Farmer's Welfare
నేషనల్ మిషన్ ఫర్ సస్టైనబుల్ అగ్రికల్చర్
“భారతదేశంలో వాతావరణ మార్పులను తట్టుకోగల వ్యవసాయ రంగ నిర్మాణం”
Posted On:
09 MAY 2026 11:22AM
కీలకాంశాలు
- 2014-15 నుంచి వర్షాధార ప్రాంత అభివృద్ధి కింద రూ.2,119.84 కోట్లు విడుదలయ్యాయి. దీని ద్వారా 8.50 లక్షల హెక్టార్ల విస్తీర్ణానికి సంబంధించి సమీకృత వ్యవసాయ విధానం ద్వారా 14.35 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూర్చారు.
- 2015-16 నుంచి అమలవుతున్న పీడీఎంసీ పథకం కింద సుమారు 109 లక్షల హెక్టార్లను సాగులోకి తెచ్చారు. ఇందుకోసం రూ.26,325 కోట్లను కేంద్ర సహాయంగా విడుదల చేశారు.
- భూసార నిర్వహణ కింద 2025-26లో 97.53 లక్షల మట్టి నమూనాలను సేకరించి, 92.87 లక్షల నమూనాలను పరీక్షించారు. 2015 నుంచి సమతుల్య పోషక యాజమాన్యం కోసం 25.79 కోట్ల సాయిల్ హెల్త్ కార్డులను రూపొందించారు.
- 2014 నుంచి 2025 మధ్య కాలంలో నేషనల్ అగ్రికల్చరల్ రీసెర్చ్ సిస్టమ్ కింద వాతావరణ మార్పులను తట్టుకోగల 2,996 పంట రకాలను విడుదల చేశారు.
పరిచయం
భారతదేశ నికర సాగు విస్తీర్ణంలో దాదాపు 60 శాతం ఉన్న వర్షాధార వ్యవసాయం.. దేశ వ్యవసాయ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలుస్తోంది. ఇది మొత్తం ఆహార ఉత్పత్తిలో సుమారు 40 శాతం వాటాను అందిస్తోంది. ఈ రంగం పోషిస్తున్న కీలక పాత్ర దృష్ట్యా, పెరుగుతున్న ఆహార ధాన్యాల డిమాండ్‌ను తీర్చాలంటే సహజ వనరుల స్థిరమైన నిర్వహణతో పాటు పటిష్టమైన వర్షాధార వ్యవసాయ వ్యవస్థల క్రమబద్ధమైన అభివృద్ధి అత్యవసరం. ఈ నేపథ్యంలో వాతావరణ మార్పులపై జాతీయ కార్యాచరణ ప్రణాళికలో భాగంగా 2014-15లో ప్రభుత్వం 'నేషనల్ మిషన్ ఫర్ సస్టైనబుల్ అగ్రికల్చర్' (ఎన్ఎంఎస్ఏ)ను ప్రారంభించింది. వాతావరణ వైవిధ్యాల వల్ల వ్యవసాయంపై పడే ప్రతికూల ప్రభావాలను తగ్గించి, దీర్ఘకాలిక ఆహార, జీవనోపాధి భద్రతను నిర్ధారించడానికి ఈ మిషన్ ఒక వ్యూహాత్మక కార్యక్రమంగా ప్రారంభమైంది.
ఆ తర్వాత 2018-19 నుంచి ఎన్ఎంఎస్ఏ "గ్రీన్ రివల్యూషన్-క్రిషోన్నతి యోజన" అనే పథకంలో భాగంగా ఒక సబ్-మిషన్‌గా అమలైంది. 2022-23లో జరిగిన మరింత సంస్థాగత పునర్నిర్మాణం ఫలితంగా దీనిని 'ప్రధాన మంత్రి రాష్ట్రీయ కృషి వికాస్ యోజన' (పీఎంఆర్‌కేవీవై) పరిధిలోకి తీసుకువచ్చారు. ఇది స్థిరమైన, వాతావరణ మార్పులను తట్టుకోగల వ్యవసాయ అభివృద్ధికి ఒక ఏకీకృత విధానాన్ని ప్రతిబింబిస్తుంది.
ఎన్ఎంఎస్ఏ కింద వాతావరణాన్ని తట్టుకోగల వ్యవసాయం కోసం సమీకృత విధానపరమైన చర్యలు
నేషనల్ మిషన్ ఫర్ సస్టైనబుల్ అగ్రికల్చర్(ఎన్ఎంఎస్ఏ) లక్షిత, సమీకృత చర్యల ద్వారా వాతావరణ మార్పులను తట్టుకునే వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తుంది. నీటి వినియోగ సామర్థ్యాన్ని పెంచడం, నేల ఆరోగ్యాన్ని మెరుగుపరచడం, స్థితిస్థాపక వ్యవసాయాన్ని బలోపేతం చేయడం ద్వారా ఇది స్థిరమైన వ్యవసాయ అభివృద్ధికి బలమైన పునాదిని అందిస్తుంది. ఎన్ఎంఎస్ఏలోని కీలక చర్యలలో వర్షాధార ప్రాంత అభివృద్ధి(ఆర్ఏడీ) విభాగం ఒకటి. ఇది వైవిధ్యభరితమైన, నష్టాలను తట్టుకోగల వ్యవసాయం కోసం సమీకృత వ్యవసాయ వ్యవస్థలను(ఐఎఫ్ఎస్) ప్రోత్సహిస్తుంది. అలాగే 'పర్ డ్రాప్ మోర్ క్రాప్'(పీడీఎంసీ) కార్యక్రమం నీటి వినియోగ సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి సూక్ష్మ నీటి పారుదలను ప్రోత్సహిస్తుంది. ఈ ప్రయత్నాలకు సాయిల్ హెల్త్ కార్డ్ (ఎస్‌హెచ్‌సీ) పథకం ద్వారా అమలవుతున్న సాయిల్ హెల్త్ మేనేజ్‌మెంట్(ఎస్‌హెచ్ఎం) తోడవుతుంది. ఇది సమతుల్య పోషకాల వినియోగాన్ని ప్రోత్సహిస్తూ దీర్ఘకాలిక నేల సారవంతాన్ని కాపాడుతుంది.
వర్షాధార ప్రాంత అభివృద్ధి(ఆర్ఏడీ): సమీకృత వ్యవసాయ వ్యవస్థల(ఐఎఫ్ఎస్) బలోపేతం
వర్షాధార ప్రాంత అభివృద్ధి(ఆర్ఏడీ) విభాగం 2014-15 నుంచి ఎన్ఎంఎస్ఏ కింద అమలవుతోంది. భారత వ్యవసాయ పరిశోధనా మండలి(ఐకార్) అభివృద్ధి చేసిన వ్యవసాయ-వాతావరణ మండలాల వారీ సమీకృత వ్యవసాయ నమూనాలను(ఐఎఫ్ఎస్) ప్రోత్సహించడం దీని లక్ష్యం. రైతుల ఆదాయాన్ని, తట్టుకునే శక్తిని పెంచడానికి బహుళ పంటల సాగు, పంట మార్పిడి, అంతర, మిశ్రమ పంటల సాగుతో పాటు ఉద్యానవన, పశుపోషణ, మత్స్య పరిశ్రమ వంటి అనుబంధ కార్యకలాపాలను అనుసంధానించే ఒక సమగ్ర విధానాన్ని ఇది ప్రోత్సహిస్తుంది.
2025–26 ఆర్థిక సంవత్సరంలో ఆర్ఏడీ అమలు కోసం రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు రూ.343.86 కోట్లు కేటాయించగా, దీని కింద 96,013 మంది రైతులకు శిక్షణ అందించారు.
నేషనల్ రైన్‌ఫెడ్ ఏరియా అథారిటీ(ఎన్ఆర్ఏఏ)
దేశంలోని మెట్ట భూములు, వర్షాధార వ్యవసాయం క్రమబద్ధమైన ఆధునికీకరణ, నిర్వహణపై విజ్ఞానపరమైన సూచనలను అందించడానికి ఎన్ఆర్ఏఏ ఒక నిపుణుల సంస్థగా పనిచేస్తుంది. విజ్ఞాన ఆధారిత జోక్యాలను ప్రారంభించడం, వివిధ సంస్థలతో సమర్థవంతమైన సమన్వయం ద్వారా వర్షాధార వ్యవసాయాన్ని ప్రోత్సహించడంపై ఇది దృష్టి సారిస్తుంది.

సూక్ష్మ నీటి పారుదల సాంకేతికత ద్వారా నీటి వినియోగ సామర్థ్యం మెరుగుదల
'పర్ డ్రాప్ మోర్ క్రాప్'(పీడీఎంసీ) కార్యక్రమం కచ్చితమైన నీటి పారుదల, ఇతర నీటి పొదుపు సాంకేతికతలను ప్రోత్సహించడం ద్వారా నీటి వినియోగ సామర్థ్యాన్ని పెంచడానికి రూపొందింది. సూక్ష్మ నీటి పారుదల వ్యవస్థల విస్తరణ కోసం లబ్ధిదారులకు రాయితీలు అందుతాయి.
ముఖ్యంగా సూక్ష్మ నీటి పారుదల పద్ధతుల ద్వారా, ప్రత్యేకించి డ్రిప్, స్ప్రింక్లర్ సాగు ద్వారా పొలం స్థాయిలో నీటి వినియోగ సామర్థ్యాన్ని మెరుగుపరచడంపై పీడీఎంసీ దృష్టి పెడుతుంది. డ్రిప్ విధానంలో పైపుల ద్వారా నేరుగా మొక్క వేరు వ్యవస్థకే నీరు అందుతుంది, దీనివల్ల వృధా తగ్గుతుంది. వనరుల వినియోగం మెరుగుపడుతుంది. దీనికి విరుద్ధంగా స్ప్రింక్లర్ విధానం పైపులు, నాజిళ్ల ద్వారా ఒత్తిడితో కూడిన నీటిని వర్షంలా పొలమంతా సమానంగా పంపిణీ చేస్తుంది.
2015-16 నుంచి అమలవుతున్న ఈ పథకం కింద దాదాపు 109 లక్షల హెక్టార్లను సాగు చేశారు. కేంద్రం రూ.26,325 కోట్ల ఆర్థిక సహాయాన్ని విడుదల చేసింది. ఇది నీటి వినియోగ సామర్థ్యాన్ని గణనీయంగా మెరుగుపరిచింది. అంతేకాకుండా, 2025-26 నుంచి 2029-30 వరకు ఐదేళ్ల కాలంలో 100 లక్షల హెక్టార్లను సూక్ష్మ నీటి పారుదల కిందకు తీసుకురావాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ లక్ష్యాలను చేరుకోవడానికి 'పర్ డ్రాప్ మోర్ క్రాప్' (పీడీఎంసీ) పథకం ద్వారా ఏటా కనీసం 20 లక్షల హెక్టార్లను సాగులోకి తేవడం అవసరం.
నేల ఆరోగ్య నిర్వహణ(ఎస్‌హెచ్ఎం): సమీకృత పోషక యాజమాన్యం ద్వారా నేల ఆరోగ్యం, ఉత్పాదకత మెరుగుదల

సాయిల్ హెల్త్ మేనేజ్‌మెంట్(ఎస్‌హెచ్ఎం) పంట వ్యర్థాల నిర్వహణ, సేంద్రీయ వ్యవసాయంతో సహా ప్రాంతీయ, పంట-నిర్దిష్ట స్థిరమైన నేల నిర్వహణ పద్ధతులను ప్రోత్సహిస్తుంది. ఇది క్రమబద్ధమైన నేల సారవంతమైన మ్యాపింగ్, స్థూల, సూక్ష్మ పోషకాల సమతుల్య వినియోగం, సరైన భూ వినియోగ పద్ధతులకు మద్దతు ఇస్తుంది. దీంతో పాటు ఎస్‌హెచ్ఎం ఎరువుల విచక్షణారహిత వినియోగాన్ని తగ్గించడం, భూమి కోత, క్షీణతను అరికట్టే చర్యల అమలుపై నొక్కి చెబుతుంది. తద్వారా దీర్ఘకాలిక నేల ఆరోగ్యం, ఉత్పాదకతను నిర్ధారిస్తుంది.
సాయిల్ హెల్త్ కార్డ్(ఎస్‌హెచ్‌సీ) పథకం: రైతులకు శాస్త్రీయ సలహాలు అందించడం
2015లో ప్రారంభమైన సాయిల్ హెల్త్ కార్డ్(ఎస్‌హెచ్‌సీ) పథకం.. నేషనల్ మిషన్ ఫర్ సస్టైనబుల్ అగ్రికల్చర్ (ఎన్ఎంఎస్ఏ) కింద రైతులకు ప్రధాన సలహా సాధనంగా పనిచేస్తోంది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో మొత్తం 97.53 లక్షల మట్టి నమూనాలను సేకరించగా, అందులో 92.87 లక్షల నమూనాలను పరీక్షించారు. ఫిబ్రవరి 2026 వరకు సంచితంగా 25.79 కోట్ల సాయిల్ హెల్త్ కార్డులను రూపొందించారు. ఈ కార్డులు పంటల వారీగా పోషక సిఫార్సులను అందిస్తాయి. దీనివల్ల రైతులు ఎరువుల వాడకాన్ని క్రమబద్ధీకరించడానికి, నేల ఆరోగ్యాన్ని పెంచడానికి వీలవుతుంది.

2025లో నీతి ఆయోగ్ నిర్వహించిన మూల్యాంకనం ప్రకారం.. ఈ పథకం పోషకాల అసమతుల్యతను సరిదిద్దడానికి, ముఖ్యంగా అధిక యూరియా వినియోగాన్ని తగ్గించడానికి తోడ్పడింది. వ్యవసాయ ఉత్పాదకత మెరుగుపడటానికి దారితీసింది. ఇది సమీకృత పోషక యాజమాన్యం(ఐఎన్ఎం) విస్తృత లక్ష్యాలకు కూడా మద్దతు ఇచ్చింది. గమనించదగ్గ విషయం ఏమిటంటే.. సర్వేలో పాల్గొన్న రైతుల్లో 68.5 శాతం మంది సిఫార్సు చేసిన పద్ధతులను పాటించిన తర్వాత నేల ఆరోగ్యంలో గణనీయమైన మార్పును నివేదించగా, 25.7 శాతం మంది స్వల్ప మెరుగుదలను గమనించారు.
నేల సారంపై పటాల ద్వారా రైతు నిర్ణయాధికారాన్ని పెంచడం
జిల్లా స్థాయి మ్యాపుల ఆధారంగా గ్రామ స్థాయిలో నేల సారంపై పటాలను సిద్ధం చేసే బాధ్యతను 'సాయిల్ అండ్ ల్యాండ్ యూజ్ సర్వే ఆఫ్ ఇండియా' (ఎస్ఎల్‌యూఎస్ఐ)కు అప్పగించారు. ఈ చొరవలో భాగంగా సమతుల్య ఎరువుల వినియోగం కోసం రైతులకు క్షేత్ర స్థాయి పోషక సమాచారాన్ని అందించడానికి 6,954 గుర్తించిన మోడల్ గ్రామాలలో సాయిల్ ఫెర్టిలిటీ మ్యాపింగ్ చేపట్టారు.
అవగాహన కల్పించడానికి, పోషకాల నిర్వహణపై సరైన నిర్ణయాలు తీసుకోవడానికి వీలుగా ఈ పటాలను గ్రామాల్లో బహిరంగంగా ప్రదర్శిస్తారు. ఇప్పటివరకు 2,023 మోడల్ గ్రామాల్లో ఈ మ్యాపింగ్ పూర్తయింది.
ఐకార్ పరిశోధనల ద్వారా వ్యవసాయ స్థితిస్థాపకత బలోపేతం
వాతావరణ మార్పులను తట్టుకోగల వ్యవసాయ సాంకేతికతలను అభివృద్ధి చేసేందుకు, వ్యాప్తి చేసేందుకు భారత వ్యవసాయ పరిశోధనా మండలి(ఐకార్) 2011లో ప్రతిష్టాత్మకమైన 'నేషనల్ ఇన్నోవేషన్స్ ఆన్ క్లైమేట్ రెసిలెంట్ అగ్రికల్చర్' (ఎన్ఐసీఆర్ఏ)ను ప్రారంభించింది. వాతావరణ మార్పుల అనుకూలత, ఉపశమన చర్యలపై శిక్షణా కార్యక్రమాలు, ప్రదర్శనలు నిర్వహించడం ద్వారా రైతులు, భాగస్వాముల సామర్థ్యాన్ని పెంచడంలో ఎన్ఐసీఆర్ఏ, ఎన్ఎంఎస్‌కేకి గణనీయంగా తోడ్పడింది. కరువులు, వరదలు, ఉష్ణ తరంగాల వంటి తీవ్రమైన వాతావరణ పరిస్థితులను తట్టుకునేలా వ్యవసాయ వ్యవస్థల సామర్థ్యాన్ని పెంచే లక్ష్యంతో ఈ చొరవ స్వల్పకాలిక, దీర్ఘకాలిక పరిశోధనలకు మద్దతు ఇస్తుంది.
ఎన్ఐసీఆర్ఏ కింద ఐపీసీసీ నిబంధనల ప్రకారం 651 వ్యవసాయ జిల్లాల్లో దుర్బలత్వ అంచనాలు జరిగాయి. వీటిలో 310 జిల్లాలు అధిక లేదా అత్యంత దుర్బలమైనవిగా గుర్తించారు. తదనంతరం ప్రాంతీయ వాతావరణాన్ని తట్టుకోగల పంటలు, నిర్వహణ పద్ధతులతో జిల్లా వ్యవసాయ అత్యవసర ప్రణాళికలు అభివృద్ధి చేశారు. రైతుల సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి 28 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలలోని 151 దుర్బల జిల్లాల్లో 448 'క్లైమేట్ రెసిలెంట్ విలేజెస్' స్థాపించారు. ఇక్కడ తగిన సాంకేతికతలను ప్రదర్శిస్తున్నారు.
దీంతో పాటు ఐకార్ నేతృత్వంలోని నేషనల్ అగ్రికల్చరల్ రీసెర్చ్ సిస్టమ్ కింద 2014-2025 కాలంలో 2,996 వాతావరణాన్ని తట్టుకోగల పంట రకాలు విడుదలయ్యాయి. వరిని నేరుగా విత్తడం, గోధుమల్లో జీరో-టిల్లేజ్ వంటి సాగు పద్ధతులు, పంట వ్యర్థాల నిర్వహణ వంటి చర్యలను కూడా వాతావరణ ప్రమాదాలను తగ్గించడానికి ప్రోత్సహిస్తున్నారు.
ఎన్ఎంఎస్ఏ చర్యల ద్వారా ఆహారం-నీరు-వాతావరణం అనుసంధానం
ఐక్యరాజ్యసమితి 2030 సుస్థిర అభివృద్ధి లక్ష్యాల(ఎస్‌డీజీ)కు, ప్రత్యేకించి ఎస్‌డీజీ 2(ఆకలి నిర్మూలన), ఎస్‌డీజీ 6 (స్వచ్ఛమైన నీరు, పారిశుధ్యం), ఎస్‌డీజీ 13 (వాతావరణ చర్య)లకు ఎన్ఎంఎస్ఏ మద్దతు ఇస్తుంది.
ఎస్‌డీజీ 2 కింద ఎన్ఎంఎస్ఏ వర్షాధార ప్రాంత అభివృద్ధి(ఆర్ఏడీ) ద్వారా స్థిరమైన ఆహార ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది. ఇది సమీకృత వ్యవసాయ విధానం(ఐఎఫ్ఎస్) ద్వారా ఉత్పాదకతను పెంచి రైతు ఆదాయాన్ని స్థిరీకరిస్తుంది. సాయిల్ హెల్త్ మేనేజ్‌మెంట్(ఎస్‌హెచ్ఎం) పోషకాల సమతుల్య వినియోగాన్ని ప్రోత్సహిస్తూ ఆహార భద్రతను బలపరుస్తుంది.
ఎస్‌డీజీ 6కు అనుగుణంగా 'పర్ డ్రాప్ మోర్ క్రాప్' (పీడీఎంసీ) విభాగం సూక్ష్మ నీటి పారుదల, నీటి పొదుపు ద్వారా వ్యవసాయంలో స్థిరమైన నీటి నిర్వహణకు మద్దతు ఇస్తుంది.
ఎస్‌డీజీ 13కు సంబంధించి ఎన్ఎంఎస్ఏ వాతావరణాన్ని తట్టుకోగల పంట వ్యవస్థలు, సహజ వనరుల పరిరక్షణను ప్రోత్సహిస్తూ రైతులు కరువులు, వరదలకు అనుగుణంగా మారడానికి సహాయపడుతుంది.
ఈ ప్రయత్నాల ద్వారా ఎన్ఎంఎస్ఏ సుస్థిర వ్యవసాయం, సమర్థవంతమైన నీటి వినియోగం, వాతావరణ స్థితిస్థాపకతను ఎస్‌డీజీ ఫ్రేమ్‌వర్క్ ప్రకారం ముందుకు తీసుకెళ్తోంది.
ముగింపు
నేషనల్ మిషన్ ఫర్ సస్టైనబుల్ అగ్రికల్చర్(ఎన్ఎంఎస్ఏ) నీటి వినియోగం, నేల ఆరోగ్యం, వాతావరణ స్థితిస్థాపకతను అనుసంధానిస్తూ స్థిరమైన వ్యవసాయాభివృద్ధికి ఒక ఏకీకృత విధానాన్ని అందిస్తోంది. ఆర్ఏడీ, పీడీఎంసీ, ఎస్‌హెచ్ఎం వంటి లక్షిత చర్యల ద్వారా సహజ వనరుల సమర్థవంతమైన వినియోగాన్ని మిషన్ ప్రోత్సహిస్తోంది.
ఎన్ఐసీఆర్ఏ అందించే వాతావరణ స్థితిస్థాపక సాంకేతికతలతో ఈ ప్రయత్నాలు ఉత్పాదకతను మెరుగుపరుస్తూ రైతుల ఆదాయాన్ని పెంచుతున్నాయి. ఎస్‌డీజీ 2, 6, 13లకు అనుగుణంగా భారతదేశంలో దీర్ఘకాలిక ఆహార, జీవనోపాధి భద్రతను నిర్ధారిస్తూ ఎన్ఎంఎస్ఏ స్థిరమైన వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తూనే ఉంది.
References
Ministry of Agriculture & Farmers Welfare
Ministry of Finance
United Nations
(Explainer ID: 158606)
आगंतुक पटल : 182
Provide suggestions / comments
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam