Social Welfare
పీఎం విద్యాలక్ష్మి పథకం
భారత్‌లో అందరికీ విద్యావకాశాల కల్పనకు ప్రోత్సాహం
Posted On:
29 JUL 2026 1:26PM
ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రతిభావంతులైన విద్యార్థులకు నాణ్యమైన ఉన్నత విద్యను అందుబాటులోకి తీసుకురావాలన్న లక్ష్యంతో విద్యా మంత్రిత్వ శాఖ ప్రధానమంత్రి విద్యాలక్ష్మి పథకాన్ని ప్రతిష్ఠాత్మక కార్యక్రమంగా అమలు చేస్తోంది. దేశంలోని అత్యుత్తమ ర్యాంకులు పొందిన ఉన్నత విద్యా సంస్థల్లో చదివే అర్హులైన విద్యార్థులకు ఈ పథకం కింద ఎలాంటి పూచీకత్తు, హామీదారు అవసరం లేకుండా విద్యా రుణాలు అందుతాయి. కుటుంబ ఆదాయం ప్రాతిపదికన వడ్డీ రాయితీ సైతం లభించడంతో విద్యాభ్యాసానికి ఎదురయ్యే ఆర్థిక ఆటంకాలు తగ్గుతాయి. 2030 నాటికి సమ్మిళిత, సమాన, నాణ్యమైన విద్యను అందరికీ అందించటంతో పాటు జీవితాంతం అభ్యసించే అవకాశాలను ప్రోత్సహించాలనే సుస్థిర అభివృద్ధి లక్ష్యం-4 సాధన దిశగా భారత్ చేస్తున్న కృషికి ఈ పథకం దోహదం చేస్తోంది.
ఉన్నత విద్యకు ఆర్థిక అడ్డంకుల తొలగింపు
గత దశాబ్ద కాలంలో భారత్‌లో ఉన్నత విద్య ప్రవేశాలు వేగంగా విస్తరించాయి. స్థూల ప్రవేశాల నిష్పత్తి(జీఈఆర్) 2014-15లో 23.7 శాతం ఉండగా, 2023-24 నాటికి 30.0 శాతానికి పెరిగింది. అయితే, దేశంలో అత్యుత్తమ ర్యాంకులు పొందిన విద్యా సంస్థల్లో నాణ్యమైన ఉన్నత విద్యను అభ్యసించటం ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఎంతోమంది ప్రతిభావంతులకు ఇప్పటికీ కష్టంగానే ఉంది. చాలామంది విద్యా రుణాల ద్వారా ఆర్థిక లోటును భర్తీ చేసేందుకు ప్రయత్నిస్తున్నా, ఆ రుణాలపై అధిక వడ్డీని భరించలేని విద్యార్థులు ఇంకా ఎంతోమంది ఉన్నారు. ప్రతిభ ఉన్నప్పటికీ ఐఐటీలు, ఐఐఎంలు సహా దేశంలోని ఎన్నో అగ్రశ్రేణి సంస్థల్లో చదవాలన్న వారి కలలు నెరవేరటం లేదు. ఇలాంటి విద్యార్థులకు అండగా నిలిచేందుకు కేంద్ర మంత్రివర్గం 2024 నవంబర్ 6న పీఎం విద్యాలక్ష్మి పథకానికి ఆమోదం తెలిపింది. దేశంలోని నిర్దేశిత నాణ్యమైన ఉన్నత విద్యా సంస్థల్లో(క్యూహెచ్ఈఐ) సొంత ప్రతిభతో ప్రవేశం పొందిన విద్యార్థులకు ఎలాంటి పూచీకత్తు, హామీదారు అవసరం లేకుండా విద్యా రుణాలు అందించే లక్ష్యాధారిత కార్యక్రమం ఇది. వార్షిక కుటుంబ ఆదాయం ₹8,00,000 వరకు ఉన్న విద్యార్థులకు 3 శాతం వడ్డీ రాయితీ సైతం లభిస్తుంది. ఈ రుణాలను పొందే ప్రక్రియ సరళంగా, పారదర్శకంగా, విద్యార్థులకు అనుకూలంగా, పూర్తిగా డిజిటల్ విధానంలో ఉంటుంది. విద్యా రుణాలకు దరఖాస్తు చేసుకోవటం, దరఖాస్తు స్థితిని తెలుసుకోవటం, వడ్డీ రాయితీని కోరటం, ఫిర్యాదులను సమర్పించటం కోసం ఏకీకృత పోర్టల్ అందుబాటులో ఉంది.
ప్రభుత్వ, ప్రైవేటు ఉన్నత విద్యా సంస్థల్లో(హెచ్ఈఐ) చదివే ప్రతిభావంతులకు వివిధ చర్యల ద్వారా ఆర్థిక సహాయం అందించాలని సిఫారసు చేసిన జాతీయ విద్యా విధానం(ఎన్ఈపీ)-2020 నుంచి ఈ పథకం రూపుదిద్దుకుంది. ఆర్థిక వనరుల కొరత కారణంగా ఏ ప్రతిభావంతుడూ దేశంలోని అత్యుత్తమ విద్యా సంస్థల్లో చదివే అవకాశాన్ని కోల్పోకూడదన్నదే దీని లక్ష్యం. సమ్మిళిత, సమాన, నాణ్యమైన విద్యను ముందుకు తీసుకెళ్లటం, అందరికీ జీవితాంత అభ్యసన అవకాశాలను ప్రోత్సహించటం ద్వారా సుస్థిర అభివృద్ధి లక్ష్యం-4, జాతీయ విద్యా విధానం-2020 ఆశయాల సాధనకు పీఎం విద్యాలక్ష్మి సానుకూలంగా తోడ్పడుతోంది.
ప్రత్యేకతలు, ప్రయోజనాలు, పరిధి
దేశంలోని నిర్దేశిత నాణ్యమైన ఉన్నత విద్యా సంస్థల్లో సొంత ప్రతిభతో ప్రవేశం పొందిన విద్యార్థులకు పీఎం విద్యాలక్ష్మి కింద పూచీకత్తు, హామీదారు అవసరం లేని విద్యా రుణాలు అందుతాయి. ప్రస్తుతం ప్రభుత్వ, ప్రైవేటు విభాగాలకు చెందిన 1,425 నాణ్యమైన ఉన్నత విద్యా సంస్థలు ఈ పథకం పరిధిలో ఉన్నాయి. మేనేజ్‌మెంట్ కోటా, ఎన్ఆర్ఐ కోటా తదితర మార్గాల్లో ప్రవేశాలు పొందిన వారికి ఈ ప్రయోజనం వర్తించదు.
₹7.5 లక్షల వరకు రుణాలపై భారత ప్రభుత్వం 75 శాతం రుణ హామీ కల్పిస్తుంది. దీనివల్ల బ్యాంకులు ఎక్కువమంది విద్యార్థులకు రుణాలు అందించగలుగుతాయి. వార్షిక కుటుంబ ఆదాయం ₹8 లక్షల వరకు ఉన్న విద్యార్థులకు ₹10 లక్షల వరకు రుణాలపై 3 శాతం వడ్డీ రాయితీ లభిస్తుంది. వార్షిక కుటుంబ ఆదాయం ₹4.5 లక్షల వరకు ఉన్న విద్యార్థులకు ఇప్పటికే అందుతున్న పూర్తి వడ్డీ రాయితీకి ఇది అదనం.

పూచీకత్తు, హామీదారు అవసరం లేని విద్యా రుణాలు
అర్హత కలిగిన నాణ్యమైన ఉన్నత విద్యా సంస్థల్లో ప్రవేశం పొందిన విద్యార్థులు పీఎం విద్యాలక్ష్మి కింద పూచీకత్తు లేదా మూడో వ్యక్తి హామీ సమర్పించకుండానే విద్యా రుణాలు పొందవచ్చు. విద్యా రుణ గరిష్ఠ మొత్తంపై ఎలాంటి పరిమితి లేదు. నాణ్యమైన ఉన్నత విద్యా సంస్థ వసూలు చేసే కోర్సు ఫీజు, ఇతర రుసుములు, సంబంధిత ఖర్చుల ఆధారంగా రుణ మొత్తం నిర్ణయమవుతుంది. మెస్, హాస్టల్ ఫీజు, సంస్థకు చెల్లించాల్సిన తిరిగి చెల్లించే లేదా తిరిగి చెల్లించని ఇతర రుసుములు, తగిన నాణ్యత కలిగిన ల్యాప్‌టాప్ ధర, కోర్సు కాలంలో విద్యార్థికి అవసరమయ్యే సముచిత జీవన వ్యయం ఇందులో ఉంటాయి. అన్ని ఆదాయ వర్గాలకు చెందిన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
రుణ సంస్థలు విద్యార్థులకు రుణాలు ఇచ్చేలా ప్రోత్సహించేందుకు ₹7.5 లక్షల వరకు రుణాలపై ప్రభుత్వం 75 శాతం రుణ హామీ కల్పిస్తుంది. దీనివల్ల రుణదాతలకు ఎదురయ్యే ముప్పు గణనీయంగా తగ్గి, విద్యార్థులకు రుణ లభ్యత మెరుగుపడుతుంది.
ఈ పథకం కింద విద్యా రుణంపై వసూలు చేసే వడ్డీ రేటు సంబంధిత బ్యాంకు బాహ్య ప్రామాణిక ఆధారిత రుణ రేటు (ఈబీఎల్ఆర్) + 0.5 శాతానికి మించదు. పీఎం విద్యాలక్ష్మి పరిధిలోకి రాని ఇతర విద్యా రుణాలపై బ్యాంకు వసూలు చేసే వడ్డీ రేటు కంటే ఇది ఎల్లప్పుడూ తక్కువగా ఉంటుంది. కోర్సు కాలంతో పాటు మరో ఏడాది మారటోరియం వ్యవధిని మినహాయించి, విద్యా రుణ చెల్లింపు గడువు 15 ఏళ్ల వరకు ఉంటుంది. భారత్‌లోని అన్ని డిగ్రీ, డిప్లొమా కోర్సులకు ఈ రుణం అందుబాటులో ఉంటుంది. ఇలాంటి రుణాలు పొందే విద్యార్థుల సంఖ్యపై ఎలాంటి పరిమితి లేదు. పథకంలో భాగస్వాములైన షెడ్యూల్డ్ బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు(ఆర్ఆర్‌బీ), సహకార బ్యాంకులు విద్యా రుణాలను అందిస్తాయి.
వడ్డీ రాయితీ
పీఎం-యూఎస్‌పీ సీఎస్ఐఎస్‌కు (ప్రధానమంత్రి ఉన్నత విద్యా ప్రోత్సాహక కేంద్ర రంగ వడ్డీ రాయితీ పథకం) పీఎం విద్యాలక్ష్మి అనుబంధంగా పనిచేస్తుంది. పీఎం-యూఎస్‌పీ సీఎస్ఐఎస్ కింద గుర్తింపు పొందిన న్యాక్ ప్రమాణాలు కలిగిన ఉన్నత విద్యా సంస్థలు లేదా ఎన్‌బీఏ గుర్తింపు పొందిన కోర్సుల్లో సాంకేతిక, వృత్తి విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు ప్రయోజనం లభిస్తుంది. వార్షిక కుటుంబ ఆదాయం ₹4.5 లక్షల వరకు ఉన్న విద్యార్థులకు ₹10 లక్షల వరకు విద్యా రుణంపై మారటోరియం కాలమంతా 100 శాతం వడ్డీ రాయితీ అందుతుంది.
పీఎం విద్యాలక్ష్మి వడ్డీ రాయితీ పథక పరిధి విస్తృతంగా ఉంటుంది. నిర్దేశిత నాణ్యమైన ఉన్నత విద్యా సంస్థల్లోని అన్ని కోర్సులు దీని పరిధిలోకి వస్తాయి. వార్షిక కుటుంబ ఆదాయం ₹8,00,000 కంటే తక్కువగా ఉన్న ప్రతిభావంతులకు ₹10 లక్షల వరకు రుణాలపై మారటోరియం కాలంలో—అంటే కోర్సు కాలంతో పాటు మరో ఏడాది వరకు—3 శాతం వడ్డీ రాయితీ లభిస్తుంది.
విద్యా రుణ మొత్తం ₹10 లక్షలకు మించి ఉంటే, పంపిణీ చేసిన మొత్తం అసలు రుణంలో ₹10 లక్షల వరకు మాత్రమే వడ్డీ రాయితీ వర్తిస్తుంది.
ఇతర కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వ ఉపకారవేతనం, మరో వడ్డీ రాయితీ పథకం లేదా ఫీజు రీయింబర్స్‌మెంట్ ప్రయోజనం పొందుతున్న విద్యార్థి సీఎస్ఐఎస్ లేదా పీఎం విద్యాలక్ష్మి కింద వడ్డీ రాయితీకి అర్హుడు కాదు.
ఏడాదికి గరిష్ఠంగా లక్ష మంది విద్యార్థులు మారటోరియం కాలంలో 3 శాతం వడ్డీ రాయితీ పొందేందుకు అర్హులు. సీఎస్ఐఎస్ లబ్ధిదారులకు ఇలాంటి పరిమితి లేదు.
పీఎం విద్యాలక్ష్మి పోర్టల్‌లో అందుబాటులో ఉన్న పీఎం-యూఎస్‌పీ సీఎస్ఐఎస్, పీఎం విద్యాలక్ష్మి వడ్డీ రాయితీల వివరాలు::
|
అంశం
|
పీఎం-యూఎస్‌పీ సీఎస్ఐఎస్
|
పీఎం విద్యాలక్ష్మి
|
|
సంస్థలు
|
న్యాక్/ఎన్‌బీఏ గుర్తింపు పొందిన సంస్థలు, జాతీయ ప్రాధాన్య సంస్థలు, భారత వైద్య కమిషన్, నర్సింగ్ కౌన్సిల్, బార్ కౌన్సిల్, ఫార్మసీ కౌన్సిల్, డెంటల్ కౌన్సిల్ వంటి నియంత్రణ సంస్థలు ఆమోదించిన సాంకేతిక విద్యా సంస్థలు
|
ఎన్ఐఆర్ఎఫ్‌లో తొలి 100 స్థానాల్లోని ప్రైవేటు సంస్థలు; రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఎన్ఐఆర్ఎఫ్ తొలి 200 స్థానాల్లోని సంస్థలు; కేంద్ర ప్రభుత్వ పరిధిలోని మిగతా సంస్థలు
|
|
కోర్సు
|
వృత్తి, సాంకేతిక కోర్సులు
|
అన్ని డిగ్రీ, డిప్లొమా కోర్సులు
|
|
కుటుంబ ఆదాయం
|
₹4.5 లక్షలు
|
₹8 లక్షలు
|
|
వడ్డీ రాయితీ
|
మారటోరియం కాలమంతా పూర్తి వడ్డీ రాయితీ
|
మారటోరియం కాలంలో 3 శాతం వడ్డీ రాయితీ
|
|
అవకాశాల సంఖ్య
|
పరిమితి లేదు
|
ఏడాదికి లక్ష కొత్త అవకాశాలు
|
|
రుణ చెల్లింపు
|
మారటోరియం కాలం—కోర్సు వ్యవధి + ఒక సంవత్సరం—ముగిసిన తర్వాత 15 ఏళ్ల వరకు
|
మారటోరియం కాలం—కోర్సు వ్యవధి + ఒక సంవత్సరం—ముగిసిన తర్వాత 15 ఏళ్ల వరకు
|
బ్యాంకు బాహ్య ప్రామాణిక ఆధారిత రుణ రేటు (ఈబీఎల్ఆర్) + 0.5 శాతానికి పరిమితమైన వడ్డీతో ఈ పథకం విద్యార్థులకు అందుబాటు ధరలో విద్యా రుణాలను అందిస్తుంది. చదువుకునే కాలంతో పాటు మారటోరియం వ్యవధిలో వడ్డీ చెల్లిస్తే, రుణగ్రహీతలకు బ్యాంకులు అదనంగా ఒక శాతం వరకు వడ్డీ రాయితీ ఇవ్వవచ్చు. సెక్షన్ 80E కింద చెల్లించిన వడ్డీపై పన్ను ప్రయోజనాలు సైతం లభిస్తాయి.
అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ లేదా సమీకృత కోర్సుల్లో ఏదో ఒకదానికి మాత్రమే వడ్డీ రాయితీ, రుణ హామీ ప్రయోజనాలు ఒక్కసారి లభిస్తాయి. 2024-25 నుంచి 2030-31 వరకు ఈ పథకానికి ప్రభుత్వం ₹3,600 కోట్ల బడ్జెట్ కేటాయించింది. ఏడేళ్ల కాలంలో కొత్తగా 7 లక్షల మంది విద్యార్థులకు ఈ వడ్డీ రాయితీ ప్రయోజనం చేకూరుతుందని అంచనా.
విద్యార్థుల అర్హత ప్రమాణాలు
· భారత్‌లోని నిర్దేశిత నాణ్యమైన ఉన్నత విద్యా సంస్థల్లో పోటీ పరీక్షల ద్వారా ప్రతిభ ఆధారిత ప్రవేశం పొందిన విద్యార్థులకు ఈ పథకం అందుబాటులో ఉంటుంది.
· అన్ని డిగ్రీ, డిప్లొమా కోర్సులకు ఈ పథకం కింద విద్యా రుణాలు లభిస్తాయి.
· మారటోరియం కాలాన్ని—కోర్సు కాలం + ఒక సంవత్సరం—మినహాయించి, విద్యా రుణ చెల్లింపు గడువు 15 ఏళ్ల వరకు ఉంటుంది.
ఈ ప్రయోజనాలన్నీ పొందేందుకు విద్యార్థులు ఆధార్ ద్వారా నమోదు చేసుకోవాలి. కోర్సులో కొనసాగటంతో పాటు సంతృప్తికరమైన విద్యా ప్రతిభను కనబరచాలి.
అదనపు షరతులు:
· దరఖాస్తుదారు కోర్సును మధ్యలో విడిచిపెట్టకూడదు. క్రమశిక్షణ లేదా విద్యా సంబంధిత కారణాలతో సంస్థ నుంచి బహిష్కరణకు గురికాకూడదు.
· రెండో సంవత్సరం నుంచి వడ్డీ రాయితీ ప్రయోజనాన్ని కొనసాగించేందుకు విద్యార్థి సంతృప్తికరమైన విద్యా ప్రతిభను కనబరచాలి.
· అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ లేదా సమీకృత కోర్సుల్లో ఏదో ఒకదానికి మాత్రమే వడ్డీ రాయితీ, రుణ హామీ ప్రయోజనాలను విద్యార్థి ఒక్కసారి పొందవచ్చు.
ఉన్నత విద్యా సంస్థల అర్హత ప్రమాణాలు
ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకుల ఆధారంగా విద్యా సంస్థలను ఎంపిక చేస్తారు. ప్రస్తుతం కింది సంస్థలు పథకం పరిధిలో ఉన్నాయి:
· విద్యా మంత్రిత్వ శాఖ తాజాగా ప్రచురించిన ఎన్ఐఆర్ఎఫ్ జాబితాలో సమగ్ర, విభాగాలవారీ లేదా రంగాలవారీ ర్యాంకింగ్స్‌లో తొలి 100 స్థానాల్లో నిలిచిన ఉన్నత విద్యా సంస్థలు.
· విద్యా మంత్రిత్వ శాఖ తాజాగా ప్రచురించిన ఎన్ఐఆర్ఎఫ్ జాబితాలో రాష్ట్రాలు లేదా కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాల పరిధిలో తొలి 200 స్థానాల్లో నిలిచిన ఉన్నత విద్యా సంస్థలు.
· భారత ప్రభుత్వ పరిధిలోని మిగతా ఉన్నత విద్యా సంస్థలన్నీ.
విదేశీ విద్యా సంస్థల భారతీయ ప్రాంగణాలు, భారతీయ విద్యా సంస్థల విదేశీ ప్రాంగణాలు, విదేశీ విద్యా సంస్థలు ఈ పథకం పరిధిలోకి రావు.
దేశవ్యాప్తంగా ఉన్నత విద్యా సంస్థల ఎంపికకు అమలు చేస్తున్న ప్రమాణాలు రాష్ట్రాల మధ్య సమాన ప్రాతినిధ్యానికి వీలు కల్పిస్తాయి.
తాజా ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ ఆధారంగా ఈ జాబితాను నవీకరిస్తారు. ప్రస్తుతం పీఎం విద్యాలక్ష్మి పరిధిలో 1,425 సంస్థలు ఉండగా, వాటిలో చదివే విద్యార్థులు ఈ పథకం విద్యా రుణాలకు అర్హులు.
ప్రయోజనాలు పొందే విధానం
విద్యార్థులకు అనుకూలమైన డిజిటల్ వేదిక ద్వారా విద్యా రుణాలను సులభంగా అందుబాటులోకి తెచ్చి, ఉన్నత విద్య అవకాశాలను విస్తరించటం పీఎం విద్యాలక్ష్మి లక్ష్యం. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవటం, దరఖాస్తు పురోగతిని తెలుసుకోవటం, సకాలంలో ఆమోదం, రుణ పంపిణీ పొందటం వంటి సదుపాయాలతో రుణ ప్రక్రియ సరళమవుతుంది.
ప్రత్యేక పోర్టల్ ద్వారా కింది సేవలు అందుతాయి:
· ఉమ్మడి రుణ దరఖాస్తులు
· బ్యాంకు ఎంపిక
· దరఖాస్తు స్థితి పరిశీలన
· వడ్డీ రాయితీ అభ్యర్థనలు
· డిజిటల్ ప్రక్రియ, పారదర్శకత

పీఎం విద్యాలక్ష్మి డిజిటల్ రూపీ యాప్(సీబీడీసీ వాలెట్)
రుణానికి ఆమోదం లభించి, మొత్తం పంపిణీ పూర్తయిన తర్వాత అర్హులైన విద్యార్థులు కుటుంబ ఆదాయం ఆధారంగా వడ్డీ రాయితీకి దరఖాస్తు చేసుకోవచ్చు. రాయితీ మొత్తాన్ని లబ్ధిదారు పీఎం విద్యాలక్ష్మి డిజిటల్ రూపీ యాప్‌లోని సీబీడీసీ వాలెట్‌కు జమ చేసి, అనంతరం విద్యా రుణ ఖాతాకు బదిలీ చేస్తారు.

కేంద్ర రంగ వడ్డీ రాయితీ పథకం (సీఎస్ఐఎస్) కింద భారత్‌లో సాంకేతిక, వృత్తి కోర్సుల అభ్యసనానికి తీసుకున్న రుణంపై మారటోరియం కాలమంతా పూర్తి వడ్డీ రాయితీ లభిస్తుంది. తల్లిదండ్రులు లేదా కుటుంబ వార్షిక స్థూల ఆదాయం ₹4.5 లక్షల వరకు ఉన్న విద్యార్థులు ఈ పథకానికి అర్హులు.
ప్రస్తుతం అమల్లో ఉన్న పీఎం-యూఎస్‌పీ సీఎస్ఐఎస్‌ను పీఎం విద్యాలక్ష్మి పోర్టల్, పీఎం విద్యాలక్ష్మి డిజిటల్ రూపీ వాలెట్ ద్వారా నిర్వహిస్తున్నారు. 2026 జూలై 22 నాటికి 35,777 క్రియాశీల వాలెట్లు ఉండగా, వాటి ద్వారా ₹57.66 కోట్ల రాయితీల పంపిణీకి వీలు కలిగింది. ప్రయోజనాల పంపిణీని క్రమబద్ధీకరించటం, జాప్యాలను తగ్గించటం, అర్హులైన విద్యార్థులకు ఆర్థిక సహాయం సమర్థంగా చేరేలా చూడటంలో ఈ డిజిటల్ విధానం తోడ్పడింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో 2024-25కు సంబంధించిన మొత్తం 4,14,844 క్లెయిమ్‌లు కెనరా బ్యాంకుకు అందాయి. వాటి విలువ ₹892.81 కోట్లు. దీనివల్ల విద్యార్థి లబ్ధిదారులపై రుణ చెల్లింపు భారం గణనీయంగా తగ్గుతుంది. ఫిర్యాదులను సమర్పించటం, వాటి పరిష్కార స్థితిని తెలుసుకోవటం కోసం పోర్టల్ విద్యార్థులకు ప్రత్యేక వేదికను సైతం అందిస్తుంది. ఫలితంగా పారదర్శకత పెరగటంతో పాటు వివాదాలకు సకాలంలో పరిష్కారం లభిస్తుంది.
పీఎం విద్యాలక్ష్మి పథక ప్రభావం
అన్ని రకాల విద్యా రుణాలతో పాటు పీఎం విద్యాలక్ష్మి రుణాల కోసం ఒకే పోర్టల్ ద్వారా బ్యాంకులకు దరఖాస్తు చేసుకోవటం, దరఖాస్తు స్థితిని ఆన్‌లైన్‌లో తెలుసుకోవటం సాధ్యమయ్యేలా పీఎం విద్యాలక్ష్మిని ఏకీకృత, పూర్తిస్థాయి డిజిటల్, పారదర్శక విద్యా రుణ సహాయక వేదికగా రూపొందించారు. దరఖాస్తులు, ఆమోదాలు, పరిశీలన దశలకు సంబంధించిన గణాంకాలను డ్యాష్‌బోర్డు ఎప్పటికప్పుడు అందిస్తుంది.
2025-26 ఆర్థిక సంవత్సరంలో అన్ని విద్యా పథకాల కింద పోర్టల్‌కు 6,45,514 విద్యా రుణ దరఖాస్తులు అందాయి. వీటిలో 1,10,667 దరఖాస్తులు పీఎం విద్యాలక్ష్మి రుణాలకు సంబంధించినవి.
2025-26 ఆర్థిక సంవత్సరంలో పీఎం విద్యాలక్ష్మి కింద 1,10,667 విద్యా రుణ దరఖాస్తులు అందాయి. వీటిలో 70,852 రుణాలకు ఆమోదం లభించగా, ఇప్పటికే 67,728 రుణాలను పంపిణీ చేశారు.

లింగ సమ్మిళితత్వం
లింగభేదంతో సంబంధం లేకుండా అర్హులైన ప్రతిభావంతులందరికీ ఉన్నత విద్య కోసం ఆర్థిక సహాయం అందుబాటులో ఉండేలా పీఎం విద్యాలక్ష్మి చూస్తోంది. మహిళలు, ట్రాన్స్‌జెండర్ విద్యార్థులు సైతం ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందుతారు. ఫలితంగా ఉన్నత విద్య మరింత సమ్మిళితంగా, అందుబాటులోకి వస్తుంది. ఆర్థిక అడ్డంకులను తగ్గించటం ద్వారా నాణ్యమైన విద్యను అభ్యసించేందుకు, నైపుణ్యాలను మెరుగుపరచుకునేందుకు, మెరుగైన ఉద్యోగ అవకాశాలను పొందేందుకు ఈ పథకం విద్యార్థులకు తోడ్పడుతుంది. దీనివల్ల వారి ఉపాధి అవకాశాలు పెరగటంతో పాటు శ్రామిక శక్తిలో భాగస్వామ్యం విస్తరిస్తుంది. తద్వారా మరింత సమ్మిళిత సామాజిక, ఆర్థిక అభివృద్ధికి దోహదం కలుగుతుంది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో 3,68,742 మంది పురుషులు, 2,76,764 మంది మహిళలు రుణాలకు దరఖాస్తు చేసుకున్నారు. పురుషులకు 2,03,438 రుణాలు, మహిళలకు 1,58,629 రుణాలు మంజూరయ్యాయి.
వెనుకబడిన విద్యార్థులకు సాధికారత
ఆర్థికంగా బలహీన వర్గాల విద్యార్థులను ప్రధాన విద్యా స్రవంతిలోకి తీసుకురావటానికి ఈ పథకం వీలు కల్పిస్తూ, సమగ్ర సమ్మిళితత్వాన్ని పెంచుతోంది. సమర్పించిన మొత్తం దరఖాస్తుల్లో ఆర్థికంగా బలహీన వర్గాలు(ఈడబ్ల్యూఎస్), సాధారణ వర్గం, నాన్-క్రీమీ లేయర్ ఇతర వెనుకబడిన తరగతులు(ఎన్‌సీఓబీసీ), ఇతర వెనుకబడిన తరగతులు(ఓబీపీ), షెడ్యూల్డ్ కులాలు(ఎస్సీ), షెడ్యూల్డ్ తెగలు(ఎస్టీ), దివ్యాంగులు(పీడబ్ల్యూడీ) ఉన్నారు. అన్ని ప్రధాన సామాజిక వర్గాల నుంచి దరఖాస్తుదారులు ఉండటం ఈ పథక విస్తృత పరిధిని, సమ్మిళిత విధానాన్ని ప్రతిబింబిస్తోంది. సమాజంలోని వివిధ వర్గాలకు విద్యావకాశాలను న్యాయంగా, సమానంగా అందుబాటులోకి తీసుకురావటం, ఆర్థిక అడ్డంకులను తగ్గించటంలో పథకం అందిస్తున్న తోడ్పాటును ఇది స్పష్టం చేస్తోంది.
పీఎం విద్యాలక్ష్మి పథకం: విద్యా సమానత్వం దిశగా కీలక అడుగు
ప్రతిభావంతులకు పూచీకత్తు, హామీదారు అవసరం లేని విద్యా రుణాలను అందించటంతో పాటు అర్హత కలిగిన కుటుంబాలకు లక్షిత వడ్డీ రాయితీ కల్పించే పీఎం విద్యాలక్ష్మి పథకం ఉన్నత విద్యలో సమాన అవకాశాలను విస్తరించే దిశగా కీలక అడుగు. ఆర్థిక అడ్డంకులను తగ్గించటం ద్వారా, ప్రత్యేకించి ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులు నాణ్యమైన ఉన్నత విద్యలో ఎక్కువగా భాగస్వాములయ్యేందుకు ఈ పథకం వీలు కల్పిస్తోంది. ఈ క్రమంలో సమ్మిళిత, సమాన, నాణ్యమైన విద్యకు సంబంధించిన జాతీయ విద్యా విధానం-2020 లక్ష్యాలను ముందుకు తీసుకెళ్తోంది. సుస్థిర అభివృద్ధి లక్ష్యం-4 సాధనకు దోహదం చేస్తూ, దేశానికి నైపుణ్యవంతమైన, భవిష్యత్తు అవసరాలకు సిద్ధమైన మానవ వనరుల పునాదిని నిర్మించేందుకు అండగా నిలుస్తోంది.
References
- Ministry of Electronics and Information Technology (MeitY)
https://www.myscheme.gov.in/schemes/pmvs
- United Nations Department of Economic and Social Affairs
https://sdgs.un.org/goals/goal4#targets_and_indicators
- Press Information Bureau
https://www.pib.gov.in/PressNoteDetails.aspx?NoteId=154950&ModuleId=3®=48&lang=2
- NITI Aayog
https://www.niti.gov.in/sites/default/files/2025-08/india-voluntary-national-review.pdf
- Ministry of Educatio
https://cdnbbsr.s3waas.gov.in/s392049debbe566ca5782a3045cf300a3c/uploads/2025/06/202506041473712372.pdf
https://cdnbbsr.s3waas.gov.in/s392049debbe566ca5782a3045cf300a3c/uploads/2026/07/202607131602421770.pdf
https://aicte.gov.in/sites/default/files/nep2020.pdf
https://www.govtschemes.in/sites/default/files/2024-11/PM%20Vidyalaxmi%20Scheme%20Details.pdf?v=1
https://pmvidyalaxmi.co.in/Index.aspx
https://pmvidyalaxmi.co.in/img/UserManual-Student.pdf
https://www.education.gov.in/en/pradhan-mantri-vidyalaxmi-pm-vidyalaxmi-scheme-guidelines
Click to See PDF
***
(Explainer ID: 159364)
आगंतुक पटल : 18
Provide suggestions / comments