Energy & Environment
భారతదేశంలో ఏఐ, వాతావరణ కార్యాచరణ
ఆవిష్కరణలు, సుస్థిరత దిశగా మార్గం
Posted On:
16 FEB 2026 3:16PM

కీలకాంశాలు
- ఇండియా-ఏఐ ఇంపాక్ట్ సదస్సు-2026 అనేది గ్లోబల్ సౌత్‌లో నిర్వహిస్తున్న మొట్టమొదటి అంతర్జాతీయ ఏఐ శిఖరాగ్ర సదస్సు.
- ఇది సమగ్రమైన, సుస్థిరాభివృద్ధి కోసం ఏఐపై దృష్టి సారిస్తుంది. ప్రజలు, గ్రహం, ప్రగతి అనే మూడు స్తంభాలపై ఆధారపడి ఉంది.
- ఏఐ-ఆధారిత వాతావరణ, విపత్తులను తట్టుకునే శక్తి ద్వారా ఇవి ఆచరణలో ఉంటాయి. తద్వారా ప్రాణాలను రక్షించడం, పర్యావరణ వ్యవస్థలను కాపాడటం, సంసిద్ధతను బలోపేతం చేస్తారు.
- అట్టడుగు స్థాయిలో ఏఐ-ఆధారిత వాతావరణ అంచనాలు ఇప్పుడు దాదాపు అన్ని గ్రామాలకు చేరుతున్నాయి. గ్రామ పంచాయతీ స్థాయి కవరేజ్, భారత్ ఫోర్కాస్టింగ్ సిస్టమ్(మే 2025) ద్వారా అధిక-రిజల్యూషన్(6 కి.మీ) అంచనాలు అందుతున్నాయి.
- సముద్ర మట్టాల పెరుగుదలను పర్యవేక్షించడం, అడ్వాన్స్‌డ్ డేవోరక్ టెక్నిక్ ద్వారా తుఫాను అంచనాలను మెరుగుపరచడం ద్వారా వాతావరణ ప్రమాద నిర్వహణను ఏఐ బలోపేతం చేస్తోంది.
పరిచయం
వాతావరణ మార్పు అనేది నేడు ఒక అత్యవసర వాస్తవం. ఇది జీవితం, జీవనోపాధికి సంబంధించిన ప్రతి అంశాన్ని ప్రభావితం చేస్తుంది. వాతావరణ ప్రమాదాలు పెరుగుతున్నా కొద్దీ అనుకూలత, ఉపశమనం కోసం చురుకైన పరిష్కారాలు అవసరం. ఈ విషయంలో భారత్ గణనీయమైన పురోగతిని సాధించింది, పచ్చదనాన్ని పెంచడం, పునరుత్పాదక ఇంధనాన్ని వినియోగించుకోవడం, ఉద్గారాలను తగ్గించడం, తీవ్రమైన వాతావరణ సవాళ్లను ఎదుర్కోవడం వంటివి చేపట్టింది. ఇటీవలి సంవత్సరాలలో కృత్రిమ మేధ(ఏఐ) వాతావరణ మార్పులపై ఈ పోరాటంలో శక్తిమంతమైన సాధనంగా ఉద్భవించింది. కంప్యూటర్లు డేటా నుంచి నేర్చుకోవడానికి, మనుషుల మాదిరిగానే నిర్ణయాలు లేదా అంచనాలు వేయడానికి కృత్రిమ మేధ(ఏఔ) వీలు కల్పిస్తుంది. డీప్ లెర్నింగ్ అనేది ఏఐలో ఒక విధానం. ఇది పెద్ద మొత్తంలో సమాచారాన్ని విశ్లేషించడం ద్వారా కంప్యూటర్లు బాగా నేర్చుకోవడంలో సహాయపడుతుంది. వాతావరణ అధ్యయనాలకు వర్తింపజేసినప్పుడు ఏఐ వ్యవస్థలు వాతావరణ సంబంధిత డేటాను విశ్లేషిస్తాయి. మెరుగైన వాతావరణ నమూనా, అనుకూలీకరించిన పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి, సుస్థిర వ్యవసాయానికి పరిష్కారాలు, విపత్తు తట్టుకునే శక్తి మెరుగవడం కోసం పరిష్కారాలను అందిస్తాయి.
సమ్మిళిత అభివృద్ధిని ప్రోత్సహించడంలో ఏఐ కీలక పాత్రను గుర్తిస్తూ ఇండియా-ఏఐ ఇంపాక్ట్ సదస్సు-2026 ఫిబ్రవరి 16-20 వరకు న్యూఢిల్లీలోని భారత్ మండపంలో జరుగుతోంది. గ్లోబల్ సౌత్‌లో నిర్వహిస్తున్న మొట్టమొదటి అంతర్జాతీయ ఏఐ సదస్సు ఇది. ప్రజలు, గ్రహం, ప్రగతి అనే మూడు పునాది స్తంభాలపై నిర్మితమైన ఈ సదస్సు పాలన, ఆవిష్కరణ, సుస్థిరాభివృద్ధిలో ఏఐ పరివర్తనాత్మక సామర్థ్యంపై దృష్టి పెడుతుంది.
ఏఐ-ఆధారిత ముందస్తు హెచ్చరిక, విపత్తు నష్టనివారణ
అధునాతన సాంకేతికత మనం వాతావరణ నమూనాలను అంచనా వేసే విధానాన్ని, ప్రకృతి వైపరీత్యాల కోసం సిద్ధమయ్యే విధానాన్ని పునర్నిర్మిస్తోంది.
అంచనా వ్యవస్థ: తుఫాను, తీవ్రమైన వాతావరణ నమూనా
ఏఐ-సహాయక సాధనాల ద్వారా భారతదేశం తన తుఫాను అంచనా సామర్థ్యాన్ని గణనీయంగా పెంచుకుంది:
1. తుఫాను తీవ్రతను అంచనా వేయడానికి భారత వాతావరణ శాఖ(ఐఎండీ), ఇతర ప్రభుత్వ సంస్థలు అధునాతన డేవోరక్ టెక్నిక్‌ను ఉపయోగిస్తున్నాయి.
తుఫాను పర్యవేక్షణ
ఉష్ణమండల తుఫానులను పర్యవేక్షించడానికి ఐఎండీ ఉపగ్రహ ఆధారిత ఏఐ సాధనాలను ఉపయోగిస్తుంది. అధునాతన డేవోరక్ టెక్నిక్ తుఫానుల తీవ్రతను అంచనా వేయడంలో సహాయపడుతుంది. యూరోపియన్ సెంటర్ ఫర్ మీడియం-రేంజ్ వెదర్ ఫోర్కాస్టింగ్ నుంచి ఏఐ-ఆధారిత మార్గదర్శకత్వాన్ని కూడా ఐఎంఈ ఉపయోగిస్తుంది. తుఫానులు ఎప్పుడు ఏర్పడతాయి, అవి ఎక్కడికి వెళ్తాయి, అవి ఎంత బలంగా మారతాయి అని అంచనా వేయడానికి ఈ సాధనాలు సహాయపడతాయి.
2. భూవిజ్ఞాన మంత్రిత్వ శాఖ 22 పెటాఫ్లాప్స్ సామర్థ్యం గల హై-పవర్ కంప్యూటింగ్ వ్యవస్థలను ఏర్పాటు చేసింది. ఈ వ్యవస్థలో సుమారు 10% ఏఐ పనుల కోసం ప్రత్యేక గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్లను(జీపీయూ) ఉపయోగిస్తుంది. వాతావరణ అంచనాలో ఏఐ, మెషిన్ లెర్నింగ్ పరిశోధనల కోసం ప్రత్యేకంగా కేటాయించిన విడి జీపీయూలు కూడా ఉన్నాయి. ఈ వ్యవస్థలు మెరుగైన వాతావరణ అంచనా నమూనాలను అభివృద్ధి చేయడంలో సహాయపడతాయి.
పరిశోధన, అభివృద్ధిలో

1. భారతీయ పరిశోధకులు అభివృద్ధి చేసిన ట్రాన్స్‌ఫార్మర్-ఆధారిత న్యూరల్ నెట్‌వర్క్‌లు 18 రోజుల ముందుగానే రుతుపవనాల ప్రవర్తనను అంచనా వేస్తాయి.
2. గ్లోబల్ ఏఐ వ్యవస్థల(గ్రాఫ్‌కాస్ట్, పంగువెదర్, అరోరా, ఫోర్‌కాస్ట్‌నెట్ సహా) తులనాత్మక అధ్యయనాలు, తుఫాను తీరం దాటడానికి 96 గంటల ముందుగానే 200 కిలోమీటర్ల కచ్చితత్వంతో సెకన్లలో మార్గ అంచనాను మెరుగుపరిచాయి. ఈ పురోగతులు తరలింపు ప్రణాళిక, మౌలిక సదుపాయాల రక్షణను బలోపేతం చేస్తున్నాయి.
3. స్పేషియల్లీ అవేర్ డొమైన్ అడాప్షన్ నెట్‌వర్క్(స్పేడనెట్)ను ఐఐటీ బాంబే అభివృద్ధి చేసింది. ఇది వైమానిక చిత్రాల నుంచి తుఫాను, హరికేన్ నష్టాన్ని అంచనా వేసే ఏఐ నమూనా. పరిమిత లేబుల్ డేటాను ఉపయోగించి నష్ట స్థాయిలను వర్గీకరించడంలో ఉన్న పద్ధతుల కంటే ఈ నమూనా 5% మెరుగైన కచ్చితత్వాన్ని సాధించింది. ఇది ఎన్‌డీఎంఏ వంటి విపత్తు సంస్థలు ఎదుర్కొంటున్న లేబుల్ డేటా లేకపోవడం, పరిమిత కంప్యూటింగ్ పవర్ మొదలైన ప్రధాన సమస్యలను పరిష్కరిస్తుంది. వేగవంతమైన, నమ్మదగిన విపత్తు స్పందనను సాధ్యం చేస్తుంది.
4. భారతదేశానికి వాతావరణ అంచనాలను మెరుగుపరచడానికి ఐఐటీ మద్రాస్ రిలయబిలిటీ ఎన్‌సెంబుల్ అవెరేజింగ్(ఆర్ఈఏ)ను ఉపయోగిస్తుంది. వారు 26 వాతావరణ నమూనాలను కలిపి ప్రస్తుత వాతావరణం, భవిష్యత్తు మార్పులను అంచనా వేయడంలో కచ్చితత్వం ఆధారంగా ప్రతిదానికి స్కోరు ఇచ్చారు. నాలుగు భారతీయ నగరాల్లో(కోయంబత్తూర్, రాజ్‌కోట్, ఉదయపూర్, సిలిగురి) పరీక్షించినప్పుడు చాలా నమూనాలు వర్షపాతాన్ని సరిగ్గా అంచనా వేయలేకపోయాయని తేలింది. అయితే, ఆర్ఈఏ చాలా నమ్మదగిన ఫలితాలను అందిస్తుంది. ఇది రుతుపవన ప్రభావిత ప్రాంతాలలో వాతావరణ ప్రణాళిక కోసం అనిశ్చితిని తగ్గించడంలో సహాయపడుతుంది.
5. పూణేలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటియోరాలజీ(ఐఐటీఎం) వద్ద ఉన్న వర్చువల్ సెంటర్ ఏఐ-ఆధారిత అప్లికేషన్ టూల్స్‌ను అభివృద్ధి చేస్తుంది. ఏఐ, మెషిన్ లెర్నింగ్ పరిశోధనలను బలోపేతం చేయడానికి ఐఎండీ ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది. ఏఐ పరిశోధన సహకారం కోసం ఐఐటీలు, ఎన్ఐటీలు, ఇస్రో, డీఆర్‌డీఓ, ఇతర సంస్థలతో ఐఎండీ ఒప్పందాలు కుదుర్చుకుంది. వర్క్‌షాపులు, కోర్సుల ద్వారా శాస్త్రవేత్తలు ఏఐలో శిక్షణ పొందుతారు. ప్రతి సంవత్సరం మే నెలలో ఏఐ, మెషిన్ లెర్నింగ్ ప్రాథమిక అంశాలపై ఐఎండీ శిక్షణ కోర్సును నిర్వహిస్తుంది.
కొండచరియలు విరిగిపడటం, వరదలు, మంచుదిబ్బల పర్యవేక్షణ
ప్రమాదకర ప్రాంతాల్లో ఏఐ-ఆధారిత ముందస్తు హెచ్చరిక వ్యవస్థలు కూడా పని చేస్తున్నాయి:
1. హిమాలయ ప్రాంతాలలో కొండచరియలు విరిగిపడటానికి మూడు గంటల ముందుగానే హెచ్చరికలను అందించే స్వదేశీ ఏఐ-ఆధారిత వ్యవస్థ అందుబాటులో ఉంది. ఈ వ్యవస్థ నేల తేమ, వర్షపాతం, గాలిలో తేమ, ఉష్ణోగ్రత, భూమి స్థానభ్రంశం కొలిచే తక్కువ ఖర్చుతో కూడిన సెన్సార్లను ఉపయోగిస్తుంది. ఈ డేటా 90% కంటే ఎక్కువ కచ్చితత్వంతో కూడిన మెషిన్ లెర్నింగ్ మోడల్‌కు అందుతుంది. హిమాచల్ ప్రదేశ్ అంతటా 60 కంటే ఎక్కువ చోట్ల స్థాపించిన ఈ విధానం మిల్లీమీటర్ స్థాయి వాలు కదలికలను కూడా గుర్తిస్తుంది. దిగుమతి చేసుకున్న సాంకేతికత ఖర్చులో కొంత భాగంతోనే స్థానికంగా లభించే భాగాలతో నిర్మించిన ఈ వ్యవస్థ విపత్తు సంసిద్ధతను బలోపేతం చేస్తుంది. ఇది భారతదేశంలోని కొండచరియలు విరిగిపడే ప్రాంతాలలో సమయానుకూలంగా ప్రజలను తరలించడానికి వీలు కల్పిస్తుంది.
2. ఇస్రో నిధులతో(2021-24) నడుస్తున్న ఇండియన్ ల్యాండ్ డేటా అసిమిలేషన్ సిస్టమ్(ఐఎల్‌డీఏఎస్) రిమోట్ సెన్సింగ్ డేటాను ఉపయోగించి భూ ఉపరితల స్థితిగతులను, వరద మైదానాల ముంపును అంచనా వేస్తుంది. ఫిజిక్స్ ఆధారిత మోడలింగ్, ఏఐ పద్ధతులను సమగ్రపరిచే వరద అంచనా వ్యవస్థలు గంగా, బ్రహ్మపుత్ర ప్రాంతాలలో నదీ పరివాహక ప్రాంతాల నిర్వహణను మెరుగుపరుస్తాయి. బ్రహ్మపుత్ర బేసిన్ కోసం ప్రభావ-ఆధారిత వరద అంచనాలను బ్రహ్మసతార్క్ అందిస్తుంది. కాగా జీబీఎం-క్లైంపాక్ట్ అనేది గంగా, బ్రహ్మపుత్ర, మేఘన బేసిన్లలో నీటి రంగం సంసిద్ధతను అంచనా వేసే వాతావరణ-ప్రభావ సాధనం.
మొత్తంగా ఈ ఏఐ-ప్రారంభిత వ్యవస్థలు ముందస్తు హెచ్చరిక సమయాన్ని పెంచుతాయి. తరలింపు ప్రణాళికను బలోపేతం చేస్తాయి. మౌలిక సదుపాయాల నష్టాన్ని తగ్గించడంతో పాటు వాతావరణ సున్నిత ప్రాంతాల్లోని బలహీన వర్గాలను రక్షిస్తాయి.
చివరి మైలు వాతావరణ సమాచారం: ప్రజలకు చేరువ
గ్రామ పంచాయతీ స్థాయి వాతావరణ అంచనా(జీపీఎల్‌డబ్ల్యూఎఫ్)ను పంచాయతీ రాజ్ మంత్రిత్వ శాఖ సహకారంతో ఐఎండీ ప్రారంభించింది. ఈ సేవ భారతదేశంలోని దాదాపు అన్ని గ్రామ పంచాయతీలను కవర్ చేస్తుంది. ఇది ఒకేసారి బహుళ వాతావరణ అంచనా నమూనాలను ఉపయోగిస్తుంది. రైతులు ఈ అంచనాలను ఇ-గ్రామ స్వరాజ్, మేరీ పంచాయతీ, మౌసం గ్రామ్ వంటి యాప్‌ల ద్వారా పొందవచ్చు. ఈ అంచనాలలో ఉష్ణోగ్రత, వర్షపాతం, తేమ, గాలి, మేఘాల సమాచారం ఉంటుంది. ఇది రైతులు విత్తనాలు వేయడం, కోత, నీటి పారుదల గురించి మెరుగైన నిర్ణయాలు తీసుకోవడంలో సహాయపడుతుంది.
2. భారత్ ఫోర్కాస్టింగ్ సిస్టమ్(భారత్ఎఫ్ఎస్)ను ప్రభుత్వం మే 27, 2025న ప్రారంభించింది. ఇది భారత్ నిర్మించిన వాతావరణ అంచనా నమూనా. ఇది గ్రామ స్థాయిలో చాలా వివరణాత్మక అంచనాలను అందిస్తుంది. భారత్ఎఫ్ఎస్ 6 కి.మీ రిజల్యూషన్ కలిగి ఉంది. ఇది మునుపటి 12 కి.మీ రిజల్యూషన్ కంటే మెరుగైనది. ఇది 10 రోజుల ముందుగానే వర్షపాతాన్ని అంచనా వేయగలదు. ఇది రైతులు, విపత్తు నిర్వాహకులు, ప్రజలు మెరుగ్గా సిద్ధపడటానికి సహాయపడుతుంది.
వాతావరణం కోసం అభివృద్ధి చెందుతున్న ఏఐ సాధనాలు
1. మౌసంజీపీటీ(జెనెరేటీవ్ ప్రీ ట్రెయిన్డ్ ట్రాన్స్‌ఫార్మర్) అనే ఏఐ చాట్‌బాట్‌ను వాతావరణం గురించి రైతులకు, ఇతరులకు సలహా ఇవ్వడానికి ప్రభుత్వం అభివృద్ధి చేస్తోంది. వర్షపాత నమూనాలను అంచనా వేయడంలో ప్రభుత్వం ఏఐ పరిశోధనలను నిర్వహిస్తోంది. మంటలు, పొగమంచు, మెరుపులు, ఉరుములతో కూడిన వర్షాలను అంచనా వేయడానికి ఏఐ ఉపయోగిస్తున్నారు. వాతావరణ వ్యవస్థలలో వర్షపు అంచనాలను మెరుగుపరచడంలో డీప్ లెర్నింగ్ సహాయపడుతుంది.
2. ఏఐ ద్వారా తీరప్రాంత, సముద్ర మట్టం పర్యవేక్షణ భారతదేశం వాతావరణ ముప్పులను ఎదుర్కోనేలా సిద్ధపడటానికి సహాయపడుతుంది. భారతదేశ తీరప్రాంతాల వెంబడి పెరుగుతున్న సముద్ర మట్టాల వల్ల ఏ ప్రాంతాలు ప్రభావితం కావచ్చో ఏఐ గుర్తిస్తోంది. ఇది నగర ప్రణాళికాకర్తలు ఈ మార్పులను తట్టుకోగల మెరుగైన నగరాలను రూపొందించడంలో సహాయపడుతుంది. తద్వారా ప్రజలు భవిష్యత్తు ప్రమాదాల నుంచి తమను తాము సిద్ధం చేసుకుని రక్షించుకోగలరు.
అధిక-నాణ్యతమైన వాతావరణ సమాచారాన్ని అందరికీ అందుబాటులోకి తేవడం ద్వారా భారతదేశం సమాజ స్థాయిలో స్థితిస్థాపకతను నింపుతోంది.
ఏఐ-ఆధారిత అటవీ నిఘా, పరిరక్షణ
1. అటవీ ప్రాంతాల చుట్టూ మోహరించిన కెమెరాల నుంచి రియల్ టైమ్ ఫుటేజీని విశ్లేషించడానికి మెషిన్ విజన్(ఎంవీ), కృత్రిమ మేధను ఉపయోగించే అధునాతన నిఘా, పర్యవేక్షణ సాంకేతికతల ద్వారా ఏఐ భారతీయ అడవులను రక్షిస్తుంది.
2. అడవిలో కార్చిచ్చు, వాటికి కారణమయ్యే మానవ కార్యకలాపాల పట్ల ఏఐ ఒక బలమైన ముందస్తు హెచ్చరిక వ్యవస్థగా పనిచేస్తుంది. మంటలు వ్యాపించకముందే వాటిని నిరోధించడానికి లేదా అరికట్టడానికి ఇది సహాయపడుతుంది. ప్రపంచవ్యాప్తంగా జరిగే అడవి కార్చిచ్చులకు కారణాల్లో 75 శాతం మనుషులే బాధ్యులు కాబట్టి ఇది చాలా కీలకం.
3. అటవీ సరిహద్దుల వెంబడి ఏర్పాటు చేసిన ఏఐ, ఎంవీతో కూడిన కెమెరాలు అటవీ ప్రాంతాలను దాటి బయటకు వచ్చే జంతువులను గుర్తిస్తాయి. తద్వారా అటవీ పర్యావరణ వ్యవస్థ ఆరోగ్యానికి ముప్పు కలిగించే మానవ-వన్యప్రాణి సంఘర్షణలను నివారించడంలో సహాయపడతాయి.
4. ఏఐ పర్యవేక్షణ సాంకేతికతలు రక్షిత అటవీ ప్రాంతాలలో అక్రమ ఆక్రమణలు, చెట్ల నరికివేత కార్యకలాపాలను గుర్తిస్తాయి.
సమీకృత ఉపగ్రహ, డ్రోన్, గ్రౌండ్-సెన్సార్ వ్యవస్థలు పరిరక్షణ పాలనను బలోపేతం చేస్తున్నాయి. కార్బన ఉద్గారాలను తగ్గించే సహజ పద్ధతులను కాపాడుతున్నాయి.

గాలి, నీటి ప్రమాద నిర్వహణలో ఏఐ ఆవిష్కరణలు
1. నిరంతర వాయు నాణ్యత పర్యవేక్షణ:
ఐఐటీ కాన్పూర్ ఐరావత్ రీసెర్చ్ ఫౌండేషన్ సుస్థిర నగరాల కోసం ఏఐ-ఆధారిత పరిశోధనలు, పరిష్కారాలను ముందుకు తీసుకెళ్లడానికి ఐఐటీ ఢిల్లీతో ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ సహకారం గాలి నాణ్యత, శక్తి, మొబిలిటీ, మౌలిక సదుపాయాలు, వ్యర్థాల నిర్వహణ, డిజిటల్ గవర్నెన్స్ సహా కీలకమైన పట్టణ సవాళ్లపై దృష్టి పెడుతుంది. సాంకేతికతతో నడిచే ఆవిష్కరణల ద్వారా తెలివైన, ఆరోగ్యకరమైన, మరింత స్థితిస్థాపక నగరాలను నిర్మించాలనే లక్ష్యంతో నిరంతరం గాలి, బయోరోసోల్ పర్యవేక్షణ కోసం ఏఐ-ప్రారంభిత సెన్సార్ వ్యవస్థలను అభివృద్ధి చేయడం ప్రధాన కార్యక్రమాలలో ఒకటి. బహుళ-మూలాల పట్టణ డేటాను ఏకీకృతం చేయడం ద్వారా వాతావరణాన్ని తట్టుకోగల, పర్యావరణపరంగా సుస్థిరమైన నగరాలను నిర్మించడంలో ఏఐ దోహదపడుతుంది.
2. భూగర్భ జలాలు, తాగునీటి ముప్పు గుర్తింపు
గంగా తీరంలో లక్షలాది మందిని ప్రభావితం చేస్తున్న సంక్షోభాన్ని పరిష్కరిస్తూ భారతదేశ తాగునీటిలో ఆర్సెనిక్ కాలుష్యాన్ని గుర్తించడానికి ఐఐటీ ఖరగ్‌పూర్ పరిశోధకులు ఏఐ-ఆధారిత అంచనా నమూనాను అభివృద్ధి చేశారు. పర్యావరణ, భౌగోళిక, మానవ వినియోగ డేటాపై ఏఐ అల్గారిథమ్‌లను ఉపయోగించి, భూగర్భ జలాల్లో ఆర్సెనిక్ విస్తరణ, ఆరోగ్య ప్రమాదాలను అంచనా వేసింది. డెల్టా ప్రాంతంలో అధిక, తక్కువ ఆర్సెనిక్ జోన్లను పరిశోధకులు గుర్తించారు. ప్రాంతీయ స్థాయి ప్రమాదానికి ‘సర్ఫిషియల్ అక్విటార్డ్ మందం’, ‘భూగర్భ జల ఆధారిత నీటి పారుదల’కు బలమైన సంబంధం ఉందని ఈ మోడల్ చూపిస్తుంది. ఈ చట్రం పశ్చిమ బెంగాల్ వంటి ఆర్సెనిక్ ప్రభావిత ప్రాంతాలలో సురక్షితమైన తాగునీటి వనరులను గుర్తించడంలో సహాయపడుతుంది. మెరుగ్గా భూగర్భ జల వనరుల ఎంపికను ప్రారంభించడం ద్వారా ప్రభుత్వ జల్ జీవన్ మిషన్‌కు మద్దతు ఇస్తుంది.
పర్యావరణ పరిరక్షణ పట్ల భారతదేశ విధానాన్ని ఏఐ మారుస్తోంది. సుస్థిర అభివృద్ధికి, ఆరోగ్యకరమైన సమాజాలకు మార్గం సుగమం చేస్తోంది.
ముగింపు
ఏఐ-ఆధారిత వాతావరణ పరిష్కారాలలో భారతదేశం ప్రపంచ దేశాలకు నాయకత్వం వహిస్తోంది. దేశం సంస్థాగత ఆవిష్కరణలు, బలమైన బహుపాక్షిక భాగస్వామ్యాలను చేసుకుంది. భారతదేశం ఇప్పుడు గ్రామస్థాయిలో వాతావరణ అంచనాలను అందిస్తోంది. ఈ అంచనాలు దాదాపు ప్రతి పంచాయతీకి చేరుతున్నాయి. స్వదేశీ భారత్ ఫోర్కాస్టింగ్ సిస్టమ్ 6 కి.మీ రిజల్యూషన్ అంచనాలను అందిస్తుంది. ఇది దేశవ్యాప్తంగా వాతావరణ సమాచార ప్రాప్తిని అందరికీ అందుబాటులోకి తెస్తుంది. దేశం ఏఐ మౌలిక సదుపాయాలలో గణనీయంగా పెట్టుబడి పెట్టింది. ఇందులో 22 పెటాఫ్లాప్స్ కంప్యూటింగ్ సామర్థ్యం కూడా ఒకటి. ఈ పెట్టుబడులు, ఆవిష్కరణలు.. అంతర్జాతీయ సహకారం పట్ల భారతదేశ నిబద్ధతను తెలియజేస్తాయి. భారతదేశం 2070 నాటికి నికర-సున్నా ఉద్గారాల లక్ష్యం దిశగా పని చేస్తోంది. ఏఐ-ఆధారిత పరిష్కారాలు అనేక రంగాలలో సహాయపడతాయి. వీటిలో పునరుత్పాదక ఇంధన ఆప్టిమైజేషన్, సుస్థిర వ్యవసాయం, విపత్తు అంచనా ఉన్నాయి. ఇవి కేవలం సాంకేతిక విజయాలు మాత్రమే కాదు. వాతావరణ ఆటుపోట్లు తట్టుకునే శక్తిని నిర్మించడానికి ఇవి అవసరమైన సాధనాలు. వాతావరణ మార్పులతో పోరాడటంలో ఏఐ ఒక శక్తిమంతమైన సాధనంగా మారుతుందని భారతదేశం నిరూపిస్తోంది. గ్లోబల్ సౌత్‌లోని బలహీన వర్గాలకు ఇది చాలా ముఖ్యం.
References:
India AI
https://indiaai.gov.in/article/ai-and-climate-action-in-india-a-strategic-perspective-in-2025
https://indiaai.gov.in/article/the-intersection-of-ai-and-climate-change-innovations-for-a-sustainable-future
https://indiaai.gov.in/case-study/ai-based-prediction-model-for-detecting-arsenic-in-india-s-drinking-water
https://indiaai.gov.in/article/iit-bhubaneswar-developed-an-ai-model-to-enhance-rain-forecast-accuracy
Press Information Bureau
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2216805 &r
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2158416®=3&lang=2
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2158416®=3&lang=2#:~:text=On%2027%20May%202025%2C%20the,the%20short%20and%20medium%20range.
Indian Institute of Technology
https://acr.iitm.ac.in/iitm_in_news/researchers-at-iit-madras-come-up-with-climate-model-for-indian-regions/
https://iitk.ac.in/kss/index.php/mou/34-sign-mou-with-iit-delhi
https://www.iitb.ac.in/research-highlight/novel-spatially-aware-ai-model-makes-hurricane-damage-assessment-more-accurate
https://dcecm.iitd.ac.in/
https://home.iitd.ac.in/show.php?id=71&in_sections=Research#:~:text=New%20Delhi:%20Two%20recent%20studies,resource%20management%20across%20South%20Asia
https://hydrosense.iitd.ac.in/research/
Department of Science and Technology
https://dst.gov.in/satellite-based-real-time-monitoring-himalayan-glacial-catchments-can-strengthen-early-flood-warning
Ministry of Earth Sciences
https://www.moes.gov.in/schemes/mission-mausam
https://mausam.imd.gov.in/event/mission_mausam.pdf
Niti Aayog
https://frontiertech.niti.gov.in/story/low-cost-indigenous-sensors-ai-deliver-real-time-landslide-alerts-across-himalayan-slopes/
Other
https://www.investindia.gov.in/team-india-blogs/role-technology-protection-forests-climate-change-mitigation
https://www.digitalindia.gov.in/initiative/global-partnership-on-artificial-intelligence/
Click here to see pdf
***
(Explainer ID: 157487)
आगंतुक पटल : 3
Provide suggestions / comments