Social Welfare
బాల్య వివాహ రహిత భారత్
బాల్య వివాహాలు లేని భారత్ వైపు ఒక ప్రతిజ్ఞ
Posted On:
08 JAN 2026 12:44PM
కీలకాంశాలు
- 2026 నాటికి బాల్య వివాహాలలను 10 శాతానికి తగ్గించాలని, 2030 నాటికి భారతదేశాన్ని బాల్య వివాహ రహిత దేశంగా మార్చాలని బాల్య వివాహ ముక్త్ భారత్ ప్రచార కార్యక్రమం లక్ష్యంగా పెట్టుకుంది.
- ఛత్తీస్‌గఢ్‌లోని బాలోద్ జిల్లా 2025లో భారతదేశ మొట్టమొదటి బాల్య వివాహ రహిత జిల్లాగా అవతరించి ఒక మైలురాయిని చేరుకుంది.
- 2025 సెప్టెంబర్ 17న ఛత్తీస్‌గఢ్‌లోని సూరజ్‌పూర్ జిల్లా యంత్రాంగం 75 గ్రామ పంచాయతీలను "బాల్య వివాహ రహిత పంచాయతీలు"గా ప్రకటించింది.
పరిచయం
చట్టబద్ధంగా నిషేధించినప్పటికీ భారతదేశంలో బాల్య వివాహాలు ఇప్పటికీ ఒక విస్తృత సామాజిక సవాలుగా మిగిలిపోయాయి. ఇది దేశవ్యాప్తంగా లక్షల మంది బాలబాలికలపై ప్రభావం చూపుతోంది. చిన్న వయస్సులోనే గర్భం దాల్చడం వల్ల కలిగే తీవ్రమైన ఆరోగ్య ప్రమాదాలకు బాలికలను గురి చేస్తోంది. గృహ హింసకు గురయ్యే అవకాశాలను పెంచడంతో పాటు పేదరికం, లింగ అసమానతలను కొనసాగిస్తోంది. భారతదేశంలో గణనీయమైన పురోగతి ఉన్నప్పటికీ 20-24 ఏళ్ల మధ్య వయస్సున్న మహిళల్లో 23% మందికి 18 ఏళ్లు నిండకముందే వివాహం జరిగింది(జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-5, 2019–21). ఇది బాల్య వివాహాన్ని నిరంతర ముప్పుగా, తీవ్రమైన నేరంగా మారుస్తోంది. పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, బీహార్ వంటి రాష్ట్రాల్లో బాల్య వివాహాల సంఖ్య ఎక్కువగా ఉన్నప్పటికీ దేశవ్యాప్తంగా అక్కడక్కడా బాల్య వివాహాలు జరుగుతూనే ఉన్నాయి.
బాల్య వివాహం అంటే ఏమిటి?
బాల్య వివాహ నిషేధ చట్టం కింద నిర్వచించిన బాల్య వివాహం అనగా.. ఆడపిల్ల వయస్సు 18 ఏళ్ల కంటే తక్కువ, మగపిల్లాడి వయస్సు 21 ఏళ్ల కంటే తక్కువ ఉండి చేసుకునే వివాహం బాల్య వివాహం. ఇది గ్రామీణ, గిరిజన ప్రాంతాలలో పేదరికం, లింగ అసమానత, ఆరోగ్య ప్రమాదాల చక్రాలను కొనసాగిస్తోంది. అంతేకాకుండా భారతీయ చట్టం ప్రకారం బాల్య వివాహం నేరుగా పిల్లలపై అత్యాచారానికి సమానం.
భారతీయ న్యాయ సంహిత-2023 ప్రకారం 18 ఏళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్న తన భార్యతో పురుషుడు చేసే ఏవైనా లైంగిక చర్యలు అత్యాచారం కిందకు వస్తాయి. బాల్య వధువు భర్త ఆమెపై లైంగిక దాడికి పాల్పడినప్పుడు అది లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ(పోక్సో) చట్టం-2012 ప్రకారం శిక్షార్హమైన నేరమని భారత సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
బాల్య వివాహాలకు వ్యతిరేకంగా భారతదేశ పోరాటం

భారతదేశంలో బాల్య వివాహాలను అరికట్టే ప్రయత్నాలు 19వ శతాబ్దంలోనే ప్రారంభమయ్యాయి. రాజా రామ్మోహన్ రాయ్, ఈశ్వర చంద్ర విద్యాసాగర్, మహాత్మా జ్యోతిరావు ఫులే వంటి సామాజిక సంస్కర్తలు ఈ దురాచారానికి వ్యతిరేకంగా ఉద్యమించారు. దీని ఫలితంగా 1891లో ఏజ్ ఆఫ్ కన్సెంట్ యాక్ట్, తర్వాత 1929లో బాల్య వివాహ నిరోధక చట్టం(శారదా చట్టం) వచ్చాయి. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ప్రభుత్వం ఈ వయోపరిమితులను 1948 సవరణ(బాలికలకు 15 ఏళ్లు), 1978 సవరణ(బాలికలకు 18 ఏళ్లు, బాలురకు 21 ఏళ్లు) ద్వారా పెంచింది. చివరకు బాల్య వివాహ నిషేధ చట్టం-2006 తీసుకువచ్చింది. చట్టపరమైన చర్యలతో పాటు, సామాజిక మనస్తత్వాలను మార్చడం, బాలికల విద్యను ప్రోత్సహించడం, బాల్య వివాహాలను నిరోధించడానికి సమాజాలను శక్తివంతం చేయడం లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం బేటీ బచావో బేటీ పఢావో(2015 నుంచి) వంటి పలు అవగాహన కార్యక్రమాలు దేశవ్యాప్తంగా ఊపందుకున్నాయి.
బాల్య వివాహ నిషేధ చట్టం-2006(పీసీఎంఏ)
బాల్య వివాహ నిషేధ చట్టం-2006 పాత శారదా చట్టం(1929) స్థానంలో వచ్చింది. దీని ఉద్దేశ్యం బాల్య వివాహాలను కేవలం అరికట్టడం మాత్రమే కాకుండా వాటిని పూర్తిగా నిషేధించడం, బాధితులకు బలమైన రక్షణను అందించడం.
- ఈ చట్టం ప్రకారం "బాల్య" అంటే 21 ఏళ్ల లోపు పురుషుడు లేదా 18 ఏళ్ల లోపు స్త్రీ.
- బాల్య వివాహాలు పూర్తిగా నిషేధం. వివాహం జరిగిన వారు మేజర్ అయిన 2 ఏళ్లలోపు జిల్లా కోర్టులో పిటిషన్ వేయడం ద్వారా దానిని రద్దు చేసుకోవచ్చు. ట్రాఫికింగ్, బలవంతం లేదా మోసం జరిగిన సందర్భాల్లో ఇవి మొదటి నుంచే చెల్లవు.
- శిక్షలు: ఇవి కాగ్నిజబుల్, నాన్-బెయిలబుల్ నేరాలు. పిల్లలను వివాహం చేసుకునే వయోజన పురుషులకు, ఇటువంటి వివాహాలను నిర్వహించే వారికి, ప్రోత్సహించే వారికి(తల్లిదండ్రులు/సంరక్షకులతో సహా) 2 సంవత్సరాల వరకు కఠిన కారాగార శిక్ష మరియు/లేదా రూ.లక్ష జరిమానా పడుతుంది. మహిళా నేరస్తులకు జైలు శిక్ష ఉండదు.
- వివాహాలను అడ్డుకోవడానికి, సాక్ష్యాలను సేకరించడానికి, అవగాహన పెంచడానికి రాష్ట్రాలు బాల్య వివాహ నిషేధ అధికారులను(సీఎంపీఓ) నియమిస్తాయి.

బాల వివాహ ముక్త భారత్(బీవీఎంబీ)
2024 నవంబర్ 27న ప్రారంభించిన బాల్ వివాహ్ ముక్త్ భారత్(బీవీఎంబీ) దేశవ్యాప్తంగా బాల్య వివాహాలను నిర్మూలించడానికి మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ(ఎండబ్ల్యూసీడీ) చేపట్టిన ఒక ప్రతిష్టాత్మక జాతీయ కార్యక్రమం. ఈ మిషన్ సుస్థిర అభివృద్ధి లక్ష్యం(ఎస్‌డీజీ) 5.3తో అనుసంధానమై ఉంది. ఇది 2030 నాటికి బాల్య, ముందస్తు, బలవంతపు వివాహాలతో సహా అన్ని హానికరమైన ఆచారాలను తొలగించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఆర్టికల్ 21(జీవించే హక్కు, వ్యక్తిగత స్వేచ్ఛ) కింద భారతదేశ రాజ్యాంగ ఆదేశం, బాల్య వివాహ నిషేధ చట్టం (పీసీఎంఏ)-2006 మద్దతుతో ఈ కార్యక్రమం అట్టడుగు వర్గాలకు చెందిన బాలికలపై ప్రభావం చూపే ఈ సామాజిక సమస్యను పరిష్కరిస్తోంది.


18 అక్టోబర్ 2024న వెలువరించిన ఒక చరిత్రాత్మక తీర్పులో గౌరవ సుప్రీంకోర్టు దేశవ్యాప్తంగా బాల్య వివాహాలను సమర్థవంతంగా నిరోధించడానికి, నిర్మూలించడానికి అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు వివరణాత్మక ఆదేశాలను జారీ చేసింది. కోర్టు బాల్య నిశ్చితార్థాలను కూడా నిషేధించింది. ఎందుకంటే అవి స్వయంప్రతిపత్తిని దెబ్బతీస్తాయి. చట్ట అమలును బలోపేతం చేయడానికి, జిల్లా స్థాయిలలో పూర్తి సమయం పనిచేసే బాల్య వివాహ నిషేధ అధికారులను(సీఎంపీఓ) నియమించాలని ఆదేశించింది. నివారణ చర్యలలో భాగంగా:
- పాఠశాలలు, అంగన్‌వాడీలు, స్వచ్ఛంద సంస్థలు, మత పెద్దలతో కూడిన బహుళ-రంగాల అవగాహన కార్యక్రమాలు;
- పోలీసులు, న్యాయవ్యవస్థ, ఉపాధ్యాయులు, ఆరోగ్య కార్యకర్తలకు శిక్షణ, సాంకేతికత ఆధారిత నివేదికలు;
- ప్రమాదంలో ఉన్న ప్రాంతాల డేటాబేస్‌లను నిర్వహించడం వంటివి ఉన్నాయి.
ఈ తీర్పు శిక్ష కంటే నివారణ, రక్షణ, సాధికారతపై దృష్టిని మళ్లిస్తుంది. బాల్ వివాహ్ ముక్త్ భారత్ చొరవ గతంలో ఉన్న బేటీ బచావో బేటీ పఢావో పథకాన్ని మరింత ముందుకు తీసుకువెళుతూ సాంకేతికత ఆధారిత విధానాన్ని అనుసరిస్తోంది.
100 రోజుల ప్రచారం: బాల్య వివాహాలకు వ్యతిరేక ఉద్యమం
డిసెంబర్ 4, 2025న అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో 100 రోజుల ప్రత్యేక డ్రైవ్ ప్రారంభమైంది. ఇందులో ప్రతి నెలా ఒక నిర్దిష్ట కార్యక్రమం జరుగుతుంది.

ఈ ప్రచారంలో భాగంగా రెండు ప్రతిష్టాత్మక గౌరవాలను ప్రవేశపెట్టారు:
- బాల్య వివాహ రహిత గ్రామ ధ్రువీకరణ పత్రం: బాల్య వివాహాలను అంతం చేస్తామని ప్రతిజ్ఞ చేసి, నిర్ణీత కాలం పాటు సున్నా కేసులు నమోదైన గ్రామాలకు/పంచాయతీలకు ఇస్తారు.
- బాల వివాహ ముక్త భారత్ యోధ అవార్డు: నివేదికలు ఇవ్వడంలో, నివారణలో, కేసులను తగ్గించడంలో అగ్రస్థానంలో నిలిచిన తొలి 10 జిల్లాలకు ఈ జాతీయ బిరుదు ఇస్తారు. ఈ జిల్లాలు అధికారిక పోర్టల్‌లో ప్రదర్శితమవుతాయి.

ఈ దేశవ్యాప్త ప్రచారం డిసెంబర్ 4, 2025న న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో అధికారికంగా ప్రారంభమైంది. దీనితో పాటు దేశవ్యాప్తంగా ఏకకాలంలో ప్రతిజ్ఞా స్వీకార కార్యక్రమం కూడా జరిగింది. ఈ ఐక్య నిబద్ధత భారతదేశాన్ని పూర్తిస్థాయిలో బాల్య వివాహ రహిత దేశంగా మార్చాలనే సంకల్పాన్ని పునరుద్ఘాటిస్తుంది.


మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ రూపొందించిన ఈ చర్యలను అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వాలు కీలక పాత్ర పోషిస్తాయి. జిల్లా స్థాయిలో సీఎంపీఓలు, ఎన్జీవోలు, పంచాయతీ రాజ్ సంస్థలతో(పీఆర్ఐ) టాస్క్ ఫోర్స్‌లను ఏర్పాటు చేయాలని, వారాంతపు పర్యవేక్షణ, బీవీఎంబీ పోర్టల్ ద్వారా జియో-ట్యాగ్‌తో కూడిన పురోగతి నివేదికలను సమర్పించాలని ప్రధాన కార్యదర్శులకు ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ ప్రచారం విద్య, ఆరోగ్యం, గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖలతో అనుసంధానమై బహుళ రంగాల సమన్వయానికి ప్రాధాన్యత ఇస్తుంది.
బాల వివాహ ముక్త భారత్(బీవీఎంబీ) పోర్టల్
మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ చేపట్టిన ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమం ఒక కేంద్రీకృత, ప్రజలకు అందుబాటులో ఉండే వేదికను అందిస్తుంది. ఇది భారతదేశం అంతటా నియమించిన బాల్య వివాహాల నిరోధక అధికారుల(సీఎంపీఓ) జాబితాను ప్రదర్శిస్తుంది. బాల్య వివాహ కేసుల గురించి వెంటనే నివేదించడానికి వీలు కల్పిస్తుంది. అలాగే, అవగాహన కార్యక్రమాలను, ప్రజాభాగస్వామ్య చేసే చర్యలను పర్యవేక్షిస్తుంది.
దేశవ్యాప్త అవగాహన ప్రచారాలు: ఒక విశ్లేషణ
ఎన్ఎఫ్‌హెచ్ఎస్-5 గణాంకాల ఆధారంగా గుర్తించిన 257 అత్యధిక ప్రభావం ఉన్న జిల్లాలకు(జాతీయ సగటు కంటే ఎక్కువ బాల్య వివాహాలు జరిగే జిల్లాలు) ప్రాధాన్యత ఇస్తూ ఈ ప్రచారానికి పూర్తి నిధులు సమకూర్చడానికి మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ కట్టుబడి ఉంది.


బాల్య వివాహాల నిరోధక ప్రచారం ప్రస్తుతం దేశవ్యాప్తంగా ముమ్మరంగా సాగుతోంది. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు అపూర్వమైన ఉత్సాహం, సమన్వయంతో పాల్గొంటున్నాయి. లక్షలాది మంది విద్యార్థులు, విద్యా సంస్థలు, గ్రామ పంచాయతీల వంటి ఇతర కీలక భాగస్వాములు బాల్య వివాహ నిరోధక ప్రతిజ్ఞను స్వీకరించాయి.
బాల్య వివాహ రహిత భారతదేశం దిశగా: ఇప్పటివరకు పురోగతి
ప్రారంభమైనప్పటి నుంచి బాల వివాహ ముక్త భారత్ (బీవీఎంబీ) మిషన్ జాతీయ శిశు సంరక్షణ లక్ష్యాలకు అనుగుణంగా కీలకమైన అమలు, అవగాహన మైలురాళ్లను సాధించింది. బాల్య వివాహాల నిరోధక చట్టం(పీసీఎంఏ)-2006 ప్రకారం నియమించిన బాల్య వివాహాల నిరోధక అధికారుల(సీఎంపీఓ) విస్తరణ ఈ పురోగతిలో ప్రధానమైనది. వీరు ఇంటింటికీ వెళ్లి అవగాహన కల్పించడం, జాతీయ చైల్డ్ హెల్ప్‌లైన్(1098)తో అనుసంధానమైన వేగవంతమైన ప్రతిస్పందన బృందాల ద్వారా క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు.
ముఖ్యంగా 2025 అక్షయ తృతియ సమయంలో ఎండబ్ల్యూసీడీ జారీ చేసిన ఆదేశాల వల్ల సామూహిక వివాహాల పర్యవేక్షణ పెరిగి, వందలాది బాల్య వివాహాలను నిరోధించడం సాధ్యమైంది. బేటీ బచావో బేటీ పఢావో వంటి పథకాలతో అనుసంధానం కావడం వల్ల శిక్షా రేటు పెరగడమే కాకుండా, అనేక గ్రామాలలో "బాల్య వివాహ రహిత జోన్ల" ఏర్పాటుకు దారితీసింది.
అంతర్జాతీయంగా బీవీఎంబీకి యూనిసెఫ్ నుంచి బలమైన మద్దతు లభించింది. ఎస్‌డీజీ 5.3, యూఎన్‌సీఆర్‌సీ లక్ష్యాలకు అనుగుణంగా భారతదేశం దక్షిణాసియాలో బాల్య వివాహ నిరోధక వ్యూహాలలో అగ్రగామిగా నిలిచింది.
ఛత్తీస్‌గఢ్: బాల్య వివాహ రహిత భారత్ దిశగా ఆశాదీపం
ఛత్తీస్‌గఢ్‌లోని బాలోద్ జిల్లా భారతదేశపు మొట్టమొదటి బాల్య వివాహ రహిత జిల్లాగా అవతరించి చరిత్రాత్మక మైలురాయిని సృష్టించింది. గత రెండేళ్లుగా ఇక్కడి 436 గ్రామ పంచాయతీలు, 9 పట్టణ స్థానిక సంస్థలలో ఒక్క బాల్య వివాహం కూడా నమోదు కాలేదు. బాలోద్ విజయాన్ని స్ఫూర్తిగా తీసుకుని, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం 2028-29 నాటికి పూర్తి రాష్ట్రాన్ని బాల్య వివాహ రహితంగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకుంది.
అదేవిధంగా సూరజ్‌పూర్ జిల్లా సెప్టెంబర్ 17, 2025న 75 గ్రామ పంచాయతీలను "బాల్య వివాహ రహిత పంచాయతీలు"గా ప్రకటించి ఆదర్శంగా నిలిచింది. ఈ విజయాలు మిగిలిన భారతదేశానికి స్ఫూర్తిదాయక నమూనాలుగా నిలుస్తాయి.

ముగింపు
19వ శతాబ్దపు సంస్కరణలు 1929 నాటి శారదా చట్టం నుంచి 2006 నాటి బాల్య వివాహాల నిరోధక చట్టం, 2024 నాటి సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పు వరకు భారతదేశ ప్రయాణం గొప్ప పురోగతిని సాధించింది. నవంబర్ 2024లో ప్రారంభించిన 'బాల వివాహ ముక్త భారత్' ప్రచారం, మార్చి 2026 వరకు కొనసాగే 100 రోజుల సాంద్రత అవగాహన కార్యక్రమం ఈ పోరాటంలో కీలక మలుపులు. బాల్య వివాహాల నిరోధక అధికారులు, సాంకేతికతతో కూడిన నివేదిక సమర్పించేందుకు బీవీఎంబీ పోర్టల్, క్షేత్రస్థాయి విజయాల ద్వారా ఈ కార్యక్రమం నియంత్రణ, రక్షణ, సాధికారతకు దారి తీయడంతో పాటు బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమంతో అనుసంధానమైంది.
కోట్లాది మంది ప్రతిజ్ఞ చేయడం, క్లిష్టమైన చర్యలు కేవలం సమాజంలో పేరుకుపోయిన లోతైన సవాలు ఎదుర్కొవడంతో పాటు సుస్థిరాభివృద్ధి లక్ష్యం 5.3, వికసిత భారత్ సంకల్పానికి అనుగుణంగా మారాయి. ప్రభుత్వం, సమాజం, ఎన్జీవోలు, పౌరుల నిరంతర సామూహిక కృషి ద్వారా అసమానతలను రూపుమాపి, ప్రతి బిడ్డకు విద్య, ఆరోగ్యం, స్వయంప్రతిపత్తిని నిర్ధారించవచ్చు. అచంచలమైన నిబద్ధతతో భారతదేశం నిజమైన బాల్య వివాహ రహిత భవిష్యత్తును సాధించగలదు.
References:
Press Information Bureau:
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2168554®=3&lang=2
https://www.pib.gov.in/PressReleseDetail.aspx?PRID=2197965®=3&lang=1
Ministry of Women and Child Development:
https://stopchildmarriage.wcd.gov.in/public/documents/noticeboard/campaign100days.pdf
https://socialwelfare.tripura.gov.in/sites/default/files/THE%20PROHIBITION%20OF%20CHILD%20MARRIAGE%20ACT%2C%202006.pdf
https://stopchildmarriage.wcd.gov.in/about#:~:text=The%20Prohibition%20of%20Child%20Marriage%20Act%20(PCMA),*%20Put%20in%20place%20a%20comprehensive%20mechanism
https://stopchildmarriage.wcd.gov.in/about#:~:text=The%20Prohibition%20of%20Child%20Marriage%20Act%20(PCMA),*%20Put%20in%20place%20a%20comprehensive%20mechanism
https://wdcw.ap.gov.in/dept_files/cm_cmp.pdf
https://x.com/Annapurna4BJP/status/1993968281439621226?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1993968281439621226%7Ctwgr%5Eb7b72c138a5947de31a0f178d352c201ede5d37d%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.pib.gov.in%2FPressReleasePage.aspx%3FPRID%3D2197965reg%3D3lang%3D1
https://x.com/MinistryWCD/status/1995429594141458665
https://rsdebate.nic.in/bitstream/123456789/421118/1/PD_104_02031978_9_p131_p222_17.pdf
Ministry of Law and Justice:
https://www.indiacode.nic.in/bitstream/123456789/6843/1/child_marriage_prohibition_act.pdf?referrer=grok.com
Doordarshan (DD National Youtube):
https://www.youtube.com/watch?v=WxlPyjEk5Fk
United Nations Population Fund:
https://india.unfpa.org/sites/default/files/pub-pdf/analytical_series_1_-_child_marriage_in_india_-_insights_from_nfhs-5_final_0.pdf
United Nations Women:
https://sadrag.org/wp-content/uploads/2025/01/Training-Guide-for-service-providers-GBV-compressed.pdf
United Nations Children's Fund:
file:///C:/Users/HP/Downloads/Ending_Child_Marriage-profile_of_progress_in_India_2023%20(1).pdf
Bal Vivah Mukt Bharat
****
(Explainer ID: 156887)
आगंतुक पटल : 5
Provide suggestions / comments