Farmer's Welfare
ఆరోగ్యకరమైన తీపి ఆహారం
భారతదేశంలో బెల్లం ఉత్పత్తి, ప్రాసెసింగ్
Posted On:
16 MAY 2026 10:40AM
ప్రపంచవ్యాప్త బెల్లం ఉత్పత్తిలో భారతదేశం 70 శాతం కంటే ఎక్కువ వాటాను కలిగి ఉంది. తద్వారా సహజ తీపి పదార్థాల ఉత్పత్తిలో ప్రపంచ అగ్రగామిగా తన స్థానాన్ని పదిలపరుచుకుంది. దేశంలోని చెరకు ఉత్పత్తిలో దాదాపు 20–30 శాతం బెల్లం తయారీకి మళ్లుతోంది. ఇది సుమారు 25 లక్షల మంది గ్రామీణ ప్రజల జీవనోపాధికి ఆసరాగా నిలుస్తోంది. ఈ రంగం గణనీయమైన ఎగుమతి వృద్ధిని కూడా సాధించింది. 2015-16, 2024-25 మధ్యకాలంలో బెల్లం ఎగుమతుల విలువ 106.5 శాతం పెరిగింది. ఇది అంతర్జాతీయంగా పెరుగుతున్న ఆదరణను సూచిస్తుంది. ఐరన్, ఖనిజాలు, అవసరమైన సూక్ష్మపోషకాలతో కూడిన బెల్లం, రిఫైన్డ్ చక్కెర కంటే ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయంగా ఉపయోగపడుతుంది. ఈ వృద్ధికి తోడుగా ప్రధానమంత్రి కిసాన్ సంపద యోజన, పీఎం ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్‌ప్రైజెస్ స్కీమ్, వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్ వంటి ప్రభుత్వ కార్యక్రమాలతో పాటు జీఐ (భౌగోళిక గుర్తింపు) ట్యాగింగ్ వంటివి విలువ ఆధారిత ఉత్పత్తుల పెంపునకు, గ్రామీణ పరిశ్రమల బలోపేతానికి, ఎగుమతి సామర్థ్యాన్ని పెంచడానికి కీలకపాత్ర పోషిస్తున్నాయి.
భారతదేశంలో బెల్లం రంగం: ఉత్పత్తి, ప్రాముఖ్యత, జీవనోపాధి
సాధారణంగా గుర్ అని పిలిచే బెల్లం ఒక సాంప్రదాయ, శుద్ధి చేయని, సహజసిద్ధమైన తీపి పదార్థం. రసాయనాలు వాడకుండా చెరకు రసాన్ని మరిగించి దీనిని తయారు చేస్తారు. దీనిని "ఔషధ చక్కెర" అని పిలుస్తారు. పోషకాల పరంగా ఇది తేనెతో సమానమైనది. ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా, కరేబియన్ దేశాలలో బెల్లాన్ని వివిధ స్థానిక పేర్లతో విస్తృతంగా వినియోగిస్తారు. దీని సహజ సిద్ధమైన మూలాలు, సాంప్రదాయ ప్రాసెసింగ్ పద్ధతులు, రసాయనాలు లేని తీపి పదార్థాల పట్ల వినియోగదారుల్లో పెరుగుతున్న ఆసక్తి దీనికి ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టాయి.

ప్రపంచ బెల్లం ఉత్పత్తిలో భారతదేశం 70 శాతం కంటే ఎక్కువ వాటాను కలిగి ఉంది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద బెల్లం ఉత్పత్తిదారుగా దేశాన్ని నిలబెట్టింది. దేశంలోని మొత్తం చెరకు ఉత్పత్తిలో దాదాపు 20–30 శాతం బెల్లం తయారీకి ఉపయోగపడుతుంది. గ్రామీణ భారతదేశంలో ఇది ఒక ప్రధాన వ్యవసాయ ఆధారిత ప్రాసెసింగ్ పరిశ్రమ. వికేంద్రీకృత ప్రాసెసింగ్, తక్కువ రవాణా ఖర్చులు, చిన్న తరహా వ్యవస్థాపకత, కుటీర పరిశ్రమలు ఈ రంగం ప్రధాన లక్షణాలు. ఇది సుమారు 25 లక్షల మందికి జీవనోపాధిని అందిస్తోంది.
తీపి వృద్ధి: విస్తరిస్తున్న భారతదేశ బెల్లం ఆర్థిక వ్యవస్థ
భారతదేశ బెల్లం రంగానికి ఇక్కడి భారీ చెరకు ఉత్పత్తి అండగా నిలుస్తోంది. 2024-25లో మొత్తం చెరకు ఉత్పత్తి 444.9 మిలియన్ టన్నులుగా అంచనా వేశారు. మొత్తం ఉత్పత్తిలో ఉత్తరప్రదేశ్ 48.5 శాతం వాటాతో అగ్రస్థానంలో నిలవగా, మహారాష్ట్ర(24.1 శాతం), కర్ణాటక(10.5 శాతం) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. గుజరాత్, తమిళనాడు, బిహార్, ఉత్తరాఖండ్, పంజాబ్, మధ్యప్రదేశ్, హర్యానా వంటివి ఇతర ఉత్పత్తి రాష్ట్రాలుగా ఉన్నాయి.

బెల్లం, మిఠాయి ఉత్పత్తుల(సాంప్రదాయ భారతీయ స్వీట్లు, క్యాండీలతో సహా) ఎగుమతుల్లో భారతదేశం ప్రముఖ స్థానంలో ఉంది. 2015-16లో 292.8 మిలియన్ టన్నుల పరిమాణంతో ఎగుమతుల విలువ 197 మిలియన్ డాలర్లుగా ఉంది. 2024-25 నాటికి ఎగుమతులు 471.9 మిలియన్ టన్నుల పరిమాణంతో 406.8 మిలియన్ డాలర్లకు పెరిగాయి. ఈ కాలంలో ఎగుమతుల విలువ సుమారు 106.5 శాతం, పరిమాణం 61.2 శాతం పెరిగింది. 2024-25లో ఇండోనేషియా, అమెరికా, యూఏఈ, నైజీరియా, నేపాల్ ప్రధాన ఎగుమతి గమ్యస్థానాలుగా ఉన్నాయి.
ఏడాది ప్రాతిపదికన వృద్ధిని పరిశీలిస్తే ఏప్రిల్-జనవరి(2025-26)లో ఎగుమతులు 450.1 మిలియన్ టన్నులకు చేరాయి. వీటి విలువ 384.4 మిలియన్ డాలర్లు. 2024-25 నాటి ఇదే కాలంతో పోలిస్తే పరిమాణంలో దాదాపు 16.5 శాతం, విలువలో 15.9 శాతం వృద్ధిని నమోదు చేసింది. అప్పట్లో ఎగుమతులు 386.2 మిలియన్ టన్నులుగా ఉండగా, వాటి విలువ 331.4 మిలియన్ డాలర్లు.
సహజ తీపి పదార్థాలకు దేశీయంగానూ డిమాండ్ పెరిగింది. తీపి పదార్థాల విభాగంలో 2021-24 కాలంలో బెల్లం, తేనె ఉత్పత్తులు 15-20 శాతం చక్రగతి వార్షిక వృద్ధి రేటును(సీఏజీఆర్) నమోదు చేశాయి. దేశీయ మార్కెట్లలో బెల్లం అమ్మకాలు ఆగస్టు 2024 నాటికి వార్షికంగా సుమారు 5,000 మెట్రిక్ టన్నులకు చేరుకున్నాయి. సాంప్రదాయ, సహజసిద్ధమైన తీపి ఉత్పత్తుల పట్ల వినియోగదారుల మొగ్గు పెరుగుతోందని ఇది స్పష్టం చేస్తోంది.
భారతీయ బెల్లం సంప్రదాయ ప్రాచీన మూలాలు
బెల్లాన్ని భారతదేశ స్వదేశీ ఉత్పత్తిగా విస్తృతంగా పరిగణిస్తారు. బెల్లం చరిత్ర వేదకాలం నాటి చెరకు సాగు, ప్రాసెసింగ్‌తో ముడిపడి ఉంది. చెరకు సాగుకు సంబంధించిన తొలి ఆధారాలు క్రీస్తుపూర్వం 1400-1000 నాటి భారతీయ గ్రంథాలలో కనిపిస్తాయి. ఈశాన్య భారతదేశంలోని తేమతో కూడిన ప్రాంతాలలో మొదట సన్న రకం చెరకు రకాలు ఉద్భవించాయని పరిశోధకులు భావిస్తున్నారు. కాలక్రమేణా చెరకు సాగు ఉష్ణమండల, ఉపఉష్ణమండల ప్రాంతాలకు విస్తరించి, దీనిని ఒక ముఖ్యమైన ప్రపంచ పంటగా మార్చింది. "షుగర్" అనే పదం సంస్కృత పదం 'శర్కర' నుంచి వచ్చింది. ఇది ఉపఖండంలో తీపి ఉత్పత్తి సాంస్కృతిక మూలాలను సూచిస్తుంది. క్రీస్తుశకం 647 లో చెరకు ప్రాసెసింగ్ పద్ధతులను నేర్చుకోవడానికి ఒక చైనీస్ బృందం మగధను సందర్శించినట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. తీపి పదార్థాల ఉత్పత్తిలో భారతీయ పరిజ్ఞానం తొలి కాలంలోనే ఇతర దేశాలకు విస్తరించిందని ఇది నిరూపిస్తోంది. సాగు, ప్రాసెసింగ్, జ్ఞానం బదిలీకి సంబంధించిన ఈ సుదీర్ఘ సంప్రదాయం బెల్లం ఉత్పత్తిలో భారతదేశ శాశ్వత ప్రాధాన్యతకు పునాది వేసింది.
పోషకాహారం, ప్రజారోగ్యంలో బెల్లం పాత్ర
బెల్లం ఒక సూపర్‌ఫుడ్‌గా, రిఫైన్డ్ చక్కెర స్థానంలో సహజసిద్ధమైన, పోషకాలు అధికంగా ఉండే ప్రత్యామ్నాయంగా గుర్తింపు పొందుతోంది. రసాయన శుద్ధి లేకుండా మరిగించిన చెరకు రసం నుంచి బెల్లాన్ని తయారుచేస్తారు. అందువల్ల సాధారణ చక్కెర శుద్ధి ప్రక్రియలో కోల్పోయే అవసరమైన ఖనిజాలు, సూక్ష్మపోషకాలు ఇందులో అలాగే ఉంటాయి. భారతదేశంలో చెరకును బెల్లం, ఖండసారి, చక్కెరగా వేర్వేరు పద్ధతుల ద్వారా ప్రాసెస్ చేస్తారు. ఈ మూడింటిలో బెల్లం అత్యంత సహజమైన పద్ధతిలో తయారవుతుంది, పోషకాల పరంగానూ సంపన్నమైనది. బెల్లాన్ని వివిధ రకాల సాంప్రదాయ ఆహారాలలో, ద్రవ రూపంలో విస్తృతంగా ఉపయోగిస్తారు. ఆరోగ్య స్పృహ పెరగడం, సహజ తీపిపదార్థాల వైపు వినియోగదారులు మళ్లడం వల్ల దీనికి డిమాండ్ క్రమంగా పెరుగుతోంది.

సాంప్రదాయ ఉపయోగాలతో పాటు బేకరీ, మిఠాయి ఉత్పత్తుల వంటి ప్రాసెస్ చేసిన ఆహారాలలో ఆరోగ్యకరమైన తీపి పదార్థంగా బెల్లం గుర్తింపు పొందుతోంది. ఈ రంగం నిరంతరం విస్తరిస్తుండటంతో చెరకు బెల్లం, తాటి బెల్లం, ముడి బెల్లం వంటి రకాలు మార్కెట్లోకి వస్తున్నాయి. సహజమైన, తక్కువ ప్రాసెస్ చేసిన ఆహారాల పట్ల వినియోగదారుల మారుతున్న ఆలోచనలకు ఈ మార్పు అద్దం పడుతోంది.
బెల్లంలో ఉండే పోషక విలువలు
చెరకు రసంలో ఉండే చాలా పోషకాలు బెల్లంలో అలాగే ఉంటాయి. దీనివల్ల ఇది అత్యంత పోషకాలు కలిగిన సహజ తీపి పదార్థాలలో ఒకటిగా నిలిచింది. తెల్ల చక్కెర తయారీ కోసం చేసే తీవ్రమైన శుద్ధి ప్రక్రియలో కోల్పోయే కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, ఫాస్పరస్, సోడియం, ఐరన్, జింక్, కాపర్, మాంగనీస్ వంటి ఖనిజాలు ఇందులో లభిస్తాయి. మంచి నాణ్యత గల బెల్లంలో సాధారణంగా 70 శాతం కంటే ఎక్కువ సుక్రోజ్, తక్కువ మొత్తంలో గ్లూకోజ్, ఫ్రక్టోజ్, సుమారు 5 శాతం ఖనిజాలు ఉంటాయి. ఇందులో ఉండే తేమ శాతం చాలా తక్కువ. ఐరన్ కంటెంట్(ప్రతి 100 గ్రాములకు సుమారు 10-13 మిలిగ్రాములు) హిమోగ్లోబిన్ స్థాయిలను మెరుగుపరచడానికి దోహదపడుతుంది, పొటాషియం, మెగ్నీషియం గుండె, కండరాల పనితీరుకు మద్దతు ఇస్తాయి.

బెల్లంలో ఫోలిక్ యాసిడ్, బి-కాంప్లెక్స్ విటమిన్లతో పాటు విటమిన్ ఎ, సి, డి, ఇ వంటి విటమిన్లు స్వల్ప పరిమాణంలో ఉంటాయి. ఈ సూక్ష్మపోషకాలు బెల్లాన్ని శక్తినిచ్చే ఆహారంగా మారుస్తాయి. ఇవి శరీరంలో పోషకాల లోపాలను అధిగమించడానికి సహాయపడతాయి. రిఫైన్డ్ చక్కెరతో పోలిస్తే ఇందులో ఖనిజ లవణాల శాతం గణనీయంగా ఎక్కువ. ఇది పోషకాహార లోపం ఉన్న ప్రజలకు అనువైన ఆహార ప్రత్యామ్నాయంగా ఉపయోగపడుతుంది.
పోషకాహార కార్యక్రమాలలో బెల్లం అనుసంధానం
పిల్లలలో పోషకాహార లోపాన్ని నివారించడానికి, పాఠశాలల్లో విద్యార్థుల హాజరును పెంచడానికి తమిళనాడు ప్రభుత్వం తన పోషకాహార కార్యక్రమాలలో బెల్లాన్ని చేర్చింది. రాష్ట్ర ప్రభుత్వం తన పౌష్టికాహార భోజన పథకం, సమగ్ర శిశు అభివృద్ధి సేవల(ఐసీడీఎస్) కింద అనుబంధ ఆహారాన్ని అందిస్తోంది. దీనిని అర్హులైన లబ్ధిదారులకు ప్రతి సంవత్సరం 300 రోజుల పాటు టేక్-హోమ్ రేషన్లుగా పంపిణీ చేస్తారు. ఈ అనుబంధ ఆహార మిశ్రమంలో బెల్లం దాదాపు 27 శాతం వాటాను కలిగి ఉంది. ఇది ఆహారంలో శక్తిని, సూక్ష్మపోషక విలువలను పెంచుతుంది. ఈ అనుబంధ ఆహారాన్ని 'సత్తుమావు' అని పిలుస్తారు. దీనిని మహిళల నేతృత్వంలోని 25 సహకార సంఘాలు, ఇద్దరు ప్రైవేట్ తయారీదారుల నుంచి 65:35 నిష్పత్తిలో సేకరిస్తారు.
ఈ సహకార సంఘాలలో మొత్తంగా సుమారు 1,450 మంది సభ్యులు ఉన్నారు. వీరిలో ఎక్కువ మంది వితంతువులు, ఒంటరి మహిళలు లేదా ఆర్థికంగా వెనుకబడిన మహిళలు ఉన్నారు. ఈ విధంగా బెల్లం తయారీ పోషకాహార సహాయంతో పాటు జీవనోపాధి కల్పనను కూడా ముడిపెడుతోంది. నీతి ఆయోగ్ ప్రకారం.. ఈ కార్యక్రమం తమిళనాడు అంతటా దాదాపు 32.75 లక్షల మంది లబ్ధిదారులకు పౌష్టికాహారాన్ని అందిస్తోంది. పోషకాహార లోపాన్ని తగ్గిస్తూనే, బెల్లం వంటి పోషకాలు అధికంగా ఉండే సాంప్రదాయ పదార్ధాల వినియోగాన్ని ఈ కార్యక్రమం ప్రోత్సహిస్తోంది.
బెల్లం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు
బెల్లం శరీరానికి నిరంతర శక్తిని అందిస్తుంది. ఎందుకంటే ఇందులోని సంక్లిష్ట సుక్రోజ్ నెమ్మదిగా జీర్ణమవుతుంది. ఫలితంగా రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు అకస్మాత్తుగా పెరగకుండా, క్రమక్రమంగా శక్తి విడుదలవుతుంది. సాంప్రదాయ ఇనుప పాత్రలలో తయారు చేయడం వల్ల ఐరన్ బెల్లంలోకి చేరుతుంది. ఇది రక్తహీనతను తగ్గించడానికి సహాయపడుతుంది. ఇందులో ఉండే ఖనిజ లవణాలు, సూక్ష్మపోషకాలు మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి.

ఆయుర్వేదం వంటి సాంప్రదాయ వైద్య పద్ధతులలో బెల్లాన్ని ఒక ఔషధ తీపి పదార్థంగా ఎప్పటి నుంచో ఉపయోగిస్తున్నారు. గొంతు, ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్ల నివారణకు, జీర్ణక్రియకు ఇది ఎంతో మేలు చేస్తుందని ఆయుర్వేద వైద్యం చెబుతోంది. దీని శుద్దీకరణ గుణాలు శ్వాసకోశ, జీర్ణవ్యవస్థలలోని వ్యర్థాలను తొలగించడానికి తోడ్పడతాయి. దుమ్ము, పర్యావరణ కాలుష్యానికి గురయ్యే వారికి ఇది ప్రత్యేకంగా ఉపయోగపడుతుంది. దీని శరీరంలో వేడిని పెంచే గుణం(థర్మోజెనిక్ ఎఫెక్ట్) వల్ల దగ్గు, కఫం, శ్వాసకోశ ఇబ్బందుల నుంచి ఉపశమనం లభిస్తుంది.
దీంతోపాటు బెల్లం రక్తాన్ని శుద్ధి చేసే సహజ డీటాక్సిఫికేషన్ ఏజెంట్‌గా పనిచేస్తుంది. ఇది అలసటను తగ్గిస్తుందని, కండరాలు, నరాలకు విశ్రాంతిని ఇస్తుందని, రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుందని నమ్ముతారు. కాల్షియం, ఫాస్పరస్, జింక్ వంటి అవసరమైన ఖనిజాల ఉనికి ఎముకల ఆరోగ్యానికి తోడ్పడుతుంది. దీనిలోని యాంటీ-టాక్సిక్, సంభావ్య యాంటీ-కార్సినోజెనిక్ గుణాలు శారీరక క్షేమానికి దోహదం చేస్తాయి.
చెరకు నుంచి జీవనోపాధి వరకు: గ్రామీణాభివృద్ధిలో బెల్లం పాత్ర
భారతదేశంలో బెల్లం ఉత్పత్తి అసంఘటిత వ్యవసాయ ప్రాసెసింగ్ రంగంలో భాగంగా ఉంది. ఇది గ్రామీణ జీవనోపాధిని, స్థానిక ఆర్థిక వ్యవస్థలను బలోపేతం చేయడంలో గణనీయమైన పాత్ర పోషిస్తోంది. దేశం అగ్రగామి ఉత్పత్తిదారుగా, ఎగుమతిదారుగా ఉన్నందున, ఈ రంగం రైతులకు ఆసరాగా నిలుస్తూనే దేశీయ వినియోగం, పెరుగుతున్న ఎగుమతి డిమాండ్‌ను తీరుస్తోంది.
వినియోగదారుల అలవాట్లు మారుతున్నందున, అంతర్జాతీయ డిమాండ్ పెరుగుతున్నందున చెరకు విలువ గొలుసులో వైవిధ్యం తీసుకురావడం అవసరమైంది. వ్యవసాయ ఆదాయాన్ని పెంచడానికి, పర్యావరణపరంగా, ఆర్థికంగా స్థిరమైన ఉత్పత్తి వ్యవస్థలను నిర్ధారించడానికి ఇది అవసరం. ముడిచెరకును నేరుగా మిల్లులకు విక్రయించడం కంటే బెల్లం ఉత్పత్తి ద్వారా విలువను జోడించడం వల్ల చాలా ఎక్కువ లాభాలు వస్తాయి. పంటల వైవిధ్యం, అంతర పంటల వంటి పద్ధతులతో బెల్లం ఉత్పత్తిని అనుసంధానించడం వల్ల నికర ఆదాయం గణనీయంగా పెరుగుతుందని క్షేత్రస్థాయి ఆధారాలు స్పష్టం చేస్తున్నాయి.
బెల్లం ప్రాసెసింగ్ పరిశ్రమలు వ్యవస్థాపకతను పెంపొందించడం, స్థానిక ఉపాధిని సృష్టించడం, ప్రాంతీయ ఆర్థిక వ్యవస్థలను బలోపేతం చేయడం ద్వారా గ్రామీణాభివృద్ధికి దోహదం చేస్తాయి. బెల్లం ప్రాసెసింగ్ ఏడాది పొడవునా ఉపాధి అవకాశాలను కల్పిస్తూ వలస కార్మికులకు ఆసరాగా నిలుస్తోంది. అధిక నాణ్యత గల బెల్లం ఉత్పత్తి ప్రీమియం మార్కెట్లకు ప్రాప్యతను కల్పిస్తుంది. తద్వారా రైతు ఆదాయాన్ని పెంచుతుంది. ఈ విధంగా బెల్లం ఆధారిత కుటీర పరిశ్రమలను బలోపేతం చేయడం విలువ ఆధారిత ఉత్పత్తుల పెంపునకు, జీవనోపాధి మెరుగుదలకు, సమగ్ర వ్యవసాయ వృద్ధికి సరైన మార్గంగా కనిపిస్తోంది.
లాభదాయకమైన విలువ ఆధారిత పరిశ్రమగా సేంద్రీయ బెల్లం పొడి
తమిళనాడులోని తిరునెల్వేలి జిల్లాకు చెందిన ఆంథోనిసామి అనే రైతు.. బెల్లం ఉత్పత్తిని ఒక లాభదాయకమైన విలువ ఆధారిత పరిశ్రమగా విజయవంతంగా మార్చి చూపించారు. ఆయన సేంద్రీయ బెల్లం పొడి తయారు చేస్తున్నారు. ఈ ఉత్పత్తి దాని స్వచ్ఛత, అద్భుతమైన రుచికి పేరుగాంచింది. స్థానిక మార్కెట్లు, పొరుగు రాష్ట్రాలు, ఎగుమతి మార్గాలలో దీనికి మంచి డిమాండ్ ఏర్పడింది. సేంద్రీయ సాగు పద్ధతులను అవలంబించడం, స్థానిక చెరకు రకాన్ని ప్రాసెస్ చేయడం ద్వారా ఆయన ఒక సాంప్రదాయ కార్యకలాపాన్ని లాభదాయకమైన వ్యాపారంగా మార్చారు.
ఈ విలువ ఆధారిత విధానం లాభదాయకతను గణనీయంగా పెంచింది. సదరు రైతు తెలిపిన వివరాల ప్రకారం.. సాధారణ బెల్లం కిలో రూ.50కి అమ్ముడవుతుండగా, సేంద్రీయ బెల్లం పొడి కిలో సుమారు రూ.75 కి విక్రయమవుతోంది. రెండింటికీ ఉత్పత్తి ఖర్చు కిలోకు సుమారు రూ.30 గా ఉంటుంది.
బెల్లం ఉత్పత్తి కొంత కాలానికి సంబంధించిందే అయినప్పటికీ మార్కెట్లో ఏడాది పొడవునా స్థిరమైన డిమాండ్ ఉంటుంది. ఇది నిరంతర ఆదాయ అవకాశాలను నిర్ధారిస్తుంది. ఈ విజయంతో పాటు బెల్లం ఫ్లేవర్ చాక్లెట్, కొబ్బరి బెల్లం వంటి వైవిధ్యభరితమైన ఉత్పత్తులు మార్కెట్ పరిధిని మరింత విస్తరిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వ మద్దతుతో నడుస్తున్న ఈ పరిశ్రమ, చిన్న తరహా ప్రాసెసింగ్ ద్వారా ఆదాయాన్ని ఎలా పెంచుకోవచ్చో, గ్రామీణ వ్యవస్థాపకతను ఎలా ప్రోత్సహించవచ్చో, వ్యవసాయ ఆధారిత జీవనోపాధిని ఎలా బలోపేతం చేయవచ్చో తెలియజేస్తోంది.
తీపికి విలువ గొలుసు ఏర్పాటు: బెల్లం వ్యవస్థ కోసం భారతదేశ విధానపరమైన కృషి
ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రిత్వ శాఖ(ఎంఓఎఫ్‌పీఐ) పలు కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా ఫుడ్ ప్రాసెసింగ్ రంగానికి సంబంధించిన మౌలిక సదుపాయాల అభివృద్ధిని, పరిశ్రమల వృద్ధిని ప్రోత్సహిస్తోంది. వీటిలో ఇవి ఉన్నాయి:
ప్రధానమంత్రి కిసాన్ సంపద యోజన(పీఎంకేఎస్‌వై),
ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ(పీఎల్ఐఎస్ఎఫ్‌పీఐ),
ప్రధానమంత్రి ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్‌ప్రైజెస్(పీఎంఎఫ్ఎంఈ) పథకం.
డిమాండ్ ఆధారితమైన ఈ కార్యక్రమాలు దేశవ్యాప్తంగా అమలవుతున్నాయి. ఇవి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అవలంబించడం ద్వారా ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపన, విస్తరణను సులభతరం చేస్తాయి. లబ్ధిదారుల యూనిట్లు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఎఫ్ఎస్ఎస్ఏఐ) నిబంధనలను పాటించాల్సి ఉంటుంది. ఎగుమతి పోటీతత్వాన్ని పెంపొందించడానికి అంతర్జాతీయ ఆహార భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా మారేలా కూడా వీటిని ప్రోత్సహిస్తారు.
పీఎంకేఎస్‌వైలో 'క్రియేషన్/ఎక్స్‌పాన్షన్ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ & ప్రిజర్వేషన్ కెపాసిటీస్'(సీఈఎఫ్‌పీపీసీ) అనే భాగం ఉంది. దీని కింద డిసెంబర్ 31, 2025 నాటికి ఐదు బెల్లం ప్రాసెసింగ్ యూనిట్లకు అనుమతులు లభించాయి. దీని కోసం మొత్తం సహాయక గ్రాంట్లు రూ.17.07 కోట్లుగా ఉన్నాయి. పీఎంఎఫ్ఎంఈ పథకం 3,528 బెల్లం ఆధారిత సూక్ష్మ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు మొత్తం రూ.102.31 కోట్ల రాయితీలతో మద్దతు ఇచ్చింది. ఈ పథకం సంఘాలకు 50 శాతం వరకు బ్రాండింగ్, మార్కెటింగ్ సహాయాన్ని కూడా అందిస్తుంది. వీటిలో ఫార్మర్-ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ (ఎఫ్‌పీఓ), స్వయం సహాయక సంఘాలు(ఎస్‌హెచ్‌జీ), సహకార సంఘాలు లేదా సూక్ష్మ పరిశ్రమల ప్రత్యేక ప్రయోజన సాధనాలు ఉండవచ్చు.
వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్(ఓడీఓపీ) కార్యక్రమం ముడిసరుకుల సేకరణ, భాగస్వామ్య సేవలు, మార్కెట్ ప్రాప్యతలో పొదుపును సాధ్యం చేయడం ద్వారా స్థానిక వ్యవసాయ ఆధారిత పరిశ్రమలను ప్రోత్సహిస్తుంది. 19 జిల్లాల్లో బెల్లం, అనుబంధ ఉత్పత్తులను ఓడీఓపీ వస్తువులుగా గుర్తించారు. ఇది విలువ గొలుసు అభివృద్ధిని సులభతరం చేసింది. సహాయక మౌలిక సదుపాయాలను బలోపేతం చేసింది.
డైరెక్టరేట్ ఆఫ్ మార్కెటింగ్ & ఇన్‌స్పెక్షన్(డీఎంఐ) ద్వారా నాణ్యత హామీ, ప్రామాణీకరణకు మద్దతు లభిస్తుంది. నిర్ణీత ప్రమాణాలకు అనుగుణంగా ఉన్న వ్యవసాయ వస్తువులను అగ్‌మార్క్ వ్యవస్థ కింద ధ్రువీకరిస్తారు. ఈ ప్రమాణాలు నాణ్యత గ్రేడ్లను నిర్వచిస్తాయి. వినియోగదారులకు నమ్మకమైన ఉత్పత్తులు లభించేలా చేస్తాయి. ఇవి రైతులకు లాభదాయకమైన ధరలను అందించే నాణ్యమైన ముడి పదార్థాలను కూడా నిర్ధారిస్తాయి. బెల్లం అనేది అగ్‌మార్క్ ధ్రువీకరణ పరిధిలోకి వచ్చే ఒక నోటిఫైడ్ వస్తువు. ఇది నాణ్యత హామీని, మార్కెట్ విశ్వసనీయతను, ఎగుమతి సంసిద్ధతను బలపరుస్తుంది.

భారతదేశంలో భౌగోళిక గుర్తింపు(జీఐ) పొందిన బెల్లం రకాలు
భౌగోళిక గుర్తింపు(జీఐ) అనేది ఒక నిర్దిష్ట భౌగోళిక ప్రాంతం లేదా మూలాలకు సంబంధించిన కొన్ని ఉత్పత్తులకు ఇచ్చే పేరు లేదా గుర్తు. ఇది ఒక ప్రాంతం, పట్టణం లేదా దేశం కావచ్చు. బెల్లం రంగంలో జీఐ గుర్తింపు ప్రాంతీయ బ్రాండింగ్‌ను బలోపేతం చేస్తుంది. ఇది సాంప్రదాయ ప్రాసెసింగ్ పద్ధతులను ప్రోత్సహిస్తుంది. గ్రామీణ ఉత్పత్తిదారులకు మార్కెట్ ప్రాప్యతను మెరుగుపరుస్తుంది. భారతదేశంలో అనేక జీఐ-ట్యాగ్ చేసిన బెల్లం రకాలు ఉన్నాయి. ఇవి ప్రత్యేకమైన ప్రాంతీయ నాణ్యతలకు, సాంప్రదాయ ప్రాసెసింగ్ పద్ధతులకు ప్రసిద్ధి చెందాయి. కొల్హాపూర్ బెల్లం(మహారాష్ట్ర) దాని బంగారు రంగు, అధిక సుక్రోజ్ కంటెంట్‌కు గుర్తింపు పొందింది. ముజఫర్‌నగర్ గుర్(ఉత్తరప్రదేశ్) ఎగుమతి ఆధారితమైనది. ఇది అధిక నాణ్యత గల చెరకుతో తయారవుతుంది. కేరళలో మరయూర్, సెంట్రల్ ట్రావెన్‌కోర్ బెల్లం రకాలు వాటి స్వచ్ఛత, ఔషధ విలువలు, సాంప్రదాయ ప్రాసెసింగ్, ప్రాంతీయ విశిష్టతకు గుర్తింపు పొందాయి.

స్థిరమైన, విలువ ఆధారిత బెల్లం రంగం వైపు
బెల్లం ఉత్పత్తి, ప్రాసెసింగ్ భారతదేశ వ్యవసాయ ఆధారిత ప్రాసెసింగ్ ఆర్థిక వ్యవస్థకు ఒక ముఖ్యమైన స్తంభంగా నిలుస్తున్నాయి. ఇది వ్యవసాయం, పోషకాహారం, గ్రామీణ జీవనోపాధి, ఎగుమతి సామర్థ్యాన్ని ముడిపెడుతుంది. ప్రపంచంలోనే అతిపెద్ద ఉత్పత్తిదారుగా భారతదేశం బలమైన చెరకు ఆధారాన్ని కలిగి ఉంది. సాంప్రదాయ ప్రాసెసింగ్ పరిజ్ఞానం, సహజ తీపి పదార్థాలకు పెరుగుతున్న దేశీయ, ప్రపంచ డిమాండ్ దీని ప్రాధాన్యతను మరింత పెంచుతున్నాయి. ఈ రంగం వికేంద్రీకృత కుటీర పరిశ్రమల ద్వారా మిలియన్ల మంది జీవనోపాధికి మద్దతు ఇస్తుంది. విలువ ఆధారిత ఉత్పత్తుల పెంపునకు, గ్రామీణ వ్యవస్థాపకతకు, రైతు ఆదాయాన్ని పెంచడానికి అవకాశాలను అందిస్తుంది.
ఆర్థిక పాత్రతో పాటు బెల్లంలో ఉండే ఖనిజ లవణాలు, ఔషధ గుణాలు దీనిని శుద్ధిచేసిన చక్కెర కంటే ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయంగా మారుస్తున్నాయి. సూక్ష్మపోషకాల లోపాలను అధిగమించడానికి ఇది ఒక ఉపయోగకరమైన ఆహార అనుబంధం. ఫుడ్ ప్రాసెసింగ్ మౌలిక సదుపాయాలు, సూక్ష్మ పరిశ్రమలు, నాణ్యతా ధ్రువీకరణ, జీఐ ట్యాగింగ్, విలువ గొలుసు అభివృద్ధిని ప్రోత్సహించే ప్రభుత్వ కార్యక్రమాలు మార్కెట్ ప్రాప్యతను, ఉత్పత్తి విశ్వసనీయతను బలోపేతం చేస్తున్నాయి. నిరంతర విధానపరమైన మద్దతు, మెరుగైన ప్రాసెసింగ్ పద్ధతులు, విలువ ఆధారిత ఉత్పత్తుల వైవిధ్యీకరణతో బెల్లం రంగం సమగ్రమైన, స్థిరమైన గ్రామీణ వృద్ధిని నడపడానికి బలమైన సామర్థ్యాన్ని కలిగి ఉంది.
References
Ministry of Commerce and Industry
https://apeda.gov.in/JaggeryAndConfectionery
https://apeda.gov.in/Food_Agri_Products_Registered_GI
https://agriexchange.apeda.gov.in/production/India/index
https://agriexchange.apeda.gov.in/India/ExportSummary/Index
https://agriexchange.apeda.gov.in/India/ExportAnalyticalReport/Index
https://agriexchange.apeda.gov.in/India/ComparativeStatement/Index
https://www.pib.gov.in/PressReleaseIframePage.aspx?PRID=2113966®=3&lang=2
https://apeda.gov.in/sites/default/files/study_reports/Report_Indian_Organic_Market_and_Export_Promotion_Strategy.pdf
Ministry of Agriculture and Farmers Welfare
https://www.agriwelfare.gov.in/Documents/AR_Eng_2024_25.pdf
Ministry of Food Processing Industries
https://niftem-t.ac.in/pmfme/DPR-Jaggery.pdf
https://www.mofpi.gov.in/mediapr/enewsfeb4.html
https://niftem.ac.in/newsite/pmfme/wp-content/uploads/2022/08/jaggeryprocessing.pdf
https://sansad.in/getFile/loksabhaquestions/annex/187/AU116_pneN8S.pdf?source=pqals
Niti Aayog
https://www.niti.gov.in/sites/default/files/2024-07/Report-on-Promoting-Best-practices-on-Millet-26_4_23.pdf
Tamil Nadu Government
https://cuddalore.nic.in/geographical-indications/
https://agritech.tnau.ac.in/success_stories/sstories_farm_enter_2015_organic_jaggery.html
The Superfood Sweetener
***
(Explainer ID: 158644)
आगंतुक पटल : 53
Provide suggestions / comments