Rural Prosperity
వికసిత భారత్ - జీ రామ్ జీ బిల్లు-2025
“వికసిత భారత్ కోసం ఎంజీనరేగా సంస్కరణ”
Posted On:
18 DEC 2025 11:54AM
కీలకాంశాలు
- ఎంజీనరేగా స్థానంలో వికసిత భారత్ - జీ రామ్ జీ బిల్లు-2025 వికసిత భారత్ 2047 లక్ష్యాలకు అనుగుణంగా కొత్త చట్టబద్ధమైన వ్యవస్థను ప్రవేశపెడుతుంది.
- ప్రతి గ్రామీణ కుటుంబానికి ఉపాధి హామీని 125 రోజులకు పెంచడం ద్వారా ఆదాయ భద్రతను బలోపేతం చేస్తుంది.
- వేతన ఉపాధిని 4 ప్రాధాన్యత రంగాలలో శాశ్వత గ్రామీణ మౌలిక సదుపాయాల కల్పనతో అనుసంధానిస్తుంది.
- వికసిత గ్రామ పంచాయతీ ప్రణాళికల ద్వారా వికేంద్రీకృత ప్రణాళికను, వికసిత భారత్ నేషనల్ రూరల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ స్టాక్ ద్వారా జాతీయ సమన్వయాన్ని బలోపేతం చేస్తుంది.
- నిబంధనల ఆధారిత నిధుల వ్యవస్థ, కేంద్ర ప్రాయోజిత నిర్మాణానికి మారడం ద్వారా అంచనా వేయదగిన విధానం, జవాబుదారీతనం, కేంద్ర-రాష్ట్ర భాగస్వామ్యం మెరుగుపడతాయి.
పరిచయం
దాదాపు రెండు దశాబ్దాలుగా భారతదేశ సామాజిక రక్షణ వ్యవస్థలో గ్రామీణ ఉపాధి ఒక మూలస్తంభంగా ఉంది. 2005లో అమలులోకి వచ్చినప్పటి నుంచి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం(ఎంజీ నరేగా) వేతన ఉపాధిని అందించడంలో, గ్రామీణ ఆదాయాలను స్థిరీకరించడంలో, ప్రాథమిక మౌలిక సదుపాయాలను సృష్టించడంలో కీలక పాత్ర పోషించింది. అయితే, కాలక్రమేణా గ్రామీణ భారతదేశ నిర్మాణం, లక్ష్యాలు గణనీయంగా అభివృద్ధి చెందాయి. పెరుగుతున్న ఆదాయాలు, విస్తరించిన అనుసంధానం, విస్తృతమైన డిజిటల్ వ్యాప్తి, వైవిధ్యభరితమైన జీవనోపాధి మార్గాలు గ్రామీణ ఉపాధి అవసరాల స్వభావాన్ని మార్చాయి.
ఈ నేపథ్యంలో ప్రభుత్వం వికసిత భారత్- గ్యారెంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవిక మిషన్(గ్రామీణ్) బిల్లు-2025ను ప్రతిపాదించింది. దీనిని వికసిత భారత్- జీ రామ్ జీ బిల్లు-2025 అని కూడా పిలుస్తారు. ఈ బిల్లు ఎంజీనరేగా సమగ్ర చట్టబద్ధమైన ప్రక్షాళనగా ఉంటుంది. గ్రామీణ ఉపాధిని వికసిత భారత్ 2047 దీర్ఘకాలిక సంకల్పంతో అనుసంధానిస్తూ, జవాబుదారీతనం, మౌలిక సదుపాయాల ఫలితాలు, ఆదాయ భద్రతను బలోపేతం చేస్తుంది.

భారతదేశంలో గ్రామీణ ఉపాధి, అభివృద్ధి విధాన నేపథ్యం
స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి భారతదేశంలోని గ్రామీణ అభివృద్ధి విధానాలు పేదరికం తగ్గింపు, వ్యవసాయ ఉత్పాదకత పెంపు, సరిపడా ఉపాధి లేని గ్రామీణ కార్మికులకు ఉపాధి కల్పనపై దృష్టి సారించాయి. వేతన ఉపాధి కార్యక్రమాలు క్రమంగా గ్రామీణ జీవనోపాధికి తోడ్పడుతూనే ప్రాథమిక మౌలిక సదుపాయాలను బలోపేతం చేసే కీలక సాధనాలుగా అభివృద్ధి చెందాయి.
భారతదేశ వేతన ఉపాధి కార్యక్రమాలు 1960లలో రూరల్ మ్యాన్‌పవర్ ప్రోగ్రామ్, 1971లో క్రాష్ స్కీమ్ ఫర్ రూరల్ ఎంప్లాయ్‌మెంట్ వంటి ప్రారంభ కార్యక్రమాలతో మొదలై పలు దశల మీదుగా సాగాయి. వీటి తర్వాత 1980, 1990లలో నేషనల్ రూరల్ ఎంప్లాయ్‌మెంట్ ప్రోగ్రామ్, రూరల్ ల్యాండ్‌లెస్ ఎంప్లాయ్‌మెంట్ గ్యారెంటీ ప్రోగ్రామ్ వంటి నిర్మాణాత్మక ప్రయత్నాలు జరిగాయి. ఇవి తర్వాత 1993లో జవహర్ రోజ్‌గార్ యోజనలో విలీనమయ్యాయి. ఇది తిరిగి 1999లో సంపూర్ణ గ్రామీణ రోజ్‌గార్ యోజనగా మారి సమన్వయాన్ని మెరుగుపరిచింది. ఎంప్లాయ్‌మెంట్ అష్యూరెన్స్ స్కీమ్, ఫుడ్ ఫర్ వర్క్ ప్రోగ్రామ్ వంటి అనుబంధ పథకాలు కాలానుగుణ నిరుద్యోగాన్ని, ఆహార భద్రతను పరిష్కరించాయి. 1977 నాటి మహారాష్ట్ర ఉపాధి హామీ చట్టం ద్వారా పని చేసే చట్టబద్ధమైన హక్కు అనే భావనతో ఒక ప్రధాన మార్పు వచ్చింది. ఈ అనుభవాలన్నీ కలిసి 2005లో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం(ఎంజీనరేగా) రూపకల్పనకు దారితీశాయి.
ఎంజీనరేగా పరిణామం, సంస్కరణల పరిమితులు
ఎంజీనరేగా అనేది నైపుణ్యాలు లేని, శారీరక శ్రమ చేయడానికి సిద్ధంగా ఉన్న గ్రామీణ కుటుంబాలకు ఏడాదికి కనీసం 100 రోజుల వేతన ఉపాధిని కల్పించడం ద్వారా జీవనోపాధి భద్రతను పెంచే లక్ష్యంతో ప్రారంభించిన ప్రతిష్టాత్మక కార్యక్రమం. ఆ తర్వాత ఏళ్లుగా అనేక పరిపాలనా, సాంకేతిక సంస్కరణలు దీని అమలును బలోపేతం చేశాయి. 2013-14, 2025-26 ఆర్థిక సంవత్సరాల మధ్య మహిళల భాగస్వామ్యం 48 శాతం నుంచి 58.15 శాతానికి పెరిగింది. ఆధార్ సీడింగ్ వేగంగా విస్తరించింది. ఎలక్ట్రానిక్ వేతన చెల్లింపులు దాదాపుగా అమలవుతున్నాయి.
పరిమిత పరిపాలనా వనరులు, సిబ్బంది ఉన్నప్పటికీ పథకం నిరంతర అమలులో క్షేత్రస్థాయి సిబ్బంది కీలకపాత్రను సైతం ఎంజీనరేగా అనుభవం ప్రధానంగా చాటిచెప్తోంది. అయితే, ఈ విజయాలతో పాటు కొన్ని లోతైన నిర్మాణాత్మక సమస్యలు కొనసాగుతున్నాయి. క్షేత్రస్థాయిలో పనులు కనిపించకపోవడం, భౌతిక పురోగతితో సరిపోలని ఖర్చులు, శ్రమతో కూడిన పనులలో యంత్రాల వినియోగం, డిజిటల్ హాజరు వ్యవస్థలను పక్కదారి పట్టించడం వంటి లోపాలు అనేక రాష్ట్రాల్లో వెలుగుచూశాయి. కాలక్రమేణా నిధుల దుర్వినియోగం పెరిగింది. కరోనా మహమ్మారి అనంతర కాలంలో అతి తక్కువ శాతం కుటుంబాలు మాత్రమే పూర్తి వంద రోజుల ఉపాధిని పొందగలిగాయి. ఈ పరిణామాలు ఎంజీనరేగా యావత్తు నిర్మాణం దాని పరిమితులకు చేరిపోయిందని సూచిస్తున్నాయి.
వికసిత భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవిక మిషన్ గ్రామీణ్ బిల్లు ఈ అనుభవాల ఆధారంగా సమగ్ర శాసన సంస్కరణను చేపట్టింది. ఇది పరిపాలనా వ్యయ పరిమితిని 6 శాతం నుంచి 9 శాతానికి పెంచడం ద్వారా సిబ్బంది నియామకం, వేతనాలు, శిక్షణ, సాంకేతిక సామర్థ్యానికి మెరుగైన మద్దతును అందిస్తుంది. ఈ మార్పు కార్యక్రమ నిర్వహణలో ఆచరణాత్మక, ప్రజా-కేంద్రీకృత విధానాన్ని ప్రతిబింబిస్తోంది. బలమైన పరిపాలనా సామర్థ్యం ప్రణాళిక, అమలు, సేవలు అందించడాన్ని మెరుగుపరుస్తుంది. జవాబుదారీతనాన్ని పెంచుతుంది. గ్రామస్థాయిలో కొత్త వ్యవస్థ లక్ష్యాలు సాధించేందుకు దోహదపడుతుంది.
కొత్త చట్టబద్ధమైన వ్యవస్థకు హేతుబద్ధత
2005లో ఎంజీనరేగా రూపొందించబడినప్పటి నుంచి గ్రామీణ భారతదేశం రూపాంతరం చెందింది. పేదరిక స్థాయిలు 2011-12లో 27.1 శాతం నుంచి 2022-23 నాటికి 5.3 శాతానికి తగ్గాయి. గ్రామీణ జీవనోపాధి మరింత వైవిధ్యభరితంగా, డిజిటల్‌గా మారినందున ఎంజీనరేగా పాత నమూనా ప్రస్తుత గ్రామీణ పరిస్థితులకు పూర్తిస్థాయిలో సరిపోవడం లేదు.
గ్రామీణ ఉపాధి హామీని ఆధునీకరించడం, జవాబుదారీతనాన్ని బలోపేతం చేయడం, దీర్ఘకాలిక మౌలిక సదుపాయాలు, వాతావరణ లక్ష్యాలకు అనుగుణంగా ఉపాధి సృష్టిని మార్చడం ద్వారా వికసిత భారత్ - జీ రామ్ జీ బిల్లు-2025 ఈ సందర్భానికి స్పందనగా నిలుస్తోంది.

వికసిత భారత్ - జీ రామ్ జీ బిల్లు-2025 ముఖ్య లక్షణాలు
ఈ బిల్లు నైపుణ్యం లేని, శారీరక శ్రమ చేయడానికి స్వచ్ఛందంగా ముందుకు వచ్చే వయోజన సభ్యులు కలిగిన ప్రతి గ్రామీణ కుటుంబానికి ప్రతి ఆర్థిక సంవత్సరంలో 125 రోజుల వేతన ఉపాధికి హామీ ఇస్తుంది. ఇది మునుపటి 100 రోజుల హామీకి మించి ఆదాయ భద్రతకు దోహదపడుతుంది. విత్తనాలు వేసే, కోత కోసే కీలక సమయాల్లో వ్యవసాయ కూలీల లభ్యతను నిర్ధారించడానికి ఏడాదిలో మొత్తం 60 రోజుల పని లేని కాలం ఉంటుంది. మిగిలిన 305 రోజులలో కార్మికులు తమకు కేటాయించిన 125 రోజుల ఉపాధిని పొందేలా చూడటం ద్వారా రైతులు, కార్మికులు ఇద్దరూ ప్రయోజనం పొందుతారు. రోజువారీ వేతనాల చెల్లింపు వారానికోసారి లేదా ఏ సందర్భంలోనైనా పని చేసిన తేదీ నుంచి పదిహేను రోజులకు మించకుండా చేయాలి. ఉపాధి కల్పన ఈ కింది నాలుగు ప్రాధాన్యత రంగాల ద్వారా మౌలిక సదుపాయాల అభివృద్ధితో అనుసంధానం చేయడమైంది:
- నీటి సంబంధిత పనుల ద్వారా జల భద్రత
- ప్రధాన గ్రామీణ మౌలిక సదుపాయాలు
- జీవనోపాధికి సంబంధించిన మౌలిక సదుపాయాలు
- తీవ్ర వాతావరణ పరిస్థితుల ప్రభావాన్ని తగ్గించడానికి ప్రత్యేక పనులు

సృష్టించిన అన్ని ఆస్తులు వికసిత భారత్ నేషనల్ రూరల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ స్టాక్‌లో చేరుతాయి. ఇది ఏకీకృత, సమన్వయ జాతీయ అభివృద్ధి వ్యూహానికి ఉపయోగపడుతుంది. వికసిత గ్రామ పంచాయతీ ప్రణాళికల ద్వారా ప్రణాళికా రచన వికేంద్రీకరణ జరిగింది. ఇవి స్థానికంగా తయారై, పీఎం గతిశక్తి వంటి జాతీయ వ్యవస్థలతో ప్రాదేశికంగా అనుసంధానమై ఉంటాయి.
ఎంజీనరేగా, వికసిత భారత్ - జీ రామ్ జీ బిల్లు-2025 మధ్య తేడా
ఎంజీనరేగాకు ప్రధాన ఆధునీకరణగా ఈ బిల్లు ఉంటుంది. ఉపాధి, పారదర్శకత, ప్రణాళిక, జవాబుదారీతనాన్ని మెరుగుపరుస్తూ నిర్మాణపరమైన లోపాలను సరిదిద్దుతుంది.
నిధుల కేటాయింపు
కేంద్ర రంగ పథకం నుంచి కేంద్ర ప్రాయోజిత వ్యవస్థలోకి మార్పు గ్రామీణ ఉపాధి, ఆస్తుల సృష్టి సహజసిద్ధమైన స్థానిక స్వభావాన్ని ప్రతిబింబిస్తుంది. ఈ కొత్త నిర్మాణం ప్రకారం రాష్ట్రాలు ఒక ప్రామాణిక కేటాయింపు విధానం ద్వారా వ్యయం, బాధ్యత రెండింటినీ పంచుకుంటాయి. ఇది సమర్థవంతమైన అమలుకు బలమైన ప్రోత్సాహకాలను సృష్టించడంతో పాటు దుర్వినియోగాన్ని నివారిస్తుంది. గ్రామ పంచాయతీ ప్రణాళికల ద్వారా స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ప్రణాళికల రూపకల్పన జరుగుతుంది. అదే సమయంలో కేంద్రం ప్రమాణాలను నిర్దేశిస్తుంది. రాష్ట్రాలు జవాబుదారీతనంతో వాటిని అమలు చేస్తాయి. దీని ఫలితంగా సమర్థతను మెరుగుపరిచే, ఫలితాలను బలోపేతం చేసే సహకార భాగస్వామ్యం ఏర్పడుతుంది.

వేతనం, వస్తు, పరిపాలనా విభాగాలపై మొత్తం అంచనా వార్షిక నిధుల అవసరం రాష్ట్ర వాటాతో కలిపి రూ.1,51,282 కోట్లు. ఇందులో కేంద్ర వాటా అంచనా రూ.95,692.31 కోట్లు. ఈ మార్పు రాష్ట్రాలపై అనవసర ఆర్థిక భారాన్ని మోపదు. నిధుల నిర్మాణం రాష్ట్ర సామర్థ్యానికి అనుగుణంగా జరిగింది. కేంద్రం, రాష్ట్రాల మధ్య సాధారణ వ్యయ భాగస్వామ్యం 60:40 నిష్పత్తిలో ఉంటుంది. ఈశాన్య, హిమాలయ రాష్ట్రాలకు 90:10 మద్దతు ఉంటుంది. శాసనసభలు లేని కేంద్రపాలిత ప్రాంతాలకు 100 శాతం కేంద్ర నిధులు అందుతాయి. రాష్ట్రాలు ఇప్పటికే మునుపటి విధానం కింద మెటీరియల్, పరిపాలనా ఖర్చులలో కొంత వాటాను భరిస్తున్నాయి. అంచనా వేయదగిన ప్రామాణీకరించిన కేటాయింపుల వైపు వెళ్లడం వల్ల బడ్జెట్ నిర్వహణకు మరింత మద్దతు లభిస్తుంది. విపత్తుల సమయంలో రాష్ట్రాలకు అదనపు సహాయం అందించే నిబంధనలు, బలమైన పర్యవేక్షణ యంత్రాంగాలు నిధుల దుర్వినియోగం వల్ల కలిగే దీర్ఘకాలిక నష్టాలను తగ్గించడానికి, ఆర్థిక స్థిరత్వాన్ని జవాబుదారీతనంతో బలోపేతం చేయడానికి సహాయపడతాయి.

వికసిత భారత్ - జీ రామ్ జీ బిల్లు ప్రయోజనాలు

ఈ బిల్లు ఉపాధి కల్పనను ఉత్పాదక ఆస్తుల సృష్టితో అనుసంధానించడం ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తుంది. ఇది అధిక గృహ ఆదాయాలకు దోహదపడుతుంది. వ్యవసాయం, భూగర్భ జలాల పునరుద్ధరణకు మద్దతు ఇచ్చే నీటి సంబంధిత పనులకు ప్రాధాన్యత దక్కుతుంది. రోడ్లు, అనుసంధానత వంటి ప్రధాన గ్రామీణ మౌలిక సదుపాయాలలో పెట్టుబడి మార్కెట్ సౌలభ్యాన్ని మెరుగుపరుస్తుంది. అయితే నిల్వ కేంద్రాలు, మార్కెట్లు, ఉత్పత్తి ఆస్తులతో కూడిన జీవనోపాధి మౌలిక సదుపాయాలు ఆదాయ వైవిధ్యతను సాధ్యం చేస్తాయి. నీటి సంరక్షణ, వరదనీటి పారుదల, నేల పరిరక్షణపై దృష్టిసారించే పనుల ద్వారా ఆటుపోట్లను తట్టుకునేలా వాతావరణం బలోపేతం అవుతుంది. 125 రోజుల ఉపాధి హామీ గృహ ఆదాయాలను పెంచుతుంది. గ్రామ స్థాయి వినియోగాన్ని ప్రేరేపిస్తుంది. డిజిటల్ హాజరు, వేతన చెల్లింపులు, డేటా ఆధారిత ప్రణాళిక మద్దతుతో కష్టాల కారణంగా జరిగే వలసలను తగ్గించడంలో సహాయపడుతుంది.

సాగు, కోత సమయాల్లో ప్రజా పనులకు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించే విరామాల ద్వారా రైతులకు కూలీల లభ్యతకు ఇబ్బంది ఉండదు. వేతనాల ద్రవ్యోల్బణం నివారించవచ్చు. మెరుగైన సాగునీరు, నిల్వ, రవాణా సౌకర్యాలు లభిస్తాయి. కార్మికులు అధిక ఆదాయ అవకాశాలు, వికసిత గ్రామ పంచాయతీ ప్రణాళికల ద్వారా ముందస్తుగా తెలిసే పనులు, సురక్షితమైన డిజిటల్ వేతన చెల్లింపులు, తాము సృష్టించిన ఆస్తుల నుంచి నేరుగా ప్రయోజనాలు, తప్పనిసరి నిరుద్యోగ భృతి ద్వారా ప్రయోజనం పొందుతారు. పని కోరిన 15 రోజుల తర్వాత కూడా పని కల్పించని పక్షంలో రాష్ట్రాల బాధ్యతతో దినసరి నిరుద్యోగ భృతి చెల్లింపు ఉంటుంది. దీని ధరలు, నిబంధనలు చట్టం నియమాల ద్వారా నిర్ణయించడం జరుగుతుంది. ఇది కార్మికుల హక్కులను కాపాడుతూ, సకాలంలో ఉపాధిని ప్రోత్సహిస్తూ, సౌలభ్యాన్ని నిర్ధారిస్తుంది.

అమలు, పర్యవేక్షణ సంస్థలు
జాతీయ, రాష్ట్ర, జిల్లా, బ్లాక్, గ్రామ స్థాయిలలో సమన్వయ, జవాబుదారీతనం, పారదర్శక అమలును నిర్ధారించడానికి ఈ బిల్లు స్పష్టమైన సంస్థాగత నిర్మాణాన్ని ఏర్పాటు చేస్తుంది.
- కేంద్ర, రాష్ట్ర గ్రామీణ రోజ్‌గార్ గ్యారెంటీ కౌన్సిళ్లు విధాన మార్గదర్శకాలను అందిస్తాయి. అమలును సమీక్షిచడంతో పాటు జవాబుదారీతనాన్ని బలోపేతం చేస్తాయి.
- జాతీయ, రాష్ట్ర స్టీరింగ్ కమిటీలు వ్యూహాత్మక దిశానిర్దేశం చేయడంతో పాటు ఏకీకరణ, పనితీరును సమీక్షిస్తాయి.
- పంచాయతీ రాజ్ సంస్థలు ప్రణాళిక, అమలులో ముందుంటాయి. గ్రామ పంచాయతీలు ఖర్చు పరంగా కనీసం సగం పనులను అమలు చేస్తాయి.
- జిల్లా కార్యక్రమ సమన్వయకర్తలు, అధికారులు ప్రణాళిక, నిబంధనల పాటింపు, చెల్లింపులు, సామాజిక తనిఖీలను నిర్వహిస్తారు.
- గ్రామ సభలు సామాజిక తనిఖీలు నిర్వహించడంలో, అన్ని రికార్డులను అందుబాటులో ఉంచడం ద్వారా పారదర్శకతను నిర్ధారించడంలో బలమైన పాత్ర పోషిస్తాయి.
పారదర్శకత, జవాబుదారీతనం, సామాజిక రక్షణ
నిబంధనల పాటింపును నిర్ధారించడానికి, ప్రభుత్వ నిధులను రక్షించడానికి ఈ బిల్లు కేంద్ర ప్రభుత్వానికి స్పష్టమైన అమలు అధికారాలను కల్పిస్తుంది. అమలుకు సంబంధించిన ఫిర్యాదులపై దర్యాప్తు చేయడానికి, తీవ్రమైన అక్రమాలు గుర్తించిన చోట నిధుల విడుదలను నిలిపివేయడానికి, లోపాలను సరిదిద్దడానికి, నివారణ చర్యలను నిర్దేశించడానికి ఇది కేంద్రానికి అధికారం ఇస్తుంది. ఈ నిబంధనలు వ్యవస్థ అంతటా జవాబుదారీతనాన్ని బలోపేతం చేస్తాయి. ఆర్థిక క్రమశిక్షణను నిర్వహిస్తాయి. దుర్వినియోగాన్ని నిరోధించడానికి సకాలంలో జోక్యం చేసుకోవడానికి వీలు కల్పిస్తాయి.

ఈ బిల్లు అమలులోని ప్రతి దశలో సమగ్ర పారదర్శకత విధానాన్ని ఏర్పాటు చేస్తుంది. అక్రమాలను ముందే గుర్తించడానికి కృత్రిమ మేధ(ఏఐ), బయోమెట్రిక్ ప్రామాణీకరణను ఉపయోగించడానికి ఇది వీలు కల్పిస్తుంది. దీనికి నిరంతర మార్గదర్శకత్వం, సమన్వయాన్ని అందించే కేంద్ర, రాష్ట్ర స్టీరింగ్ కమిటీలు మద్దతు ఇస్తాయి. స్పష్టంగా నిర్వచించిన నాలుగు గ్రామీణ అభివృద్ధి రంగాల ద్వారా కేంద్రీకృత విధానం ఫలితాలను నిశితంగా గుర్తించడానికి అనుమతిస్తుంది. పనుల పర్యవేక్షణలో పంచాయతీలకు మెరుగైన పాత్ర కేటాయించచింది. దీనికి తోడు నిరంతరం జీపీఎస్, మొబైల్ ఆధారిత పర్యవేక్షణ ఉంటుంది. నిరంతర ఎంఐఎస్ డ్యాష్‌బోర్డ్‌లు, వారానికి ఒకసారి బహిరంగంగా వెల్లడించడం ప్రజలకు స్పష్టతను ఇస్తాయి. కనీసం ప్రతి ఆరు నెలలకు ఒకసారి తప్పనిసరిగా సామాజిక తనిఖీలు చేపట్టడం సమాజ భాగస్వామ్యాన్ని, నమ్మకాన్ని బలోపేతం చేస్తాయి.
ముగింపు
వికసిత భారత్ - గ్యారెంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవిక మిషన్ (గ్రామీణ) బిల్లు-2025 భారతదేశ గ్రామీణ ఉపాధి విధానంలో ఒక నిర్ణయాత్మక మార్పు. ఎంజీనరేగా కాలక్రమేణా భాగస్వామ్యం, డిజిటలైజేషన్, పారదర్శకతలో గణనీయమైన విజయాలను సాధించినప్పటికీ, నిరంతర నిర్మాణపరమైన బలహీనతలు దాని ప్రభావాన్ని పరిమితం చేశాయి. కొత్త బిల్లు గత మెరుగుదలలపై నిర్మితమవడమే కాకుండా ఆధునిక, జవాబుదారీ, మౌలిక సదుపాయాల ఆధారిత విధానం ద్వారా వాటి లోపాలను పరిష్కరిస్తుంది. ఉపాధి హామీని విస్తరించడం, పనులను జాతీయ అభివృద్ధి ప్రాధాన్యతలతో అనుసంధానించడం, బలమైన డిజిటల్ పాలనను పొందుపరచడం ద్వారా ఈ బిల్లు గ్రామీణ ఉపాధిని స్థిరమైన వృద్ధి, ఆటుపోట్లకు తట్టుకునేలా జీవనోపాధి కోసం వ్యూహాత్మక సాధనంగా నిలుస్తుంది. ఇది వికసిత భారత్ 2047 సంకల్పానికి అనుగుణంగా ఉంటుంది.
References
Ministry of Rural Development
https://mnregaweb4.nic.in/netnrega/SocialAuditFindings/SAU_FMRecoveryReport.aspx?lflag=eng&fin_year=2024-2025&source=national&labels=labels&rep_type=SoA&Digest=3uRMVt6308BGCW2QZYttXQ
Lok Sabha Bill
https://sansad.in/getFile/BillsTexts/LSBillTexts/Asintroduced/As intro1216202512439PM.pdf?source=legislation
News on Air
https://www.newsonair.gov.in/indias-extreme-poverty-falls-to-5-3-in-2022-2023-says-world-bank/
PIB Press Releases
https://www.pib.gov.in/PressNoteDetails.aspx?id=155090&NoteId=155090&ModuleId=3®=3&lang=2
Click here to see pdf
***
(Backgrounder ID: 156588)
आगंतुक पटल : 52
Provide suggestions / comments