Economy
బ్యాంకింగ్ చట్టాల(సవరణ) చట్టం- 2025 భారతదేశంలో కొత్త తరం బ్యాంకింగ్ దిశగా అడుగు
Posted On:
04 DEC 2025 11:40AM
కీలకాంశాలు
- డిపాజిటర్లు వారి ప్రాధాన్యతలకు అనుగుణంగా డిపాజిట్లు, లాకర్ల కోసం నామినీలను నియమించుకునే వెసులుబాటు.
- ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో పాలన ప్రమాణాలను బలోపేతం చేయడం, ఆడిట్ నాణ్యతను మెరుగుపరచడం.
- క్లెయిమ్ చేయని నిధులు ఇన్వెస్టర్ ఎడ్యుకేషన్ ఆండ్ ప్రొటెక్షన్ ఫండ్‌కు బదిలీ.
- అధిక పారదర్శకత కోసం ఆధునిక పరిమితులు, రిపోర్టింగ్ ప్రమాణాలతో నియంత్రణ నిబంధనల ఆధునికీకరణ.
పరిచయం
ఒక దేశ ఆర్థిక విజయం ఎక్కువగా దాని ఆర్థిక వ్యవస్థపై ఆధారపడి ఉంటుంది. సాధారణంగా, బ్యాంకింగ్ సంస్థలు డిపాజిట్లు తీసుకోవడం, రుణాలు ఇవ్వడం, లావాదేవీలకు సహాయపడటంతో పాటు క్రెడిట్ కార్డులు, పొదుపు ఖాతాలు, రుణాలు వంటి వివిధ ఆర్థిక వస్తువులను ప్రజలకు అందించడం వంటి అనేక రకాల సేవలను అందిస్తాయి. భారతదేశంలోని బ్యాంకింగ్ వ్యవస్థ పెట్టుబడులను, వ్యక్తిగత ఆర్థిక అవసరాలను సులభతరం చేస్తుంది. తద్వారా దేశ ఆర్థికాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుంది.
భారతదేశ బ్యాంకు రంగం గణనీయమైన మార్పును చూసింది. కాగితం ఆధారిత, బ్రాంచ్-కేంద్రీకృత వ్యవస్థ నుంచి కీలకమైన సాంకేతిక, విధానపరమైన మైలురాళ్ల ద్వారా నడిచే డిజిటల్ వ్యవస్థగా అభివృద్ధి చెందింది. ఇది సాంప్రదాయ బ్యాంకింగ్, తొలి దశ కంప్యూటరైజేషన్ నుంచి బయోమెట్రిక్ గుర్తింపు వ్యవస్థ అయిన ఆధార్ వినియోగం వరకు రూపాంతరం చెందింది. బ్యాంకింగ్ సేవలు అందుకోని కోట్లాది మందిని ప్రధానమంత్రి జన్ ధన్ యోజన ద్వారా అధికారిక ఆర్థిక వ్యవస్థలోకి తీసుకువచ్చింది. పట్టణ, గ్రామీణ జనాభా మధ్య అంతరాన్ని తగ్గించడం ద్వారా, లక్షలాది మందికి అధికారిక బ్యాంకింగ్ సేవలను అందించడం ద్వారా ఆర్థిక సమ్మిళితత్వాన్ని ప్రోత్సహించడంలో ఇటువంటి ప్రభుత్వ కార్యక్రమాలు కీలక పాత్ర పోషించాయి.
బ్యాంకింగ్ చట్టాల(సవరణ) చట్టం-2025 అనేది బ్యాంకింగ్ రంగంలో పాలనా ప్రమాణాలను బలోపేతం చేయడానికి ఒక ముందడుగు. ఇది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు బ్యాంకులు సమర్పించే నివేదికలలో ఏకరూపతను, ప్రభుత్వ రంగ బ్యాంకులలో(పీఎస్‌బీ) మెరుగైన పర్యవేక్షణ నాణ్యత ఉండేలా చూస్తుంది. మెరుగైన నామినేషన్ సౌకర్యాల ద్వారా వినియోగదారుల సౌలభ్యాన్ని పెంపొందిస్తుంది. తద్వారా ఈ చట్టం డిపాజిటర్, పెట్టుబడిదారుల రక్షణను పెంచుతుంది.
భారతదేశ బ్యాంకింగ్ చట్టాల పరిణామం
భారతదేశ బ్యాంకింగ్ నియంత్రణ దేశ ఆర్థిక, సంస్థాగత అభివృద్ధితో పాటు పరిణామం చెందింది. దీనికి ఆర్థిక నిర్మాణాన్ని నిర్వచించే ఐదు మూలస్తంభాల లాంటి చట్టాలు మార్గనిర్దేశం చేశాయి. ఈ చట్టాలు ఇప్పటికీ దేశ ఆర్థిక నిర్మాణాన్ని నిర్వచిస్తున్నాయి.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దేశానికి సెంట్రల్ బ్యాంకుగా ఉంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టం-1934 (II ఆఫ్ 1934) బ్యాంకు కార్యకలాపాల కోసం చట్టపరమైన పునాదిని ఏర్పాటు చేసింది. దీనిని ప్రధానంగా నోట్ల జారీని నియంత్రించడానికి, ద్రవ్య స్థిరత్వాన్ని కాపాడటానికి, ద్రవ్య నిల్వలను నిర్వహించడానికి, దేశ రుణ, కరెన్సీ వ్యవస్థను నిర్వహించడానికి ఏర్పాటుచేశారు. దేశ ఆర్థిక మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడానికి, యూనిట్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా, ఇండిస్ట్రియల్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్(నాబార్డ్) వంటి సంస్థల స్థాపనలో కూడా బ్యాంకు కీలక పాత్ర పోషించింది.
స్వాతంత్య్రం వచ్చిన వెంటనే బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టం-1949 వచ్చింది. ఇది ఏకరూప చట్టపరమైన నిర్మాణంలో బ్యాంకింగ్ కార్యకలాపాలపై నియంత్రణను ఏకీకృతం చేసింది. ఇది భారతదేశంలోని అత్యంత ముఖ్యమైన చట్టపరమైన నియమావళులలో ఒకటి. స్థిరత్వం, భద్రత, వృద్ధి సాధించేలా బ్యాంకింగ్ రంగాన్ని నియంత్రిస్తుంది.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టం-1955 స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) అధికారిక స్థాపనకు సంబంధించింది. ఇది ముఖ్యంగా గ్రామీణ, పాక్షిక-పట్టణ ప్రాంతాల్లో బ్యాంకింగ్ సౌకర్యాలను విస్తరించడానికి, అనేక ఇతర ప్రజా ప్రయోజనాల కోసం ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బాధ్యతలను స్వీకరించింది.
జాతీయ విధాన లక్ష్యాలకు అనుగుణంగా ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి అవసరాలను మెరుగుపరచడానికి, రూ.50 కోట్ల కంటే ఎక్కువ డిపాజిట్లు కలిగి ఉన్న 14 ముఖ్యమైన భారతీయ షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకులు 1969లో జాతీయం అయ్యాయి. ఇందుకోసం ఒక కొత్త ఆర్డినెన్స్ జారీ అయ్యింది. ఆ తర్వాత దీని స్థానంలో బ్యాంకింగ్ కంపెనీల(స్వాధీనం, బాధ్యతల బదిలీ) చట్టం-1970 వచ్చింది. ప్రజల సంక్షేమాన్ని ప్రోత్సహించడానికి, కొన్ని బ్యాంకింగ్ సంస్థల బాధ్యతలను స్వాధీనం చేసుకోవడానికి, బదిలీ చేయడానికి బ్యాంకింగ్ కంపెనీల(స్వాధీనం, బాధ్యతల బదిలీ) చట్టం-1980 ఆమోదం పొందింది.
వీటికి అదనంగా ఆర్బీఐ చట్టానికి అనేక ముఖ్యమైన సవరణలు, బ్యాంకింగ్ రెగ్యులేషన్(సవరణ) చట్టం-1994, బ్యాంకింగ్ కంపెనీల(స్వాధీనం, బాధ్యతల బదిలీ) సవరణ చట్టం-1994, బ్యాంకింగ్ రెగ్యులేషన్(సవరణ) చట్టం-2007, బ్యాంకింగ్ చట్టాల(సవరణ) చట్టం-2012 వంటి ముఖ్యమైన సవరణలు వచ్చాయి. ఇవి పాలన, మూలధన సరళీకృతం, స్టాట్యూటరీ లిక్విడిటీ రేషియో(ఎస్ఎల్ఆర్) లేదా నగదు నిల్వల నిష్పత్తి(సీఆర్ఆర్) ఆధారిత ద్రవ్య నిర్వహణకు సంబంధించి భారతదేశ బ్యాంకింగ్ వ్యవస్థను సంస్కరించాయి.
బ్యాంకింగ్ రెగ్యులేషన్ (సవరణ) చట్టం-2020 ద్వారా సహకార బ్యాంకులను మెరుగ్గా నియంత్రించడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు అదనపు అధికారాలు వచ్చాయి. దీనిని కొనసాగిస్తూ ఇటీవలి సంస్కరణలో బ్యాంకింగ్ చట్టాల (సవరణ) చట్టం-2025.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టం-1934, బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టం-1949, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టం-1955, బ్యాంకింగ్ కంపెనీల(స్వాధీనం, బాధ్యతల బదిలీ) చట్టం-1970, బ్యాంకింగ్ కంపెనీల(స్వాధీనం, బాధ్యతల బదిలీ) చట్టం-1980లను సవరించింది. బ్యాంకింగ్ పాలనను మెరుగుపరచడం, ఆడిట్ పారదర్శకతను పెంచడం, డిపాజిటర్ల రక్షణను బలోపేతం చేయడం, సహకార బ్యాంకులను మరింత బలమైన నియంత్రణ వ్యవస్థలోకి తీసుకురావడం ఈ సవరణ లక్ష్యం.
సరికొత్త సవాళ్లను పరిష్కరించడం: బ్యాంకింగ్ సవరణ చట్టం-2025 ఆవశ్యకత
వాస్తవ పరిశీలన: నామినేషన్ ఎందుకు ముఖ్యం?
బ్యాంకులలో క్లెయిమ్ చేయని డిపాజిట్లుగా భారీ మొత్తంలో డబ్బు ఉంది. నామినీలను నమోదు చేయకపోవడమే ఇందుకు కారణం. ఈ జాప్యాన్ని తగ్గించి, సులభమైన క్లెయిమ్ పరిష్కారాలు అందించడం, కుటుంబాలకు వేగంగా నిధులు లభ్యమయ్యేలా చూడటం కొత్త నిబంధనల లక్ష్యం.
దేశంలోని వృద్ధి సామర్థ్యాన్ని వెలికితీసేందుకు, ఇప్పటివరకు సేవలుందని భారీ జనాభాకు ఆర్థిక సేవలను విస్తరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకోవడంతో, ఇటీవలి కాలంలో బ్యాంకింగ్ వ్యవస్థపై గృహాల ఆధారపడటం పెరిగింది. ఆర్థిక సమ్మిళితత్వాన్ని మరింతగా లోతుకు తీసుకెళ్లడంతో పాటు దేశవ్యాప్తంగా బ్యాంకులు అందుబాటులో ఉండేలా విస్తరించడంతో పెరుగుతున్న సంక్లిష్టతకు అనుగుణంగా మాన్యువల్‌గా చేసే పనిని తగ్గించడం, కార్యకలాపాలను పరిశ్రమ స్థాయికి, సాంకేతికతకు అనుగుణంగా మార్చడం, మెరుగైన సమ్మతి కోసం చట్టపరమైన గడువులను మార్చడం చాలా అవసరం.
వేగవంతమైన డిజిటల్ వృద్ధి, ఆర్థి సవాళ్లు పెరుగుతున్న నేపథ్యంలో బ్యాంకింగ్ సవరణ చట్టం-2025 ప్రవేశపెట్టారు. ఈ సంస్కరణ పాలన, సమ్మతి వ్యవస్థలను సమకాలీన పరిశ్రమ పరిస్థితులు, మారుతున్న సాంకేతికతకు అనుగుణంగా మారుస్తుంది. ఈ సంస్కరణ ప్రాథమిక అవసరం:
- బ్యాంకులు, డిపాజిటర్లకు ఆస్తుల బదిలీ సులభతరం చేయడం, వివాదాలను తగ్గించడం, న్యాయపరమైన జోక్యం అవసరాన్ని తగ్గించడం కోసం ఆస్తుల వారసత్వంలో స్పష్టత పొందడం.
- నియంత్రణ సమ్మతిని క్రమబద్ధీకరించడం, బ్యాంకింగ్ వ్యవస్థలో సరికొత్త సాంకేతికతలకు అనుగుణంగా మారడాన్ని సులభతరం చేసేందుకు ఏకరూప పరిభాష పాటించడం.
- మనుషులపై పనిభారాన్ని తగ్గించడానికి, ఆటోమేషన్‌ను ప్రోత్సహించడానికి, వ్యవస్థాగత సామర్థ్యాన్ని బలోపేతం చేయడానికి అకౌంటింగ్ కాలాలకు గడువులను అనుగుణంగా మార్చడం.
బ్యాకింగ్ చట్టాల(సవరణ) చట్టం-2025: కీలక సంస్కరణలు
డిపాజిటర్ల భద్రత, పాలన బలోపేతం, ఒత్తిడిని వేగంగా తగ్గించడంపై దృష్టి సారించే కీలక సంస్కరణలను బ్యాకింగ్ చట్టాల(సవరణ) చట్టం-2025 పరిచయం చేస్తోంది. నిర్మాణాత్మక ఆధునికీకరణలకు మించి ఈ చట్టం బ్యాంకింగ్ పర్యవేక్షణ, పాలనను మెరుగుపరిచేందుకు భారతదేశం చేస్తున్న ప్రయత్నాలను బలోపేతం చేస్తుంది. గత దశాబ్దంలో కనిపించిన ఆచరణాత్మక సవాళ్లతో ఈ మార్పులు ముడిపడి ఉన్నాయి. ఈ చట్టంలోని నిబంధనలు రెండు దశల్లో నోఇఫై అయ్యాయి: మొదటి దశలో 3 నుంచి 5వ సెక్షన్ వరకు 15-20 సెక్షన్ల వరకు(2025 ఆగస్టు 1) ఉన్నాయి. రెండో దశలో 10 నుంచి 13వ సెక్షన్ల వరకు(2025 నవంబర్ 1) ఉన్నాయి.

ప్రస్తుత వ్యవస్థలు, ప్రక్రియలను మెరుగుపరచడానికి అమలు చేస్తున్న కీలక సంస్కరణలు కింద వివరించడమైంది.


ఆధునికీకరించిన నామినేషన్ విధానం(సెక్షన్లు 10 - 13)
- డిపాజిటర్లు వారి బ్యాంకు ఖాతాలకు నలుగురు వ్యక్తుల వరకు సైమల్టేనియస్ లేదా సక్సెసివ్ నామినేషన్‌ల ద్వారా నామినేట్ చేయవచ్చు.
- సైమల్టేనియస్ నామినేషన్ల ద్వారా మొత్తం 100% అయ్యేలా శాతాలవారీగా కేటాయించేందుకు నామినేట్ చేయవచ్చు.
- నామినీ మరణించిన సందర్భంలో వారి ఆధీనంలోని, లాకర్లలోని వస్తువులను వారసులకు అందించేందుకు సక్సెసివ్ నామినేషన్లు ఉపయోగపడతాయి.
సబ్‌స్టాన్షియల్ వడ్డీ పునర్నిర్వచనం(సెక్షన్ 3)
- పరిమితి రూ.5 లక్షల(1968 పరిమితి) నుంచి రూ.2 కోట్లకు పెంపు
- పాలనా ప్రామాణాలను పునరుద్ధరించడం కోసం ఈ నియంత్రణ మార్పు
సహకార బ్యాంకుల్లో పాలన(సెక్షన్ 4, 14)
- డైరెక్టర్ల గరిష్ట పదవీకాలం(చైర్‌పర్సన్, జీవితకాల డైరెక్టర్లు మినహా) 8 నుంచి 10 సంవత్సరాలకు పెంపు. ఇతర బ్యాంకింగ్ సంస్థలలో డైరెక్టర్ల పదవీకాలం మారదు.
- సహకార బ్యాంకులను 97వ రాజ్యాంగ సవరణకు అనుగుణంగా మారుస్తుంది. ఇది ప్రజాస్వామ్య పాలనను తప్పనిసరి చేస్తుంది. దేశ రాజకీయ, ఆర్థిక వ్యవస్థల హోదాను పెంచుతుంది.
పీఎస్‌బీల్లో ఆడిట్ సంస్కరణలు(సెక్షన్ 15-20)
- ఆడిటర్ల పారితోషికాన్ని నిర్ణయించేందుకు పీఎస్‌బీలకు అధికారాన్ని ఇస్తుంది.
- క్లెయిమ్ చేయని వాటాలు, వడ్డీ, బాండ్ రిడెంప్షన్ మొత్తాలను ఇన్వెస్టర్ ఎడ్యుకేషన్ అండ్ ప్రొటెక్షన్ ఫండ్(ఐఈపీఎఫ్)కు బదిలీ చేసేందుకు అనుమతి. తద్వారా వాటిని కంపెనీల చట్టం కింద కంపెనీలు అనుసరించే పద్ధతులతో సమానంగా మార్చింది.
వ్యవస్థ విధానపరమైన సామర్థ్యం
- కార్యకలాపాలకు సంబంధించిన నిర్వచనాలను గణనీయంగా సవరించడంతో పాటు బ్యాంకులు, సహకార బ్యాంకుల చట్టబద్ధమైన రిపోర్టింగ్ తేదీలను మార్చింది.
- ఇంతకుముందు చివరి శుక్రవారం లేదా ప్రత్యామ్నాయ శుక్రవారాలుగా ఉండే రిపోర్టింగ్ తేదీలు ఇప్పుడు నెల చివరి రోజు లేదా పక్షం చివరి రోజుగా మార్చింది.
జాతీయ దృష్టితో బ్యాంకింగ్ సంస్కరణల ప్రభావం
ఈ చట్టాల అమలుతో భారతీయ బ్యాంకింగ్ రంగ చట్టపరమైన, నియంత్రణ, పాలనా నిర్మాణాన్ని బలోపేతం చేసే దిశగా ఒక ప్రధాన అడుగు ముందుకు పడింది. 2025 సవరణలు డిపాజిటర్లు, సేవా ప్రదాతలపై పరివర్తనాత్మక ప్రభావాన్ని చూపుతాయి.
- డిపాజిటర్ కేంద్రీకృతం: డిపాజిటర్ల కుటుంబాలకు సరళమైన క్లెయిమ్ పరిష్కారం ద్వారా బ్యాంకింగ్ సంస్థలపై ప్రజల విశ్వాసాన్ని కాపాడేందుకు బలమైన చర్యలను కలిగి ఉంది.
- మెరుగైన పాలన: "సబ్‌స్టాంటియల్ ఇంట్రెస్ట్" కోసం సవరించిన పరిమితి ద్రవ్యోల్బణం, వృద్ధిని ప్రతిబింబిస్తుంది. సహకార బ్యాంకు డైరెక్టర్ల గరిష్ట పదవీకాలం(ఛైర్‌పర్సన్, జీవితకాల డైరెక్టర్లు మినహా) ఇప్పుడు 97వ రాజ్యాంగ సవరణకు అనుగుణంగా ఉంది, ఇది ప్రజాస్వామ్య దృక్పథాన్ని సూచిస్తుంది.
- మెరుగైన ఆర్థిక పారదర్శకత: నిధుల నిర్వహణ కోసం మరింత పారదర్శక వ్యవస్థను సృష్టించడం లక్ష్యంగా ఇన్వెస్టర్ ఎడ్యుకేషన్ అండ్ ప్రొటెక్షన్ ఫండ్‌కు బదిలీ.
- మెరుగైన ఆడిట్ నాణ్యత: పీఎస్‌బీలు ఇప్పుడు ఆడిటర్‌లకు మెరుగైన వేతనం చెల్లించడం ద్వారా మరింత అర్హత కలిగిన నిపుణులను ఆకర్షించగలవు. పర్యవేక్షణ నాణ్యతను మెరుగుపరచగలవు.
- మెరుగైన కార్యాచరణ సామర్థ్యం: కొన్ని విధానాలను సరళీకృతం చేయడం, నిర్దిష్ట కార్యాచరణ నిర్వచనాలను ఆధునికీకరించడం వంటివి ఈ చట్టంలో ఉన్నాయి.
ముగింపు
బ్యాంకింగ్ చట్టాల(సవరణ) చట్టం-2025 భారతదేశ ఆర్థిక నిర్మాణాన్ని ఆధునీకరించడానికి ఒక ముఖ్యమైన ముందడుగు. పాలన ప్రమాణాలను, డిపాజిటర్ల రక్షణను, ప్రస్తుత ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా ఆడిట్ పద్ధతులను మార్చడం ద్వారా ఈ చట్టం ప్రజల విశ్వాసాన్ని బలోపేతం చేస్తోంది. సురక్షితమైన, సమగ్రమైన, సాంకేతికత ఆధారిత బ్యాంకింగ్ వ్యవస్థ కోసం భారతదేశ దార్శనికతకు మద్దతు ఇస్తుంది. ఈ సంస్కరణలు స్థిరత్వం, పారదర్శకత, సామర్థ్యాన్ని బలోపేతం చేస్తాయి. ఇవి అభివృద్ధి చెందుతున్న డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో వృద్ధిని కొనసాగించడానికి అవసరమైన స్తంభాలు.
Ministry of Finance:
https://www.pib.gov.in/PressReleaseIframePage.aspx?PRID=2181734
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2150371
https://financialservices.gov.in/beta/en/banking-overview
https://financialservices.gov.in/beta/sites/default/files/2025-05/Gazettee-Notification_1.pdf
https://www.pib.gov.in/PressReleseDetailm.aspx?PRID=2117408
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=1868239
Reserve Bank of India:
https://rbi.org.in/scripts/briefhistory.aspx
https://rbi.org.in/history/Brief_Chro1968to1985.html
https://rbi.org.in/commonman/english/scripts/Notification.aspx?Id=1476
Others:
https://www.indiacode.nic.in/bitstream/123456789/1885/1/A194910.pdf
https://www.indiacode.nic.in/handle/123456789/1553?view_type=browse
Rajya Sabha:
https://sansad.in/getFile/annex/268/AU1038_fL1aXP.pdf?source=pqars
Clik here for pdf file
****
***
(Explainer ID: 156343)
आगंतुक पटल : 58
Provide suggestions / comments