Social Welfare
పీఎం స్వనిధి: వీధి వ్యాపారులకు సాధికారత
Posted On:
20 DEC 2025 5:18PM
కీలకాంశాలు
- పునర్వ్యవస్థీకరించిన పీఎం స్వనిధి పథకం 50 లక్షల మంది కొత్త లబ్ధిదారులతో కలిపి మొత్తం 1.15 కోట్ల మంది వీధి వ్యాపారులకు ప్రయోజనం చేకూర్చాలని లక్ష్యంగా పెట్టుకుంది.
- రుణ కాలపరిమితిని మార్చి 31, 2030 వరకు పొడిగించారు.
పరిచయం: సాధికారతకు బాటలు
వీధి వ్యాపారులు నగరాల అసంఘటిత ఆర్థిక వ్యవస్థలో ఒక ముఖ్యమైన భాగంగా ఉంటారు. స్వయం ఉపాధికి మూలమైన వీధి వ్యాపారం.. పట్టణ సరఫరా గొలుసులో ప్రముఖ స్థానాన్ని కలిగి ఉంటుంది. వీధి వ్యాపారం జనాభాలోని అన్ని వర్గాలకు వారి ఇంటి వద్దకే వస్తువులు, సేవలను సులభంగా అందుబాటులోకి తెస్తుంది.
అయితే, గుర్తింపు లేకపోవడం, అధికారిక రుణాల అందుబాటు పరిమితంగా ఉండటం, సరైన విద్య, నైపుణ్యాలు లేకపోవడం, నిర్దేశిత ప్రాంతాల్లో ఉండకపోవడం, అభివృద్ధి చెందుతున్న మార్కెట్ అవకాశాల వినియోగం పరిమితంగా ఉండటం వంటివి వీధి వ్యాపారులు ఎదుర్కొంటున్న కొన్ని ఇబ్బందులు. అసంఘటితంగా, స్వయం ఉపాధి పొందుతున్న కారణంగా వీధి వ్యాపారులు, వారి కుటుంబాలకు తరచుగా సామాజిక భద్రత, సంక్షేమం, ప్రభుత్వ పథకాలతో అనుసంధానం ఉండదు. ఇది కష్టకాలంలో లేదా ఊహించని పరిస్థితుల్లో సహాయం అవసరమైనప్పుడు వీధి వ్యాపారులను, వారి కుటుంబాలను ఇబ్బందులకు గురిచేస్తుంది.
జూన్ 2020లో ప్రారంభించిన పీఎం స్వనిధి పథకం ఆర్థిక ఇబ్బందుల ప్రతికూల ప్రభావాలను అధిగమించడానికి, కొవిడ్ మహమ్మారి సమయంలో కోల్పోయిన వ్యాపారాలను తిరిగి ప్రారంభించడానికి వీధి వ్యాపారులకు సహాయం చేయడానికి రూపొందించిన పథకం. అయితే, ఈ పథకం ప్రారంభమైనప్పటి నుంచి ఇది వీధి వ్యాపారులకు కేవలం ఆర్థిక సహాయంగా మాత్రమే కాకుండా వారికి ఒక గుర్తింపును, ఆర్థిక వ్యవస్థకు వారు అందిస్తున్న సహకారానికి అధికారిక గౌరవాన్ని ఇచ్చింది.
ఆగస్టు 27, 2025న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం "ప్రధాన మంత్రి వీధి వ్యాపారుల ఆత్మనిర్భర్ నిధి (పీఎం స్వనిధి) పథకం రుణ కాలపరిమితిని 31.12.2024 తర్వాత కూడా పునర్వ్యవస్థీకరించడానికి, పొడిగించడానికి" ఆమోదం తెలిపింది. రుణ కాలపరిమితి ఇప్పుడు మార్చి 31, 2030 వరకు పొడిగించింది. ఈ పథకం కోసం మొత్తం వ్యయం రూ.7,332 కోట్లు. పునర్వ్యవస్థీకరించిన ఈ పథకం 50 లక్షల మంది కొత్త లబ్ధిదారులు సహా మొత్తం 1.15 కోట్ల మంది లబ్ధిదారులకు ప్రయోజనం చేకూర్చాలని లక్ష్యంగా పెట్టుకుంది.
రుణాల పంపిణీ, సంక్షేమ అనుసంధానం

మొదటి, రెండో విడతలో రుణ మొత్తాన్ని పెంచడం, రెండో రుణాన్ని సకాలంలో తిరిగి చెల్లించిన లబ్ధిదారులకు యూపీతో అనుసంధానమై ఉండే రూపే క్రెడిట్ కార్డ్ సౌకర్యం కల్పించడం, రిటైల్, హోల్‌సేల్ లావాదేవీల కోసం డిజిటల్ క్యాష్‌బ్యాక్ ప్రోత్సాహకాలు ఇవ్వడం వంటివి పునర్వ్యవస్థీకరించిన పథకం ముఖ్య లక్షణాలు. ఈ పథకం పరిధిని చట్టబద్ధమైన పట్టణాల నుంచి సెన్సస్ పట్టణాలు, పాక్షిక పట్టణ ప్రాంతాలు మొదలైన వాటికి క్రమ పద్ధతిలో విస్తరిస్తున్నారు.
పెంచిన రుణ నిర్మాణంలో మొదటి విడత రుణం రూ.15,000కు (రూ.10,000 నుంచి), రెండో విడత రుణం రూ.25,000కు (రూ.20,000 నుంచి) పెరిగింది. మూడో విడత రూ.50,000గా ఉంది.
యూపీఐతో అనుసంధానమై ఉండే రూపే క్రెడిట్ కార్డు ఇవ్వడం ద్వారా వీధి వ్యాపారులకు వారి అత్యవసర వ్యాపార, వ్యక్తిగత అవసరాలను తీర్చుకోవడానికి తక్షణ రుణ సదుపాయాన్ని అందిస్తుంది.
దీంతో పాటు డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించడానికి, వీధి వ్యాపారులు డిజిటల్ లావాదేవీలపై క్యాష్‌బ్యాక్ పొందవచ్చు:
- క్రమం తప్పకుండా చేసే అమ్మకాలపై నెలకు గరిష్టంగా రూ.100 చొప్పున రూ.1,200 వరకు క్యాష్‌బ్యాక్.
- రూ.2,000 లేదా అంతకంటే ఎక్కువ విలువైన హోల్‌సేల్ కొనుగోళ్లపై రూ.400 వరకు క్యాష్‌బ్యాక్(లావాదేవీకి రూ.20 చొప్పున త్రైమాసికానికి గరిష్టంగా రూ.100).
ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో, జీవనోపాధిని ప్రోత్సహించడంలో, ఆర్థిక సమ్మిళితత్వాన్ని పెంపొందించడంలో, డిజిటల్ సాధికారతను అందించడంలో అత్యుత్తమ కృషి చేసినందుకు ఈ పథకానికి ఆవిష్కరణ(కేంద్ర స్థాయి) కోసం పరిపాలన(2023) విభాగంలో ప్రతిభకు ప్రధానమంత్రి అవార్డు లభించింది. అలాగే డిజిటల్ వినియోగంలో ప్రభుత్వ ప్రాసెస్ రీ-ఇంజనీరింగ్‌లో(2022) రజత పురస్కారం గెలుచుకుంది.
ఉపశమనం నుండి వృద్ధి వరకు: పునర్వ్యవస్థీకరించిన పీఎం స్వనిధి పథకం
2020లో కోవిడ్ మహమ్మారి సమయంలో మైక్రో-క్రెడిట్ మద్దతుగా ప్రారంభమైన ఈ పునర్వ్యవస్థీకరించిన పథకం.. వ్యాపార విస్తరణ, స్థిరమైన వృద్ధికి అవసరమైన ఆర్థిక వనరులను అందించడం ద్వారా వీధి వ్యాపారుల సమగ్ర అభివృద్ధిని ఉపకరిస్తోంది. ఈ పథకం కేవలం సమగ్ర ఆర్థిక వృద్ధిని ప్రోత్సహించడమే కాకుండా వీధి వ్యాపారులు, వారి కుటుంబాల సామాజిక-ఆర్థిక ఉన్నతిపై దృష్టి పెడుతుంది. వారి జీవనోపాధిని మెరుగుపర్చడంతో పాటు పట్టణ ప్రాంతాలను శక్తివంతమైన, స్వయం సమృద్ధ వ్యవస్థగా మారుస్తుంది. ఈ పథకం వ్యాపార ఆసక్తి, ఆర్థిక అక్షరాస్యత, డిజిటల్ నైపుణ్యాలు, మార్కెటింగ్, వీధి వ్యాపారుల సామర్థ్యాన్ని పెంపొందించడంపై దృష్టి పెడుతుంది. ఎఫ్ఎస్ఎస్ఏఐ భాగస్వామ్యంతో వీధి ఆహార విక్రేతల కోసం ప్రామాణిక పరిశుభ్రత, ఆహార భద్రత శిక్షణ నిర్వహిస్తున్నారు.
పీఎం స్వనిధి ప్రయోజనాల అందజేతలో సంస్థాగత పాత్రలు
ఈ పథకాన్ని అమలు చేయడం కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ఆర్థిక సేవల విభాగం సంయుక్త బాధ్యత. బ్యాంకులు/ఆర్థిక సంస్థలు, వారి క్షేత్రస్థాయి సిబ్బంది ద్వారా రుణాలు/క్రెడిట్ కార్డుల సౌకర్యాన్ని కల్పించడానికి డీఎఫ్ఎస్ బాధ్యత వహిస్తుంది.
పీఎం స్వనిధి కేంద్ర ప్రభుత్వ పథకం అయినప్పటికీ రాష్ట్రాలు, బ్యాంకులు, పట్టణ స్థానిక సంస్థల సన్నిహిత సహకారం ద్వారానే ప్రభావవంతమైన అమలు చేయడం సాధ్యమవుతుంది. వీధి వ్యాపారులను గుర్తించడం, రుణ ప్రక్రియలను సులభతరం చేయడం, లబ్ధిదారులను సంక్షేమ పథకాలతో అనుసంధానించడంలో రాష్ట్ర ప్రభుత్వాలు, యూఎల్‌బీలు కీలకపాత్ర పోషిస్తాయి. బ్యాంకులు సజావుగా రుణ పంపిణీ చేయడంలో, సకాలంలో వడ్డీ రాయితీ ప్రక్రియ చేపట్టడం, డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించేలా చూస్తాయి. ఈ భాగస్వాములన్నీ కలిసి ఈ పథకాన్ని విధానం నుంచి వాస్తవంలోకి తీసుకువచ్చి దేశవ్యాప్తంగా వీధి వ్యాపారులకు అవకాశాలను, గౌరవాన్ని కల్పిస్తాయి.
లోక్ కళ్యాణ్ మేళా, స్వనిధి సంకల్ప్ అభియాన్ ద్వారా అవగాహన, రుణ పంపిణీ పెంపు
వీధి వ్యాపారులు, వారి కుటుంబాల సమగ్ర సంక్షేమం, అభివృద్ధిని మరింత ముందుకు తీసుకెళ్లడానికి కాలానుగుణంగా 'లోక్ కళ్యాణ్ మేళాల' ద్వారా 'స్వనిధి సే సమృద్ధి' అంశాన్ని బలోపేతం చేస్తున్నారు. భారత ప్రభుత్వ వివిధ పథకాల ప్రయోజనాలు సంతృప్త పద్ధతిలో వ్యాపారులకు, వారి కుటుంబాలకు అందేలా చూడటం, వారి వృద్ధి, సంక్షేమం కోసం మరింత సమగ్రమైన, మద్దతు ఇచ్చే వ్యవస్థను పెంపొందించడం దీని లక్ష్యం. ప్రత్యేక ప్రచారంలో భాగంగా 2025 సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 15 వరకు అన్ని పట్టణ స్థానిక సంస్థలలో "లోక్ కళ్యాణ్ మేళాలు" నిర్వహించారు. ప్రత్యేక లోక్ కళ్యాణ్ పోర్టల్ ద్వారా వీటి పర్యవేక్షణ జరిగింది. ఈ మేళాలు విక్రేతల సమీకరణ, రుణ దరఖాస్తుల సమర్పణ, రుణాల పంపిణీని వేగవంతం చేయడం, లబ్ధిదారులను డిజిటల్ వ్యవస్థలోకి తీసుకురావడాన్ని సులభతరం చేశాయి.
పీఎం స్వనిధి పథకం విజయాలు
స్వనిధి సే సమృద్ధి:

'స్వనిధి సే సమృద్ధి' భారత ప్రభుత్వానికి చెందిన 8 సంక్షేమ పథకాలతో లబ్ధిదారులను అనుసంధానించింది. 47 లక్షల కంటే ఎక్కువ మంది వీధి వ్యాపారులు, కుటుంబాల నమోదు ప్రక్రియ పూర్తయింది. 2025 డిసెంబర్ 9 నాటికి 1.46 కోట్లకు పైగా పథకాలు మంజూరు అయ్యాయి.

ముగింపు:
పీఎం స్వనిధి పథకం పొడిగింపు వీధి వ్యాపారులకు ఆర్థిక స్థిరత్వాన్ని అందించడమే కాకుండా సమగ్ర పట్టణాభివృద్ధి విస్తృత దృక్పథాన్ని ప్రతిబింబిస్తోంది. షూరిటీ లేని బ్యాంక్ రుణాలు, రుణ చరిత్ర సృష్టి, యూపీఐ-ఆధారిత డిజిటల్ చెల్లింపు వేదికలతో వీధి వ్యాపారులను అధికారిక ఆర్థిక వ్యవస్థలో చేర్చడం ద్వారా ఈ పథకం అసంఘటిత జీవనోపాధి నుంచి స్థిరమైన సూక్ష్మ వ్యాపార నిర్వహణ వైపు మార్పును సులభతరం చేస్తుంది. అదే సమయంలో ఈ పథకం సామాజిక భద్రత, సంక్షేమ అనుసంధానాలకు ప్రవేశాన్ని ప్రోత్సహిస్తుంది. తద్వారా విక్రేతలు, వారి కుటుంబాలకు కష్టనష్టాలను తగ్గించి దీర్ఘకాలిక జీవనోపాధి భద్రతను పెంచుతుంది. నిరంతర డిజిటల్ వినియోగం, ఆర్థిక అక్షరాస్యత, సామర్థ్య పెంపుదల మద్దతు ద్వారా పీఎం స్వనిధి పట్టణ అసంఘటిత ఆర్థిక వ్యవస్థలోని అత్యంత కీలకమైన విభాగాలలో ఒకటైన వీధి వ్యాపారుల సాధికారతకు దోహదపడుతోంది. ప్రతి పౌరుడికి అభివృద్ధి చెందే అవకాశం ఉండే దృఢమైన, స్వయం సమృద్ధి అవకాశాల పట్ల కేంద్ర ప్రభుత్వ నిబద్ధతను పునరుద్ఘాటిస్తుంది.
References:
Ministry of Housing and Urban Affairs
***
(Explainer ID: 157012)
आगंतुक पटल : 54
Provide suggestions / comments