Economy
స్టార్టప్ ఇండియాకు దశాబ్దం
ఆవిష్కరణల విస్తరణ, భారతదేశ అభివృద్ధి గాథ రూపకల్పన
Posted On:
15 JAN 2026 2:16PM
కీలకాంశాలు
- 2025 డిసెంబర్ నాటికి 2 లక్షలకు పైగా డీపీఐఐటీ గుర్తింపు పొందిన అంకుర సంస్థలతో భారతదేశం ప్రపంచంలోని అతిపెద్ద అంకుర సంస్థల వ్యవస్థలలో ఒకటిగా పటిష్టంగా నిలిచింది.
- స్టార్టప్ ఇండియా ఈ దశాబ్ద కాలంలో ఆలోచన నుంచి నిధుల సమీకరణ, మార్గదర్శకత్వం, విస్తరణ వరకు పూర్తి స్థాయి మద్దతు వ్యవస్థను నిర్మించింది.
- దాదాపు 50% డీపీఐఐటీ గుర్తింపు పొందిన అంకురాలు ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల నుంచి వస్తున్నాయి. ఇది వ్యవస్థాపకత ప్రజాస్వామ్యీకరణను సూచిస్తుంది.
- ఏఐఎం 2.0 అనేది వ్యవస్థలోని లోపాలను సరిదిద్దడానికి, ప్రభుత్వాలు, పరిశ్రమలు, విద్యాసంస్థలు, సమాజ సహకారంతో నిరూపితమైన నమూనాలను విస్తరించడానికి కొత్త కార్యక్రమాలకు మార్గనిర్దేశం చేయడంపై దృష్టి సారించింది.
- ఎస్‌వీఈపీ, ఏఎస్‌పీఐఆర్ఈ, పీఎంఈజీపీ వంటి గ్రామీణ, అట్టడుగు స్థాయి కార్యక్రమాలు సూక్ష్మ పరిశ్రమలు, మహిళల నేతృత్వంలోని సంస్థలు, స్థానిక ఉపాధిని ప్రోత్సహిస్తున్నాయి.
అంకుర సంస్థలు: ఆర్థికాభివృద్ధిలో కీలక పాత్ర
2026 జనవరి 16న జాతీయ అంకుర సంస్థల దినోత్సవం స్టార్టప్ ఇండియా కార్యక్రమ దశాబ్ద మైలురాయికి సూచిక. 2016లో వ్యవస్థాపకతను శక్తివంతం చేయడానికి ఒక విధానపరమైన నిర్ణయంగా ఈ కార్యక్రమం ప్రారంభమైంది. నేడు ప్రపంచంలోని అతిపెద్ద, విభిన్నమైన అంకుర సంస్థల వ్యవస్థలలో ఒకటిగా అభివృద్ధి చెందింది. "స్టార్టప్ ఇండియా" సారథ్యంలో ఈ ఉద్యమం భారతదేశ వ్యవస్థాపక, ఆవిష్కరణారంగంపై విప్లవాత్మక ప్రభావాన్ని చూపింది. ఇది ఆర్థిక ఆధునీకరణను, సమగ్ర ప్రాంతీయ అభివృద్ధిని మిళితం చేస్తూ వికసిత భారత్ 2047 సాధన దిశగా భారతదేశ ప్రయాణానికి అనుగుణంగా పనిచేస్తోంది.
ఆవిష్కరణలు, ఉపాధి కల్పన, సమగ్ర అభివృద్ధిని ప్రోత్సహిస్తూ అంకుర సంస్థలు భారతదేశ ఆర్థిక పరివర్తనకు ఒక ముఖ్యమైన స్తంభంగా ఎదిగాయి. గత దశాబ్ద కాలంలో డిసెంబర్ 2025 నాటికి 2 లక్షల కంటే ఎక్కువ అంకురాలతో, భారతదేశం ప్రపంచంలోని అతిపెద్ద అంకుర సంస్థల వ్యవస్థలలో ఒకటిగా వేగంగా ఎదిగింది. బెంగళూరు, హైదరాబాద్, ముంబై, ఢిల్లీ-ఎన్‌సీఆర్ వంటి ప్రధాన కేంద్రాలు ఈ మార్పులో ముందున్నాయి. ఇదే సమయంలో సుమారు 50% స్టార్టప్‌లు ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల నుంచి ఉద్భవించడంతో చిన్న నగరాలు కూడా ఈ జోరుకు క్రమంగా తోడ్పడుతున్నాయి. ఇది వ్యవస్థాపకత అందరికీ చేరువవడాన్ని ప్రతిబింబిస్తుంది.
అంకుర సంస్థలు: ఆర్థిక వృద్ధికి ఒక ప్రేరణ
- సాంకేతిక ఆవిష్కరణలు, ఉత్పాదకతను నడిపిస్తాయి.
- భారీ స్థాయిలో ఉపాధి అవకాశాలను సృష్టిస్తాయి.
- ఆర్థిక సమ్మిళితత్వాన్ని, డిజిటల్ ప్రాప్యతను మెరుగుపరుస్తాయి.
- ప్రాంతీయ, అట్టడుగు స్థాయి వ్యవస్థాపకతను ప్రోత్సహిస్తాయి.
అగ్రిటెక్, టెలిమెడిసిన్, మైక్రోఫైనాన్స్, పర్యాటక, ఎడ్-టెక్ రంగాలలో పరిష్కారాలను అమలు చేయడం ద్వారా స్టార్టప్‌లు భారతదేశ గ్రామీణ, పట్టణ వ్యత్యాసాన్ని తగ్గిస్తున్నాయి. నేరుగా అభివృద్ధి లోపాలను పరిష్కరిస్తూ గ్రామీణ జీవనోపాధికి మద్దతు ఇస్తున్నాయి. ఈ క్రమంలో మహిళల నేతృత్వంలోని అంకుర సంస్థలు సమగ్ర, ప్రాంతీయంగా సమతుల్య వృద్ధికి కీలక చోదకశక్తిగా ఎదుగుతున్నాయి. డిసెంబర్ 2025 నాటికి గుర్తించిన అంకురాలలో 45% కంటే ఎక్కువ శాటిల్లో కనీసం ఒక మహిళా డైరెక్టర్/భాగస్వామిని కలిగి ఉన్నాయి. ఇది ఆవిష్కరణ కేవలం ఆర్థిక చోదకశక్తిగానే కాకుండా సామాజిక సమానత్వం, సమతుల్య ప్రాంతీయ అభివృద్ధికి తోడ్పడుతోంది.

స్టార్టప్ ఇండియా కార్యక్రమం: భారతదేశ ఆవిష్కరణ వెన్నెముకను నిర్మించిన దశాబ్దం
వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ పరిధిలోని పరిశ్రమల, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక విభాగం(డీపీఐఐటీ) నేతృత్వంలోని స్టార్టప్ ఇండియా కార్యక్రమం భారతదేశ ఆవిష్కరణ, వ్యవస్థాపక పర్యావరణ వ్యవస్థకు మూలస్తంభంగా నిలిచింది. గత దశాబ్దంలో ఈ కార్యక్రమం ఒక విధాన-కేంద్రీకృత చట్రం నుంచి ఆలోచన స్థాయి, కార్యకలాపాల విస్తరణ వరకు ప్రతి దశలో అంకుర సంస్థలకు మద్దతు ఇచ్చే సమగ్ర, బహుముఖ వేదికగా పరిణామం చెందింది. ఈ పురోగతి భారతదేశ అధిక విలువైన అంకుర వ్యవస్థను ప్రతిబింబిస్తుంది. 2014లో 1 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ విలువ కలిగిన ప్రైవేటు కంపెనీలు(యూనికార్న్‌లు) కేవలం నాలుగు మాత్రమే ఉండగా నేడు అటువంటి సంస్థల సంఖ్య 120 దాటింది. వీటి ఉమ్మడి విలువ 350 బిలియన్ డాలర్లకు పైగా ఉంది. ఇది భారతీయ స్టార్టప్ రంగ స్థాయిని, పెరుగుతున్న ప్రపంచ ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది.
అంకురాలు భారతదేశ యువ జనాభా ప్రయోజనాన్ని వినియోగించుకుంటూ సాంకేతికత, సేవలు, తయారీ రంగాలలో ఉపాధిని కల్పిస్తున్నాయి. ఇదే సమయంలో గిగ్ వర్క్, సరఫరా గొలుసు ద్వారా పరోక్ష ఉపాధి అవకాశాలను కూడా సృష్టిస్తున్నాయి. ఉపాధికి అతీతంగా స్టార్టప్‌లు పెద్ద కార్పొరేట్లు, బహుళజాతి కంపెనీలతో ఎక్కువగా సహకరిస్తూ సాంకేతిక బదిలీ, విస్తరణ, ప్రపంచ మార్కెట్ అనుసంధానాన్ని సులభతరం చేస్తున్నాయి.
సాంప్రదాయ రంగాలలో కూడా ఆవిష్కరణలు ఆర్థిక వ్యవస్థ అంతటా ప్రభావాన్ని చూపుతున్నాయి: 'హెసా' వంటి అగ్రి-టెక్ వేదికలు గ్రామీణ, పట్టణ వ్యత్యాసాన్ని తగ్గిస్తూ రైతులకు మార్కెట్ సౌలభ్యాన్ని మెరుగుపరుస్తున్నాయి. 'జిప్' వంటి క్లీన్ మొబిలిటీ అంకురాలు ఈవీ-ఆధారిత రవాణా పరిష్కారాలను అందిస్తున్నాయి. ఈ ఆవిష్కరణలు ఆర్థిక, సరఫరా గొలుసు, స్థిరత్వం, డిజిటల్ మౌలిక సదుపాయాలలో బహుళ ప్రభావాలను సృష్టిస్తున్నాయి. ఇది అభివృద్ధి చెందుతున్న స్టార్టప్ రంగ విస్తృత ప్రయోజనాలను తెలియజేస్తుంది.
ఆవిష్కరణల ఆధారిత వ్యవస్థాపకతను వేగవంతం చేయడానికి డీపీఐఐటీ స్టార్టప్ ఇండియా కార్యక్రమం ద్వారా దేశవ్యాప్తంగా నిధులు, మార్గదర్శకత్వం, అంకురాల విస్తరణకు మద్దతుగా ఈ క్రింది ప్రధాన పథకాలు, డిజిటల్ వేదికలను అందుబాటులోకి తెచ్చింది.
- ఫండ్ ఆఫ్ ఫండ్స్ ఫర్ స్టార్టప్స్
స్టార్టప్ ఇండియా కార్యాచరణ ప్రణాళిక కింద డీపీఐఐటీ ప్రధాన పథకమిది. దీనిని స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్ఐడీబీఐ) నిర్వహిస్తోంది. రూ.10,000 కోట్ల నిధితో ఈ పథకం సెబీ నమోదిత ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్స్(ఐఏఎఫ్) కు మద్దతు ఇస్తుంది. ఇవి క్రమంగా స్టార్టప్‌లలో పెట్టుబడి పెడతాయి. దీని ఉద్దేశ్యం దేశీయ మూలధన ప్రాప్యతను విస్తరించడం, వ్యవస్థాపక పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేయడం.
ఈ రూ.10,000 కోట్ల నిధిని 140 కంటే ఎక్కువ ఏఐఎఫ్‌లకు కేటాయించారు. ఇవి సంయుక్తంగా 1,370కు పైగా అంకురాలలో రూ.25,500 కోట్లకు పైగా పెట్టుబడి పెట్టాయి.
క్రెడిట్ గ్యారెంటీ స్కీమ్ ఫర్ స్టార్టప్స్
అర్హత కలిగిన ఆర్థిక సంస్థల ద్వారా స్టార్టప్‌లకు షూరిటీ లేని రుణాలను అందించడానికి ఈ పథకం అమలవుతోంది. దీనిని నేషనల్ క్రెడిట్ గ్యారెంటీ ట్రస్టీ కంపెనీ(ఎన్‌సీజీటీసీ) లిమిటెడ్ నిర్వహిస్తోంది. సీజీఎస్ఎస్ కింద స్టార్టప్ రుణగ్రహీతల కోసం రూ.800 కోట్లకు పైగా విలువైన 330కు పైగా రుణాలకు హామీ ఇవ్వడమైంది.
స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ స్కీమ్
రూ.945 కోట్ల నిధితో స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ స్కీమ్(ఎస్ఐఎస్ఎఫ్ఎస్) ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్, ప్రోటోటైపింగ్, ప్రొడక్ట్ ట్రయల్స్, మార్కెట్ ఎంట్రీ, వాణిజ్యీకరణ వంటి కార్యకలాపాల కోసం స్టార్టప్‌లకు ఆర్థిక సహాయం అందిస్తోంది. ఈ పథకాన్ని ఎక్స్‌పర్ట్ అడ్వైజరీ కమిటీ(ఈఏసీ) పర్యవేక్షిస్తోంది.
ఈ పథకం కింద ప్రారంభ దశలోని స్టార్టప్‌లకు మద్దతు ఇవ్వడానికి 215కు పైగా ఇంక్యుబేటర్లకు రూ.945 కోట్లు కేంద్రం ఇస్తోంది.
స్టార్టప్ ఇండియా హబ్
స్టార్టప్ ఇండియా ఆన్‌లైన్ హబ్ అనేది భారతదేశంలోని వ్యవస్థాపక వ్యవస్థలోని భాగస్వాములు ఒకరినొకరు కనుగొనడానికి, అనుసంధానానికి, పరస్పరం సహకరించుకోవడానికి ఉపయోగపడే ఒక విశిష్టమైన డిజిటల్ వేదిక. ఇది పెట్టుబడిదారులు, మార్గదర్శకులు, ఇంక్యుబేటర్లను ఆశావహ వ్యవస్థాపకులతో అనుసంధానిస్తుంది. ఇది నిధులు, విద్యా సంస్థలు, కార్పొరేట్లు, ప్రభుత్వ సంస్థలను ఒకే చోట చేరుస్తుంది.
రాష్ట్రాల స్టార్టప్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్(ఎస్ఆర్ఎఫ్)
రాష్ట్రాల స్టార్టప్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్(ఎస్ఆర్ఎఫ్) రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను వాటి అంకుర సంస్థల అనుకూల విధానాలు, అమలు ఆధారంగా అంచనా వేస్తుంది. ఇది పోటీతత్వ సమాఖ్య విధానాన్ని పెంపొందిస్తుంది. దీని కింద రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలను బెస్ట్ పెర్ఫార్మర్స్, టాప్ పెర్ఫార్మర్స్, లీడర్స్, ఆస్పైరింగ్ లీడర్స్, ఎమర్జింగ్ స్టార్టప్ ఎకోసిస్టమ్స్‌గా వర్గీకరిస్తారు.
జాతీయ మార్గదర్శక పోర్టల్(మార్గ్)
దేశవ్యాప్తంగా ఉన్న అంకురాలకు మార్గదర్శకత్వం సులభంగా అందుబాటులో ఉంచడానికి మెంటార్‌షిప్, అడ్వైజరీ, అసిస్టెన్స్, రెసిలియన్స్ అండ్ గ్రోత్(మార్గ్) ప్రోగ్రామ్ అభివృద్ధి చేసింది. అనుభవజ్ఞులైన మెంటార్లతో వ్యవస్థాపకులను అనుసంధానించడం ద్వారా ఈ పోర్టల్ స్టార్టప్ వృద్ధికి తోడ్పడటం, వ్యూహాత్మక మార్గదర్శకత్వం అందించడం లక్ష్యంగా పెట్టుకుంది.
స్టార్టప్ ఇండియా ఇన్వెస్టర్ కనెక్ట్ పోర్టల్
ఎస్ఐడీబీఐ సహకారంతో అభివృద్ధి చేసిన ఈ డిజిటల్ వేదిక అంకుర సంస్థలను, ముఖ్యంగా ప్రారంభ దశలోని సంస్థలను, వెంచర్ క్యాపిటల్ ఫండ్స్, పెట్టుబడిదారులతో కలుపుతుంది. వ్యవస్థాపకులు ఒకే అప్లికేషన్ ద్వారా బహుళ పెట్టుబడిదారులను చేరుకోవడానికి, వారి ఆలోచనలను సమర్థవంతంగా వివరించడానికి ఇది వీలు కల్పిస్తుంది.

భారతదేశపు అంకుర వ్యవస్థను బలోపేతం చేస్తున్న పథకాలు
స్టార్టప్ ఇండియాతో పాటు వివిధ రంగాలు, మంత్రిత్వ శాఖల ఆధ్వర్యంలోని కార్యక్రమాలు సాంకేతిక అభివృద్ధి, గ్రామీణ వ్యవస్థాపకత, విద్యాపరమైన ఆవిష్కరణలు, ప్రాంతీయ సమ్మిళితత్వాన్ని పరిష్కరించడం ద్వారా వ్యవస్థను మరింత బలోపేతం చేశాయి. ఈ పథకాలు అంకురాలకు ఇచ్చే మద్దతు విస్తృతంగా, వికేంద్రీకృతంగా, జాతీయ అభివృద్ధి ప్రాధాన్యతలకు అనుగుణంగా ఉండేలా చూస్తాయి.

అటల్ ఇన్నోవేషన్ మిషన్(ఏఐఎం)
2016లో నీతి ఆయోగ్(నీతి ఆయోగ్) ప్రారంభించిన అటల్ ఇన్నోవేషన్ మిషన్(ఏఐఎం) పాఠశాలలు, విశ్వవిద్యాలయాలు, పరిశోధనా సంస్థలు, అంకురాలు, పరిశ్రమలలో ఆవిష్కరణ, వ్యవస్థాపక సంస్కృతిని పెంపొందించడం లక్ష్యంగా పెట్టుకున్న ప్రభుత్వ ప్రధాన కార్యక్రమం. మార్చి 2028 వరకు రూ.2,750 కోట్ల కేటాయింపుతో ఆవిష్కరణ కార్యక్రమాలను రూపొందించడానికి, భాగస్వామ్యాలను పెంపొందించడానికి ఏఐఎం ఒక సమగ్ర చట్రాన్ని అందిస్తోంది.
ఏఐఎం 1.0: ప్రధాన కార్యక్రమాలు
వివిధ కేంద్ర, రాష్ట్ర మంత్రిత్వ శాఖలు, ఇంక్యుబేటర్లు, అంతర్జాతీయ భాగస్వాములతో కలిసి పనిచేస్తూ ఏఐఎం కింద ఉన్న కార్యక్రమాలు భారతీయ స్టార్టప్ వ్యవస్థను ప్రోత్సహిస్తాయి.
అటల్ టింకరింగ్ ల్యాబ్స్(ఏటీఎల్)
- అటల్ టింకరింగ్ ల్యాబ్(ఏటీఎల్) కార్యక్రమం విద్యార్థులను బట్టీ పద్ధతి నుంచి సృజనాత్మకత, సమస్యల పరిష్కారం, ఆవిష్కరణల వైపు మళ్లించడం ద్వారా భారతదేశ విద్యా రంగాన్ని పునర్నిర్మించడంపై దృష్టి సారించింది.
- 733 జిల్లాల్లో 10,000 కంటే ఎక్కువ ఏటీఎల్‌లతో ఏఐ, రోబోటిక్స్, ఐఓటీ, 3డీ ప్రింటింగ్ వంటి 21వ శతాబ్దపు నైపుణ్యాలను అన్వేషించడానికి లక్షలాది మంది విద్యార్థులకు ఏఐఎం వీలు కల్పిస్తోంది. 1.1 కోట్లకు పైగా విద్యార్థులను భాగస్వామ్యం చేస్తూ ఇది 16 లక్షలకు పైగా ఆవిష్కరణ ప్రాజెక్టులను సాధ్యం చేసింది.
కమ్యూనిటీ ఇన్నోవేటర్ ఫెలోషిప్(సీఐఎఫ్)
- యూఎన్‌డీపీ ఇండియాతో భాగస్వామ్యంతో అమలవుతున్న ఈ కార్యక్రమం అట్టడుగు స్థాయి వ్యవస్థాపకత, సామాజిక ప్రభావాన్ని నడపడానికి అవసరమైన జ్ఞానం, మార్గదర్శకత్వం, మౌలిక సదుపాయాల మద్దతుతో ఆశావహ కమ్యూనిటీ ఇన్నోవేటర్లను సిద్ధం చేస్తుంది.
- ఒక సంవత్సరం పాటు జరిగే ఈ ఫెలోషిప్‌లో ప్రతి ఫెలో అటల్ కమ్యూనిటీ ఇన్నోవేషన్ సెంటర్‌లో ఉండి ఎస్‌డీజీ అవగాహన, వ్యవస్థాపక, జీవిత నైపుణ్యాలను పొందుతారు.
యూత్ కో:లాబ్ కార్యక్రమం
- ఆసియా-పసిఫిక్ ప్రాంతంలోని యువతను నాయకత్వం, సామాజిక ఆవిష్కరణలు, వ్యవస్థాపకత ద్వారా ఎస్‌డీజీలను నడిపించేలా శక్తివంతం చేయడం, వారి కోసం పెట్టుబడి పెట్టడం దీని లక్ష్యం.
- ఈ కార్యక్రమం ప్యానెల్ చర్చలు, వర్క్‌షాప్‌లు, వెబినార్ల ద్వారా జాతీయ స్థాయి చర్చలను హైలైట్ చేసింది.
- అసిస్టెక్ ఫౌండేషన్ భాగస్వామ్యంతో యూత్ కో:లాబ్ నేషనల్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ 2024–25 దివ్యాంగుల కోసం సహాయక సాంకేతికత, సమ్మిళిత ఎడ్-టెక్ వంటి రంగాలలో పరిష్కారాలను అభివృద్ధి చేసే యువ వ్యవస్థాపకులను ప్రోత్సహించడంపై దృష్టి సారించింది.
ఏఐఎం 1.0 ఆవిష్కరణ మౌలిక సదుపాయాలను స్థాపించడంపై దృష్టి పెట్టగా ఏఐఎం 2.0(2024) వ్యవస్థలోని లోపాలను సరిదిద్దే కొత్త కార్యక్రమాలను చేపట్టడంపై, ప్రభుత్వం, పరిశ్రమలు, విద్యాసంస్థల సహకారంతో విజయవంతమైన నమూనాలను విస్తరించడంపై దృష్టి సారిస్తోంది. ఇది అటల్ టింకరింగ్ ల్యాబ్‌ల వ్యవస్థను విస్తరించడం ద్వారా పాఠశాల విద్యార్థులలో సమస్యల పరిష్కార, వ్యవస్థాపక మనస్తత్వాన్ని పెంపొందిస్తోంది.
ఏఐఎం 2.0 కింద కార్యక్రమాలు
- 30 వెర్నాక్యులర్ ఇన్నోవేషన్ సెంటర్లను స్థాపించడం ద్వారా ఆంగ్లం మాట్లాడలేని ఆవిష్కర్తలు, పెట్టుబడిదారుల కోసం భారతదేశంలోని 22 అధికారిక భాషలలో అడ్డంకులను తగ్గించడంపై లాంగ్వేజ్ ఇంక్లూసివ్ ప్రోగ్రామ్ ఆఫ్ ఇన్నోవేషన్(లిపి) దృష్టి పెడుతుంది.
- జమ్మూ కశ్మీర్, లడఖ్, ఈశాన్య రాష్ట్రాలు, ఆశావహ జిల్లాల కోసం అటల్ టింకరింగ్ ల్యాబ్స్ ద్వారా ప్రత్యేకమైన ఆవిష్కరణ, వ్యవస్థాపక నమూనాలను రూపొందించడానికి ఫ్రాంటియర్ కార్యక్రమం ప్రయత్నిస్తుంది.
- భారతదేశ ఆవిష్కరణ, వ్యవస్థాపక వ్యవస్థను నిర్వహించడానికి సిద్ధంగా ఉన్న నిపుణులు, ఉపాధ్యాయులు, శిక్షకుల బృందాన్ని నిర్మించడం హ్యూమన్ క్యాపిటల్ డెవలప్‌మెంట్ కార్యక్రమ లక్ష్యం.
- డీప్‌టెక్ ఆవిష్కరణలను, ముఖ్యంగా ఎక్కువ సమయం, పెట్టుబడి అవసరమయ్యే వాటిని వాణిజ్యీకరించడానికి ప్రభావవంతమైన మార్గాలను అన్వేషించడానికి డీప్‌టెక్ రియాక్టర్ ఒక పరిశోధనా కేంద్రంగా పనిచేస్తుంది.
- భారతదేశ ఆవిష్కరణ, వ్యవస్థాపక వ్యవస్థను ఇంటర్నేషనల్ ఇన్నోవేషన్ కొలాబరేషన్స్ కార్యక్రమం అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళుతుంది.
- ఇతర కార్యక్రమాలలో అధునాతన స్టార్టప్‌లను విస్తరించడంలో పరిశ్రమల భాగస్వామ్యాన్ని పెంచడానికి ఇండస్ట్రియల్ యాక్సిలరేటర్ కార్యక్రమం, కేంద్ర మంత్రిత్వ శాఖలలో ఐడెక్స్ వంటి వేదికలను నిర్మించడానికి అటల్ సెక్టోరల్ ఇన్నోవేషన్ లాంచ్‌ప్యాడ్స్(ఏఎస్ఐఎల్ వంటి ఉన్నాయి.
జెనెసిస్(జెన్-నెక్ట్స్ సపోర్ట్ ఫర్ ఇన్నొవేటివ్ స్టార్టప్స్)
ఎలక్ట్రానిక్స్, ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ చేపట్టిన జెనెసిస్ అనేజాతీయ డీప్‌టెక్ స్టార్టప్ వేదిక జులై 2022లో ప్రారంభమైంది. ఇది భారతదేశవ్యాప్తంగా ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లోని సుమారు 1600 సాంకేతిక అంకుర సంస్థలను విస్తరించడం, డీప్‌టెక్ ఆవిష్కరణలకు గణనీయమైన నిధులు, మద్దతు అందించడం లక్ష్యంగా పెట్టుకుంది.
ఐదేళ్ల కాలానికి రూ.490 కోట్ల బడ్జెట్ కేటాయింపుతో ఈ పథకాన్ని స్టార్టప్‌లు, ప్రభుత్వ సంస్థలు, విద్యాసంస్థలు, కార్పొరేట్ల మధ్య సహకారం ద్వారా సాంకేతిక స్టార్టప్ వ్యవస్థను బలోపేతం చేయడానికి రూపొందించింది.
ఎంఈఐటీవై స్టార్టప్ హబ్(ఎంఎస్‌హెచ్)
2016లో స్థాపించిన ఎంఈఐటీవై స్టార్టప్ హబ్(ఎంఎస్‌హెచ్) సాంకేతికత ఆధారిత ఆవిష్కరణలను ప్రోత్సహిస్తుంది. ఈ హబ్ ఆర్థిక వృద్ధిని నడిపించడంతో పాటు ఇంక్యుబేషన్ సెంటర్లు, సరికొత్త సాంకేతికతలపై ఉన్న సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్, ఎంఈఐటీవై మద్దతు ఇచ్చే ఇతర వేదికలను అనుసంధానించే కేంద్ర వేదికగా పనిచేస్తుంది.
డిసెంబర్ 2025 నాటికి ఎంఎస్హెచ్ దేశవ్యాప్తంగా 6,148కు పైగా అంకురాలు, 517 కంటే ఎక్కువ ఇంక్యుబేటర్లు, 329 కంటే ఎక్కువ ల్యాబ్‌లతో కూడిన వ్యవస్థకు మద్దతు ఇస్తోంది.
టెక్నాలజీ ఇంక్యుబేషన్ అండ్ డెవలప్‌మెంట్ ఆఫ్ ఎంటర్‌ప్రెన్యూర్స్(టైడ్) 2.0 పథకం
ఎంఈఐటీవై పరిధిలోని ఈ పథకం ఐఓటీ, ఏఐ, బ్లాక్‌చెయిన్, రోబోటిక్స్ వంటి అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలను ఉపయోగించే ఐసీటీ స్టార్టప్‌లకు మద్దతు ఇచ్చే ఇంక్యుబేటర్లను బలోపేతం చేయడం ద్వారా సాంకేతిక వ్యవస్థాపకతను వేగవంతం చేయడానికి 2019లో ప్రారంభమైంది. ఆరోగ్య సంరక్షణ, విద్య, వ్యవసాయం, ఆర్థిక సమ్మిళితత్వం, మౌలిక సదుపాయాలు, పర్యావరణం వంటి ఏడు రంగాలలో ఇది మద్దతునిస్తుంది. దేశవ్యాప్తంగా ఉన్న 51 ఇంక్యుబేటర్ల ద్వారా ఈ మద్దతు అందిస్తోంది.
నిధి(నేషనల్ ఇనిషియేటీవ్ ఫర్ డెవెలపింగ్ అండ్ హార్నెసింగ్ ఇన్నొవేషన్స్)
శాస్త్ర, సాంకేతిక విభాగం(డీఎస్‌టీ) ద్వారా 2016లో ప్రారంభించిన నిధి.. విజ్ఞాన ఆధారిత, సాంకేతికతతో కూడిన ఆలోచనలను విజయవంతమైన అంకురాలుగా మార్చడానికి ఒక గొడుగు కార్యక్రమంగా పనిచేస్తుంది. సంపద, ఉపాధి కల్పన ద్వారా సామాజిక-ఆర్థిక అభివృద్ధిని సాధించడం దీని లక్ష్యం.
ఇది 1,30,000కు పైగా ఉద్యోగాలను సృష్టించడం, 12,000కు పైగా అంకురాలకు మద్దతు ఇవ్వడం, 175కు పైగా సాంకేతిక బిజినెస్ ఇంక్యుబేటర్లకు(టీబీఐ) అండగా నిలవడంతో పాటు 1100కు పైగా ఐపీలను(ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ)ని సృష్టించడం ద్వారా ఆర్థిక వ్యవస్థకు తోడ్పడింది.
విభాగాలు:
నిధి-ప్రయాస్(ప్రమోషన్ అండ్ అక్సెలరేషన్ ఆఫ్ యంగ్ అండ్ ఆస్పైరింగ్ టెక్నాలజీ ఎంటర్‌ప్రెన్యూర్స్): ఒక ఆవిష్కర్తకు/అంకురానికి గరిష్టంగా రూ.10 లక్షల నిధులు అందిస్తూ ఆలోచన నుంచి ప్రోటోటైప్ వరకు మద్దతు ఇస్తుంది.
నిధి-ఈఐఆర్(ఎంటర్‌ప్రెన్యూఆర్ ఇన్ రెసిడెన్స్): వర్ధమాన వ్యవస్థాపకులకు నష్టపోయే ముప్పు తగ్గించడానికి, పట్టభద్రులైన విద్యార్థులను ప్రోత్సహించడానికి నెలకు రూ.30,000/- వరకు ఆర్థిక సహాయం అందిస్తుంది.
నిధి-టీబీఐ(టెక్నాలజీ బిజినెస్ ఇంక్యుబేటర్): హోస్ట్ సంస్థ వద్ద అందుబాటులో ఉన్న నైపుణ్యం, మౌలిక సదుపాయాలను ఉపయోగించుకుని కొత్త సంస్థలను సృష్టించడానికి సాంకేతికతలను వినియోగిస్తుంది.
నిధి-ఐటీబీఐ(ఇంక్లూజివ్-టెక్నాలజీ బిజినెస్ ఇంక్యుమేటర్): ఇది నిధి-టీబీఐలో ఒక కొత్త రకం. ఇది ప్రధానంగా ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో ప్రాంతం, లింగం, దివ్యాంగులు మొదలైన వాటితో కూడిన సమగ్రతను ప్రోత్సహించడంపై దృష్టి పెడుతుంది.
నిధి-యాక్సెలరేటర్(స్టార్టప్ యాక్సెలరేషన్ ప్రోగ్రామ్): అంకుర సంస్థను వేగంగా అభివృద్ధి చేయడానికి ప్రత్యేక ప్రోత్సాహాన్ని అందిస్తుంది.
నిధి-ఎస్ఎస్ఎస్(సీడ్ సపోర్ట్ సిస్టమ్): సీడ్ సపోర్ట్ కింద ఒక ఇంక్యుబేటర్‌కు గరిష్టంగా రూ.1000 లక్షలు, ఒక అంకుర సంస్థకు గరిష్టంగా రూ.100 లక్షల వరకు ఆరంభ దశలో ఆర్థిక సహాయం అందిస్తుంది.
నిధి-సీఓఈ(సెంటర్స్ ఆఫ్ ఎక్సెలెన్స్): స్టార్టప్‌లు ప్రపంచ స్థాయికి చేరుకోవడానికి అంతర్జాతీయ పోటీతత్వ సదుపాయాలను అందిస్తుంది.
స్టార్టప్ విలేజ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ప్రోగ్రామ్(ఎస్‌వీఈపీ)
మే 2015లో దీనదయాళ్ అంత్యోదయ యోజన-నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్(డీఏవై-ఎన్ఆర్ఎల్ఎం) కింద ఉప పథకంగా అమలు చేస్తున్న ఎస్‌వీఈపీ స్థానిక సంస్థలను స్థాపించడానికి, విస్తరించడానికి గ్రామీణ కుటుంబాలను ప్రోత్సహించడం ద్వారా గ్రామీణ వ్యవస్థాపకతను పెంపొందించడం లక్ష్యంగా పెట్టుకుంది.
- స్వయం ఉపాధి, నైపుణ్యం కలిగిన వేతన ఉపాధి ద్వారా పేదరికాన్ని తగ్గించడం దీని లక్ష్యం.
- గ్రామీణ వ్యాపారసంస్థలకు మూలధన సదుపాయం కల్పించడం, సాంకేతిక సహకారాన్ని ద్వారా ఎస్‌వీఈపీ అంతరాలను పూడ్చుతోంది.
- జూన్ 30, 2025 నాటికి ఈ కార్యక్రమం 3.74 లక్షల సంస్థలకు మద్దతు ఇచ్చి, గ్రామీణ స్థాయిలో ఆదాయ అవకాశాలను పెంచింది.

ఏఎస్‌పీఐఆర్ఈ(గ్రామీణ పరిశ్రమలు, వ్యవస్థాపకతను ప్రోత్సహించే పథకం)
ఎంఎస్ఎంఈ మంత్రిత్వ శాఖ 2015లో ప్రారంభించిన ఈ పథకం గ్రామీణ, వెనుకబడిన ప్రాంతాలలో ఆవిష్కరణలను, వ్యవస్థాపకతను ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఇది సూక్ష్మ సంస్థల సృష్టి కోసం లైవ్లీహుడ్ బిజినెస్ ఇంక్యుబేటర్లను(ఎల్‌బీఐ) ఏర్పాటు చేయడంపై దృష్టి పెడుతుంది.
ఆర్థిక ప్రోత్సాహకాలు
యంత్రాల కొనుగోలు కోసం:
- ప్రభుత్వ సంస్థలకు గరిష్టంగా రూ.కోటి
- ప్రైవేటు సంస్థలకు రూ.75 లక్షలు.
నిర్వహణ వ్యయం
మానవవనరుల వ్యయం, ఇంక్యుబేషన్ నిర్వహణ, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు, వంటి వాటి కోసం నిర్వహణ ఖర్చుల కింద ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు గరిష్టంగా రూ.1 కోటి వరకు మద్దతు.
ప్రధాన మంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం(పీఎంఈజీపీ)
స్వయం ఉపాధిని ప్రోత్సహించడానికి భారతదేశపు ప్రధాన కార్యక్రమంగా 2008లో అప్పటి ప్రధానమంత్రి రోజ్‌గార్ యోజన(పీఎంఆర్‌వై), గ్రామీణ ఉపాధి కల్పన కార్యక్రమం(ఆర్ఈజీపీ) పథకాలను విలీనం చేయడం ద్వారా ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం(పీఎంఈజీపీ) అమల్లోకి వచ్చింది. దీనిని ఎంఎస్ఎంఈ మంత్రిత్వ శాఖ పరిధిలోని ఖాదీ, గ్రామ పరిశ్రమల కమిషన్(కేవీఐసీ) అమలు చేస్తోంది.
- జనరల్ కేటగిరీ లబ్ధిదారులకు గ్రామీణ ప్రాంతాల్లో ప్రాజెక్టు ఖర్చులో 25%, పట్టణ ప్రాంతాల్లో 15% మార్జిన్ మనీ (ఎంఎం) మద్దతు లభిస్తుంది.
- ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీలు, మహిళలు, మాజీ సైనికులు, దివ్యాంగులు, ట్రాన్స్‌జెండర్లు, ఈశాన్య రాష్ట్రాలు, కొండ ప్రాంతాలు, సరిహద్దు ప్రాంతాలు, ఆశావహ జిల్లాలకు చెందిన ప్రత్యేక వర్గాల వారికి గ్రామీణ ప్రాంతాల్లో 35%, పట్టణ ప్రాంతాల్లో 25% రాయితీ లభిస్తుంది.
- తయారీ రంగంలో రూ.50 లక్షల వరకు, సేవా రంగంలో రూ.20 లక్షల వరకు ఉన్న ప్రాజెక్టులకు ఈ పథకం మద్దతు ఇస్తుంది.
భవిష్యత్తు వైపు: ఆవిష్కరణ, అమలు ఆధారిత భవిష్యత్తు
స్టార్టప్ ఇండియా దశాబ్దాన్ని పూర్తి చేసుకుంటున్న తరుణంలో దేశపు అంకుర సంస్థల వ్యవస్థ ఒక కీలక మలుపులో ఉంది. వేగవంతమైన విస్తరణ నుంచి స్థిరమైన స్థాయికి, వాస్తవ ఆర్థిక వ్యవస్థతో లోతైన అనుసంధానానికి చేరుకుంటోంది. ఈ దశాబ్దం కేవలం పరిమాణాన్నే కాకుండా జనాభా ప్రయోజనం, డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాలు, నిరంతర సంస్కరణల ద్వారా సాధించిన నిర్మాణాత్మక పరివర్తనను సూచిస్తుంది. అంకురాలు ఇప్పుడు ప్రాధాన్యత కలిగిన రంగాలలో భాగమై ఆవిష్కరణలు, ఉపాధి కల్పన, ప్రపంచ మార్కెట్ అనుసంధానాన్ని నడిపిస్తున్నాయి. 2030 నాటికి 7.3 ట్రిలియన్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థ దిశగా, వికసిత భారత్ 2047 విస్తృత దృక్పథం వైపు భారతదేశం దూసుకుపోతున్న తరుణంలో, స్టార్టప్‌లు దేశాభివృద్ధికి కేంద్రబిందువుగా ఉండబోతున్నాయి.
References
Ministry of Commerce & Industry
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2098452®=3&lang=2
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2038380®=3&lang=2
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2201280®=3&lang=1
https://www.startupindia.gov.in/content/sih/en/startup-scheme.html
AU4149_fl3i6c.pdf
https://www.pib.gov.in/Pressreleaseshare.aspx?PRID=1895966®=3&lang=2
https://investorconnect.startupindia.gov.in/
https://www.startupindia.gov.in/srf/
AU1507_iPkDqy.pdf
AU4149_fl3i6c.pdf
https://www.indiabudget.gov.in/economicsurvey/doc/echapter.pdf
https://aim.gov.in/pdf/ATL-Guidebook.pdf
Ministry Of Electronics & Information Technology
https://sansad.in/getFile/loksabhaquestions/annex/184/AU2240_79NBJo.pdf?source=pqals
https://msh.meity.gov.in/schemes/tide
https://msh.meity.gov.in/
Ministry of Science & Technology
https://nidhi.dst.gov.in/nidhieir/
https://nidhi.dst.gov.in/schemes-programmes/nidhiprayas/
https://nidhi.dst.gov.in/
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2170134®=3&lang=2
NIDHI- Seed Support System (NIDHI-SSS) | India Science, Technology & Innovation - ISTI Portal
Ministry of Rural Development
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2081567®=3&lang=2
https://www.pib.gov.in/PressReleaseIframePage.aspx?PRID=2146872®=3&lang=2
Ministry of Micro, Small & Medium Enterprises
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2204536®=3&lang=1
https://aspire.msme.gov.in/ASPIRE/AFHome.aspx
https://www.nimsme.gov.in/about-scheme/a-scheme-for-promotion-of-innovation-rural-industries-and-entrepreneurship-aspire-
Ministry of Home Affairs
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2170168®=3&lang=2#:~:text=Similarly%2C%20the%20number%20of%20unicorn,harnessed%20to%20create%20unicorn%20startups
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2176932®=3&lang=2
Ministry of Skill Development & Entrepreneurship
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2038380®=3&lang=2
Press Information Bureau
https://www.pib.gov.in/PressNoteDetails.aspx?NoteId=155121&ModuleId=3®=3&lang=2
https://www.pib.gov.in/FactsheetDetails.aspx?Id=149260®=3&lang=2
https://www.pib.gov.in/PressNoteDetails.aspx?NoteId=154840&ModuleId=3®=3&lang=2
https://static.pib.gov.in/WriteReadData/specificdocs/documents/2025/jun/doc2025619572801.pdf
NITI Aayog
https://aim.gov.in/atl.php
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2077102®=3&lang=2
IBEF
https://www.ibef.org/blogs/the-role-of-startups-in-india-s-economic-growth
https://www.ibef.org/economy/foreign-direct-investment
https://www.ibef.org/blogs/the-role-of-startups-in-india-s-economic-growth
SIDBI
https://www.sidbivcf.in/en/funds/ffs
Click here for pdf file.
***
(Explainer ID: 156971)
आगंतुक पटल : 23
Provide suggestions / comments