Economy
మీ డబ్బు, మీ హక్కు
మరచిపోయిన ఆర్థిక ఆస్తులను తిరిగి పొందడం, పౌరుల యాజమాన్యాన్ని బలోపేతం చేయడం
Posted On:
26 DEC 2025 11:41AM
కీలకాంశాలు
- మీ డబ్బు, మీ హక్కు అనేది పౌరులు తమ క్లెయిమ్ చేయని ఆర్థిక ఆస్తులను గుర్తించి, తిరిగి పొందేలా సహాయపడటానికి రూపొందించిన దేశవ్యాప్త అవగాహన, సహాయక కార్యక్రమం.
- ఈ చొరవ నియంత్రిత ఆర్థిక వ్యవస్థలో ఉన్న బ్యాంకులు, బీమా, మ్యూచువల్ ఫండ్‌లు, డివిడెండ్‌లు, షేర్లు, రిటైర్మెంట్ ప్రయోజనాల్లో క్లెయిమ్ చేయని పొదుపు మొత్తాల సమస్యను పరిష్కరిస్తుంది.
- ఆర్థిక సేవల విభాగం, ఆర్థిక రంగ నియంత్రణ సంస్థల సమన్వయంతో ఈ ప్రచారం డిజిటల్ పోర్టల్‌లను జిల్లా స్థాయి సౌకర్యాలతో అనుసంధానిస్తుంది.
- ప్రభుత్వ విభాగాలు, నియంత్రణ సంస్థలు, ఆర్థిక సంస్థల సమన్వయ ప్రయత్నాల ద్వారా దాదాపు రూ.2,000 కోట్లు అసలైన యజమానులకు తిరిగి చేరాయి.

పరిచయం
తరతరాలుగా భారతీయ కుటుంబాలు బ్యాంక్ ఖాతాలను తెరవడం, బీమా పాలసీలను కొనుగోలు చేయడం, మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టడం, షేర్ల నుంచి డివిడెండ్లను సంపాదించడం, పదవీ విరమణ కోసం డబ్బును పక్కన పెట్టడం ద్వారా జాగ్రత్తగా పొదుపు చేస్తున్నాయి. పిల్లల విద్యను సురక్షితం చేయడానికి, ఆరోగ్య అవసరాలకు మద్దతు ఇవ్వడానికి, వృద్ధాప్యంలో గౌరవప్రదమైన జీవితాన్ని జీవించేందుకు ఒక ఆశ, బాధ్యతతో ఈ ఆర్థిక నిర్ణయాలను తీసుకుంటాయి.
అయినప్పటికీ కాలక్రమేణా కష్టపడి సంపాదించిన ఈ పొదుపులో గణనీయమైన భాగం క్లెయిమ్ చేయకుండా మిగిలిపోతోంది. ఈ డబ్బు మాయం కాలేదు, దుర్వినియోగం కాలేదు. ఇది నియంత్రిత ఆర్థిక సంస్థల వద్ద సురక్షితంగా ఉంది. కానీ అవగాహన లేకపోవడం, పాత రికార్డులు, నివాసం మారడం లేదా పత్రాలు లేకపోవడం వల్ల అసలైన యజమానులకు అందలేదు. చాలా సందర్భాలలో అటువంటి ఆస్తులు ఉన్నాయని కుటుంబాలకు తెలియదు.
"మీ డబ్బు, మీ హక్కు" అనేది పౌరులను ఈ మరచిపోయిన ఆర్థిక ఆస్తులతో తిరిగి అనుసంధానించడానికి, వ్యక్తులు, కుటుంబాలకు చెందిన డబ్బు చివరికి వారికి తిరిగి చేరేలా చూడటానికి చేస్తున్న దేశవ్యాప్త ప్రయత్నం.
క్లెయిమ్ చేయని ఆర్థిక ఆస్తులు అంటే ఏమిటి

ఆర్థిక సంస్థల వద్ద ఉన్న డబ్బును ఖాతాదారుడు లేదా వారి వారసులు చాలాకాలం పాటు క్లెయిమ్ చేయనప్పుడు క్లెయిమ్ చేయని ఆర్థిక ఆస్తులు ఏర్పడతాయి. ఇటువంటి ఆస్తులలో ఇవి ఉన్నాయి:
- పదేళ్లు లేదా అంతకంటే ఎక్కువ కాలం పాటు నిర్వహించని సేవింగ్స్ ఖాతాలు, కరెంట్ ఖాతాలు, ఫిక్స్‌డ్ డిపాజిట్లు, రికరింగ్ డిపాజిట్లు వంటి బ్యాంక్ డిపాజిట్లు.
- గడువు తేదీ దాటిన తర్వాత కూడా చెల్లించబడకుండా మిగిలిపోయిన బీమా పాలసీ సొమ్ము.
- బ్యాంక్ ఖాతా మార్పు, బ్యాంక్ ఖాతా మూసివేత, రికార్డులలో అసంపూర్ణ బ్యాంక్ ఖాతా వంటి కారణాల వల్ల క్రెడిట్ చేయలేకపోయిన మ్యూచువల్ ఫండ్ రీడెంప్షన్ సొమ్ము లేదా డివిడెండ్‌లు.
- క్లెయిమ్ చేయకుండా మిగిలిపోయి, చట్టబద్ధమైన సంస్థలకు బదిలీ చేసిన డివిడెండ్‌లు, షేర్లు.
- సాధారణ క్రమంలో క్లెయిమ్ చేయని పింఛను, పదవీ విరమణ ప్రయోజనాలు.
చాలా సందర్భాలలో ఉద్యోగం కోసం వలస వెళ్లడం, సంప్రదింపు వివరాలలో మార్పులు, పాత బ్యాంక్ ఖాతాలను మూసివేయడం లేదా కుటుంబసభ్యులు, వారసులకు సమాచారం లేకపోవడం వంటి సాధారణ జీవిత సంఘటనల వల్ల ఆస్తులు క్లెయిమ్ చేయకుండా ఉండిపోవచ్చు.
“మీ డబ్బు, మీ హక్కు” కార్యక్రమం
ఈ సవాలును నిర్మాణాత్మకమైన, పౌర-కేంద్రీకృత పద్ధతిలో పరిష్కరించడానికి ప్రభుత్వం 2025 అక్టోబర్‌లో “మీ డబ్బు, మీ హక్కు” అనే కార్యక్రమాన్ని దేశవ్యాప్త అవగాహన, సౌకర్యాల ప్రచారంగా ప్రారంభించింది.
ఈ కార్యక్రమాన్ని ఆర్థిక మంత్రిత్వ శాఖలోని ఆర్థిక సేవల విభాగం, కీలక ఆర్థిక రంగ నిధుల నియంత్రణ సంస్థల సహకారంతో సమన్వయం చేస్తోంది. ఇందులో ఈ సంస్థలు ఉన్నాయి:
- రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ)
- ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఐఆర్‌డీఏఐ)
- సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ)
- ఇన్వెస్టర్ ఎడ్యుకేషన్ అండ్ ప్రొటెక్షన్ ఫండ్ అథారిటీ (ఐఈపీఎఫ్ఏ)
- పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ (పీఎఫ్ఆర్‌డీఏ)
సరళమైన ప్రక్రియలు, పారదర్శక వ్యవస్థలను ఉపయోగించి పౌరులు తమకు చట్టబద్ధంగా చెందిన ఆర్థిక ఆస్తులను గుర్తించడానికి, పొందేందుకు, క్లెయిమ్ చేయడానికి సహాయపడటం దీని ప్రధాన లక్ష్యం.
క్లెయిమ్ చేయని డబ్బు పరిమాణం
భారతదేశంలో క్లెయిమ్ చేయని ఆర్థిక ఆస్తుల పరిమాణం గణనీయంగా ఉంది. అధికారిక ఆర్థిక వ్యవస్థలోని బహుళ విభాగాలలో ఇవి విస్తరించి ఉన్నాయి. భారతీయ బ్యాంకులన్నీ కలిసి దాదాపు రూ.78,000 కోట్ల క్లెయిమ్ చేయని డిపాజిట్లను కలిగి ఉన్నాయని అంచనాలు సూచిస్తున్నాయి. క్లెయిమ్ చేయని బీమా పాలసీ సొమ్ము దాదాపు రూ.14,000 కోట్లుగా అంచనా. కాగా, మ్యూచువల్ ఫండ్లలో క్లెయిమ్ చేయని మొత్తాలు సుమారు రూ.3,000 కోట్లు. అదనంగా, క్లెయిమ్ చేయని డివిడెండ్‌లు దాదాపు రూ.9,000 కోట్లు ఉన్నాయి.

ఈ మొత్తాలు ఆర్థిక వ్యవస్థలో సురక్షితంగా ఉన్నప్పటికీ పౌరులకు చెందిన క్లెయిమ్ చేయని పొదుపులు ఎంత పెద్ద ఎత్తున వాడుకలో లేకుండా ఉన్నాయో తెలియజేస్తాయి.
క్లెయిమ్ చేయని ఆస్తులు ఎందుకు ముఖ్యం
క్లెయిమ్ చేయని డబ్బు కేవలం ఒక ఆర్థిక గణాంకం మాత్రమే కాదు. గృహాలకు సంబంధించి, విద్య, వైద్యం, జీవనోపాధికి మద్దతు లేదా అత్యవసర పరిస్థితుల కోసం అవసరమైన నిధుల అందుబాటును ఇది పరిమితం చేయవచ్చు లేదా ఆలస్యం చేయవచ్చు. సీనియర్ సిటిజన్లకు ఇది అవసరమైన ఆర్థిక భద్రతను అందించే పింఛన్లు లేదా బీమా ప్రయోజనాలకు సంబంధించినది కావచ్చు.

వ్యవస్థాగత స్థాయిలో క్లెయిమ్ చేయని ఆస్తులు పౌరులకు, అధికారిక ఆర్థిక వ్యవస్థకు మధ్య ఉన్న సంబంధాన్ని బలహీనపరుస్తాయి. ప్రజలు తమకు చెందిన డబ్బును పొందలేకపోయినప్పుడు అది నమ్మకం, భాగస్వామ్యంపై ప్రభావం చూపుతుంది. “మీ డబ్బు, మీ హక్కు” చొరవతో ఈ సమస్యను పరిష్కరించడం వల్ల గృహ ఆర్థిక స్థితి మాత్రమే కాకుండా ఆర్థిక సంస్థల విశ్వసనీయత, సమగ్రత కూడా బలపడుతుంది.
క్లెయిమ్ చేయని ఆస్తుల గుర్తింపునకు డిజిటల్ వేదికలు
క్లెయిమ్ చేయని బ్యాంక్ డిపాజిట్లు – ఉద్గామ్ పోర్టల్
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అభివృద్ధి చేసిన ఉద్గామ్(యూడీజీఏఎం) పోర్టల్ వివిధ బ్యాంకుల్లో క్లెయిమ్ చేయని బ్యాంక్ డిపాజిట్లను వెతికేందుకు ఒక కేంద్రీకృత సదుపాయాన్ని అందిస్తోంది. క్లెయిమ్‌లను సంబంధిత బ్యాంకులు పరిష్కరించినప్పటికీ క్లెయిమ్ చేయని నిల్వలు ఎక్కడ ఉన్నాయో గుర్తించడానికి ఈ పోర్టల్ పౌరులకు సహాయపడుతుంది.
ఒక బ్యాంక్ డిపాజిట్ పదేళ్లు లేదా అంతకంటే ఎక్కువ కాలం పాటు క్లెయిమ్ చేయకుండా ఉంటే అది డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్‌నెస్ ఫండ్ (డీఈఏ ఫండ్)కు బదిలీ అవుతుంది. అయినప్పటికీ ఆ డబ్బు వినియోగదారుడిదే. ఈ డబ్బును వినియోగదారు లేదా వారి వారసులు క్లెయిమ్ చేయడానికి ఎటువంటి కాలపరిమితి లేదు.
పోర్టల్‌ను ఇక్కడ సందర్శించవచ్చు: https://udgam.rbi.org.in/unclaimed-deposits/#/login
బీమా సొమ్ము – బీమా భరోసా పోర్టల్
వ్యక్తులు క్లెయిమ్ చేయని బీమా పాలసీ సొమ్మును గుర్తించడానికి బీమా భరోసా పోర్టల్ వీలు కల్పిస్తుంది. ఇది పాలసీదారులు, నామినీలు, వారసులు ఇన్సూరర్ల విచారణ పేజీల లింకుల ద్వారా తమకు ఏవైనా బీమా మొత్తాలు రావాల్సి ఉందో లేదో తనిఖీ చేయడానికి అనుమతిస్తుంది.
ఒక బీమా మొత్తం గడువు తేదీ నుంచి పన్నెండు నెలలకు మించి చెల్లించకుండా ఉంటే అది క్లెయిమ్ చేయనిదిగా పరిగణిస్తారు. పదేళ్ల కంటే ఎక్కువ కాలం క్లెయిమ్ చేయకుండా ఉన్న బీమా సొమ్ము ప్రభుత్వం నిర్వహించే సీనియర్ సిటిజన్ల సంక్షేమ నిధి(ఎస్‌సీడబ్ల్యూఎఫ్)కి బదిలీ అవుతుంది. అటువంటి బదిలీ యాజమాన్య హక్కులను ప్రభావితం చేయదు. బదిలీ చేసిన తేదీ నుంచి 25 సంవత్సరాల వరకు మొత్తాన్ని క్లెయిమ్ చేసే హక్కును లబ్ధిదారులు కలిగి ఉంటారు.
పాలసీదారులు, నామినీలు లేదా వారసులు ఎస్‌సీడబ్ల్యూఎఫ్‌కి బదిలీ చేసిన తర్వాత కూడా నిర్దేశించిన విధానాల ప్రకారం క్లెయిమ్‌లను ప్రారంభించడానికి సంబంధిత ఇన్సూరర్‌ను సంప్రదించవచ్చు. క్లెయిమ్ చేయని బీమా సొమ్మును క్లెయిమ్ చేయడానికి ఎటువంటి రుసుము లేదు.
సంప్రదింపు వివరాలను నవీకరించడం, నామినేషన్లను నమోదు చేయడం, నవీకరించడం, బీమా పాలసీల గురించి కుటుంబసభ్యులకు తెలియజేయడం, డిజిలాకర్ వంటి వేదికల ద్వారా పాలసీ పత్రాల భౌతిక లేదా డిజిటల్ రికార్డులను నిర్వహించడం వంటి నివారణ చర్యలను కూడా ఇది ప్రోత్సహిస్తోంది. సులభంగా గుర్తించడానికి పాలసీలను ఆధార్, పాన్ కార్డులతో కూడా అనుసంధానించవచ్చు.
పోర్టల్‌ను ఇక్కడ సందర్శించవచ్చు: https://bimabharosa.irdai.gov.in/
మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు – మిత్రా(ఎంఐటీఆర్ఏ) పోర్టల్
పెట్టుబడిదారులు క్లెయిమ్ చేయని, నిష్క్రియంగా ఉన్న మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులను గుర్తించడానికి ఎంఎఫ్ సెంట్రల్‌లో ఉన్న మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్‌మెంట్ ట్రేసింగ్ అండ్ రిట్రీవల్ అసిస్టెంట్(మిత్రా) వీలు కల్పిస్తుంది. ఈ వేదిక పెట్టుబడిదారులు నిర్దేశించిన సెర్చ్ పారామీటర్లను ఉపయోగించి అటువంటి పెట్టుబడులు ఏ మ్యూచువల్ ఫండ్‌లో ఉన్నాయో గుర్తించడానికి అనుమతిస్తుంది.
ఫోలియో సంఖ్య అనేది మ్యూచువల్ ఫండ్ సంస్థలు తమ పెట్టుబడిదారులకు ఒక నిర్దిష్ట పథకంలో వారి ఆస్తులను పర్యవేక్షించడానికి అందించే ప్రత్యేక గుర్తింపు సంఖ్య.
బ్యాంక్ ఖాతాల మార్పు లేదా మూసివేత, అసంపూర్ణ రికార్డులు, పాత సంప్రదింపు వివరాలు లేదా పెండింగ్‌లో ఉన్న కేవైసీ వంటి కారణాల వల్ల రీడెంప్షన్, మెచ్యూరిటీ సొమ్ము లేదా డివిడెండ్‌లు పెట్టుబడిదారుడి బ్యాంక్ ఖాతాలో క్రెడిట్ కానప్పుడు మ్యూచువల్ ఫండ్ మొత్తాలు క్లెయిమ్ చేయకుండా ఉండిపోతాయి.
అటువంటి సందర్భాలలో డబ్బు పోదు; గడువు తేదీన, అది క్లెయిమ్ చేసే వరకు కేటాయించిన క్లెయిమ్ చేయని పథకాలకు బదిలీ అవుతుంది. అదనంగా ఫోలియోలో యూనిట్ బ్యాలెన్స్ అందుబాటులో ఉన్నప్పటికీ పెట్టుబడిదారు పదేళ్లపాటు ఎలాంటి లావాదేవీ చేయకుంటే ఆ మ్యూచువల్ ఫండ్ ఫోలియో నిష్క్రియమైనదిగా పరిగణిస్తారు.
మిత్రా క్లెయిమ్ చేయని లేదా నిష్క్రియ పెట్టుబడుల గుర్తింపును సులభతరం చేస్తుంది. ఆ తర్వాత పెట్టుబడిదారులు క్లెయిమ్ ప్రక్రియను ప్రారంభించడానికి సంబంధిత అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీ(ఏఎంసీ) లేదా రిజిస్ట్రార్ అండ్ ట్రాన్స్‌ఫర్ ఏజెంట్(ఆర్‌టీఏ)ని సంప్రదించవచ్చు.
నివారణ చర్యలను కూడా ఈ విధానం ప్రధానంగా చెప్తోంది. భవిష్యత్తులో పెట్టుబడులు క్లెయిమ్ చేయకుండా ఉండకుండా ఉండటానికి కేవైసీ వివరాలు, బ్యాంక్ ఖాతా సమాచారం, సంప్రదింపుల రికార్డులను తాజాగా ఉంచాలని, క్రమం తప్పకుండా ఖాతా స్టేట్‌మెంట్‌లను సమీక్షించాలని పెట్టుబడిదారులను ప్రోత్సహిస్తుంది.
పోర్టల్‌ను ఇక్కడ సందర్శించవచ్చు: https://app.mfcentral.com/investor/signin
డివిడెండ్‌లు, షేర్లు – ఐఈపీఎఫ్ఏ పోర్టల్
క్లెయిమ్ చేయని డివిడెండ్‌లు, షేర్లు వరుసగా ఏడేళ్లపాటు చెల్లించకుండా లేదా క్లెయిమ్ చేయకుండా ఉన్న తర్వాత కంపెనీల ద్వారా ఇన్వెస్టర్ ఎడ్యుకేషన్ అండ్ ప్రొటెక్షన్ ఫండ్ అథారిటీ(ఐఈపీఎఫ్ఏ)కి బదిలీ అవుతాయి. ఐఈపీఎఫ్ఏ పోర్టల్ పాన్, పేరు లేదా కంపెనీ పేరు, డీమ్యాట్ ఐడీ/ఫోలియో నంబర్ వంటి వివరాలను నమోదు చేయడం ద్వారా క్లెయిమ్ చేయని డివిడెండ్‌లు, షేర్లు లేదా డిపాజిట్లను గుర్తించడానికి ఒక శోధన సదుపాయాన్ని అందిస్తుంది.
ఐఈపీఎఫ్ఏ వద్ద క్లెయిమ్ దాఖలు చేయడానికి ఎటువంటి రుసుము లేదు. ఫండ్‌కు బదిలీ చేసిన మొత్తాలను క్లెయిమ్ చేయడానికి నిర్దిష్ట కాలపరిమితి లేదు. అసలైన క్లెయిమ్‌దారు బదిలీ చేసిన తర్వాత ఏ సమయంలోనైనా వాపసు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
పోర్టల్‌ను ఇక్కడ సందర్శించవచ్చు: https://www.iepf.gov.in/content/iepf/global/master/Home/Home.html
క్షేత్రస్థాయికి కార్యక్రమం
“మీ డబ్బు, మీ హక్కు” కార్యక్రమం నేరుగా పౌరులకు చేరువ కావడానికి బలమైన ప్రాధాన్యతనిస్తుంది. దేశవ్యాప్తంగా విస్తృతమైన, సమగ్రమైన కవరేజీ కోసం డిజిటల్ వేదికలను క్షేత్రస్థాయి కార్యక్రమాలతో అనుసంధానిస్తుంది.
అక్టోబర్ 2025లో ప్రారంభించిన ఈ కార్యక్రమం ప్రతి రాష్ట్రం, కేంద్రపాలిత ప్రాంతాన్ని కవర్ చేస్తూ అక్టోబర్ నుంచి డిసెంబర్ 2025 వరకు మూడు నెలల దేశవ్యాప్త డ్రైవ్‌గా అమలైంది. ఈ ప్రచారం 3ఏ విధానం — అవేర్‌నెస్ (అవగాహన), యాక్సెసిబిలిటీ (అందుబాటు), యాక్షన్ (చర్య) ఆధారంగా రూపొందింది. పౌరులు తమ హక్కుగల పొదుపులను సరళమైన, పారదర్శక ప్రక్రియల ద్వారా గుర్తించడం, పొందడం, క్లెయిమ్ చేయడం దీని లక్ష్యం.
అక్టోబర్ నుంచి 19 డిసెంబర్ 2025 వరకు 668 జిల్లాల్లో సహాయక శిబిరాలు జరిగాయి. ఈ శిబిరాల్లో ప్రజా ప్రతినిధులు, జిల్లా యంత్రాంగాలు, బ్యాంకులు, బీమా కంపెనీలు, ఇతర ఆర్థిక సంస్థల అధికారుల క్రియాశీల భాగస్వామ్యం కనిపించింది. ఇది స్థానిక స్థాయిలో సమన్వయంతో కూడిన, సమర్థవంతమైన సేవలను అందించేలా చేసింది.
- ఈ శిబిరాలు లీడ్ డిస్ట్రిక్ట్ బ్యాంకులు, స్థానిక యంత్రాంగాల సమన్వయంతో స్టేట్ లెవల్ బ్యాంకర్స్ కమిటీలు, స్టేట్ లెవల్ ఇన్సూరెన్స్ కమిటీల ద్వారా జరిగాయి.
- క్లెయిమ్ చేయని ఆర్థిక ఆస్తులను వెతకడానికి, క్లెయిమ్‌లను సౌకర్యవంతంగా ప్రారంభించడానికి పౌరులకు హెల్ప్‌డెస్క్‌లు, డిజిటల్ కియోస్క్‌ల ద్వారా సహాయం అందింది.
- ఆర్థిక సమ్మిళిత పథకాలలో చేరడానికి, కేవైసీ, రీ-కేవైసీ ఫార్మాలిటీలను పూర్తి చేయడానికి కూడా ఈ కార్యక్రమం పౌరులను ప్రోత్సహించింది. తద్వారా అధికారిక ఆర్థిక వ్యవస్థతో వారి సంబంధం బలపడింది.

జిల్లా స్థాయి ఫలితాలు
జిల్లా స్థాయి అమలు జాతీయ లక్ష్యాలను స్థానిక స్థాయిలో కొలవగల ఫలితాలుగా మార్చింది. నిష్క్రియంగా ఉన్న, క్లెయిమ్ చేయని ఆర్థిక ఖాతాలను గుర్తించడంతో పాటు క్లెయిమ్‌లు ప్రారంభించారు. అనేక సందర్భాల్లో ప్రచార కార్యకలాపాల సమయంలో అక్కడికక్కడే పరిష్కారాల ద్వారా లబ్ధిదారులకు నిధులు తిరిగి చేరాయి. బ్యాంకులు, బీమా కంపెనీలు, ఇతర ఆర్థిక సంస్థలు ఒకే వేదికపై భాగస్వామ్యం వహించడం వల్ల సమన్వయంతో కూడిన సేవలు సాధ్యమయ్యాయి. పౌరుల పరస్పర చర్య సరళమవడంతో పాటు ప్రక్రియలో జాప్యం తగ్గింది.
సాధించిన పురోగతి
ప్రభుత్వ విభాగాలు, నియంత్రణ సంస్థలు, ఆర్థిక సంస్థల సమన్వయ ప్రయత్నాలు ప్రచారం సందర్భంగా స్పష్టమైన ఫలితాలను ఇచ్చాయి. దాదాపు రూ.2,000 కోట్లు అసలైన యజమానులకు తిరిగి అందాయి. సుదీర్ఘకాలం క్లెయిమ్ చేయకుండా ఉన్న ఆర్థిక ఆస్తులతో కుటుంబాలను తిరిగి అనుసంధానించారు.
ఆర్థిక రికవరీతో పాటు నామినేషన్లు, డాక్యుమెంటేషన్, రికార్డుల నిర్వహణపై అవగాహన పెంచడానికి ఈ కార్యక్రమం దోహదపడింది. ఇది గృహ స్థాయిలో మరింత సమర్థవంతమైన ఆర్థిక ప్రణాళికకు మద్దతు ఇచ్చింది.
ముగింపు
మీ డబ్బు, మీ హక్కు అనేది వ్యక్తులను, కుటుంబాలను చట్టబద్ధంగా వారికి చెందిన ఆర్థిక ఆస్తులతో తిరిగి అనుసంధానించే కేంద్రీకృత, పౌర-కేంద్రీకృత కార్యక్రమం. అవగాహన, సరళీకృత ప్రాప్యత, సమన్వయాన్ని కలపడం ద్వారా ఈ కార్యక్రమం ఆర్థిక వ్యవస్థలో దీర్ఘకాలంగా ఉన్న లోపాన్ని పరిష్కరించింది. క్లెయిమ్ చేయని పొదుపులు గుర్తించి, వాటి అసలైన యజమానులకు తిరిగి చేర్చింది.
విస్తృత స్థాయిలో ఈ కార్యక్రమం ఆర్థిక సంస్థలపై నమ్మకాన్ని బలపరుస్తుంది. ఆర్థిక సమ్మిళితాన్ని బలోపేతం చేయడంతో పాటు బాధ్యతాయుతమైన ఆర్థిక పద్ధతులను ప్రోత్సహిస్తుంది. వ్యక్తిగత పొదుపులు అందుబాటులో ఉండేలా, రక్షించుకునేలా, బదిలీ చేసుకునేలా చూడటం ద్వారా, “మీ డబ్బు, మీ హక్కు” మరింత పారదర్శకమైన, స్పందించే, పౌరులకు ప్రథమ ప్రాధాన్యతనిచ్చే ఆర్థిక పర్యావరణ వ్యవస్థకు దోహదపడింది.
References
Ministry of Finance
https://financialservices.gov.in/beta/sites/default/files/2025-10/LIC-Booklet-Design-for-Finance-Ministry_SEPT-2025_ENG-07-10-25.pdf
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2180477®=3&lang=2
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2200982®=3&lang=1
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2180029®=3&lang=2
DD News
https://ddnews.gov.in/en/pm-modi-urges-citizens-to-join-your-money-your-right-movement/
Link for video:
https://www.youtube.com/watch?v=c1CdZ2LnwII
Click here to see pdf
***
(Explainer ID: 156785)
आगंतुक पटल : 90
Provide suggestions / comments