Rural Prosperity
స్టార్టప్ విలేజ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ప్రోగ్రామ్ క్షేత్రస్థాయి ఔత్సాహికతతో గ్రామీణ ఆర్థిక వ్యవస్థలకు ఊతం
Posted On:
25 JUL 2026 10:02AM
స్టార్టప్ విలేజ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ప్రోగ్రామ్(ఎస్‌వీఈపీ) శిక్షణ, ఆర్థిక సహాయం, మార్గదర్శనం, సమాజ ఆధారిత సంస్థాగత తోడ్పాటు ద్వారా వ్యవసాయేతర సంస్థలకు అండగా నిలుస్తోంది. 2026 జూన్ 30 నాటికి దేశవ్యాప్తంగా 4.32 లక్షల గ్రామీణ సంస్థలకు ఎస్‌వీఈపీ సహాయం అందించింది. సామాజిక సమ్మిళితత్వం, ఔత్సాహిక అవకాశాలను అందరికీ సమానంగా అందించడంపై ఈ కార్యక్రమం ప్రత్యేక దృష్టి సారించింది. ఔత్సాహికుల్లో దాదాపు 86 శాతం మంది ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, ఓబీసీ వర్గాలకు చెందినవారు. స్వయం సహాయక సంఘాలు (ఎస్‌హెచ్‌జీలు), కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్స్–ఎంటర్‌ప్రైజ్ ప్రమోషన్ (సీఆర్‌పీ–ఈపీలు), బ్యాంకు అనుసంధానాలు, ప్రధానమంత్రి ముద్ర యోజన వంటి పథకాల సమన్వయం ద్వారా ఎస్‌వీఈపీ తన పరిధిని విస్తరించింది. పేదరిక నిర్మూలన, స్థానిక ఉపాధి కల్పన, గ్రామీణ ఆర్థికాభివృద్ధికి సమర్థవంతమైన క్షేత్రస్థాయి నమూనాగా ఎస్‌వీఈపీ నిలిచింది.
వ్యాపార సంస్థల ఆధారిత గ్రామీణ పరివర్తన దిశగా భారత్
ప్రపంచంలో మూడో అతిపెద్ద అంకుర సంస్థల వ్యవస్థ భారత్‌లో ఉంది. అనుకూల ప్రభుత్వ విధానాల తోడ్పాటుతో ఇది గణనీయంగా అభివృద్ధి చెంది, ఆర్థిక వృద్ధికి ఎంతో ప్రయోజనం చేకూర్చింది. అయితే, భారత్‌లోని స్టార్టప్ వ్యవస్థల్లో అధిక భాగం పట్టణ ప్రాంతాల్లోనే కేంద్రీకృతమై ఉన్నాయి. ఈ నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లో ఔత్సాహికత, ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం పలు కార్యక్రమాలు ప్రారంభించింది. వీటిలో స్టార్టప్ విలేజ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ప్రోగ్రామ్ (ఎస్‌వీఈపీ) కీలకమైనది.
2016లో ప్రారంభమైన ఎస్‌వీఈపీ.. దీనదయాళ్ అంత్యోదయ యోజన–జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ (డీఏవై–ఎన్‌ఆర్‌ఎల్‌ఎం) అనుబంధ పథకం. వ్యవసాయేతర రంగంలో చిన్న సంస్థలను నెలకొల్పేందుకు స్వయం సహాయక సంఘాలు, వాటి సభ్యుల కుటుంబాలకు ఈ కార్యక్రమం సహకరిస్తుంది. ఆర్థిక సహాయం, సంస్థాగత తోడ్పాటు, వ్యాపార నిర్వహణ శిక్షణ, వ్యక్తిగత నైపుణ్యాల అభివృద్ధి, వ్యాపారాభివృద్ధి సేవలను అందిస్తుంది. తద్వారా గ్రామీణ ప్రాంతాల్లో స్థిరమైన జీవనోపాధి, స్వయం ఉపాధి అవకాశాలకు ప్రోత్సాహం లభిస్తోంది.

బ్యాంకు అనుసంధానాలను పొందటంతో పాటు ప్రభుత్వ పథకాలతో సమన్వయం సాధించడానికీ ఎస్‌వీఈపీ సహకరిస్తుంది. దీర్ఘకాలిక ఆర్థిక వృద్ధి, విస్తృత సామాజిక ప్రయోజనాల సాధనపై వ్యూహాత్మకంగా దృష్టి సారించింది. స్థానికంగా సంస్థలకు నిధులు, సహాయం అందించే అంశాల్లో సమాజ ఆధారిత నిర్ణయాలకు ప్రాధాన్యం ఇవ్వడం ఎస్‌వీఈపీ ప్రత్యేకత.
దీనదయాళ్ అంత్యోదయ యోజన–జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్
ప్రపంచంలోని అతిపెద్ద జీవనోపాధి కార్యక్రమాల్లో దీనదయాళ్ అంత్యోదయ యోజన–జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ (డీఏవై–ఎన్‌ఆర్‌ఎల్‌ఎం) ఒకటి. గ్రామీణ పేద కుటుంబాలను, ప్రధానంగా మహిళలను స్వయం సహాయక సంఘాలుగా ఈ కార్యక్రమం సమీకరిస్తోంది. వారికి స్థిరమైన జీవనోపాధి, ఆర్థిక సేవలు, నైపుణ్యాభివృద్ధి అవకాశాలు కల్పించడంపై దృష్టి సారిస్తోంది. 2026 జూన్ మధ్య నాటికి డీఏవై–ఎన్‌ఆర్‌ఎల్‌ఎం పరిధిలో 10.29 కోట్లకు పైగా గ్రామీణ కుటుంబాలు స్వయం సహాయక సంఘాల్లో చేరాయి.
దేశవ్యాప్తంగా విస్తరిస్తున్న గ్రామీణ ఔత్సాహికత
మహిళలు, అణగారిన వర్గాలు, పరిమిత విద్యార్హతలు కలిగిన వ్యక్తులకు సహాయం అందించడంపై ప్రత్యేక దృష్టితో ఎస్‌వీఈపీ సమ్మిళిత విధానాన్ని అనుసరిస్తోంది. కార్యక్రమం ప్రారంభమైనప్పటి నుంచి 2026 జూన్ 15 వరకు 4.32 లక్షలకు పైగా గ్రామీణ సంస్థలకు సహాయం అందించింది. ఈ కార్యక్రమం కింద అత్యధిక సంఖ్యలో సంస్థలు సహాయం పొందిన రాష్ట్రాలుగా అస్సాం, బిహార్, ఝార్ఖండ్, పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్ నిలిచాయి.

ఎస్‌వీఈపీ నిరంతర విస్తరణకు మద్దతుగా ప్రభుత్వం 2026 ఫిబ్రవరి వరకు కేంద్ర వాటా కింద మొత్తంగా ₹942.09 కోట్లు విడుదల చేసింది. కార్యక్రమం ప్రారంభమైన 2016 నుంచి 2018 జనవరి వరకు విడుదల చేసిన మొత్తం ₹112.39 కోట్లతో పోలిస్తే ఇది దాదాపు 738 శాతం అధికం.

గ్రామీణ సంస్థల ప్రోత్సాహం, విస్తరణకు కార్యాచరణ ప్రణాళిక
రాష్ట్ర గ్రామీణ జీవనోపాధి మిషన్ల (ఎస్‌ఆర్‌ఎల్‌ఎంలు) ద్వారా ఎస్‌వీఈపీ అమలవుతోంది. ప్రతి బ్లాక్‌కు ₹6.50 కోట్ల కేటాయింపుతో పాటు ఒక్కో సంస్థపై సగటున ₹27,083 పెట్టుబడి పెట్టే వెసులుబాటు ఉంది.

బ్లాక్ స్థాయిలో బ్లాక్ రిసోర్స్ సెంటర్స్–ఎంటర్‌ప్రైజ్ ప్రమోషన్ (బీఆర్‌సీ–ఈపీలు) కార్యక్రమ అమలును సమన్వయం చేస్తాయి. శిక్షణ పొందిన కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్స్–ఎంటర్‌ప్రైజ్ ప్రమోషన్ (సీఆర్‌పీ–ఈపీలు) సంస్థల ప్రోత్సాహానికి సంబంధించి బ్లాక్ రిసోర్స్ సెంటర్లకు సాంకేతిక సహాయం అందిస్తారు. అర్హులైన ఔత్సాహికులకు బ్యాంకులు ఆర్థిక సహాయం అందిస్తాయి. సామర్థ్యం ఉన్న ఔత్సాహికులను గుర్తించడంలో స్వయం సహాయక సంఘాలు, వాటి సమాఖ్యలు సహకరిస్తాయి. సంస్థల స్థాపనకు సామాజిక సంస్థలు తోడ్పాటు అందించడంతో పాటు నిరంతరం చేయూతనిస్తాయి. కమ్యూనిటీ ఎంటర్‌ప్రైజ్ ఫండ్ (సీఈఎఫ్) ద్వారా రుణాలను కూడా అవే నిర్వహిస్తాయి. సంస్థల పనితీరు, వృద్ధిని సామాజిక సంస్థలు క్రమం తప్పకుండా పర్యవేక్షిస్తాయి. వ్యాపార ప్రణాళిక, రుణ మదింపు, సంస్థల పురోగతి పరిశీలనకు డిజిటల్ సాధనాలు ఉపయోగపడతాయి. ఈ సమగ్ర వ్యవస్థ సమర్థవంతమైన అమలు, సంస్థల అభివృద్ధికి భరోసా ఇస్తోంది.
పరీక్షలు, శిక్షణ, ధ్రువీకరణ ప్రక్రియల ద్వారా ఎస్‌ఆర్‌ఎల్‌ఎంలు, ప్రాజెక్టు అమలు సంస్థలు సంయుక్తంగా సీఆర్‌పీ–ఈపీలను ఎంపిక చేస్తాయి. ప్రాథమిక వ్యాపార, గణిత నైపుణ్యాలు కలిగిన స్థానికులకు ప్రాధాన్యం ఇస్తారు. కనీసం 90 శాతం సీఆర్‌పీ–ఈపీలను స్వయం సహాయక సంఘాల కుటుంబాల నుంచి ఎంపిక చేస్తారు. ఈ బృందంలో మహిళలు కనీసం 60 శాతం ఉండాలి. ఒక్కో సీఆర్‌పీ–ఈపీ గరిష్ఠంగా 50 సంస్థలకు మార్గదర్శనం, శిక్షణ, రుణ సదుపాయాల కల్పనలో సహాయం అందిస్తారు.
అవసరం, పేదరిక స్థితి, ఔత్సాహిక సామర్థ్యం ఆధారంగా సామాజిక సంస్థలు ఔత్సాహికులను గుర్తిస్తాయి. సంస్థ ఆర్థికంగా నిలదొక్కుకోగల సామర్థ్యాన్ని మదింపు చేసిన తర్వాత లబ్ధిదారులకు శిక్షణ, మార్గదర్శనం, ఆర్థిక సహాయం అందిస్తారు. రుణానికి తుది ఆమోదాన్ని సమాజ ఆధారిత సంస్థలు ఇస్తాయి. లబ్ధిదారుల్లో కనీసం 60 శాతం మంది మహిళలు ఉండాలని కార్యక్రమం నిర్దేశిస్తోంది. దివ్యాంగులు, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించడానికీ ప్రాధాన్యం ఇస్తోంది.
త్రైమాసిక సమీక్షలు, నిర్ణీత కాల వ్యవధుల్లో మదింపుల ద్వారా రాష్ట్ర, కేంద్ర స్థాయుల్లో ఎస్‌వీఈపీని పర్యవేక్షిస్తారు. సంస్థల పనితీరు, నిధుల వినియోగం, కార్యక్రమ పురోగతిని పరిశీలించేందుకు కేంద్రీకృత నిర్వహణ సమాచార వ్యవస్థ (ఎంఐఎస్) కూడా అందుబాటులో ఉంది.
గ్రామీణ జీవనోపాధి, ఔత్సాహికతపై ఎస్‌వీఈపీ ప్రభావం
గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ కోసం క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (క్యూసీఐ) ఎస్‌వీఈపీ మధ్యంతర మదింపును నిర్వహించింది. ఇందులో భాగంగా 2019లో ప్రధాన క్షేత్రస్థాయి మదింపులు చేపట్టింది. గ్రామీణ సంస్థలు, జీవనోపాధి, సామాజిక సమ్మిళితత్వంపై కార్యక్రమం చూపిన ప్రభావాన్ని ఈ సమీక్ష అంచనా వేసింది.
ఆదాయ కల్పన, సంస్థల అభివృద్ధి, బలహీన వర్గాల సాధికారతలో సానుకూల ఫలితాలు వచ్చినట్లు మదింపు ఫలితాలు వెల్లడించాయి:
* ఎస్‌వీఈపీ సహాయం పొందిన సంస్థల్లో 99 శాతం లాభాలు ఆర్జించాయి.
* కుటుంబాల మొత్తం ఆదాయంలో ఎస్‌వీఈపీ సంస్థల వాటా 57 శాతంగా ఉంది.
* సంస్థల సగటు నెలవారీ ఆదాయం దాదాపు ₹39,000గా నమోదైంది.
* తయారీ రంగ సంస్థలు నెలకు ₹47,800తో అత్యధిక సగటు ఆదాయాన్ని నమోదు చేశాయి.
* పొదుపు పెరిగినట్లు 96 శాతం మంది ఔత్సాహికులు తెలిపారు.
* 75 శాతం సంస్థలకు మహిళలు యజమానులుగా లేదా నిర్వాహకులుగా ఉన్నారు.
ఔత్సాహికులు తొలుత ఆశించినదాని కంటే అధిక ఆదాయం సంపాదించేందుకు ఎస్‌వీఈపీ తోడ్పడింది. ఆర్థిక సహాయం సులభంగా లభించడంతో ఔత్సాహికులు సంస్థలను స్థాపించి, విస్తరించగలిగారు. నిరంతర మార్గదర్శనం సంస్థల నిర్వహణ సామర్థ్యాన్ని, సుస్థిరతను బలోపేతం చేసింది.
అంతేకాక, మహిళలు, వెనుకబడిన వర్గాల వారు తమ కుటుంబాల్లో తొలితరం ఔత్సాహికులుగా ఎదిగేందుకు ఎస్‌వీఈపీ ప్రోత్సాహం ఇచ్చింది. తమలో ఆత్మవిశ్వాసం, జీవనోపాధి భద్రత పెరిగినట్లు లబ్ధిదారులు తెలిపారు. అనేక కుటుంబాల్లో విద్య, పోషకాహారం, ఆరోగ్యం, పారిశుద్ధ్య పరిస్థితులు మెరుగయ్యాయి. ఔత్సాహికులు మెరుగైన వ్యాపార నిర్వహణ, ఆర్థిక నైపుణ్యాలను పొందారు. పెరిగిన పొదుపు, పునఃపెట్టుబడులు సంస్థల దీర్ఘకాలిక వృద్ధికి తోడ్పడ్డాయి. లబ్ధిదారులకు తమ సమాజాల్లో సామాజిక గౌరవం పెరగడానికి కూడా ఈ కార్యక్రమం దోహదపడింది.
సంక్షేమం నుంచి సంస్థల ఆధారిత అభివృద్ధి వైపు
బలమైన సామాజిక సంస్థల మద్దతు లభిస్తే గ్రామీణ ఔత్సాహికత సమ్మిళిత ఆర్థిక వృద్ధికి శక్తిమంతమైన చోదకశక్తిగా పనిచేయగలదని ఎస్‌వీఈపీ నిరూపించింది. మహిళలు, ఎస్సీ, ఎస్టీ వర్గాలు, తొలితరం ఔత్సాహికులకు సాధికారత కల్పించడం ద్వారా స్థానిక ఆకాంక్షలను స్థిరమైన సంస్థలుగా ఈ కార్యక్రమం మలిచింది. ఇది అధిక ఆదాయం, పెరిగిన పొదుపు, మెరుగైన కుటుంబ సంక్షేమానికి దారితీస్తోంది. మరీ ముఖ్యంగా, ప్రతి గ్రామంలో ఔత్సాహిక ప్రతిభ ఉందని, సరైన అనుకూల వ్యవస్థను కల్పిస్తే ఆ ప్రతిభ వికసించగలదని చాటింది. ప్రపంచ స్టార్టప్ కేంద్రంగా ఎదిగే దిశగా భారత్ ముందుకు సాగుతున్న తరుణంలో, ఎస్‌వీఈపీ వంటి కార్యక్రమాలు చైతన్యవంతమైన గ్రామీణ స్టార్టప్ వ్యవస్థకు పునాది వేస్తున్నాయి. ఈ కార్యక్రమం ఉపాధి కల్పిస్తూ, స్థానిక ఆర్థిక వ్యవస్థలను బలోపేతం చేస్తూ, కోట్లాది గ్రామీణ కుటుంబాలకు కొత్త అవకాశాలను అందిస్తోంది. మొత్తంగా, స్వావలంబనతో కూడిన అభివృద్ధి చెందిన భారతదేశ లక్ష్య సాధనకు ఇది దోహదం చేస్తోంది.
ఎస్‌హెచ్‌జీ సభ్యురాలి నుంచి గ్రామీణ వ్యాపార నాయకురాలిగా..
మహారాష్ట్రలోని జహాన్‌పూర్‌కు చెందిన శ్రీమతి భాగ్యశ్రీ లోంధే 2014లో స్వయం సహాయక సంఘంలో చేరడం ద్వారా తన ప్రయాణాన్ని ప్రారంభించారు. స్వయం సహాయక సంఘం, గ్రామ సంస్థల (వీఓలు) కార్యకలాపాల్లో పాల్గొనడం ద్వారా ఆమె నాయకత్వ, వ్యాపార నైపుణ్యాలు మెరుగయ్యాయి. తొలుత తక్కువ పరిమాణంలో మసాలాలు, అప్పడాలు, పచ్చళ్లు తయారు చేస్తూ వ్యాపార ప్రయాణాన్ని ప్రారంభించారు. ఎస్‌వీఈపీ కింద కమ్యూనిటీ ఎంటర్‌ప్రైజ్ ఫండ్ నుంచి పొందిన ₹45,000 రుణంతో స్థానికంగా లభించే ముడి పదార్థాలను వినియోగించి ఉత్పత్తిని విస్తరించారు. మహాలక్ష్మి సరస్ 2019–20లో ఆమె ఔత్సాహిక కృషికి గుర్తింపు లభించింది. అక్కడ పది రోజుల్లోనే ₹5 లక్షల ఆదాయం ఆర్జించారు.
నేర్చుకోవాలి, ఎదగాలన్న ఆకాంక్షతో ఆమె వ్యాపార పరిజ్ఞానం, నైపుణ్యాలను మెరుగుపరచుకున్నారు. సంస్థను నిర్వహిస్తూనే సార్వత్రిక విశ్వవిద్యాలయం ద్వారా పదో తరగతి విద్యను పూర్తి చేశారు. ఎన్‌ఆర్‌ఎల్‌ఎం, కృషి విజ్ఞాన కేంద్రం అందించిన శిక్షణతో ఆమె వ్యాపార అవగాహన, సాంకేతిక సామర్థ్యాలు పెరిగాయి. ఫలితంగా ఆమె సంస్థ రోజూ భారీ పరిమాణంలో ఉత్పత్తులను తయారు చేస్తూ, క్రమమైన ఆదాయం పొందటంతో పాటు గ్రామీణ మహిళలకు ఉపాధి కల్పిస్తోంది. ఔత్సాహికత, నిరంతర అభ్యాసం, సంస్థాగత తోడ్పాటు ద్వారా వ్యాపారంపై ఆసక్తి కలిగిన మహిళలు విజయవంతమైన వ్యాపార నాయకులుగా ఎలా ఎదగగలరో ఆమె ప్రయాణం చాటుతోంది.
ఎస్‌హెచ్‌జీ సభ్యురాలి నుంచి అత్యుత్తమ సీఆర్‌పీ–ఈపీగా
ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన శ్రీమతి పూనమ్ సామాజిక, ఆర్థిక అవరోధాలను అధిగమించి విజయవంతమైన సీఆర్‌పీ–ఈపీగా ఎదిగారు. స్వయం సహాయక సంఘంలో చేరిన తర్వాత ఎస్‌వీఈపీ గురించి తెలుసుకున్న ఆమె, 54 రోజుల సీఆర్‌పీ–ఈపీ శిక్షణ కార్యక్రమాన్ని పూర్తి చేశారు. సంస్థల ప్రోత్సాహం, జీవనోపాధి అభివృద్ధికి అవసరమైన నైపుణ్యాలను ఈ శిక్షణ ద్వారా పొందారు. శిక్షణ పూర్తి చేసిన తర్వాత వ్యాపార ప్రణాళికల రూపకల్పన, రుణ సదుపాయాల కల్పన, మార్కెట్ అనుసంధానాల ఏర్పాటు, నిరంతర మార్గదర్శనం ద్వారా దాదాపు 40 సంస్థలకు సహాయం అందించడం ప్రారంభించారు. తాను ఆర్థిక స్వాతంత్ర్యం సాధించడానికి ఎస్‌వీఈపీ తోడ్పడిందని పూనమ్ పేర్కొన్నారు. ఇతరులు తమ వ్యాపారాలను స్థాపించి, విస్తరించేందుకు సహాయం చేసే అవకాశం లభించడాన్ని ఆమె ఎంతో విలువైనదిగా భావిస్తున్నారు. సమాజ ఆధారిత సంస్థలు, ఔత్సాహికతకు లభించే తోడ్పాటు గ్రామీణ జీవనోపాధిని ఎలా బలోపేతం చేయగలవో, మహిళల ఆర్థిక సాధికారతను ఎలా ముందుకు తీసుకెళ్లగలవో ఆమె ప్రయాణం ప్రతిబింబిస్తోంది.
References
Ministry of Rural Development
https://svep.nrlm.gov.in/landing
https://svep.nrlm.gov.in/pdf/Final_Mid_Term_Report.pdf
https://nrlm.gov.in/dashboardForOuter.do?methodName=dashboard
https://lakhpatididi.gov.in/wp-content/uploads/2024/02/SVEP_updated_Master_Circular.pdf
https://sansad.in/getFile/loksabhaquestions/annex/13/AU2824.pdf?source=pqals
https://www.pib.gov.in/PressReleaseIframePage.aspx?PRID=1651525®=48&lang=2
https://sansad.in/getFile/loksabhaquestions/annex/187/AU3940_Wamd8p.pdf?source=pqals
Ministry of Commerce
https://www.ibef.org/blogs/svep-start-up-village-entrepreneurship-programme
Government of Nagaland
https://nsrlm.nagaland.gov.in/wp-content/uploads/2020/07/guidelines-CRP-EP.pdf
PIB Backgrounders
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2195990®=3&lang=1
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2267960®=3&lang=1
https://www.pib.gov.in/FeaturesDeatils.aspx?NoteId=156719&ModuleId=2®=3&lang=1
Click to See PDF
***
(Explainer ID: 159341)
आगंतुक पटल : 190
Provide suggestions / comments