Security
రెడ్ కారిడార్ నుంచి నక్సల్ రహిత భారత్ వరకు: నిర్ణయాత్మక విజయాల దశాబ్దం(2014-2025)
Posted On:
13 DEC 2025 1:40PM
కీలకాంశాలు
- నక్సల్ ప్రభావిత జిల్లాల సంఖ్య 2014లో 126 ఉండగా 2025 నాటికి కేవలం 11కి తగ్గింది. అత్యంత ప్రభావిత జిల్లాల సంఖ్య 36 నుండి 3కి పడిపోవడం రెడ్ కారిడార్ దాదాపుగా కుప్పకూలిపోయిందని సూచిస్తోంది.
- 12,000 కి.మీ.కు పైగా రోడ్ల నిర్మాణం, 586 ఫోర్టిఫైడ్ పోలీసు స్టేషన్ల ఏర్పాటు, 361 కొత్త శిబిరాల ప్రారంభంతో పాటు 8,500కు పైగా మొబైల్ టవర్లు అందుబాటులోకి వచ్చాయి. రూ.92 కోట్ల విలువైన ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు. ఈ చర్యల ద్వారా నక్సలైట్ల భౌగోళిక, ఆర్థిక ఆధిపతం ప్రధాన ప్రాంతాల్లో అంతమైంది.
- 2025లోనే 317 మంది నక్సలైట్‌లను నిర్మూలించారు(అగ్రశ్రేణి నాయకులు కూడా ఇందులో ఉన్నారు). 800 మందికి పైగా అరెస్టు అయ్యారు. దాదాపు 2,000 మంది లొంగిపోయారు. ఇది గతంలో ఎన్నడూ లేని విధంగా నక్సలైట్ల బలాన్ని తగ్గించింది. మార్చి 2026 నాటికి నక్సల్ రహిత భారతదేశం సాధ్యమవుతుందని ఇది రుజువు చేస్తోంది.
పరిచయం
వామపక్ష తీవ్రవాదానికి వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వ నిర్ణయాత్మక వ్యూహాన్ని ప్రతిబింబించేలా దేశవ్యాప్తంగా నక్సల్ ప్రభావిత ప్రాంతాలను తగ్గించడంలో గణనీయ పురోగతి కనిపించింది. ఫలితంగా 2014లో 36గా ఉన్న అత్యంత నక్సల్ ప్రభావిత జిల్లాలు 2025 నాటికి 3కి, 126గా ఉన్న వామపక్ష తీవ్రవాద ప్రభావిత జిల్లాలు 11కి తగ్గాయి. గత ప్రభుత్వాల వికేంద్రీకృత విధానానికి భిన్నంగా ప్రభుత్వం నక్సలిజానికి వ్యతిరేకంగా సమగ్రమైన, బహుముఖమైన, నిర్ణయాత్మకమైన వ్యూహాన్ని అనుసరిస్తోంది. చర్చలు, భద్రత, సమన్వయం అనే స్పష్టమైన సూత్రాల ఆధారంగా, ప్రభుత్వం మార్చి 2026 నాటికి అన్ని నక్సల్ ప్రభావిత ప్రాంతాలను నక్సల్ రహితంగా చేయాలనే లక్ష్యంతో పనిచేస్తోంది.
గత పదేళ్లలో నక్సల్ హింసలో గణనీయమైన తగ్గుదల
దేశంలో నక్సలిజం “రెడ్ కారిడార్”గా వ్యాపించి ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, ఒడిశా, మహారాష్ట్ర, కేరళ, పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలోని కొన్ని ప్రాంతాలను ప్రభావితం చేసింది. భారతదేశ సమగ్రమైన నక్సల్ వ్యతిరేక వ్యూహం ఇప్పుడు ఈ హింసను బాగా తగ్గించడంతో పాటు ఈ ఉద్యమాన్ని బలహీనపరిచింది. జిల్లాలను తిరిగి ప్రధాన స్రవంతిలోకి తీసుకువచ్చింది.
2004–2014 నుంచి 2014–2024 వరకు
1. హింసాత్మక సంఘటనలు 16,463 నుంచి 7,744కు 53% తగ్గాయి.

2. భద్రతా బలగాల మరణాలు 73%, అంటే 1,851 నుండి 509కు తగ్గాయి.

3. పౌరుల మరణాల సంఖ్య 70%, 4,766 నుండి 1,495కు పడిపోయింది.

2024–2025లో సాధించిన కార్యాచరణ విజయాలు

2025లో ఇప్పటివరకు 317 నక్సలైట్‌లను నిర్మూలించడమైనది. 862 మంది అరెస్టు అయ్యారు. 1,973 మంది లొంగిపోయారు. 2024లో 290 మందిని నిర్మూలించడమైనది. 1,090 మంది అరెస్టు అయ్యారు. 881 మంది లొంగిపోయారు. మొత్తం 28 మంది అగ్రస్థాయి నక్సల్ నాయకులను నిర్మూలించడమైనది. ఇందులో 2024లో ఒక సెంట్రల్ కమిటీ సభ్యుడు, 2025లో ఐదుగురు ఉన్నారు. ప్రధాన విజయాలలో ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్‌లో 27 మంది నక్సలైట్‌లను నిర్మూలించడం, మే 23, 2025న బిజాపూర్‌లో 24 మంది లొంగిపోవడం, 2025 అక్టోబర్‌లో ఛత్తీస్‌గఢ్(197), మహారాష్ట్ర(61)లో మొత్తం 258 మంది లొంగిపోవడం ఉన్నాయి. వీరిలో 10 మంది సీనియర్ నక్సలైట్లు ఉన్నారు.
భద్రతాపరమైన విజయాలు
2014లో నక్సలిజంలో అత్యంత ప్రభావిత జిల్లాలుగా 36 ఉండగా, 2025 నాటికి 3కి తగ్గాయి. 2014లో 126గా ఉన్న నక్సల్ ప్రభావిత జిల్లాల సంఖ్య 2025 నాటికి 11కి తగ్గింది. 2014 వరకు 66 మాత్రమే ఉన్న ఫోర్టిఫైడ్ పోలీస్ స్టేషన్ల సంఖ్య గత పదేళ్లలో 586కి పెరిగింది. 2013లో 76 జిల్లాల్లోని 330 పోలీస్ స్టేషన్ల పరిధిలో నక్సల్ సంబంధిత సంఘటనలు నమోదయ్యాయి. జూన్ 2025 నాటికి ఇవి 22 జిల్లాల్లోని 52 పోలీస్ స్టేషన్ల పరిధికి తగ్గిపోయాయి. అదనంగా, గత ఆరేళ్లలో 361 కొత్త భద్రతా శిబిరాలను ఏర్పాటు చేయగా, కార్యాచరణ పరిధిని విస్తృతం చేయడానికి 68 రాత్రివేళ ల్యాండింగ్‌కు వీలయ్యే హెలిప్యాడ్‌ల నిర్మాణం జరిగింది.
నక్సల్ నిధుల అడ్డగింత
కేంద్ర ప్రభుత్వం ఎన్ఐఏలో ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయడం ద్వారా నక్సల్ నిధులను సమర్థవంతంగా అడ్డుకుంది. ఈ విభాగం రూ.40 కోట్ల రూపాయలకు పైగా విలువైన ఆస్తులను స్వాధీనం చేసుకుంది. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా రూ.40 కోట్ల రూపాయలకు పైగా ఆస్తులను స్వాధీనం చేసుకున్నాయి. అంతేకాకుండా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ మరో రూ.12 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను అటాచ్ జత చేసింది. ఈ సమకాలీన చర్యల వల్ల అర్బన్ నక్సల్స్‌కు తీవ్ర నైతిక, మానసిక నష్టం వాటిల్లడమే కాకుండా వారి సమాచార యుద్ధ వ్యవస్థలపై నియంత్రణ మరింత కఠినతరమైంది.

రాష్ట్రాల సామర్థ్యాలను పెంచుతున్న కేంద్రం
కీలక భద్రతా, మౌలిక సదుపాయాల పథకాల ద్వారా ఆర్థిక సహాయం పెంచడంతో పాటు వామపక్ష తీవ్రవాద ప్రభావిత రాష్ట్రాల సామర్థ్యాన్ని కేంద్ర ప్రభుత్వం బలోపేతం చేసింది.
- గత 11 ఏళ్లలో వామపక్ష తీవ్రవాద ప్రభావిత రాష్ట్రాలకు భద్రత సంబంధిత వ్యయాల(ఎస్ఆర్ఈ) పథకం కింద కేంద్ర ప్రభుత్వం రూ.3,331 కోట్లు విడుదల చేసింది. ఇది గత పదేళ్లతో పోలిస్తే నిధుల విడుదలలో 155% పెరుగుదలను సూచిస్తోంది.
- ప్రత్యేక మౌలిక సదుపాయాల పథకం(ఎస్ఐఎస్) కింద రాష్ట్ర ప్రత్యేక దళాలను(ఎస్ఎఫ్), ప్రత్యేక నిఘా విభాగాలను(ఎస్ఐబీ) బలోపేతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం రూ.371 కోట్లు, అలాగే మొదటి దశలో 246 ఫోర్టిఫైడ్ పోలీసు స్టేషన్ల కోసం రూ.620 కోట్లు ఆమోదించింది. ఈ పథకాన్ని 2026 వరకు పొడిగించింది. పొడిగించిన కాలంలో ఎస్ఎఫ్, ఎస్ఐబీ, జిల్లా పోలీసుల మరింత బలోపేతానికి రూ.610 కోట్లు, 56 అదనపు ఎఫ్‌పీఎస్‌ల కోసం రూ.140 కోట్లు కేటాయించింది.
- గత ఎనిమిదేళ్లలో(2017–18 నుంచి) రూ.1,757 కోట్ల విలువైన ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. ఇందులో ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం రూ.445 కోట్లు విడుదల చేసింది.
- 2014 నుంచి ఇప్పటివరకు మొత్తం 586 ఫోర్టిఫైడ్ పోలీసు స్టేషన్ల నిర్మాణం జరిగింది.
- ప్రత్యేక కేంద్ర సహాయం (ఎస్‌సీఏ) పథకం కింద రూ.3,817.59 కోట్లు అందించింది.
- కేంద్ర సంస్థలకు సహాయం పథకం(ఏసీఏఎల్‌డబ్ల్యూఈఎంఎస్) కింద గత పదేళ్లలో శిబిరాల మౌలిక సదుపాయాల కోసం రూ.125.53 కోట్లు, ఆసుపత్రుల ఆధునీకరణ, నూతన నిర్మాణాల కోసం రూ.12.56 కోట్లు విడుదల చేసింది.
మౌలిక సదుపాయాల అభివృద్ధి
వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాలలో రహదారుల నెట్‌వర్క్‌ను విస్తరించడం, మొబైల్ కనెక్టివిటీని మెరుగుపరచడం ద్వారా కేంద్ర ప్రభుత్వం మౌలిక సదుపాయాలను గణనీయంగా బలోపేతం చేసింది. దీని ద్వారా ప్రాంతాల మధ్య రాకపోకలు, భద్రతా చర్యల స్పందన, సామాజిక-ఆర్థిక అభివృద్ధిని ప్రోత్సహించవచ్చు.
ఎల్‌డబ్ల్యూఈ ప్రాంతాల్లో రోడ్డు వ్యవస్థ:
మే 2014 నుంచి ఆగస్టు 2025 వరకు వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాలలో రూ.20,815 కోట్ల ఖర్చుతో మొత్తం 17,589 కిలోమీటర్ల రోడ్డు ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. 12,000 కిలోమీటర్ల మేర రోడ్లను నిర్మించింది. దీని ద్వారా గతంలో చేరుకోలేని ప్రాంతాలకు ఇప్పుడు అన్ని కాలాల్లోనూ రాకపోకలు సాగేలా అనుసంధానత ఏర్పడింది.
మొబైల్ నెట్‌వర్క్ విస్తరణ:
మొదటి దశలో రూ.4,080 కోట్ల ఖర్చుతో 2,343(2జీ) మొబైల్ టవర్లను ఏర్పాటు చేసింది. రెండో దశలో రూ.2,210 కోట్ల పెట్టుబడితో 2,542 టవర్లను ఆమోదించింది. వాటిలో 1,154 ఇప్పటికే ఏర్పాటై, పనిచేస్తున్నాయి. అదనంగా, ఆశావాహ జిల్లాలు, 4జీ శాచురేషన్ పథకాల కింద 8,527(4జీ) టవర్లను ఆమోదించగా, వాటిలో 5,357 టవర్లు ప్రస్తుతం పనిచేస్తున్నాయి. దీని ద్వారా ప్రధాన నక్సల్ ప్రాంతాల్లో సమాచార వ్యవస్థ, నిఘా పరిధి బాగా మెరుగుపడింది.
ప్రభావిత ప్రాంతాల్లో ఆర్థిక చేరిక
కేంద్ర ప్రభుత్వం నక్సల్ ప్రభావిత జిల్లాల్లో 1,804 బ్యాంకు శాఖలు, 1,321 ఏటీఎంలు , 37,850 బ్యాంకింగ్ కరస్పాండెంట్ల ఏర్పాటుతో లోతైన ఆర్థిక చేరికకు బాటలు వేసింది. అంతేకాకుండా, 90 జిల్లాల్లో ప్రతి 5 కిలోమీటర్ల పరిధిలో 5,899 పోస్టల్ కార్యాలయాలను ప్రారంభించింది. తద్వారా గతంలో నక్సల్స్ ప్రభావం ఉన్న మారుమూల ప్రాంతాలకు బ్యాంకింగ్, పోస్టల్, నగదు పంపే సేవలను నేరుగా అందుబాటులోకి తెచ్చింది.
విద్యా సాధికారత(48 జిల్లాలలో నైపుణ్యాభివృద్ధి)
కేంద్ర ప్రభుత్వం 48 వామపక్ష తీవ్రవాద ప్రభావిత జిల్లాలలో రూ.495 కోట్ల పెట్టుబడితో 48 పారిశ్రామిక శిక్షణ సంస్థలను(ఐటీఐలు) మంజూరు చేయడంతో పాటు 61 నైపుణ్యాభివృద్ధి కేంద్రాలను(ఎస్డీసీలు) ఆమోదించింది. వీటి ద్వారా నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించింది. వీటిలో 46 ఐటీఐలు, 49 ఎస్డీసీలు ఇప్పటికే పనిచేస్తూ స్థానిక యువతకు వృత్తి విద్యా శిక్షణ, ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాయి. దీని ద్వారా నక్సల్ రిక్రూట్‌మెంట్‌ను తగ్గించి, మారుమూల ప్రాంతాల ప్రజలను ప్రధాన స్రవంతిలో అనుసంధానం చేస్తున్నాయి.
ఎన్ఐఏలో ఒక ప్రత్యేక విభాగం
జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) నక్సల్ వ్యతిరేక విభాగాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేసింది. ఈ విభాగం 108 కేసులను పరిశోధించి, 87 కేసులలో అభియోగ పత్రాలు దాఖలు చేసింది. వేగవంతమైన విచారణల ద్వారా మావోయిస్టుల సంస్థాగత నిర్మాణం గణనీయంగా బలహీనపడింది. అదే సమయంలో 2018లో కేంద్ర ప్రభుత్వం బస్తరీయా బటాలియన్‌ను ఏర్పాటు చేసింది. ఇందులో ఛత్తీస్‌గఢ్‌లోని బిజాపూర్, సుక్మా, దంతెవాడలోని అత్యంత ప్రభావిత ప్రాంతాల నుంచి 400 మంది స్థానిక యువకులతో సహా మొత్తం 1,143 మంది నియమితులయ్యారు. ఈ చర్య మావోయిస్టుల పూర్వపు బలమైన స్థావరాలను తిరుగుబాటుకు వ్యతిరేకంగా పోరాడుతున్న శిక్షణ పొందిన భద్రతా సిబ్బందికి మూలాలుగా మార్చింది.
మూడు దశాబ్దాల తర్వాత నక్సల్స్ నుంచి విముక్తి పొందిన ప్రాంతాలు(విజయగాథలు)
ఆక్టోపస్, డబుల్ బుల్, చక్‌బంధ వంటి నిర్ణయాత్మక చర్యల ద్వారా భద్రతా దళాలు మూడు దశాబ్దాలుగా మావోయిస్టుల ఆధీనంలో ఉన్న బుద్ధ పహాడ్, పరాస్‌నాథ్, బరమాసియా, చక్రబంధ(బీహార్) సహా పలు ప్రాంతాలకు విముక్తి కలిపించాయి. మారుమూల అడవుల్లోనూ శాశ్వత శిబిరాలను ఏర్పాటు చేసి, గతంలో వెళ్లడం కష్టంగా ఉన్న అబుజ్‌మడ్ ప్రాంతానికి చేరుకున్నాయి. ఈ నిరంతర దాడుల కారణంగా పీఎల్‌జీఏ బెటాలియన్ బిజాపూర్-సుక్మాలోని ప్రధాన స్థావరాన్ని విడిచిపెట్టాల్సి వచ్చింది. దీంతో 2024 నాటి నక్సలైట్ల వ్యూహాత్మక ప్రతిదాడి ప్రచారం (టీసీఓసీ) పూర్తిగా విఫలమైంది. వారి వ్యూహాత్మక బలం, కార్యాచరణ ఆధిపత్యం పతనమయ్యాయి.
లొంగుబాటు, పునరావాస కార్యక్రమం
ఆకర్షణీయమైన ప్రోత్సాహకాలు, కచ్చితమైన జీవనోపాధి కల్పించడంతో కూడిన కేంద్ర ప్రభుత్వ లొంగుబాటు-పునరావాస విధానం నక్సల్ కాడర్ సంఖ్యను తగ్గించింది. ఉన్నత స్థాయి వామనక్ష తీవ్రవాద కాడర్‌కు రూ.5 లక్షలు, మధ్య/దిగువ స్థాయి కాడర్‌కు రూ.2.5 లక్షలు, లొంగిపోయిన వారందరికీ 36 నెలల వృత్తి శిక్షణ కోసం నెలకు రూ.10,000 స్టైపెండ్ లభిస్తుంది.
ముగింపు
గత 11 ఏళ్లుగా సమన్వయం, బహుముఖ వ్యూహంతో కూడిన కేంద్ర ప్రభుత్వ క్రమబద్ధమైన భద్రతా చర్యలు, అద్భుతమైన మౌలిక సదుపాయాల అభివృద్ధి, నిధులు అందకుండా చేయడం, వేగవంతమైన అభివృద్ధి కార్యక్రమాలు, ఆకర్షణీయమైన లొంగుబాటు విధానం వంటి వాటి కలయికతో 2014లో 126 జిల్లాలలో ఉన్న వామపక్ష తీవ్రవాదాన్ని 2025 నాటికి కేవలం 11 జిల్లాలకు కుదించింది. వాటిలో మూడు మాత్రమే “అత్యంత ప్రభావిత” జిల్లాలుగా మిగిలాయి. హింస 70% కంటే ఎక్కువ తగ్గింది. పౌరులు, భద్రతా బలగాల ప్రాణనష్టం గణనీయంగా పడిపోయింది. అగ్రస్థాయి మావోయిస్టు నాయకత్వం క్రమంగా నిర్మూలించబడింది. వేలాది మంది కార్యకర్తలు సాయుధ పోరాటాన్ని వదిలి సాధారణ జీవితాన్ని ఎంచుకున్నారు. చిన్నపాటి ప్రతిఘటన ఇంకా కొనసాగుతోంది. పూర్తిగా నిర్మూలించడానికి 2026 మార్చి 31వ తేదీన నిర్ణయించిన గడువు వరకు నిరంతర అప్రమత్తత అవసరం. అయినప్పటికీ, ఈ మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. నక్సల్ తిరుగుబాటు సైద్ధాంతిక, భౌగోళిక వెన్నెముక విరిగిపోయింది. ఇది చాలాకాలంగా శాంతి, అభివృద్ధికి దూరంగా ఉన్న ప్రాంతాలలో శాశ్వతమైన శాంతి, అభివృద్ధికి మార్గం సుగమం చేసింది.
PIB
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2179459®=3&lang=2
https://www.pib.gov.in/PressReleseDetailm.aspx?PRID=2130295®=3&lang=2
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=1991936®=3&lang=2
Jharkhand Police
https://jhpolice.gov.in/news/police-reaching-out-villagers-under-operation-goodwill-8090-1351598017
Ministry of Home Affairs
Click here to see PDF
***
(Explainer ID: 156526)
आगंतुक पटल : 90
Provide suggestions / comments