• Sitemap
  • Advance Search
Energy & Environment

పులుల సంరక్షణలో ముందున్న‌ భారత్

‘‘పులుల ర‌క్ష‌ణ‌... పర్యావరణ వ్యవస్థల పరిరక్ష‌ణ‌’’

Posted On: 28 JUL 2026 10:54AM

శాస్త్రీయ విధానాలు, బలమైన సంస్థాగత మద్దతుతో పులుల సంరక్షణలో భారత్‌ ప్రపంచ అగ్రగామిగా అవతరించింది. ప్రపంచంలోని అడవి పులుల్లో దాదాపు 70 శాతం భారత్‌లోనే ఉన్నాయి. సాంకేతికత ఆధారిత పర్యవేక్షణ, సమర్థ పాలన, ప్రజల భాగస్వామ్యం కారణంగా సంరక్షణ ఫలితాలు మరింత మెరుగయ్యాయి. పులులు, వాటి ఆవాసాల భవిష్యత్తుకు భరోసా కల్పించే దిశగా అంతర్జాతీయ సహకారాన్ని కూడా భారత్‌ ముందుకు తీసుకెళుతోంది.

వర్ధిల్లుతున్న పులులు... దృఢమైన పర్యావరణ వ్యవస్థలు
ప్రతి ఏటా జులై 29న నిర్వహించే అంతర్జాతీయ పులుల దినోత్సవం పులుల సంరక్షణకు ఉన్న ప్రపంచ ప్రాధాన్యాన్ని చాటుతుంది. శాస్త్రీయ సంరక్షణ, సుస్థిర అభివృద్ధి పట్ల ప్రభుత్వ దీర్ఘకాలిక నిబద్ధతను భారత్‌కు సంబంధించి ఈ దినోత్సవం మరోసారి స్పష్టం చేస్తుంది. సంరక్షణ రంగంలో భారత్‌ సాధించిన అసాధారణ విజయాలను కూడా ఈ రోజు ప్రపంచానికి తెలియజేస్తుంది. ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యధిక అడవి పులుల జనాభా భారత్‌లో ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మొత్తం అడవి పులుల్లో దాదాపు 70 శాతం మన దేశంలోనే ఉన్నాయి. దశాబ్దాలుగా కొనసాగుతున్న విధానపరమైన మద్దతు, శాస్త్రీయ నిర్వహణ, ప్రజల భాగస్వామ్యానికి ఈ విజయం నిదర్శనం. పులుల సంరక్షణలో భారత్‌ను ప్రపంచ అగ్రగామిగా నిలిపిన ఘనత కూడా వీటికే దక్కుతుంది.



ఈ విజయానికి పులులతో భారత్‌కు ఉన్న లోతైన సాంస్కృతిక, పర్యావరణ అనుబంధమే పునాది. శతాబ్దాలుగా ప్రాచీన నాణేలు, రాజముద్రలు, ఆలయ శిల్పాల్లో పులిని శక్తి, సార్వభౌమత్వానికి ప్రతీకగా చిత్రీకరించారు. ఈ చిరకాల వారసత్వాన్ని గుర్తించిన ప్రభుత్వం 1972లో రాయల్‌ బెంగాల్‌ టైగర్‌ను జాతీయ జంతువుగా ప్రకటించింది. నేటికీ పులి భారత సమృద్ధ జీవవైవిధ్యానికి, పర్యావరణ సంపదకు, విభిన్న భూభాగాల్లో విస్తరించిన ఉమ్మడి సహజ వారసత్వానికి ప్రతీకగా నిలుస్తోంది.

సాంస్కృతిక ప్రాధాన్యానికి మించి పర్యావరణ పరంగా కూడా పులి కీలక పాత్ర పోషిస్తుంది. ఆహార గొలుసులో అగ్రస్థాయి వేటాడే జంతువుగా, అనేక జీవజాతులకు రక్షణ కల్పించే ‘అంబ్రెల్లా స్పీసీస్‌’గా ఆరోగ్యకరమైన అటవీ పర్యావరణ వ్యవస్థల పరిరక్షణకు తోడ్పడుతుంది. పులుల ఆవాసాలను సంరక్షించడం ద్వారా అడవులు, నదులు, లెక్కలేనన్ని ఇతర జీవజాతులకు రక్షణ లభిస్తుంది. ఈ అడవులు నీటి వ్యవస్థను క్రమబద్ధీకరిస్తాయి. నేలను కాపాడతాయి. పరాగసంపర్కానికి దోహదం చేస్తాయి. స్థానిక వాతావరణాన్ని సమతుల్యం చేస్తాయి. ప్రకృతి విపత్తుల ముప్పును తగ్గించడంతో పాటు గ్రామీణ జీవనోపాధులు, పట్టణ ఆర్థిక వ్యవస్థలకు అవసరమైన పర్యావరణ సేవలను అందిస్తాయి. పులులు, వాటి ఆవాసాలను కాపాడటం ద్వారా ప్రభుత్వం జీవవైవిధ్య పరిరక్షణను బలోపేతం చేస్తోంది. పర్యావరణ భద్రతను పెంచుతోంది, సుస్థిర అభివృద్ధి ద్వారా వికసిత భారత్‌ లక్ష్యాన్ని ముందుకు తీసుకెళుతోంది.

మీకు తెలుసా? అంతర్జాతీయ పులుల దినోత్సవానికి 2010 నవంబరులో జరిగిన సెయింట్‌ పీటర్స్‌బర్గ్‌ టైగర్‌ సమ్మిట్‌ మూలం. భారత్‌ సహా పులులు విస్తరించిన 13 దేశాల నాయకులు 2022 నాటికి ప్రపంచ అడవి పులుల జనాభాను రెట్టింపు చేయాలనే ప్రతిష్ఠాత్మక ‘టీఎక్స్‌2’ లక్ష్యాన్ని ఆమోదించారు. నేడు సంరక్షణ పురోగతిని సమీక్షించేందుకు, అంతర్జాతీయ సహకారాన్ని బలోపేతం చేసేందుకు, ప్రజల్లో అవగాహన పెంచేందుకు ఈ దినోత్సవం ప్రపంచ వేదికగా ఉపయోగపడుతోంది. 2010లో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 3,200 అడవి పులులు మాత్రమే మిగిలి ఉన్నట్లు అంచనా. మెరుగైన సంరక్షణ చర్యలు, శాస్త్రీయ పర్యవేక్షణ ఫలితంగా 2022 నాటికి ఈ సంఖ్య దాదాపు 4,500కు పెరిగింది. సమంజసమైన అంచనా పరిధి ప్రకారం ఈ సంఖ్య 3,700 నుంచి 5,600 మధ్య ఉంది. తాజా ప్రపంచ అంచనాల ప్రకారం.. ప్రస్తుతం దాదాపు 5,711 అడవి పులులు ఉన్నాయి. 2010తో పోలిస్తే ఇది సుమారు 78 శాతం పెరుగుదల.

పెరిగిన పులుల సంఖ్య: సంక్షోభం నుంచి పునరుద్ధరణ దిశగా
వన్యప్రాణుల పునరుద్ధరణలో భారత్‌ చేపట్టిన పులుల సంరక్షణ చర్యలు ప్రపంచానికి ఆదర్శంగా నిలిచాయి. శాస్త్రీయంగా అంచనా వేసిన దేశ పులుల జనాభా 2006 నుంచి రెట్టింపునకు పైగా పెరిగింది. అఖిల భారత పులుల గణన–2022 ప్రకారం దేశంలో పులుల సంఖ్య 3,682. ఈ గణన 20 రాష్ట్రాల్లో సాగింది. సిబ్బంది కాలినడకన 6.41 లక్షల కిలోమీటర్లకు పైగా ప్రయాణించి సర్వే నిర్వహించారు. ప్రపంచంలోనే అతిపెద్ద, అత్యంత సమగ్ర వన్యప్రాణుల అంచనాల్లో ఇది ఒకటి. నిరంతర విధానపరమైన మద్దతు, శాస్త్రీయ సంరక్షణ, బలమైన సంస్థాగత పాలనకు ఈ అసాధారణ పునరుద్ధరణ నిదర్శనం. ఆవాసాలకు దీర్ఘకాలిక రక్షణ, కట్టుదిట్టమైన పర్యవేక్షణ, సమన్వయంతో కూడిన అమలు దేశవ్యాప్తంగా పులుల సంరక్షణను మరింత బలోపేతం చేస్తున్నాయి.

 



పులుల సంరక్షణకు పటిష్ఠ పాలనా వ్యవస్థ
పులుల సంరక్షణకు భారత్‌ అమలు చేస్తున్న విధాన చట్రం దీర్ఘకాలిక దార్శనికతతో పాటు జాతీయ, రాష్ట్ర స్థాయుల్లో నిరంతర సంస్థాగత మద్దతును సమన్వయం చేస్తుంది. ప్రాజెక్ట్‌ టైగర్‌, జాతీయ పులుల సంరక్షణ ప్రాధికార సంస్థ(ఎన్‌టీసీఏ), పులుల సంరక్షణ ప్రణాళికలు కలిసి పులుల ఆవాసాలకు పటిష్ఠమైన శాస్త్రీయ పాలనా వ్యవస్థను అందిస్తున్నాయి.

ప్రాజెక్ట్‌ టైగర్‌
ప్రాజెక్ట్‌ టైగర్‌ భారత ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక కేంద్ర ప్రాయోజిత పథకం. కేంద్ర పర్యావరణం, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ దీన్ని అమలు చేస్తోంది. పులులు వాటి సహజ ఆవాసాల్లో మనుగడ సాగించగల స్థిరమైన జనాభాకు భరోసా కల్పించడం ఈ పథకం లక్ష్యం. సంరక్షణ చర్యల కోసం పులులు విస్తరించిన రాష్ట్రాలకు ఆర్థిక, సాంకేతిక సహాయాన్ని అందిస్తుంది. ఆవాసాల రక్షణ, శాస్త్రీయ నిర్వహణ, క్రమం తప్పని క్షేత్రస్థాయి పర్యవేక్షణను ఈ కార్యక్రమం సమన్వయం చేస్తుంది. కాలక్రమంలో సంరక్షణ చర్యలు మరింత బలోపేతం కావడానికి ఈ విధానం దోహదపడింది.



జాతీయ పులుల సంరక్షణ ప్రాధికార సంస్థ (ఎన్‌టీసీఏ) నివేదిక–2023 ప్రకారం.. ప్రాజెక్ట్‌ టైగర్‌ కింద పులులు విస్తరించిన 18 రాష్ట్రాల్లో 58 పులుల అభయారణ్యాల వ్య‌వ‌స్థ‌ ఏర్పాటైంది. ఇవి దాదాపు 84,500 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్నాయి. ఇది భారత భౌగోళిక విస్తీర్ణంలో సుమారు 2.56 శాతం. నేటికీ ప్రాజెక్ట్‌ టైగర్‌ దేశ వన్యప్రాణుల సంరక్షణ చర్యలకు మూలస్తంభంగా కొనసాగుతోంది. పులులు, వాటి ఆవాసాల పరిరక్షణ పట్ల ప్రభుత్వ దీర్ఘకాలిక నిబద్ధతకు ఇది అద్దం పడుతోంది.

మీకు తెలుసా? వన్యప్రాణుల పరిరక్షణ చట్టం–1972లోని సెక్షన్‌ 38 వీ (3) ప్రకారం ప్రతి పులుల అభయారణ్యానికి సంబంధిత రాష్ట్ర ప్రభుత్వం పులుల సంరక్షణ ప్రణాళికను సిద్ధం చేయాలి. పులుల అభయారణ్యాలకు రక్షణ కల్పించడంతో పాటు పులులు, సహ వేటాడే జంతువులు, ఆహారంగా ఉపయోగపడే జంతువుల స్థిరమైన జనాభాకు అవసరమైన ఆవాస వనరులను ఈ ప్రణాళికలు తప్పనిసరిగా సమకూర్చాలి.

జాతీయ పులుల సంరక్షణ ప్రాధికార సంస్థ (ఎన్‌టీసీఏ)


ప్రాజెక్ట్‌ టైగర్‌తో పాటు సంబంధిత సంరక్షణ కార్యక్రమాల అమలును ఎన్‌టీసీఏ పర్యవేక్షిస్తుంది. పులులు విస్తరించిన రాష్ట్రాలకు శాస్త్రీయ, సాంకేతిక, ఆర్థిక మార్గదర్శకత్వాన్ని అందిస్తుంది. పులుల సంరక్షణ ప్రణాళికలను ఆమోదిస్తుంది. అభయారణ్యాల నిర్వహణకు ప్రామాణిక కార్యాచరణ విధానాలను జారీ చేస్తుంది. నిర్ణీత కాలాల్లో అంచనాలు నిర్వహిస్తూ పులుల అభయారణ్యాల నిర్వహణను కూడా పర్యవేక్షిస్తుంది. ఈ సంస్థ అనుసరిస్తున్న శాస్త్రీయ విధానం ఆవాసాల రక్షణను పటిష్ఠం చేస్తోంది. సంరక్షణ ఫలితాలను మెరుగుపరుస్తోంది. దేశవ్యాప్తంగా అడవి పులుల దీర్ఘకాలిక మనుగడకు తోడ్పడుతోంది.



మీకు తెలుసా? కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి ఎన్‌టీసీఏకు అధ్యక్షత వహిస్తారు. పార్లమెంట్‌ సభ్యులు, ప్రభుత్వ సీనియర్‌ అధికారులు, నిపుణులు కూడా ఇందులో ఉంటారు. పులుల సంరక్షణకు దిశానిర్దేశం చేయడం, పులుల అభయారణ్యాలను పర్యవేక్షించడం, దేశవ్యాప్తంగా ప్రాజెక్ట్‌ టైగర్‌ సమర్థ అమలుకు భరోసా కల్పించడం ఈ సంస్థ బాధ్యత.

టైగర్‌ టాస్క్‌ ఫోర్స్‌
సంరక్షణ విధానాలను పునఃపరిశీలించి, సంస్కరణలను సిఫార్సు చేసేందుకు భారత ప్రభుత్వం టైగర్‌ టాస్క్‌ ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది. దేశ పులుల సంరక్షణ చట్రాన్ని సమీక్షించిన ఈ కార్యదళం కీలక విధాన సంస్కరణలను సిఫార్సు చేసింది. పరిపాలనా నిపుణులు, పర్యావరణ శాస్త్రవేత్తలు, స్థానిక సముదాయాల ప్రతినిధులను ఒకే వేదికపైకి తీసుకొచ్చింది. పారదర్శకత, ప్రజల భాగస్వామ్యం, ప్రాజెక్ట్‌ టైగర్‌కు మరింత బలమైన సంస్థాగత మద్దతు అవసరమని నొక్కిచెప్పింది. దీని సిఫార్సులు మరింత పటిష్ఠమైన సంరక్షణ చట్రానికి రూపునిచ్చాయి. 2006లో వన్యప్రాణుల పరిరక్షణ చట్టానికి కీలక సవరణలు రావడానికి దారితీశాయి. ఈ సవరణల ద్వారా జాతీయ పులుల సంరక్షణ ప్రాధికార సంస్థ(ఎన్‌టీసీఏ), వన్యప్రాణి నేర నియంత్రణ బ్యూరో(డబ్ల్యూసీసీబీ) చట్టబద్ధ సంస్థలుగా ఏర్పాటయ్యాయి.

సంస్థలు, సహకార సమాఖ్య విధానం పునాదిగా భారత్‌ అనుసరిస్తున్న పులుల సంరక్షణ చట్రం బలమైన పాలనా నమూనాకు ప్రతీక. దేశ జీవవైవిధ్యాన్ని ముందుకు తీసుకెళుతూనే పులుల భవిష్యత్తుకు భరోసా కల్పించేందుకు ఈ సమగ్ర విధానం తోడ్పడుతోంది.

మీకు తెలుసా? భారత్‌లోని పులుల అభయారణ్యాలు భూదృశ్య ఆధారిత సంరక్షణ విధానాన్ని అనుసరిస్తాయి. ప్రతి అభయారణ్యంలో కోర్‌ ఏరియా (కీలక పులుల ఆవాసం అని కూడా పిలుస్తారు), బఫర్‌ ఏరియా ఉంటాయి. కోర్‌ ఏరియాలకు అత్యున్నత స్థాయి రక్షణ లభిస్తుంది. బఫర్‌ ఏరియాలు సంరక్షణ, సుస్థిర జీవనోపాధుల మధ్య సమతుల్యతను సాధిస్తాయి. వన్యప్రాణుల కారిడార్లు పులుల అభయారణ్యాలను అనుసంధానిస్తాయి. దీంతో పులులు సురక్షితంగా సంచరించగలుగుతాయి. వివిధ భూదృశ్యాల్లో ఆరోగ్యకరమైన పులుల జనాభా కొనసాగుతుంది.

భారత్‌లో పులుల పర్యవేక్షణ, మదింపు
పులుల జనాభాను పర్యవేక్షించి, మదింపు చేసేందుకు భారత్‌ పటిష్ఠమైన శాస్త్రీయ వ్యవస్థను అభివృద్ధి చేసింది. క్షేత్రస్థాయి సర్వేలు, కెమెరా ట్రాప్‌లు, డిజిటల్‌ సాంకేతికతలు, శాస్త్రీయ విశ్లేషణను ఈ విధానం సమన్వయం చేస్తుంది. పులుల జనాభా, వాటి ఆహారంగా ఉపయోగపడే జీవజాతులు, ఆవాసాల నాణ్యతపై విశ్వసనీయ సమాచారాన్ని అందిస్తుంది. ఆధారాలతో కూడిన సంరక్షణ ప్రణాళికలు, పరిస్థితులకు అనుగుణంగా నిర్వహణ చేపట్టేందుకు ఈ సమాచారం దిశానిర్దేశం చేస్తుంది. నిరంతర పర్యవేక్షణ ఆవాసాల రక్షణను బలోపేతం చేయడంతో పాటు పులులు విస్తరించిన ప్రాంతాల్లో సమగ్ర సమాచారంతో కూడిన నిర్వహణ నిర్ణయాలకు వీలు కల్పిస్తుంది.



అఖిల భారత పులుల గణన (ఏఐటీఈ): ప్రపంచంలోనే అతిపెద్ద జీవవైవిధ్య సర్వే
ఏఐటీఈ ప్రపంచంలోనే అతిపెద్ద జీవవైవిధ్య సర్వే. ప్రతి నాలుగేళ్లకు ఒకసారి నిర్వహించే ఈ సర్వేకు భారత వన్యప్రాణి సంస్థ (డబ్ల్యూఐఐ) సహకారంతో ఎన్‌టీసీఏ నాయకత్వం వహిస్తుంది. పులులు ఉన్న అన్ని రాష్ట్రాల్లో పులుల జనాభా, సహ వేటాడే జంతువులు, ఆహార జీవజాతులు, ఆవాసాల నాణ్యతను ఇది అంచనా వేస్తుంది. 2022 అంచనాలో తొలిసారిగా దేశవ్యాప్తంగా గిట్టలు కలిగిన జంతువుల సర్వేను కూడా చేర్చారు. పులుల స్థిరమైన జనాభా మనుగడకు ఆరోగ్యకరమైన ఆహార జంతువుల సంఖ్య ఎంత ముఖ్యమో ఈ ప్రక్రియ వెల్లడించింది.

మీకు తెలుసా? అఖిల భారత పులుల గణన ప్రపంచంలోనే అతిపెద్ద జీవవైవిధ్య సర్వేగా గుర్తింపు పొందింది. ఎన్‌టీసీఏ నిర్వహించిన కెమెరా ట్రాప్‌ సర్వే ప్రపంచంలోనే అతిపెద్ద కెమెరా ట్రాప్‌ వన్యప్రాణుల సర్వేగా గిన్నిస్‌ ప్రపంచ రికార్డు సాధించింది. అధునాతన సాంకేతికతలు, శాస్త్రీయ పర్యవేక్షణతో భారత్‌ చేపట్టే పులుల గణన ప్రపంచంలోనే అత్యంత కట్టుదిట్టమైన అంచనా ప్రక్రియల్లో ఒకటిగా నిలిచింది.

సాంకేతికత ఆధారిత పర్యవేక్షణ
పులుల పర్యవేక్షణలో ప్రతి దశకూ భారత్‌ అధునాతన డిజిటల్‌ సాంకేతికతలను అనుసంధానించింది. ‘మానిటరింగ్‌ సిస్టమ్‌ ఫర్‌ టైగర్స్‌–ఇంటెన్సివ్‌ ప్రొటెక్షన్‌ అండ్‌ ఎకలాజికల్‌ స్టేటస్‌’ (ఎం–స్ట్రైప్స్‌) క్షేత్రస్థాయి పర్యవేక్షణకు జీపీఎస్‌, జీపీఆర్‌ఎస్‌, రిమోట్‌ సెన్సింగ్‌ సాంకేతికతలను ఉపయోగిస్తుంది. జీపీఎస్‌ ట్యాగ్‌ చేసిన చిత్రాలు సమాచార కచ్చితత్వాన్ని పెంచి, మానవ తప్పిదాలను తగ్గిస్తాయి. క్షేత్రస్థాయి పరిశీలనలను శాస్త్రీయ విశ్లేషణ, సమగ్ర నిర్ణయాల కోసం ఈ వేదిక కేంద్ర సమాచార నిధిలో అనుసంధానిస్తుంది. కృత్రిమ మేధ పర్యవేక్షణను మరింత పటిష్ఠం చేస్తోంది. కెమెరా ట్రాప్‌ డేటా రిపాజిటరీ అండ్‌ అనాలిసిస్‌ టూల్‌ (క్యాట్‌రాట్‌) కెమెరా ట్రాప్‌ చిత్రాలను జీవజాతుల వారీగా స్వయంచాలకంగా వర్గీకరిస్తుంది. ‘ఎక్స్‌ట్రాక్ట్‌ కంపేర్‌’ పులులపై ఉండే ప్రత్యేక చారల నమూనాల ఆధారంగా ఒక్కో పులిని గుర్తిస్తుంది. ఈ సాధనాలన్నీ కలిసి పులుల జనాభా అంచనాల్లో కచ్చితత్వం, విశ్వసనీయతను పెంచుతున్నాయి.

నిర్వహణ ప్రభావశీలత మదింపు (ఎంఈఈ)


పులుల అభయారణ్యాల నిర్వహణ ఎంత సమర్థంగా ఉందో ఎంఈఈ అంచనా వేస్తుంది. ప్రణాళిక, రక్షణ, నిర్వహణ ప్రక్రియలు, సంరక్షణ ఫలితాలను ఈ చట్రం మదింపు చేస్తుంది. నిర్వహణలోని లోపాలను గుర్తించడంతో పాటు జవాబుదారీతనాన్ని బలోపేతం చేయడానికి తోడ్పడుతుంది. 2022 నాటికి ఈ చట్రం కింద 51 పులుల అభయారణ్యాలను మదింపు చేశారు. పన్నెండు అభయారణ్యాలు ‘అత్యుత్తమం’ రేటింగ్‌ పొందగా, సగటు నిర్వహణ స్కోరు 78 శాతానికి చేరింది. ఈ ఫలితాలు విధాన నిర్ణయాలకు దిశానిర్దేశం చేస్తాయి, అభయారణ్యాల నిర్వహణను పటిష్ఠం చేస్తాయి, దీర్ఘకాలిక సంరక్షణ ప్రణాళికలకు తోడ్పడతాయి.



పులుల సంరక్షణలో భారత్‌ ప్రపంచ నాయకత్వం
పులులు, ఇతర వన్యప్రాణుల సంరక్షణను బలోపేతం చేసేందుకు భారత్‌ ప్రపంచంలోని పలు దేశాలతో చురుగ్గా కలిసి పనిచేస్తోంది. నేపాల్‌, భూటాన్‌తో సరిహద్దులకు అతీతమైన జీవవైవిధ్య సంరక్షణ భాగస్వామ్యాలు ఇందులో కీలకమైనవి. కలప అక్రమ రవాణాను అరికట్టడం, పులులతో పాటు ఇతర వన్యప్రాణులను సంరక్షించడంపై మయన్మార్‌తో సహకారం సాగుతోంది. కెమెరా ట్రాప్‌ సమాచార నిర్వహణలో రష్యాతో భారత్‌ కలిసి పనిచేస్తోంది. పులులు, చిరుతల సంరక్షణపై భారత్‌–రష్యా కార్యాచరణ ఉపసంఘం ద్వారా కూడా సహకారం కొనసాగుతోంది. బోట్స్వానా, దక్షిణాఫ్రికా, గ్వాటెమాలా, కంబోడియా, కెన్యా, నమీబియాలతో భాగస్వామ్యాలు వన్యప్రాణుల సంరక్షణ, నిర్వహణ, జీవవైవిధ్య సుస్థిర వినియోగాన్ని బలోపేతం చేస్తున్నాయి. పులుల సంరక్షణపై చైనాతో కూడా భారత్‌ ద్వైపాక్షిక సహకారాన్ని ఏర్పాటు చేసుకుంది. శాస్త్ర విజ్ఞానం, సహకారం, ఉమ్మడి కార్యాచరణ ద్వారా ప్రపంచ వన్యప్రాణుల సంరక్షణ పట్ల భారత్‌కు ఉన్న నిబద్ధతను ఈ భాగస్వామ్యాలు మరింత బలపరుస్తున్నాయి.

అంతర్జాతీయ బిగ్‌ క్యాట్‌ అలయన్స్‌ (ఐబీసీఏ)

 


ఐబీసీఏ అనేది పెద్ద పిల్లి జాతి జంతువులు విస్తరించిన 95 దేశాలు, భాగస్వామ్య దేశాలు, శాస్త్రీయ సంస్థలు, సంరక్షణ భాగస్వాములతో కూడిన ప్రపంచ కూటమి. పులి, సింహం, చిరుత, మంచు చిరుత, చీతా, జాగ్వార్‌, ప్యూమా అనే ఏడు పెద్ద పిల్లి జాతుల సంరక్షణకు ఈ కూటమి సహకారాన్ని ప్రోత్సహిస్తుంది. భారత్‌లో ప్రధాన కార్యాలయంతో కూడిన దీని సచివాలయం ఏర్పాటుకు కేంద్ర మంత్రివర్గం 2024 మార్చి 12న ఆమోదం తెలిపింది. ప్రపంచ గుర్తింపు పొందిన భారత్‌ పులుల సంరక్షణ అనుభవాన్ని పునాదిగా చేసుకొని, పెద్ద పిల్లి జాతులు, వాటి ఆవాసాల రక్షణకు అంతర్జాతీయ సహకారాన్ని ఐబీసీఏ బలోపేతం చేస్తోంది.

గ్లోబల్‌ టైగర్‌ ఫోరం (జీటీఎఫ్‌)


పులుల సంరక్షణకే ప్రత్యేకంగా అంకితమైన ప్రపంచ ఏకైక అంతర్‌ ప్రభుత్వ సంస్థ జీటీఎఫ్‌. న్యూఢిల్లీ ప్రధాన కేంద్రంగా పనిచేసే ఈ సంస్థలో పులులు విస్తరించిన 13 దేశాలు సభ్యులుగా ఉన్నాయి. అవి బంగ్లాదేశ్‌, భూటాన్‌, కంబోడియా, చైనా, భారత్‌, ఇండోనేషియా, లావో పీడీఆర్‌, మలేసియా, మయన్మార్‌, నేపాల్‌, రష్యా, థాయ్‌లాండ్‌, వియత్నాం. పులులు, వాటి ఆహార జీవజాతులు, ఆవాసాల సంరక్షణకు ఉమ్మడి విధానాన్ని ఈ వేదిక ప్రోత్సహిస్తుంది. సభ్య దేశాల్లో పులుల సంరక్షణను బలోపేతం చేసేందుకు విస్తృత భూదృశ్య స్థాయి సంరక్షణ, ప్రాంతీయ సామర్థ్యాల పెంపు, సాంకేతిక ఆవిష్కరణలకు మద్దతు ఇస్తుంది. విజ్ఞానాన్ని పంచుకోవడం, అంతర్జాతీయ సహకారం ద్వారా ప్రపంచ పులుల సంరక్షణలో భారత్‌ నాయకత్వాన్ని జీటీఎఫ్‌ మరింత పటిష్ఠం చేస్తోంది.

సమగ్ర పులుల ఆవాస సంరక్షణ కార్యక్రమం (ఐటీహెచ్‌సీపీ)
ఐటీహెచ్‌సీపీ అనేది అంతర్జాతీయ ప్రకృతి పరిరక్షణ సమాఖ్య (ఐయూసీఎన్‌) చేపట్టిన ప్రతిష్ఠాత్మక పులుల సంరక్షణ కార్యక్రమం. కేఎఫ్‌డబ్ల్యూ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ ద్వారా జర్మనీ ప్రభుత్వం దీనికి నిధులు సమకూరుస్తోంది. ఆసియాలో ప్రాధాన్య పులుల భూదృశ్యాల్లో చేపట్టే శాస్త్రీయ సంరక్షణ ప్రాజెక్టులకు ఈ కార్యక్రమం మద్దతు ఇస్తుంది. ఆవాసాల రక్షణ, భూదృశ్య స్థాయి సంరక్షణ, అంతర్జాతీయ సహకారాన్ని ప్రోత్సహిస్తుంది. ఐటీహెచ్‌సీపీ కార్యక్రమాల్లో భారత్‌ చురుగ్గా పాల్గొంటూ పులులు, వాటి ఆవాసాల సంరక్షణకు ప్రాంతీయ స్థాయిలో చేపట్టే చర్యలను బలోపేతం చేస్తోంది.

మీకు తెలుసా? కన్జర్వేషన్‌ అష్యూర్డ్‌ టైగర్‌ స్టాండర్డ్స్‌ (సీఏ|టీఎస్‌) అనేది పులుల సంరక్షణ ప్రాంతాల సమర్థ నిర్వహణకు భరోసా కల్పించే ప్రపంచ ధ్రువీకరణ వ్యవస్థ. 2013లో జపాన్‌లో జరిగిన తొలి ఆసియా పార్కుల కాంగ్రెస్‌లో దీన్ని ప్రారంభించారు. రక్షణ, ఆవాసాల నిర్వహణ, స్థానిక సముదాయాల భాగస్వామ్యం, వన్యప్రాణుల పర్యవేక్షణకు ఇది ప్రమాణాలను నిర్దేశిస్తుంది. పులులకు సురక్షితమైన, సుస్థిర వాతావరణాన్ని కల్పించడం, ప్రపంచ జీవవైవిధ్యాన్ని పరిరక్షించడం లక్ష్యంగా సీఏ|టీఎస్‌ చర్యలకు మద్దతు ఇస్తుంది. సంరక్షణలో ప్రపంచ అత్యుత్తమ విధానాల అమలుకు భరోసా కల్పిస్తూ భారత్‌లోని 23 పులుల అభయారణ్యాలకు సీఏ|టీఎస్‌ గుర్తింపు ఇచ్చింది.

సరిహద్దులకు అతీతంగా పులుల సంరక్షణకు చేపట్టే సమష్టి కార్యాచరణను భారత్‌ అంతర్జాతీయ భాగస్వామ్యాలు బలోపేతం చేస్తున్నాయి. విజ్ఞానం, సాంకేతికత, అత్యుత్తమ విధానాలను ప పంచుకోవడం ద్వారా పులులు, వాటి ఆవాసాల రక్షణకు ప్రపంచవ్యాప్తంగా సాగే కృషిని భారత్‌ ముందుకు తీసుకెళుతోంది.

పులులకు సురక్షిత భవిష్యత్తు దిశగా
భారత్‌కు పులుల సంరక్షణ అనేది నిరంతరం మారుతూ, అభివృద్ధి చెందుతున్న ప్రాధాన్య అంశం. వన్యప్రాణులతో పాటు ప్రజలకు కూడా మేలు చేసేలా అనుసంధానిత, వాతావరణ మార్పులను తట్టుకోగల పులుల భూదృశ్యాలకు భద్రత కల్పించాలన్నది భారత్‌ భవిష్యత్‌ దార్శనికత. సమాచార ఆధారిత పర్యవేక్షణ, సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన రక్షణ, క్షేత్రస్థాయి సిబ్బంది సామర్థ్యాల పెంపులో నిరంతర పెట్టుబడులు ఈ లక్ష్య సాధనకు తోడ్పడతాయి. పులులు విస్తరించిన ఇతర దేశాలు, ప్రపంచ భాగస్వాములతో సహకారం విజ్ఞానాన్ని పంచుకోవడానికి, సమష్టి సంరక్షణ విజయాలను మరింత బలోపేతం చేయడానికి ఉపయోగపడుతుంది. ముఖ్యంగా యువతను భాగస్వాములను చేస్తూ భవిష్యత్‌ కార్యాచరణను ముందుకు తీసుకెళ్లేందుకు అంతర్జాతీయ పులుల దినోత్సవం ప్రతి ఏటా ఒక అవకాశాన్ని కల్పిస్తుంది. బలమైన విధాన దిశకు నిరంతర అమలును జోడించడం ద్వారా పులుల సంరక్షణ ప్రయాణంలో ప్రపంచ నాయకత్వాన్ని కొనసాగించాలని భారత్‌ లక్ష్యంగా పెట్టుకుంది.

References

Ministry of Environment, Forest and Climate Change

National Tiger Conservation Authority

Global Tiger Forum

Others

Click here to see pdf

***

(Explainer ID: 159348) आगंतुक पटल : 16
Provide suggestions / comments
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Bengali , Kannada