో ఉన్న ప్రతి సదుపాయం ఈ ప్రాంతంలోని పేద గిరిజనులకు చేరి, వారి పిల్లలకు కూడా ఉజ్వల భవిష్యత్ లభించేలా చూడటం దీని ప్రధాన లక్ష్యం. మారుమూల ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు, అనుసంధానం, పాలనా సేవల విస్తరణపై ఈ దశ దృష్టి సారించింది. అత్యవసర సేవలు, రహదారులు, డిజిటల్ నెట్‌వర్క్‌ల అందుబాటును మెరుగుపరిచింది. గతంలో తగిన సేవలు అందని ప్రాంతాలను ప్రధాన అభివృద్ధి, పాలనా వ్యవస్థలతో అనుసంధానించేందుకు ఈ ప్రయత్నాలు తోడ్పడ్డాయి.
రహదారి అనుసంధానం: ప్రభావిత ప్రాంతాల్లో రహదారి అనుసంధానాన్ని బలోపేతం చేసేందుకు వామపక్ష తీవ్రవాద ప్రాంతాల కోసం ప్రత్యేకంగా రూపొందించిన రోడ్ రిక్వైర్‌మెంట్ ప్లాన్ (ఆర్‌ఆర్‌పీ), ఎల్‌డబ్ల్యూఈ ప్రభావిత ప్రాంతాల రహదారి అనుసంధాన ప్రాజెక్టు (ఆర్‌సీపీఎల్‌డబ్ల్యూఈఏ) కింద మొత్తం 15,189 కిలోమీటర్ల రహదారులను నిర్మించారు.
డిజిటల్, మొబైల్ అనుసంధానం: ఆధునిక సమాజాల ప్రగతికి టెలికాం అనుసంధానం ప్రాథమిక పునాదిగా అవతరించింది. సామాజిక–ఆర్థికాభివృద్ధికి కీలక ప్రేరకంగా పనిచేయడం, డిజిటల్ అంతరాన్ని తగ్గించడం, విద్య, ఆరోగ్య సేవలకు చేరువ చేయడం, ఆర్థిక అవకాశాలను పెంపొందించడం వంటి ప్రయోజనాల దృష్ట్యా గ్రామీణ గిరిజన సముదాయాలకు ఇది మరింత ముఖ్యం. దీన్ని దృష్టిలో ఉంచుకొని 9,497 టవర్లను అందుబాటులోకి తెచ్చారు. తీవ్ర వామపక్ష ప్రభావిత ప్రాంతాల్లోని 46,592 గ్రామాల్లో 44,728 గ్రామాలకు, అంటే 96 శాతం గ్రామాలకు ఇప్పుడు మొబైల్ అనుసంధానం ఉంది. దీంతో విద్య, ఆన్‌లైన్ సేవలు, ఆర్థిక వృద్ధికి కొత్త అవకాశాలు అందుబాటులోకి వచ్చాయి.
ఆర్థిక సమ్మిళితం: గత పన్నెండేళ్లలో వామపక్ష తీవ్రవాద ప్రభావిత జిల్లాల్లో కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సమ్మిళితాన్ని గణనీయంగా విస్తరించింది. 2015 ఏప్రిల్ నుంచి 2026 మార్చి వరకు 1,804 బ్యాంకు శాఖలను ప్రారంభించారు. 1,321 ఏటీఎంలను ఏర్పాటు చేసి, 74,720 మంది బ్యాంకింగ్ ప్రతినిధులను నియమించారు. 6,025 తపాలా కార్యాలయాలను నెలకొల్పారు.
విద్య–నైపుణ్యాభివృద్ధి: గత పన్నెండేళ్లలో భారత ప్రభుత్వం 259 ఏకలవ్య ఆదర్శ గురుకుల పాఠశాలలకు (ఈఎంఆర్‌ఎస్) అనుమతి ఇచ్చింది. వీటిలో 179 పాఠశాలలు కార్యకలాపాలు ప్రారంభించాయి. ఈ ప్రాంతాల్లో అదనంగా 47 పారిశ్రామిక శిక్షణ సంస్థలు (ఐటీఐలు), 49 నైపుణ్యాభివృద్ధి కేంద్రాలను (ఎస్‌డీసీలు) దాదాపు ₹800 కోట్ల పెట్టుబడితో అభివృద్ధి చేశారు. ఇవి గిరిజన యువతకు విద్య, వృత్తి శిక్షణ, ఉపాధి అవకాశాలను విస్తరించి, మారుమూల సముదాయాలు ప్రధాన ఆర్థిక వ్యవస్థలో భాగమయ్యేందుకు తోడ్పడ్డాయి. 90,000 మందికి పైగా యువత, మహిళలకు నైపుణ్య శిక్షణ అందించారు.
గిరిజన యువజన మార్పిడి కార్యక్రమం (టీవైఈపీ) కింద గతంలో వామపక్ష తీవ్రవాద ప్రభావానికి గురైన ప్రాంతాల గిరిజన యువతను దేశవ్యాప్తంగా అవగాహన పర్యటనలకు తీసుకెళ్తున్నారు. జాతీయ సమైక్యత, సాంస్కృతిక అవగాహన, అభివృద్ధిపై వారికి అనుభవపూర్వక పరిజ్ఞానం కల్పించడం దీని లక్ష్యం. 2014 నుంచి మొత్తం 37,655 మంది గిరిజన యువత ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
పౌర కార్యాచరణ కార్యక్రమాలు: సీఏపీఎఫ్ బలగాలు తమ కార్యాచరణ ప్రాంతాల్లో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టేందుకు పౌర కార్యాచరణ కార్యక్రమం కింద భారత ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తోంది. వైద్య శిబిరాలు, క్రీడా పోటీల నిర్వహణ, స్థానిక సముదాయాలకు నిత్యావసర వస్తువుల పంపిణీ ఇందులో భాగంగా ఉన్నాయి.
2014 నుంచి ఈ కార్యక్రమం కింద ₹221.88 కోట్లు విడుదల చేశారు. భద్రతా దళాలు, స్థానిక సముదాయాల మధ్య అంతరాన్ని తగ్గించి, పరస్పర విశ్వాసాన్ని బలోపేతం చేసేందుకు ఈ నిధులు తోడ్పడ్డాయి.
గ్రామాలను కలిపే రహదారులు, సమాచార మార్పిడికి వీలు కల్పించే మొబైల్ టవర్లు, ఆర్థిక భాగస్వామ్యానికి దోహదపడే బ్యాంకులు, గిరిజన యువతకు అవకాశాల ద్వారాలు తెరిచే పాఠశాలలతో కూడిన ఈ మౌలిక సదుపాయాలు క్షేత్రస్థాయిలో నేరుగా సంక్షేమ ఫలితాలను అందించాయి. నిజమైన సంక్షేమం, గౌరవం, సాంస్కృతిక పునరుజ్జీవనాన్ని అందించేందుకు అవసరమైన భౌతిక, సంస్థాగత వేదికను సృష్టించాయి.


నిరంతర మౌలిక సదుపాయాల అభివృద్ధి ద్వారా ప్రభావిత ప్రాంతాల్లో చేపట్టిన సమగ్ర అభివృద్ధి ప్రాంతీయ సమైక్యతను బలోపేతం చేస్తోంది. మెరుగైన అనుసంధానం ఆర్థిక అవకాశాలు, రాకపోకలకు ఊతమిస్తోంది. దీర్ఘకాలిక పెట్టుబడులు శాశ్వత, సమ్మిళిత వృద్ధికి మార్గాలను సృష్టిస్తున్నాయి.
మీకు తెలుసా: ప్రస్తుతం దేశంలోని 37 జిల్లాలను ‘లెగసీ’, ‘థ్రస్ట్’ జిల్లాలుగా వర్గీకరించి, నిరంతర భద్రత, అభివృద్ధి సహాయం అందిస్తున్నారు. నిరంతర నిఘా, సాధించిన ఫలితాల స్థిరీకరణ కోసం ఒక జిల్లాను ‘ఆందోళనకర జిల్లా’ విభాగంలో చేర్చారు.
ప్రజా సంక్షేమం–గౌరవం
వ్యూహంలోని ఈ చివరి కార్యాచరణ మార్గం గౌరవం, సమ్మిళితత్వంతో సంక్షేమ సేవల పంపిణీకి ప్రాధాన్యం ఇస్తోంది. అణగారిన సముదాయాలకు చివరి అంచె వరకు సేవల పంపిణీని బలోపేతం చేస్తోంది. అత్యవసర ప్రజా సేవలు అందరికీ సమానంగా అందేలా ఈ విధానం చూస్తోంది.
గిరిజన జీవనోపాధికి బలం
అభివృద్ధిని విస్తరించడం, అవకాశాల అందుబాటును మెరుగుపరచడం, గిరిజన సముదాయాలకు ప్రజాస్వామ్య సంస్థలతో అనుబంధాన్ని బలోపేతం చేయడం ద్వారా గిరిజన సంక్షేమంపై నిరంతర దృష్టి వామపక్ష తీవ్రవాద ప్రభావాన్ని తగ్గించడంలో కీలక పాత్ర పోషించింది. భద్రతా చర్యలతో పాటు మెరుగైన విద్య, మౌలిక సదుపాయాలు, ఆరోగ్య సంరక్షణ, గృహవసతి, జీవనోపాధి సహాయం ద్వారా మారుమూల గిరిజన ప్రాంతాలకు అభివృద్ధి చేరేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది.
లొంగిపోయిన సభ్యుల పునరావాస వ్యవస్థ నైపుణ్యాభివృద్ధి, జీవనోపాధి సహాయం, ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద గృహవసతి, స్వయం ఉపాధికి ఆర్థిక సహాయం ద్వారా వారు జనజీవన స్రవంతిలో కలిసేందుకు ప్రోత్సహించింది. నక్సల్ ప్రభావాన్ని తొలగించి, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన పంచాయతీలను ఏర్పాటు చేసుకున్న గ్రామాలకు అభివృద్ధి నిధులు అందించారు. లొంగిపోయిన సభ్యుల పిల్లలకు 12వ తరగతి వరకు ఉచిత విద్య కల్పించి, ఆ కుటుంబాలు మరింత సురక్షిత భవిష్యత్‌ను నిర్మించుకునేలా తోడ్పడింది.

లక్షిత కార్యక్రమాలు ఈ పరివర్తనను వేగవంతం చేశాయి. జాతీయ విధానం–కార్యాచరణ ప్రణాళిక భద్రత, అభివృద్ధి, సముదాయ హక్కుల పరిరక్షణను సమన్వయం చేసింది. అత్యంత ప్రభావిత జిల్లాల్లో కీలక ప్రజా మౌలిక సదుపాయాలను ప్రత్యేక కేంద్ర సహాయం ద్వారా నిర్మించారు. ఆరోగ్యం, విద్య, ఆర్థిక సమ్మిళితం, అనుసంధానంలో మెరుగైన ఫలితాలు సాధించేందుకు ఆకాంక్షిత జిల్లాల కార్యక్రమం అనేక సంక్షేమ పథకాలను సమన్వయం చేసింది.
పరివర్తనలో విద్య కీలక మూలస్తంభంగా అవతరించింది. ఏకలవ్య ఆదర్శ గురుకుల పాఠశాలలకు (ఈఎంఆర్‌ఎస్) మద్దతు పెంచడం ద్వారా వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాలతో సహా షెడ్యూల్డ్ తెగల పిల్లలకు నాణ్యమైన గురుకుల విద్య అందుబాటును విస్తరించారు. గృహవసతి, సురక్షిత తాగునీరు, విద్య, ఆరోగ్య సంరక్షణ, అత్యవసర అనుసంధానాన్ని మెరుగుపరచడం ద్వారా పీఎం–జన్‌మన్ కార్యక్రమం ప్రత్యేకంగా దుర్బల గిరిజన సమూహాలపై (పీవీటీజీలు) మరింత దృష్టి సారించింది. తగిన సేవలు అందని సముదాయాలను ప్రధాన అభివృద్ధి స్రవంతిలోకి తీసుకురావడంలో తోడ్పడింది.
ధర్తీ ఆబా జనజాతీయ గ్రామ ఉత్కర్ష్ అభియాన్ ప్రారంభంతో గిరిజన గ్రామాల్లో మౌలిక సదుపాయాల లోటును తగ్గించే ప్రయత్నాలు మరింత బలోపేతమయ్యాయి.
అనేక మంత్రిత్వ శాఖల సమన్వయ చర్యల ద్వారా జీవన ప్రమాణాలను మెరుగుపరచడం, ఆర్థిక అవకాశాలను విస్తరించడం, భారత అభివృద్ధి ప్రయాణంలో గిరిజన సముదాయాల సంపూర్ణ భాగస్వామ్యం ఉండేలా చూడటం ఈ కార్యక్రమాల లక్ష్యం.
కేస్ స్టడీ: నక్సలిజం నుంచి అభివృద్ధి దిశగా ఛత్తీస్‌గఢ్ ప్రయాణం
ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ దశాబ్దాలపాటు దేశంలో అత్యధిక నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో ఒకటిగా ఉండేది. పరిమిత అనుసంధానం, బలహీన పాలనా ఉనికి, క్లిష్టమైన భౌగోళిక పరిస్థితులు తీవ్రవాద సంస్థలు బలమైన స్థావరాన్ని ఏర్పాటు చేసుకునేందుకు వీలు కల్పించాయి. గత 12 ఏళ్లలో భద్రత, అభివృద్ధి, గిరిజన భాగస్వామ్యంతో కూడిన సమన్వయ వ్యూహం ఈ ప్రాంత గమనాన్ని మార్చింది.
2017లో బస్తరియా బెటాలియన్ ఏర్పాటు కీలక మలుపుగా నిలిచింది. బీజాపూర్, సుక్మా, దంతెవాడకు చెందిన దాదాపు 400 మంది స్థానిక యువతతో సహా 1,143 మందిని ఈ బెటాలియన్‌లో నియమించారు. స్థానిక భాగస్వామ్యం నిఘా వ్యవస్థలను బలోపేతం చేసింది. భద్రతా దళాలు, గిరిజన సముదాయాల మధ్య విశ్వాసాన్ని మెరుగుపరచి, ప్రభుత్వ సంస్థలపై నమ్మకాన్ని పునరుద్ధరించేందుకు తోడ్పడింది.

భద్రతా పరిస్థితులు మెరుగుపడటంతో అభివృద్ధి వేగం పుంజుకుంది. బస్తర్, బీజాపూర్, దంతెవాడ, సుక్మా, నారాయణ్‌పూర్, కాంకేర్, కొండగావ్ జిల్లాలతో కూడిన బస్తర్ ప్రాంతంలో 3,240 కిలోమీటర్లకు పైగా రహదారులు నిర్మించారు. డిజిటల్ అనుసంధానాన్ని మెరుగుపరచేందుకు 889 మొబైల్ టవర్లను కూడా ఏర్పాటు చేశారు. ఒకప్పుడు ఇతర ప్రాంతాలతో సంబంధాలు లేని గ్రామాలకు మార్కెట్లు, పాఠశాలలు, ఆరోగ్య సదుపాయాలు, బ్యాంకింగ్ సేవలు, ప్రభుత్వ కార్యక్రమాలతో అనుసంధానం ఏర్పడింది.
పునరావాసం, పునరేకీకరణపై కూడా ప్రభుత్వం దృష్టి సారించింది. లొంగిపోయిన దాదాపు 3,000 మంది సభ్యుల కోసం ప్రత్యేక ప్రణాళికను రూపొందించి, నైపుణ్యాభివృద్ధి, విద్య, జీవనోపాధి అవకాశాలకు ప్రారంభ కేటాయింపుగా ₹20 కోట్లు అందించింది. హింసా చక్రం స్థానంలో ఆర్థిక సాధికారతకు మార్గాలను సృష్టించడం ఈ కార్యక్రమ లక్ష్యం.
భద్రతా విజయాలను శాశ్వత అభివృద్ధిగా మార్చేందుకు 2026 మేలో షహీద్ వీర్ గుండా ధుర్ సేవా డేరా కార్యక్రమాన్ని ప్రారంభించారు. దాదాపు 70 సీఏపీఎఫ్ శిబిరాలను ప్రభుత్వ పథకాలు, ఆరోగ్య సంరక్షణ, బ్యాంకింగ్, వ్యవసాయ సహాయం, నైపుణ్యాభివృద్ధి, ఇతర పౌర సేవలు అందించే కేంద్రాలుగా మారుస్తున్నారు. వీర్ గుండాధుర్ జన్మస్థలమైన నేతనార్‌లో ఉమ్మడి సేవా కేంద్రం ఏర్పాటు గతంలో తీవ్రవాద ప్రభావానికి గురైన ప్రాంతాలకు పాలన తిరిగి చేరిందనడానికి ప్రతీకగా నిలుస్తోంది.

మౌలిక సదుపాయాలు, సంక్షేమంతో పాటు బస్తర్ పండుమ్, బస్తర్ ఒలింపిక్స్ వంటి సాంస్కృతిక కార్యక్రమాలు సామాజిక భాగస్వామ్యం, గిరిజన గుర్తింపును బలోపేతం చేశాయి. లక్షలాది మంది గిరిజన యువత, కళాకారులను ఈ వేదికలు ఒకచోటికి తీసుకొచ్చాయి. సామాజిక సమైక్యతను ప్రోత్సహించి, భాగస్వామ్యం, నాయకత్వానికి కొత్త అవకాశాలను సృష్టించాయి.
భద్రతా చర్యల తర్వాత అభివృద్ధి, సంక్షేమ సేవల పంపిణీ, సామాజిక సాధికారత కొనసాగితేనే శాశ్వత శాంతి సాధ్యమని బస్తర్ పరివర్తన చాటుతోంది. నిరంతర ప్రభుత్వ ఉనికి, స్థానిక భాగస్వామ్యం, సమ్మిళిత వృద్ధి ద్వారా ఘర్షణ ప్రభావిత ప్రాంతాన్ని అభివృద్ధి, శ్రేయస్సు మార్గంలోకి ఎలా తీసుకురావచ్చో ఛత్తీస్‌గఢ్ అనుభవం స్పష్టం చేస్తోంది.
దశాబ్ద కాల పరివర్తన ఫలితాలు
వామపక్ష తీవ్రవాద ప్రభావిత జిల్లాల సంఖ్య 2014లో 126 నుంచి 2026 మార్చి–ఏప్రిల్ నాటికి సున్నాకు తగ్గింది. అత్యంత ప్రభావిత జిల్లాల సంఖ్య కూడా 35 నుంచి సున్నాకు చేరి, భద్రతా పరిస్థితుల్లో నిర్ణయాత్మక మార్పును తీసుకొచ్చింది.
హింసకు సంబంధించిన అన్ని ప్రధాన సూచికల్లో ఈ ప్రభావం కనిపించింది. నక్సలిజం చరిత్రలో అత్యంత ప్రాణాంతక దశల్లో ఒకటిగా నిలిచిన 2010లో 1,936 నక్సల్ సంబంధిత ఘటనలు, 1,005 మరణాలు నమోదయ్యాయి. ఆ తర్వాత నిరంతర భద్రతా కార్యకలాపాలు, అభివృద్ధి చర్యలు, మెరుగైన పాలన వామపక్ష తీవ్రవాద నెట్‌వర్క్‌లను గణనీయంగా బలహీనపరిచాయి. నక్సల్ సంబంధిత ఘటనలు 2014లో 870 నుంచి 2026లో కేవలం 33కు తగ్గాయి (2026 జూలై 29 నాటికి). ఇదే కాలంలో మరణాల సంఖ్య 310 నుంచి 11కు తగ్గింది.


హింస నిరంతరంగా తగ్గడం నక్సల్ సంస్థల కార్యాచరణ సామర్థ్యం బలహీనపడటంతో పాటు ప్రభావిత ప్రాంతాల్లో భద్రత, అనుసంధానం, ప్రజా విశ్వాసం క్రమంగా పునరుద్ధరణకు నిదర్శనంగా నిలుస్తోంది.
భద్రతా పరిస్థితుల్లో గణనీయమైన మెరుగుదలను ఈ ధోరణి ప్రతిబింబిస్తోంది. గతంలో తరచూ హింసకు గురైన ప్రాంతాల్లో శాంతి, ప్రజా భద్రత గణనీయంగా మెరుగుపడ్డాయి.
భారత భద్రత–అభివృద్ధి ప్రస్థానంలో నిర్ణయాత్మక అధ్యాయం
నక్సలిజం రహిత భారత్ సాధన స్వతంత్ర భారత చరిత్రలో అత్యంత కీలకమైన అంతర్గత భద్రతా విజయాల్లో ఒకటిగా నిలుస్తోంది. నిర్ణయాత్మక నాయకత్వం, నిరంతర విధాన అమలు, భద్రత–అభివృద్ధి–పునరావాసంతో కూడిన బహుముఖ వ్యూహ ప్రభావాన్ని ఇది ప్రతిబింబిస్తోంది.
గత దశాబ్దంలో వామపక్ష తీవ్రవాదంపై భారత్ తన విధానాన్ని ప్రతిస్పందనాత్మక నియంత్రణ నుంచి క్రియాశీల నిర్మూలన దిశగా మార్చింది. తదుపరి ప్రయాణం ఇప్పటికే ప్రారంభమైంది. నక్సలిజం రహిత భారత్ సాధన కేవలం ఒక తిరుగుబాటు ముగింపు మాత్రమే కాదు. దేశంలోని అత్యంత దుర్బల సముదాయాల్లో కొన్నింటికి శాంతి, సమ్మిళితత్వం, ప్రగతితో కూడిన కొత్త అధ్యాయానికి ఇది ఆరంభం.
References:
Click here to see pdf
***
(Explainer ID: 159434)
आगंतुक पटल : 9
Provide suggestions / comments