• Skip to Content
  • Sitemap
  • Advance Search
Global Affairs

భారత్-ఈయూ భాగస్వామ్యం: యూరోపియన్ యూనియన్‌తో పెరుగుతున్న భారతదేశ సంబంధాలు

Posted On: 24 JAN 2026 12:05PM

కీల‌కాంశాలు
- రాబోయే భారత్-ఈయూ శిఖరాగ్ర సమావేశం, స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందానికి అనుగుణంగా భారతదేశం ఐరోపాపై తన వ్యూహాత్మక దృష్టిని కేంద్రీకరిస్తోంది.
- 2024-25లో ద్వైపాక్షిక వాణిజ్య పరిమాణం సుమారు 136 బిలియన్ డాల‌ర్ల‌కు చేరుకుంది. దీంతో ఈయూ భారతదేశపు అతిపెద్ద వస్తు వాణిజ్య భాగస్వామిగా అవతరించింది.
- 2019, 2024 మధ్య భారత్-ఈయూ సేవల వాణిజ్యం క్రమంగా పెరిగింది. భారతీయ ఎగుమతులు 19 బిలియన్ యూరోల‌ నుంచి 37 బిలియన్ యూరోల‌కు పెరగగా, భారతదేశానికి ఈయూ ఎగుమతులు 29 బిలియన్ యూరోల‌కు పెరిగాయి.
- 2024 నాటికి 16,268 బ్లూ కార్డుదారులు సహా మొత్తం 931,607 మంది భారతీయులు ఈయూలో నివసిస్తున్నారు. గత 20 ఏళ్లలో 6,000 మందికి పైగా భారతీయ విద్యార్థులు 'ఎరాస్మస్ ముండస్' స్కాలర్‌షిప్‌లను పొందారు. ఇది భారత్-ఈయూ మధ్య విద్యా సంబంధాలను నొక్కి చెబుతుంది.

పరిచయం
భారత్-ఈయూ సంబంధాలు నూతన వ్యూహాత్మక దశలోకి ప్రవేశించాయి. న్యూఢిల్లీలో జరగనున్న భారత్-ఈయూ శిఖరాగ్ర సమావేశానికి ముందు ఇరు పక్షాలు తమ సంబంధాల‌ను పెంచుకుంటున్నాయి. భారతదేశం, యూరోపియన్ యూనియన్ చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పంద(ఎఫ్‌టీఏ) చర్చలను ముందుకు తీసుకెళ్లాలని, ప్రస్తుత రోడ్‌మ్యాప్‌కు అతీతంగా భాగస్వామ్యాన్ని నడిపించడానికి కొత్త 'జాయింట్ స్ట్రాటజిక్ అజెండా'ను ఆమోదించాలని కోరుకుంటున్నాయి. వాణిజ్యం, పెట్టుబడులు, స్వచ్ఛ, హరిత ఇంధనం, శాస్త్ర‌సాంకేతిక రంగాలు, భద్రత, రక్షణ, డిజిటల్ కార్య‌క్ర‌మాలు, అనుసంధానం, అంతరిక్షం, వ్యవసాయ రంగాలలో పరస్పర నిబద్ధతను ఇది తెలియజేస్తుంది.

ఇటీవలి కాలంలో భారత్-ఈయూ మధ్య ఉన్నత స్థాయి సంబంధాలు బలోపేతమయ్యాయి. 2025 ఫిబ్ర‌వ‌రిలో అధ్య‌క్షుడు ఉర్సులా వాన్ డెర్ లేయెన్ నేతృత్వంలోని 'ఈయూ కాలేజ్ ఆఫ్ కమిషనర్స్' న్యూఢిల్లీని సందర్శించింది. ఐరోపా వెలుపల ఒక ద్వైపాక్షిక భాగస్వామిని ఇలా సందర్శించడం ఇదే మొదటిసారి. జూన్ 2025లో కెనడాలో జరిగిన జీ7, జీ20 వంటి బహుపాక్షిక వేదికల వెలుపల కూడా నాయకులు సమావేశమయ్యారు. సెప్టెంబర్ 2025లో ప్రెసిడెంట్ వాన్ డెర్ లేయెన్, ప్రెసిడెంట్ ఆంటోనియో కోస్టాతో ప్ర‌ధాన‌మంత్రి టెలిఫోన్ చర్చల ద్వారా సంబంధాలు కొనసాగుతున్నాయి.

భారత్-ఈయూ సంబంధాలు
భారతదేశం, యూరోపియన్ యూనియన్ మధ్య సంబంధాలు.. ప్రజాస్వామ్యం, చట్టబద్ధ పాలన, నిబంధనల ఆధారిత అంతర్జాతీయ క్రమం, సమర్థవంతమైన బహుపాక్షికత పట్ల నిబద్ధత వంటి ఉమ్మడి విలువలపై ఆధారపడి ఉన్నాయి. ఈ సంబంధాలు వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ, వాతావరణ చర్యలు, స్వచ్ఛ ఇంధనం, డిజిటల్ అభివృద్ధి, అనుసంధానం, శాస్త్ర‌, సాంకేతిక‌త‌, ప్రజల మధ్య సంబంధాల వంటి విస్తృత శ్రేణిని కలిగి ఉన్నాయి. వస్తువుల పరంగా ఈయూ భారతదేశానికి అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా కొనసాగుతోంది. 2024-25లో ద్వైపాక్షిక వాణిజ్యం సుమారు $136 బిలియన్లకు చేరుకుంది.



2020లో ఆమోదించిన 'భారత్-ఈయూ వ్యూహాత్మక భాగస్వామ్యం: రోడ్‌మ్యాప్ టు 2025' మార్గ‌నిర్దేశం ద్వారా ఈ బహుముఖ భాగస్వామ్యం కొన‌సాగుతోంది. ఇది ఈ కింది అంశాలలో పరస్పర శ్రేయస్సు, ప్రపంచ స్థిరత్వం దిశగా అభివృద్ధి చెందుతూనే ఉంది:

గ‌తంలో భారత్, ఈయూ సంబంధాలు
భారత్-ఈయూ భాగస్వామ్యం దశాబ్దాలుగా అభివృద్ధి చెందింది. 1960లలో ప్రాథమిక దౌత్య సంబంధాలతో ప్రారంభమై 21వ శ‌తాబ్దంలో రాజకీయ చర్చలు, ఆర్థిక సహకారం, భద్రత, వాతావరణ మార్పు వంటి ప్రపంచ సవాళ్లను ఎదుర్కొనే బహుముఖ వ్యూహాత్మక కూటమిగా విస్తరించింది.

ప్రారంభ పునాదులు
భారత్, ఈయూ మధ్య దౌత్య సంబంధాలు 1960ల ప్రారంభం నుంచి కొన‌సాగుతున్నాయి. 1962లో యూరోపియన్ ఎకనామిక్ కమ్యూనిటీ(ఈఈసీ)తో సంబంధాలను ఏర్పరచుకున్న మొదటి దేశాలలో భారతదేశం ఒకటి. ద్వైపాక్షిక రాజ‌కీయ‌, ఆర్థిక సంబంధాల బ‌లోపేతం కోసం ఇది 1993 ఉమ్మడి రాజకీయ ప్రకటన, 1994 సహకార ఒప్పందానికి దారితీసింది.

2000ల ప్రారంభంలో కీలక మైలురాళ్లు
2000ల‌లో ఈ భాగ‌స్వామ్య రూప‌క‌ల్ప‌న‌కు కీల‌క కార్య‌క్ర‌మాలు జ‌రిగాయి. 2000 జూన్‌లో లిస్బన్‌లో మొదటి భారత్-ఈయూ శిఖరాగ్ర సమావేశం జరిగింది. దీని తరువాత 2004లో హేగ్‌లో జరిగిన 5వ శిఖరాగ్ర సమావేశంలో దీనిని 'వ్యూహాత్మక భాగస్వామ్యంస‌గా ఆధునీక‌రించారు. దీంతో వాణిజ్యంతో పాటు భద్రత, సాంస్కృతిక మార్పిడి కూడా ఇందులో చేరాయి.

భారత్-ఈయూ సంబంధాలలో ఇటీవలి పురోగతి
2020 జూలైలో 'రోడ్‌మ్యాప్ టు 2025' ఆమోదం, మే 2021లో స్వేచ్ఛా వాణిజ్య చర్చల పునఃప్రారంభం, 2022 ఏప్రిల్‌లో 'భారత్-ఈయూ ట్రేడ్ అండ్ టెక్నాలజీ కౌన్సిల్(టీటీసీ)' ప్రారంభంతో ఈ సంబంధాలు వేగవంతమయ్యాయి. ఫిబ్రవరి 2025లో జరిగిన టీటీసీ రెండవ మంత్రివర్గ సమావేశం డిజిటల్, గ్రీన్ టెక్నాలజీలలో సహకారాన్ని మరింత పెంపొందించింది.



భారత్-ఈయూ చర్చలు - వ్యూహాత్మక భాగస్వామ్య నిర్మాణం
గత దశాబ్ద కాలంలో భారత్-ఈయూ సంబంధాలు గణనీయంగా బలపడ్డాయి. కేవలం చర్చల స్థాయి నుంచి రక్షణ, మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు, కార్మిక చలనశీలత, అభివృద్ధి చెందుతున్న ప్రపంచ ప్రాధాన్యతలలో కార్యాచరణ ఆధారిత వ్యూహాత్మక సహకారంగా ఇవి రూపాంతరం చెందాయి.

ఇందుకు 'భారత్ – ఈయూ వ్యూహాత్మక భాగస్వామ్యం: రోడ్‌మ్యాప్ 2025' మార్గదర్శకంగా నిలిచింది. ప్రతిపాదిత 'సెక్యూరిటీ అండ్ డిఫెన్స్ పార్టనర్‌షిప్‌', 'ట్రేడ్ అండ్ టెక్నాలజీ కౌన్సిల్(టీటీసీ)' వంటి ఉన్నత స్థాయి ఒప్పందాలు ఇందులో భాగంగా ఉన్నాయి. వాతావరణ మార్పులు, సరఫరా గొలుసు భద్రత, ప్రాంతీయ శాంతి వంటి ఉమ్మడి సవాళ్లను ఎదుర్కోవడంలో భారత్‌ను కీలక భాగస్వామిగా ఇవి నిలబెట్టాయి.

వాణిజ్యం, ఆర్థికాంశాల‌పై దృష్టి
ఈయూ ఒక ముఖ్యమైన భాగస్వామిగా ఎదిగేందుకు వాణిజ్యం మూలస్తంభంగా ఉంది. భారత్, ఈయూ మధ్య ద్వైపాక్షిక వస్తువుల వాణిజ్యం గణనీయంగా పెరిగి, 2024-25లో $136 బిలియన్లకు చేరుకుంది. ఈయూ నుంచి భారత్‌కు యంత్రాలు, రవాణా పరికరాలు, రసాయనాలు ఎగుమతి అవుతుండగా భారత్ నుంచి యంత్రాలు, రసాయనాలు, బేస్ మెటల్స్, ఖనిజ ఉత్పత్తులు, వస్త్రాలు ఎగుమతి అవుతున్నాయి.

అంతేకాకుండా 2019 నుంచి 2024 వరకు సేవల రంగంలో ద్వైపాక్షిక వాణిజ్యం స్థిరమైన వృద్ధిని కనబరిచింది. భారతీయ ఎగుమతులు 2019లో 19 బిలియన్ యూరోల నుంచి 2024 నాటికి 37 బిలియన్ యూరోలకు పెరిగాయి. ఈయూ నుంచి దిగుమతులు కూడా పెరిగి 2024లో 29 బిలియన్ యూరోలకు చేరుకున్నాయి.

రక్షణ, భద్రత
2025లో భారత్-ఈయూ రక్షణ, భద్రతా సంబంధాలు మరింత బలపడ్డాయి. ఫిబ్రవరిలో 'కాలేజ్ ఆఫ్ కమిషనర్స్' భారత పర్యటన సందర్భంగా విడుదల చేసిన నేతల ప్రకటనలో 'సెక్యూరిటీ అండ్ డిఫెన్స్ పార్టనర్‌షిప్'ను అన్వేషించడానికి అంగీకరించారు. డిసెంబర్ 2025లో 'సొసైటీ ఆఫ్ ఇండియన్ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరర్స్' బృందం బ్రస్సెల్స్‌ను సందర్శించి పారిశ్రామిక సహకారాన్ని పెంపొందించింది.

సెప్టెంబర్ 2025లో మొత్తం 27 సభ్య దేశాలకు ప్రాతినిధ్యం వహించే ఈయూ పొలిటికల్ అండ్ సెక్యూరిటీ కమిటీ ఆసియాలో తన మొట్టమొదటి పర్యటనను భారత్‌లో చేపట్టింది. వ్యూహాత్మక చర్చలను ముందుకు తీసుకెళ్లడానికి విదేశాంగ కార్యదర్శి, డిప్యూటీ ఎన్ఎస్ఏ, సెక్ర‌ట‌రీ(వెస్ట్‌)తో ఉన్నత స్థాయి సమావేశాలు నిర్వహించింది.

వీటితో పాటు జూన్ 2025లో హిందూ మహాసముద్రం, అక్టోబర్ 2023లో గల్ఫ్ ఆఫ్ గినియా, జూన్ 2021లో గల్ఫ్ ఆఫ్ ఏడెన్ ప్రాంతాల్లో సంయుక్త నౌకాదళ విన్యాసాలు నిర్వహించారు.



స్వచ్ఛ ఇంధనం, వాతావరణం
ఇంధ‌న‌, వాతావరణ సహకారం భారత్-ఈయూ భాగస్వామ్యానికి ఒక కేంద్ర స్తంభాన్ని ఏర్పరుస్తుంది. ఇది సుస్థిరాభివృద్ధి, వాతావరణ చర్య, స్వచ్ఛ ఇంధన పరివర్తన పట్ల భాగస్వామ్య నిబ‌ద్ధ‌త‌ను ప్రతిబింబిస్తోంది.

భారత్-ఈయూ ఇంధ‌న‌, వాతావరణ నిమగ్నతకు కేంద్రంగా 2016లో స్థాపించిన క్లీన్ ఎనర్జీ అండ్ క్లైమేట్ పార్టనర్‌షిప్ (సీఈసీపీ) ఉంది దీని మూడో ద‌శ‌ నవంబర్ 2024లో ఆమోదం పొందింది. ఇది పెరుగుతున్న ద్వైపాక్షిక సహకార పరిధిని ప్రతిబింబిస్తుంది. ఈయూ 2018 నుంచి అంతర్జాతీయ సౌర కూటమిలో భాగస్వామిగా కొన‌సాగుతూ సౌర శక్తి విస్తరణకు మద్దతు ఇస్తుంది. కాగా యూరోపియన్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ సుస్థిర రవాణా, పట్టణ మొబిలిటీ ప్రాజెక్టులకు నిధులు సమకూరుస్తుంది. ఇందులో ఎంపిక చేసిన భారతీయ నగరాల్లో పట్టణ రైలు, మెట్రో వ్యవస్థలు ఉన్నాయి.

భారత్-ఈయూ సహకారం ప‌వ‌న విద్యుత్తు, గ్యాస్ మౌలిక సదుపాయాల అభివృద్ధి, మీథేన్ ఉద్గారాల తగ్గింపు, పెట్టుబడులు, సాంకేతిక బదిలీకి కూడా దోహ‌ద‌ప‌డుతోంది. మార్చి 2021లో విపత్తు తట్టుకోగల మౌలిక సదుపాయాల కూటమి(సీడీఆర్ఐ)లో ఈయూ చేరడం ప్ర‌తికూల వాతావరణ ప‌రిస్థితుల‌ను తట్టుకోగల మౌలిక సదుపాయాలపై ఉమ్మడి ప్రాధాన్యతలను నొక్కి చెబుతుంది. అధునాతన శాస్త్రీయ రంగాలలో భారత్, ఈయూ జూలై 2020లో అణుశక్తి శాంతియుత ఉపయోగాలపై ఈయూఆర్ఏటీఓఎంతో ఆర్ అండ్ డీ ఒప్పందంపై సంతకం చేశాయి. భారత్ 2017 నుండి సీఈఆర్ఎన్‌లో అసోసియేట్ సభ్యునిగా ఉంది.

అనుసంధాన‌త‌
భారత్, యూరోపియన్ యూనియన్ తమ భాగస్వామ్యానికి వ్యూహాత్మక స్తంభంగా కనెక్టివిటీపై తమ సహకారాన్ని స్థిరంగా విస్తరించాయి. ఇది అన్ని ప్రాంతాల్లో సుస్థిరమైన, కలుపుకొనిపోయే, బ‌ల‌మైన‌ సంబంధాలను ప్రోత్సహించే లక్ష్యంతో ఉంది. భారత్-ఈయూ కనెక్టివిటీ కార్యక్రమాలు ఆర్థిక ఏకీకరణను పెంచడానికి, ద్వైపాక్షిక నిమగ్నతకు మించి సమతుల్య అభివృద్ధికి మద్దతు ఇవ్వడానికి ప్రయత్నిస్తాయి.

భారత్-ఈయూ కనెక్టివిటీ భాగస్వామ్యం(2021) - 2021లో ప్రారంభించిన ఈ భాగస్వామ్యం రవాణా, డిజిటల్ మౌలిక సదుపాయాలు, ఇంధన వ్య‌వ‌స్థ‌లలో సహకారాన్ని బలోపేతం చేయడానికి ప్రయత్నిస్తుంది.

త్రైపాక్షిక అభివృద్ధి సహకారం(జూన్ 2025) - జూన్ 2025లో భారత్, యూరోపియన్ యూనియన్ తృతీయ‌ దేశాలలో అభివృద్ధి ప్రాజెక్టులను సంయుక్తంగా అమలు చేయడానికి ఒక పరిపాలనా ఒప్పందాన్ని చేసుకున్నాయి.

భారత్-మధ్యప్రాచ్యం-యూరప్ ఆర్థిక కారిడార్(ఐఎంఈసీ) (సెప్టెంబర్ 2023): సెప్టెంబర్ 2023లో న్యూఢిల్లీలో జరిగిన జీ20 నేతల సదస్సు సందర్భంగా భారత్, ఈయూ, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, సౌదీ అరేబియా, యూఏఈ, యునైటెడ్ స్టేట్స్ నేతలు ఇండియా-మిడిల్ ఈస్ట్‌-యూరోప్ ఎక‌నామిక్ కారిడార్‌(ఐఎంఈసీ) అభివృద్ధిపై సహకరించడానికి అవగాహన ఒప్పందాన్ని ప్రకటించారు.

శాస్త్ర‌, సాంకేతిక రంగం
శాస్త్ర‌, సాంకేతిక సహకారం అనేది భారత్-ఈయూ భాగస్వామ్యంలో ఒక ముఖ్యమైన స్తంభం. ఇది పరిశోధన, ఆవిష్కరణలను ప్రోత్సహించే సంస్థాగత వ్యవస్థల ద్వారా అభివృద్ధి చెందుతోంది.

ఈ ద్వైపాక్షిక సంబంధం 2007లో సంతకం చేసిన 'సైన్స్ అండ్ టెక్నాలజీ కోఆపరేషన్ అగ్రిమెంట్'పై ఆధారపడి ఉంది. దీని కింద ఒక జాయింట్ స్టీరింగ్ కమిటీ పనిచేస్తూ.. స్మార్ట్ గ్రిడ్లు, నీరు, టీకాలు, ఐసీటీ, పోలార్ సైన్స్‌, యువ శాస్త్రవేత్తల రాకపోకల వంటి రంగాలలో సహకారాన్ని పర్యవేక్షిస్తోంది.

శాస్త్ర‌, సాంకేతిక‌ మంత్రిత్వ శాఖ, యూరోపియన్ కమిషన్ కలిసి నిధులు సమకూర్చే ఒక విధానాన్ని ఏర్పాటు చేశాయి. దీని ద్వారా బ‌హారిజాన్ 2020" అనే యూరోపియన్ పరిశోధన కార్యక్రమంలో భారతీయులు పాల్గొనడానికి, ముఖ్యంగా వాతావరణ మార్పులు, పోలార్‌ పరిశోధనల్లో మద్దతు లభిస్తుంది.

భారత్-ఈయూ అంతరిక్ష సహకారం
అంతరిక్ష సహకారం అనేది భారత్-ఈయూ వ్యూహాత్మక భాగస్వామ్యంలో ఒక ముఖ్యమైన భాగం. ఇది దశాబ్దాల సాంకేతిక సహకారం, పెరుగుతున్న సంస్థాగత భాగస్వామ్యంపై నిర్మిత‌మైంది.

భారత్-ఈయూ అంతరిక్ష సంబంధాలు 1980ల నుండే ప్రారంభమయ్యాయి. అప్పట్లో భారతీయ ఉపగ్రహాలను యూరప్‌కు చెందిన 'ఆరియన్' లాంచర్ల ద్వారా ప్రయోగించేవారు. ఆ తర్వాత యూరోపియన్ కమిషన్, భారత అంతరిక్ష శాఖ మధ్య కుదిరిన ఒప్పందం ద్వారా భూ పరిశీలన రంగంలో సహకారం పెరిగింది. అదే సమయంలో, ఇస్రో, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ(ఈఎస్ఏ) పరస్పర సహకార ఒప్పందాలు చేసుకున్నాయి. దీనివల్ల చంద్రయాన్-3, ఆదిత్య-ఎల్‌1 వంటి కీలక మిషన్ల సమయంలో నావిగేషన్, డేటా నిర్వహణలో ఒకరికొకరు సహాయం చేసుకున్నారు. డిసెంబర్ 2024లో ఇస్రోకు చెందిన పీఎస్ఎల్‌వీ-ఎక్స్ఎల్‌ ద్వారా ఈఎస్ఏకు చెందిన‌ 'ప్రోబా-3' మిషన్‌ను విజయవంతంగా ప్రయోగించడం ఈ సహకారానికి నిదర్శనం.

ఈ కార్యకలాపాలతో పాటు ఉన్నత స్థాయి సమావేశాలు కూడా జరుగుతున్నాయి. ఫిబ్రవరి 2025లో ఈయూ రక్షణ, అంతరిక్ష కమిషనర్.. భారత శాస్త్ర‌, సాంకేతిక మంత్రితో న్యూఢిల్లీలో భేటీ అయ్యారు. దీనిని అనుసరించి నవంబర్ 2025లో బ్రస్సెల్స్‌లో మొట్టమొదటి భారత్-ఈయూ అంత‌రిక్ష అంశాల‌పై చ‌ర్చ‌లు జ‌రిపారు. అలాగే, మే 2025లో మానవ అంతరిక్ష యాత్రల కోసం ఇస్రో, ఈఎస్ఏ ఒక ఉమ్మడి ఒప్పందంపై సంతకం చేశాయి.

వలసలు, ఉపాధి
మొద‌ట్లో కేవలం చర్చలకే పరిమితమైన వలసల అంశం 2016లో 'కామన్ ఎజెండా ఆన్ మైగ్రేషన్ అండ్ మోబిలిటీస‌ (సీఏఎంఎం) అనే వ్యవస్థగా మారింది. ఇది నైపుణ్యం కలిగిన కార్మికులు, సామాజిక భద్రత, క్రమబద్ధమైన వలసలపై దృష్టి పెడుతుంది.

నవంబర్ 2025లో జరిగిన 9వ ఉన్నత స్థాయి చర్చల్లో దీని అమలును మరింత వేగవంతం చేశారు. ఐసీటీ నిపుణుల కోసం భారతదేశంలో 'యూరోపియన్ లీగల్ గేట్‌వే ఆఫీస్'ను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. 2024 చివరి నాటికి మొత్తం 9,31,607 మంది భారతీయ పౌరులు ఈయూలో నివసిస్తున్నారు. ముఖ్యంగా బ్లూ కార్డ్ పొందిన వారిలో భారతీయులే అత్యధికంగా(20.8%) ఉన్నారు.

'ఎరాస్మస్ ముండస్' స్కాలర్‌షిప్‌లను పొందుతున్న వారిలో భారతీయ విద్యార్థులు ముందు వరుసలో ఉన్నారు. గత 20 ఏళ్లలో 6,000 మందికి పైగా భారతీయ విద్యార్థులకు యూరప్‌లోని ప్రముఖ సంస్థల్లో చదువుకోవడానికి, పనిచేయడానికి ఈ స్కాలర్‌షిప్‌లు లభించాయి.

వ్యూహాత్మకంగా ఈ వలస భాగస్వామ్యాలు భారత‌దేశ‌ దౌత్య సంబంధాలను బలోపేతం చేస్తున్నాయి. చట్టపరమైన మార్గాలను సులభతరం చేయడం, అర్హతల గుర్తింపు ద్వారా భార‌త్‌, ఈయూ దేశాలకు అవసరమైన ప్రతిభను అందించే ప్రధాన వనరుగా భారతదేశం ఎదుగుతోంది.

ముగింపు
భారత్-ఈయూ సంబంధాలు ఉమ్మడి విలువలు, పెరుగుతున్న ఆర్థిక సంబంధాలు, వ్యూహాత్మక ప్రయోజనాలపై ఆధారపడి ఒక బలమైన భాగస్వామ్యంగా అభివృద్ధి చెందాయి. పెరుగుతున్న వాణిజ్యం, పెట్టుబడులు, క్లీన్ ఎనర్జీ, డిజిటల్ టెక్నాలజీ, భద్రత వంటి రంగాల్లో సహకారం స్పష్టమైన ఫలితాలను ఇస్తోంది.

ట్రేడ్ అండ్ టెక్నాలజీ కౌన్సిల్, గ్లోబల్ గేట్‌వే, ఐఎంఈసీ, ఎఫ్టీఏ చర్చలు భారత్, ఈయూ మధ్య పెరుగుతున్న సాన్నిహిత్యాన్ని ప్రతిబింబిస్తున్నాయి. ఈ క్రమంలో 2026 జనవరి 25-27 తేదీల్లో యూరోపియన్ కౌన్సిల్ ప్రెసిడెంట్, యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్‌లు భారతదేశంలో పర్యటించనున్నారు. ఈ పర్యటన భారత్ తన అంత‌ర్జాతీయ‌ వ్యూహంలో ఈయూ సంబంధాలకు ఎంత ప్రాముఖ్యత ఇస్తుందో తెలియజేస్తోంది.

 

 

References:

Ministry of External Affairs

Eurostat

 

European Union Commission

  • https://ec.europa.eu/commission/presscorner/detail/en/ip_25_2116

India–EU Partnership: India’s Growing Engagement with European Union

 

****

(Explainer ID: 157109) आगंतुक पटल : 64
Provide suggestions / comments
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , हिन्दी , Bengali , Gujarati , Kannada , Malayalam
Link mygov.in
National Portal Of India
STQC Certificate