Infrastructure
100% విద్యుదీకరణ మిషన్: భారతీయ రైల్వే భవిష్యత్తుకు శక్తి
Posted On:
06 JAN 2026 11:35AM
కీలకాంశాలు
- భారతీయ రైల్వే 2025 నవంబర్ నాటికి తన నెట్‌వర్క్‌లో సుమారు 99.2% విద్యుదీకరించింది. తద్వారా ప్రపంచంలోనే అత్యంత విస్తృతంగా విద్యుదీకరించిన రైల్వే వ్యవస్థలలో ఒకటిగా నిలిచింది.
- విద్యుదీకరణ వేగం 1.42 కి.మీ/రోజు (2004–2014) నుంచి 2019-2025 మధ్య 15 కి.మీ/రోజుకి పైగా పెరిగింది. ఇది ఆధునీకరణలో భారీ వేగానికి నిదర్శనం.
- 2025 నవంబర్ నాటికి భారతీయ రైల్వే తన సౌర విద్యుత్ సామర్థ్యాన్ని 898 మెగావాట్లకు పెంచుకుంది. 2014లో ఉన్న 3.68 మెగావాట్ల నుంచి గణనీయమైన వృద్ధిని సాధించి, పునరుత్పాదక ఇంధన వినియోగంలో విప్లవాత్మక మార్పును చాటుకుంది.
పట్టాలపై నిశ్శబ్ద విప్లవం
ఒకప్పుడు ప్రధానంగా డీజిల్‌తో నడిచే భారతీయ రైల్వే ఇప్పుడు వేగంగా విద్యుత్ రైళ్ల వైపు మళ్లుతోంది. ఇది ఆధునిక, స్థిరమైన భవిష్యత్తు వైపు ఒక ప్రధాన అడుగు. 100% విద్యుదీకరణ మిషన్ కింద రైల్వే వ్యవస్థ అంతటా విద్యుత్ తీగలు విస్తరించడంతో ఇప్పుడు రైలు వ్యవస్థ మరింత వేగంగా, సమర్థవంతంగా మారుతోంది. ఈ మార్పు కాలుష్యాన్ని తగ్గించడంలో భారతదేశ బలమైన నిబద్ధతను ప్రతిబింబిస్తోంది. ఇది దేశానికి స్వచ్ఛమైన వాతావరణాన్ని, మెరుగైన రవాణాకు దోహదపడుతోంది. ప్రస్తుతం దాదాపు మొత్తం రైల్వే వ్యవస్థ విద్యుత్‌పై నడుస్తోంది. సౌర శక్తి వంటి పునరుత్పాదక ఇంధనం కూడా స్టేషన్లు, కార్యకలాపాలలో అనుసంధానం అవుతోంది. పర్యావరణ అనుకూల రైళ్లు, విశ్వసనీయ శక్తి, స్వచ్ఛ వాతావరణం వంటి లక్ష్యాలతో స్పష్టమైన దృష్టి ఉంది.
శతాబ్దపు పురోగతి: భారతదేశంలో రైల్వే విద్యుదీకరణ ప్రయాణం
భారతదేశ రైల్వే విద్యుదీకరణ కథ 1925లో ప్రారంభమైంది. అప్పుడు దేశంలోనే మొదటి విద్యుత్ రైలు 1500 వోల్ట్ డీసీ సిస్టమ్‌తో బొంబాయి విక్టోరియా టెర్మినస్, కుర్లా హార్బర్ మధ్య నడిచింది. అది స్వల్ప మార్గం అయినప్పటికీ ఒక చరిత్రాత్మక ముందడుగు. భారతదేశంలో ఎలక్ట్రిక్ ట్రాక్షన్ మొదటి కార్యాచరణ వినియోగం. ఇది ఇంధన-సమర్థవంతమైన, అధిక-సామర్థ్యం గల రైలు ప్రయాణానికి నాంది పలికింది.
ప్రారంభ దశాబ్దాలలో పురోగతి తక్కువగానే ఉండేది. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చే నాటికి కేవలం 388 రూట్ కిలోమీటర్లు(ఆర్‌కేఎం) మాత్రమే విద్యుదీకరణ జరిగింది. బొగ్గు, డీజిల్ ఇంజన్లే పట్టాలపై ఆధిపత్యం చెలాయించేవి. కాలక్రమేణా విద్యుదీకరణ క్రమంగా విస్తరించింది. అయితే గత దశాబ్దంలో భారతీయ రైల్వే పరిశుభ్రమైన, సమర్థవంతమైన కార్యకలాపాలపై దృష్టి సారించడంతో అసలైన మార్పు మొదలైంది.
దీని ప్రభావం అద్భుతంగా ఉంది. విద్యుదీకరణ వేగం 2004 - 2014 మధ్య రోజుకు కేవలం 1.42 కి.మీ నుంచి 2019 - 2025 మధ్య సగటున రోజుకు 15 కి.మీ కంటే ఎక్కువకు పెరిగింది. నెట్‌వర్క్ ఎంత త్వరగా ఆధునీకరణ జరుగుతోందో ఈ వేగం తెలియజేస్తోంది. విద్యుదీకరించిన ట్రాక్ వాటా 2000లో 24% నుంచి 2017లో 40 శాతానికి పెరిగింది. 2024 చివరి నాటికి 96% దాటింది. నేడు శతాబ్దపు ప్రయాణం ముగింపు దశకు చేరుకుంటోంది. 2025 నవంబర్ నాటికి భారతదేశం అద్భుతమైన 69,427 ఆర్‌కేఎంలను విద్యుదీకరించింది. ఇది మొత్తం రైల్వే వ్యవస్థలో సుమారు 99.2 శాతం. ఇందులో 46,900 ఆర్‌కేఎంలు 2014 - 2025 మధ్య విద్యుదీకరణ జరిగింది.


వంద సంవత్సరాల క్రితం బొంబాయిలోని ఒక చిన్న సబర్బన్ మార్గంలో ప్రారంభమైన విద్యుదీకరణ ప్రయాణం నేడు ప్రపంచంలోనే అత్యంత విస్తృతమైన, దాదాపు పూర్తిగా విద్యుదీకరణ జరిగిన రైలు వ్యవస్థలలో ఒకటిగా ఎదిగింది. ఉద్గారాలను తగ్గించడానికి, సామర్థ్యాన్ని పెంచడానికి, దేశానికి హరిత, వేగవంతమైన భవిష్యత్తును అందించడానికి భారతీయ రైల్వే చేస్తున్న కృషిలో విద్యుదీకరణ ఇప్పుడు కేంద్ర బిందువుగా ఉంది.
ప్రస్తుత పరిస్థితి: చివరి మైళ్ల అనుసంధానం
భారతదేశంలోని 70,001 ఆర్‌కేఎం బ్రాడ్ గేజ్ నెట్‌వర్క్‌లో 99.2% ఇప్పటికే విద్యుదీకరించడంతో భారతీయ రైల్వే పూర్తి విద్యుదీకరణ ముంగిట ఉంది. ఇది స్థిరమైన, సమర్థవంతమైన, భవిష్యత్తుకు సిద్ధంగా ఉన్న రైలు రవాణాలో ఒక విప్లవాత్మక విజయంగా నిలుస్తోంది. రాష్ట్రాలవారీగా వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.
రాష్ట్రాల వారీగా రైల్వే విద్యుదీకరణ
- 25 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలలో 100% విద్యుదీకరణ జరిగింది. అక్కడ పెండింగ్‌లో ఉన్న బీజీ రూట్ కిలోమీటర్లు ఏవీ లేవు.
- కేవలం 5 రాష్ట్రాల్లో మాత్రమే విద్యుదీకరణ పనులు మిగిలి ఉన్నాయి. ఇవి మొత్తం కలిపి కేవలం 574 ఆర్‌కేఎంలు. అంటే మొత్తం బీజీ వ్యవస్థలో కేవలం 0.8% మాత్రమే.
విద్యుదీకరణ పనులు మిగిలి ఉన్న రాష్ట్రాలు
రాష్ట్రం మొత్తం బీజీ ఆర్‌కేఎం విద్యుదీకరించిన బీజీ ఆర్‌కేఎం విద్యుదీకరణ శాతం మిగిలిన ఆర్‌కేఎం
|
State
|
Total BG RKM
|
Electrified BG RKM
|
% Electrified
|
Balance RKM
|
|
రాజస్థాన్
|
6,514
|
6,421
|
99%
|
93
|
|
తమిళనాడు
|
3,920
|
3,803
|
97%
|
117
|
|
కర్ణాటక
|
3,742
|
3,591
|
96%
|
151
|
|
అస్సాం
|
2,578
|
2,381
|
92%
|
197
|
|
గోవా
|
187
|
171
|
91%
|
16
|
విద్యుదీకరణ ఎందుకు ముఖ్యం
భారతదేశ స్థిరమైన రవాణా, ఆర్థిక వృద్ధి వ్యూహంలో రైల్వే విద్యుదీకరణ ఒక మూలస్తంభంగా నిలుస్తోంది. పర్యావరణంపై ప్రతికూల ప్రభావాన్ని తగ్గించడమే కాకుండా ఇది ఇంధన భద్రతను బలోపేతం చేస్తుంది. కార్యకలాపాల సామర్థ్యాన్ని పెంచుతుంది. ప్రాంతాల వారీగా సమగ్రాభివృద్ధిని ప్రోత్సహిస్తుంది. వేగవంతమైన, సమర్థవంతమైన రైలు కార్యకలాపాల నుంచి రైల్వే కారిడార్ల వెంట పారిశ్రామిక, గ్రామీణ వృద్ధిని వేగవంతం చేయడం వరకు విద్యుదీకరణ ప్రయోజనాలు విస్తరించి ఉన్నాయి. ఇది జాతీయ పురోగతికి శక్తివంతమైన సాధనంగా మారుతోంది.

ప్రపంచ ప్రమాణాలతో పోలిక: ప్రపంచ దృష్టిలో భారతదేశం
99.2% రైల్వే విద్యుదీకరణను సాధించడం ద్వారా భారతీయ రైల్వే ప్రపంచంలోని అగ్రగామి రైల్వే వ్యవస్థల మధ్య తన స్థానాన్ని పటిష్టం చేసుకుంది. ప్రధాన అంతర్జాతీయ రైల్వే వ్యవస్థలతో పోలిస్తే విద్యుదీకరణ స్థాయిలు ప్రపంచవ్యాప్తంగా ఎలా మారుతాయో, భారతదేశం సాధించిన పురోగతి స్థాయి, ప్రాముఖ్యతను అర్థమవుతుంది. ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ రైల్వేస్ (UIC) 2025 జూన్ నివేదిక ప్రకారం ప్రముఖ దేశాలలో రైల్వే విద్యుదీకరణ స్థాయి ఈ కింది విధంగా ఉంది:
|
దేశం
|
రైల్వే విద్యుదీకరణ (%)
|
|
స్విట్జర్లాండ్
|
100%
|
|
చైనా
|
82%
|
|
స్పెయిన్
|
67%
|
|
జపాన్
|
64%
|
|
ఫ్రాన్స్
|
60%
|
|
రష్యా
|
52%
|
|
యునైటెడ్ కింగ్‌డమ్
|
39%
|
ఈ ప్రపంచ పోలిక అభివృద్ధి చెందిన రైల్వే వ్యవస్థల మధ్య భారతదేశ స్థానాన్ని చాటి చెప్పడంతో పాటు సామర్థ్యం, స్థిరత్వం, అంతర్జాతీయ పోటీతత్వాన్ని సాధించడంలో సుస్థిర విద్యుదీకరణ వ్యూహాత్మక ప్రాముఖ్యతను బలపరుస్తుంది.
సౌర శక్తితో రైల్వేలు: భవిష్యత్తుకు వెలుగు
స్థిరమైన, సమర్థవంతమైన రవాణాపై పెరుగుతున్న దృష్టితో భారతీయ రైల్వే విద్యుత్ ట్రాక్షన్‌కు ప్రాధాన్యతనిస్తోంది. ఎందుకంటే ఇది పర్యావరణ అనుకూలమైనది. డీజిల్ ట్రాక్షన్ కంటే సుమారు 70% తక్కువ ఖర్చుతో కూడుకున్నది. భారతీయ రైల్వేల 100% విద్యుదీకరణ మిషన్‌కు సంబంధించి రెండు ముఖ్యమైన సానుకూల పరిణామాలు కనిపిస్తున్నాయి:
- మొత్తం బ్రాడ్ గేజ్ వ్యవస్థను యుద్ధప్రాతిపదికన విద్యుదీకరించాలనే నిబద్ధత, ప్రజలకు పర్యావరణ అనుకూలమైన, స్వచ్ఛమైన, హరిత రవాణా మార్గాన్ని అందించేందుకు దోహదపడుతోంది.
- రైల్వే పట్టాల వెంట అందుబాటులో ఉన్న విస్తారమైన భూమిని ఉపయోగించుకోవడం ద్వారా పునరుత్పాదక ఇంధనాన్ని, ముఖ్యంగా సౌర శక్తిని వినియోగించుకోవాలనే వ్యూహాత్మక నిర్ణయం.
ప్రధాన సౌర సామర్థ్య వినియోగం
పునరుత్పాదక ఇంధనం వైపు భారతీయ రైల్వే మళ్లడం అనేది హరిత, మరింత స్థిరమైన రవాణా వ్యవస్థను నిర్మించడంలో ఒక నిర్ణయాత్మక అడుగు. వ్యవస్థ అంతటా సౌర శక్తిని స్వీకరించిన వేగం, స్థాయి ఈ నిబద్ధతను నొక్కి చెబుతున్నాయి.
- అపూర్వమైన సామర్థ్య వృద్ధి: 2025 నవంబర్ నాటికి భారతీయ రైల్వే 898 మెగావాట్ల సౌర విద్యుత్తును ఏర్పాటు చేసింది. ఇది 2014లో ఉన్న కేవలం 3.68 మెగావాట్ల నుంచి అద్భుతమైన వృద్ధిని సాధించింది. అంటే సౌర సామర్థ్యంలో దాదాపు 244 రెట్లు పెరుగుదల కనిపించింది.
- దేశవ్యాప్తంగా స్వచ్ఛ ఇంధన విస్తరణ: ఇప్పుడు 2,626 రైల్వే స్టేషన్లలో సౌర విద్యుత్ ఏర్పాటైంది. ఇది వివిధ భౌగోళిక, కార్యాచరణ జోన్లలో స్వచ్ఛమైన ఇంధన పరిష్కారాలను విస్తృతంగా అవలంబించడాన్ని ప్రదర్శిస్తుంది.
సౌర శక్తి రైల్వే విద్యుదీకరణకు ఎలా మద్దతు ఇస్తుంది?
సౌర శక్తి విద్యుదీకరణ లక్ష్యానికి బహుళ మార్గాల్లో దోహదపడుతుంది:
- విద్యుత్ రైళ్ల కార్యకలాపాలకు మద్దతు: ప్రారంభించిన మొత్తం 898 మెగావాట్ల సౌర సామర్థ్యంలో 629 మెగావాట్ల(సుమారు 70%) ట్రాక్షన్ అవసరాల కోసం ఉపయోగపడుతోంది. అంటే ఉత్పత్తి చేసిన సౌర విద్యుత్ నేరుగా విద్యుత్ రైళ్ల కార్యకలాపాలకు అవసరమైన విద్యుత్తుకు తోడ్పడుతుంది. ఇది ట్రాక్షన్ కోసం సంప్రదాయ గ్రిడ్ విద్యుత్తుపై ఆధారపడటాన్ని తగ్గిస్తుంది.
- ట్రాక్షన్-యేతర ఇంధన అవసరాలను తీర్చడం: మిగిలిన 269 మెగావాట్ల సౌర సామర్థ్యం స్టేషన్ లైటింగ్, భవనాలు, వర్క్‌షాప్‌లు, రైల్వే క్వార్టర్ల వంటి ట్రాక్షన్-యేతర అవసరాల కోసం ఉపయోగ పడుతోంది. ఈ ఇంధన అవసరాలను సౌరశక్తితో తీర్చడం ద్వారా భారతీయ రైల్వే సంప్రదాయ ఇంధన వినియోగాన్ని, విద్యుత్ ఖర్చులను స్వచ్ఛమైన, స్థిరమైన మార్గంలో తగ్గిస్తుంది. దీనివల్ల నెట్‌వర్క్ అంతటా మొత్తం ఇంధన భద్రత, కార్యాచరణ సామర్థ్యం మెరుగుపడుతోంది.

విద్యుదీకరణ భవిష్యత్తు నిర్మాణం
రైల్వే విద్యుదీకరణ ప్రాజెక్టులలో సామర్థ్యం, భద్రత, వేగాన్ని మెరుగుపరచడానికి భారతీయ రైల్వే ఆధునిక సాంకేతికతలను, వినూత్న నిర్మాణ పద్ధతులను ఎక్కువగా అవలంబిస్తోంది. మాన్యువల్ ఆధారిత పనులను తగ్గించి, యంత్రీకరణను స్వీకరించడం ద్వారా ప్రాజెక్టుల అమలు వేగంగా, మరింత విశ్వసనీయంగా, నాణ్యతతో సాగుతోంది.

సిలిండ్రికల్ మెకనైజ్డ్ ఫౌండేషన్
సాంప్రదాయ ఓవర్ హెడ్ ఎలక్ట్రిఫికేషన్(ఓహెచ్ఈ) పునాదులకు శ్రమతో కూడిన తవ్వకాలు అవసరమయ్యేవి. ప్రాజెక్టు పురోగతి సైతం నెమ్మదిగా ఉండేది. మెకనైజ్డ్ ఆగరింగ్ ద్వారా వేసి సిలిండ్రికల్ పునాదులను అవలంబించడం వల్ల ప్రక్రియ సులభతరమైంది. శ్రమ తగ్గడంతో పాటు సమయం గణనీయంగా ఆదా అవుతోంది.
అత్యాధునిక ఆటోమేటిక్ వైరింగ్ రైలు
ఆటోమేటిక్ వైరింగ్ రైలు సరైన టెన్షన్ కంట్రోల్‌తో కేటెనరీ, కాంటాక్ట్ వైర్లను ఏకకాలంలో అమర్చడానికి వీలు కల్పిస్తోంది. ఈ అధునాతన వ్యవస్థ వైరింగ్ ప్రక్రియను వేగవంతం చేయడంతో పాటు విద్యుదీకరణ పనులను సకాలంలో పూర్తి చేసేలా చేస్తుంది.

ఆధునీకరణ మాత్రమే కాదు.. ఒక ఉద్యమం
భారతీయ రైల్వే ఇంధన ముఖచిత్రాన్ని విద్యుదీకరణ తిరిగి రాస్తోంది. పాత వ్యవస్థను సమకాలీన శక్తి కేంద్రంగా మారుస్తోంది. ఒకప్పుడు డీజిల్‌తో నడిచే దిగ్గజం ఇప్పుడు తక్కువ శబ్దం, తక్కువ ఖర్చు, తక్కువ కార్బన్‌తో లక్షల మందిని తరలించే సొగసైన, విద్యుదీకరించిన వ్యవస్థగా వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఇది కేవలం ఆధునీకరణ మాత్రమే కాదు.. ఒక వేగం. భారతదేశంలో రైల్వే విద్యుదీకరణ అనేది ఇప్పుడు కేవలం సాంకేతిక ఆధునీకరణ మాత్రమే కాదు.. ఇది మౌలిక సదుపాయాలు ఆకాంక్షలను కలిసే జాతీయ గాథ. ఇక్కడ ప్రతి కొత్త విద్యుదీకరించిన మార్గం వేగవంతమైన, హరిత, మరింత అనుసంధానిత ప్రయాణాలకు ఒక వాగ్దానంగా మారుతోంది.
Ministry of Railways
https://core.indianrailways.gov.in/view_section.jsp?lang=0&id=0,294,302
https://core.indianrailways.gov.in/view_section.jsp?lang=0&id=0,294,302,530
https://indianrailways.gov.in/railwayboard/uploads/directorate/ele_engg/2025/Status%20of%20Railway%C2%A0Electrification%20as%20on%C2%A030_11_2025.pdf
https://nfr.indianrailways.gov.in/railwayboard/uploads/directorate/secretary_branches/IR_Reforms/Mission%20100%25%20Railway%20Electrification%20%20Moving%20towards%20Net%20Zero%20Carbon%20Emission.pdf
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2078089
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2205232
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2204797
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2203715
Mission 100% Electrification: Powering the Future of Indian Railways
***
(Explainer ID: 156854)
आगंतुक पटल : 10
Provide suggestions / comments