Technology
డిజిటల్ ఇండియా
11 ఏళ్ల రూపాంతర ప్రయాణం
Posted On:
27 JUN 2026 5:06PM
దేశవ్యాప్తంగా పౌరులు ఒకరినొకరు అనుసంధానించుకునే, నేర్చుకునే, లావాదేవీలు జరిపే, ప్రభుత్వ సేవలను పొందే విధానాన్ని డిజిటల్ ఇండియా కార్యక్రమం పూర్తిగా మార్చేసింది. గత 11 ఏళ్లలో ప్రపంచంలోనే అతిపెద్ద డిజిటల్ డిజిటల్ ప్రజా మౌలిక వసతుల వ్యవస్థను భారతదేశం నిర్మించింది. డిజిటల్ వేదికలు గ్రామీణ, వెనుకబడిన ప్రాంతాలలో ఆరోగ్య రక్షణ, విద్య, నైపుణ్యాభివృద్ధి, వ్యవసాయం, సంక్షేమ సేవలను విస్తృతం చేశాయి. డిజిటల్ చెల్లింపులు, డిజిటల్ పాలన ఆవిష్కరణలలో భారతదేశం ప్రపంచ అగ్రగామిగా ఎదిగింది. ఇండియా స్టాక్ ఇప్పుడు అనేక దేశాలకు విస్తరించడంతో సమగ్రమైన, పౌర కేంద్రిత, సాంకేతిక ఆధారిత అభివృద్ధిలో భారతదేశం అంతర్జాతీయ నాయకత్వాన్ని బలోపేతం చేస్తోంది.
డిజిటల్ ఇండియా పరిణామ క్రమం
డిజిటల్ ఇండియా కార్యక్రమం 2026 జూలై 1 నాటికి 11 ఏళ్లు పూర్తి చేసుకుని, దేశ డిజిటల్ రూపాంతర ప్రయాణంలో ఒక మైలురాయిని అధిగమించనుంది. 2015 కంటే ముందు ప్రభుత్వ సేవలు అంటే పొడవైన క్యూలు, కాగితపు పనులు, పరిమిత అనుసంధానత మాత్రమే గుర్తుకొచ్చేవి. ఇంటర్నెట్ సేవలను విస్తరించడం, సేవలను ఆన్‌లైన్‌లోకి తీసుకురావడం ద్వారా డిజిటల్ ఇండియా ఈ వ్యత్యాసాన్ని తొలగించింది. ఇది డిజిటల్ పాలనను బలోపేతం చేసి, సేవలను వేగవంతంగా, పారదర్శకంగా, సులభంగా అందుబాటులోకి తెచ్చింది. కోట్లాది మంది ప్రజలు ఇప్పుడు ఆరోగ్య సంరక్షణ, విద్య, బ్యాంకింగ్, సంక్షేమ పథకాల కోసం డిజిటల్ వేదికలను వాడుతున్నారు. డిజిటల్ మౌలిక సదుపాయాలపై ప్రభుత్వం చేసిన పెట్టుబడులు గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో అనుసంధానతను మెరుగుపరిచాయి. తక్కువ ధరకే ఇంటర్నెట్, డిజిటల్ సేవలను ప్రజలందరికీ అందుబాటులోకి తెచ్చి సాంకేతికతను ప్రజాస్వామ్యీకరించడంలో ఈ కార్యక్రమం తోడ్పడింది.
గత దశాబ్ద కాలంలో డిజిటల్ ఇండియా దేశ డిజిటల్ ఆర్థిక వ్యవస్థకు, డిజిటల్ ప్రజా మౌలిక వసతులకు బలమైన పునాదిగా మారింది. ప్రపంచవ్యాప్త రియల్ టైమ్ డిజిటల్ చెల్లింపులలో భారతదేశం ప్రస్తుతం అగ్రస్థానంలో ఉంది. ప్రపంచ లావాదేవీల పరిమాణంలో దాదాపు 49% ఒక్క యూపీఐ ద్వారానే జరుగుతున్నాయి. దేశ జీడీపీలో డిజిటల్ ఆర్థిక వ్యవస్థ వాటా దాదాపు 12–14% వరకు ఉంది. రాబోయే దశాబ్దంలో ఇది ఐదో వంతుకు చేరుకుంటుందని అంచనా. డిజిటల్ ఇండియా వివిధ రంగాలలో ఆవిష్కరణలను, అంకుర సంస్థల వృద్ధిని, సాంకేతికత విస్తరణను వేగవంతం చేసింది. కృత్రిమ మేధ, క్లౌడ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ రంగాలలో దేశ సామర్థ్యాలను పెంచింది. వికసిత్ భారత్ 2047 దిశగా అడుగులు వేస్తున్న తరుణంలో, దేశవ్యాప్తంగా సమగ్ర వృద్ధిని, సాంకేతిక స్వాలంబనను, పౌరుల సాధికారతను డిజిటల్ ఇండియా నిరంతరం ముందుకు నడిపిస్తోంది.
డిజిటల్ ఇండియా తొమ్మిది స్తంభాలు
డిజిటల్ సౌకర్యాలను విస్తరించడానికి, ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి ఒక సమగ్రమైన ప్రణాళికను అందించేలా డిజిటల్ ఇండియా కార్యక్రమాన్ని 9 స్తంభాల ఆధారంగా రూపొందించారు.

మొదటి స్తంభం: బ్రాడ్‌బ్యాండ్ హైవేస్
దేశవ్యాప్తంగా డిజిటల్ వ్యత్యాసాలను తొలగించడంలో మొబైల్ కనెక్టివిటీ అత్యంత కీలకం. భారత్‌నెట్-1, భారత్‌నెట్-2 కింద దేశంలోని 2.22 లక్షలకు పైగా గ్రామ పంచాయితీలను అనుసంధానించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. జనవరి 2026 నాటికి దాదాపు 2.15 లక్షల గ్రామ పంచాయితీలకు(సుమారు 97%) కనెక్టివిటీ లభించింది. దేశవ్యాప్తంగా సుమారు 7 లక్షల కిలోమీటర్ల ఆప్టికల్ ఫైబర్ కేబుల్ వేశారు. ఇది గ్రామీణ భారతంలో ఈ-గవర్నెన్స్, డిజిటల్ చెల్లింపులు, ఆన్‌లైన్ విద్య, టెలిమెడిసిన్, స్థానిక వ్యవస్థాపకతను గణనీయంగా బలోపేతం చేసింది.
రెండో స్తంభం: మొబైల్ కనెక్టివిటీ విశ్వవ్యాప్తం
డిజిటల్ పాలనకు, సమగ్ర ఆర్థిక వృద్ధికి నమ్మకమైన బ్రాడ్‌బ్యాండ్ అవసరం. 2026 మార్చి చివరి నాటికి బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య 106.58 కోట్లకు పెరిగింది. ఇది గ్రామీణ భారతంలో చివరి లబ్ధిదారుడి వరకు నమ్మకమైన డిజిటల్ కనెక్టివిటీని అందించింది.
మూడో స్తంభం: పబ్లిక్ ఇంటర్నెట్ యాక్సెస్ ప్రోగ్రామ్
ప్రజలు తమ ఇంటికి దగ్గరలోనే సేవలను పొందడానికి ఈ డిజిటల్ కేంద్రాలు సహాయపడతాయి. ప్రస్తుతం 6.5 లక్షలకు పైగా కామన్ సర్వీస్ సెంటర్లు, 1.6 లక్షల పోస్టాఫీసులు డిజిటల్ సేవలను అందిస్తున్నాయి. ఈ కేంద్రాలు గ్రామీణ, వెనుకబడిన ప్రాంతాలలో ఈ-గవర్నెన్స్, బ్యాంకింగ్, పౌర సేవలను అందుబాటులోకి తెస్తున్నాయి.
నాలుగో స్తంభం: ఈ-గవర్నెన్స్: సాంకేతికత ద్వారా ప్రభుత్వ సంస్కరణలు
సేవలను ఎలక్ట్రానిక్ పద్ధతిలో అందించడానికి ఉద్దేశించిన ఈ-గవర్నెన్స్, కాగిత రహిత, సమగ్ర, పౌర కేంద్రిత పరిపాలనను ప్రోత్సహిస్తుంది. ప్రస్తుతం డిజీలాకర్, నేషనల్ సింగిల్ సైన్-ఆన్ వంటి వేదికలు ధృవీకరణ పత్రాలు, దరఖాస్తులు, చెల్లింపులు, ప్రభుత్వ సేవలను సులభంగా పొందేలా చేస్తున్నాయి. కాగితపు పనులను తగ్గించి జీవన సౌలభ్యాన్ని మెరుగుపరుస్తున్నాయి.
ఐదో స్తంభం: ఈ-క్రాంతి: ఎలక్ట్రానిక్ పద్ధతిలో సేవలు
డిజిటల్ ఇండియా సేవల పంపిణీ విభాగమైన ఈ-క్రాంతి, భౌతిక పాలన నుంచి డిజిటల్ పాలన వైపు మార్పును వేగవంతం చేసింది. ఈ-హాస్పిటల్, ఈ-సంజీవని, ఈ-కోర్టులు వంటి సమగ్ర వేదికలు సర్టిఫికెట్లు, ఆరోగ్య సంరక్షణ, న్యాయ సేవలను సులభతరం చేశాయి. పరిపాలనను మరింత సమర్థవంతంగా, పౌర కేంద్రితంగా మార్చాయి.
మీకు తెలుసా? ఈ-కోర్ట్స్ పేరుతో యుద్ధ ప్రాతిపదికన చేపట్టిన కార్యక్రమం భారతదేశ కాగితపు న్యాయ వ్యవస్థను డిజిటల్ న్యాయ వ్యవస్థగా మార్చింది. 660 కోట్లకు పైగా పేజీలను డిజిటలైజ్ చేయగా, 1.07 కోట్ల కేసులు ఆన్‌లైన్‌లో నమోదయ్యాయి.

ఆరో స్తంభం: అందరికీ సమాచారం
ప్రభుత్వ సమాచారాన్ని సులభంగా అందుబాటులో ఉంచడం, డిజిటల్ వేదికల ద్వారా పౌరుల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడం ద్వారా ఈ స్తంభం పారదర్శక, భాగస్వామ్య పాలనను బలోపేతం చేస్తుంది. మైగవ్, ఓపెన్ గవర్నమెంట్ డేటా వంటి కార్యక్రమాలు పౌరులు సమాచారాన్ని తెలుసుకోవడానికి, ప్రభుత్వ కార్యక్రమాలు, సేవలతో ఎప్పటికప్పుడు అనుసంధానమై ఉండటానికి సహాయపడుతున్నాయి.
ఏడో స్తంభం: ఎలక్ట్రానిక్స్ తయారీ
విధానపరమైన మద్దతు, ఆవిష్కరణలు, పెట్టుబడుల ద్వారా డిజిటల్ ఇండియా దేశ ఎలక్ట్రానిక్స్ తయారీ రంగాన్ని బలోపేతం చేసింది. 2014-15 ఆర్థిక సంవత్సరంలో రూ.1.9 లక్షల కోట్లుగా ఉన్న ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తి 2026 మార్చి నాటికి సుమారు రూ.12 లక్షల కోట్లకు పెరిగింది. ప్రస్తుతం భారతదేశం ప్రపంచంలోనే రెండో అతిపెద్ద మొబైల్ ఫోన్ తయారీ దేశంగా నిలిచింది. ఇది అంతర్జాతీయ ఎలక్ట్రానిక్స్ సరఫరా గొలుసులో దేశ పాత్రను తెలియజేస్తోంది.
ఎనిమిదో స్తంభం: ఉద్యోగాల కోసం ఐటీ
భారతదేశ డిజిటల్ ఆర్థిక వ్యవస్థ భారీ స్థాయిలో ఉపాధి అవకాశాలను సృష్టిస్తోంది. నాస్కామ్ అంచనాల ప్రకారం.. ఐటీ, ఐటీఈఎస్ పరిశ్రమ 2025 ఆర్థిక సంవత్సరంలో 283 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని ఆర్జించింది. భారతదేశంలోని 2,100కి పైగా గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు(జీసీసీ) ఇంజనీరింగ్, అనలిటిక్స్, సైబర్ సెక్యూరిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి రంగాలలో దాదాపు 26 లక్షల మంది నిపుణులకు ఉపాధి కల్పిస్తున్నాయి.
తొమ్మిదో స్తంభం: ముందస్తు సమాచార కార్యక్రమాలు
బయోమెట్రిక్ హాజరు, సురక్షిత ప్రభుత్వ ఈమెయిల్, పబ్లిక్ వై-ఫై హాట్‌స్పాట్‌లు, ఈ-బుక్స్, ఎస్ఎంఎస్ ఆధారిత వాతావరణ హెచ్చరికలు, డిజిటల్ కమ్యూనికేషన్ వేదికలు వంటి త్వరిత ఫలితాలను ఇచ్చే కార్యక్రమాలు సాంకేతిక ఆధారిత పాలన తాలూకు తక్షణ ప్రయోజనాలను నిరూపించాయి.
ఈ 9 స్తంభాలు డిజిటల్ ఇండియాకు వ్యూహాత్మక ప్రణాళికను అందిస్తూ, భవిష్యత్తుకు సిద్ధంగా ఉండే ఒక అనుసంధానిత దేశానికి పునాది వేశాయి.
సమీకృత దశాబ్దానికి ఊతమిచ్చిన ప్రతిష్టాత్మక కార్యక్రమాలు
డిజిటల్ ఇండియా కార్యక్రమం కేవలం డిజిటల్ వ్యత్యాసాలను తొలగించే ప్రయత్నంగా ప్రారంభమై, ప్రస్తుతం వివిధ రంగాలలో పాలనను నడిపించే ప్రపంచంలోనే అతిపెద్ద డీపీఐ వ్యవస్థలలో ఒకటిగా రూపాంతరం చెందింది.
జామ్(జేఏఎం) త్రయం: డిజిటల్ ఇండియాకు మూలస్తంభం
జామ్ త్రయం - జన్ ధన్, ఆధార్, మొబైల్ అనుసంధానత - భారతదేశంలో ఆర్థిక సమ్మిళిత్వాన్ని, సంక్షేమ సేవల అందజేతను విప్లవాత్మకంగా మార్చాయి. ఇవి కోట్లాది మందిని అధికారిక బ్యాంకింగ్ వ్యవస్థలోకి తీసుకువచ్చాయి. ప్రభుత్వ సేవలను సులభంగా పొందేలా చేశాయి.
జన్ ధన్ యోజన దేశవ్యాప్తంగా బ్యాంకింగ్ సేవలను వేగంగా విస్తరించింది. బ్యాంక్ ఖాతాలు 2015 మార్చిలో 14.72 కోట్లు ఉండగా, 2026 ఫిబ్రవరి నాటికి 57.78 కోట్లకు పెరిగాయి. ఇదే కాలంలో డిపాజిట్లు రూ.15,670 కోట్ల నుంచి రూ.2.94 లక్షల కోట్లకు పెరిగాయి.
దీనికి తోడు సురక్షితమైన, తక్షణ డిజిటల్ ధ్రువీకరణ కోసం ఆధార్ ఒక నమ్మకమైన బయోమెట్రిక్ గుర్తింపు వేదికను సృష్టించింది. ఆధార్ నమోదులు 2010-11లో 0.42 కోట్లు ఉండగా, 2026 మార్చి నాటికి 144 కోట్లకు పైగా పెరిగాయి.
మొబైల్ అనుసంధానత దేశవ్యాప్తంగా డిజిటల్ సౌకర్యాన్ని విస్తరించడం ద్వారా జామ్ వ్యవస్థను మరింత బలోపేతం చేసింది. 2026 మార్చి నాటికి 85.5% భారతీయ కుటుంబాలు కనీసం ఒక స్మార్ట్‌ఫోన్‌ను కలిగి ఉన్నాయి. 109 కోట్లకు పైగా ప్రజలు ఇంటర్నెట్ సౌకర్యం కలిగి ఉన్నారు.
ఇవన్నీ కలిసి డిజిటల్ ఇండియా సమగ్ర పాలనా వ్యవస్థకు వెన్నెముకగా మారాయి. 2026 జూన్ నాటికి రూ.51 లక్షల కోట్లకు పైగా నిధులు ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా 176 కోట్ల మంది పౌరుల ఖాతాల్లోకి నేరుగా బదిలీ అయ్యాయి. ఇది దేశవ్యాప్తంగా పారదర్శకతను, డిజిటల్ పాలనను మెరుగుపరిచింది.

కేస్ స్టడీ: భారతదేశం తన డిజిటల్ గుర్తింపును విప్లవాత్మకంగా మార్చిన తీరు
ఆధార్ రాకముందు కోట్లాది మంది భారతీయులకు సరైన గుర్తింపు కార్డు లేకపోవడం వల్ల బ్యాంకింగ్, సంక్షేమ పథకాలు, ప్రభుత్వ సేవలు పొందేందుకు ఇబ్బందులు ఎదురయ్యేవి. ఆధార్ ఈ సవాలును సురక్షితమైన బయోమెట్రిక్ ఆధారిత డిజిటల్ గుర్తింపు వేదిక ద్వారా పరిష్కరించింది. ఈ కార్యక్రమంలో అందరినీ భాగస్వామ్యం చేయాలనే లక్ష్యానికి ప్రతీకగా, మహారాష్ట్రలోని టెంబ్లీ గ్రామానికి చెందిన గిరిజన మహిళ శ్రీమతి రంజనా సోనావనే మొదటి ఆధార్ కార్డుదారురాలిగా నిలిచారు. ఆధార్ కేవలం సాధారణ పౌరులకే కాకుండా, భారతదేశంలోని గిరిజన, వెనుకబడిన వర్గాల వారికి కూడా బ్యాంకింగ్, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్, ప్రభుత్వ సేవలను అందుబాటులోకి తెచ్చింది. ఆధార్ చట్టం-2016 ద్వారా యుఐడీఏఐకి చట్టబద్ధమైన అధికారం లభించడం, ఆధార్‌ను కీలకమైన డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్(డీపీఐ)గా గుర్తించడంతో ఈ మార్పు మరింత వేగం పుంజుకుంది.

భారీ స్థాయిలో బ్యాంక్ ఖాతాల ప్రారంభం, ధ్రువీకరణ, ఆర్థిక సేవలను సులభంగా పొందేలా చేయడం ద్వారా ఆధార్ భారతదేశ ఆర్థిక చేరికను పునర్నిర్మించింది.
దళారులు లేని సంక్షేమం: సురక్షితమైన, పారదర్శకమైన సేవల పంపిణీ ద్వారా సంక్షేమ పథకాల అమలను ఆధార్ మార్చేసింది. ప్రస్తుతం 98 శాతారినికి పైగా ప్రజా పంపిణీ వ్యవస్థ(రేషన్) ధాన్యాల పంపిణీ ఆధార్ ధ్రువీకరణ ద్వారానే జరుగుతోంది. అర్హులైన లబ్ధిదారులు 3,100కి పైగా ప్రత్యక్ష నగదు బదిలీ(డీబీటీ) పథకాలు, 360కి పైగా ప్రభుత్వ సేవలను ఆధార్ ఆధారిత ధ్రువీకరణ ద్వారా పొందుతున్నారు.
కాగిత రహిత ధ్రువీకరణ: వివిధ రంగాలలో గుర్తింపు ధ్రువీకరణను ఆధార్ సులభతరం చేసింది. 2025 ఏప్రిల్ 30 నాటికి మొత్తం ఈ-కేవైసీ లావాదేవీలు 2,393 కోట్లకు చేరాయి. ఇది కాగితపు పనులను తగ్గించి, ప్రభుత్వ సేవలను వేగంగా పొందేలా చేసింది.
దీని తాజా రూపమైన ఆధార్ యాప్ అందుబాటులోకి వచ్చిన ఐదు నెలల్లోనే 3.1 కోట్లకు పైగా డౌన్‌లోడ్‌లను దాటింది. ఇది మొబైల్ నంబర్లు, చిరునామాల డిజిటల్ అప్‌డేట్ వంటి సేవలను అందిస్తూ, దైనందిన జీవితంలో కాగిత రహిత ధ్రువీకరణను విస్తృతం చేస్తోంది.
ప్రపంచం గమనిస్తున్న ఒక నమూనా: ఈజిప్ట్, నైజీరియా, ఇండోనేషియా, పపువా న్యూ గినియా వంటి దేశాలు ఈ నమూనాను అధ్యయనం చేస్తుండటంతో నేడు ఆధార్ అంతర్జాతీయంగా డీపీఐకి ఒక ప్రమాణంగా గుర్తింపు పొందింది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద, అత్యంత విశ్వసనీయమైన డిజిటల్ గుర్తింపు వ్యవస్థలలో ఒకటిగా నిలిచి, ప్రపంచవ్యాప్తంగా డిజిటల్ పాలనా నమూనాలకు స్ఫూర్తినిస్తోంది.
డిజీలాకర్:
డిజీలాకర్ భౌతిక పత్రాల స్థానంలో సురక్షితమైన డిజిటల్ వాలెట్‌ను అందిస్తూ దేశవ్యాప్తంగా పత్రాల నిల్వ, ధ్రువీకరణ ప్రక్రియను మారుస్తోంది. 2026 మార్చి నాటికి ఈ వేదిక 70.69 కోట్లకు పైగా నమోదిత వినియోగదారులను కలిగి ఉంది. 850 కోట్లకు పైగా పత్రాలను జారీ చేసింది. దీనివల్ల ధ్రువీకరణ వేగంగా, కాగిత రహితంగా, మరింత నమ్మకమైనదిగా మారింది.

యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్(యూపీఐ)
2026 నాటికి పదేళ్లు పూర్తి చేసుకుంటున్న యూపీఐ.. పౌరులు, వ్యాపారాల కోసం తక్షణ, సురక్షితమైన లావాదేవీల ద్వారా డిజిటల్ చెల్లింపులను విప్లవాత్మకంగా మారుస్తోంది. ఒక సాధారణ చెల్లింపు వేదికగా ప్రారంభమైన ఇది ఇప్పుడు భారతదేశంలో దైనందిన డిజిటల్ వాణిజ్యానికి ఊతమిస్తోంది. యూపీఐ లావాదేవీలు 2016-17 ఆర్థిక సంవత్సరంలో కేవలం 2 కోట్లు ఉండగా, 2025-26 ఆర్థిక సంవత్సరం నాటికి 24,162 కోట్లకు పైగా పెరిగాయి. యూపీఐ అంతర్జాతీయ విస్తరణ ప్రస్తుతం తొమ్మిది దేశాలకు చేరింది. ప్రయాణికుల కోసం సులభమైన యూపీఐ ఆధారిత చెల్లింపులను అనుమతించిన తాజా దేశంగా కంబోడియా నిలిచింది.

మీకు తెలుసా? భీమ్(భారత్ ఇంటర్‌ఫేస్ ఫర్ మనీ) అనేది నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్‌పీసీఐ) అభివృద్ధి చేసిన ప్రభుత్వ మద్దతు గల యూపీఐ యాప్. ఇది యూపీఐని ఉపయోగించి తక్షణ నగదు బదిలీలను సాధ్యం చేస్తుంది. సురక్షితమైన, నగదు రహిత డిజిటల్ చెల్లింపులను భారతదేశంలోని కోట్లాది మంది వినియోగదారులకు సరళంగా, అందుబాటులో ఉంచుతుంది.
ప్రజారోగ్యానికి ఊతమిస్తున్న డిజిటల్ వేదికలు
గత దశాబ్ద కాలంలో డిజిటల్ ఇండియా కార్యక్రమం ప్రజారోగ్య సేవలను వేగవంతంగా, అనుసంధానితంగా, సులభంగా అందుబాటులోకి తెస్తూ రూపాంతరీకరిస్తోంది. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ సిస్టమ్(ఓఆర్ఎస్) రోగులు డిజిటల్ పద్ధతిలో అపాయింట్‌మెంట్‌లను బుక్ చేసుకోవడానికి సహాయపడుతూ, క్యూలను, కాగితపు పనులను తగ్గిస్తోంది. 2026 జూన్ 24 నాటికి ఓఆర్ఎస్ ద్వారా 1.37 కోట్లకు పైగా ఆన్‌లైన్ అపాయింట్‌మెంట్‌లు నమోదయ్యాయి. ఈ వ్యవస్థకు మద్దతుగా, క్లౌడ్ ఆధారిత ఈ-హాస్పిటల్ వేదిక ఆసుపత్రి కార్యకలాపాలను డిజిటలైజ్ చేస్తోంది. ఈ-బ్లడ్ బ్యాంక్ ఆరోగ్య సంస్థలలో రక్తం లభ్యతను, నిర్వహణను మెరుగుపరుస్తోంది.


ఈ-సంజీవని ద్వారా ఆరోగ్య సేవలు మరింత విస్తరిస్తున్నాయి. ఈ టెలిమెడిసిన్ వేదిక ముఖ్యంగా గ్రామీణ, వెనుకబడిన ప్రాంతాలలో రోగులను వైద్యులతో సుదూరం నుంచి అనుసంధానిస్తోంది. ఇది ప్రయాణ ఖర్చులను, వేచి ఉండే సమయాన్ని తగ్గిస్తూ, దేశవ్యాప్తంగా నిపుణులైన వైద్య సేవలను అందుబాటులోకి తెస్తోంది. 24 జూన్ 2026 నాటికి ఈ-సంజీవని 48 కోట్లకు పైగా సంప్రదింపులను విజయవంతం చేసింది. 2.3 లక్షలకు పైగా ఆరోగ్య సంరక్షణ ప్రదాతలను చేర్చుకుంది, తద్వారా టెలిమెడిసిన్‌ను ప్రజారోగ్య పంపిణీలో ఒక ముఖ్యమైన స్తంభంగా మార్చింది.
కోవిడ్-19 మహమ్మారిని ఎదుర్కొనే సమయంలో ఆరోగ్య సేతు, కోవిన్ వంటి వేదికల ద్వారా భారతదేశం తన డిజిటల్ ఆరోగ్య వ్యవస్థను విస్తరించింది. ఆరోగ్య సేతు ప్రారంభంలో కాంటాక్ట్ ట్రేసింగ్, ఆరోగ్య సలహాల కోసం ఉపయోగపడింది. ఆ తర్వాత ఇది ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ కింద నేషనల్ హెల్త్ యాప్‌గా రూపాంతరం చెందింది. కోవిన్ భారతదేశ వ్యాక్సినేషన్ కార్యక్రమానికి డిజిటల్ వెన్నెముకగా నిలిచింది. ఇది 220 కోట్లకు పైగా వ్యాక్సిన్ డోసులను నిర్వహించి, డిజిటల్ ప్రజారోగ్య వ్యవస్థలకు అంతర్జాతీయ నమూనాగా అవతరించింది.

14416, 1-800-891-4416 నంబర్ల ద్వారా టెలి మానస్ దేశవ్యాప్తంగా ఉచిత టెలి-కౌన్సెలింగ్, మానసిక ఆరోగ్య మద్దతును అందిస్తుంది. జూన్ 2026 నాటికి దేశవ్యాప్తంగా 53 టెలి మానస్ విభాగాలు, 23 మెంటరింగ్ ఇన్‌స్టిట్యూట్‌లు, 5 ప్రాంతీయ సమన్వయ కేంద్రాలతో ఇది 40.42 లక్షలకు పైగా కాల్‌లను స్వీకరించింది. దీంతో పాటు మానస్ టోల్-ఫ్రీ నంబర్ 1933, ఉమాంగ్ యాప్ ద్వారా మాదకద్రవ్యాల రవాణా, సంబంధిత నేరాలపై పౌరులు అనామకంగా ఫిర్యాదు చేయడానికి వీలు కల్పిస్తుంది. ఈ వేదిక కౌన్సెలింగ్, పునరావాస మద్దతును కూడా అందిస్తుంది. జూన్ 2026 నాటికి ఇది 2.16 లక్షలకు పైగా మాదకద్రవ్యాల సంబంధిత సమాచారాన్ని, 16,200 కంటే ఎక్కువ తక్షణ చర్య తీసుకోదగిన మాదకద్రవ్యాల రవాణా నిఘా సమాచారాన్ని అందుకుంది. తద్వారా దేశవ్యాప్త డ్రగ్-ఫ్రీ భారత్ ప్రచారాన్ని బలోపేతం చేసింది.
సాంకేతికత ద్వారా వాణిజ్యానికి సాధికారత
గవర్నమెంట్ ఈ-మార్కెట్‌ప్లేస్(జెమ్) ప్రభుత్వ కొనుగోళ్లను పారదర్శకంగా, సమర్థవంతంగా, కాగిత రహితంగా మార్చడం ద్వారా రూపాంతరం చెందించింది. జూన్ 2026 నాటికి ఇది రూ.18.4 లక్షల కోట్లకు పైగా గ్రాస్ మెర్కండైజ్ వ్యాల్యూ(జీఎంవీ)ని నమోదు చేసింది. ఇందులో 2025-26 ఆర్థిక సంవత్సరంలోనే రూ.5 లక్షల కోట్లు ఉన్నాయి. అలాగే 11 లక్షలకు పైగా ఎంఎస్ఎంఈలు ప్రభుత్వ మార్కెట్‌లను పొందడానికి వీలు కల్పించింది.
ఓపెన్ నెట్‌వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్(ఓఎన్‌డీసీ) వేదికల వ్యాప్తంగా కొనుగోలుదారులు, విక్రేతలను అనుసంధానించే పారదర్శక, పరస్పర వినమయ డిజిటల్ వాణిజ్య వ్యవస్థను సృష్టిస్తోంది. 2026 జూన్ నాటికి ఓఎన్‌డీసీ 20 కోట్లకు పైగా కొనుగోలుదారులు, 5 లక్షల మంది విక్రేతలకు విస్తరించింది. 1,000 నగరాల్లో ఉనికిని చాటుకుంది. నెలకు దాదాపు 90 లక్షల లావాదేవీలను నమోదు చేస్తోంది. ఓఎన్‌డీసీ ఇండియా పోస్ట్‌ను లాజిస్టిక్స్ సేవా ప్రదాతగా అనుసంధానించింది. ఇది దేశవ్యాప్తంగా నమ్మకమైన, విస్తృతమైన ఈ-కామర్స్ డెలివరీని బలోపేతం చేసింది. పరస్పర వినమయతను ప్రోత్సహించడం, వేదికలపై ఆధారపడటాన్ని తగ్గించడం ద్వారా ఓఎన్‌డీసీ చిన్న వ్యాపారాలకు మెరుగైన మార్కెట్ సౌకర్యాన్ని కల్పిస్తోంది. డిజిటల్ వాణిజ్యంలో సమగ్ర వృద్ధిని పెంపొందిస్తోంది.

ఈ వేదికలు కొనుగోలు ప్రక్రియలను క్రమబద్ధీకరించాయి. చిన్న వ్యాపారాలకు మార్కెట్ సౌకర్యాన్ని కల్పించాయి. పోటీ ధరలను ప్రోత్సహించాయి. జెమ్, ఓఎన్‌డీసీలు వ్యాపార సౌలభ్యాన్ని బలోపేతం చేశాయి. భారతదేశంలో ప్రభుత్వ సేవల పంపిణీ విస్తృత డిజిటలైజేషన్‌ను ముందుకు తీసుకెళ్లాయి.
మీకు తెలుసా? ఈ-సారస్, ఇండియాహ్యాండ్‌మేడ్‌లు స్వయం సహాయక బృందాలు, చేనేత కార్మికులు, కళాకారులు డిజిటల్ మార్కెట్‌లను నేరుగా యాక్సెస్ చేయడానికి వీలు కల్పిస్తూ, గ్రామీణ జీవనోపాధికి మద్దతు ఇస్తున్నాయి. సాంప్రదాయ కళలను రక్షిస్తున్నాయి. ఓఎన్‌డీసీతో అనుసంధానం కావడం వల్ల 11కి పైగా విక్రయ యాప్‌లలో వీటి ఉనికి మరింత విస్తరించింది.
సామాజిక సంక్షేమం కోసం సాంకేతిక ఆధారిత ప్రభుత్వ సేవలు
ఉమాంగ్ ప్రభుత్వ సేవలకు ఒకే డిజిటల్ ద్వారంగా మారింది. 2017లో 166 సేవలతో ప్రారంభమై 2026 జూన్ నాటికి 2572 సేవలకు విస్తరించింది. లావాదేవీలు 3.9 కోట్ల నుంచి 796.69 కోట్లకు పెరిగాయి. ఇది విస్తృతమైన డిజిటల్ స్వీకరణను ప్రతిబింబిస్తుంది. విభిన్న పౌర సేవలను ఒకే వేదికపైకి తీసుకురావడం ద్వారా ఉమాంగ్ దేశవ్యాప్తంగా ప్రభుత్వ సేవలను పొందే సౌలభ్యాన్ని, ప్రాప్యతను మెరుగుపరిచింది.

గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ నెట్‌వర్క్(జీఎస్‌టీఎన్) రిజిస్ట్రేషన్, రిటర్న్ ఫైలింగ్, పన్ను చెల్లింపులు, ఈ-ఇన్వాయిసింగ్‌లను అనుసంధానించడం ద్వారా పరోక్ష పన్నుల విధానాన్ని ఆధునికీకరించింది. 2026 ఏప్రిల్ నాటికి స్థూల జీఎస్టీ వసూళ్లు దాదాపు రూ.2.43 లక్షల కోట్లకు చేరుకున్నాయి. ఈ వేదిక పన్ను నిబంధనల అమలును మెరుగుపరిచింది. పారదర్శకతను పెంచింది. జీఎస్టీ విధానాన్ని వేగవంతమైన, సాంకేతిక ఆధారిత పరిపాలన వైపు నడిపించింది.
పోషకాహార సేవల నిరంతర పర్యవేక్షణను పోషణ్ ట్రాకర్ సాధ్యం చేస్తోంది. 13.35 లక్షల అంగన్‌వాడీ కేంద్రాలను అనుసంధానిస్తూ గర్భిణీలు, పాలిచ్చే తల్లులు, పిల్లలు(0-6 సంవత్సరాలు), కౌమార బాలికలతో(ఆశావహ జిల్లాలు, ఈశాన్య రాష్ట్రాలలో) కలిపి 8.9 కోట్లకు పైగా లబ్ధిదారులకు సేవలు అందిస్తోంది. ఈ డిజిటల్ వేదిక డేటా ఆధారిత పర్యవేక్షణను సాధ్యం చేసింది. మహిళలు, పిల్లల కోసం ఉద్దేశించిన పోషకాహార, సంక్షేమ కార్యక్రమాల సమర్థతను మెరుగుపరచడంలో సహాయపడింది.

మీకు తెలుసా? పోషణ్ హెల్ప్‌లైన్(డయల్ 1515) అనేది మిషన్ సక్షం అంగన్‌వాడీ & పోషణ్ 2.0, ప్రధానమంత్రి మాతృ వందన యోజన(పీఎంఎంవీవై) లబ్ధిదారుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ప్రభుత్వ సహాయ వ్యవస్థ. ఇది సమాచారం, ఫిర్యాదుల పరిష్కారం, సాంకేతిక మద్దతును 17 భాషల్లో తక్షణమే అందిస్తుంది.
సమగ్ర మౌలిక సదుపాయాల ప్రణాళిక కోసం పీఎం గతిశక్తి ఒక జీఐఎస్ ఆధారిత వేదికను సృష్టించింది. ఫిబ్రవరి 2026 నాటికి నెట్‌వర్క్ ప్లానింగ్ గ్రూప్ రూ.16.10 లక్షల కోట్ల విలువైన 352 ప్రాజెక్టులను మూల్యాంకనం చేసింది. ఇందులో 201 ఆమోదం పొందగా, 167 అమలులో ఉన్నాయి. వివిధ రంగాలు, మంత్రిత్వ శాఖల వ్యాప్తంగా సమన్వయ ప్రణాళికను సాధ్యం చేయడం ద్వారా ఈ వేదిక సమర్థతను మెరుగుపరిచింది. లాజిస్టిక్స్ లోపాలను తగ్గించింది. మౌలిక సదుపాయాల అభివృద్ధిని వేగవంతం చేసింది.


మై భారత్(మేరా యువ భారత్) యువత కోసం భారతదేశపు అతిపెద్ద డీపీఐగా నిలిచింది. యువ పౌరులను స్వచ్ఛంద సేవ, అనుభవపూర్వక అభ్యాసం, ఇంటర్న్‌షిప్‌లు, ఉద్యోగాలు, నైపుణ్యాభివృద్ధి, నాయకత్వం, ఆవిష్కరణలు, జాతీయ కార్యక్రమాల అవకాశాలతో అనుసంధానించే ఒక సమగ్ర, సురక్షిత, విస్తరించదగిన వేదికను అందిస్తోంది. 31 అక్టోబర్ 2023న ప్రారంభమైన ఈ వేదిక 2.21 కోట్లకు పైగా యువతను నమోదు చేసుకుంది. 1.52 లక్షలకు పైగా స్వచ్ఛంద సేవా అవకాశాలను, 28,000కు పైగా అనుభవపూర్వక అభ్యాస కార్యక్రమాలను(ఈఎల్‌పీ) అందుబాటులోకి తెచ్చింది. 1.19 లక్షలకు పైగా సంస్థలను చేర్చుకుంది. కృత్రిమ మేధ, బహుభాషా మద్దతు, మొబైల్ సేవలు, గేమిఫికేషన్, ఓపెన్ ఏపీఐలు, నిరంతర విశ్లేషణలతో నిర్మితమైన మై భారత్.. ప్రభుత్వాలు, భాగస్వామ్య సంస్థలు ఒకే జాతీయ డిజిటల్ వ్యవస్థ ద్వారా కోట్లాది మంది యువతను భాగస్వామ్యం చేయడానికి, గుర్తించడానికి, సాధికారత కల్పించడానికి వీలు కల్పిస్తూ, డిజిటల్ ఇండియా, వికసిత్ భారత్@2047 విజన్‌ను ముందుకు తీసుకెళ్తోంది.
మీకు తెలుసా? 390,812 మంది ధ్రువీకరణ పొంది భాగస్వాములతో "ఒక వారంలో అత్యధిక మంది ఆన్‌లైన్ క్విజ్‌లో పాల్గొన్న" రికార్డును నెలకొల్పి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించడం ద్వారా మై భారత్ భారతదేశ డీపీఐ బలాన్ని చాటిచెప్పింది.
అగ్రిస్టాక్: సాంకేతికత ద్వారా రైతులకు సాధికారత

డిజిటల్ అగ్రికల్చర్ మిషన్ కింద అభివృద్ధి చేసిన అగ్రిస్టాక్, ఆన్‌లైన్ వ్యవసాయ వాణిజ్యం కోసం ఈ-నామ్, తక్షణ వ్యవసాయ సమాచారం, ప్రభుత్వ పథకాల మద్దతును అందించే కృత్రిమ మేధ ఆధారిత చాట్‌బాట్ కిసాన్ ఈ-మిత్ర వంటి సేవలను నడిపించే రైతు కేంద్రిత డీపీఐ. రైతు, భూమి, పంట డేటాను అనుసంధానించడం ద్వారా ఇది రుణాలు, భీమా, రాయితీలు, కొనుగోళ్లు, వ్యక్తిగతీకరించిన సలహా సేవలను సులభంగా పొందేలా చేస్తుంది. మార్చి 2026 నాటికి 9.20 కోట్లకు పైగా రైతు ఐడీలను సృష్టించారు.
మీకు తెలుసా? శాస్త్రీయ, సాంకేతిక ఆధారిత వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి భారతదేశం 731 కృషి విజ్ఞాన కేంద్రాలను(కేవీకే) స్థాపించింది. కిసాన్ సారథి డిజిటల్ అడ్వైజరీ ప్లాట్‌ఫారమ్ ద్వారా రైతులు కేవీకేలు, ఐకార్, వ్యవసాయ విశ్వవిద్యాలయాల నుంచి నిరంతర మార్గదర్శకత్వాన్ని పొందుతున్నారు. వ్యవసాయ జ్ఞానాన్ని మరింత అందుబాటులోకి తెస్తూ పర్యావరణ అనుకూల, రైతు కేంద్రిత వ్యవసాయ పద్ధతులకు మద్దతు ఇస్తున్నారు.
విద్యా రంగాన్ని నడిపిస్తున్న డిజిటల్ వేదికలు
డిజిటల్ ఇండియా తరగతి గదులు, భౌగోళిక సరిహద్దులకు అతీతంగా నాణ్యమైన అభ్యాసాన్ని అందుబాటులోకి తెస్తూ విద్యా రంగంలోని వ్యత్యాసాలను తొలగిస్తోంది.
దీక్ష(డిజిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫర్ నాలెడ్జ్ షేరింగ్) పాఠ్యప్రణాళిక ఆధారిత డిజిటల్ లెర్నింగ్ వనరులు, ఉపాధ్యాయ శిక్షణ ద్వారా పాఠశాల విద్యను మారుస్తోంది. ఈ వేదిక విద్యార్థులు, అధ్యాపకుల కోసం క్యూఆర్ కోడెడ్ పాఠ్యపుస్తకాలు, ఇంటరాక్టివ్ కంటెంట్, ఏఐ-ఆధారిత అభ్యాస సాధనాలను అందిస్తుంది. ఇది భారతీయ సంకేత భాషా వనరులు, అందుబాటులో ఉండే డిజిటల్ కంటెంట్ ద్వారా సమగ్ర విద్యకు మద్దతు ఇస్తోంది. 2026 మార్చి నాటికి దీక్ష దేశవ్యాప్తంగా 2 కోట్లకు పైగా నమోదిత వినియోగదారులను దాటింది.
అదనంగా స్వయం, స్వయం ప్రభలు తరగతి గదులకు అతీతంగా నాణ్యమైన విద్యను విస్తరిస్తున్నాయి. స్వయం ప్రముఖ విద్యాసంస్థల ద్వారా 9వ తరగతి నుంచి పోస్ట్ గ్రాడ్యుయేట్ స్థాయి వరకు ఉచిత ఆన్‌లైన్ కోర్సులను అందిస్తోంది. జనవరి 2026 నాటికి వివిధ విభాగాలలో 4,400కు పైగా కోర్సులను అందిస్తోంది. దీనికి అనుబంధంగా స్వయం ప్రభ 48 ప్రత్యేక డీటీహెచ్ ఛానెళ్ల ద్వారా విద్యా విషయాలను ప్రసారం చేస్తుంది. ఇంటర్నెట్ సౌకర్యం పరిమితంగా ఉన్న ప్రాంతాలలోనూ అభ్యాస అవకాశాన్ని కల్పిస్తుంది.

ఈ కార్యక్రమాల ఆధారంగా పీఎం ఈ-విద్య నిరంతర, బహుళ-మాధ్యమ అభ్యాసాన్ని అందించడానికి దీక్ష, స్వయం, స్వయం ప్రభ, కమ్యూనిటీ రేడియో, ప్రత్యేక విద్యా టెలివిజన్ ఛానెళ్లను ఒకే చట్రం కిందకు తీసుకువచ్చింది. ఇది భిన్న ప్రతిభావంతులైన అభ్యాసకుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన కంటెంట్ ద్వారా సమగ్ర అభ్యాసాన్ని ప్రోత్సహిస్తూ నాణ్యమైన విద్యను విస్తరిస్తోంది.
మీకు తెలుసా? అపార్(ఆటోమేటెడ్ పర్మనెంట్ అకడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ) ప్రతి విద్యార్థికి ఒక ప్రత్యేక డిజిటల్ విద్యా గుర్తింపును అందిస్తుంది. విద్యా రికార్డులను సురక్షితంగా నిల్వ చేస్తుంది. ప్రవేశాలు, స్కాలర్‌షిప్‌లు, ఇతర సేవల కోసం కాగిత రహిత ధృవీకరణను సాధ్యం చేస్తుంది. జూన్ 2026 నాటికి, 33.74 కోట్లకు పైగా అపార్ ఐడీలను సృష్టించారు.
భారతదేశ డిజిటల్ శ్రామికశక్తికి ఊతం
డిజిటల్ ఇండియా దేశవ్యాప్తంగా డిజిటల్ నైపుణ్యాలు, అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలు, ఉపాధి అవకాశాలను విస్తరించడం ద్వారా భవిష్యత్తుకు సిద్ధంగా ఉండే శ్రామికశక్తిని నిర్మిస్తోంది.
పీఎంజీదిశ స్మార్ట్‌ఫోన్ వినియోగం, ఇంటర్నెట్ యాక్సెస్, డిజిటల్ చెల్లింపులు, ఆన్‌లైన్ సేవలలో పౌరులకు శిక్షణ ఇవ్వడం ద్వారా గ్రామీణ డిజిటల్ వ్యత్యాసాన్ని తొలగించింది. మార్చి 2024 నాటికి ఇది తన లక్ష్యాన్ని మించి 6.39 కోట్ల మంది గ్రామీణ పౌరులకు శిక్షణ ఇచ్చింది.

ఫ్యూచర్‌స్కిల్స్ ప్రైమ్.. ఏఐ, క్లౌడ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ, డేటా అనలిటిక్స్ వంటి అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలలో అభ్యాసకులను సిద్ధం చేస్తోంది. ఇది 26 లక్షల కంటే ఎక్కువ మంది అభ్యర్థులను నమోదు చేసుకుంది. నాస్కామ్ టాలెంట్ కనెక్ట్ ద్వారా అభ్యాసకులను ఉద్యోగాలతో అనుసంధానిస్తుంది.
స్కిల్ ఇండియా డిజిటల్ హబ్(ఎస్ఐడీహెచ్) అనేది నైపుణ్యాభివృద్ధి, సర్టిఫికేషన్, ఉపాధి సేవల కోసం ఒక సమగ్ర వేదిక. మార్చి 2026 నాటికి, ఇది 32 లక్షల కంటే ఎక్కువ మంది అభ్యర్థులను చేర్చుకుంది. పీఎంకేవీవై, పీఎం విశ్వకర్మ, ప్రభుత్వ పథకాలు, డిజిటల్ లెర్నింగ్ పార్టనర్ల కింద కోర్సులను అందిస్తోంది.

ఇండియాఏఐ మిషన్ ఏఐ విద్య, మౌలిక సదుపాయాలు, బాధ్యతాయుతమైన ఏఐ స్వీకరణను బలోపేతం చేస్తోంది. ఇది ఇండియాఏఐ కోష్ వంటి కార్యక్రమాల ద్వారా పాఠశాలలు, ఉన్నత విద్యా సంస్థలు, వృత్తిపరమైన శిక్షణా కార్యక్రమాలలో ఏఐ నైపుణ్యాలను ప్రోత్సహిస్తోంది.
మీకు తెలుసా? భారతదేశం 2026 ఫిబ్రవరిలో ఇండియాఏఐ ఇంపాక్ట్ సమిట్‌ను నిర్వహించింది. తద్వారా అంతర్జాతీయ ఏఐ సమిట్‌కు ఆతిథ్యం ఇచ్చిన గ్లోబల్ సౌత్‌లో మొదటి దేశంగా అవతరించింది. ఇది 100కు పైగా దేశాల నుంచి ప్రతినిధులను ఒకచోటకు చేర్చింది.
భారతదేశ డిజిటల్ నాయకత్వం.. భవిష్యత్ మార్గం

విస్తరించతగిన, పౌర కేంద్రిత డిజిటల్ పరిపాలనా వేదికల ఆధారంగా డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్(డీపీఐ)లో భారతదేశం ప్రపంచ అగ్రగామిగా ఎదుగుతోంది. 2026 ఫిబ్రవరి నాటికి డిజిటల్ గుర్తింపు, చెల్లింపులు, డేటా మార్పిడి, సేవల పంపిణీ రంగాలలో ఇండియా స్టాక్, డీపీఐ వ్యవస్థలపై సహకారం కోసం భారతదేశం 24 దేశాలతో అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేసింది. యూపీఐ ఇప్పుడు యూఏఈ, సింగపూర్, ఫ్రాన్స్, మారిషస్, శ్రీలంక సహా ఎనిమిది కంటే ఎక్కువ దేశాలలో అందుబాటులో ఉంది. ఇది భారతదేశ అంతర్జాతీయ ఫిన్‌టెక్ ఉనికిని బలోపేతం చేస్తోంది. ఆధార్, డిజీలాకర్, కొవిన్, జెమ్, దిక్ష, ఉమాంగ్, ఈ-సంజీవని వంటి వేదికలు అంతర్జాతీయ డిజిటల్ గవర్నెన్స్ నమూనాలను ఎక్కువగా ప్రభావితం చేస్తున్నాయి. భారతదేశం 2023లో జీ20 అధ్యక్షత వహించిన సమయంలో ఇండియా స్టాక్ గ్లోబల్, గ్లోబల్ డీపీఐ రిపోజిటరీని ప్రారంభించింది. ఇది భారతీయ డిజిటల్ పరిష్కారాలకు అంతర్జాతీయ ప్రాప్యతను విస్తరించింది. డిజిటల్ ఇండియా తదుపరి దశాబ్దంలోకి అడుగుపెడుతున్న తరుణంలో.. సమగ్ర వృద్ధి, డిజిటల్ సాధికారత, అంతర్జాతీయ సహకారానికి సాంకేతికతను ఒక సాధనంగా భారతదేశం మలుచుకుంటోంది.
References
Ministry of Communications
Ministry of Finance
Ministry of Panchayati Raj
Ministry of Electronics & IT
Ministry of Commerce & Industry
Ministry of Law and Justice
Ministry of Agriculture & Farmers Welfare
Rajya Sabha
Others:
Click here for pdf file.
***
(Explainer ID: 159065)
आगंतुक पटल : 8
Provide suggestions / comments