Economy
ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్‌గార్ యోజన (పీఎం-వీబీఆర్‌వై)
వ్యవస్థీకృత ఉపాధి విస్తరణ, భారత శ్రామిక శక్తికి భద్రత
Posted On:
01 AUG 2026 10:53AM
వికసిత్ భారత్ 2047 లక్ష్య సాధన దిశగా భారత్ సాగిస్తున్న ప్రయాణంలో దేశ శ్రామిక శక్తి కీలక ప్రేరకంగా నిలుస్తోంది. సమ్మిళిత వృద్ధికి నాణ్యమైన ఉపాధి ప్రధాన ఆధారం. తొలిసారి ఉపాధి పొందేవారిని ప్రోత్సహించడంతో పాటు కొత్త వ్యవస్థీకృత ఉద్యోగాల కల్పనకు యజమానులకు ప్రోత్సాహకాలు అందించడం ద్వారా ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్‌గార్ యోజన(పీఎం-వీబీఆర్‌వై) ఈ దార్శనికతకు తోడ్పడుతోంది. ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ(ఈపీఎఫ్‌వో) అనుసంధానంతో సాంకేతిక పరిజ్ఞాన ఆధారిత విధానంలో అమలయ్యే ఈ పథకం శ్రామిక శక్తిని వ్యవస్థీకృత రంగంలోకి తీసుకురావడం, సామాజిక భద్రత పరిధిని విస్తరించడం, కార్మికులకు ఆర్థిక భరోసా కల్పించడంపై దృష్టి సారిస్తోంది. ఉపాధి కల్పన, ఆర్థిక సమ్మిళితం, పారదర్శక అమలును సమన్వయం చేస్తూ దేశ దీర్ఘకాలిక ఆర్థిక వృద్ధికి తోడ్పడే నైపుణ్యవంతమైన, సురక్షితమైన, భవిష్యత్తుకు సిద్ధమైన శ్రామిక శక్తిని పీఎం-వీబీఆర్‌వై తీర్చిదిద్దుతోంది.
భారత జనాభా ప్రయోజనం అందిస్తున్న అవకాశం
యువతతో కూడిన చురుకైన శ్రామిక శక్తి భారత్‌కు ఉన్న గొప్ప బలాల్లో ఒకటి. ఆర్థిక వృద్ధికి ఊతమిచ్చి, వికసిత్ భారత్ 2047 దార్శనికతను సాకారం చేసేందుకు ఇది అపూర్వ అవకాశాన్ని అందిస్తోంది. ప్రతి సంవత్సరం లక్షలాది మంది యువత కార్మిక విపణిలోకి ప్రవేశిస్తున్నారు. ఈ జనాభా ప్రయోజనాన్ని నిరంతర, సమ్మిళిత అభివృద్ధిగా మలచేందుకు సామాజిక భద్రతతో కూడిన వ్యవస్థీకృత ఉపాధిని విస్తరించడం అత్యవసరం.
తొలిసారి ఉపాధి పొందేవారిని ప్రోత్సహించడంతో పాటు ఉద్యోగాల కల్పనకు మద్దతు ఇవ్వడం ద్వారా ప్రధాన మంత్రి వికసిత్ భారత్ రోజ్‌గార్ యోజన (పీఎం-వీబీఆర్‌వై) ఈ జాతీయ ప్రాధాన్యాన్ని మరింత బలోపేతం చేస్తోంది. ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) నిర్వహించే పారదర్శక విధానం ద్వారా ఉద్యోగులు, యజమానులు ఇరువురికీ అవకాశాలు కల్పిస్తూ శ్రామిక శక్తిని వ్యవస్థీకృత రంగంలోకి తీసుకువస్తోంది.
అవకాశాలను ఉపాధిగా మలచడం
2025 ఆగస్టులో ప్రకటించిన పీఎం-వీబీఆర్‌వై పథకాన్ని ₹99,446 కోట్ల వ్యయంతో 2025 ఆగస్టు 1 నుంచి 2027 జూలై 31 వరకు రెండేళ్ల పాటు అమలు చేస్తున్నారు. 2026 ఆగస్టు 1 నాటికి ఈ పథకం అమలులో వచ్చి ఏడాది పూర్తవుతోంది. వ్యవస్థీకృత ఉపాధి, సామాజిక భద్రత పరిధి విస్తరణకు భారత్ చేస్తున్న కృషిలో ఇది కీలక మైలురాయి.

1.92 కోట్ల మంది తొలిసారి ఉద్యోగంలో చేరే వారితో కలిపి 3.5 కోట్ల మందికి పైగా ఉపాధి కల్పించాలని పీఎం-వీబీఆర్‌వై లక్ష్యంగా పెట్టుకుంది. ఈపీఎఫ్‌వోలో నమోదు ద్వారా యువత వ్యవస్థీకృత శ్రామిక రంగంలోకి ప్రవేశించేలా ఈ పథకం ప్రోత్సహిస్తోంది. వివిధ రంగాల్లో, ముఖ్యంగా అధిక సంఖ్యలో కార్మికులకు ఉపాధి కల్పించే తయారీ రంగంలో సామాజిక భద్రత పరిధిని కూడా విస్తరిస్తోంది. కొత్తగా ఏర్పాటవుతున్న, విస్తరిస్తున్న పరిశ్రమల్లో ఉపాధిని ప్రోత్సహించడం ద్వారా జాతీయ తయారీ మిషన్‌కు ఈ పథకం అనుబంధంగా నిలుస్తోంది.
ఉద్యోగులు, యజమానులు ఇరువురికీ ప్రయోజనం
ఉద్యోగులు, యజమానులకు వేర్వేరు నిబంధనలతో రూపొందించిన రెండు భాగాల ప్రోత్సాహక విధానం పీఎం-వీబీఆర్‌వైలో ప్రధాన అంశం.
పార్ట్-ఏ: తొలిసారి ఉద్యోగంలో చేరేవారికి ప్రోత్సాహకం
* నెలకు ₹1,00,000 వరకు వేతనం పొందుతూ తొలిసారి ఉద్యోగంలో చేరే వారు ఈ భాగం కింద అర్హులు.
* వారికి ఒక నెల ఈపీఎఫ్ వేతనానికి సమానమైన మొత్తాన్ని గరిష్ఠంగా ₹15,000 వరకు ఒకసారి ప్రోత్సాహకంగా అందిస్తారు.
* ఈ ప్రోత్సాహకాన్ని రెండు విడతల్లో చెల్లిస్తారు. ఆరు నెలల సర్వీసు పూర్తయిన తర్వాత తొలి విడత, ఆర్థిక అక్షరాస్యత కార్యక్రమాన్ని పూర్తిచేసి వరుసగా పన్నెండు నెలల సర్వీసు అనంతరం రెండో విడత చెల్లిస్తారు.
* ఆర్థిక భద్రత, పొదుపును ప్రోత్సహించేందుకు ప్రోత్సాహక మొత్తంలో కొంత భాగాన్ని నిర్దేశిత పొదుపు పథకంలో పెట్టుబడిగా ఉంచుతారు. ఉద్యోగి దానిని తర్వాతి తేదీలో ఉపసంహరించుకోవచ్చు.
పార్ట్-బీ: యజమానులకు మద్దతు
* నెలకు ₹1,00,000 వరకు వేతనం పొందే ఉద్యోగులకు సంబంధించి యజమానులు ప్రోత్సాహకాలకు అర్హులు.
* కనీసం ఆరు నెలల పాటు కొనసాగించిన ప్రతి అర్హతగల అదనపు ఉద్యోగికి రెండేళ్లపాటు యజమానులు నెలకు గరిష్ఠంగా ₹3,000 అందుకుంటారు.
* ఈ మద్దతు నియామక వ్యయాన్ని తగ్గించి, నిరంతర ఉపాధి కల్పనను ప్రోత్సహిస్తుంది.
* అధిక ఉపాధి కల్పన సామర్థ్యం దృష్ట్యా తయారీ రంగానికి మూడో, నాలుగో సంవత్సరాల్లోనూ ప్రోత్సాహకాలను కొనసాగిస్తారు.

పీఎం-వీబీఆర్‌వై ప్రభావం
తొలిసారి ఉద్యోగ నియామకాలను ప్రోత్సహించడం, సామాజిక భద్రత పరిధిని విస్తరించడం ద్వారా పీఎం-వీబీఆర్‌వై తొలి ఏడాదిలోనే శ్రామిక శక్తిని వ్యవస్థీకృత రంగంలోకి తీసుకురావడంలో పురోగతి సాధించింది. మరింత మంది కార్మికులు వ్యవస్థీకృత రంగంలోకి వచ్చేలా తోడ్పడుతూనే, వివిధ పరిశ్రమల్లో కొత్త ఉద్యోగాలు కల్పించేందుకు యజమానులను ఈ పథకం ప్రోత్సహిస్తోంది.
* 2025 ఆగస్టు నుంచి 72 లక్షల మందికి పైగా తొలిసారి ఉద్యోగంలో చేరినవారు వ్యవస్థీకృత శ్రామిక రంగంలోకి ప్రవేశించారు.
* లబ్ధిదారుల్లో దాదాపు 30 శాతం మంది మహిళలు ఉన్నారు. ఇది వ్యవస్థీకృత ఉపాధిలో మహిళల భాగస్వామ్యాన్ని మరింత పెంచుతోంది.
* ఈ పథకం కింద ఇప్పటికే 15 లక్షల మందికి పైగా లబ్ధిదారులు ఉపాధి అనుసంధానిత ప్రోత్సాహకాలను అందుకున్నారు.
* ఉపాధిని ఈపీఎఫ్‌వో నమోదు, ప్రత్యక్ష ప్రయోజన బదిలీలతో అనుసంధానించడం ద్వారా పీఎం-వీబీఆర్‌వై దేశ వ్యవస్థీకృత కార్మిక విపణిని బలోపేతం చేస్తూ మరింత భద్రత కలిగిన ప్రతిభావంతుల సమూహాన్ని రూపొందిస్తోంది.

పీఎం-వీబీఆర్‌వై డిజిటల్ పాలన, సమర్థ సేవల అమలు
పారదర్శకమైన, సమర్థమైన, జవాబుదారీతనంతో కూడిన అమలుకు పీఎం-వీబీఆర్‌వై డిజిటల్ సాంకేతికతలను వినియోగిస్తోంది. నిరంతరాయ ధ్రువీకరణ, ప్రయోజనాల బదిలీ, ఎప్పటికప్పుడు పర్యవేక్షణకు ఈ పథకం వీలు కల్పిస్తోంది.
* పూర్తి డిజిటల్ విధానంలో పనిచేసే ఈపీఎఫ్‌వో అనుసంధానిత వేదిక ద్వారా పథకాన్ని అమలు చేస్తూ నిరంతరాయ ధ్రువీకరణ, సమర్థ ప్రయోజన పంపిణీకి భరోసా కల్పిస్తున్నారు.
* ఆధార్ ఆధారిత ప్రామాణీకరణ, యూనివర్సల్ అకౌంట్ నంబర్లు (యూఏఎన్‌లు), క్రమం తప్పని ఎలక్ట్రానిక్ చలాన్-కమ్-రిటర్న్ (ఈసీఆర్) దాఖళ్లను ఈ పథకం వినియోగిస్తుంది. ఉమంగ్ యాప్‌లో ముఖ ప్రామాణీకరణ సాంకేతికత ద్వారా యూఏఎన్‌ను ధ్రువీకరించిన తర్వాతే ప్రోత్సాహకాలు అందుబాటులోకి వస్తాయి. సామాజిక భద్రత పరిధిని విస్తరిస్తూనే నిబంధనల అమలుకు ఇది భరోసా కల్పిస్తుంది.
* పారదర్శకత, జవాబుదారీతనాన్ని పెంచేందుకు ప్రత్యక్ష ప్రయోజన బదిలీ (డీబీటీ) ద్వారా ప్రోత్సాహకాలను ఆధార్‌తో అనుసంధానించిన బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా జమ చేస్తారు.
* పీఎం-వీబీఆర్‌వై పోర్టల్ పథకం అమలుకు సంబంధించిన అన్ని దశలను సులభతరం చేయడంతో పాటు లబ్ధిదారులు, రంగాలవారీ పురోగతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించే సదుపాయం కల్పిస్తుంది.
పథకం, దాని నిబంధనలపై దేశవ్యాప్తంగా విస్తృత ప్రచార కార్యక్రమాల ద్వారా అవగాహన కల్పిస్తున్నారు. ఈపీఎఫ్‌వో, కార్మిక రాజ్య బీమా సంస్థ(ఈఎస్ఐసీ), ప్రధాన కార్మిక కమిషనర్ (సీఎల్‌సీ) కార్యాలయ అధికారులతో కూడిన క్రాస్-ఫంక్షనల్ బృందాలు క్షేత్రస్థాయిలో భాగస్వామ్యాన్ని పెంచుతూ ఈ కార్యక్రమాలకు మద్దతు ఇస్తున్నాయి.
భారత శ్రామిక శక్తికి సాధికారత
నిరంతర, సమ్మిళిత వృద్ధి దిశగా భారత్ ముందుకు సాగుతున్న తరుణంలో జీవనోపాధి మెరుగుదల, ఆర్థిక ప్రతిఘటన సామర్థ్యం పెంపునకు నాణ్యమైన ఉపాధి కీలకంగా కొనసాగుతుంది. తొలిసారి ఉపాధి పొందేవారిని ప్రోత్సహించడం, ఉద్యోగాల కల్పనకు మద్దతు అందించడం ద్వారా పీఎం-వీబీఆర్‌వై దేశ వ్యవస్థీకృత ఉపాధి వ్యవస్థను బలోపేతం చేస్తూ సామాజిక భద్రత పరిధిని విస్తరిస్తోంది. ఈ పథకం తొలి ఏడాది పూర్తి చేసుకుంటున్న వేళ, భారత జనాభా ప్రయోజనంలోని పూర్తి సామర్థ్యాన్ని వెలికితీయాలన్న ప్రభుత్వ నిబద్ధతను మరోసారి చాటుతోంది.
References
Ministry of Labour and Employment
https://pmvbry.epfindia.gov.in/
https://pmvbry.epfindia.gov.in/pmvbry-scheme/
https://pmvbry.epfindia.gov.in/wp-content/themes/epfo-child/assets/images/PMVBRY-Final.pdf
https://sansad.in/getFile/annex/270/AU1536_GzvOyc.pdf?source=pqars
https://sansad.in/getFile/loksabhaquestions/annex/187/AU1392_4I7wJ2.pdf?source=pqals
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2275419®=48&lang=2
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2148270®=48&lang=2
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2275547®=48&lang=2
Others
http://pmindia.gov.in/hi/news_updates/%E0%A4%AA%E0%A5%8D%E0%A4%B0%E0%A4%A7%E0%A4%BE%E0%A4%A8%E0%A4%AE%E0%A4%82%E0%A4%A4%E0%A5%8D%E0%A4%B0%E0%A5%80-%E0%A4%B6%E0%A5%8D%E0%A4%B0%E0%A5%80-%E0%A4%A8%E0%A4%B0%E0%A5%87%E0%A4%A8%E0%A5%8D-1154/
https://www.youtube.com/shorts/UMSneQm7H90
https://www.youtube.com/watch?v=GQt75TsuzBI&list=PLNLJCvbS5aqS4h_BsqW9UboJ2N9a5RGKk&index=11
Click here to see pdf
PIB Research
***
(Explainer ID: 159405)
आगंतुक पटल : 173
Provide suggestions / comments