Social Welfare
కార్యాచరణలో అంత్యోదయ
అందరికీ గౌరవం, అవకాశం, ప్రగతికి భరోసా
Posted On:
12 JUN 2026 12:13PM
తరతరాలుగా భారతదేశంలోని అత్యంత వెనుకబడిన వర్గాలు సరైన సేవలు అందక సమాజంలో వెనుకబడే ఉన్నారు. గత 12 ఏళ్లుగా ప్రభుత్వం అంత్యోదయను తన మంత్రంగా స్వీకరించడంతో ఈ పరిస్థితి మారిపోయింది. సమగ్ర, నాణ్యమైన విద్య, నైపుణ్య శిక్షణా కార్యక్రమాలు, ఉపాధికి తోడ్పాటు, మౌలిక సదుపాయాలు, సాంస్కృతిక గుర్తింపు వంటివి ఈ వర్గాలకు మునుపెన్నడూ లేని స్థాయిలో చేరువయ్యాయి. వెనుకబడిన వారిని అవకాశాలు, పురోగతిలో ముందంజలో ఉంచాలనే స్పష్టమైన లక్ష్యంతో ఈ కార్యక్రమాలు సాగుతున్నాయి.
పాలనా విధానంగా అంత్యోదయ
"మీరు చూసిన అత్యంత పేద, బలహీనమైన వ్యక్తి ముఖాన్ని గుర్తు తెచ్చుకోండి" అని మహాత్మా గాంధీ ఒకప్పుడు సలహా ఇచ్చారు. "మీరు తీసుకునే నిర్ణయం ఆ వ్యక్తికి ఏమైనా ఉపయోగపడుతుందా అని మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి." దశాబ్దాలుగా ఈ శక్తివంతమైన ఆలోచన ఎక్కువగా పుస్తకాలకే పరిమితమైంది. కానీ దేశ పురోగతిలో లక్షలాది మంది భారతీయులు వెనుకబడిపోయారు.
గత పన్నెండేళ్లుగా మాత్రం ఒక ప్రధాన మార్పు వచ్చింది. భారతదేశం ఈ ఆదర్శాన్ని కేవలం మాటలకే పరిమితం చేయకుండా ఆచరణలోకి తీసుకువచ్చింది. ఇది వరుసలో చివరిగా ఉన్న వారికి అవకాశాలు, గౌరవం, అభివృద్ధిని ముందుగా అందేలా చేసింది. ముక్కలు ముక్కలుగా సేవలు అందించే పద్ధతి నుంచి అందరికీ పూర్తిగా ప్రయోజనాలు చేకూర్చే సమగ్ర విధానం వైపు అడుగులు పడ్డాయి.
గిరిజన ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల విస్తరణ పెరిగింది. వెనుకబడిన వర్గాల విద్యార్థులకు విద్యావకాశాలు మెరుగయ్యాయి. పారిశుధ్య కార్మికులకు బలమైన గుర్తింపు, రక్షణ లభించాయి. వెనుకబడిన, సంచార జాతులు సంక్షేమ ప్రణాళికల ప్రధాన లక్ష్యంగా మారారు.
ఈ మార్పు భౌగోళికంగా కూడా స్పష్టంగా కనిపిస్తోంది. గిరిజన ప్రాంతాలు, ఆశావహ జిల్లాలు, మారుమూల గ్రామాలు అభివృద్ధి ప్రణాళికలలో కేంద్ర బిందువులుగా మారాయి. వివిధ మంత్రిత్వ శాఖల సమన్వయం వల్ల ఒకప్పుడు చేరుకోలేని ప్రాంతాలకు కూడా సేవలు అందుతున్నాయి.
అభివృద్ధి కేంద్రంలో గిరిజన వర్గాలు
భారతదేశ గిరిజన వర్గాలు సంస్కృతి, సాంప్రదాయ జ్ఞానం, పట్టుదలలో ఎప్పుడూ సంపన్నమైనవే. వారికి రవాణా, విద్య, ఆరోగ్యం, నీరు, విద్యుత్, ఉపాధి అవకాశాల వంటి మౌలిక సదుపాయాలు సరిగ్గా అందలేదు. గత 12 ఏళ్లుగా ఆ దూరాన్ని తగ్గించే ప్రయత్నం స్పష్టంగా, కొలవదగిన రీతిలో పెద్ద ఎత్తున జరుగుతోంది.
ఈ మార్పు ముఖ్యంగా ఆదిమజాతి తెగల(పీవీటీజీ) మారుమూల ప్రాంతాల్లో స్పష్టంగా కనిపిస్తోంది. ఒకప్పుడు చేరుకోలేని ప్రాంతాలుగా భావించినవి ఇప్పుడు అభివృద్ధి ప్రణాళికలలో ముందంజలో ఉన్నాయి.
ప్రధానమంత్రి జనజాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్(పీఎం జన్‌మన్)
జార్ఖండ్: అడవి నుంచి మార్కెట్ వరకు
జార్ఖండ్‌లోని గరియాబంద్ జిల్లాలో కామర్ పీవీటీజీ వర్గానికి చెందిన మహిళలు తమ పెద్దలు అడవి మూలికలతో వైద్యం చేయడం చూస్తూ పెరిగారు. ఇది తల్లుల నుంచి కుమార్తెలకు నిశ్శబ్దంగా అందిన జ్ఞానం. సంవత్సరాలుగా వారు ఆ మూలికలను మార్కెట్ ఇచ్చిన ధరకే విక్రయించేవారు. జ్ఞానం వారిదే అయినా, సంపాదన మాత్రం వారికి దక్కేది కాదు.
పీఎం జన్‌మన్ ఈ పరిస్థితిని మార్చింది. దీని కింద ఉన్న వన్ ధన్ వికాస్ కేంద్ర చొరవతో 87 మంది మహిళలు కలిసి ఒక కొత్త అడుగు వేశారు. వారు ఆయుష్ ధ్రువీకరణతో ఛత్తీస్‌గఢ్ హెర్బల్స్ బ్రాండ్ కింద ఆయుర్వేద నూనెలు, పొడులు, మందులను తయారు చేయడానికి ఒక లైసెన్స్ పొందిన విభాగాన్ని ఏర్పాటు చేశారు. వ్యాపార నైపుణ్యాలు, డిజిటల్ అక్షరాస్యత శిక్షణ ద్వారా వారి సామర్థ్యాలు మెరుగయ్యాయి. ప్రారంభం నుంచి ఇప్పటివరకు అమ్మకాలు రూ.159.59 లక్షలకు చేరాయి. ఈ మహిళలు ఇప్పుడు తమ గ్రామాన్ని విడిచిపెట్టకుండానే ఉత్పత్తి, ప్యాకేజింగ్, మార్కెటింగ్ పనులను నిర్వహిస్తున్నారు. ఒకప్పుడు నిశ్శబ్దంగా వారసత్వంగా వచ్చిన జ్ఞానం ఇప్పుడు ఒక విజయవంతమైన వ్యాపారంగా మారింది.
ప్రధానమంత్రి జనజాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్(పీఎం జన్‌మన్) అనేది ఆదిమ జాతి తెగల(పీవీటీజీ) కోసం ఉద్దేశించిన కార్యక్రమం. వీరు భారతదేశంలోని అత్యంత ఒంటరి వర్గాలలో ఉన్నారు. చాలామంది పక్కా ఇళ్లు, స్వచ్ఛమైన నీరు, విద్యుత్, రహదారి సౌకర్యం లేకుండా జీవించారు. అన్ని మంత్రిత్వ శాఖల సమన్వయ కృషి ద్వారా ఈ లోపాలను భర్తీ చేయడానికి ప్రభుత్వం 2023 నవంబర్‌లో పీఎం జన్‌మన్‌ను ప్రారంభించింది. ఈ కార్యక్రమం 18 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలోని 75 పీవీటీజీ వర్గాలను లక్ష్యంగా చేసుకుంది. 9 మంత్రిత్వ శాఖలు అమలు చేసే 11 రకాల పనుల ద్వారా ఇది సాగుతోంది. దీని మొత్తం బడ్జెట్ కేటాయింపు రూ.24,104 కోట్లు.
ఈ 11 రకాల పనులలో గృహనిర్మాణం, రహదారి అనుసంధానం, పైపుల ద్వారా నీటి సరఫరా, మొబైల్ వైద్య విభాగాలు, అంగన్‌వాడీ కేంద్రాలు, హాస్టళ్లు, విద్యుద్దీకరణ, మొబైల్ టవర్లు, బహుళ ప్రయోజన కేంద్రాలు, వన్ ధన్ వికాస్ కేంద్రాలు, వృత్తి విద్యా శిక్షణ ఉన్నాయి.
వన్ ధన్ వికాస్ కేంద్రాల(వీడీవీకే) ద్వారా నైపుణ్యాలు, జీవనోపాధి:
పీఎం జన్‌మన్‌లో ఒక ముఖ్యమైన భాగం వన్ ధన్ వికాస్ కేంద్రాల(వీడీవీకే) స్థాపన. ఇవి అటవీ ఉత్పత్తులను సేకరించడం, ప్రాసెస్ చేయడం, విక్రయించడంలో పీవీటీజీ వర్గాలకు మద్దతు ఇస్తాయి. తద్వారా స్థానిక ఉపాధి, ఆదాయ వనరులను సృష్టిస్తాయి. ట్రైబల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ డెవలప్‌మెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ట్రైఫెడ్) మద్దతుతో 15 రాష్ట్రాలలో నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ఆంట్రప్రెన్యూర్‌షిప్ అండ్ స్మాల్ బిజినెస్ డెవలప్‌మెంట్, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆంట్రప్రెన్యూర్‌షిప్(ఐఐఈ) నైపుణ్య, వ్యాపార శిక్షణను అమలు చేస్తున్నాయి.
- 500 కేంద్రాల లక్ష్యంలో 491 వన్ ధన్ వికాస్ కేంద్రాలు పనిచేస్తున్నాయి(ఏప్రిల్ 2026 నాటికి).
- వ్యాపార అభివృద్ధి కార్యక్రమం కింద 38,391 మంది పీవీటీజీ సభ్యులకు శిక్షణ ఇచ్చారు.
పీఎం-జుగా / ధర్తీ ఆబా జన్జాతీయ గ్రామ్ ఉత్కర్ష్ అభియాన్
ప్రస్తుతం పీఎం-జుగా అని పిలిచే ధర్తీ ఆబా జన్జాతీయ గ్రామ్ ఉత్కర్ష్ అభియాన్(డీఏజేజీయూఏ) కార్యక్రమాన్ని 2025 అక్టోబర్‌లో ప్రారంభించారు. ఇది 17 మంత్రిత్వ శాఖల శ్రమను ఏకం చేస్తుంది. గిరిజన జనాభా ఎక్కువగా ఉన్న గ్రామాలు, పీవీటీజీ ప్రాంతాలలో దీర్ఘకాలంగా ఉన్న లోపాలను పూరించడంపై దృష్టి పెడుతుంది.

పీఎం జుగా కింద విడివిడి పనుల నుంచి వివిధ రంగాలు, మంత్రిత్వ శాఖల మధ్య సమన్వయంతో కూడిన మిషన్-మోడ్ సేవల వైపు అడుగులు పడుతున్నాయి.
ఏకలవ్య మోడల్ వసతి పాఠశాలలు (ఈఎంఆర్‌ఎస్)
షెడ్యూల్డ్ తెగల విద్యార్థులకు విద్యావకాశాలను విస్తరించడంలో ఏకలవ్య మోడల్ వసతి పాఠశాలలు (ఈఎంఆర్‌ఎస్) కీలక పాత్ర పోషిస్తున్నాయి. గిరిజన ప్రాంతాలలో ఏర్పాటు చేసిన ఈ వసతి పాఠశాలలు ఆరో తరగతి నుంచి పన్నెండో తరగతి వరకు నాణ్యమైన విద్య, ఆధునిక మౌలిక సదుపాయాలు, సమగ్ర అభివృద్ధి మద్దతును అందిస్తాయి.

గత 12 ఏళ్లలో ఏకలవ్య మోడల్ వసతి పాఠశాలల విస్తరణ మారుమూల జిల్లాలలో గిరిజన విద్యా మౌలిక సదుపాయాలను మార్చింది. ఈ వ్యవస్థ 2018 తర్వాత వేగంగా పెరిగింది. తరతరాలుగా సేవలు అందని షెడ్యూల్డ్ తెగల వర్గాలకు ఆధునిక వసతి విద్యా విధానాన్ని, నాణ్యమైన విద్యను చేరువ చేసింది.
2026 నాటికి 499 పాఠశాలల్లో 1.56 లక్షల మందికి పైగా విద్యార్థులు చదువుతున్నారు. మరో 323 పాఠశాలలు నిర్మాణంలో ఉన్నాయి.
ఈ పాఠశాలల్లో చేరిన చాలామంది విద్యార్థులు తమ కుటుంబాలలో క్రమబద్ధమైన ఉన్నత విద్యా వ్యవస్థలోకి ప్రవేశించిన మొదటి తరం విద్యార్థులుగా నిలిచారు.
కొత్త క్యాంపస్‌లు స్మార్ట్ క్లాస్‌రూమ్‌లు, సైన్స్, కంప్యూటర్ ల్యాబ్‌లు, లైబ్రరీలు, క్రీడా సౌకర్యాలు, డిజిటల్ లెర్నింగ్ సౌకర్యాలు, బాలురు, బాలికలకు ప్రత్యేక హాస్టళ్లు సహా మారుమూల ప్రాంతాలలో గతంలో లేని సౌకర్యాలను తీసుకువచ్చాయి.
ఒక హిమాలయ గ్రామం నుంచి ఐఐటీ వరకు: జతిన్ నేగి కథ
హిమాచల్ ప్రదేశ్‌లోని కిన్నౌర్ జిల్లాలో ఉన్న సాంగ్లా గ్రామం టిబెట్ సరిహద్దులో ఉంటుంది. శీతాకాలంలో రెండు నెలల పాటు విద్యుత్ ఉండదు. మంచు కారణంగా రహదారులు మూసుకుపోతాయి. ఇక్కడే జతిన్ నేగి పెరిగాడు.
అతను ఆరో తరగతిలో ఏకలవ్య మోడల్ వసతి పాఠశాలలో చేరాడు. క్రమబద్ధమైన అభ్యాసం, క్రమం తప్పకుండా పరీక్షలు, పాఠ్యపుస్తకాలకు మించి ప్రోత్సహించే ఉపాధ్యాయులు అతని జీవితాన్ని మార్చారు. అతను 12వ తరగతిలో ఉన్నప్పుడు తండ్రి చనిపోతే, ఉపాధ్యాయులు అతనికి అండగా నిలిచారు. అతను ఒక సంవత్సరం విరామం తీసుకుని, పట్టుదలగా చదివి, జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షలో 421వ ఆల్ ఇండియా ర్యాంక్ సాధించాడు. అతను ప్రస్తుతం ఐఐటీ జోధ్‌పూర్‌లో చదువుతున్నాడు.
అతని గ్రామానికి ఐఐటీ అంటే ఏంటో ఎప్పుడూ తెలియదు. జతిన్ కథ 597 మంది విద్యార్థుల విజయాలలో ఒకటి — 2022-23లో కేవలం ఇద్దరు విద్యార్థుల నుంచి 2024-25లో జేఈఈ, నీట్ పరీక్షలలో ఉత్తీర్ణత సాధించిన ఏకలవ్య పాఠశాల విద్యార్థుల సంఖ్య ఇది.
గిరిజన పరిశోధనా సంస్థలకు(టీఆర్‌ఐ) మద్దతు
గిరిజన భాషలు, సంస్కృతి, సంప్రదాయాలు, స్వదేశీ జ్ఞాన వ్యవస్థలను రక్షించడంలో గిరిజన పరిశోధనా సంస్థలు (టీఆర్‌ఐ) కీలక పాత్ర పోషిస్తాయి. 29 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో ఇవి పరిశోధనలు చేయడం, మౌఖిక చరిత్రలను నమోదు చేయడం, సాంస్కృతిక పద్ధతులను భద్రపరచడం, మ్యూజియంలు, ప్రచురణలు, పండుగల ద్వారా గిరిజన వారసత్వంపై అవగాహనను పెంచుతాయి. ట్రైబల్ రీసెర్చ్, ఇన్‌ఫర్మేషన్, ఎడ్యుకేషన్, కమ్యూనికేషన్, ఈవెంట్స్(టీఆర్‌ఐ-ఈసీఈ) పథకం కింద ఈ ప్రయత్నాలకు మరింత మద్దతు లభిస్తుంది. ఇది ఐఐటీలు, ఐఐఎంలు, ఎయిమ్స్, టెరి, భాషా రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ వంటి సంస్థల ద్వారా అంతరించిపోతున్న భాషలు, సాంప్రదాయ వైద్యం, కమ్యూనిటీ అటవీ హక్కులు, పీవీటీజీ జీవనోపాధి వంటి అంశాలపై పరిశోధనలకు నిధులు సమకూరుస్తోంది.
గిరిజన వారసత్వం, స్వాతంత్య్ర సమరయోధుల గుర్తింపు
గత 12 ఏళ్లలో వలసరాజ్యాల పాలనకు వ్యతిరేకంగా పోరాడిన గిరిజన నాయకులను గౌరవించడానికి ప్రభుత్వం 10 రాష్ట్రాలలో 11 గిరిజన స్వాతంత్య్ర సమరయోధుల మ్యూజియంలను మంజూరు చేసింది. జార్ఖండ్, మధ్యప్రదేశ్(2 మ్యూజియంలు), ఛత్తీస్‌గఢ్‌లలో నాలుగు మ్యూజియంలు ప్రారంభమయ్యాయి. మిజోరాం, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, గుజరాత్, గోవా, మణిపూర్‌లలో మరో ఏడు నిర్మాణంలో ఉన్నాయి.
భగవాన్ బిర్సా ముండా జయంతి అయిన నవంబర్ 15ను ప్రతి సంవత్సరం జన్‌జాతీయ గౌరవ్ దివస్‌గా జరుపుకుంటారు. ఇది కేవలం ఒక నాయకుడిని మాత్రమే కాకుండా, ప్రధాన స్రవంతి భారతదేశం చాలా కాలంగా విస్మరించిన వలసరాజ్యాల పాలనకు వ్యతిరేకంగా జరిగిన గిరిజన ప్రతిఘటన చరిత్రను గౌరవిస్తుంది. భగవాన్ బిర్సా ముండా 150వ జయంతిని 15 నవంబర్ 2024 నుంచి 15 నవంబర్ 2025 వరకు జన్‌జాతీయ గౌరవ్ వర్ష్‌గా జరుపుకున్నారు.
షెడ్యూల్డ్ కులాలకు న్యాయం, గౌరవం
గత 12 ఏళ్లలో షెడ్యూల్డ్ కులాల(ఎస్సీ) వర్గాలు ప్రత్యేక అభివృద్ధి వ్యూహంలో భాగంగా ఉన్నాయి. ఈ వ్యూహం ఆర్థిక సాధికారత, విద్యావకాశాలు, ప్రత్యేక బడ్జెట్ మద్దతును మిళితం చేస్తుంది. కేవలం నామమాత్రపు గుర్తింపు నుంచి నిజమైన సమానత్వం వైపు అడుగులు వేస్తుంది.
ప్రధానమంత్రి అనుసూచిత్ జాతి అభ్యుదయ్ యోజన(పీఎం-అజయ్)
2021లో ప్రారంభించిన పీఎం-అజయ్.. షెడ్యూల్డ్ కులాల జనాభా ఎక్కువగా ఉన్న గ్రామాల సమగ్ర అభివృద్ధిపై దృష్టి పెడుతుంది. ఈ పథకం వెనుకబడిన ఎస్సీ వర్గాలలో మౌలిక సదుపాయాల కల్పన, నైపుణ్య అభివృద్ధి, జీవనోపాధి అవకాశాలకు మద్దతు ఇస్తుంది.
పీఎం-అజయ్ కింద ఆదర్శ్ గ్రామ్ విభాగం వివిధ పథకాల సమన్వయం, గ్రామ అభివృద్ధి ప్రణాళికలు, స్థానిక అవసరాల భర్తీ ద్వారా ఎస్సీ జనాభా ఎక్కువగా ఉన్న గ్రామాలను అభివృద్ధి చేయడానికి ప్రాంతీయ విధానాన్ని అవలంబిస్తుంది.
ఇది 26 రాష్ట్రాల్లోని 597 జిల్లాల్లో ఉన్న 47,334 గ్రామాలకు వర్తిస్తుంది. ఈ కార్యక్రమం 4 కోట్లకు పైగా షెడ్యూల్డ్ కులాల పౌరులకు, 83 లక్షలకు పైగా కుటుంబాలకు చేరువవుతోంది.

ఈ కార్యక్రమం గ్రామ స్థాయి ప్రణాళిక, మౌలిక సదుపాయాల పర్యవేక్షణను కూడా బలోపేతం చేసింది. 25,000 కంటే ఎక్కువ గ్రామాలు మౌలిక సదుపాయాల అంచనా పనులను పూర్తి చేశాయి. ఇది రహదారులు, నీటి సరఫరా, విద్య, పారిశుధ్యం, అనుసంధానంలో ఉన్న లోపాలను క్రమబద్ధంగా గుర్తించడానికి సహాయపడింది. యువత భాగస్వామ్యం, జీవనోపాధి కల్పనపై కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. నైపుణ్యాభివృద్ధి, స్వయం సహాయక సంఘాల భాగస్వామ్యం, గ్రామ మౌలిక సదుపాయాల కల్పన వంటివి దీర్ఘకాలిక ఆర్థిక భాగస్వామ్యం వైపు సాగుతున్న ప్రయత్నంలో భాగమయ్యాయి.
షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి కార్యాచరణ ప్రణాళిక(డీఏపీఎస్‌సీ)
షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి కార్యాచరణ ప్రణాళిక(డీఏపీఎస్‌సీ) దేశవ్యాప్తంగా ఎస్సీ వర్గాల కోసం ప్రత్యేక వ్యయ ముసల్దాను సృష్టించింది. డీఏపీఎస్‌సీ అనేది ఒక ప్రత్యేక పథకం కాదు. ఇది ఎస్సీ వర్గాల సంక్షేమం, అభివృద్ధి కోసం వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాలు అమలు చేసే పథకాలు, కార్యక్రమాలను ఏకం చేస్తుంది. ఈ విధానం మంత్రిత్వ శాఖలు ఎస్సీ వర్గాలకు ప్రయోజనం చేకూర్చే పథకాల కోసం ప్రత్యేక నిధులను కేటాయించేలా చేస్తుంది.

ఈ విధానం ప్రస్తుతం 38 మంత్రిత్వ శాఖలు, విభాగాలలో విస్తరించి ఉంది. ఇది విద్య, గృహనిర్మాణం, ఆరోగ్యం, నైపుణ్యాలు, జీవనోపాధి, విద్యుద్దీకరణ, సామాజిక న్యాయం వంటి రంగాలలో 239 పథకాలకు మద్దతు ఇస్తుంది.
ఎస్సీ, ఇతర విద్యార్థులకు స్కాలర్‌షిప్ మద్దతు
స్కాలర్‌షిప్స్ ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఫర్ యంగ్ అచీవర్స్ స్కీమ్(శ్రేయస్)
ఫిబ్రవరి 2019లో ప్రారంభించిన శ్రేయస్ పథకం ఎస్సీ, ఓబీసీ, ఈబీసీ విద్యార్థులకు ఉన్నత విద్య, పరిశోధనలు, పోటీ పరీక్షలు, విదేశీ విద్యను అభ్యసించడంలో మద్దతు ఇస్తుంది. ఈ పథకం ఆర్థిక ఇబ్బందులను తగ్గించి, నాణ్యమైన విద్యావకాశాలను విస్తరించే బహుళ కార్యక్రమాలను ఒకచోటకు చేరుస్తుంది. 2025–26లోనే, టాప్ క్లాస్ ఎడ్యుకేషన్ విభాగం ఐఐటీలు, ఐఐఎంలు, ఎయిమ్స్, ఎన్‌ఐటీల వంటి ప్రముఖ సంస్థలలో 4,156 మంది ఎస్సీ విద్యార్థులకు మద్దతు ఇచ్చింది, ఇందులో 30 శాతం సీట్లు ఎస్సీ బాలికలకు కేటాయించారు. ఇదే సమయంలో, ఉచిత కోచింగ్ పథకం పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న 990 మంది విద్యార్థులకు సహాయం చేయగా, నేషనల్ ఓవర్సీస్ స్కాలర్‌షిప్ విదేశాలలో ఉన్నత చదువులు చదువుతున్న 72 మంది విద్యార్థులకు మద్దతు ఇచ్చింది. పరిశోధన స్థాయిలో, ఫెలోషిప్ పథకాలు 2025-26లోనే 4,153 మంది ఎస్సీ పరిశోధకులకు, 1,969 మంది ఓబీసీ పరిశోధకులకు ప్రయోజనం చేకూర్చాయి.


నిర్దేశిత ప్రాంతాల హైస్కూల్ విద్యార్థుల వసతి విద్యా పథకం(శ్రేష్ఠ)
తక్కువ ఆదాయం ఉన్న కుటుంబాల షెడ్యూల్డ్ కులాల విద్యార్థులకు నాణ్యమైన వసతి విద్యా విధానం ఎంతో అవసరం. జూన్ 2022లో ప్రారంభించిన శ్రేష్ఠ పథకం తొమ్మిదో తరగతి నుంచి పన్నెండో తరగతి వరకు విద్యను అందించడం ద్వారా ఈ అవసరాన్ని తీరుస్తుంది.
ఈ పథకం రెండు పద్ధతులలో పనిచేస్తుంది:
- మొదటి పద్ధతి జాతీయ ప్రవేశ పరీక్ష ఫర్ శ్రేష్ఠ(నెట్స్) ద్వారా ప్రైవేట్ వసతి పాఠశాలల్లో ప్రతిభావంతులైన ఎస్సీ విద్యార్థుల ప్రవేశానికి మద్దతు ఇస్తుంది.
- రెండో పద్ధతి స్వచ్ఛంద సంస్థలు, విద్యా సంస్థలు నడిపే వసతి పాఠశాలలకు మద్దతు ఇస్తుంది. వార్షిక కుటుంబ ఆదాయం రూ.2.5 లక్షల వరకు ఉన్న అర్హులైన ఎస్సీ విద్యార్థులు ఈ ప్రవేశ పరీక్షకు హాజరుకావచ్చు.

2025-26లో శ్రేష్ఠ పథకం 288 పాఠశాలలు, సంస్థలలో 19,754 మంది షెడ్యూల్డ్ కులాల విద్యార్థులకు మద్దతు ఇచ్చింది.
ఇద్దరు అమ్మాయిలు, ఒకే పథకం, ఒకే సంకల్పం
తమ కుటుంబాలు తమ అపజయాన్ని తట్టుకోలేవని తెలిసిన పిల్లలలో ఒక ప్రత్యేక రకమైన పట్టుదల పెరుగుతుంది. డోలి, ఊర్మిళ ఎప్పుడూ కలుసుకోలేదు. ఒకరు హిమాచల్ ప్రదేశ్, మరొకరు రాజస్థాన్ వాసి. భౌగోళిక దూరం ఉన్నా వారి కథలు ఒకేలా ఉంటాయి.
డోలి తండ్రి రోజువారీ కూలీ. ఆమె పాఠశాల చదువు మధ్యలోనే ఆగిపోయే ప్రమాదం స్పష్టంగా ఉంది. ఎలాంటి మద్దతు లేకపోతే ఆమె చదువు కొనసాగించడం సాధ్యమయ్యేది కాదు. నాణ్యమైన పాఠశాలల్లో ఎస్సీ విద్యార్థులకు ప్రత్యక్ష ఆర్థిక సహాయం అందించే శ్రేష్ఠ మొదటి పద్ధతి కింద ఆమె డల్హౌసీ పబ్లిక్ స్కూల్‌లో తన ముఖ్యమైన విద్యా సంవత్సరాల్లో చదువు కొనసాగించింది. ఆమె ఐఐటీ ఢిల్లీలో ప్రవేశం పొంది, ప్రస్తుతం అక్కడ సివిల్ ఇంజనీరింగ్ చదువుతోంది. "పరిమితులు ఉన్నప్పటికీ నా లక్ష్యాలను సాధించడానికి శ్రేష్ఠ నాకు మద్దతు, ప్రేరణ, ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చింది" అని ఆమె పేర్కొంది.
ఊర్మిళ తండ్రి రాజస్థాన్‌లోని బాల్‌రావ్ జిల్లాలో ఒక చిన్న భూమిలో వ్యవసాయం చేస్తారు. ఆమెకు రెండవ పద్ధతి ద్వారా మద్దతు లభించింది. ఇది ఎస్సీ విద్యార్థులను చేర్చుకోవడానికి నాణ్యమైన వసతి పాఠశాలలకు నిధులు సమకూరుస్తుంది. ఆమె తన 12వ తరగతి బోర్డు పరీక్షలలో 99.60 శాతం మార్కులు సాధించి, రాజస్థాన్ వ్యాప్తంగా మొదటి ర్యాంక్ సాధించింది.
ఇద్దరు అమ్మాయిలు, రెండు కుటుంబాలు, ఒకే కష్టాల అంచున ఉన్న జీవితాలు వేర్వేరు మార్గాల ద్వారా పనిచేసిన ఒకే పథకం వారిని ఆదుకుంది. శ్రేష్ఠ వారి ప్రతిభను కొత్తగా కనుగొనలేదు, పరిస్థితులు ఆ ప్రతిభను ఆరిపోకుండా చూసింది.
పాఠశాల, ఉన్నత విద్యా స్కాలర్‌షిప్‌లు
ప్రీ-మెట్రిక్, పోస్ట్-మెట్రిక్ స్కాలర్‌షిప్ పథకాలు షెడ్యూల్డ్ కులాల విద్యార్థులకు విద్య వివిధ దశలలో మద్దతు ఇస్తాయి. ప్రీ-మెట్రిక్ స్కాలర్‌షిప్ తొమ్మిది, పది తరగతుల విద్యార్థులు పాఠశాల చదువు కొనసాగించడానికి సహాయపడుతుంది. ఇది మానవ వ్యర్థాల తొలగింపు, ప్రమాదకరమైన పారిశుధ్య పనులలో నిమగ్నమైన కుటుంబాల పిల్లలకు కూడా మద్దతు ఇస్తుంది. పోస్ట్-మెట్రిక్ స్కాలర్‌షిప్ విద్యా ఖర్చులను భరించడం ద్వారా విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించడానికి సహాయపడుతుంది. రెండు పథకాలు పూర్తిగా డిజిటల్ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్(డీబీటీ) విధానం ద్వారా అమలు అవుతున్నాయి.
ఇటీవలి ప్రగతి
- ప్రీ-మెట్రిక్ స్కాలర్‌షిప్ పథకం కింద 2025-26లో రూ.359.47 కోట్లు విడుదలయ్యాయి. డీబీటీ ద్వారా 17.14 లక్షల మంది విద్యార్థులు ప్రయోజనం పొందారు.
- పోస్ట్-మెట్రిక్ స్కాలర్‌షిప్ పథకం ప్రయత్నాల వల్ల ఉన్నత విద్యలో షెడ్యూల్డ్ కులాల నమోదు 2021-22 నాటికి 66.23 లక్షలకు చేరింది. ఇది 2014-15 నుంచి 44 శాతం పెరుగుదల.
- ఎస్సీ విద్యార్థినుల నమోదు 31.71 లక్షలకు పెరిగింది. ఇది 2014-15 నుంచి 51 శాతం పెరుగుదలను ప్రతిబింబిస్తుంది.
- ఉన్నత విద్యలో ఎస్సీ విద్యార్థుల స్థూల నమోదు నిష్పత్తి (జీఈఆర్) 2014-15లో 18.9 శాతం నుంచి 2021-22 నాటికి 25.9 శాతానికి పెరిగింది. ఇదే కాలంలో ఎస్సీ విద్యార్థినుల జీఈఆర్ 18.1 శాతం నుంచి 26 శాతానికి పెరిగింది.
- 11, 12 తరగతుల్లో ఎస్సీ విద్యార్థుల జీఈఆర్ 2019-20లో 52.9 శాతం నుంచి 2021-22 నాటికి 61.5 శాతానికి మెరుగైంది.
దేశవ్యాప్తంగా షెడ్యూల్డ్ కులాల విద్యార్థుల విద్యా ఫలితాలను బలోపేతం చేయడానికి, ఉన్నత విద్యావకాశాలను విస్తరించడానికి ఈ పథకాలు సహాయపడ్డాయి. 2021-22 నుంచి ఈ పథకం పూర్తిగా డిజిటల్ విధానంలోకి మారింది. నిధులు నేరుగా అర్హులైన విద్యార్థులకు చేరుతున్నాయి.
వెనుకబడిన, సంచార జాతుల ఉన్నతికి ఊతం
ఇతర వెనుకబడిన తరగతులు(ఓబీసీలు), ఆర్థికంగా వెనుకబడిన తరగతులు(ఈబీసీలు), నోటిఫైడ్ కాని, సంచార తెగలు(డీఎన్‌టీలు) కూడా అధికారిక అభివృద్ధికి దూరంగా సమాజపు అంచుల్లోనే ఉండిపోయారు. గత 12 ఏళ్లలో ఈ పరిస్థితి మారింది. స్కాలర్‌షిప్‌లు, నైపుణ్యాభివృద్ధి, జీవనోపాధి వనరులు, చట్టపరమైన గుర్తింపు వంటివి ఈ వర్గాలకు విస్తృతంగా చేరువయ్యాయి.
పీఎం-యశస్వి –పీఎం యంగ్ అచీవర్స్ స్కాలర్‌షిప్ అవార్డు స్కీమ్ ఫర్ వైబ్రంట్ ఇండియా
2021-22లో ప్రారంభమైన పీఎం-యశస్వి పథకం ఓబీసీ, ఈబీసీ, డీఎన్‌టీ విద్యార్థులకు ఐదు విభాగాల ద్వారా మద్దతు ఇస్తుంది. అవి: ప్రీ-మెట్రిక్ స్కాలర్‌షిప్, పోస్ట్-మెట్రిక్ స్కాలర్‌షిప్, టాప్ క్లాస్ స్కూల్ ఎడ్యుకేషన్, టాప్ క్లాస్ కాలేజ్ ఎడ్యుకేషన్, ఓబీసీ హాస్టళ్లు. అన్ని ప్రయోజనాలు నేరుగా ఆధార్ అనుసంధాన బ్యాంక్ ఖాతాల్లోకే బదిలీ అవుతాయి. అన్ని విభాగాలలో కనీసం 30 శాతం సీట్లు విద్యార్థినుల కోసం కేటాయించారు.

ప్రధానమంత్రి దక్షత ఔర్ కుశలత సంపన్న హితగ్రాహి యోజన(పీఎం దక్ష్)
2020-21లో ప్రారంభమైన పీఎం-దక్ష్ పథకం వెనుకబడిన వర్గాలకు ఉచిత, ధ్రువీకృత నైపుణ్య శిక్షణను అందిస్తుంది. ఈ పథకం వారిని నేరుగా వేతన ఉపాధి, స్వయం ఉపాధితో అనుసంధానిస్తుంది.
ఈ పథకం వర్తించే వారు:
- షెడ్యూల్డ్ కులాలు — ఆదాయ పరిమితి లేదు
- ఓబీసీలు — కుటుంబ ఆదాయం రూ.3 లక్షల వరకు
- ఈబీసీలు — కుటుంబ ఆదాయం రూ.1 లక్ష వరకు
- నోటిఫైడ్ కాని, సంచార తెగలు — ఆదాయ పరిమితి లేదు
- పారిశుధ్య కార్మికులు, చెత్త సేకరించే వారు — ఆదాయ పరిమితి లేదు
ఈ పథకం ప్రారంభమైనప్పటి నుంచి పీఎం-దక్ష్ ద్వారా 2.08 లక్షలకు పైగా మంది లబ్ధిదారులకు విజయవంతంగా శిక్షణ ఇచ్చారు.
వంచిత్ ఇకాయ్ సమూహ్ ఔర్ వర్గోన్ కో ఆర్థిక సహాయత(విశ్వాస్) యోజన
ఎస్సీలు, ఓబీసీలు, సఫాయ్ కర్మచారీలు ఆదాయాన్ని ఇచ్చే పనుల కోసం తక్కువ వడ్డీకి రుణాలు పొందడానికి విశ్వాస్ పథకం సహాయపడుతుంది. ఈ పథకం అర్హత కలిగిన రుణాలపై సంవత్సరానికి 5 శాతం వరకు వడ్డీ సబ్సిడీని అందిస్తుంది. ప్రయోజనాలు నేరుగా లబ్ధిదారులకు డీబీటీ ద్వారా బదిలీ అవుతాయి. రుణ ఖర్చులను తగ్గించడం ద్వారా ఇది వ్యాపారవేత్తలను, స్వయం ఉపాధిని, జీవనోపాధి అవకాశాలను ప్రోత్సహిస్తుంది.
కీలక విజయాలు (2024-25, 2025-26):

స్కీమ్ ఫర్ ఎకనామిక్ ఎంపవర్‌మెంట్ ఆఫ్ డీఎన్‌టీ (సీడ్)
2022 ఫిబ్రవరిలో ప్రారంభమైన సీడ్ అనేది నోటిఫైడ్ కాని, సంచార, పాక్షిక సంచార తెగల(డీఎన్‌టీ/ఎన్‌టీ/ఎస్‌ఎన్‌టీ) సంక్షేమం కోసం ఉద్దేశించిన ఒక ప్రత్యేక పథకం. ఈ పథకం నాలుగు కీలక పనులకు మద్దతు ఇస్తుంది: పోటీ పరీక్షలకు ఉచిత కోచింగ్, ఆరోగ్య బీమా రక్షణ, కమ్యూనిటీ స్థాయి జీవనోపాధి కార్యక్రమాలు, గృహ నిర్మాణానికి ఆర్థిక సహాయం.
2025-26లోనే 4,485 మంది డీఎన్‌టీ విద్యార్థులకు ఉచిత కోచింగ్ మద్దతు అందించడానికి రూ.26.75 కోట్లు కేటాయించారు. అదే సమయంలో, క్షేత్రస్థాయిలో ఆర్థిక స్వవలంబనను పెంపొందించడానికి, 64,701 మంది వ్యక్తుల జీవనోపాధికి మద్దతుగా రూ.16 కోట్లు నేరుగా బదిలీ చేశారు. ఆర్థిక, విద్యా సాధికారతతో పాటు ప్రభుత్వం సామాజిక భద్రతకు ప్రాధాన్యత ఇచ్చింది. 2025-26లోనే డీఎన్‌టీ కుటుంబాలకు 73,569 ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య బీమా కార్డులను జారీ చేశారు. ఇది వారికి అవసరమైనప్పుడు ఉచిత, నాణ్యమైన వైద్య సేవలు అందేలా చూస్తుంది.
వెనుకబడిన మైనారిటీ వర్గాల సాధికారత
ప్రధానమంత్రి విరాసత్ కా సంవర్ధన్(పీఎం వికాస్)
2025లో ప్రారంభమైన పీఎం వికాస్.. మైనారిటీ వర్గాల విద్యా, ఆర్థిక, సామాజిక అభివృద్ధి అవసరాలకు ఒక క్రమబద్ధమైన పరిష్కారాన్ని అందిస్తుంది. ప్రస్తుతం ఉన్న ఐదు పథకాలను — సీఖో ఔర్ కమావో, ఉస్తాద్, హమారీ ధరోహర్, నయీ రోష్ని, నయీ మంజిల్ — ఒకే సమగ్ర విధానంలోకి చేర్చారు.
పీఎం వికాస్ ప్రధాన లక్ష్యం పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా నైపుణ్యాలను అభివృద్ధి చేయడం. దీనివల్ల శిక్షణ ప్రస్తుత మార్కెట్ డిమాండ్, ఉపాధి అవకాశాలకు అనుగుణంగా ఉంటుంది. ఎయిర్‌లైన్ క్యాబిన్ క్రూ, గార్డెనింగ్, నర్సరీ మేనేజ్‌మెంట్, సాంప్రదాయ చేతి ఎంబ్రాయిడరీ, గ్రాఫిక్ డిజైన్, ఎలక్ట్రీషియన్, జూనియర్ ఇంజనీర్-డ్రోన్ (పరిశోధన-అభివృద్ధి) వంటి విభిన్న రంగాలలో శిక్షణ ఇస్తున్నారు. నైపుణ్యాభివృద్ధితో పాటు వ్యాపార నైపుణ్యం, నాయకత్వ లక్షణాలు, సాంస్కృతిక పరిరక్షణను మిళితం చేయడం ద్వారా ఈ పథకం ఉపాధి అవకాశాలను మెరుగుపరుస్తుంది. మైనారిటీ వర్గాలకు స్థిరమైన జీవనోపాధిని సృష్టిస్తుంది.
ప్రగతి (10 జూన్ 2026 నాటికి):
- ఈ పథకం కోసం 73,200 మంది అభ్యర్థులు నమోదు చేసుకున్నారు.
- 31 శిక్షణా భాగస్వాములు, 353 శిక్షణా కేంద్రాల ద్వారా 12,429 మంది అభ్యర్థులకు వివిధ నైపుణ్యాలలో శిక్షణ ఇచ్చారు.
- 2,557 బ్యాచ్‌లలో ఎయిర్‌లైన్ క్యాబిన్ క్రూ, మల్టీ-స్కిల్ టెక్నీషియన్, సాంప్రదాయ చేతి ఎంబ్రాయిడరీ మొదలైన రంగాలలో 1,405 మంది అభ్యర్థులకు ధృవీకరణ పత్రాలు అందజేశారు.
- నిర్వహణ, మీడియా-వినోదం, ఆరోగ్యం, వ్యవసాయం వంటి రంగాలలో ఈ నమోదు విస్తరించింది.
పారిశుధ్య కార్మికులకు గౌరవప్రదమైన జీవితం

పారిశుధ్య కార్మికులు తమ స్వంత ఆరోగ్యం, రక్షణ, గౌరవాన్ని సైతం పణంగా పెట్టి భారతదేశ నగరాలను శుభ్రంగా ఉంచుతున్నారు. ఈ పరిస్థితిని మార్చడానికి 2023-24 ఆర్థిక సంవత్సరంలో నమస్తే పథకం(నేషనల్ యాక్షన్ ఫర్ మెకనైజ్డ్ శానిటేషన్ ఎకోసిస్టమ్) ప్రారంభమైంది. ఇది ప్రమాదకరమైన మానవ వ్యర్థాల చేతితో శుభ్రపరిచే పద్ధతి స్థానంలో యంత్రాల వ్యవస్థలను ప్రవేశపెట్టే ఒక నిర్మాణాత్మక సంస్కరణ, ఇది గౌరవం, రక్షణతో కూడిన జీవనోపాధిని నిర్మిస్తుంది.
ఈ పథకం మొదట మురుగునీటి కాలువలు, సెప్టిక్ ట్యాంక్ కార్మికులకు మాత్రమే వర్తించేది. 2024 జూన్ నుంచి పట్టణ, గ్రామీణ ప్రాంతాలలోని చెత్త సేకరించే వారిని కూడా ఇందులో చేర్చారు.
వెనుకబడిన ప్రాంతాల రూపాంతరం – ఆశావహ జిల్లాల విధానం
భౌగోళిక పరిస్థితులు ఒకరి భవిష్యత్తును నిర్ణయించకూడదనే సరళమైన నమ్మకంతో ప్రభుత్వం ఆకాంక్షిత జిల్లాల కార్యక్రమాన్ని చేపట్టింది. 2018లో ప్రారంభమైన ఈ కార్యక్రమం ఆరోగ్యం, పోషకాహారం, విద్య, వ్యవసాయం, ఆర్థిక సేవలు వంటి రంగాలలో భారతదేశంలోని 112 అత్యంత వెనుకబడిన జిల్లాలను లక్ష్యంగా చేసుకుంది. 2023లో ఇది మరింత విస్తరించి, ఆశావహ బ్లాకుల కార్యక్రమం ద్వారా 329 జిల్లాలలోని 500 బ్లాకులకు చేరుకుంది.
దీని ఫలితాలు స్థానికంగా, స్పష్టంగా, కొలవదగిన రీతిలో కనిపిస్తున్నాయి. ప్రతి జిల్లా తన ప్రధాన సమస్యను గుర్తించి, దానికి తగిన పరిష్కారాన్ని నిర్మించుకుంది.
ఆశావహ జిల్లాల కార్యక్రమం — చివరి మైలు వరకు పాలన
వరదలు ఎక్కువగా వచ్చే అస్సాంలోని లఖింపూర్‌లో నదీ తీర ప్రాంతాల కారణంగా ప్రజలు సంవత్సరాలుగా వైద్య సేవలకు దూరమయ్యారు. యంత్రాంగం ఏప్రిల్ 2023 నుంచి డిసెంబర్ 2024 మధ్య కాలంలో 1,176 ప్రాంతాలలో మొబైల్ మెడికల్ యూనిట్లు, బోట్ క్యాంపులను ఏర్పాటు చేసింది. ఫలితంగా, 25,308 మంది జనాభాలో మధుమేహం, రక్తపోటు రెండింటికీ 100 శాతం స్క్రీనింగ్ పరీక్షలు పూర్తి చేశారు.
తమిళనాడులోని విరుదునగర్‌లో సరైన సమన్వయం లేకపోవడం, గర్భధారణ సమస్యలను సరిగ్గా పర్యవేక్షించకపోవడం వల్ల చాలాకాలంగా ప్రసవ సమయాల్లో తల్లులు మరణించేవారు. ఈ జిల్లా విరుకేర్ అనే ప్రత్యేక డిజిటల్ పోర్టల్‌ను నిర్మించింది. ఇది గర్భిణుల పర్యవేక్షణతో పాటు రక్తహీనత ఉన్న తల్లులకు సరైన పోషకాహార మద్దతును అందిస్తుంది. దీనివల్ల ఏప్రిల్ 2023 నుంచి మార్చి 2024 మధ్య కాలంలో జిల్లాలో ఒక్క ప్రసవ మరణం కూడా నమోదు కాలేదు.
క్షేత్రస్థాయిలో సరైన వ్యవస్థలు, జవాబుదారీతనం, నిబద్ధత ఉన్న అధికారులు ఉన్నప్పుడు భారతదేశ అత్యంత సంక్లిష్టమైన అభివృద్ధి సవాళ్లను కూడా పరిష్కరించవచ్చని ఆశావహ జిల్లాలు, బ్లాకుల కార్యక్రమం నిరూపించింది.
సమానత్వం వైపు కొనసాగుతున్న ప్రయాణం
2014 కంటే ముందు ప్రభుత్వ విధానాలకు, భారతదేశంలోని అత్యంత వెనుకబడిన వర్గాలకు మధ్య పెద్ద వ్యత్యాసం ఉండేది. సంక్షేమ పథకాలు సూత్రప్రాయంగా ఉన్నప్పటికీ, సేవలు అందే విధానంలో అసమగ్రత ఉండేది. గిరిజన వర్గాలు, షెడ్యూల్డ్ కులాలు, ఇతర వెనుకబడిన తరగతులు, సంచార సమూహాలు, మైనారిటీలలోని పెద్ద విభాగాలు అధికారిక అభివృద్ధికి దూరంగానే ఉండిపోయాయి.
ఆ తర్వాతి సంవత్సరాలలో ఈ వ్యత్యాసాన్ని తొలగించడానికి ఒక సంయుక్త కృషి జరిగింది. కేవలం ఒకే ఒక్క చొరవపై ఆధారపడకుండా, వివిధ వర్గాలు ఎదుర్కొంటున్న విభిన్న సవాళ్లను పరిష్కరించడానికి ప్రభుత్వం లక్ష్యిత కార్యక్రమాల ఒక విస్తృత వ్యవస్థను నిర్మించింది. విద్య, నైపుణ్యాభివృద్ధి, జీవనోపాధి, ఆర్థిక సమ్మిళితం, గుర్తింపు, మౌలిక సదుపాయాలు, సాంస్కృతిక పరిరక్షణ, సామాజిక గౌరవం వంటి అంశాలను ఒకదానితో ఒకటి అనుసంధానించారు.
వెనుకబడిన వర్గాలపై దీని ప్రభావం దేశవ్యాప్తంగా స్పష్టంగా కనిపిస్తోంది. ఎస్టీ విద్యార్థులు విశ్వవిద్యాలయాలలో ప్రవేశించడం, పీహెచ్‌డీలు చేయడం, ఎస్సీ యువత కొత్త వ్యాపారాలను స్థాపించడం, గ్రామాలకు రహదారులు, విద్యుత్ సౌకర్యం లభించడం, అలాగే మైనారిటీ వర్గాల మహిళలు తమ ఇళ్ల నుంచే స్థిరమైన జీవనోపాధిని సృష్టించుకోవడం వంటివి దీనికి నిదర్శనం.
అభివృద్ధి స్థిరంగా సాగుతోంది. మరింత సమగ్రమైన అభివృద్ధికి పునాదులు బలంగా పడ్డాయి. ఇప్పుడు భారతదేశ వెనుకబడిన వర్గాలను దేశ వృద్ధి కథలో ఒక భాగంగానే చూస్తున్నారు. వారు దేశ ప్రగతిలో కేంద్ర బిందువుగా నిలిచారు. వికసిత్ భారత్ @2047 ఆలోచనలో తాము కూడా భాగస్వామ్యులమనే భావన వారిలో వ్యక్తమవుతోంది.
References
Press Information Bureau
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2236972®=3&lang=1
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2248357®=3&lang=2
https://www.pib.gov.in/PressNoteDetails.aspx?NoteId=154915&ModuleId=3®=3&lang=2
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2238355®=3&lang=2
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2238355®=3&lang=2
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2189515®=3&lang=2
https://www.pib.gov.in/PressReleseDetailm.aspx?PRID=2159087®=3&lang=2
https://www.pib.gov.in/PressNoteDetails.aspx?id=154377&NoteId=154377&ModuleId=3®=3&lang=2
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=1784229®=3&lang=2
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2209488®=3&lang=2
https://www.pib.gov.in/PressReleseDetailm.aspx?PRID=2247766®=3&lang=2
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2253348®=3&lang=2
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2146466®=3&lang=2
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2255017®=3&lang=1
Ministry of Tribal Affairs
https://tribal.nic.in/downloads/pm-janman/pm/index.html
https://nests.tribal.gov.in/
https://nests.tribal.gov.in/backend/web/dashboard/index
https://tribal.nic.in/downloads/Statistics/AnnualReport/AnnualReport2014-15.pdf
Parliament Questions
https://sansad.in/getFile/loksabhaquestions/annex/187/AU6227_bkLVA3.pdf?source=pqals
https://sansad.in/getFile/annex/270/AU3814_fWJmb3.pdf?source=pqars
Ministry of Social Justice
https://pmagy.gov.in/
https://e-utthaan.gov.in/home/eyJpdiI6IlJsWkJzNDdDcjU5Q3YxMmYvTzZyZnc9PSIsInZhbHVlIjoiTHFaNmtaTlJZOWJpcERPTUsrRXJIak9DQ1pOcmpHcHQ0Z0lsVWNFeDBPQT0iLCJtYWMiOiI5NWI5ZWEwNGNmZDkyNmNlN2FlMDI5MGE1YWVjYWEwZTczMmUxMDI0YzQwNDg0OWFkNzdiYTdhMzFmZWFiYzJjIiwidGFnIjoiIn0=
https://socialjustice.gov.in/writereaddata/UploadFile/71441776233188.pdf
https://visvas.dosje.gov.in/visvas/home
Others
https://pmvikas.minorityaffairs.gov.in/page/about-us
https://app.powerbi.com/view?r=eyJrIjoiZTgxY2RjNTktMTNkZi00NjlmLTkyZGYtMDViNTRlZWVkZDhkIiwidCI6IjcyNGI4ZWQxLTgxODMtNGNiOS1iNWIwLTFlZDY3YWZlYWNmMSIsImMiOjEwfQ%3D%3D
https://www.niti.gov.in/sites/default/files/2025-08/stories-of-chnage-aspirational-districts-and-blocks.pdf
Click here to see pdf
***
(Explainer ID: 158883)
आगंतुक पटल : 39
Provide suggestions / comments