• Sitemap
  • Advance Search
Farmer's Welfare

వ్యవసాయ యాంత్రీకరణ ఉప-ప‌థ‌కం వ్యవసాయ యాంత్రీకరణ ద్వారా ఉత్పాదకత పెంపు

Posted On: 09 JUL 2026 11:32AM

వ్యవసాయ యాంత్రీకరణ ఉప-ప‌థ‌కం(ఎస్ఎంఏఎం) దేశవ్యాప్తంగా ప్రత్యేక యాంత్రీకరణ సహాయం అందిస్తూ చిన్న రైతులు, మహిళలు, వెనుకబడిన వర్గాలకు యంత్రాల లభ్యతను విస్తరిస్తోంది. వ్యవసాయ యంత్రాలు, సాంకేతికత లభ్యతలో ప్రాంతీయ అసమానతలను తొలగించడానికి వెనుకబడిన రాష్ట్రాలు, ఈశాన్య రాష్ట్రాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. ఈ పథకం ప్రారంభించినప్పటి నుంచి భారతదేశవ్యాప్తంగా వ్యక్తిగత రైతులకు 21.61 లక్షల వ్యవసాయ యంత్రాల పంపిణీకి రూ. 9,404.47 కోట్ల ఆర్థిక సహాయం అందించారు. క‌చ్చితత్వ వ్యవసాయాన్ని దేశవ్యాప్తంగా ప్రోత్సహించేందుకు రూ. 52.5 కోట్ల ఆర్థిక సహాయంతో 40,918 హెక్టార్లలో 40,928 కి పైగా డ్రోన్ ప్రదర్శనలు నిర్వహించారు.

వ్యవసాయ యాంత్రీకరణ ద్వారా వ్యవసాయం బలోపేతం
భారతదేశంలో వ్యవసాయ ఉత్పాదకతను పెంచడంలో వ్యవసాయ యాంత్రీకరణ కీలకపాత్ర పోషిస్తోంది. పంట ఉత్పత్తి చక్రంలోని వివిధ వ్యవసాయ పనుల కోసం యంత్రాలు, పరికరాలు, ఆధునిక సాంకేతికతలను ఉపయోగించడం ఇందులో భాగం. ఈ పనులలో భూమిని సిద్ధం చేయడం, విత్తనాలు చల్లడం, నీటి పారుదల, మొక్కల సంరక్షణ, కోతలు, కోత అనంతర నిర్వహణ వంటివి ఉన్నాయి. మానవ శ్రమ, పశువుల శక్తిపై ఆధారపడటాన్ని తగ్గించడం ద్వారా యాంత్రీకరణ వ్యవసాయ పనులను సకాలంలో, సమర్థవంతంగా పూర్తి చేయడానికి వీలు కల్పిస్తుంది. ఇది ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించి, వ్యవసాయ పద్ధతుల నాణ్యతను మెరుగుపరుస్తుంది.

భారతదేశంలో వ్యవసాయ యాంత్రీకరణను ప్రోత్సహించడానికి 2014-15 లో వ్యవసాయ యాంత్రీకరణ ఉప-ప‌థ‌కం(ఎస్ఎంఏఎం) ప్రారంభించారు. ఇది రాష్ట్రీయ కృషి వికాస్ యోజన(ఆర్‌కేవీవై) కింద నడిచే కేంద్ర పథకం. యాంత్రీకరణ ప్రయోజనాలను ఇంతవరకు అందుకోని వెనుకబడిన వర్గాలకు అందించడం ఈ పథకం ప్రధాన లక్ష్యం. ఇందులో చిన్న, సన్నకారు రైతులు, మహిళలు, షెడ్యూల్డ్ కులాలు(ఎస్సీ), షెడ్యూల్డ్ తెగలు(ఎస్టీ), రైతు ఉత్పత్తిదారుల సంఘాలు(ఎఫ్‌పీవో), స్వయం సహాయక బృందాలు(సీహెచ్‌జీ), గ్రామీణ వ్యవస్థాపకులు ఉన్నారు.

ఈ పథకం కస్టమ్ హైరింగ్ సెంటర్ల(సీహెచ్‌సీ) ఏర్పాటును ప్రోత్సహిస్తుంది. ఇవి రైతులు అద్దెకు తీసుకోవడానికి వీలుగా వ్యవసాయ యంత్రాలు, పనిముట్లు, పరికరాలను కలిగి ఉండే కేంద్రాలు. ఇది హైటెక్, అధిక విలువైన వ్యవసాయ పరికరాల కేంద్రాల అభివృద్ధికి, వ్యవసాయ యంత్రాల పంపిణీకి కూడా మద్దతు ఇస్తుంది. ప్రదర్శనలు, సామర్థ్య పెంపుదల కార్యక్రమాల ద్వారా అవగాహన కల్పించే పనులు కూడా చేపడుతున్నారు. తక్కువ వ్యవసాయ శక్తి అందుబాటులో ఉన్న ప్రాంతాలపై, చిన్న భూకమతాలు, అధిక పెట్టుబడి ఖర్చులు వంటి నిర్మాణాత్మక సమస్యలను సీహెచ్‌సీల ద్వారా సరసమైన అద్దె సేవలతో పరిష్కరించడంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. అదనంగా, వ్యవసాయ యంత్రాల పనితీరు పరీక్షలు, ధ్రువీకరణకు ఈ పథకం మద్దతు ఇస్తుంది. సంబంధిత వర్గాలలో దీని వాడకాన్ని పెంచడానికి సమాచారం, విద్య, సమాచార మార్పిడి(ఐఈసీ) కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు.

2007లో ప్రారంభించిన రాష్ట్రీయ కృషి వికాస్ యోజన(ఆర్‌కేవీవై).. వ్యవసాయం, దాని అనుబంధ రంగాలలో ప్రభుత్వ పెట్టుబడులను పెంచడానికి రాష్ట్రాలను ప్రోత్సహించే ఒక ప్రముఖ పథకం. ఇది స్థానిక అవసరాలకు అనుగుణంగా ప్రాజెక్టులను రూపొందించి అమలు చేయడానికి రాష్ట్రాలకు సౌలభ్యం, స్వయంప్రతిపత్తిని అందిస్తుంది. ఈ పథకాలు పంట ఉత్పత్తి, మౌలిక సదుపాయాల అభివృద్ధి, యాంత్రీకరణ, విలువ జోడింపుతో సహా విస్తృతమైన రంగాలను కవర్ చేస్తాయి. 2017-18లో కోతకు ముందు, కోత తర్వాత మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడంపై ఎక్కువ దృష్టి పెడుతూ ఈ పథకాన్నిఆర్‌కేవీవై-ఆర్ఏఎఫ్‌టీఏఆర్‌గా పునర్వ్యవస్థీకరించారు.

వ్యవసాయ ఉత్పాదకతను పెంచడానికి ఎస్ఎంఏఎం వ్యూహాత్మక స్తంభాలు

 


ఆధునిక వ్యవసాయ పరికరాల లభ్యతను మెరుగుపరచడం, శ్రమను తగ్గించడం, వ్యవసాయ ఉత్పాదకతను పెంచడం ద్వారా సమగ్రమైన, సమర్థవంతమైన వ్యవసాయ యాంత్రీకరణను ప్రోత్సహించడానికి ఈ వ్యవసాయ యాంత్రీకరణ ఉప-ప‌థ‌కం(ఎస్ఎంఏఎం) రూపొందించారు.

* శిక్షణ, పరీక్షలు, ప్రదర్శనలు, కోత అనంతర యాంత్రీకరణ ద్వారా వ్యవసాయ యాంత్రీకరణ ప్రచారం: ఆధునిక వ్యవసాయ సాంకేతికతలను అందుబాటులోకి తెచ్చి వ్యవసాయ ఉత్పాదకతను, సామర్థ్యాన్ని పెంచుతుంది. వ్యవసాయ యాంత్రీకరణను ప్రోత్సహించడం ద్వారా ప్రాసెసింగ్, నిల్వ, విలువ జోడింపు, పంట వ్యర్థాల నిర్వహణ కోసం కోత అనంతర మౌలిక సదుపాయాలను మరింత బలోపేతం చేస్తుంది.

* వ్యవసాయ యంత్రాలు, పరికరాల కొనుగోలుకు ఆర్థిక సహాయం: ప్ర‌త్య‌క్ష న‌గ‌దు బ‌దిలీ(డీబీటీ) విధానం ద్వారా వ్యక్తిగత వ్యవసాయ యంత్రాల కొనుగోలుకు రాయితీ సహాయం అందిస్తుంది. ఇది సాధారణ లబ్ధిదారులకు యంత్రం ఖరీదులో 40 శాతం, ఎస్సీ/ఎస్టీ రైతులు, చిన్న, సన్నకారు రైతులు, ఈశాన్య రాష్ట్రాల లబ్ధిదారులకు 50 శాతం సబ్సిడీని కల్పిస్తుంది. సీహెచ్‌సీలు, ఎస్‌హెచ్‌జీలు, ఎఫ్‌పీవోల ద్వారా డ్రోన్‌లతో సహా యాంత్రీకృత సేవల కోసం చిన్న, సన్నకారు రైతులకు హెక్టారుకు రూ. 2,000 లభిస్తుంది.

* కస్టమ్ హైరింగ్ కోసం ఫార్మ్ మెషినరీ బ్యాంకుల(ఎఫ్ఎంబీ) ఏర్పాటు: స్వయం సహాయక బృందాలు, ఎఫ్‌పీఓలు, స్థానిక సంస్థలు వ్యవసాయ యంత్రాలను కొనుగోలు చేయడానికి 80-90 శాతం ఆర్థిక సహాయం అందిస్తూ వ్యవసాయ యాంత్రీకరణను మెరుగుపరుస్తుంది. రూ.250 లక్షల వరకు ఉన్న ప్రాజెక్టుల కోసం సీహెచ్‌సీలకు ప్రాజెక్ట్ వ్యయంలో 40 శాతం ఆర్థిక సహాయం అందుబాటులో ఉండగా, రూ.30 లక్షల వరకు ఉన్న ప్రాజెక్టులకు ఫార్మ్ మెషినరీ బ్యాంకులు 80 శాతం సహాయాన్ని పొందుతాయి.

* హైటెక్, హై-ప్రొడక్టివిటీ ఎక్విప్‌మెంట్ హబ్‌ల ఏర్పాటు: కార్యాచరణ సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి, అధిక విలువైన పరికరాలను అందుబాటులోకి తెచ్చేందుకు పంటల వారీ పనుల కోసం అధునాతన, అధిక సామర్థ్యం గల యంత్రాలను ఇక్కడ ఏర్పాటు చేస్తారు.

* ఈశాన్య ప్రాంతంలో(ఎన్ఈఆర్) వ్యవసాయ యాంత్రీకరణ ప్రచారం: చిన్న యంత్రాలకు 100 శాతం వరకు సబ్సిడీ, ఫార్మ్ మెషినరీ బ్యాంకులకు 95 శాతం సహాయంతో సహా ప్రాంతీయ అవసరాలకు తగిన చర్యల ద్వారా ఈశాన్య రాష్ట్రాలలో మెరుగైన మద్దతును అందిస్తుంది.

వ్యవసాయ యాంత్రీకరణకు బలం: ఎస్ఎంఏఎం ఆర్థిక వెన్నెముక
ఈ పథకం కింద 2014-15 నుంచి 2025-26 వరకు రూ.9,404.47 కోట్ల కేంద్ర సహాయం ద్వారా వ్యక్తిగత రైతులకు 21.61 లక్షల యంత్రాల పంపిణీ జరిగింది. అదనంగా ఇది 27,554 కస్టమ్ హైరింగ్ సెంటర్లు, 646 హైటెక్ హబ్‌లు, 25,608 ఫార్మ్ మెషినరీ బ్యాంకుల ఏర్పాటుకు మద్దతు ఇచ్చింది. ఈ పథకం కింద వ్యక్తిగత వ్యవసాయ యంత్రాల యాజమాన్యం పొందిన లబ్ధిదారుల సంఖ్య 2020-21లో 2.07 లక్షల నుంచి 2024-25 నాటికి 2.32 లక్షలకు పెరిగింది. ఇది పథకం విస్తృతిని ప్రతిబింబిస్తోంది.



ఈ పథకం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వ్యయ-భాగస్వామ్య ఒప్పందాన్ని అనుసరిస్తుంది. చాలా రాష్ట్రాలకు నిధుల నమూనా 60:40 గా ఉండగా, ఈశాన్య, హిమాలయ రాష్ట్రాలకు ఇది 90:10 గా ఉంది. కేంద్రపాలిత ప్రాంతాల విషయంలో 100 శాతం కేంద్ర నిధులతో సహాయం అందిస్తారు. ఈ విభిన్న నిధుల నిర్మాణం వివిధ ప్రాంతీయ పరిస్థితులలో విస్తృత యాంత్రీకరణను సులభతరం చేస్తుంది.

ఆచరణలో ఆవిష్కరణ: డ్రోన్ ఆధారిత వ్యవసాయాన్ని ఎస్ఎంఏఎం ఎలా విస్తరిస్తోంది
వ్యవసాయ యాంత్రీకరణ ఉప-ప‌థ‌కం(ఎస్ఎంఏఎం) వ్యవసాయ పనులను మెరుగుపరచడానికి డ్రోన్ల వినియోగాన్ని ప్రోత్సహిస్తుంది. ఈ పథకం కింద రూ.52.50 కోట్ల ఆర్థిక సహాయంతో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్(ఐకార్‌) దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున క్షేత్ర ప్రదర్శనల ద్వారా డ్రోన్ల వాడకాన్ని ప్రోత్సహించింది.

2023-24 నుంచి 2025-26 కాలంలో ఐకార్‌ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, కృషి విజ్ఞాన కేంద్రాల(కేవీకే) సహకారంతో 40,918 హెక్టార్లలో 40,928 కిసాన్ డ్రోన్ ప్రదర్శనలను నిర్వహించింది. ఈ ప్రదర్శనలు నిర్ణీత ప్రామాణిక నిర్వహణ విధానాల ప్రకారం పోషకాలు, ఎరువులు, వ్యవసాయ రసాయనాలను చల్లడంపై దృష్టి పెట్టాయి.

విస్తృత వాడకాన్ని సులభతరం చేయడానికి, డ్రోన్ల కొనుగోలు, ప్రదర్శనల కోసం ఈ పథకం ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది. ఈ కార్యకలాపాల కోసం ఐకార్‌ సంస్థలు, కేవీకేలు, రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయాల వంటి అర్హత కలిగిన సంస్థలు డ్రోన్‌కు రూ.10 లక్షల వరకు 100 శాతం ఆర్థిక సహాయాన్ని పొందుతాయి. రైతు ఉత్పత్తిదారుల సంఘాలు(ఎఫ్‌పీఓ) 75 శాతం వరకు గ్రాంట్ సహాయానికి అర్హులు. అదనంగా సర్వీస్ మోడల్స్ ద్వారా డ్రోన్లను ఉపయోగించే ఏజెన్సీలకు హెక్టారుకు రూ.6,000 అదనపు ఖర్చుల కింద మద్దతు ఇస్తారు.



ఈ పథకం సమగ్రతపై గట్టి దృష్టి పెడుతూ మొత్తం నిధులలో 30 శాతాన్ని మహిళా రైతుల కోసం కేటాయించింది. ఈ నిబంధన వ్యవసాయ యంత్రాలపై వారికి లభ్యతను పెంచడం, యాంత్రీకృత వ్యవసాయ విధానాలలో ఎక్కువ భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకుంది.

అంతరాలను తొలగించడం, వృద్ధిని పెంచడం: ఎస్ఎంఏఎం ప్రభావం
వ్యవసాయ ఉత్పాదకత, సామర్థ్యం, సమగ్రతను బలోపేతం చేయడంలో ఈ పథకం ఒక కీలకమైన చర్యగా అవతరించింది. చిన్న, సన్నకారు రైతులు, మహిళలు, ఎస్సీ/ఎస్టీ వర్గాలు, వెనుకబడిన ప్రాంతాలపై దృష్టి పెట్టడం ద్వారా ఈ పథకం సబ్సిడీలు, కస్టమ్ హైరింగ్ సెంటర్లు, ఫార్మ్ మెషినరీ బ్యాంకులు, ప్రత్యేక ప్రాంతీయ మద్దతు ద్వారా యాంత్రీకరణలోని కీలక అంతరాలను పూరించడానికి సహాయపడింది. శిక్షణ, ప్రదర్శనలు, కోత అనంతర నిర్వహణ, డ్రోన్ల వంటి అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలపై ఇది చూపిన శ్రద్ధ వ్యవసాయాన్ని ఆధునీకరించడంలో భవిష్యత్తు దృక్పథాన్ని ప్రతిబింబిస్తుంది. సంస్థాగత మౌలిక సదుపాయాలను సృష్టించడం ద్వారా ఈ పథకం శ్రమ భారాన్ని తగ్గించడానికి, పనులను సకాలంలో పూర్తి చేయడానికి, అధిక వ్యవసాయ ఉత్పాదకతకు దోహదపడింది.

Ministry of Agriculture and Farmers Welfare

https://agriportal.cg.nic.in/agridept/CentralScheme/2.3%20smam%20gl.pdf

https://farmech.dac.gov.in/Content/New_Folder/Revised_SMAM_Guidelines_%282025%29_With_Covering.pdf

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2146927&reg=3&lang=2

https://agriwelfare.gov.in/sites/default/files/rkvy_inro.pdf
https://farmech.dac.gov.in/Content/New_Folder/Revised_SMAM_Guidelines_%282025%29_With_Covering.pdf

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2225993&reg=3&lang=1

https://sansad.in/getFile/loksabhaquestions/annex/184/AU1307_PlCuP7.pdf?source=pqals

https://sansad.in/getFile/loksabhaquestions/annex/187/AU2869_rYAp4R.pdf?source=pqals

https://sansad.in/getFile/loksabhaquestions/annex/184/AU4030_u5gVDd.pdf?source=pqals

https://sansad.in/getFile/loksabhaquestions/annex/187/AU2910_hr4mIN.pdf?source=pqals

https://sansad.in/getFile/annex/270/AU1621_FVTLGW.pdf?source=pqars


Ministry of Finance

https://www.indiabudget.gov.in/economicsurvey/doc/echapter.pdf

Ministry of Rural Development

https://sansad.in/getFile/loksabhaquestions/annex/186/AU2540_lhHekv.pdf?source=pqals


PIB Backgrounder

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2248987&reg=3&lang=2

Click here to see pdf 

 

***

 

(Explainer ID: 159159) आगंतुक पटल : 17
Provide suggestions / comments