Economy
పొదుపు నుంచి శక్తి: సుకన్య సమృద్ధి యోజన ద్వారా భారతీయ బాలికల సాధికారత
Posted On:
21 JAN 2026 12:36PM
కీలకాంశాలు
- ప్రభుత్వం చేపట్టిన 'బేటీ బచావో, బేటీ పఢావో' ప్రచారంలో భాగంగా 2015 జనవరి 22న సుకన్య సమృద్ధి యోజన ప్రారంభమైంది.
- ఇది భారత ప్రభుత్వం చేత నోటిఫై అయిన చిన్న పొదుపు పథకం. దీని కింద డిపాజిట్లు ప్రభుత్వం ఎప్పటికప్పుడు నోటిఫై చేసే వడ్డీ రేట్లను పొందుతాయి. పథకం నిబంధనల ప్రకారం ఆ మొత్తాలు అందుతాయి. ప్రస్తుతం ఎస్ఎస్‌వై కింద వడ్డీ రేటు 8.2% గా ఉంది.
- ఇప్పటివరకు 4.53 కోట్లకు పైగా ఖాతాలు తెరివగా, మొత్తం డిపాజిట్లు రూ.3.33 లక్షల కోట్ల కంటే ఎక్కువగా ఉన్నాయి(డిసెంబర్ 2025 నాటికి).
కుమార్తెల సాధికారత: సుకన్య సమృద్ధి యోజన వెనుక ఉన్న సంకల్పం

భారతదేశవ్యాప్తంగా లక్షలాది మంది బాలికల కలలను సాకారం చేయడానికి, వారి భవిష్యత్తును భద్రంగా మార్చడానికి ప్రభుత్వం చేస్తున్న కృషికి నిదర్శనం సుకన్య సమృద్ధి యోజన(ఎస్ఎస్‌వై). 22 జనవరి 2015న బేటీ బచావో, బేటీ పఢావో ప్రచారంలో భాగంగా ప్రారంభించిన ఈ పథకం పొదుపు పథకానికి మించినదిగా రూపొందించారు. ఇది ఆర్థిక భద్రత, సామాజిక మార్పుల మధ్య ఒక వారధిగా పనిచేస్తుంది. తమ కుమార్తెల విద్య, సంక్షేమం కోసం ముందుగానే ప్రణాళిక వేసుకోవాలని కుటుంబాలను ప్రోత్సహించడం ద్వారా ఎస్ఎస్‌వై క్షేత్రస్థాయిలో ఆత్మవిశ్వాసం, సమ్మిళితత్వం, దీర్ఘకాలిక పురోగతిని పెంపొందించడంలో సహాయపడింది.
22 జనవరి 2026 నాటికి ఎస్ఎస్‌వై 11 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఇది తమ కుమార్తెల భవిష్యత్తుపై లక్షలాది కుటుంబాలకు ఉన్న నమ్మకానికి నిదర్శనంగా నిలుస్తోంది. ప్రారంభం నుంచి 4.53 కోట్లకు పైగా ఖాతాలు తెరిచారు. ప్రతి ఖాతా ఒక ఆడపిల్ల సామర్థ్యంపై నమ్మకాన్ని తెలియజేస్తుంది. ఒక ఆడపిల్లను శక్తివంతురాలిని చేయడం వల్ల కుటుంబాలు, సమాజాలు, చివరికి దేశమే బలోపేతం అవుతుందనే ఆలోచనను ఇది బలపరుస్తుంది. ఇది ఎస్ఎస్‌వైని సమానత్వం, అవకాశాల దిశగా దేశవ్యాప్త ఉద్యమంగా మార్చింది.
బాలికల భవిష్యత్తుకు భద్రత: సుకన్య సమృద్ధి యోజన ఎలా పనిచేస్తుంది
మీకు తెలుసా?
ఎస్ఎస్‌వై పథకంలో ప్రస్తుతం ఉన్న ఏడాదికి 8.2% వడ్డీ రేటు కుమార్తెల కోసం కేటాయించిన పొదుపు సాధనాల్లో అత్యధికమైన వాటిలో ఒకటి!

ఎస్ఎస్‌వై పథకం తక్కువ రిస్క్ కలిగిన డిపాజిట్ పథకం. ఇందులో అసలు, ప్రతి త్రైమాసికంలో నిర్ణయించి, ఏటా చెల్లించే వడ్డీకి ప్రభుత్వం హామీ ఇస్తుంది.
ఈ పథకానికి ఆర్థిక, సామాజిక ప్రాముఖ్యత రెండూ ఉన్నాయి. ఇది కేవలం ఆర్థిక పెట్టుబడి మాత్రమే కాదు, ఆడపిల్లల ఉజ్వల, సంపన్న భవిష్యత్తును భద్రపరచడానికి ఒక ఉత్ప్రేరకం. ఇది ఆడపిల్లల విద్య, వివాహ ఖర్చులను తీర్చడానికి ఉద్దేశించిన పథకం. ఆమె విద్య, ఆర్థిక భద్రతను పెంపొందించడం ద్వారా ఈ చొరవ మహిళా సాధికారతను బలోపేతం చేయడంతో పాటు భవిష్యత్తులో ఆత్మనిర్భర సంకల్పానికి దోహదం చేస్తుంది.
ఎస్ఎస్‌వై ఖాతా అంటే ఏమిటి, ఎవరు తెరవగలరు?
ఎస్ఎస్‌వై ఖాతా అనేది ఎస్ఎస్‌వై పథకం కింద జమ చేసిన నిధులను కలిగి ఉండే ఖాతా. తల్లిదండ్రులు లేదా చట్టబద్ధమైన సంరక్షకులు తమ భారతీయ ఆడపిల్ల కోసం ఏదైనా ఇండియా పోస్ట్ ఆఫీస్ లేదా ఏదైనా ప్రభుత్వ రంగ బ్యాంకు, అధీకృత ప్రైవేటు రంగ బ్యాంకుల(హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, ఐడీబీఐ బ్యాంక్) శాఖల్లో ఖాతాను తెరవవచ్చు.
- ఖాతాను ఆడపిల్ల పుట్టినప్పటి నుంచి ఆమెకు 10 ఏళ్లు నిండే వరకు ఎప్పుడైనా తెరవవచ్చు.
- ఒక ఆడపిల్లకు ఒకే ఎస్ఎస్‌వై ఖాతా తెరిచేందుకు అనుమతి ఉంటుంది. ఒక కుటుంబం గరిష్టంగా ఇద్దరు ఆడపిల్లల కోసం ఖాతాలను తెరవవచ్చు. అయితే, కవలలు లేదా ముగ్గురు పిల్లలు పుట్టిన సందర్భాలలో సంబంధిత జనన ధ్రువీకరణ పత్రాలతో పాటు అఫిడవిట్ సమర్పించి రెండింటి కంటే ఎక్కువ ఖాతాలను తెరవడానికి అనుమతి ఉంది.
- ఈ ఖాతాను భారతదేశంలోని ఏ ప్రాంతానికైనా బదిలీ చేసుకోవచ్చు.
ముఖ్యంగా ఆడపిల్లకు పద్దెనిమిది ఏళ్లు వచ్చే వరకు ఖాతాను తల్లిదండ్రులు/సంరక్షకులు నిర్వహిస్తారు. ఇది పొదుపును పర్యవేక్షించడానికి, నిధులను పిల్లల విద్య, భవిష్యత్తు అవసరాల కోసం సమర్థవంతంగా వినియోగించేలా చూడటానికి సంరక్షకుడిని అనుమతిస్తుంది. పద్దెనిమిది ఏళ్లు నిండిన తర్వాత ఖాతాదారు అవసరమైన పత్రాలను సమర్పించడం ద్వారా ఖాతాను స్వయంగా తన ఆధీనంలోకి తీసుకోవచ్చు.
ఖాతా తెరవడానికి ఏ పత్రాలు అవసరం?
ఎస్ఎస్‌వై ఖాతాను తెరవడానికి నాలుగు కీలక పత్రాలు అవసరం -
- సుకన్య సమృద్ధి ఖాతా ప్రారంభ ఫారమ్(బ్యాంకులు/పోస్ట్ ఆఫీసుల్లో అందుబాటులో ఉంటుంది)
- ఆడపిల్ల జనన ధ్రువీకరణ పత్రం
- యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా జారీ చేసిన ఆధార్ నంబర్
- ఆదాయపు పన్ను నిబంధనలలో నిర్వచించిన విధంగా పర్మనెంట్ అకౌంట్ నంబర్(పాన్) లేదా ఫారమ్ 60
ఎస్ఎస్‌వై ఖాతాకు ఎంత డిపాజిట్ అవసరం?
మీకు తెలుసా?
ఎస్ఎస్‌వై ఖాతాలలో మొత్తం డిపాజిట్లు రూ.3,33,000 కోట్లు దాటాయి!(డిసెంబర్ 2025)
తల్లిదండ్రులు, సంరక్షకులు ఎస్ఎస్‌వై ఖాతాలో కనీస ప్రాథమిక డిపాజిట్ రూ.250తో ప్రారంభించవచ్చు. తదుపరి డిపాజిట్లు రూ.50 గుణిజాలలో చేయవచ్చు. అయితే ఒక ఆర్థిక సంవత్సరంలో కనీసం రూ.250 డిపాజిట్ చేయాలి. మొత్తం వార్షిక డిపాజిట్ పరిమితి రూ.1,50,000గా ఉంది. అంతకంటే ఎక్కువ మొత్తంపై వడ్డీ లభించదు. అది తిరిగి ఇచ్చేస్తారు.

ఖాతా తెరిచిన తేదీ నుండి పదిహేను సంవత్సరాల వరకు డిపాజిట్లు చేయవచ్చు.
వడ్డీ లెక్కింపు ఎలా జరుగుతుంది?
ప్రతి నెలా లెక్కించే వడ్డీని ప్రతి ఆర్థిక సంవత్సరం చివరలో ఖాతాకు జోడిస్తారు. సంవత్సరంలో ఖాతాను వేరే బ్యాంకు లేదా పోస్ట్ ఆఫీసుకు బదిలీ చేసినప్పటికీ వడ్డీ మాత్రం ఆర్థిక సంవత్సరం చివరలో జమ అవుతుంది, తద్వారా ఆడపిల్ల కోసం పొదుపు నిరంతరంగా, సురక్షితంగా పెరుగుతుంది.
ఎస్ఎస్‌వై ఖాతా నుంచి డబ్బును ఎలా విత్‌డ్రా చేయాలి?
ఖాతాదారు విద్యా అవసరాల కోసం అంతకుముందు ఆర్థిక సంవత్సరం చివరలో ఉన్న బ్యాలెన్స్‌లో 50% వరకు విత్‌డ్రా చేసుకోవచ్చు. ఖాతాదారుకు పద్దెనిమిది ఏళ్లు నిండిన తర్వాత లేదా పదో తరగతి ఉత్తీర్ణత సాధించిన తర్వాత(ఏది ముందు అయితే అది) ఈ సౌకర్యం అందుబాటులోకి వస్తుంది. దరఖాస్తు చేయడానికి ధ్రువీకరించిన అడ్మిషన్ లెటర్ లేదా విద్యా సంస్థ జారీ చేసిన ఫీజు స్లిప్ వంటి సంబంధిత పత్రాలతో కూడిన అధికారిక దరఖాస్తును ఖాతాదారు సమర్పించాలి.
విత్‌డ్రా మొత్తాన్ని ఒకేసారి లేదా వాయిదాల పద్ధతిలో తీసుకోవచ్చు. అయితే, ఐదు సంవత్సరాల కాలపరిమితిలో సంవత్సరానికి గరిష్టంగా ఒక విత్‌డ్రాకు మాత్రమే అవకాశం ఉంటుంది. అన్ని సందర్భాల్లోనూ విత్‌డ్రా చేసిన మొత్తం సమర్పించిన పత్రాలలో పేర్కొన్న వాస్తవ ఫీజులు, ఛార్జీల కంటే ఎక్కువగా ఉండకూడదు.
ఎస్ఎస్‌వై ఖాతా ఎప్పుడు మెచ్యూర్ అవుతుంది? ఎవరైనా ముందుగానే మూసివేయవచ్చా?
ఎస్ఎస్‌వై ఖాతా తెరిచిన తేదీ నుంచి ఇరవై ఒక్క ఏళ్లు పూర్తయిన తర్వాత మెచ్యూర్ అవుతుంది. నిర్దిష్ట పరిస్థితుల్లో మాత్రమే ఖాతాను ముందస్తుగా మూసివేయడానికి అనుమతి ఉంటుంది:
ఖాతాదారు మెచ్యూరిటీ కంటే ముందే వివాహం చేసుకోవాలనుకున్నప్పుడు
- ఖాతాదారు దరఖాస్తుతో పాటు నోటరీ ద్వారా ధ్రువీకరించిన నాన్-జుడీషియల్ స్టాంప్ పేపర్‌పై డిక్లరేషన్, వివాహ తేదీ నాటికి తనకు కనీసం పద్దెనిమిది ఏళ్లు నిండుతాయని ధ్రువీకరించే వయస్సు ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించాలి.
- వివాహానికి ఒక నెల ముందు లేదా వివాహం తర్వాత మూడు నెలల లోపు మాత్రమే ఖాతాను మూసివేయవచ్చు. ఆమోదం పొందిన తర్వాత ఖాతాదారు వర్తించే వడ్డీతో పాటు బ్యాలెన్స్‌ను విత్‌డ్రా చేయడానికి దరఖాస్తు చేసుకోవచ్చు. తద్వారా నిధులు సకాలంలో అందుతాయి.
ఖాతాదారు మరణిస్తే
- సంబంధిత అధికారి జారీ చేసిన మరణ ధ్రువీకరణ పత్రం, దరఖాస్తును సమర్పించిన వెంటనే ఖాతాను మూసివేయవచ్చు.
- మరణించిన తేదీ వరకు వచ్చిన వడ్డీతో కూడిన నిల్వ(బ్యాలెన్స్)ను సంరక్షకుడికి చెల్లిస్తారు.
- మరణించిన తేదీ నుంచి ఖాతా మూసివేసే వరకు ఉన్న కాలానికి వడ్డీని పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ ఖాతాలకు వర్తించే రేటు ప్రకారం లెక్కిస్తారు.
అయితే ఖాతా తెరిచిన తేదీ నుంచి మొదటి ఐదు సంవత్సరాలలోపు ముందస్తు ముగింపుకు అనుమతి లేదు.
ఆడపిల్లల కోసం సుకన్య సమృద్ధి యోజన ఎందుకు తెలివైన ఎంపిక
ప్రభుత్వ మద్దతు ఉన్న ప్రముఖ పొదుపు పథకం కావడంతో ఎస్ఎస్‌వై అధిక రాబడి, పన్ను ప్రయోజనాలు, విద్య, భవిష్యత్తు అవసరాల కోసం సౌకర్యవంతమైన విత్‌డ్రా ఎంపికలను అందించడం ద్వారా ఆడపిల్లలకు దీర్ఘకాలిక ఆర్థిక భద్రతను కల్పించే లక్ష్యంతో ఉంది. ఇది ఆడపిల్లల ఆర్థిక భవిష్యత్తును భద్రపరచడానికి రూపొందించిన అనేక ప్రయోజనాలను అందిస్తుంది-
ఈ పథకం ఆకర్షణీయమైన వడ్డీ రేటును అందిస్తుంది. దీనిని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఎప్పటికప్పుడు నోటిఫై చేస్తుంది. ఇది కాలక్రమేణా పొదుపు స్థిరంగా పెరగడానికి సహాయపడుతుంది.
ఈ పథకం కింద చేసే పెట్టుబడులు ఆదాయపు పన్ను చట్టం-1961లోని సెక్షన్ 80సీ కింద పన్ను ప్రయోజనాలకు అర్హత పొందుతాయి.
డిపాజిట్ పరిధి పెద్దదిగా ఉంటుంది. కనీస వార్షిక విరాళం రూ.250, గరిష్టంగా రూ.1.5 లక్షలు. అంతేకాకుండా పాక్షిక విత్‌డ్రా సదుపాయాన్ని కూడా పొందవచ్చు.
మెచ్యూరిటీ సమయంలో ఖాతాను మూసివేయకపోయినా పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ ఖాతాకు వర్తించే రేటు ప్రకారం ఇది వడ్డీని అందిస్తూనే ఉంటుంది.

ఆమెతో పాటు ఎదిగే పథకం
భారతదేశంలోని బాలికలకు సురక్షితమైన, సాధికారత కలిగిన భవిష్యత్తును నిర్మించడంలో సుకన్య సమృద్ధి యోజన ఒక అర్థవంతమైన అడుగుగా నిలుస్తుంది. దీర్ఘకాలిక పొదుపును ప్రోత్సహించడం, విద్య, ఆర్థిక స్వాతంత్య్రానికి ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా ఈ పథకం కుటుంబాలలో ఆర్థిక బాధ్యతను, విస్తృత సామాజిక పురోగతిని పెంపొందిస్తుంది.
ఖాతాల స్వీకరణలో నిరంతర పెరుగుదల ఈ చొరవపై పెరుగుతున్న నమ్మకాన్ని, ప్రభావాన్ని హైలైట్ చేస్తుంది. భారతదేశం మెరుగైన లింగ సమానత్వం, సమ్మిళితత్వం దిశగా సాగుతున్న కొద్దీ ప్రతి ఆడపిల్ల ఎదగడానికి, విజయం సాధించడానికి, ఆమె పూర్తి సామర్థ్యాన్ని గ్రహించడానికి అవసరమైన వనరులు, ఆత్మవిశ్వాసంతో మద్దతు ఇచ్చేలా చూడటంలో ఎస్ఎస్‌వై కీలక పాత్ర పోషిస్తుంది.
References
Ministry of Finance
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2094807®=3&lang=2#:~:text=Maturity%20of%20the%20account,access%20to%20funds%20when%20needed.
https://www.pib.gov.in/PressReleaseIframePage.aspx?PRID=1778546®=3&lang=2
https://www.pib.gov.in/PressReleaseIframePage.aspx?PRID=1990745®=3&lang=2
https://static.pib.gov.in/WriteReadData/specificdocs/documents/2022/jan/doc20221207101.pdf
Prime Minister's Office
https://www.pib.gov.in/PressReleseDetail.aspx?PRID=2191605®=3&lang=1
Directorate of Small Savings, Govt. of Assam
https://smallsavings.assam.gov.in/portlets/take-care-with-sukanya-samriddhi-account
https://finance.assam.gov.in/portlets/sukanya-samriddhi-for-your-girl-child
Government of Uttar Pradesh, Moradabad Division
https://moradabaddivision.nic.in/scheme/sukanya-samriddhi-yojana/
Sansad.in
https://sansad.in/getFile/loksabhaquestions/annex/178/AU767.pdf?source=pqals
https://sansad.in/getFile/loksabhaquestions/annex/184/AU3747_MIzukL.pdf?source=pqals
mygov.in
https://transformingindia.mygov.in/scheme/sukanya-samriddhi-yojana/#intro
State Bank of India
https://www.sbisecurities.in/calculators/sukanya-samriddhi-yojana
https://sbi.bank.in/web/personal-banking/investments-deposits/govt-schemes/sukanya-samriddhi-yojana
Others
https://www.ibef.org/news/over-us-36-72-billion-deposited-in-banks-under-sukanya-samriddhi-scheme-prime-minister-mr-narendra-modi
Click here for pdf file.
***
(Explainer ID: 157026)
आगंतुक पटल : 66
Provide suggestions / comments