Farmer's Welfare
ఎరువుల సమతుల్య వినియోగం: సుస్థిర వ్యవసాయానికి కీలక సాధనం ఉత్పాదకత, నేల ఆరోగ్యం, పర్యావరణ బాధ్యతల అనుసంధానం
Posted On:
31 JAN 2026 10:25AM
కీలకాంశాలు
- సమతుల్య ఎరువుల వినియోగం అంటే పంట అవసరాలు, నేల సారం, ప్రస్తుత వాతావరణ పరిస్థితుల ఆధారంగా అన్ని ఆవశ్యక స్థూల పోషకాలు, సూక్ష్మ పోషకాలను తగిన నిష్పత్తులలో, పరిమాణంలో, సరైన సమయంలో, సరైన పద్ధతుల్లో అందించడం.
- భూసార కార్డు పథకం, పోషక ఆధారిత సబ్సిడీ, వేప పూత పూసిన యూరియా, అనుకూలీకరించిన, ఫోర్టిఫైడ్ ఎరువులు, నానో ఎరువులతో సహా అనేక కార్యక్రమాల ద్వారా భారత ప్రభుత్వం ఎరువుల సమతుల్య వినియోగాన్ని చురుకుగా ప్రోత్సహిస్తోంది.
- పునరుత్పాదక వ్యవసాయం నేల ఆరోగ్యాన్ని మెరుగుపరచడం ద్వారా, పోషకాల వినియోగ సామర్థ్యాన్ని పెంచడం ద్వారా సమతుల్య ఎరువుల వినియోగాన్ని బలపరుస్తుంది. ఇదే సమయంలో నష్టాలను తగ్గించి దీర్ఘకాలిక ఉత్పాదకతను నిలబెడుతుంది.
- భూసార పరీక్ష ఆధారిత సిఫార్సులు, అనుకూలీకరించిన ఎరువులు, సమీకృత పోషక నిర్వహణ విధానాలు మరింత కచ్చితమైన, సమర్థవంతమైన ఎరువుల వినియోగాన్ని సాధ్యం చేస్తాయి.
పరిచయం: సమతుల్య ఎరువుల వినియోగం వెనుక ఉన్న ఉద్దేశ్యం
హరిత విప్లవం భారతదేశ వ్యవసాయ చరిత్రలో ఒక నిర్ణయాత్మక మలుపు. 1960ల మధ్యకాలంలో ఎరువులకు బాగా స్పందించే, అధిక దిగుబడినిచ్చే వరి, గోధుమ రకాలను ప్రవేశపెట్టడం, విస్తరించిన నీటిపారుదల, రసాయన ఎరువుల వినియోగం మద్దతుతో, దేశాన్ని "పూట గడిచే" పరిస్థితి నుంచి స్వయం సమృద్ధి గల, చివరికి ఆహారాన్ని ఎగుమతి చేసే దేశంగా మార్చింది. ఆహార ధాన్యాల ఉత్పత్తిలో ఈ వేగవంతమైన వృద్ధి జాతీయ ఆహార భద్రతను నిర్ధారించడమే కాకుండా ఆకలిని గణనీయంగా తగ్గించి, గ్రామీణ జీవనోపాధిని మెరుగుపరిచింది. భారతదేశాన్ని ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఒక నమూనాగా నిలిపింది.
అయితే, ఈ ఉత్పాదకత లాభాలకు ఆధారమైన సాగు తీవ్రత క్రమంగా దాని పరిమితులను బయటపెట్టింది. నిరంతర సాగు, నత్రజని ఎరువులపై అసమానంగా ఆధారపడటం, సేంద్రీయ ఎరువుల వినియోగం తగ్గడం వల్ల పోషక అసమతుల్యత, నేల ఆరోగ్యం క్రమంగా క్షీణించడానికి దారితీసింది. అధిక, అసమతుల్య ఎరువుల వినియోగం ద్వితీయ, సూక్ష్మ పోషకాల క్షీణతను వేగవంతం చేసింది. నేలను దిగజార్చింది. ప్రవాహం, లీచింగ్ ద్వారా పోషక నష్టాలను పెంచింది.
క్షీణిస్తున్న నేల సారం పంట పెరుగుదల, దిగుబడిని ప్రతికూలంగా ప్రభావితం చేస్తోంది:
- మొక్కల జీవక్రియ ప్రక్రియలకు అంతరాయం కలిగించడం ద్వారా,
- తెగుళ్లు, వ్యాధుల బారిన పడే అవకాశాన్ని పెంచడం ద్వారా,
- ఉత్పత్తి నాణ్యతను తగ్గించడం ద్వారా.
అసమతుల్య ఎరువుల వినియోగం నేల క్షీణతకు మించి మరిన్ని దుష్పరిణామాలను కలిగి ఉంది. ఈ ప్రక్రియలు పర్యావరణ కాలుష్యానికి మరింత దోహదం చేస్తాయి. ఆరోగ్యపరమైన ప్రమాదాలను కలిగిస్తాయి. ఈ ప్రతికూల ప్రభావాలు పశువుల రంగానికి కూడా విస్తరించాయి. పోషకాలు లోపించిన నేలల్లో పండించిన పంటల నుంచి వచ్చే మేత, దాణాలో అవసరమైన ఖనిజాలు లేకపోవడం వల్ల పశువుల ఆరోగ్యం దెబ్బతినడంతో పాటు ఉత్పాదకత తగ్గుతుంది. పర్యవసానంగా పోషక అసమతుల్యత అనేది సమీకృత పంట-పశువుల ఉత్పత్తి వ్యవస్థల దీర్ఘకాలిక స్థిరత్వం, సామర్థ్యానికి గణనీయమైన అడ్డంకిగా మారుతుంది. అందువల్ల, నేల సారాన్ని కాపాడుకోవడం, శాస్త్రీయంగా సరైన పద్ధతులను అవలంబించడం వ్యవసాయ ఉత్పత్తి స్థిరత్వానికి ప్రాథమికం. రసాయన, భౌతిక, జీవసంబంధమైన లక్షణాల ద్వారా మారే నేల సారం.. సమర్థవంతమైన పోషక వినియోగం, ఆర్థిక ఆచరణ సాధ్యత, పర్యావరణ పరిరక్షణకు ఆధారం.

అసమతుల్య ఎరువుల వినియోగం వల్ల తలెత్తుతున్న సవాళ్లకు ప్రతిస్పందనగా ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్(ఐసీఏఆర్) దీర్ఘకాలిక ఎరువుల ప్రయోగాలపై అఖిల భారత సమన్వయ పరిశోధన ప్రాజెక్టు (ఏఐసీఆర్పీ-ఎల్‌టీఎఫ్ఈ)ను ప్రారంభించింది. విస్తృత శ్రేణి వ్యవసాయ-పర్యావరణ ప్రాంతాలు, పంటల వ్యవస్థలలో చేసిన ఈ అధ్యయనం.. నేల ఆరోగ్యం, పంట ఉత్పాదకత, వ్యవసాయ వ్యవస్థ స్థిరత్వంపై నిరంతర ఎరువుల వినియోగం వల్ల కలిగే దీర్ఘకాలిక ప్రభావాలను అంచనా వేసేలా రూపొందించబడింది. ఈ అధ్యయనం పోషకాల వెలికితీత, నేల క్షీణత, హేతుబద్ధమైన ఎరువుల నిర్వహణ ఆవశ్యకతపై బలమైన అనుభావిక ఆధారాలను అందించింది. తద్వారా విధాన రూపకల్పనకు సమాచారాన్ని అందిస్తుంది. పర్యావరణ ఆరోగ్యాన్ని కాపాడుతూ అధిక పెట్టుబడి వ్యవసాయాన్ని కొనసాగించడానికి హేతుబద్ధమైన పోషక నిర్వహణ పద్ధతులను ప్రోత్సహిస్తుంది. ఈ సందర్భంలో నేల ఆరోగ్యాన్ని పునరుద్ధరించడానికి, నిలబెట్టడానికి ఒక ప్రధాన వ్యూహంగా భారత ప్రభుత్వం సమతుల్య ఎరువుల వినియోగాన్ని చురుకుగా ప్రోత్సహిస్తోంది. తద్వారా సుస్థిర వ్యవసాయ ఉత్పాదకతకు మద్దతు ఇస్తుంది.
ఎరువులు అంటే?
ఎరువు అనేది మొక్కలకు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ పోషకాలను అందించడానికి నేలకు జోడించే సహజ లేదా కృత్రిమ మూలం కలిగిన ఏదైనా పదార్థం.
ఎరువులను స్థూలంగా సేంద్రీయ, నిరింద్రియ ఎరువులుగా వర్గీకరించారు:
నిరింద్రియ ఎరువులు: ఇవి నిర్దిష్ట పోషకాలను సాంద్రత రూపంలో కలిగి ఉండే కృత్రిమ రసాయన సమ్మేళనాలు. ఇవి పంటలకు కచ్చితమైన, తక్షణ పోషక సరఫరాను సాధ్యం చేస్తాయి.
సేంద్రీయ ఎరువులు: ఇవి కంపోస్ట్, పశువుల ఎరువులు, పంట అవశేషాలు, సముద్రపు పాచి, ఎముకల పొడి వంటి సహజ వనరుల నుంచి సేకరిస్తారు. ఇవి నేల స్వభావం, సేంద్రీయ పదార్థాన్ని, జీవక్రియను మెరుగుపరుస్తూ పోషకాలను క్రమంగా సమతుల్య రూపంలో అందిస్తాయి. వీటిలో బ్లడ్ మీల్, ఈకల పొడి, కొమ్ము లేదా గిట్టల పొడి వంటి జంతువుల ఉప ఉత్పత్తులు కూడా ఉంటాయి.
సమతుల్య ఎరువుల వినియోగం: సుస్థిర వ్యవసాయానికి కీలకం
సమతుల్య పోషక నిర్వహణ పోషకాల శోషణను గరిష్ఠం చేయడం ద్వారా, నష్టాలను తగ్గించడం ద్వారా ఎరువుల వినియోగ సామర్థ్యాన్ని పెంచుతుంది. ఇదే సమయంలో మెరుగైన మొక్కల పెరుగుదల, పంట పనితీరు, ఉత్పాదకతకు మద్దతు ఇచ్చే పోషకాల మధ్య పరస్పర సహకార చర్యలను పెంపొందిస్తుంది. ఇది నేల సేంద్రీయ పదార్థం, జీవసంబంధమైన ఆరోగ్యంతో సహా దీర్ఘకాలం పాటు నేల సారాన్ని నిలబెడుతుంది. తగినంత పోషణ ద్వారా సంభావ్య, వాస్తవ పంట దిగుబడుల మధ్య అంతరాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. అసమతుల్య ఎరువుల వినియోగం వల్ల కలిగే పోషక ప్రవాహం, లీచింగ్, గ్రీన్‌హౌస్ వాయు ఉద్గారాల వంటి పర్యావరణ ప్రభావాలను తగ్గిస్తుంది.
సమతుల్య ఎరువుల వినియోగ శాస్త్రీయ ఆధారాన్ని జస్టస్ వాన్ లైబిగ్ 'లా ఆఫ్ ది మినిమం'లో చూడొచ్చు. పంట పెరుగుదల అనేది ఇతర పోషకాలు ఎంత సమృద్ధిగా ఉన్నప్పటికీ అత్యంత తక్కువగా ఉన్న(పరిమితం చేసే) పోషకం ద్వారా మాత్రమే నియంత్రణకు గురవుతుందని ఈ సూత్రం పేర్కొంటుంది. ఇతర ఆవశ్యక పోషకాలు లోపించినప్పుడు, కేవలం ఒకే పోషకాన్ని అధికంగా వేయడం వృథా అని ఈ సూత్రం నొక్కి చెబుతుంది.

కాబట్టి, సమతుల్య ఎరువుల వినియోగం అనేది పంట అవసరాలు, నేల సారం, ప్రస్తుత వాతావరణ పరిస్థితుల ఆధారంగా అన్ని ఆవశ్యక మొక్కల పోషకాలను - స్థూల పోషకాలు, సూక్ష్మ పోషకాలను తగిన నిష్పత్తిలో, పరిమాణంలో, సరైన సమయంలో, పద్ధతులలో అందించడాన్ని సూచిస్తుంది. ఇది కేవలం నత్రజని(ఎన్), భాస్వరం(పీ), పొటాషియం(కే)లను అందించే సంప్రదాయ పద్ధతికి మించి సంపూర్ణ పోషక నిర్వహణ విధానాన్ని ఏకీకృతం చేస్తుంది.

సమతుల్య ఎరువుల వినియోగం వల్ల కలిగే ప్రయోజనాలు
సమతుల్య ఎరువుల వినియోగం సుస్థిర వ్యవసాయానికి ఒక ప్రాథమిక స్తంభం వంటిది. ఇది విస్తృతమైన వ్యవసాయ, ఆర్థిక, పర్యావరణ ప్రయోజనాలను అందిస్తుంది:
అధిక పంట ఉత్పాదకత: సమతుల్య పోషకాల సరఫరా పంటలు వాటి పూర్తి సామర్థ్యాన్ని చేరుకోవడానికి వీలు కల్పిస్తుంది. ఫలితంగా గణనీయంగా అధిక దిగుబడులు వస్తాయి.
అధిక దిగుబడినిచ్చే రకాల ఉత్తమ పనితీరు: మెరుగైన పంట రకాల ఉత్పాదకతను గరిష్ఠం చేయడానికి సమతుల్య పోషణ కీలకం.
మెరుగైన పోషక వినియోగ సామర్థ్యం: తగినంత సూక్ష్మపోషకాల లభ్యత స్థూల పోషకాల వినియోగ సామర్థ్యాన్ని పెంచుతుంది. తద్వారా వృథాను తగ్గిస్తుంది.
మెరుగైన పంట నాణ్యత, ఒత్తిడి నిరోధకత: బాగా పోషణ పొందిన మొక్కలు వ్యాధి నిరోధకతను, వాతావరణ ఒత్తిడిని తట్టుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. ఫలితంగా మానవ వినియోగానికి, పశుగ్రాసానికి అధిక నాణ్యత గల దిగుబడి లభిస్తుంది.
మెరుగైన నేల ఆరోగ్యం, స్థిరత్వం: సమతుల్య ఎరువుల వినియోగం నేల సారం, సూక్ష్మజీవుల చర్యలు, నేల ఆకృతి, నీటిని నిలుపుకునే సామర్థ్యాన్ని పెంచుతుంది.
తగ్గిన పర్యావరణ ప్రమాదాలు: పంట అవసరానికి అనుగుణంగా పోషకాలను అందించడం వల్ల ప్రవాహ నష్టాలు, లీచింగ్, నీటి కాలుష్యం తగ్గుతాయి.
ఖర్చుతో కూడుకున్న పెట్టుబడి వినియోగం: సమతుల్య పోషక నిర్వహణ రైతులకు పెట్టుబడులను అత్యంత సమర్థవంతంగా ఉపయోగించడంలో సహాయపడుతుంది. అనవసరమైన ఎరువుల ఖర్చులను తగ్గిస్తూనే అధిక దిగుబడి, మెరుగైన నాణ్యత ద్వారా ఆదాయాన్ని పెంచుతుంది. ఇది దీర్ఘకాలంలో లాభదాయకమైన విధానంగా మారుతుంది.

సమతుల్య ఎరువుల ప్రక్రియ: నేల నుంచి పరిష్కారం వరకు
సమతుల్య ఎరువుల వినియోగాన్ని సాధించడానికి సైన్స్, పాలసీ, సాంకేతికత, రైతుల భాగస్వామ్యాన్ని సమన్వయం చేసే బహుముఖ వ్యూహం అవసరం. భారతీయ వ్యవసాయంలో సుస్థిర పోషక నిర్వహణను నిర్ధారించడానికి ఈ కింది చర్యలు కీలకం:
1. సమీకృత పోషక నిర్వహణ(ఐఎన్ఎం) అనేది సమతుల్య ఎరువుల వినియోగాన్ని సాధించడానికి ఒక ప్రధాన వ్యూహం. ఇది సేంద్రీయ ఎరువులు, రసాయన ఎరువులు, జీవ సంబంధిత వనరులను విచక్షణతో అనుసంధానించడం ద్వారా సమర్థవంతమైన, పొదుపైన, సుస్థిరమైన పోషక వినియోగాన్ని సాధ్యం చేస్తుంది. పంటల సంపూర్ణ పోషక అవసరాలను తీర్చడానికి కేవలం రసాయన ఎరువులు లేదా కేవలం సేంద్రీయ ఎరువులు మాత్రమే సరిపోవని ఐఎన్ఎం గుర్తిస్తుంది. తదనుగుణంగా ఇది ఈ కింది వాటిని మిళితం చేసే సమగ్ర విధానాన్ని ప్రోత్సహిస్తుంది.
- అవసరమైన స్థూల పోషకాలను(ఎన్‌పీకే) అందించడానికి రసాయన ఎరువులు.
- నేల స్వభావం, నీటి నిలుపుదల, సూక్ష్మజీవుల చర్యలను మెరుగుపరచడానికి కంపోస్ట్, పశువుల ఎరువు, పేడ, 'ధైంచా' వంటి పచ్చిరొట్ట ఎరువులతో సహా సేంద్రీయ పదార్థాలు.
- పంట మార్పిడి, అవశేషాల నిర్వహణ - వ్యవస్థ వైవిధ్యాన్ని పెంచడానికి, తెగుళ్లు, వ్యాధి చక్రాలను అడ్డుకోవడానికి, పోషక వినియోగ సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి.
2. సాంకేతికత ద్వారా అనుకూలీకరించిన ఎరువులు: నిర్దిష్ట పంట, నేల పోషక అవసరాలను తీర్చడానికి ఇవి రూపొందాయి. ఈ ఎరువులు శాస్త్రీయంగా నిర్ణయించిన నిష్పత్తులలో స్థూల, సూక్ష్మ పోషకాలను కలిగి ఉంటాయి.
ఉదాహరణకు, స్థానిక నేల లోపాల ఆధారంగా జింక్, బోరాన్, సల్ఫర్ వంటి సూక్ష్మపోషకాలను యూరియా లేదా డీఏపీతో కలపవచ్చు. ఈ లక్ష్యిత అన్వయం పోషక నష్టాలను తగ్గించడానికి, ఎరువుల సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి, మెరుగైన పంట ప్రతిస్పందనకు దారితీస్తుంది.
3. భూసార పరీక్ష ఆధారిత ఎరువుల సిఫార్సులు: సమతుల్య ఎరువుల వినియోగంలో భూసార పరీక్ష ఒక ప్రాథమిక, ముఖ్యమైన అడుగు. పరీక్ష ఫలితాల ఆధారంగా నేలలను తక్కువ, మధ్యస్థ లేదా అధిక పోషక పదార్థాలు ఉన్నవిగా వర్గీకరిస్తారు. పోషకాలు తక్కువగా ఉన్న నేలలకు ఎరువుల మోతాదును పెంచుతారు. పోషక స్థాయిలు ఇప్పటికే తగినంతగా ఉన్న చోట తగ్గిస్తారు. భూసార ఆరోగ్య కార్డు పథకం రైతులకు పొలం-నిర్దిష్ట నేల సమాచారాన్ని అందించడం ద్వారా ఈ విధానానికి మద్దతు ఇస్తుంది. తద్వారా వారు ఎరువులను మరింత కచ్చితత్వంతో వాడటానికి, అధిక వినియోగాన్ని నివారించడానికి వీలు కల్పిస్తుంది.
4. సాయిల్ టెస్ట్ క్రాప్ రెస్పాన్స్(ఎస్‌టీసీఆర్) విధానం: ఎస్‌టీసీఆర్ విధానం ఎరువుల వాడకాన్ని నేరుగా పంట దిగుబడి లక్ష్యాలతో ముడిపెడుతుంది. ఇది ఆశించిన దిగుబడిని సాధించడానికి అవసరమైన కచ్చితమైన పోషక అవసరాలను లెక్కించడానికి నేల పోషక స్థితి, పంట రకం, స్థానిక వాతావరణ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుంటుంది. ఈ పద్ధతి ఎరువుల అతివృష్టి లేదా అనావృష్టిని నివారిస్తుంది.
5. డయాగ్నోసిస్ అండ్ రికమెండేషన్ ఇంటిగ్రేటెడ్ సిస్టమ్(డీఆర్ఐఎస్): ఈ విధానం కేవలం సంపూర్ణ పోషక విలువలపై దృష్టి పెట్టకుండా మొక్కల కణజాలాన్ని విశ్లేషించి నత్రజని-భాస్వరం(ఎన్/పీ) లేదా నత్రజని-పొటాషియం(ఎన్/ కే) వంటి పోషక నిష్పత్తులను అంచనా వేస్తుంది. అసమతుల్యతలను గుర్తించినప్పుడు, సాధారణంగా టాప్ డ్రెస్సింగ్ ద్వారా దిద్దుబాటు చర్యలు సిఫార్సు చేస్తారు.
6. సైట్-స్పెసిఫిక్ న్యూట్రియెంట్ మేనేజ్‌మెంట్(ఎస్ఎస్ఎన్ఎం): ఇది పంట వాస్తవ అవసరాలు, పొలంలోని నేల వైవిధ్యానికి అనుగుణంగా ఎరువులను వేయడంపై దృష్టి పెడుతుంది. ఇది మూడు దశలను అనుసరిస్తుంది:
- స్థానిక పరిస్థితుల ఆధారంగా వాస్తవిక దిగుబడి లక్ష్యాన్ని నిర్దేశించడం.
- నేల, సేంద్రీయ వనరుల నుంచి లభించే దేశీయ పోషక సరఫరాను అంచనా వేయడం.
- మిగిలిన లోటును పూరించడానికి మాత్రమే ఎరువులను వాడటం.
పునరుత్పాదక వ్యవసాయం: సమతుల్య ఎరువుల వినియోగానికి అనుబంధ విధానం
పునరుత్పాదక వ్యవసాయం అనేది నేల ఆరోగ్యాన్ని పునరుద్ధరించడం, జీవవైవిధ్యాన్ని పెంపొందించడంపై కేంద్రీకృతమైన సమగ్ర వ్యవసాయ విధానం.
నేల ఆరోగ్యం మెరుగుపడటం వల్ల పోషకాలను, తేమను నిలుపుకునే నేల సామర్థ్యం పెరుగుతుంది. దీనివల్ల పంటలు పోషకాలను మెరుగ్గా గ్రహిస్తాయి. ఇది పోషక నష్టాలను తగ్గించడానికి, ఎరువుల అవసరాన్ని తగ్గించడానికి, సమర్థవంతమైన పోషక వినియోగానికి దారితీస్తుంది. భారత్‌లో వ్యవసాయానికి సూక్ష్మ నీటిపారుదల, సహజ వ్యవసాయ విధానం, మల్చింగ్ వంటివి ఇందులో ప్రధాన భాగాలు.
సమతుల్య ఎరువుల వినియోగాన్ని ప్రోత్సహిస్తున్న ప్రభుత్వ కార్యక్రమాలు
నేల ఆరోగ్యాన్ని మెరుగుపరచడం, పంట ఉత్పాదకతను నిలబెట్టడం కోసం సమతుల్య ఎరువుల వినియోగ ప్రాముఖ్యతను గుర్తించిన భారత ప్రభుత్వం అనేక చురుకైన చర్యలను చేపట్టింది.
భూమి ఆరోగ్య కార్డు
2015లో ప్రారంభించిన సాయిల్ హెల్త్ కార్డ్(ఎస్‌హెచ్‌సీ) పథకం.. శాస్త్రీయ భూసార పరీక్షల ఆధారంగా ప్రతి రైతుకు వారి భూమికి సంబంధించిన సమగ్ర నివేదికను అందిస్తుంది. ఈ కార్డ్ పన్నెండు కీలక పారామితుల ఆధారంగా నేల ఆరోగ్యాన్ని అంచనా వేస్తుంది. అందులో స్థూల పోషకాలు: నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం, సల్ఫర్; సూక్ష్మ పోషకాలు: జింక్, ఐరన్, కాపర్, మాంగనీస్, బోరాన్; నేల లక్షణాలు: పీహెచ్ విలువ, విద్యుత్ వాహకత(ఈసీ), ఆర్గానిక్ కార్బన్(ఓసీ) ఉంటాయి.
ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి జారీ చేసే ఈ కార్డ్.. నేలలోని పోషకాల స్థితిని రైతులకు వివరిస్తుంది. ఇది రసాయనిక ఎరువులు, జీవ ఎరువులు, సేంద్రియ ఎరువుల వాడకంపై పంటల వారీగా సిఫార్సులను అందిస్తుంది. జూలై 2025 నాటికి ఈ పథకం ద్వారా 93,000 కంటే ఎక్కువ రైతు శిక్షణ కార్యక్రమాలు, 6.8 లక్షల క్షేత్ర ప్రదర్శనలు జరిగాయి. నవంబర్ 2025 మధ్య నాటికి దేశవ్యాప్తంగా 25.55 కోట్లకు పైగా సాయిల్ హెల్త్ కార్డ్‌లు పంపిణీ అయ్యాయి.
న్యూట్రియంట్ బేస్డ్ సబ్సిడీ(ఎన్‌బీఎస్) పథకం
ఈ పథకం నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం, సల్ఫర్ వంటి ముఖ్యమైన పోషకాల సమతుల్య వినియోగాన్ని ప్రోత్సహిస్తుంది. దీని ద్వారా రైతులు ఒకే రకమైన ఎరువుపై ఆధారపడకుండా, నేల ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ దిగుబడిని పెంచుకోవచ్చు. దీని కింద డీఏపీ వంటి పీ&కే ఎరువులపై ప్రభుత్వం నిర్ణీత రాయితీని అందిస్తుంది. రబీ 2025-26 కాలానికి ఆమోదించిన ఎన్‌బీఎస్ ధరలు అక్టోబర్ 1, 2025 నుంచి మార్చి 31, 2026 వరకు అమలులో ఉంటాయి. 2022-23 నుంచి 2024-25 మధ్య కాలంలో ఈ ఎరువుల కోసం రూ.2.04 లక్షల కోట్ల కంటే ఎక్కువ సబ్సిడీ కేటాయింపు జరిగింది.
వేప పూత పూసిన యూరియా
దేశీయంగా తయారయ్యే యూరియా అంతటికీ 100 శాతం వేప పూతను ప్రభుత్వం తప్పనిసరి చేసింది. దీనివల్ల అయ్యే అదనపు ఖర్చును భర్తీ చేయడానికి తయారీదారులు గరిష్ట రిటైల్ ధర(ఎంఆర్పీ)పై 5 శాతం వరకు అదనంగా వసూలు చేసేందుకు అనుమతించింది. ఇది 2015 సెప్టెంబర్ నుంచి దేశీయంగా తయారుచేసిన యూరియాపై, 2015 డిసెంబర్ నుంచి దిగుమతి చేసుకున్న యూరియాపై అమలవుతోంది. తద్వారా జాతీయ యూరియా సరఫరాను వేప-పూత పూసిన వాటి వైపు మార్పు చెందేందుకు దోహదపడుతోంది.
వేప పూత పూసిన యూరియా తయారీకి వేప నూనె వినియోగిస్తారు. ఈ యూరియా నేలలో నైట్రోజన్ నెమ్మదిగా విడుదలయ్యేలా చేస్తుంది. దీనివల్ల పంటకు అవసరమైనప్పుడు పోషకాలు అందుతాయి. ఇది నైట్రోజన్ వినియోగ సామర్థ్యాన్ని పెంచి, ఎరువుల వృధాను తగ్గిస్తుంది. రైతులకు యూరియా వినియోగాన్ని తగ్గిస్తుంది. దీంతో పాటు భూసారాన్ని మెరుగుపరిచేందుకు, వ్యవసాయ ఉత్పత్తి వ్యవస్థల సామర్థ్యం పెరిగేందుకు వేప-పూత పూసిన యూరియా ఉపయోగపడుతుంది.
పరంపరాగత్ కృషి వికాస్ యోజన(పీకేవీవై)
2015లో ప్రారంభించిన పరంపరాగత్ కృషి వికాస్ యోజన(పీకేవీవై).. సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తుంది. దీని కింద మూడు సంవత్సరాల కాలానికి హెక్టారుకు రూ.31,500 ఆర్థిక సహాయం అందిస్తారు. ఈ పథకం కంపోస్ట్, బయోఫెర్టిలైజర్స్, ఆర్గానిక్ మ్యాటర్ వంటి వాటి వినియోగాన్ని ప్రోత్సహించడంతో పాటు సంప్రదాయ వ్యవసాయ పద్ధతులను, సుస్థిర భూసార విధానాలతో అనుసంధానం చేస్తుంది. అక్టోబర్ 31, 2025 నాటికి, ఈ పథకం కింద 16.90 లక్షల హెక్టార్ల భూమి సాగులోకి వచ్చింది.
పీఎం-ప్రణామ్(పీఎం ప్రోగ్రామ్ ఫర్ రీస్టోరింగ్, అవేర్‌నెస్, నౌరీష్‌మెంట్ అండ్ అమెలియోరేషన్ ఆఫ్ మదర్ ఎర్త్)
పీఎం-ప్రణామ్(పీఎం ప్రోగ్రామ్ ఫర్ రీస్టోరింగ్, అవేర్‌నెస్, నౌరీష్‌మెంట్ అండ్ అమెలియోరేషన్ ఆఫ్ మదర్ ఎర్త్) పథకం రసాయనిక ఎరువుల వినియోగాన్ని తగ్గించడం, సమతుల్య పోషకాల వినియోగాన్ని ప్రోత్సహించడంపై దృష్టి సారిస్తుంది. ఈ పథకం సేంద్రియ ఎరువులు, బయో-ఫెర్టిలైజర్స్, కంపోస్ట్ వంటి పర్యావరణ అనుకూల ప్రత్యామ్నాయాల స్వీకరణను ప్రోత్సహిస్తుంది. గత మూడు సంవత్సరాల సగటు వినియోగంతో పోలిస్తే, ఒక నిర్దిష్ట ఆర్థిక సంవత్సరంలో రసాయనిక ఎరువుల(యూరియా, డీఏపీ, ఎన్‌పీకే, ఎంఓపీ) వినియోగాన్ని తగ్గించే రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ప్రోత్సాహకాలను అందించే నిబంధన ఈ పథకంలో ఉంది. సాధించిన ఎరువుల సబ్సిడీ ఆదాలో 50 శాతానికి సమానమైన ప్రోత్సాహకాలను వీటికి అందిస్తారు. 2023–24 ఆర్థిక సంవత్సరంలో 14 రాష్ట్రాలు గత 3 ఆర్థిక సంవత్సరాల సగటుతో పోలిస్తే రసాయనిక ఎరువుల వినియోగంలో 15.14 లక్షల మెట్రిక్ టన్నుల తగ్గింపును నమోదు చేశాయి.
నానో ఎరువుల ప్రోత్సాహం
నానో ఎరువులు అనేవి నానో మెటీరియల్స్ అని పిలిచే చిన్న కణాలలో కూడిన మొక్కల పోషకాలు. ఇవి పోషకాలు నెమ్మదిగా విడుదలయ్యేలా, కనిష్ట వృధాతో పంటలు మరింత సమర్థవంతంగా గ్రహించేలా చేస్తాయి. వాటి స్వీకరణను ప్రోత్సహించడానికి ఎరువుల శాఖ కీలక చర్యలను చేపట్టింది:
- వర్క్‌షాప్‌లు, వెబ్‌నార్‌లు, క్షేత్ర ప్రదర్శనలు, వీధి నాటకాలు. ప్రాంతీయ చిత్రాల ద్వారా అవగాహన ప్రచారాలు నిర్వహించడం.
- దేశవ్యాప్తంగా ఉన్న ప్రధానమంత్రి కిసాన్ సమృద్ధి కేంద్రాల(పీఎంకేఎస్‌కే) వద్ద నానో యూరియా, నానో డైఅమ్మోనియం ఫాస్ఫేట్(డీఏపీ) అందుబాటులో ఉంచడం.
- లభ్యతను నిర్ధారించడానికి నెలవారీ ఎరువుల సరఫరా ప్రణాళికలో నానో యూరియాను చేర్చడం.
- నానో రకాలు సహా సమతుల్య ఎరువుల వినియోగాన్ని దేశవ్యాప్తంగా ప్రోత్సహించడం.
- క్షేత్ర ప్రదర్శనలు, నిర్మాణాత్మక రైతులతో సంభాషనల మద్దతుతో మొత్తం 15 ఆగ్రో-క్లైమాటిక్ జోన్‌లలో నానో డైఅమ్మోనియం ఫాస్ఫేట్(డీఏపీ) స్వీకరణను ప్రోత్సహించడానికి "మహా అభియాన్" నిర్వహించడం.
- శిక్షణ పొందిన గ్రామ స్థాయి వ్యవస్థాపకుల మద్దతుతో, సమర్థవంతమైన, తక్కువ ఖర్చుతో కూడిన వినియోగాన్ని ప్రారంభించడానికి డ్రోన్ ఆధారిత స్ప్రేయింగ్ మరియు బ్యాటరీతో నడిచే స్ప్రేయర్‌లను ప్రోత్సహించడం.
- నానో-ఎరువుల ఉత్పత్తిని విస్తరించడానికి, పెంచడానికి ఎరువుల కంపెనీలను ప్రోత్సహించడం.
అనుకూలీకరించిన, బలవర్ధకమైన ఎరువుల అభివృద్ధి
పోషక అవసరాలకు అనుగుణంగా బలవర్ధకమైన, నేల, పంట, ప్రాంతానికి తగిన ఎరువుల స్వీకరణను ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. పోషక ఆధారిత సబ్సిడీ(ఎన్‌బీఎస్) విధానం ప్రకారం.. బోరాన్, జింక్ వంటి సూక్ష్మపోషకాలతో బలవర్ధకమైన లేదా పూత పూసిన సబ్సిడీ ఫాస్ఫాటిక్, పొటాసిక్(పీ&కే) ఎరువుల రకాల సబ్సిడీ మద్దతు అందుతుంది. అదనంగా, ఈ బలవర్ధకమైన లేదా పూత పూసిన ఎరువులు ప్రాథమిక పోషకాలతో పాటు వాటి వినియోగాన్ని ప్రోత్సహించడానికి, సమతుల్య పోషకాల వినియోగాన్ని ప్రోత్సహించడానికి మెట్రిక్ టన్నుకు(ఎంటీ) అదనపు సబ్సిడీని పొందుతాయి.

ఎరువుల సరఫరా, రైతు ప్రయోజనాలను కాపాడేందుకు అమలు చర్యలు
భారత ప్రభుత్వ వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ (డీఏ&ఎఫ్‌డబ్ల్యూ) తో సన్నిహిత సమన్వయంతో ఎరువుల శాఖ (డీఓఎఫ్) రైతు ప్రయోజనాలను కాపాడటానికి, జాతీయ ఎరువుల సరఫరా గొలుసు సమగ్రతను నిర్ధారించడానికి ఖరీఫ్, ప్రస్తుతం కొనసాగుతున్న రబీ సీజన్ 2025–26(2026 ఏప్రిల్-జనవరి మధ్య) సమయంలో సమగ్ర అమలు కార్యక్రమాన్ని చేపట్టింది.
రాష్ట్ర ప్రభుత్వాలు, జిల్లా స్థాయి అధికారుల సహకారంతో ఎరువుల మళ్లింపు, దుర్వినియోగాన్ని అరికట్టడానికి తనిఖీలు, దాడులు, చట్టపరమైన చర్యలతో సహా విస్తృతమైన అమలు చర్యలు చేపట్టడం జరిగింది. ఈ డ్రైవ్‌లో భాగంగా 14,692 షోకాజ్ నోటీసులు జారీ అయ్యాయి. 6,373 లైసెన్స్‌లు నిలిపివేయడం లేదా రద్దు అయ్యాయి. 766 ఎఫ్ఐఆర్‌లు నమోదయ్యాయి. ఈ చురుకైన, కఠినమైన చర్యలు ఎరువులు సకాలంలో లభ్యమయ్యేలా చూస్తాయి మార్కెట్ క్రమశిక్షణను బలోపేతం చేయడంతో పాటు దేశవ్యాప్తంగా ఎరువుల పంపిణీ వ్యవస్థల సమగ్రతను కాపాడతాయి.
ముగింపు
నేల క్షీణత, పోషకాల అసమతుల్యత, పర్యావరణ ఒత్తిడి వంటి అభివృద్ధి చెందుతున్న సవాళ్లను పరిష్కరిస్తూ.. వ్యవసాయ ఉత్పాదకతను నిలబెట్టుకోవడానికి భారతదేశ వ్యూహంలో సమతుల్య ఫలదీకరణం ప్రధానమైనదిగా మారింది. ఎరువుల అసమతుల్య వినియోగం వల్ల తలెత్తే ప్రమాదాలను గుర్తించి, సైన్స్ ఆధారిత, రైతు-కేంద్రీకృత జోక్యాల ద్వారా పోషకాల అసమతుల్యతను సరిదిద్దడానికి, ఎరువుల వినియోగ సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి ప్రభుత్వం చురుకైన, సమన్వయ చర్యలను చేపట్టింది. సాయిల్ హెల్త్ కార్డ్ స్కీమ్ కింద నేల పరీక్షా-ఆధారిత సిఫార్సులు, పోషక ఆధారిత సబ్సిడీ, ఇంటిగ్రేటెడ్ న్యూట్రియంట్ మేనేజ్‌మెంట్ ప్రోత్సాహం, అనుకూలీకరించిన, బలవర్ధకమైన ఎరువుల ప్రోత్సాహం, నానో ఎరువుల వంటి వినూత్న ఇన్‌పుట్‌ల స్వీకరణ వంటి కార్యక్రమాలు పోషకాల అసమతుల్యతను పరిష్కరించడానికి, ఎరువుల వినియోగ సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి తీవ్రమైన విధానపరమైన కృషిని ప్రతిబింబిస్తాయి. మొత్తంగా ఈ ప్రయత్నాలు నేల ఆరోగ్యాన్ని పునరుద్ధరించడానికి, ఇన్‌పుట్ వినియోగాన్ని మెరుగుపర్చడానికి, వ్యవసాయ రంగ దీర్ఘకాలిక దృఢత్వం, ఉత్పాదకతను బలోపేతం చేయడానికి ప్రభుత్వ నిబద్ధతను నొక్కి చెబుతాయి.
References
Lok Sabha
Ministry of Agriculture and Farmers Welfare
PIB Press Releases
PIB Backgrounders
Economic Survey 2025-2026
Click here to see pdf
***
(Explainer ID: 157153)
आगंतुक पटल : 8
Provide suggestions / comments