• Sitemap
  • Advance Search
Social Welfare

ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ స‌మ‌గ్ర‌ మాతృత్వ ఆరోగ్య సంరక్షణలో దశాబ్దం

Posted On: 08 JUN 2026 9:47PM

కీల‌కాంశాలు
2016 జూన్‌లో ప్రారంభించిన ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ గర్భిణులకు, ముఖ్యంగా రెండో, మూడో త్రైమాసికాల్లో ఉచిత, నాణ్యమైన ప్రసవ పూర్వ సంరక్షణను అందిస్తుంది. ప్రతి నెల 9వ తేదీన నిర్దేశిత ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ప్రమాదాలను ముందస్తుగా గుర్తించడం, సకాలంలో వైద్య సహాయం అందించడం, సురక్షితమైన గర్భధారణను నిర్ధారించడం ఈ చొరవ ముఖ్య ఉద్దేశం. ఈ పథకం 2026 జూన్ 9 నాటికి పదేళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా సాధారణ ప్రసవ పూర్వ తనిఖీ సేవలతో పాటు పీఎంఎస్ఎంఏ కింద 7.50 కోట్లకు పైగా గర్భిణులు ప్రసవ పూర్వ సేవలను అందుకున్నారు. 2022లో ప్రారంభించిన విస్తరిత పీఎంఎస్ఎంఏ.. ప్రమాదం అధికంగా ఉన్న గర్భధారణల తదుపరి సంరక్షణ, పర్యవేక్షణను బలోపేతం చేస్తుంది.

మాతృత్వ ఆరోగ్యం ఎందుకు ముఖ్యం
ప్రతి గర్భధారణ ఒక కుటుంబానికే కాకుండా, ఒక సమాజం, దేశ భవిష్యత్తుకు ఆశలను మోసుకొస్తుంది. అందువల్ల సురక్షితమైన గర్భధారణ, ఆరోగ్యకరమైన ప్రసవాన్ని నిర్ధారించడం ప్రజారోగ్యానికి, మానవాభివృద్ధికి అత్యంత ప్రాథమికమైనది. అయినప్పటికీ గర్భధారణలో కొన్ని ప్రమాదాలు ఉంటాయి. వాటిని సకాలంలో గుర్తించి, నిర్వహించకపోతే తల్లి, బిడ్డ ఇద్దరి ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుంది. ఒక దేశ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ బలానికి, సమ్మిళితత్వానికి మాతృత్వ ఆరోగ్యం అత్యంత స్పష్టమైన సూచికలలో ఒకటిగా నిలుస్తుంది.

మాతృత్వ‌ మరణాల నిష్పత్తి(ఎంఎంఆర్) అంటే ఏమిటి
ఒక నిర్దిష్ట కాలంలో ప్రతి లక్ష సజీవ జననాలకు జరిగే మాతృ మరణాల సంఖ్యను దీనిగా నిర్వచిస్తారు. మాతృత్వ‌ మరణం అంటే గర్భధారణ సమయంలో లేదా గర్భధారణ ముగిసిన 42 రోజుల లోపు, గర్భధారణకు సంబంధించిన లేదా దాని నిర్వహణ వల్ల తలెత్తే కారణాల వల్ల స్త్రీ మరణించడం. ఇందులో ప్రమాదాలు లేదా ప్రాసంగిక కారణాల వల్ల జరిగే మరణాలు ఉండవు.

ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్(పీఎంఎస్ఎంఏ) ప్రారంభించడానికి ముందు మాతృత్వ‌ మరణాలు ప్రధాన ప్రజారోగ్య సవాలుగా ఉండేవి. 2014–16 కాలంలో భారతదేశ మాతృ మరణాల నిష్పత్తి(ఎంఎంఆర్) ప్రతి లక్ష సజీవ జననాలకు 130గా ఉంది.

దేశవ్యాప్తంగా మాతృత్వ ఆరోగ్య సంరక్షణ సేవలను బలోపేతం చేయాల్సిన అత్యవసర అవసరాన్ని ఈ పరిస్థితి నొక్కిచెప్పింది. 2030 నాటికి మాతృత్వ‌ మరణాలను ప్రతి లక్ష సజీవ జననాలకు 70 కంటే తక్కువకు తగ్గించాలనే సుస్థిరాభివృద్ధి లక్ష్యం(ఎస్డీజీ) సాధనకు భారతదేశం కట్టుబడి ఉంది. జాతీయ ఆరోగ్య విధానం-2017 కింద కూడా మాతృత్వ ఆరోగ్యానికి కీలక ప్రాధాన్యత ఇచ్చారు. ఇది కేంద్రీకృత, నిరంతర జోక్యాల అవసరాన్ని బలోపేతం చేసింది. ఈ నేపథ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం 2016లో ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ (పీఎంఎస్ఎంఏ)ను ప్రారంభించింది.

ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్(పీఎంఎస్ఎంఏ)
జూన్ 9, 2016న ప్రారంభించిన పీఎంఎస్ఎంఏ.. గర్భిణులకు, ముఖ్యంగా వారి రెండో, మూడో త్రైమాసికాల్లో ఉన్నవారికి ప్రతి నెల 9వ తేదీన నిర్దేశిత ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలలో ఉచిత, సమగ్ర ప్రసవ పూర్వ సంరక్షణను అందిస్తుంది. భారతదేశంలో నివసించే ప్రతి మహిళకు, ఆమె ఎక్కడ ఉన్నా సరే, ముందస్తు ప్రమాద గుర్తింపు, సకాలంలో వైద్య సహాయం, సురక్షితమైన గర్భధారణను నిర్ధారించడం ఈ కార్యక్రమం లక్ష్యం.

పీఎంఎస్ఎంఏ సేవల ప్యాకేజీలో క్లినికల్ పరీక్షలు, ప్రయోగశాల పరీక్షలు(రక్తం, మూత్ర పరీక్షలు), అల్ట్రాసోనోగ్రఫీ, మందులు, పోషకాహారం, ప్రసవ ప్రణాళిక, సురక్షితమైన గర్భధారణ పద్ధతులపై కౌన్సెలింగ్ ఉంటాయి.

ముఖ్యమైన ఫీచర్లు ఇవీ:
- ప్రసూతి, గైనకాలజీ నిపుణులు లేదా సమగ్ర అత్యవసర ప్రసూతి, నవజాత శిశు సంరక్షణ(సీఈఎంఓఎన్సీ) ద్వారా కనీసం ఒక సమగ్ర, నాణ్యమైన ప్రసవ పూర్వ తనిఖీ.
- రెండో లేదా మూడవ త్రైమాసికంలో సమగ్ర అత్యవసర ప్రసూతి, నవజాత శిశు సంరక్షణ(సీఈఎంఓఎన్సీ)/ప్రాథమిక అత్యవసర ప్రసూతి, నవజాత శిశు సంరక్షణ (బీఈఎంఓఎన్సీ) శిక్షణ పొందిన వైద్యుల పర్యవేక్షణ.
- నిర్దేశిత ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలలో నిపుణుల ప్రసవ పూర్వ సంరక్షణ సేవల కోసం గర్భిణులను సమీకరించడం.
- 25 రకాల అధిక ప్రమాద కారకాలను పరీక్షించడం ద్వారా అధిక ప్రమాద గర్భధారణ(హెచ్ఆర్పీ) గుర్తింపు, ప్రారంభ దశలోనే నిర్వహణ.
- సురక్షితమైన ప్రసవం కోసం హెచ్ఆర్పీలను సమీపంలోని మొదటి రిఫరల్ యూనిట్(ఎఫ్‌ఆర్‌యూ) కు అనుసంధానించడం.
- పీఎంఎస్ఎంఏ సేవలను అందించడానికి ప్రైవేట్ సేవా ప్రదాతలను చేర్చుకోవడం.
- సేవల ప్యాకేజీలో అవసరమైన రక్తం, మూత్ర పరీక్షలు, అల్ట్రాసోనోగ్రఫీ ఉంటాయి.
- ప్రతి గర్భిణీకి పోషకాహారం, సరైన ప్రసవ ప్రణాళిక, సమస్యలను ఎదుర్కోవడానికి సంసిద్ధతపై కౌన్సెలింగ్.

25 అధిక ప్రమాద గర్భధారణ(హెచ్ఆర్పీ) విభాగాలు: హెచ్ఐవీ, సిఫిలిస్, తీవ్రమైన రక్తహీనత, గర్భధారణ ప్రేరిత రక్తపోటు, జెస్టేషనల్ డయాబెటిస్ మెల్లిటస్, హైపోథైరాయిడిజం, క్షయ, మలేరియా, గతంలో లోయర్ సెగ్మెంట్ సిజేరియన్ సెక్షన్(ఎల్‌ఎస్‌సీఎస్), సెఫాలో-పెల్విక్ అసమతుల్యత, చెడు ప్రసూతి చరిత్ర, కవలలు లేదా బహుళ గర్భధారణ, హెపటైటిస్ బీ, అసాధారణ పిండం హృదయ స్పందన రేటు, టీనేజ్ గర్భధారణ, తీవ్రమైన జ్వరం, పునరుత్పత్తి మార్గ అంటువ్యాధులు/లైంగికంగా సంక్రమించే అంటువ్యాధులు(ఆర్‌టీఐ/ఎస్‌టీఐ), మృతశిశువు జనన చరిత్ర, పుట్టుకతో వచ్చే వైకల్యం, నెగటివ్ బ్లడ్ గ్రూప్, ఎర్లీ ప్రిమి (చిన్న వయసులో మొదటి గర్భధారణ), ఎల్డర్లీ ప్రిమి (ఎక్కువ వయసులో మొదటి గర్భధారణ), గ్రాండ్ మల్టీపారా, పొట్టిగా ఉండటం, ఇతర నిర్దిష్ట వైద్య లేదా ప్రసూతి పరిస్థితులు.

గర్భిణుల‌ పరిస్థితి, ప్రమాద కారకాన్ని సూచించే స్టిక్కర్‌ను ప్రతి సందర్శనలో తల్లి, పిల్లల సంరక్షణ కార్డులపై అంటిస్తారు:

పీఎంఎస్ఎంఏ సేవలను ఎవరు పొందవచ్చు:
- తమ రెండో త్రైమాసికం (13–27 వారాలు) లేదా మూడో త్రైమాసికంలో (28 వారాల నుంచి ప్రసవం వరకు) ఉన్న గర్భిణులు.
- భారతదేశంలో నివసిస్తూ, ప్రతి నెల 9వ తేదీన నిర్దేశిత ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలను సందర్శించడానికి సిద్ధంగా ఉన్న భారతీయ పౌరులు.
- అధిక ప్రమాదం ఉన్న గర్భధారణ కేసులకు ప్రాధాన్యత, తదుపరి సంరక్షణ లభిస్తుంది.
- సాధారణ ప్రసవ పూర్వ సంరక్షణకు దూరమైన మహిళలను ఇందులో పాల్గొనేలా చురుగ్గా ప్రోత్సహిస్తారు.

డాక్టర్ వాలంటీర్ వ్యవస్థ
ఈ కార్యక్రమం ప్రతి నెల 9వ తేదీన తమ సమయాన్ని స్వచ్ఛందంగా కేటాయించడానికి ప్రైవేట్ రంగానికి చెందిన ఓబీ-జీవైఎన్ నిపుణులు, రేడియాలజిస్టులు, వైద్యులను చురుగ్గా ఆహ్వానిస్తుంది. ప్రధానమంత్రి స్వయంగా తన 'మన్ కీ బాత్' ప్రసంగంలో ఈ కార్య‌క్ర‌మం కోసం ఏడాదికి కేవలం 12 రోజులు కేటాయించాలని వైద్యులను కోరారు. వైద్యులు అధికారిక పీఎంఎస్ఎంఏ పోర్టల్ ద్వారా నమోదు చేసుకోవచ్చు. వాలంటీర్ల సహకారానికి గుర్తింపుగా 'ఐప్లెడ్జ్‌ఫర్9' అచీవర్స్ అవార్డులను అందజేస్తారు.

భారతదేశవ్యాప్తంగా విస్తరిస్తున్న పరిధి

 


నిర్దేశిత మాతృత్వ ఆరోగ్య కార్య‌క్ర‌మంగా ప్రారంభమైన ఈ కార్యక్రమం దేశవ్యాప్త ఉద్యమంగా ఎదిగింది. ప్రారంభమైనప్పటి నుంచి పీఎంఎస్ఎంఏ జిల్లాలకు, ఆరోగ్య కేంద్రాలకు, వర్గాలకు తన పరిధిని క్రమంగా విస్తరించింది.
 

 


ముఖ్యంగా భారతదేశం మాతృత్వ‌ మరణాల నిష్పత్తిని 43 పాయింట్లు తగ్గించి, 2014–16 - 2022–24 మధ్య ప్రతి లక్ష సజీవ జననాలకు 130 నుంచి 87 మాతృత్వ‌ మరణాలకు త‌గ్గించింది.

విస్తరిత పీఎంఎస్ఎంఏ: తదుపరి సంరక్షణను బలోపేతం చేయడం

 


అధిక ప్రమాదం ఉన్న గర్భధారణలను గుర్తించడం మొదటి అడుగు మాత్రమేనని గుర్తిస్తూ, తదుపరి సంరక్షణను బలోపేతం చేయడానికి ప్రభుత్వం జనవరి 2022లో విస్తరిత పీఎంఎస్ఎంఏ వ్యూహాన్ని ప్రారంభించింది. అధిక ప్రమాదం ఉన్నట్లు గుర్తించిన మహిళలు అదనపు ప్రసవ పూర్వ తనిఖీలు, నిరంతర పర్యవేక్షణ, గర్భధారణ అంతటా సకాలంలో వైద్య సహాయం పొందేలా ఈ కార్య‌క్ర‌మం చూస్తుంది. సురక్షితమైన ప్రసవం జరిగే వరకు ప్రతి అధిక ప్రమాద గర్భధారణను వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తారు. లబ్ధిదారురాలితో పాటు వచ్చే గుర్తింపు పొందిన సామాజిక ఆరోగ్య కార్యకర్త(ఆశా) కు మూడు అదనపు సందర్శనల వరకు ఆర్థిక ప్రోత్సాహకాలు మద్దతుగా నిలుస్తాయి. హెచ్ఆర్పీ నమోదు, తదుపరి సందర్శనల కోసం లబ్ధిదారురాలితో పాటు ఆశా కార్యకర్తకు ఎస్ఎంఎస్ అలర్ట్‌లు పంపుతారు.

ఇతర మాతృత్వ ఆరోగ్య కార్యక్రమాలతో కలిసి పనిచేయడం
పీఎంఎస్ఎంఏ ఒంటరిగా పనిచేయడం లేదు. ఇది ప్రభుత్వం అమలు చేస్తున్న మాతృ, శిశు ఆరోగ్య కార్యక్రమాల పెద్ద వ్యవస్థలో ఒక భాగంగా ఉంది.
- జనని సురక్ష యోజన(జేఎస్‌వై) సంస్థాగత ప్రసవాలను ప్రోత్సహిస్తుంది. 2014-15 నుంచి మార్చి 2025 నాటికి 11.96 కోట్ల నుంచి ఎక్కువ మంది మహిళలు దీని ద్వారా లబ్ధి పొందారు.
- జనని శిశు సురక్ష కార్యక్రమం(జేఎస్‌ఎస్‌కే) గర్భిణులకు, నవజాత శిశువులకు ఉచిత ఆరోగ్య సంరక్షణ సేవలను అందిస్తుంది. 2014-15 నుంచి ఈ పథకం కింద 18.05 కోట్లకు పైగా లబ్ధిదారులు సహాయం పొందుతున్నారు.
- 99,290 కి పైగా కేంద్రాల వ్య‌వ‌స్థ‌ ద్వారా సురక్షిత మాతృత్వ ఆశ్వాసన్(సుమన్) నాణ్యమైన మాతృత్వ ఆరోగ్య సంరక్షణను బలోపేతం చేస్తుంది.
- ప్రధానమంత్రి సమగ్ర పోషకాహార పథకం(పోషణ్) అభియాన్, ప్రధానమంత్రి మాతృ వందన యోజన (పీఎంఎంవీవై), లేబర్ రూమ్ క్వాలిటీ ఇంప్రూవ్‌మెంట్ ఇనిషియేటివ్(లక్ష్య) వంటి ఇతర కార్యక్రమాలు మాతృ పోషకాహారం, ప్రసూతి ప్రయోజనాలు, లేబర్ రూములలో సంరక్షణ నాణ్యతను మెరుగుపరుస్తాయి.
ఈ కార్యక్రమాలన్నీ కలిసి మాతృ, నవజాత శిశువుల ఆరోగ్యానికి ఒక సమగ్రమైన రూపురేఖలను సృష్టిస్తాయి.

పీఎంఎస్ఎంఏ 10 సంవత్సరాల వేడుక
ప్రభుత్వం పీఎంఎస్ఎంఏ 10 సంవత్సరాల వేడుక‌గా ఈ కార్య‌క్ర‌మాల‌ను నిర్వహిస్తోంది:
• 1.8 లక్షల ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలలో ఆయుష్మాన్ ఆరోగ్య శిబిరాలు: దేశంలోని 1.8 లక్షల ఆయుష్మాన్ ఆరోగ్య‌ మందిరాలలో నాణ్యమైన ప్రసవ పూర్వ సంరక్షణ(ఏఎన్‌సీ) సేవలను అందిస్తున్నారు.
• గ్రామ ఆరోగ్య పరిశుభ్రత, పోషకాహార దినోత్సవం(వీహెచ్ఎస్‌ఎన్‌డీ), జన్ ఆరోగ్య సమితి(జేఏఎస్), స్వయం సహాయక సంఘాల(ఎస్‌హెచ్‌జీ) ద్వారా కమ్యూనిటీ అవగాహన కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నారు.
• అన్ని జిల్లా ఆసుపత్రులు / ఉప జిల్లా ఆసుపత్రులు / మొదటి రిఫరల్ యూనిట్లు (ఎఫ్‌ఆర్‌యూ), ఇతర నిర్దేశిత పీఎంఎస్ఎంఏ కేంద్రాలలో ప్రత్యేక పీఎంఎస్ఎంఏ సెషన్‌లను నిర్వహిస్తున్నారు.

పదేళ్లు, భవిష్యత్తు వైపు చూపు
గడిచిన దశాబ్ద కాలంలో ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ భారతదేశంలో ప్రసవ పూర్వ సంరక్షణను మార్చివేసింది. నాణ్యమైన మాతృత్వ ఆరోగ్య సంరక్షణ ఇప్పుడు మరింత అందుబాటులోకి, క్రమబద్ధంగా, స్పందనాత్మకంగా మారింది. అధిక ప్రమాదం ఉన్న గర్భధారణలను ముందస్తుగా గుర్తించడం, క్రమబద్ధమైన పర్యవేక్షణ, సకాలంలో వైద్య సహాయం అందించడం ద్వారా ఈ కార్యక్రమం దేశవ్యాప్తంగా మాతృత్వ ఆరోగ్య సంరక్షణ సేవలను బలోపేతం చేయడానికి సహాయపడింది. తల్లులు, నవజాత శిశువుల ఆరోగ్య ఫలితాల మెరుగుదలకు దోహదపడింది. సరైన సమయంలో మహిళలకు నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ అందినప్పుడు, అది ప్రాణాలను కాపాడుతుందని, సమస్యలను నివారిస్తుందని, కుటుంబాలకు, భావి తరాలకు ఆరోగ్యకరమైన ప్రారంభాన్ని అందిస్తుందని పీఎంఎస్ఎంఏ నిరూపించింది.

భారతదేశం వికసిత్ భారత్@2047 వైపు అడుగులు వేస్తున్న వేళ ప్రతి గర్భధారణ సురక్షితంగా ఉండేలా చూస్తూ, ప్రతి తల్లికి దక్కాల్సిన సంరక్షణ అందేలా చేస్తూ పీఎంఎస్ఎంఏ మాతృత్వ ఆరోగ్య సంరక్షణ చిత్రాన్ని మార్చడం కొనసాగిస్తుంది. గత దశాబ్దంలో మాతృ మరణాల నిష్పత్తి 130 నుంచి 87 కు గణనీయంగా తగ్గడం, కేంద్రీకృత జోక్యాలు వేలాది ప్రాణాలను ఎలా కాపాడగలవో చూపిస్తుంది. నిరంతర నిబద్ధత, ఉమ్మడి చర్యలతో, జీవాన్నిచ్చే క్రమంలో ఏ మహిళా ప్రాణాలు కోల్పోని యుగాన్ని తీసుకురావడానికి పీఎంఎస్ఎంఏ సహాయపడుతుంది. ఇది మరింత ఆరోగ్యకరమైన, సంపన్నమైన భారతదేశ పునాదులను బలోపేతం చేస్తుంది.

References:

Press Information Bureau

Prime Minister's Office

Ministry of Health and Family Welfare

Others

Click here to see pdf 

 

***

(Explainer ID: 158847) आगंतुक पटल : 26
Provide suggestions / comments
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Manipuri , Bengali , Assamese , Gujarati , Kannada , Malayalam