Technology
భారతదేశ డ్రోన్ వ్యవస్థ
విధానాల నుంచి ప్రజా సేవల పరివర్తన
Posted On:
17 FEB 2026 10:02AM
కీలకాంశాలు
- ఫిబ్రవరి 2026 నాటికి భారత్ 38,500కు పైగా నమోదిత డ్రోన్‌లు(యూఐఎన్), 39,890 డీజీసీఏ-ధ్రువీకృత పైలట్లు, 244 ఆమోదిత శిక్షణ సంస్థలతో ఒక క్రమబద్ధమైన డ్రోన్ వ్యవస్థను నిర్మించింది.
- స్వమిత్వ పథకం కింద డ్రోన్‌లను ఉపయోగించి 3.28 లక్షల గ్రామాలను సర్వే చేశారు. 31 రాష్ట్రాల్లోని 1.82 లక్షల గ్రామాలకు సంబంధించి 2.76 కోట్ల ఆస్తి కార్డులను సిద్ధం చేశారు.
- నమో డ్రోన్ దీదీ కార్యక్రమం కింద 500కు పైగా డ్రోన్‌లు సహా మొత్తం 1,094 డ్రోన్‌లను మహిళా స్వయం సహాయక సంఘాలకు పంపిణీ చేశారు. ఇది వ్యవసాయ ఉత్పాదకతను, జీవనోపాధిని మెరుగుపరుస్తుంది.
పరిచయం
గత రెండు దశాబ్దాలలో డ్రోన్ సాంకేతికత ప్రపంచవ్యాప్తంగా ఒక శక్తిమంతమైన సాధనంగా ఎదిగింది. భారతదేశం తన పాలన, అభివృద్ధి రంగాలలో దీని సామర్థ్యాన్ని వేగంగా ఉపయోగించుకుంటోంది. ప్రయోగాత్మకంగా ప్రారంభమైన ఈ ప్రయాణం ఇప్పుడు ప్రభుత్వ సేవలు, మౌలిక సదుపాయాల నిర్వహణ, వ్యవసాయం, జాతీయ భద్రత వంటి రంగాలలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చే స్థాయికి చేరుకుంది.
నేడు భారతదేశంలో భూమి, ఆస్తి సర్వేలు, ఆధునిక వ్యవసాయం, మౌలిక సదుపాయాల తనిఖీ, విపత్తు నిర్వహణ, రైల్వే, హైవేల పర్యవేక్షణ వంటి పనుల కోసం డ్రోన్‌లను ఉపయోగిస్తున్నారు. పెరుగుతున్న డ్రోన్‌ల వినియోగం తయారీదారులు, సాఫ్ట్‌వేర్ డెవలపర్లు, శిక్షణ సంస్థలు, అంకుర సంస్థలు, పరిశోధన సంస్థలు, ధ్రువీకృత పైలట్‌లతో కూడిన సమగ్ర వ్యవస్థను ప్రతిబింబిస్తోంది. ఈ వ్యవస్థ ప్రభుత్వ నిబంధనలకు లోబడి పని చేస్తోంది.
సరళీకృత విధాన నిర్ణయాలు డ్రోన్ వ్యవస్థ విస్తరణకు దోహదపడుతున్నాయి. ప్రభుత్వం తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాల వల్ల ఈ రంగం ఇంతగా అభివృద్ధి చెందింది. సరళీకృతమైన డ్రోన్ నియమాలు, 'డిజిటల్ స్కై' సింగిల్ విండో ప్లాట్‌ఫారమ్, తయారీదారులకు ఇచ్చే ప్రోత్సాహకాలు, లక్షిత నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు, డ్రోన్ వినియోగాన్ని సామాన్యులకు కూడా అందుబాటులోకి తీసుకువచ్చాయి. ప్రభుత్వ పథకాల్లో డ్రోన్‌లను చేర్చడం వల్ల పనులు మరింత వేగంగా, పారదర్శకగా జరుగుతున్నాయి.
డ్రోన్ సాంకేతికతల ద్వారా పౌర సేవల పంపిణీలో మార్పు
భారతదేశంలో సమర్థవంతమైన, వేగవంతమైన పౌర సేవల పంపిణీకి డ్రోన్ సాంకేతికత ఒక కీలక సాధనంగా మారింది. సర్వే ఆఫ్ విలేజెస్ అండ్ మ్యాపింగ్ విత్ ఇంప్రువైజ్డ్ టెక్నాలజీ ఇన్ విలేజ్ ఏరియాస్(స్వమిత్వ), ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన(పీఎంఎఫ్‌బీవై) వంటి ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకాలలో డ్రోన్లను అనుసంధానించడం ద్వారా పాలనలో చురుకుదనం, కచ్చితత్వం, పారదర్శకత పెరుగుతున్నాయి. భూసర్వేలు, పంటల అంచనా, మౌలిక సదుపాయాల పర్యవేక్షణ, విపత్తు నిర్వహణ, రక్షణ రంగాలలో వీటి వినియోగం కేవలం సేవా పంపిణీని మెరుగుపరచడమే కాకుండా, ప్రభుత్వ కార్యక్రమాలలో డ్రోన్ల వినియోగాన్ని వేగవంతం చేస్తూ, ప్రతి స్థాయిలోనూ ఆవిష్కరణలను, సామర్థ్యాన్ని పెంపొందిస్తోంది.
1. వ్యవసాయం, రైతు సేవలు: నవంబర్ 2023లో ప్రారంభించిన 'నమో డ్రోన్ దీదీ' పథకం భారత ప్రభుత్వపు ప్రతిష్టాత్మక పథకం. ఆధునిక వ్యవసాయ పద్ధతులకు మద్దతుగా మహిళా స్వయం సహాయక సంఘాలకు(ఎస్‌హెచ్‌జీ) డ్రోన్లను అందించడం ఈ పథకం లక్ష్యం. వ్యవసాయ సామర్థ్యాన్ని మెరుగుపరచడం, పంట ఉత్పాదకతను పెంచడం, పెట్టుబడి ఖర్చులను తగ్గించడం, మహిళలకు స్థిరమైన జీవనోపాధి అవకాశాలను కల్పించడం దీని ప్రధాన ఉద్దేశ్యాలు.

వ్యవసాయం, రైతు సేవల్లో నమో డ్రోన్ దీదీ ప్రభావం
- పథకం ప్రారంభమైనప్పటి నుంచి ప్రముఖ ఎరువుల కంపెనీల ద్వారా మహిళా స్వయం సహాయక సంఘాలకు 1,094 డ్రోన్లు పంపిణీ అయ్యాయి. ఇందులో నమో డ్రోన్ దీదీ పథకం కింద అందించినవి 500కు పైగా డ్రోన్లు ఉన్నాయి.
- నమో డ్రోన్ దీదీ పథకం శ్రమతో కూడిన పాత పద్ధతుల నుంచి కచ్చితమైన వ్యవసాయం వైపు గణనీయమైన మార్పును సూచిస్తుంది.
- ఉత్తరప్రదేశ్‌లోని సీతాపూర్‌కు చెందిన ఒక డ్రోన్ దీదీ మన్ కీ బాత్ 110వ ఎపిసోడ్‌లో మాట్లాడుతూ.. డ్రోన్ శిక్షణ ద్వారా తన స్వయం సహాయక సంఘం రైతులకు మందులు పిచికారీ చేసే సేవలను అందిస్తూ ఆదాయాన్ని, సామాజిక సాధికారతను ఎలా పొందారో వివరించారు.
2. భూ మ్యాపింగ్: సర్వే ఆఫ్ విలేజెస్ అండ్ మ్యాపింగ్ విత్ ఇంప్రువైజ్డ్ టెక్నాలజీ ఇన్ విలేజ్ ఏరియాస్(స్వమిత్వ) పథకంలో డ్రోన్ సాంకేతికత ప్రధాన భూమిక పోషిస్తోంది. ఈ పథకాన్ని ఏప్రిల్ 2020లో ప్రారంభించారు. దీనిని పంచాయతీ రాజ్ మంత్రిత్వ శాఖ, రాష్ట్ర ప్రభుత్వాలు, సర్వే ఆఫ్ ఇండియా సంయుక్తంగా అమలు చేస్తున్నాయి. భూ వివాదాలను పరిష్కరించడానికి, బ్యాంకు రుణాలు పొందడాన్ని సులభతరం చేయడానికి గ్రామీణ ఆబాదీ ప్రాంతాలలో డ్రోన్ ఆధారిత మ్యాపింగ్ కోసం ఈ పథకం ఉద్దేశించింది.
స్వమిత్వ పథకం ప్రభావం
- ఈ పథకం కింద దాదాపు 3.44 లక్షల గ్రామాల్లో సర్వే చేయాలనేది లక్ష్యం.
- డిసెంబర్ 2025 నాటికి 3.28 లక్షల గ్రామాల్లో డ్రోన్ సర్వే పూర్తయింది. ఇది మొత్తం లక్ష్యంలో సుమారు 95%.
- డిసెంబర్ 2025 నాటికి 31 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 1.82 లక్షల గ్రామాలకు సంబంధించి 2.76 కోట్ల ఆస్తి కార్డులు సిద్ధమయ్యాయి.
- మార్చి 2025 నాటికి 31 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేశాయి.
3. హైవే అభివృద్ధి కోసం ఏరియల్ మ్యాపింగ్: నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఎన్‌హెచ్ఏఐ) అన్ని హైవే ప్రాజెక్టుల కోసం ప్రతి నెలా డ్రోన్-వీడియో రికార్డింగ్‌లను తప్పనిసరి చేసింది. కాంట్రాక్టర్లు ప్రస్తుత నెల, అంతకుముందు నెల ఫుటేజీని నెలవారీ పోలిక కోసం ఎన్‌హెచ్ఏఐ డేటాబేస్‌లో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. పర్యవేక్షణ కన్సల్టెంట్లు ఈ రికార్డింగ్‌లను విశ్లేషించి డిజిటల్ నెలవారీ పురోగతి నివేదికలలో అభిప్రాయాన్ని అందిస్తారు. ప్రాజెక్ట్ డైరెక్టర్లు భౌతిక తనిఖీల సమయంలో వీటిని మరోసారి పరిశీలిస్తారు. డేటా లేక్‌లో స్టోర్ చేసిన డ్రోన్ వీడియోలు శాశ్వత రికార్డుగా ఉపయోగపడతాయి. ఇవి ఆర్బిట్రల్ ట్రిబ్యునళ్లు, కోర్టులలో వివాద పరిష్కారానికి సాక్ష్యంగా కూడా ఉపయోగపడతాయి.
4. విపత్తు నిర్వహణ, అత్యవసర ప్రతిస్పందనలో డ్రోన్ల వినియోగం: ప్రకృతి విపత్తుల సమయంలో భారతదేశం మెరుగ్గా స్పందించడానికి డ్రోన్లు సహాయపడుతున్నాయి. నార్త్ ఈస్ట్ సెంటర్ ఫర్ టెక్నాలజీ అప్లికేషన్ అండ్ రీచ్ (నెక్టార్) విపత్తు పరిస్థితుల కోసం ప్రత్యేక డ్రోన్ వ్యవస్థను అభివృద్ధి చేసింది. ఈ డ్రోన్ గాలిలో ఎక్కువ సేపు స్థిరంగా ఉండగలదు. బరువైన పరికరాలను మోయగలదు. వరదలు, కొండచరియలు విరిగిపడటం వంటి విపత్తుల సమయంలో ప్రభావిత ప్రాంతాలను పర్యవేక్షించడానికి దీనిని ఉపయోగిస్తారు. ఈ డ్రోన్ ఆకాశం నుంచి ప్రత్యక్ష దృశ్యాలను పంపుతుంది. ఇది సహాయక బృందాలకు పరిస్థితిని త్వరగా అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది. దీనివల్ల గాలింపు, సహాయక చర్యలు వేగంగా, మెరుగైన సమన్వయంతో జరుగుతాయి.
5. రైల్వే డ్రోన్ పర్యవేక్షణ: రైల్వే ట్రాక్‌లు, వంతెనలు, ఇతర మౌలిక సదుపాయాల పర్యవేక్షణ, నిర్వహణ కోసం యూఏవీలు/డ్రోన్లను మోహరించాలని రైల్వే మంత్రిత్వ శాఖ తన అన్ని జోన్లు, విభాగాలను ఆదేశించింది. వెస్ట్ సెంట్రల్ రైల్వే మొదటి కెమెరాలను కొనుగోలు చేసి ట్రయల్స్ నిర్వహించింది. దీనివల్ల చేరుకోవడానికి కష్టతరమైన ప్రాంతాలను తనిఖీ చేయడంతో పాటు ట్రాక్ పర్యవేక్షణ సామర్థ్యం మెరుగుపడింది. జోనల్ రైల్వేలు, ప్రభుత్వ రంగ సంస్థలు కూడా క్రమబద్ధమైన నిర్వహణ కోసం యూఏవీ వ్యవస్థలను ఏర్పాటు చేశాయి.
మీకు తెలుసా?
రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్(ఆర్‌పీఎఫ్) రైలు యార్డులు, స్టేషన్ ప్రాంగణాలు, రైల్వే ట్రాక్‌ల వెంబడి భద్రతా నిఘా కోసం డ్రోన్లను వినియోగిస్తోంది. ఈ డ్రోన్లు రియల్ టైమ్ ట్రాకింగ్, వీడియో స్ట్రీమింగ్, వైమానిక పర్యవేక్షణను అందిస్తాయి. ఇవి రద్దీ నిర్వహణ, అక్రమ ప్రవేశాల నిరోధక కార్యకలాపాలకు ఉపయోగపడతాయి.

6. రక్షణ రంగంలో డ్రోన్లు: భారతదేశ రక్షణలో డ్రోన్లు కీలక పాత్ర పోషిస్తున్నాయి. సరిహద్దులను పర్యవేక్షించడంలో, సమాచారాన్ని సేకరించడంలో, కచ్చితమైన దాడులను నిర్వహించడంలో ఇవి సాయుధ దళాలకు సహాయపడతాయి. ఆపరేషన్ సిందూర్ సమయంలో, భారతీయ డ్రోన్లు, లోయిటరింగ్ మ్యునిషన్లు శత్రు లక్ష్యాలను సురక్షితంగా, కచ్చితంగా ధ్వంసం చేశాయి. డ్రోన్లు వైమానిక రక్షణ వ్యవస్థలు, రాడార్ నెట్‌వర్క్‌లు, కమాండ్ సెంటర్లతో కలిసి పనిచేస్తూ కీలక మౌలిక సదుపాయాలను రక్షించడంలో, ముప్పులకు త్వరగా స్పందించడంలో తోడ్పడుతున్నాయి.
భారతదేశంలో డ్రోన్లు వివిధ రంగాలలో సామాజిక-ఆర్థిక అభివృద్ధి ఫలితాలను అందిస్తున్నాయి. వ్యవసాయంలో వీటి వినియోగం మహిళా రైతులకు సాధికారత కల్పించడమే కాకుండా పంట నష్టాల అంచనాను మెరుగుపరిచింది, మౌలిక సదుపాయాలు, పట్టణ ప్రణాళికలో ఇవి చురుకైన పర్యవేక్షణ, మెరుగైన వనరుల నిర్వహణకు వీలు కల్పించాయి. విపత్తు నిర్వహణ, జాతీయ భద్రతలో, డ్రోన్లు సంసిద్ధతను, వేగవంతమైన ప్రతిస్పందన సామర్థ్యాలను బలోపేతం చేశాయి. మొత్తంగా చూస్తే ఈ అప్లికేషన్లు డ్రోన్ సాంకేతికతను భవిష్యత్తుకు సిద్ధంగా ఉన్న పరిష్కారంగా, భారతదేశంలో పారదర్శకమైన, సమర్థవంతమైన పాలనకు మార్గదర్శిగా నిలుపుతున్నాయి.
విధానాలు, కార్యక్రమాలు, సంస్కరణల ద్వారా భారతదేశంలో వేగవంతంగా డ్రోన్ వినియోగం
డ్రోన్ల తయారీ, వినియోగాన్ని వేగవంతం చేయడానికి భారత ప్రభుత్వం సమగ్ర విధానపరమైన, ఆర్థిక చట్రాన్ని ఏర్పాటు చేసింది. ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి, నిబంధనల అమలును సులభతరం చేయడానికి, స్వదేశీ ఉత్పత్తిని బలోపేతం చేయడానికి ఈ చర్యలు రూపొందాయి.
1. డ్రోన్ రూల్స్-2021, డ్రోన్ (సవరణ) రూల్స్-2022 & 2023: డ్రోన్ రూల్స్-2021, 2022, 2023లో ప్రవేశపెట్టిన సవరణలు భారతదేశ డ్రోన్ వ్యవస్థను గణనీయంగా సరళీకరించాయి.
- నియంత్రణ విధానాలు సులభతరం అయ్యాయి. ఫారమ్‌ల సంఖ్యను 25 నుంచి 5కి తగ్గించారు. అనుమతుల అవసరాలను 72 నుంచి కేవలం 4 కి తగ్గించారు.
- ఫీజుల హేతుబద్ధీకరణ జరిగింది. డ్రోన్ పరిమాణంతో సంబంధం లేకుండా ఫీజుల నిర్ణయం జరిగింది.
- 500 కేజీల బరువున్న డ్రోన్ల వరకు పౌర డ్రోన్ కార్యకలాపాలకు అనుమతి ఇవ్వడమైంది. దీనివల్ల వాణిజ్య, పారిశ్రామిక అనువర్తనాలు విస్తరించాయి.
- భారతీయ గగనతలంలో దాదాపు 90% గ్రీన్ జోన్‌గా ప్రకటించిడమైంది. ఇది 400 అడుగుల వరకు విమాన ప్రయాణాలకు అనుమతినిస్తుంది.
- సాంప్రదాయ పైలట్ లైసెన్స్ అవసరానికి బదులుగా డీజీసీఏ జారీ చేసే రిమోట్ పైలట్ సర్టిఫికేట్ ప్రవేశపెట్టడమైంది.
- పాస్‌పోర్ట్ అవసరం తొలగించడమైంది. ప్రభుత్వం జారీ చేసిన ఏదైనా ఐడీ, అడ్రస్ ప్రూఫ్ ఉంటే డ్రోన్లను నడపడానికి సరిపోతుంది.
మొత్తంగా ఈ సంస్కరణలు డ్రోన్ రంగంలోకి ప్రవేశించే అడ్డంకులను గణనీయంగా తగ్గించాయి. గ్రామీణ, వాణిజ్య పరంగా వీటి స్వీకరణను ప్రోత్సహించాయి. డ్రోన్-యాస్-ఏ-సర్వీస్ నమూనాల వృద్ధికి మద్దతునిచ్చాయి.

2. ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకం(పీఎల్ఐ): డ్రోన్లు, డ్రోన్ విడిభాగాల కోసం పీఎల్ఐ పథకానికి కేంద్రం రూ.120 కోట్లు కేటాయించింది. స్థానిక ఉత్పత్తిని ప్రోత్సహించడం ద్వారా అధిక విలువ కలిగిన స్వదేశీ తయారీని ప్రోత్సహించడం దీని లక్ష్యం. ఈ పథకం భారతీయ అంకుర సంస్థలు, ఎంఎస్ఎంఈలు తమ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకోవడానికి, దేశీయ డ్రోన్ తయారీ వ్యవస్థను బలోపేతం చేయడానికి వీలు కల్పిస్తుంది.
3. డ్రోన్లపై జీఎస్టీ: సెప్టెంబర్ 2025లో డ్రోన్లపై జీఎస్టీని ఏకరీతిగా 5 శాతానికి తగ్గించారు. అంతకుముందు ఉన్న 18%, 28% పన్ను రేట్లు తొలగించారు. ఈ సరళీకృత పన్ను విధానం డ్రోన్ల విస్తృత వాణిజ్య, వ్యక్తిగత వినియోగానికి మద్దతు ఇస్తుంది. నెక్స్ట్-జెన్ జీఎస్టీ సంస్కరణలు డ్రోన్ పైలట్ శిక్షణ కోసం ఉపయోగించే ఫ్లైట్, మోషన్ సిమ్యులేటర్లకు కూడా వర్తిస్తాయి. దీనివల్ల శిక్షణ సంస్థల ఖర్చులు తగ్గి, డ్రోన్ రంగంలో నైపుణ్యాభివృద్ధి మరింత బలోపేతం అవుతుంది.
4. డిజిటల్ స్కై-2018, ఈజీసీఏ: డ్రోన్ రిజిస్ట్రేషన్, రిమోట్ పైలట్ సర్టిఫికేషన్, టైప్ సర్టిఫికేషన్, ఆర్టీపీఓ అధికారాల వంటి నియంత్రణ సేవలు డిజిటల్ స్కై ప్లాట్‌ఫారమ్ నుంచి ఈజీసీఏకి మార్చారు. విమాన ప్రణాళిక, ఎయిర్‌స్పేస్ మ్యాప్ వంటి కార్యాచరణ సేవలు డిజిటల్ స్కై ప్లాట్‌ఫారమ్‌తో అనుసంధానితమై కొనసాగుతున్నాయి.
డిజిటల్ స్కై వేదిక కీలక విజయాలు
- ఫిబ్రవరి 9, 2026 నాటికి 38,575 డ్రోన్లు విజయవంతంగా నమోదయ్యాయి. వాటికి విశిష్ట గుర్తింపు సంఖ్య(యూఐఎన్) జారీ అయ్యింది.
- ఫిబ్రవరి 2026 నాటికి 39,890 రిమోట్ పైలట్ సర్టిఫికేట్లు(ఆర్‌పీసీలు) జారీ అయ్యాయి. ఇవి దేశవ్యాప్తంగా ధ్రువీకరించిన డ్రోన్ కార్యకలాపాలకు వీలు కల్పిస్తున్నాయి.
- ఫిబ్రవరి 2026 నాటికి డీజీసీఏ దేశవ్యాప్తంగా 244 రిమోట్ పైలట్ శిక్షణ సంస్థలను(ఆర్‌పీటీఓ) ఆమోదించింది. ఇది పైలట్ శిక్షణ, నైపుణ్యాభివృద్ధి కోసం సంస్థాగత సామర్థ్యాన్ని బలోపేతం చేసింది.
5. ప్రతిష్టాత్మక కార్యక్రమాల ద్వారా వ్యవస్థ అభివృద్ధి, సామర్థ్య నిర్మాణం:
- భారత్ డ్రోన్ శక్తి, భారత్ డ్రోన్ మహోత్సవ్, డ్రోన్ ఇంటర్నేషనల్ ఎక్స్‌పో వంటి వేదికలు డ్రోన్-యాస్-ఏ-సర్వీస్(డీఏఏఎస్) స్టార్టప్‌లను, కొత్త వ్యాపార నమూనాలను ప్రోత్సహిస్తాయి. ఇవి స్వదేశీ సాంకేతికతలను ప్రదర్శిస్తాయి. అంకుర సంస్థలు, ఎంఎస్ఎంఈలు, పరిశ్రమలు, పరిశోధనా సంస్థల మధ్య సహకారాన్ని ప్రోత్సహిస్తాయి.
- డీజీసీఏ-ఆమోదిత శిక్షణా కార్యక్రమాలు, రిమోట్ పైలట్ శిక్షణ సంస్థలు(ఆర్‌టీపీఓ) కూడా దేశంలో ధ్రువీకరించిన డ్రోన్ పైలట్ల సంఖ్యను పెంచుతున్నాయి.
- స్వయాన్ అనేది మానవరహిత విమాన వ్యవస్థల్లో మానవ వనరుల అభివృద్ధి కోసం సామర్థ్య నిర్మాణ కార్యక్రమం. ఇది శిక్షణ, ప్రతిభను ప్రోత్సహిస్తుంది. ఇప్పటివరకు 857కి పైగా కార్యక్రమాలు నిర్వహించారు. దీనివల్ల 337 భాగస్వామ్యాలతో 26,000 కంటే ఎక్కువ మంది లబ్ధి పొందారు.
- నేషనల్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ ఫర్ డ్రోన్ అప్లికేషన్ అండ్ రీసెర్చ్(నైడార్) విద్యార్థులు, పరిశోధకులను భాగస్వాములను చేస్తుంది. ఇది విపత్తు నిర్వహణ, కచ్చితమైన వ్యవసాయం కోసం స్వయంప్రతిపత్తి కలిగిన డ్రోన్లను ప్రోత్సహిస్తుంది. ఈ ప్రోగ్రామ్ రూ.40 లక్షల బహుమతులను అందిస్తుంది. స్టార్టప్ ఇంక్యుబేషన్‌కు మద్దతు ఇస్తుంది.
పురోగతి కలిగిన నిబంధనలు, ఆర్థిక ప్రోత్సాహకాలు, ప్రత్యేక సామర్థ్య నిర్మాణ కార్యక్రమాల ద్వారా భారతదేశం డ్రోన్ల వినియోగం, తయారీని వేగవంతం చేసే సమగ్ర వ్యవస్థను సృష్టించింది. డ్రోన్ రూల్స్ కింద సరళీకృత నిబంధనలు, పీఎల్ఐ ద్వారా దేశీయ ఉత్పత్తికి మద్దతు, జీఎస్టీ తగ్గింపు, డిజిటల్ స్కై వంటి వేదికలు, నైపుణ్యాభివృద్ధి, ఆవిష్కరణ కార్యక్రమాలతో కలిసి డ్రోన్ల విస్తృత వాణిజ్య, పారిశ్రామిక, సామాజిక వినియోగానికి దారి తీస్తున్నాయి. స్వయం సమృద్ధి, భవిష్యత్తుకు సిద్ధంగా ఉండే రంగంగా మారుస్తున్నాయి.
ముగింపు
భారతదేశ డ్రోన్ వ్యవస్థ పైలట్ ప్రాజెక్టుల స్థాయి నుంచి ఒక ప్రధాన స్రవంతి, ఆవిష్కరణ-ఆధారిత రంగంగా మారింది. దీనికి ప్రగతిశీల విధానాలు, సరళీకృత నిబంధనలు, లక్ష్యిత ఆర్థిక ప్రోత్సాహకాలు వెన్నెముకగా నిలిచాయి. మహిళా వ్యవస్థాపకత, గ్రామీణ సదుపాయాలు, దేశీయ తయారీకి మద్దతు ఇచ్చే కార్యక్రమాలతో ప్రభుత్వం సాంకేతిక ఆవిష్కరణలను, విస్తృత వినియోగాన్ని ప్రోత్సహించే ఒక నిర్మాణాత్మక చట్రాన్ని రూపొందించింది. డ్రోన్లు ఇప్పుడు వ్యవసాయం, భూమి, ఆస్తి సర్వేలు, మౌలిక సదుపాయాల పర్యవేక్షణ, విపత్తు అంచనా, పౌర సేవల పంపిణీ వంటి కీలక రంగాలలో భాగమయ్యాయి. ఇవి పాలనలో సామర్థ్యాన్ని, పారదర్శకతను, కచ్చితత్వాన్ని పెంచే తమ సామర్థ్యాన్ని నిరూపించుకున్నాయి.
స్వదేశీ తయారీ విస్తరణ, రిమోట్ పైలట్ల నైపుణ్యాభివృద్ధి, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాలతో అనుసంధానం కావడం వల్ల సామాజిక-ఆర్థిక సాధికారత, మౌలిక సదుపాయాల పర్యవేక్షణ, జాతీయ భద్రత కోసం డ్రోన్లను ఉపయోగించుకోవడంలో భారతదేశం మెరుగైన స్థానంలో ఉంది. బడ్జెట్ కేటాయింపులు, ఆవిష్కరణ గ్రాంట్లు, వ్యూహాత్మక మోహరింపుతో సహా పెరుగుతున్న ప్రభుత్వ మద్దతుతో, భారతదేశం మానవరహిత విమాన వ్యవస్థల్లో ప్రపంచ దేశాలకు నాయకత్వం వహించడానికి సిద్ధంగా ఉంది. వాణిజ్య వృద్ధి, సాంకేతిక స్వయం ప్రతిపత్తి, సమగ్ర అభివృద్ధిని సమతుల్యం చేసే ఒక పటిష్టమైన పర్యావరణ వ్యవస్థను ఇది నిర్మిస్తోంది.
References
Press Information Bureau
Lok Sabha
Rajya Sabha
Ministry of Information and Broadcasting
National Highways Authority of India
Ministry of Civil Aviation
Others
Click here for pdf file.
****
(Explainer ID: 157458)
आगंतुक पटल : 15
Provide suggestions / comments