Social Welfare
సర్వైకల్ క్యాన్సర్ టీకా కార్యక్రమం ప్రారంభం
Posted On:
28 FEB 2026 7:26PM
కీలకాంశాలు
- దేశంలో మహిళలకు ఎక్కువగా వచ్చే రెండో రకం క్యాన్సర్ అయిన 'సర్వైకల్ క్యాన్సర్'(గర్భాశయ ముఖద్వార క్యాన్సర్) నివారణకు భారత్ శ్రీకారం చుట్టింది. 14 ఏళ్ల వయసున్న 1.15 కోట్ల మంది బాలికలకు దేశవ్యాప్తంగా ఉచితంగా హెచ్‌పీవీ టీకాలు అందిస్తోంది.
- సర్వైకల్ క్యాన్సర్‌కు కారణమయ్యే హెచ్‌పీవీ రకాలపై 'గార్డాసిల్-4' టీకా ఒక్క డోస్‌తోనే 93-100% వరకు ప్రభావవంతంగా పనిచేస్తుంది.
- సర్వైకల్ క్యాన్సర్‌ను నిర్మూలించాలనే ప్రపంచ లక్ష్యాన్ని ముందుకుతీసుకెళ్తూ, హెచ్‌పీవీ టీకాను తమ జాతీయ ఆరోగ్య పథకాల్లో చేర్చిన 160కి పైగా దేశాల జాబితాలో ఇప్పుడు భారత్ కూడా చేరింది.
పరిచయం
మహిళల్లో సర్వైకల్ క్యాన్సర్ నివారణకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫిబ్రవరి 28, 2026న రాజస్థాన్‌లోని అజ్మీర్‌లో దేశవ్యాప్త HPV టీకా కార్యక్రమాన్ని ప్రారంభించారు. అదే రోజున అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో కూడా ఈ కార్యక్రమాలు మొదలయ్యాయి. దాదాపు 1.15 కోట్ల మంది 14 ఏళ్ల వయస్సు గల బాలికలకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఈ టీకాలను ఉచితంగా ఇస్తారు.

ఈ కార్యక్రమం మొదలైన 90 రోజుల్లోపు 15 ఏళ్లు నిండే బాలికలు కూడా ఈ మూడు నెలల ప్రత్యేక డ్రైవ్‌లో టీకా తీసుకోవచ్చు. గరిష్టంగా అందరికీ టీకా అందేలా ఈ 90 రోజులు ప్రతిరోజూ టీకాలు వేస్తారు. ఆ తర్వాత రొటీన్ ఇమ్యునైజేషన్ డేస్‌లో ఇవి అందుబాటులో ఉంటాయి.
గర్భాశయ ముఖద్వార క్యాన్సర్
ప్రపంచవ్యాప్తంగా మహిళల్లో ఇది నాలుగో అతిపెద్ద క్యాన్సర్. 2022 లెక్కల ప్రకారం.. ఈ క్యాన్సర్‌కు సంబంధించి సుమారు 6.6 లక్షల కొత్త కేసులు, 3.5 లక్షల మరణాలు నమోదయ్యాయి. సర్వైకల్ క్యాన్సర్ అనేది హ్యూమన్ పాపిలోమా వైరస్ వల్ల వస్తుంది. చిన్న వయసులోనే తల్లులను కోల్పోతున్న పిల్లల్లో 20% మందికి ఈ క్యాన్సరే కారణం అవుతోంది.

భారతదేశంలో పరిస్థితి చూస్తే.. గ్లోబోకాన్ 2022 డేటా ప్రకారం సర్వైకల్ క్యాన్సర్ అనేది మహిళల్లో రెండో అతిపెద్ద క్యాన్సర్. ఏటా 1.2 లక్షల కొత్త కేసులు, దాదాపు 80 వేల మరణాలు ఈ క్యాన్సర్ వల్ల సంభవిస్తున్నాయి.
ప్రపంచవ్యాప్తంగా నమోదవుతున్న సర్వైకల్ క్యాన్సర్ మరణాల్లో 25% భారత్‌లోనే నమోదవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఈ క్యాన్సర్ బారిన పడుతున్న ప్రతి ఐదుగురిలో ఒకరు భారతీయులే ఉంటున్నారు. సర్వైకల్ క్యాన్సర్ సంబంధిత అనారోగ్యాలలో ప్రపంచవ్యాప్తంగా భారతదేశం నాలుగో స్థానంలో ఉంది.
సర్వైకల్ క్యాన్సర్ హ్యూమన్ పాపిలోమా వైరస్(హెచ్‌పీవీ) వల్ల వస్తుంది. సకాలంలో అందిస్తే వ్యాక్సిన్ ద్వారా నివారించగల ఏకైక క్యాన్సర్ ఇది. భారతదేశంలోని సర్వైకల్ క్యాన్సర్ కేసులలో 80% కంటే ఎక్కువ కారణమయ్యే అత్యంత ప్రమాదకరమైన హెచ్‌పీవీ రకాలు, ముఖ్యంగా 16, 18 రకాల వైరస్‌ల వల్ల సంభవిస్తున్నాయని శాస్త్రీయ ఆధారాలు నిర్ధారిస్తున్నాయి.
వ్యాక్సిన్: గార్డాసిల్-4
భారతదేశ జాతీయ కార్యక్రమం గార్డాసిల్ అనే క్వాడ్రివాలెంట్ హెచ్‌పీవీ వ్యాక్సిన్‌ను ఉపయోగిస్తోంది. ఇది సర్వైకల్ క్యాన్సర్‌కు కారణమయ్యే హెచ్‌పీవీ రకాలు 16, 18తో పాటు 6, 11 రకాల నుంచి కూడా రక్షణ కల్పిస్తుంది. ఈ వ్యాక్సిన్ భారతదేశ ఔషధ నియంత్రణ సంస్థచే ఆమోదం పొందింది. కఠినమైన నాణ్యత, కోల్డ్-చైన్ ప్రమాణాలకు అనుగుణంగా ఉంటుంది. అంతరాయం లేని సరఫరా, రాజీ లేని నాణ్యతను నిర్ధారించడానికి గ్లోబల్ అలయన్స్ ఫర్ వ్యాక్సిన్స్ అండ్ ఇమ్యునైజేషన్(జీఏవీఐ) భాగస్వామ్యంతో పారదర్శక యంత్రాంగం ద్వారా ఈ వ్యాక్సిన్ సేకరణ జరుగుతోంది. యువతులు లైంగికంగా చురుగ్గా మారకముందే 14 ఏళ్ల వయస్సులో ఈ టీకా ఇస్తారు.
ఫిబ్రవరి 2023లో జీఏవీఐ, భారత ప్రభుత్వం దేశంలోని లక్షలాది మంది పిల్లలకు ప్రాణరక్షణ టీకాలను అందించే లక్ష్యంతో మూడేళ్ల భాగస్వామ్యాన్ని కుదుర్చుకున్నాయి. ఈ వ్యూహాత్మక భాగస్వామ్యం ద్వారా ఒక్క సాధారణ టీకా కూడా తీసుకోని పిల్లలను గుర్తించి వారికి టీకాలు వేయడానికి, ఉన్నత ఆరోగ్య వ్యవస్థలను బలోపేతం చేయడానికి, జాతీయ రోగనిరోధక పట్టికలో హ్యూమన్ పాపిలోమా వైరస్(హెచ్‌పీవీ) వ్యాక్సిన్, టైఫాయిడ్ కాంజుగేట్ వ్యాక్సిన్(టీసీవీ)లను ప్రవేశపెట్టడానికి జీఏవీఐ 250 మిలియన్ డాలర్ల నిధులను అందించింది.
జీఏవీఐ అనేది ప్రభుత్వాలు, డబ్ల్యూహెచ్ఓ, యూనిసెఫ్, ప్రపంచ బ్యాంక్, వ్యాక్సిన్ పరిశ్రమ, పౌర సమాజం, గేట్స్ ఫౌండేషన్‌లను కలిపి ప్రపంచంలోని అత్యంత ప్రాణాంతక వ్యాధుల నుంచి పిల్లలకు టీకాలు వేయడానికి ఏర్పడిన ఒక ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యం.
వ్యాక్సినేషన్ కేంద్రాలు, భద్రత
వ్యాక్సినేషన్ కేవలం కోల్డ్ చైన్ పాయింట్(సీసీపీ) సదుపాయం, టీకా అనంతర దుష్ప్రభావాల(ఏఈఎఫ్ఐ) నిర్వహణ కోసం ప్రత్యేక మెడికల్ ఆఫీసర్, ఇంటర్నెట్ కనెక్టివిటీ ఉన్న ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలలో మాత్రమే అందుబాటులో ఉంటుంది.
సెషన్ సమయాలు సాధారణంగా ఉదయం 9:00 నుంచి మధ్యాహ్నం 2:00 వరకు ఉంటాయి. ఇవి ప్రభుత్వ సెలవు దినాలు, వారాంతాల్లో కూడా నిర్వహించవచ్చు. తక్షణ వైద్య సహాయం కోసం అన్ని కేంద్రాలు సమీపంలోని 24×7 ప్రభుత్వ ఆరోగ్య కేంద్రానికి అనుసంధానితమై ఉంటాయి. టీకా వేయించుకునే ముందు బాలికలు ఖాళీ కడుపుతో ఉండకూడదు. టీకా వేసిన తర్వాత వారిని 30 నిమిషాల పాటు పరిశీలనలో ఉంచాలి.
రిజిస్ట్రేషన్, రికార్డింగ్, రిపోర్టింగ్
- లబ్ధిదారులు యూ-విన్ డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లో స్వయంగా నమోదు చేసుకోవచ్చు. ఆరోగ్య కార్యకర్త సహాయంతో ముందస్తు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు లేదా నేరుగా కేంద్రానికి వెళ్లి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.
- అన్ని వ్యాక్సిన్ నిల్వలు, లాజిస్టిక్స్ eVIN ద్వారా జరుగుతాయి. దీని ద్వారానే పర్యవేక్షణ జరుగుతుంది.
- వ్యాక్సినేషన్ సర్టిఫికేట్‌లను యూ-విన్ పోర్టల్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇందులో సమీపంలోని 24×7 ఏఈఎఫ్ఐ సదుపాయం చిరునామా, హెల్ప్‌లైన్ నంబర్ కూడా ఉంటాయి. కోరిన వారికి హార్డ్ కాపీలు కూడా అందుబాటులో ఉంటాయి.
- ఈ మూడు నెలల ప్రచార కాలంలో టీకా పొందిన ప్రతి ఒక్కరి ఎడమ చేతి చూపుడు వేలిపై గుర్తు పెడతారు.
టీకా నుంచి మినహాయించిన బాలికలు
- మితమైన లేదా తీవ్రమైన అనారోగ్యంతో ఉన్నవారు(పూర్తిగా కోలుకునే వరకు వేచి ఉండాలి)
- ఈస్ట్ పట్ల అలెర్జీ ఉన్నవారు లేదా గతంలో ఏదైనా టీకా వల్ల అలెర్జీ ప్రతిచర్యలు ఎదుర్కొన్నవారు.
- గర్భంతో ఉన్నవారు
- 14 ఏళ్ల లక్షిత వయస్సు పరిధికి వెలుపల ఉన్న బాలికలు
- గతంలో ఏదైనా హెచ్‌పీవీ వ్యాక్సిన్(గార్డసిల్, గార్డసిల్-9, సెర్వరిక్స్, లేదా సెర్వవాక్) తీసుకున్న బాలికలు

ముగింపు
హెచ్‌పీవీ వ్యాక్సిన్‌లు ప్రపంచవ్యాప్తంగా అత్యంత విస్తృతంగా అధ్యయనం చేసిన టీకాలలో ఒకటి. 2006 నుంచి ప్రపంచవ్యాప్తంగా 50 కోట్లకు పైగా డోస్‌లు పంపిణీ అయ్యాయి. ఈ వ్యాక్సిన్ అది కవర్ చేసే హెచ్‌పీవీ రకాల వల్ల వచ్చే సర్వైకల్ క్యాన్సర్‌ను నివారించడంలో 93-100% ప్రభావవంతంగా ఉంటుంది.
ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమంతో తమ జాతీయ రోగనిరోధక పట్టికలలో హెచ్‌పీవీ టీకాను ప్రవేశపెట్టిన 160కు పైగా దేశాల సరసన భారతదేశం నిలిచింది. 90 కంటే ఎక్కువ దేశాలు సింగిల్-డోస్ హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ పద్ధతిని అమలు చేస్తున్నాయి. ఇది కవరేజీని, అందుబాటును, కార్యక్రమ సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఈ నిర్మూలన లక్ష్యాన్ని సాధించడం ద్వారా 2120 నాటికి ప్రపంచవ్యాప్తంగా 7.4 కోట్ల కొత్త సర్వైకల్ క్యాన్సర్ కేసులను, 6.2 కోట్ల మరణాలను నివారించవచ్చని అంచనా.
ఆరోగ్యకరమైన కుటుంబాల నిర్మాణానికి మహిళల ఆరోగ్య సంరక్షణలో నివారణ, రక్షణ, సమానత్వానికి ప్రాధాన్యతనిస్తూ ప్రభుత్వ "స్వస్థ నారి సశక్త్ పరివార్" దార్శనికతను ఈ కార్యక్రమం నెరవేరుస్తుంది.
References
Cervical Cancer Vaccination Campaign Launched
***
(Explainer ID: 157676)
आगंतुक पटल : 167
Provide suggestions / comments