Economy
ప్రధానమంత్రి ముద్ర యోజన 11 ఏళ్ల ప్రస్థానం
ఆర్థిక సమ్మిళితం, సూక్ష్మ-పారిశ్రామిక వృద్ధికి చోదకశక్తి
Posted On:
08 APR 2026 12:45PM
కీలకాంశాలు
- పీఎంఎంవై సాధికారత, ఆశయాలకు శక్తిమంతమైన సాధనంగా ఎదిగింది. రూ.40.07 లక్షల కోట్ల విలువైన 57 కోట్లకు పైగా రుణాలు మంజూరయ్యాయి.
- నాలుగు విభిన్న రుణ వర్గాల ద్వారా సులభమైన క్రెడిట్ సౌకర్యం: శిశు, కిషోర్, తరుణ్, తరుణ్ ప్లస్.
- తయారీ, వాణిజ్యం, సేవలు, అనుబంధ వ్యవసాయ కార్యకలాపాల కోసం రూ.20 లక్షల వరకు పూచీకత్తు లేని రుణాలు.
- 2024-25 ఆర్థిక సంవత్సరంలో దాదాపు 60% రుణ ఖాతాలు మహిళలవే కావడం, దాదాపు 21% కొత్త వ్యాపారవేత్తలవి కావడం ద్వారా ఆర్థిక సమ్మిళితం బలోపేతమవుతోంది.
- గత దశాబ్ద కాలంలో పీఎంఎంవై మరింత సాంకేతిక ఆధారిత, సమగ్ర, స్థిరమైన రుణ చట్రంగా పురోగమించింది.
పీఎం ముద్ర యోజన: "నిధులు లేని వారికి నిధులు అందించడం"
భారతదేశంలోని నగరాలు, పట్టణాలు, గ్రామాలలో లక్షలాది మంది చిన్న వ్యాపారవేత్తలు పొరుగు దుకాణాలు, రిపేర్ సేవల నుంచి చిన్న తరహా తయారీ, రవాణా కార్యకలాపాల వరకు నిరాడంబరమైన, కీలకమైన సంస్థల ద్వారా స్థానిక ఆర్థిక వ్యవస్థలను నిలబెడుతున్నారు. ఈ సూక్ష్మ వ్యాపారాలు జీవనోపాధిని సృష్టించడమే కాకుండా సమాజ స్థాయిలో ఉపాధిని, అవసరమైన సేవలను కూడా అందిస్తాయి. అయితే, సంవత్సరాల తరబడి బ్యాంకు రుణాల లభ్యత పరిమితంగా ఉండటం వల్ల వారి వృద్ధి కుంటుపడింది. చాలామంది స్నేహితులు, కుటుంబ సభ్యులు లేదా స్థానిక వడ్డీ వ్యాపారుల నుంచి అప్పులు తీసుకోవడంపై ఆధారపడేవారు. ఎందుకంటే సంస్థలకు అవసరమైన పూచీకత్తు, అధికారిక ఆర్థిక రికార్డులు వీరి వద్ద సాధారణంగా ఉండవు.

2015 ఏప్రిల్ 8న ప్రధానమంత్రి ముద్ర యోజన(పీఎంఎంవై) ప్రారంభం కావడం ఈ అంతరాన్ని పూడ్చడంలో ఒక నిర్ణయాత్మక ముందడుగు. “నిధులు లేని వారికి నిధులు అందించడం” అనే దార్శనికతతో ఈ పథకం రుణ సౌకర్యాన్ని మెరుగుపరుస్తుంది. రూ.20 లక్షల వరకు పూచీకత్తు లేని రుణాలను అందిస్తుంది. రుణగ్రహీతలలో తయారీ, వాణిజ్యం, సేవలు, వ్యవసాయ అనుబంధ కార్యకలాపాలలో నిమగ్నమైన నాన్-కార్పొరేట్, నాన్-ఫార్మ్ సూక్ష్మ, చిన్న సంస్థలు ఉన్నాయి.
ముఖ్యంగా 2026 మార్చి 27 నాటికి ఈ పథకం 57 కోట్లకు పైగా ఖాతాలకు రూ.40.07 లక్షల కోట్ల విలువైన రుణాలను పంపిణీ చేసింది. ఇందులో 12 కోట్లకు పైగా ఖాతాలు కొత్త వ్యాపారవేత్తలవే. వీరిని అధికారిక ఆర్థిక వ్యవస్థలోకి తీసుకురావడంలో పీఎంఎంవై పాత్రను ఇది నొక్కి చెబుతోంది.
గత దశాబ్దంలో సాధికారత, ఆశయాలకు పీఎంఎంవై ఒక శక్తిమంతమైన సాధనంగా ఎదిగింది. తద్వారా ఇది గ్రామీణ స్థాయి వ్యవస్థాపకతను బలోపేతం చేసింది. ఆర్థిక సమ్మిళితాన్ని లోతుగా తీసుకువెళ్లడంతో పాటు భారతదేశ స్థానిక ఆర్థిక వ్యవస్థల నిరంతర వృద్ధికి తోడ్పడింది.
చివరి మైలు వరకు రుణాలు అందించేలా రూపకల్పన
పీఎంఎంవై మూడు అంచెల సంస్థాగత నిర్మాణం ద్వారా పనిచేస్తుంది. ఇందులో మైక్రో యూనిట్స్ డెవలప్‌మెంట్ అండ్ రీఫైనాన్స్ ఏజెన్సీ లిమిటెడ్(ముద్ర), మెంబర్ లెండింగ్ ఇన్‌స్టిట్యూషన్స్(ఎంఎల్ఐ), లబ్ధిదారులు (రుణగ్రహీతలు) ఉంటారు. ఈ చట్రం మధ్యవర్తి-ఆధారిత నమూనా ద్వారా అధికారిక ఆర్థిక సంస్థల నుంచి సూక్ష్మ సంస్థలకు రుణం సజావుగా ప్రవహించేలా చేస్తుంది.

మీకు తెలుసా?
2024-2025 ఆర్థిక సంవత్సరంలో ముద్ర లిమిటెడ్ రూ.827 కోట్లకు పైగా లాభాన్ని నివేదించింది. ఇది తన మధ్యవర్తి భాగస్వాములకు మద్దతునిస్తూనే స్వయం-స్థిరత్వం దిశగా తన ప్రయాణాన్ని బలోపేతం చేసుకుంది.
మైక్రో యూనిట్స్ డెవలప్‌మెంట్ అండ్ రీఫైనాన్స్ ఏజెన్సీ రుణ సంస్థల నెట్‌వర్క్‌కు రీఫైనాన్స్ మద్దతును అందించే సహాయక సంస్థగా పనిచేస్తుంది. తద్వారా సూక్ష్మ సంస్థ రంగానికి సంస్థాగత రుణ ప్రవాహాన్ని అనుమతిస్తుంది. పీఎంఎంవై కింద రుణాలు షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకులు(ఎస్‌సీబీలు), ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు(ఆర్ఆర్‌బీలు), స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు(ఎస్ఎఫ్‌బీలు), నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు (ఎన్‌బీఎఫ్‌సీలు), మైక్రో ఫైనాన్స్ సంస్థల(ఎంఎఫ్ఐ)తో సహా ఎంఎల్ఐల ద్వారా పొడిగించారు. ఈ సంస్థలు రుణగ్రహీతలకు ప్రత్యక్షంగా రుణాలు ఇవ్వడానికి బాధ్యత వహిస్తాయి. రుణాలను చివరి మైలు వరకు పంపిణీ అయ్యేలా చూస్తాయి.
పీఎంఎంవై కింద రుణగ్రహీతలు తయారీ, వాణిజ్యం, సేవలు, అనుబంధ వ్యవసాయ కార్యకలాపాలలో నిమగ్నమైన సూక్ష్మ సంస్థలను కలిగి ఉంటారు. ఆదాయ ఉత్పాదక కార్యకలాపాలకు మద్దతు ఇవ్వడానికి, వ్యాపార కార్యకలాపాలను నిర్వహించడానికి, వారి సంస్థలను విస్తరించడానికి వారు పూచీకత్తు లేని రుణాలను పొందుతారు. ఒక నిర్మాణాత్మక చట్రం ద్వారా పీఎంఎంవై ఫైనాన్స్‌కు సమ్మిళిత ప్రాప్తిని సులభతరం చేయడంతో పాటు వ్యవస్థాపకతను ప్రోత్సహిస్తుంది.
పీఎంఎంవై పరిధి
ఆదాయ ఉత్పత్తి, ఉపాధి కల్పనను ప్రోత్సహించే విస్తృత శ్రేణి కార్యకలాపాల కోసం ముద్ర రుణాలు అందిస్తారు. ఈ రుణాలు ప్రధానంగా వీటి కోసం ఇస్తారు:
- విక్రేతలు, వ్యాపారులు, దుకాణదారులు, కమ్యూనిటీ, సామాజిక & వ్యక్తిగత సేవలు, ఆహార ఉత్పత్తులు, వస్త్రాలు మొదలైన ఇతర సేవా రంగ కార్యకలాపాల కోసం వ్యాపార రుణం.
- ముద్ర కార్డుల ద్వారా వర్కింగ్ క్యాపిటల్ రుణాలు.
- అవసరమైన యంత్రాలు, పరికరాలు మొదలైనవాటిని కొనుగోలు చేయడం వంటి సూక్ష్మ యూనిట్ల కోసం ఎక్విప్‌మెంట్ ఫైనాన్స్.
- ఆటో రిక్షాలు, చిన్న వస్తువుల రవాణా వాహనాలు, 3 వీలర్లు, ఇ-రిక్షాలు మొదలైన వాణిజ్య అవసరాల కోసం మాత్రమే రవాణా వాహన రుణాలు.
- చేపల పెంపకం, తేనెటీగల పెంపకం, పౌల్ట్రీ, పశువుల పెంపకం, గ్రేడింగ్, సార్టింగ్, అగ్రిగేషన్ అగ్రో-ఇండస్ట్రీస్, డైరీ, ఫిషరీ, అగ్రి-క్లినిక్‌లు, అగ్రి-బిజినెస్ సెంటర్లు, ఫుడ్ & అగ్రో-ప్రాసెసింగ్ మొదలైన వ్యవసాయ అనుబంధ వ్యవసాయేతర ఆదాయ ఉత్పాదక కార్యకలాపాల కోసం రుణాలు.
విభిన్న రుణాలతో ప్రతి దశలోనూ సంస్థలకు మద్దతు
వ్యాపార అవసరాల ఆధారంగా సులభమైన రుణ ప్రాప్తి అందించడానికి పీఎంఎంవై కింద రుణాలను శిశు, కిషోర్, తరుణ్, తరుణ్ ప్లస్ అనే నాలుగు విభిన్న వర్గాలుగా వర్గీకరించారు. ఈ వర్గీకరణ సంస్థల వివిధ వృద్ధి దశలు, ఆర్థిక అవసరాలను తీరుస్తుంది.

శిశు
శిశు విభాగం రూ.50,000 వరకు రుణాలను కవర్ చేస్తుంది. ఇది చాలా చిన్న లేదా ప్రారంభ దశ వ్యాపార కార్యకలాపాల కోసం ఉద్దేశించినది. ఇది సాధారణంగా చిన్న రిటైల్ అవుట్‌లెట్‌లు, రిపేర్ సర్వీసులు మొదలైన కార్యకలాపాలతో సహా కొత్త సంస్థలను ప్రారంభించే లేదా కనీస స్థాయిలో పనిచేసే వ్యక్తులకు మద్దతు ఇస్తుంది. శిశు వర్గం రుణ లభ్యతలో రుణ చరిత్ర లేదా పూచీకత్తు లేని వ్యాపారవేత్తలు కూడా ఉంటారు. ఈ నిబంధన అత్యంత అట్టడుగున ఉన్న వ్యాపారవేత్తలకు కూడా ఒక ఆలోచనను వాస్తవ వ్యాపారంగా మార్చడానికి సహాయపడుతుంది.
కిషోర్
కిషోర్ విభాగంలో రూ.50,000 పైన, రూ.5 లక్షల వరకు రుణాలు ఉంటాయి. ఈ వర్గం కొత్త సంస్థలతో పాటు ఇప్పటికే కార్యకలాపాలు ప్రారంభించి, స్థిరీకరణ, వర్కింగ్ క్యాపిటల్ లేదా వ్యాపార కార్యకలాపాల స్వల్ప విస్తరణ కోసం అదనపు నిధులు అవసరమయ్యే సంస్థల కోసం రూపొందింది.
తరుణ్
తరుణ్ విభాగం రూ.5 లక్షల పైన, రూ.₹10 లక్షల వరకు రుణాలను కవర్ చేస్తుంది. కార్యకలాపాలను పెంచుకోవడానికి, పరికరాలలో పెట్టుబడి పెట్టడానికి లేదా ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడానికి ప్రయత్నిస్తున్న అభివృద్ధి చెందుతున్న సంస్థలకు ఇది మద్దతు ఇస్తుంది.
తరుణ్ ప్లస్
పీఎంఎంవై సరికొత్త విభాగం ఇది. తరుణ్ ప్లస్ విభాగం 2024లో ప్రారంభమైంది. ఇది తరుణ్ వర్గం కింద మునుపటి రుణాలను విజయవంతంగా తిరిగి చెల్లించి, స్థిరమైన వ్యాపార ట్రాక్ రికార్డ్‌ను ప్రదర్శించిన రుణగ్రహీతలకు రూ.10 లక్షల పైన, రూ.20 లక్షల వరకు రుణాలను అందిస్తుంది. ఈ నిబంధన తదుపరి విస్తరణను, ఉన్నత స్థాయి సంస్థాగత కార్యకలాపాలకు పురోగతికి దోహదపడుతుంది.
సమ్మిళిత వృద్ధి, అభివృద్ధికి ఒక ఉత్ప్రేరకం
పీఎంఎంవై ఇటీవలి కాలంలో గణనీయమైన విజయాన్ని సాధించింది. ఇది ఆర్థిక సమ్మిళితాన్ని, వ్యవస్థాపకతను బలోపేతం చేసి సమ్మిళిత వృద్ధి, అభివృద్ధికి దారితీసింది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో పనితీరు పీఎంఎంవై ప్రధాన దృష్టి క్రెడిట్ ప్రాప్తి, మహిళల నేతృత్వంలోని సంస్థలు, శాశ్వత సామాజిక-ఆర్థిక ప్రభావాన్ని సృష్టించడానికి సూక్ష్మ వ్యాపారాలను అధికారికం చేయడంపై ఉందని ప్రతిబింబిస్తుంది.

- అన్ని రాష్ట్రాలలో ఉత్తరప్రదేశ్ రూ.58,111 కోట్లతో అత్యధిక రుణ పంపిణీని నమోదు చేయగా, బీహార్ రూ..54,064 కోట్లతో తర్వాతి స్థానంలో ఉంది. మహారాష్ట్ర రూ.50,762 కోట్లతో మూడో స్థానంలో నిలిచింది.
- మొత్తం రుణ ఖాతాల సంఖ్యలో మహిళా రుణగ్రహీతలు 59.81% ఉండగా, పంపిణీ చేసిన మొత్తంలో 37.45% వాటాను కలిగి ఉన్నారు.
- కొత్త వ్యాపారవేత్తలు మొత్తం రుణ ఖాతాలలో 21%, మొత్తం పంపిణీ చేసిన మొత్తంలో 30.09% వాటాను కలిగి ఉన్నారు.
- ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాల సంచిత వాటా రుణ ఖాతాల పరంగా 45.52%, మొత్తం పంపిణీ చేసిన మొత్తం పరంగా 31.77% గా ఉంది.
తద్వారా ఈ పథకం ఆర్థిక వ్యవస్థను ప్రజాస్వామీకరించడంలో, భారతదేశం అంతటా సూక్ష్మ-సంస్థల వృద్ధికి మద్దతు ఇవ్వడంలో కీలకపాత్ర పోషిస్తూనే ఉంది.

పీఎంఎంవై వ్యవస్థను బలోపేతం చేయడం
ఇతర ప్రభుత్వ మద్దతు ఉన్న పథకాలు, డిజిటల్ పోర్టల్‌లతో అనుసంధానితమైన పీఎంఎంవై విస్తృత పరిధి సూక్ష్మ సంస్థలు, స్వయం సహాయక బృందాల(ఎస్‌హెచ్‌జీల) ఆర్థిక సమ్మిళితంతో పాటు బలోపేతం చేసిన రుణ వ్యవస్థను ఏర్పాటుచేసింది.
ముద్ర లావాదేవీల డిజిటలీకరణ రుణగ్రహీతలకు సామర్థ్యం, పారదర్శకత, రుణ ప్రాప్తిని సులభతరం చేసింది. ముఖ్యంగా, నేషనల్ క్రెడిట్ గ్యారెంటీ ట్రస్టీ కంపెనీ(ఎన్‌సీజీటీసీ) ద్వారా నిర్వహించే క్రెడిట్ గ్యారెంటీ ఫండ్ ఫర్ మైక్రో యూనిట్స్(సీజీఎఫ్ఎంయూ) వంటి పథకాల మద్దతుతో రుణ వ్యవస్థ బలోపేతమైంది. ఇది పీఎంఎంవై కింద పొడిగించిన రుణాలకు గ్యారెంటీని వర్తింపజేస్తుంది. రుణ సంస్థలకు క్రెడిట్ రిస్క్‌ను తగ్గిస్తుంది. తద్వారా సూక్ష్మ సంస్థలకు పూచీకత్తు లేని రుణాలను సులభతరం చేస్తుంది. పీఎంఎంవై రుణ దరఖాస్తు ప్రక్రియను సరళీకృతం చేయడానికి, సకాలంలో రుణాల పంపిణీని నిర్ధారించడానికి చర్యలు తీసుకున్నారు. ఉదాహరణకు జన్‌సమర్థ్ పోర్టల్ డేటాను ధ్రువీకరించడానికి, ఎంఎల్ఐల ఇబ్బందులను తగ్గించడానికి డిజిటల్ యాక్సెస్‌ను అందించడానికి ముద్ర రుణాలతో సహా బహుళ అనుసంధానాలను అందిస్తోంది.
జన్‌సమర్థ్ అనేది 14 రుణ అనుసంధాల ప్రభుత్వ పథకాలు, 7 రుణ విభాగాలు(వ్యాపార కార్యకలాపాల కోసం పీఎంఎంవై సహా), 200+ రుణదాతలతో కూడిన జాతీయ పోర్టల్.
చిన్న రుణాలు, పెద్ద కలలు: పీఎంఎంవైతో మారిన జీవితాలు
పీఎంఎంవై ఫలితం దేశవ్యాప్తంగా రుణగ్రహీతల ప్రయాణాలలో ప్రతిబింబిస్తుంది. వారు తమ సంస్థలను స్థాపించడానికి, విస్తరించడానికి సంస్థాగత రుణాన్ని ఉపయోగించుకున్నారు.

బీహార్‌కు చెందిన రైతు కోడలు పూనమ్ కుమారికి వ్యాపారం ప్రారంభించడం అనేది ఒక స్పష్టమైన మార్గం కాదు. ఇది ఆమె భర్తతో కలిసి తీసుకున్న ఆలోచనాత్మకమైన నిర్ణయం. అవసరం, నిశ్శబ్ద సంకల్పం నుంచి పుట్టిన నిర్ణయమిది. 2024లో కనీస రాతపనితో పొందిన రూ.8 లక్షల ముద్ర రుణం ఆమెకు విత్తనాల వ్యాపారాన్ని ప్రారంభించడానికి మార్గాలను ఇచ్చింది. తక్కువ సమయంలోనే ఆమె నెలవారీ ఆదాయం రూ.60,000కు చేరుకుంది. ఈ అంకె ఆమెకు ఆర్థిక స్వేచ్ఛను తీసుకురావడమే కాకుండా ఆమె కుటుంబ నమ్మకాన్ని, విశ్వాసాన్ని సంపాదించిపెట్టింది. ఆమె కథ పట్టుదల, భాగస్వామ్యం, సొంత కాళ్లపై నిలబడటం వల్ల వచ్చే నిశ్శబ్ద గౌరవానికి నిదర్శనం.
(Source: https://www.youtube.com/watch?v=otNb6xwsrSc)

ముదస్సిర్ నక్ష్‌బందీ ఒకప్పుడు ఉద్యోగాన్వేషి నుంచి ఉద్యోగ సృష్టికర్తగా విజయాన్ని రుచి చూశారు. కశ్మీర్‌లోని బారాముల్లాలో 'బేక్ మై కేక్' యజమాని అయిన ముదస్సిర్.. జిల్లాలోని మారుమూల మూలల నుంచి 42 మందికి ఉపాధి కల్పించే అభివృద్ధి చెందుతున్న బేకరీ వ్యాపారాన్ని నిర్మించడానికి తన ముద్ర రుణాన్ని ఉపయోగించారు. ఒకప్పుడు వేలల్లో ఉన్న అతని సంపాదన లక్షలు, కోట్లకు చేరుకుంది. అతని వ్యాపారం భారతదేశం ఎలా లావాదేవీలు నిర్వహిస్తుందో అనే దానిలో విస్తృత మార్పును ప్రతిబింబిస్తుంది. అతని బేకరీలో ప్రతి పది చెల్లింపులలో తొమ్మిది యూపీఐ ద్వారా అవుతున్నాయి. ఇది విస్తరిస్తున్న డిజిటల్ ఆర్థిక సమ్మిళితానికి సంకేతం.
(Source: https://www.youtube.com/watch?v=UkhViDHj9cc)

భోపాల్‌కు చెందిన లవకుశ మెహ్రా 2021లో తన మొదటి ముద్ర రుణాన్ని రూ.5 లక్షలు తీసుకున్నప్పుడు అతను కొంత సంకోచంతోనే చేశాడు. కొన్ని సంవత్సరాలలోనే ఆ ఒక్క అడుగు ఒక అద్భుతమైన ప్రయాణానికి ఆరంభమైంది. అతని ఫార్మాస్యూటికల్ వ్యాపారం రూ..12 లక్షల టర్నోవర్ నుంచి రూ.50 లక్షల పైచిలుకు పెరిగింది. అతని ఆదాయం రెండింతలు పెరిగింది. అతను ఒక ఇంటి యజమాని అయ్యాడు. అతని కథ పీఎంఎంవై దేనిని సాధించడానికి రూపొందిందో ప్రతిబింబిస్తుంది. యువ వ్యాపారవేత్తలకు వారి స్వంత ఆలోచనలపై జీవనోపాధిని నిర్మించుకోవడానికి ఆర్థిక పునాదిని అందించింది.
(Source: https://www.youtube.com/watch?v=oPqmp6PuwGU)
ఈ విజయగాథలు సూక్ష్మ వ్యాపారాలను వృద్ధి-ఆధారిత వెంచర్లుగా మార్చడంలో పీఎంఎంవై పరివర్తన సామర్థ్యాన్ని చాటిచెప్తున్నాయి.
ముగింపు
లక్షలాది మంది చిన్న వ్యాపారవేత్తలకు పూచీకత్తు లేని రుణాన్ని అందిస్తూ భారతదేశ ఆర్థిక సమ్మిళిత ప్రయత్నాలలో పీఎం ముద్ర యోజన కేంద్ర బిందువుగా ఉంది. డిజిటల్ అనుసంధానం, పరిపూరకరమైన ప్రభుత్వ కార్యక్రమాలతో సమన్వయం ద్వారా ఈ పథకం మరింత ప్రభావవంతంగా పెరిగింది. ఇది తన తదుపరి దశలోకి ప్రవేశిస్తున్నప్పుడు, ప్రాధాన్యతలు స్పష్టంగా ఉన్నాయి. క్రెడిట్ నాణ్యతను మెరుగుపరచడం, సంస్థల స్థిరత్వాన్ని నిర్ధారించడం, వృద్ధి-ఆధారిత ఫైనాన్సింగ్ వైపు మొగ్గు చూపడం, తద్వారా నేటి సూక్ష్మ సంస్థలు రేపటి స్థితిస్థాపక, విస్తరించగల వ్యాపారాలుగా మారుతాయి.
References
Ministry of Finance
https://www.mudra.org.in/Default/DownloadFile/Annual-Report-2024-25.pdf
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2119954®=3&lang=2
https://www.mudra.org.in/AboutUs/Genesis
https://www.mudra.org.in/
https://www.mudra.org.in/Offerings
https://www.jansamarth.in/business-loan-pradhan-mantri-mudra-yojana-scheme
https://www.myscheme.gov.in/schemes/pmmy
https://www.pib.gov.in/PressReleaseIframePage.aspx?PRID=2069170®=3&lang=2
https://www.mudra.org.in/FAQ
https://www.ncgtc.in/en/product-details/CGFMU/Credit-Guarantee-Fund-for-Micro-Units-(CGFMU)
https://www.ncgtc.in/en/Blogs/understanding-how-cgfmu-helps-avail-collateral-free-business-loans
Ministry of Micro, Small & Medium Enterprises
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2240159®=3&lang=2
Prime Minister’s Office
https://www.pib.gov.in/PressReleaseIframePage.aspx?PRID=2119970®=3&lang=2
https://www.youtube.com/watch?v=otNb6xwsrSc
https://www.youtube.com/watch?v=oPqmp6PuwGU
https://www.youtube.com/watch?v=UkhViDHj9cc
Lok Sabha
https://sansad.in/getFile/loksabhaquestions/annex/187/AS336_mnJub0.pdf?source=pqals
Small Industries Development Bank of India
https://www.psbloansin59minutes.com/knowledge-hub/understanding-loan-categories-mudra-scheme
State Bank of India
https://sbi.bank.in/documents/13958/43951007/10%2BYears%2Bof%2BPMMY_SBI%2BReport.pdf/93f97f57-e655-dcfc-0733-cd638e82fe0e?t=1743585995479
https://sbi.bank.in/web/business/sme/sme-government-schemes/pmmy
https://sbi-bank-in.translate.goog/web/agri-rural/pradhan-mantri-mudra-yojna?_x_tr_sl=en&_x_tr_tl=hi&_x_tr_hl=hi&_x_tr_pto=sge
Click here to see pdf
***
(Explainer ID: 158200)
आगंतुक पटल : 52
Provide suggestions / comments