Economy
జీఐ ట్యాగ్‌లు: ప్రపంచ బ్రాండ్లుగా సంప్రదాయ సంపద విస్తరణ
Posted On:
04 AUG 2026 9:28AM
భారత సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షిస్తూ స్థానిక సముదాయాలకు ఆర్థిక అవకాశాలు కల్పించే శక్తిమంతమైన సాధనంగా భౌగోళిక సూచిక (జీఐ) ట్యాగ్‌లు అవతరించాయి. ఉత్పత్తులను వాటి మూల ప్రాంతాలతో అనుసంధానించడం ద్వారా జీఐ ట్యాగ్‌లు సంప్రదాయ విజ్ఞానాన్ని పరిరక్షిస్తాయి. దుర్వినియోగాన్ని అడ్డుకుంటాయి. వినియోగదారుల్లో నమ్మకాన్ని పెంచుతాయి. కళాకారులు, నేత కార్మికులు, రైతులు, ఉత్పత్తిదారుల సంఘాలు మార్కెట్‌లో మెరుగైన గుర్తింపు పొందేందుకు, అధిక ధరలు లభించే మార్కెట్లలోకి ప్రవేశించేందుకు ఇవి తోడ్పడతాయి. పటిష్టమైన చట్టపరమైన వ్యవస్థ, ప్రజల్లో పెరుగుతున్న అవగాహన మద్దతుతో భారత జీఐ వ్యవస్థ కొన్నేళ్లుగా గణనీయంగా విస్తరించింది. ఆర్థిక సహాయం, ఎగుమతుల ప్రోత్సాహం, పర్యాటక రంగంతో అనుసంధానం, ప్రత్యేక మార్కెటింగ్ వేదికల ద్వారా ప్రభుత్వ కార్యక్రమాలు ఈ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తున్నాయి. ఈ ప్రయత్నాలన్నీ కలిసి జీఐ ఉత్పత్తులను గ్రామీణాభివృద్ధి, సాంస్కృతిక పరిరక్షణ, ఎగుమతి ఆధారిత వృద్ధికి చోదకశక్తులుగా మారుస్తున్నాయి.
భారత విశిష్ట ఉత్పత్తులకు జీఐ ట్యాగ్‌తో రక్షణ
బనారస్‌కు చెందిన ఓ నేత కార్మికుడు ఒక్క బనారసీ చీరను రూపొందించేందుకు వారాల తరబడి శ్రమిస్తారు. క్లిష్టమైన జరీ పనిలోని ప్రతి పోగును అసాధారణ నైపుణ్యం, కచ్చితత్వంతో నేస్తారు. ఈ పద్ధతులను ఒక్క రాత్రిలో నేర్చుకోవడం సాధ్యం కాదు. శతాబ్దాల నాటి సంప్రదాయాన్ని పరిరక్షిస్తూ వీటిని తరతరాలుగా అందిస్తున్నారు.

ఇంత శ్రమ, నైపుణ్యం ఉన్నప్పటికీ అసలైన బనారసీ చీరలను వాటి వాస్తవ విలువ కంటే చాలా తక్కువ ధరలకు విక్రయించే సందర్భాలు అనేకం. చేతితో నేసిన అసలైన చీరకు, నకిలీ ఉత్పత్తులకు మధ్య తేడాను కొనుగోలుదారులు ప్రతిసారీ గుర్తించలేకపోవచ్చు. ఇలాంటి సందర్భాల్లో ‘జీఐ ట్యాగ్’ (భౌగోళిక సూచిక) అనే రెండు పదాలు ఎంతో కీలకంగా మారతాయి.
సంప్రదాయ పద్ధతుల్లో బనారస్‌లోనే చీరను తయారు చేసినట్లు జీఐ ట్యాగ్ ధ్రువీకరిస్తుంది. దాని ప్రామాణికత, నాణ్యత, సాంస్కృతిక వారసత్వంపై కొనుగోలుదారులకు భరోసా ఇస్తుంది. ఫలితంగా అసలైన బనారసీ చీరకు దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లలో గణనీయంగా అధిక ధర లభిస్తుంది. నేత కార్మికుడి నైపుణ్యానికి మరింత గుర్తింపుతో పాటు మెరుగైన ఆర్థిక ప్రతిఫలం లభించేలా ఇది దోహదం చేస్తుంది.
భారత సంప్రదాయం, ఆర్థిక వ్యవస్థ, సుస్థిరతలో జీఐ ఉత్పత్తుల ప్రాధాన్యం
హస్తకళా ఉత్పత్తుల ప్రామాణికతకు జీఐ ట్యాగ్ ముద్రగా నిలుస్తూ నకిలీలు, దుర్వినియోగం, అనధికార వాణిజ్యం నుంచి వాటిని కాపాడుతుంది. అయితే దీని ప్రాధాన్యం చట్టపరమైన రక్షణకే పరిమితం కాదు. ఉదాహరణకు, చన్నపట్న బొమ్మలకు 2006లో జీఐ గుర్తింపు లభించింది. కర్ణాటకలోని చన్నపట్న ప్రాంతంలో తయారయ్యే చెక్క బొమ్మలకు మాత్రమే ఈ గుర్తింపు వర్తిస్తుంది. ఆ ప్రాంతానికి ప్రత్యేకమైన లక్క కళను ఉపయోగించి ఈ బొమ్మలను తయారు చేయాలి. ఇది సాధారణ ధ్రువీకరణగా కనిపించినప్పటికీ విస్తృత ప్రయోజనాలను అందించగలదు.
జీఐ ట్యాగ్ కేవలం ఒక గుర్తింపు కాదు. కేంద్ర జౌళి మంత్రిత్వ శాఖ ప్రకారం.. ఇది గ్రామీణ కళాకారుల ఆదాయాన్ని 20–30 శాతం వరకు పెంచగలదు!

ఒక ఉత్పత్తి మూల ప్రాంతం, ప్రత్యేక వారసత్వాన్ని ధ్రువీకరించడం ద్వారా జీఐ ట్యాగ్‌లు కొనుగోలుదారుల్లో విశ్వాసాన్ని నింపి, మార్కెట్‌లో ఆ ఉత్పత్తికి ఆకర్షణను పెంచుతాయి.
* ప్రామాణికత, సంప్రదాయం, నైపుణ్యంతో రూపొందిన వస్తువుల కోసం వినియోగదారుల ఆసక్తి పెరుగుతున్న తరుణంలో నాణ్యత, సాంస్కృతిక విశిష్టతకు జీఐ గుర్తింపు శక్తిమంతమైన చిహ్నంగా నిలుస్తోంది.
* జీఐ ట్యాగ్ పొందిన ఉత్పత్తులకు పెరుగుతున్న డిమాండ్ వల్ల కళాకారులకు మరింత గుర్తింపు లభిస్తుంది. అధిక ధరలు లభించే మార్కెట్లలోకి ప్రవేశించేందుకు, బేరసారాల సామర్థ్యాన్ని పెంచుకునేందుకు, తమ శ్రమ ద్వారా ఏర్పడే విలువలో ఎక్కువ వాటా పొందేందుకు అవకాశం కలుగుతుంది.
* ఈ గుర్తింపు సుస్థిర జీవనోపాధి అవకాశాలను సృష్టిస్తుంది. భారత సుసంపన్నమైన సాంస్కృతిక వారసత్వం, దేశీయ హస్తకళా నైపుణ్యాన్ని భవిష్యత్ తరాల కోసం పరిరక్షించి, ప్రోత్సహించడంలో కూడా జీఐ ట్యాగ్‌లు కీలక పాత్ర పోషిస్తాయి.
ముజఫర్‌నగర్ బెల్లం విజయగాథ: స్థానిక ప్రత్యేకత నుంచి ప్రపంచ మార్కెట్లకు
ముజఫర్‌నగర్ బెల్లానికి లభించిన జీఐ ట్యాగ్ ప్రత్యేక నాణ్యత, మూల ప్రాంతం కలిగిన అత్యుత్తమ ఉత్పత్తిగా దాని గుర్తింపును బలోపేతం చేసింది. ఈ గుర్తింపును సద్వినియోగం చేసుకున్న బృజ్‌నందన్ ఆగ్రో ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ 2025లో 30 మెట్రిక్ టన్నుల బెల్లాన్ని బంగ్లాదేశ్‌కు విజయవంతంగా ఎగుమతి చేసింది. జీఐ ధ్రువీకరణ కొనుగోలుదారుల్లో విశ్వాసాన్ని పెంచి, అంతర్జాతీయ మార్కెట్లలో ఉత్పత్తి విక్రయ అవకాశాలను మెరుగుపరిచింది.

ఫలితంగా రైతుల నేతృత్వంలోని ఈ కంపెనీ ఎగుమతి అవకాశాలను అందుకుంది. తన 545 మంది సభ్యులకు ఆదాయ అవకాశాలను పెంచడంతో పాటు స్థానికంగా ఉత్పత్తి చేసిన బెల్లానికి అధిక విలువను సృష్టించింది.
మీకు తెలుసా?
భారత్‌లో 800కు పైగా నమోదిత జీఐ ఉత్పత్తులు ఉన్నాయి. 2014 నుంచి 607 జీఐలకు గుర్తింపు లభించింది.
పశ్చిమ బెంగాల్‌కు చెందిన డార్జిలింగ్ తేయాకు భారత్‌లో జీఐ ట్యాగ్ పొందిన తొలి ఉత్పత్తి. ఉత్పత్తితో పాటు దాని లోగోకు కూడా రక్షణ లభించింది. కేరళకు చెందిన సంప్రదాయ హస్తకళా ఉత్పత్తి ఆరన్ముల కన్నడి, తెలంగాణకు చెందిన ప్రసిద్ధ వస్త్ర కళ పోచంపల్లి ఇకత్ తొలి దశలో నమోదైన ఇతర ఉత్పత్తుల్లో ఉన్నాయి.
గత పదేళ్లలో జీఐ ట్యాగ్‌ల అధీకృత వినియోగదారుల సంఖ్య 365 నుంచి 29,000కు పెరిగింది (2025 జనవరి నాటికి).
భారత జీఐ ఉత్పత్తులకు బ్రిటన్, ఇటలీ, యూఏఈ, బహ్రెయిన్, ఖతార్, అమెరికా, దక్షిణ కొరియా ప్రధాన ఎగుమతి గమ్యస్థానాలుగా ఉన్నాయి.
జీఐ నియంత్రణ
మేధో సంపత్తిలో ఒక రూపమైన భౌగోళిక సూచికలకు పారిశ్రామిక సంపత్తి పరిరక్షణకు సంబంధించిన పారిస్ ఒప్పందం, ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీఓ) పరిధిలోని వాణిజ్య సంబంధిత మేధో సంపత్తి హక్కుల ఒప్పందం (ట్రిప్స్) కింద అంతర్జాతీయ గుర్తింపు ఉంది. భారత్‌లో 1999 చట్టం కింద ఏర్పాటైన భౌగోళిక సూచికల రిజిస్ట్రీ వాటి నమోదు, రక్షణను పర్యవేక్షిస్తుంది.
2025 సవరణ ద్వారా జీఐ దరఖాస్తుల దాఖలు, సంబంధిత ప్రక్రియల రుసుమును 80 శాతం తగ్గించారు. ట్యాగ్ పునరుద్ధరణ రుసుమును కూడా ₹3,000 నుంచి కేవలం ₹500కు తగ్గించారు!
నిర్దిష్ట ప్రాంతాలతో అనుబంధం కలిగిన ఉత్పత్తుల పరిరక్షణ కోసం భౌగోళిక సూచికల వస్తువుల (నమోదు, రక్షణ) చట్టం–1999, దానికి అనుబంధంగా 2002లో ప్రకటించిన నిబంధనల ద్వారా భారత్ చట్టపరమైన వ్యవస్థను ఏర్పాటు చేసింది. ఈ వ్యవస్థ 2003లో అమలులోకి రాగా, 2004–05లో జీఐ నమోదులు ప్రారంభమయ్యాయి. భౌగోళిక సూచికల వస్తువుల (నమోదు, రక్షణ) నిబంధనలు–2002ను 2025లో సవరించారు.
జీఐ ట్యాగ్ ఉత్పత్తులు కలిగిన ప్రధాన రంగాలు, రాష్ట్రాలు
హస్తకళలు, వ్యవసాయ ఉత్పత్తులు, తయారీ వస్తువులు, ఆహార ఉత్పత్తులు, సహజ ఉత్పత్తులు వంటి విభాగాల్లో భారత్ అనేక జీఐ ట్యాగ్ ఉత్పత్తులకు నిలయంగా ఉంది.
* హస్తకళా ఉత్పత్తులు– చట్టం కింద 445 హస్తకళా ఉత్పత్తులు, 27 ఉత్పత్తుల లోగోలను నమోదు చేశారు (2025 డిసెంబరు నాటికి). జమ్మూ-కశ్మీర్‌కు చెందిన పష్మీనా, పశ్చిమ బెంగాల్‌కు చెందిన బాలుచరి చీర, ఉత్తరప్రదేశ్‌కు చెందిన బనారస్ గులాబీ మీనాకారీ కళ వీటికి ఉదాహరణలు.
* వ్యవసాయ ఉత్పత్తులు– తృణధాన్యాలు, పండ్లు, కూరగాయలు, సుగంధ ద్రవ్యాలు, బాస్మతీయేతర బియ్యం సహా విభిన్న పంటలకు చెందిన 251 ఉత్పత్తులను నమోదు చేశారు.
* తయారీ ఉత్పత్తులు– నాసిక్ వ్యాలీ వైన్, కనౌజ్ పరిమళ ద్రవ్యం వంటి 64 తయారీ ఉత్పత్తులను నమోదు చేశారు.
* ఆహార ఉత్పత్తులు– సిద్ధం చేసిన, వండిన లేదా శుద్ధి చేసిన వంటకాలతో కూడిన 66 ఆహార ఉత్పత్తులు జీఐ ట్యాగ్ పొందాయి. ఉదాహరణకు పశ్చిమ బెంగాల్‌కు చెందిన బర్ధమాన్ మిహిదానా, సీతాభోగ్, ఒడిశాకు చెందిన కేంద్రపారా రసబలి, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ప్రసిద్ధ తిరుపతి లడ్డూ ఉన్నాయి.
* సహజ ఉత్పత్తులు– మక్రానా మార్బుల్ (రాజస్థాన్), చునార్ బలువా పత్తర్ (ఉత్తరప్రదేశ్), పురూలియా లక్క (పశ్చిమ బెంగాల్), పన్నా వజ్రం (మధ్యప్రదేశ్), అంబాజీ వైట్ మార్బుల్ (గుజరాత్) అనే ఐదు సహజ ఉత్పత్తులు భారత్‌లో జీఐ ట్యాగ్ పొందాయి. ఇవి పూర్తిగా ‘సహజ’ ఉత్పత్తులు కాగా, సహజ మూలాలు కలిగిన వందలాది ఇతర వస్తువులు వ్యవసాయ ఉత్పత్తుల విభాగంలో ఉన్నాయి.
భారత జీఐ వారసత్వాన్ని అనేక రాష్ట్రాలు ముందుకు తీసుకెళ్తున్నాయి. 2025 డిసెంబరు నాటికి 81 జీఐ ట్యాగ్ ఉత్పత్తులతో ఉత్తరప్రదేశ్ అగ్రస్థానంలో ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో తమిళనాడు (76 జీఐ ట్యాగ్ ఉత్పత్తులు), మహారాష్ట్ర (55 జీఐ ట్యాగ్ ఉత్పత్తులు) ఉన్నాయి.

జీఐ ట్యాగ్ వెనుక ప్రక్రియ: నమోదు, రక్షణ, పునరుద్ధరణ
ఒక ఉత్పత్తి ధ్రువీకరణ పొందే ముందు నిర్దిష్ట చట్టపరమైన, విధానపరమైన నిబంధనలను పాటించాలి. ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు, రక్షణ ఎంతకాలం కొనసాగుతుంది, ఏ పరిస్థితుల్లో జీఐ గుర్తింపును రద్దు చేయవచ్చు అనే అంశాలను భారత జీఐ నమోదు వ్యవస్థ నిర్వచిస్తుంది.

జీఐ నమోదు వ్యవస్థ
ఉత్పత్తిదారుల సంఘం, సంస్థ లేదా చట్టం కింద ఏర్పాటైన అధీకృత విభాగం జీఐ నమోదు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుదారు చట్టబద్ధమైన సంస్థగా ఉంటూ సంబంధిత ఉత్పత్తిదారుల ప్రయోజనాలకు ప్రాతినిధ్యం వహించాలి. దరఖాస్తుదారు ఉత్పత్తిదారుల సంఘం కానట్లయితే, తాను ఉత్పత్తిదారుల ప్రయోజనాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నట్లు నిరూపించాలి. ఇదే విధంగా నమోదు కోసం దరఖాస్తు చేసే అధీకృత విభాగం కూడా ఆ ఉత్పత్తిదారులకు ప్రాతినిధ్యం వహిస్తున్నట్లు నిరూపించాలి.
దరఖాస్తు లేదా ఇతర పత్రాన్ని నేరుగా జీఐ రిజిస్ట్రీలో దాఖలు చేయవచ్చు. సాధారణ పోస్టు, రిజిస్టర్డ్ పోస్టు, స్పీడ్ పోస్టు లేదా కొరియర్ సేవల ద్వారా కూడా పంపవచ్చు. దేశవ్యాప్త అధికార పరిధి కలిగిన భౌగోళిక సూచికల రిజిస్ట్రీ చెన్నైలో ఉంది.
జీఐ మినహాయింపులు: నమోదు చేయలేనివి
* మూల దేశంలో ఇకపై రక్షణ లేని సాధారణ ఉత్పత్తుల పేర్లు.
* వినియోగదారులను తప్పుదోవ పట్టించే లేదా వేరే భౌగోళిక మూలాన్ని తప్పుగా సూచించే గుర్తింపులు.
* మతపరమైన మనోభావాలను దెబ్బతీసే లేదా అభ్యంతరకరమైన, అవమానకరమైన, అశ్లీల అంశాలు కలిగిన గుర్తింపులు.
* చట్టపరమైన రక్షణకు అర్హత లేని లేదా అమలులో ఉన్న ఏదైనా చట్టాన్ని ఉల్లంఘించే గుర్తింపులు.
జీఐ నమోదు పదేళ్లపాటు చెల్లుబాటులో ఉంటుంది. కాలానుగుణంగా దానిని పునరుద్ధరించుకోవచ్చు.
జీఐ ట్యాగ్‌ను రద్దు చేయవచ్చా?
జీఐ నమోదును ఉపసంహరించడం, రద్దు చేయడం లేదా మార్చడం చట్టంలోని సెక్షన్ 27 పరిధిలోకి వస్తుంది. నమోదిత జీఐని రద్దు చేయాలని లేదా మార్చాలని బాధిత వ్యక్తి రిజిస్ట్రార్ లేదా సంబంధిత అధీకృత సంస్థకు దరఖాస్తు చేసుకోవచ్చు. అవసరమైతే రిజిస్ట్రార్ లేదా అప్పీలేట్ బోర్డు సొంతంగా కూడా అలాంటి చర్యను ప్రారంభించవచ్చు.
కింది పరిస్థితుల్లో జీఐ నమోదును ఉపసంహరించవచ్చు లేదా రద్దు చేయవచ్చు:
* మోసం లేదా తప్పుడు సమాచారం ద్వారా దాన్ని పొందినప్పుడు.
* మూల దేశంలో దానికి ఇకపై రక్షణ లేనప్పుడు లేదా వినియోగం నిలిచిపోయినప్పుడు.
* దాని వినియోగం వినియోగదారులను మోసగించే అవకాశం ఉన్నప్పుడు, ఏదైనా చట్టాన్ని ఉల్లంఘించినప్పుడు లేదా అభ్యంతరకరమైన, అశ్లీల అంశాలు కలిగి ఉన్నప్పుడు.
జీఐ ట్యాగ్‌లకు బలం చేకూరుస్తున్న పథకాలు, విధానాలు
అవగాహన, మార్కెట్ అవకాశాలు, ఎగుమతులు, చట్టపరమైన రక్షణను మెరుగుపరిచే కార్యక్రమాల ద్వారా ప్రభుత్వం జీఐ ఉత్పత్తులను ప్రోత్సహిస్తోంది. ఆత్మనిర్భర్ భారత్, వోకల్ ఫర్ లోకల్ దార్శనికతకు అనుగుణంగా ఈ ప్రయత్నాలు కళాకారులు, రైతులు, ఉత్పత్తిదారుల సముదాయాలకు సాధికారత కల్పిస్తున్నాయి. భారత విశిష్ట ప్రాంతీయ ఉత్పత్తులకు దేశీయ, ప్రపంచస్థాయి గుర్తింపును కూడా పెంచుతున్నాయి.
ప్రత్యేక విక్రయ కేంద్రాలు, మౌలిక సదుపాయాలు
ఉత్పత్తులకు మరింత గుర్తింపు కల్పించడం, కొనుగోలుదారులను చేరుకునే అవకాశాలను బలోపేతం చేయడం, సంప్రదాయ ఉత్పత్తిదారులకు కొత్త అవకాశాలు సృష్టించడం కోసం కొన్ని ప్రత్యేక వేదికలను ప్రవేశపెట్టారు.
* పీఎం ఏక్తా మాల్ (యూనిటీ మాల్): ఒక జిల్లా–ఒక ఉత్పత్తి (ఓడీఓపీ) వస్తువులు, జీఐ ట్యాగ్ ఉత్పత్తులు, ఇతర హస్తకళా వస్తువులను పీఎం ఏక్తా మాల్స్ ప్రోత్సహించి విక్రయిస్తాయి. అన్ని రాష్ట్రాల్లో ఈ మాల్స్ ఏర్పాటుకు ₹5,000 కోట్లు కేటాయించారు (2023–24 ఆర్థిక సంవత్సరం).
* ఒక స్టేషన్–ఒక ఉత్పత్తి (ఓఎస్ఓపీ): ఓఎస్ఓపీ కార్యక్రమం కింద రైల్వే జీఐ కేంద్రాలు జీఐ ట్యాగ్ ఉత్పత్తుల ప్రదర్శన, విక్రయాలకు ప్రత్యేక స్టాళ్లను అందిస్తున్నాయి. ప్రాంతీయ హస్తకళలు, వస్త్రాలు, చేనేత వస్తువులు, ఆహార ఉత్పత్తులకు ఇవి విస్తృత ప్రచారం కల్పిస్తాయి. కళాకారులు, నేత కార్మికులు, రైతులు, ఉత్పత్తిదారుల సంఘాలకు ఓఎస్ఓపీ కేంద్రాలు ప్రత్యక్ష మార్కెట్ సదుపాయం అందిస్తాయి.
జీఐ పర్యాటక మార్గాలు
జీఐ ఉత్పత్తుల సమూహాలను ప్రధాన పర్యాటక ప్రణాళికల్లో అనుసంధానిస్తున్నారు. ఫ్రాన్స్‌లోని వైన్ పర్యటనల తరహాలో పోచంపల్లి ఇకత్ నేత గ్రామ పర్యటన లేదా డార్జిలింగ్ తేయాకు తోటల మార్గం వంటి జీఐ పర్యాటక మార్గాలను భారత్ ప్రయోగాత్మకంగా చేపడుతోంది. ఇది అనుభవ ఆధారిత పర్యాటకాన్ని గ్రామీణ ప్రాంతాల నుంచి వినియోగదారులకు నేరుగా జరిగే విక్రయాలతో మేళవిస్తుంది.
2026 జూన్‌లో అస్సాంలో ముగా సిల్క్ ట్రయల్‌తో పాటు సిల్క్ టూరిజం పార్కు, ముగా ఉత్సవ్‌లను ప్రకటించారు. పట్టు వారసత్వ పర్యాటకంలో అస్సాంను ప్రముఖ గమ్యస్థానంగా ఇది నిలుపుతోంది.
ఎంఎస్ఎంఈ ఇన్నోవేటివ్ పథకం
జీఐలతో సహా మేధో సంపత్తి రక్షణ, వాణిజ్య వినియోగానికి ఎంఎస్ఎంఈ ఇన్నోవేటివ్ పథకంలోని మేధో సంపత్తి హక్కుల (ఐపీఆర్) విభాగం కింద మద్దతు అందిస్తున్నారు. ఈ పథకంలో అర్హతగల దరఖాస్తుదారులు జీఐ నమోదు కోసం చేసిన వాస్తవ వ్యయాన్ని తిరిగి పొందవచ్చు. నమోదైన ఒక్కో జీఐకి గరిష్ఠంగా ₹2 లక్షల పరిమితికి లోబడి మొత్తం వ్యయంలో 100 శాతం వరకు తిరిగి చెల్లిస్తారు.
ఆర్థిక సహాయం
కేంద్ర జౌళి మంత్రిత్వ శాఖ పరిధిలోని అభివృద్ధి కమిషనర్ (హస్తకళలు) కార్యాలయం జీఐ రక్షణకు ఆర్థిక సహాయం అందిస్తోంది. జీఐ హక్కుల అమలు, వాటి రక్షణకు సంబంధించిన న్యాయ వ్యయాల కోసం అర్హతగల దరఖాస్తుదారులు ₹1.5 లక్షల వరకు పొందవచ్చు. దీనికి తోడు జాతీయ చేనేత అభివృద్ధి కార్యక్రమం (ఎన్‌హెచ్‌డీపీ), జాతీయ హస్తకళల అభివృద్ధి కార్యక్రమం (ఎన్‌హెచ్‌డీపీ) కింద ప్రభుత్వం ఉత్పత్తులను ప్రోత్సహిస్తోంది. డిజైన్లు/ఉత్పత్తుల నమోదు వ్యయం, అమలు సంస్థల సిబ్బందికి శిక్షణ, జీఐ నమోదు సమర్థ అమలుకు ఆర్థిక సహాయం అందిస్తున్నారు.
ఎన్‌హెచ్‌డీపీలో భాగమైన చేనేత మార్కెటింగ్ సహాయం కింద 104 జీఐ నమోదిత చేనేత ఉత్పత్తులు, 53 నమోదులకు మద్దతు లభిస్తోంది (2026 జూన్).
ఏపీఈడీఏ(అపెడా) ఎగుమతి కార్యక్రమాలు
వ్యవసాయ, శుద్ధి చేసిన ఆహార ఉత్పత్తుల ఎగుమతి అభివృద్ధి ప్రాధికార సంస్థ(ఏపీఈడీఏ-అపెడా) భారత జీఐ ట్యాగ్ వ్యవసాయ ఉత్పత్తుల ప్రపంచస్థాయి ఉనికిని బలోపేతం చేస్తోంది. నాణ్యత మెరుగుదల, సామర్థ్య నిర్మాణం, మౌలిక సదుపాయాల మద్దతు, మార్కెట్ ప్రోత్సాహం ద్వారా రైతులు, ఎగుమతిదారులకు సహకారం అందిస్తోంది.
2026లో రైతులు, ఉత్పత్తిదారుల సంఘాలకు కొత్త అంతర్జాతీయ మార్కెట్లను అందుబాటులోకి తీసుకురావడం ద్వారా జీఐ ట్యాగ్ ఉత్పత్తుల ఎగుమతులను ఏపీఈడీఏ వేగవంతం చేసింది. తాజా పండ్ల నుంచి సంప్రదాయ బియ్యం, శుద్ధి చేసిన ఆహార ఉత్పత్తుల వరకు తొలిసారిగా చేపట్టిన ఈ ఎగుమతులు భారత ప్రాంతీయ ప్రత్యేక ఉత్పత్తుల ప్రపంచస్థాయి ఉనికిని బలోపేతం చేశాయి. ఉత్పత్తిదారులకు మెరుగైన ప్రతిఫలాన్ని కూడా అందించాయి.
|
మార్కెట్
|
జీఐ ఉత్పత్తి
|
ప్రధాన ప్రభావం
|
|
మాల్దీవులు
|
కర్ణాటక జీఐ పండ్లు
|
రైతులకు 40–50 శాతం అధిక ప్రతిఫలం
|
|
కెనడా
|
సేలం సాగో
|
విస్తరించిన డిమాండ్, మెరుగైన ఆదాయం
|
|
బ్రిటన్, ఇటలీ
|
జోహా బియ్యం
|
కొత్త ఎగుమతి మార్కెట్లు, మెరుగైన ధర
|
|
దుబాయ్
|
తేజ్‌పూర్ లిచీ
|
సాగుదారులకు సుమారు 10 శాతం అధిక ధర
|

ఐరోపా సమాఖ్య–భారత్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంతో అనుసంధానం
విశిష్ట ప్రాంతీయ ఉత్పత్తులకు మార్కెట్ అవకాశాలను విస్తరించడం ద్వారా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు (ఎఫ్‌టీఏలు) జీఐల విలువను పెంచుతాయి. జీఐ ట్యాగ్‌లు ప్రామాణికత, మూల ప్రాంతాన్ని ధ్రువీకరిస్తే, ఎఫ్‌టీఏలు వాణిజ్య అవరోధాలను తగ్గించి ఎగుమతి అవకాశాలను మెరుగుపరుస్తాయి. పెరుగుతున్న ప్రాధాన్యానికి అనుగుణంగా భారత వాణిజ్య చర్చల్లో జీఐలు కీలక అంశంగా మారాయి–
* భారత్–ఒమన్ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం (సీఈపీఏ)పై సంతకాలు జరిగిన తర్వాత 2025 డిసెంబరులో కర్ణాటకకు చెందిన 3 మెట్రిక్ టన్నుల ఇండీ నిమ్మకాయలను ఒమన్‌కు ఎగుమతి చేశారు. జీఐ ట్యాగ్ పొందిన ఇండీ నిమ్మకాయలను ఒమన్‌కు ఎగుమతి చేయడం జీఐ ధ్రువీకరణ ద్వారా సమకూరే అదనపు విలువను చాటుతోంది.
* భారత జీఐ ఉత్పత్తుల నమోదుకు వీలు కల్పిస్తామని న్యూజిలాండ్ కూడా హామీ ఇచ్చింది. ప్రస్తుతం ఈ ప్రత్యేక సదుపాయం ఐరోపా సమాఖ్యకు మాత్రమే ఉంది. ఈ చర్య న్యూజిలాండ్ మార్కెట్‌లో డార్జిలింగ్ తేయాకు, బాస్మతి బియ్యం, ప్రాంతాలవారీ ప్రత్యేక హస్తకళలు వంటి భారత ఉత్పత్తులకు అధికారిక జీఐ రక్షణ కల్పిస్తుంది.
భారత్–ఐరోపా సమాఖ్య ఎఫ్‌టీఏ చర్చల్లో ప్రత్యేక జీఐ ఒప్పందంపై ఇరుపక్షాలు సంప్రదింపులు కొనసాగిస్తున్నాయి.
ప్రచార కార్యక్రమాలు
జీఐ ట్యాగ్ ఉత్పత్తుల ప్రదర్శన, మార్కెట్ల విస్తరణ, కళాకారులు, నేత కార్మికుల జీవనోపాధికి మద్దతు కోసం ప్రదర్శనలు, అవగాహన కార్యక్రమాలు, అంతర్జాతీయ వాణిజ్య వేడుకలను నిర్వహిస్తున్నారు.
* హస్తకళా ప్రదర్శనలు, ఢిల్లీ హాట్ కార్యక్రమాలు, ప్రత్యేక జీఐ ప్రచార కార్యక్రమాలు వీటిలో ఉన్నాయి. నేత కార్మికులు, కళాకారుల కోసం సదస్సులు, సెమినార్లు, కార్యశాలలను కూడా నిర్వహిస్తున్నారు.
* ‘జీఐ అండ్ బియాండ్: విరాసత్ సే వికాస్ తక్’ వంటి కార్యక్రమాలు జీఐ చేనేత ఉత్పత్తుల వారసత్వం, ప్రామాణికత, నైపుణ్యాన్ని ప్రదర్శిస్తాయి. దేశీయ, అంతర్జాతీయ ప్రేక్షకుల్లో అవగాహన పెంచేందుకు కూడా ఇవి తోడ్పడతాయి.
* ఇటీవల వరల్డ్ ఫుడ్ ఇండియా–2025, ట్రైబల్ బిజినెస్ కాన్‌క్లేవ్–2025, ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్–2026లో జీఐ ఉత్పత్తులను ప్రోత్సహించారు. వారణాసి, ఢిల్లీ, ముంబై విమానాశ్రయాలతో పాటు ఢిల్లీ మెట్రోలో కూడా తెరలు, ప్రదర్శన బోర్డులు, కన్వేయర్ బెల్టులు తదితర మార్గాల్లో వీటికి ప్రచారం కల్పిస్తున్నారు.
* దేశీయ కార్యక్రమాలతో పాటు భారత జీఐ ఉత్పత్తులకు సంబంధించిన ప్రత్యక్ష ప్రదర్శనలు, ఎగ్జిబిషన్లను విదేశాల్లో కూడా నిర్వహిస్తున్నారు. బ్రిటన్‌లోని బర్మింగ్‌హామ్‌లో నిర్వహించిన ఆటమ్ ఫెయిర్ ఇంటర్నేషనల్–2024, జర్మనీలోని బజార్ బెర్లిన్–2024 వీటికి ఉదాహరణలు.
భవిష్యత్ మార్గం: భారత జీఐ విజయగాథ విస్తరణ
భారత జీఐ వ్యవస్థ సంప్రదాయానికి, అవకాశాలకు మధ్య వారధిగా రూపుదిద్దుకుంటోంది. వారసత్వాన్ని పరిరక్షిస్తూ స్థానిక ఉత్పత్తిదారులకు సాధికారత కల్పించే జీఐ ట్యాగ్‌లు దీర్ఘకాలిక ఆర్థిక విలువను సృష్టిస్తాయి. దేశీయ, ప్రపంచ మార్కెట్లలో ప్రవేశ అవకాశాలను కూడా విస్తరిస్తాయి. భారత విశిష్ట ప్రాంతీయ ఉత్పత్తులు తరతరాల పాటు వర్ధిల్లేలా ఈ ప్రయత్నాలు భరోసా కల్పిస్తున్నాయి. 2030 నాటికి 10,000 జీఐ నమోదులు సాధించాలన్న లక్ష్యంతో భారత వారసత్వ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు విశిష్ట ప్రాంతీయ ఉత్పత్తుల ప్రపంచస్థాయి ఉనికిని మరింత పెంచేందుకు దేశం సన్నద్ధంగా ఉంది.
References
Ministry of Electronics & Information Technology
https://varanasi.nic.in/district-produce/banarasi-saree/
https://ariyalur.nic.in/geographical-indications/
Ministry of Law & Justice
https://www.indiacode.nic.in/bitstream/123456789/1981/5/A1999-48.pdf
https://ipindia.gov.in/frontend/pdf/mannual/GAZETTE_NOTIFICATION_AMENDED_GI_RULES_2025.pdf
https://www.indiacode.nic.in/handle/123456789/1981
https://www.indiacode.nic.in/bitstream/123456789/1981/1/a199948.pdf
Ministry of Tourism
https://www.incredibleindia.gov.in/en/karnataka/channapatna-toys-and-dolls
https://www.indiator.com/package/a-day-excursion-to-textile-village-pochampally-from-hyderabad
https://www.incredibleindia.gov.in/en/west-bengal/darjeeling/happy-valley-tea-estate
Ministry of Textiles
https://www.indiahandmade.com/blog/why-do-gi-tags-make-indian-handicrafts-global-and-boost-artisan-livelihoods?srsltid=AfmBOorwnYG19-Hd5LVKdyTeYtIIrcMJ_TZX-vUeJ6V61Du9bZ7Wrb4b
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2152551®=48&lang=2
https://x.com/TexMinIndia/status/2066117182086603038
https://www.pib.gov.in/Pressreleaseshare.aspx?PRID=1579529®=48&lang=2
https://www.pib.gov.in/PressReleaseIframePage.aspx?PRID=2113550®=48&lang=2
Ministry of Commerce & Industry
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2113966®=48&lang=2
https://sansad.in/getFile/loksabhaquestions/annex/187/AU2947_WBLKzd.pdf?source=pqals
https://ipindia.gov.in/frontend/pdf/gi/registered/State_wise_Registered_GI_of_India.pdf
https://www.pib.gov.in/PressReleaseDetail.aspx?PRID=2239598®=6&lang=1
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2270578®=3&lang=1
https://www.commerce.gov.in/files/2026-04/final_1.pdf
https://www.dpiit.gov.in/static/uploads/2026/03/863a5fef349d79a1bba316c4b51eaacb.pdf
https://www.pib.gov.in/PressReleaseIframePage.aspx?PRID=2206803®=48&lang=2
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2149738®=48&lang=2
Ministry of Micro, Small & Medium Enterprises
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2271522®=3&lang=1
https://innovative.msme.gov.in/Home/AboutIpr
https://ciprpf.com/msme-innovative-scheme
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2038537®=48&lang=2
Ministry of Development of North-East Region
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2268097®=48&lang=2
Ministry of Railways
https://www.pib.gov.in/PressReleaseIframePage.aspx?PRID=1942801®=48&lang=2
European Parliament
https://www.europarl.europa.eu/legislative-train/theme-a-global-europe-leveraging-our-power-and-partnerships/file-eu-india-fta-bit-and-gi-agreement?sid=10301
South Asian Journal of Management Research
https://siberindia.edu.in/journals/SAJMR/Oct-2021/Paper-5.pdf
Office of the Controller General of Patents, Designs and Trademarks & Registrar of GIs
https://ipindia.gov.in/frontend/pdf/mannual/1_31_1_manual-of-geographical-indications-practice-and-procedure.pdf
Chanakya National Law University
https://www.cnlu.ac.in/wp-content/uploads/2025/04/15-Yashna-Walia-and-Shreya-Kumar-1.pdf
IBEF
https://www.ibef.org/giofindia
https://www.ibef.org/blogs/promotion-of-geographical-indications-gis-in-india
See in PDF
***
(Explainer ID: 159430)
आगंतुक पटल : 25
Provide suggestions / comments